అలజడుల జడివాన ‘రాప్తాడు’ కవిత్వం

అతడు – “ప్రేయసీ… వొక కథ చెప్పనా”! అంటూ సున్నిత హృదయాన్ని ఆవిష్కరించిండు. పచ్చటి పంట పొలాల్లో సీతాకోకచిలుకై వాలిండు. నదులు, వాగులు, కొండలు, కోనల్ని ప్రేమించిండు. మనుషుల్ని ప్రేమించిండు. మనుషుల్లోపలి విధ్వంసాన్ని చూసి అతని గుండెలో ఎంత వలపోతో! మరెన్ని కన్నీళ్లో! వెంటాడే గాయాలు. కులం చేత వెలి బతుకు. అతని మనసులో ఎంత కల్లోలం చెలరేగిందో? ఎన్ని కన్నీటి సంద్రాలు ఉప్పొంగినయో. బాధల్నించి విముక్తి కోసం అక్షరాలై పోటెత్తిండు. మనుషుల్ని తడిపే ప్రవాహమైండు. రాళ్ల సీమ బతుకు వెతల ‘కన్నీళ్లు’ కథలల్లిండు. యేదీ యేకవచనం కాదని, కోట్లాది గళ గర్జనల జడివానైండు. అతని కవిత్వమంతా రుధిర స్వప్నాల జాడలే. వీరులు నడిచిన తొవ్వల్లో పూసిన మోదుగు పూల రెపరెపలే. పల్లె పల్లెనూ కదిపే, గుండె గుండెనూ తడిపే వెన్నెల జలపాతాలే. అతని అక్షరాల్నిండా ఆరని కుంపట్ల సెగలే. రగిలే రణన్నినాదాలే. ఊరుకూ వాడకూ మధ్య నిలువెల్లా మొలిచిన అడ్డు గోడల్ని కూల్చే విధ్వంసి అతడు. అతని తపనంతా మనుషుల్ని చీల్చే కుట్రల్ని కూల్చడమే. అతని జీవితమంతా అలజడే. ఎక్కడా నిలువనీయని ప్రవాహమే.

ఎంచుకున్న ప్రేమ బంధం కరిగిన స్వప్నమైంది. తీరని వేదన మిగిల్చింది. ఒకానొక తెల్లవారుజామున తన కలల్ని ఉరి తాడుకు వేలాడేసిండు. తనను తాను రద్దు చేసుకున్నడు. మనందరికీ జ్ఞాపకమైండు. అతడు- పల్లె మంగలి కతల కల్ప. గొంతెత్తిన వెలుతురు పిట్టల పాట. విప్లవ స్వాప్నికుడు. కవి. కథకుడు. విప్లవ స్వాప్నికుడు రాప్తాడు గోపాలకృష్ణ.

గోపీ నక్సల్బరీ తరం (1968)లో పుట్టిండు. అనంతపురం జిల్లా రాప్తాడు సొంతూరు. తండ్రి కోర్టులో గుమస్తా. వానొస్తే మురుగు వాగులా పారే ఇంటిదారి. దోసిళ్లతో నీళ్లెత్తిపోసిన జ్మాపకాల చిత్తడి బతుకు. అలజడి. అతని బతకంతా అలజడే. డిగ్రీ తర్వాత అనంతపురం రచయితలకు దోస్తయిండు. తన రచనకు మెరుగులు దిద్దుకున్నడు. కళ్లెదుట కన్పించే బతుకుల్ని కన్నీటి కథలల్లిండు. కులం చేసిన గాయాలు, అవమానాలు, వెలివేతలతో నడవాల్సిన దారినెంచుకున్నడు. రాడికల్ రణన్నినాదాల్ని గొంతెత్తి నినదించిండు. విప్లవ రాజకీయాలవైపు అడుగేసిండు. విప్లవ రాజకీయాలు, విప్లవ సాహిత్యంతో జీవితాన్ని పెనవేసుకున్నడు. విప్లవం అతని ఊపిరైంది. అట్లా 1992 గుంటూరు సభల్లో విరసం సభ్యుడైండు. కొంత కాలం కర్నూలులో టీచర్ గా, లెక్చరర్ గా పనిచేసిండు. అతని గుండెల్నిండా జగిత్యాల పోరుదారే. జైత్రయాత్రలో వీరులు నడిచిన తొవ్వను ముద్దాడిండు. అక్కడే 1994లో ఓ ప్రైవేటు కాలేజీలో అధ్యాపకుడిగా చేరిండు. కొంతకాలానికి ఇంటిదారి పట్టిండు. కర్నూల్ లో సొంతంగా స్కూల్ పెట్టడం అతని స్వప్నం. అందుకోసం చేయని ప్రయత్నమంటూ లేదు. విద్యా బోధన గురించి చదవని పుస్తకాల్లేవు. చేయని ప్రయోగాల్లేవు. పిల్లలతో పిల్లవాడై తిరిగిండు. బతుకును రంగు రంగుల సింగిడి చేసుకున్నడు. ఒంటరి గోపీ జీవితంలోకి ప్రేమ ఓ వసంతాన్ని వాగ్దానం చేసింది. ఓదార్పునూ, తోడునూ వాగ్దానం చేసిన ఓ హృదయం దొరికింది. శిశిరం చిగురించి వసంత గీతమైండు. అంతలోనే ఆ ప్రేమ దూరమైంది. కులం వల్ల. పెద్దల వెలివేత వల్ల. అతని కలలన్నీ కల్లలైనయని తల్లడిల్లిండు. పగలంతా మిత్రులతో మాటలు. రాత్రయితే అలముకునే ఒంటరితనం. 9 సెప్టెంబర్ 1999 రాత్రంతా మిత్రులతో కలసి కవిత్వమైండు. అదే రాత్రి ఏ చీకట్లు అలుముకున్నయో. ఏ ఒంటరితనం తరిమిందో. తెల్లవారు జామున ఉరివేసుకున్నడు.

గోపీ చనిపోయాక అతని కవిత్వమంతా కలిసి విరసం కర్నూలు యూనిట్ ‘యేదీ యేకవచనం కాదు’ పేరిట కవితా సంకలనం వేసింది.

**

ఇది నీళ్లు లేక నెర్రెలిచ్చిన బీడు భూముల గుండెల్ని తడిపిన వాన చినుకు పరిచయం. కన్నీరై ఉబికే వేదనల తాలూకు గుండె తడి. వెలి గాయాల వలపోత. జగిత్యాల జైత్రయాత్ర గాథల్ని గుండెల్నిండా నింపుకొని, అక్కడి నేలను ముద్దాడిన సున్నిత మనస్కుడి ప్రేమ గీతమిది.

నేను దోసిళ్లకెత్తుకున్న అతని అక్షరాలివి.

”నేనిప్పుడు కవి సమయంలోంచి
మాట్లాడటం లేదు
కవి స్థలంలో నిలబడి పలవరిస్తున్నాను…” అని ప్రకటించిన కవి గురించిన పరిచయమిది.

”రక్తంతో తడిచిన నా నేల నిండా
తవ్విన కొద్దీ బండరాళ్లే.
శవాల గుట్టలే…. ” అని గాయాల నేలను గుండెలకు హత్తుకొని విలపించిన క్షతగాత్రుడి కన్నీళ్లివి.

అది తెలుగు నేలన నెత్తురు పారుతున్న కాలం. రోజుకో ఎన్ కౌంటర్ తో తెల్లారుతున్న కాలం. వందలాది మంది విప్లవ సానుభూతిపరుల్ని రాజ్యం మాయం చేసిన కాలం. బూటకపు ఎదురు కాల్పుల కట్టుకథల్లో ఎందరో విప్లవకారులు అమరులైన్రు. కన్నవాళ్లకూ, తోబుట్టువులకూ, బంధువులక్కూడా శవాల్నివ్వకుండా పోలీసులే దహనం చేసేవాళ్లు. కడచూపు కూడా దక్కని దుర్భర పరిస్థితి. పేగు బంధం తెగి తల్లడిల్లే తల్లుల కడుపుకోతను రాజ్యం పట్టించుకోలేదు. అమరుల మృతదేహాలను స్వాధీనం చేసుకుని సాగనంపేందుకు పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది. ఈ పోరాటంలో బాధ్యుడిగా ఉన్న ప్రజా కళాకారుడు, జన నాట్యమండలి గద్దర్ పై పోలీసులు కాల్పులు జరిపి పారిపోయిన్రు. ఆ కాలాన గోపీ ఎంత తల్లడిల్లిండో. రాజ్యం మాయం చేస్తున్న సహచరుల్ని తలుచుకొని. ఎక్కడో దొంగ ఎదురు కాల్పుల్లో కనుమూసిన కూనల్ని తలుచుకొని కంటికి పుట్టెడేస్తున్న తల్లుల కడుపుకోతను కళ్లముందుంచిండు గోపీ. రక్తం పారుతున్న నేలను చూపించిండు. తుపాకీ మోతలతో తెల్లవారే రక్తసిక్త ఉదయాన్ని దృశ్యమానం చేసిండు.

”తెలవారిందనడానికి గుర్తుగా
వూరి చివర వొక తుపాకీ పేల్తుంది

కొడుకో కూతురో మాయమైన యింటి ముంగిట
తెల్లటి నవ్వులాంటి ముగ్గు అదృశ్యమవుతుంది….” అంటూ మనల్ని కన్నీళ్లు పెట్టిస్తడు. ఏడుపై ఎదకు హత్తుకుంటడు.

”యిప్పుడిక్కడ
బిడ్డ యేకవచనం కాదు
తల్లి యేకవచనం కాదు
వూరు యేకవచనం కాదు…” అంటూ పోరాటంలో అమరులైన వీరుల పాదముద్రల్ని కవిత్వం చేసిండు. యిప్పుడు ఊర్లన్నీ పోరాట కేంద్రాలే. తల్లీ బిడ్డలందరూ ఆ పోరాటాల్లో వెలుగురేఖలే. వీరులు యేక వచనం కాదు. ఆ వీరుల్ని కన్న తల్లులూ ఒక్కరు కాదు. వాళ్లంతా సర్వనామమే. వాళ్లది సామూహిక స్వప్నం. కలలై విరిసే పూలవనం. ఎన్నెన్ని శిశిరాలు రాలినా చిగురించే వసంతగీతం… ఆ పోరాటాలు. నినదించే ఒక్క గొంతు మూగబోతే లక్షోప లక్షలై ప్రతిధ్వనించే కంఠాలు ఊపిరిపోసుకుంటాయని చేసిన ఆశావహ ప్రకటన ఇది. జనం గుండెల సవ్వడిది.

”శవం నేలరాలితే
జనం జెండాలై రెపరెపలాడుతారు…” అంటూ రణన్నినాదాలయ్యే గళ గర్జనల్ని మన గుండెల్నిండా నింపుతున్న యుద్ధభేరి గోపీ అక్షరాలు.

అతడు లోపలి మనిషి విధ్వంసం గురించి తల్లుడిల్లుతడు. అంతరాల్లేని మనుషుల కోసం వెతికీ వెతికీ అలసిపోయిండు. అదొక అన్వేషణ. ఎడతెగని అన్వేషణ. మనిషికి ఎక్కడా స్వేచ్ఛలేదని విలపించిన సున్నిత మనసు తనది. జైళ్లను ధ్వంసం చేసి ఆకాశాన్ని విశాలం చేయాలనే తపన గోపీది. జైళ్లను పడగొట్టి, వాటిని పునాదులతో తవ్వి పారెయ్యాలని చెప్తడు.

”నీలోనూ వొక జైలుంటుంది
నిన్నెప్పుడూ అర అంగుళం అరగదీస్తుంటుంది
విలువల సంచులలోకి కుదిస్తుంటుంది
లోక మర్యాదలతో ఆత్మహత్యిస్తుంటుంది”… అంటూ మనుషుల్లోపలి జైలు తాలూకు నీడల్ని చూపుతడు మనకు.

”అంతర్ బాహిర్ జైళ్ల మధ్య నీవు నిత్య ఖైదీవి
రెండు జైళ్ల మధ్య నీవు మాటలు పడిపోతావ్
రెండు జైళ్ల మధ్య నీవు రెక్కలను కలగంటావ్
రెండు జైళ్ల మధ్య నీవు ఆకాశాన్ని విలపిస్తావ్
రెండు జైళ్ల మధ్య నీవు శిలామానవుడవౌతావ్…” అంటూ ఒక్కోసారి మనిషి లోలోపల ఊపిరాడక తల్లడిల్లే యాతనని కళ్లముందుంచిండు. అతనిలోని ఖైదీ వలపోతిది. ఇది మనందరి వలపోత కూడా. ఆకాశాన స్వేచ్ఛగా ఎగిరే పక్షులు రెక్కలు తెగి విలవిల్లాడే రక్తసిక్త దృశ్యాన్ని నెత్తుటి రంగుతో చిత్రించిండు. ఇంటా బయటా ఎక్కడ చూసినా నోళ్లు తెరుచుకుని ఎదురుచూసే జైళ్లే. రెక్కల్ని కలగనే మనిషి ఆకాశాన్ని చూసి విలపించడం తప్ప అంధకారంలో ఏమీ చేయలేని తనం. ఉక్కపోత. ఊపిరాడదు. చెప్పాలనుకున్నవీ, రాయాలనుకున్నవీ ఆవిరైపోయే ఎడారితనం. ఎండమావుల దృశ్యం. శిశిర సదృశ దృశ్యం. అయినా వసంతాల్ని కలగనే ఆశావహ దీపం లోలోపల మిణుకుమిణుకుమంటది. రాప్తాడు రాళ్ల దారిన ఎదుర్రాయి తాకి చిట్టిన కాలి బొటనవేలు చిమ్మిన నెత్తురు ప్రవాహం అతని కవిత్వం. ఆ ప్రవాహంలో ఎదురీదడం అతనికొక సాంత్వన. అక్షరాలను కాగడాలు, మిణుగురు దీపాల్లా చేసి వెలుగుదారిన సాగే ముసాఫిర్ తను.

బీడుబారిన నేల గుండెల్ని తడిపేందుకు వానను కలగన్న రైతు కన్ను అతనిది. వాన చినుకుల్నీ, చెంగున ఎగిరే లేగదూడల ఉత్తేజాన్ని, నాట్లేసే కూలి తల్లుల పాటల్నీ గుండెల్నిండా నింపుకున్న వాడికి అక్షరం ఒక నాగలి సాలు లాంటిది. భావాలు అందులో మొలకెత్తే విత్తనాల్లాంటివి. ఆ రాళ్ల భూముల్లో చెకుముకి రాళ్లు రాజేసిండు రాప్తాడు. కుంపటై. నెగడై. కొలిమై. ఊరూరా అంటుకుని రగిలే నినాదాల్ని నింపుకున్నడు. కలం నిండా. కలల్నిండా.

బురద పొలాల మీదుగా తేలియాడుతూ గుండెల్లో నాటుకున్న పాట గురించిన కలవరింత అతని కవిత్వం. పలవరింత ఆ పాట. పల్లె అతనికొక నాస్టాల్జియా. వెంటాడే జ్ఞాపకం. సిరిమల్లె చెట్టుకింది లచ్చుమమ్మల్లా. కొంగు నడుముకు చుట్టి కొడవళ్లు చేపట్టిన చెల్లెమ్మల్లా. ఆ కల. నిలువెల్లా వానలో తడిచి పరవశించే కల. ఆ కలలో ఆకలి. ఆకలి తీరే దారి కోసం తండ్లాట. దు:ఖపు తీరాన నిలబడి పల్లెను కలల్నిండా నింపుకున్న కల్లోల హృదయుడు గోపాలక్రిష్ణ.

”హొయలు హొయలుగా కులుకుతూ
పచ్చని పల్లె కలలో కనిపిస్తుంది
వొక వరి నాటు పాట గుండెల్లో నాటుకుంటుంది… అని శ్రమసంబంధాల్ని కవితలల్లిండు.
శరీరం లేగదూడై గెంతుతుంటుంది
ఎక్కడో ఎద్దుల మెడలో మువ్వలు
రాగాలు రాగాలుగా విరజిల్లుతుంటాయి…” అంటూ మనల్ని పల్లెలకు తీస్కపోతడు. కలలో కనిపించిన పల్లె పోలీసుల కవాతుతో తెల్లారుతుంది. బూట్ల చెప్పుళ్లతో బిక్కుబిక్కుమనే జనం గుండెల్లో భయం. ఏ లాఠీ ఏ వీపును రడమండలం చేస్తదో. ఏ తూటా ఏ శరీరాన్ని జల్లెడ చేస్తదో అని. పచ్చని పంట పొలాల మధ్య కల్లాలను కల్లోలం చేసే కర్కశత్వాన్ని చిత్రించిండు గోపి.

”తల్లి కోడే కోడి పిల్లను అప్పగిస్తుంటుంది
అంతా కళ్లముందే కదలాడుతుంటుంది
కళ్లు మూసుకుందామంటే రెప్పలుండవు
కన్నీళ్లు తుడుచుకుందామంటే చేతులుండవు…” అంటూ కలలు గన్న కనులమీది రెప్పల్ని కత్తిరించే బీతావహ దృశ్యాన్ని చిత్రించిండు. కారే కన్నీళ్లను తుడుచుకుందామన్నా చేతులుండని రక్తసిక్త గాయాల్ని కవిత్వంలోకి తీసుకువచ్చిండు. కలలుగనే కళ్లను పెరికి, ఉత్పత్తిలో పాల్గొనే చేతుల్ని నరికేసే రాజ్య హంతక స్వభావాన్ని చెప్తున్నడు. ఇన్ని కల్లోలాల మధ్యే నిలబడి గొంతెత్తి పాడే క్షతగాత్రుడతడు. విప్లవమంటే ఆరని మంటే అని తెలుసు. బూడిద రాసుల్లోంచే ప్రాణం పోసుకొని సూరీణ్ని ముద్దాడే ఫీనిక్స్ అనీ తెలుసు.

అందుకే…
”రాళ్ల వానలో నేను రక్తమోడుతుంటాను
భూత భవిష్యత్ ల మధ్య నిలబడి
నేను గొంతెత్తి అరుస్తాను
చివరి బొట్టు రాలేదాకా
పోరాడ్డానికి పేటెంట్ హక్కులు నావే…” అని పోరు తప్ప దారి లేదనే వాస్తవాన్ని చెప్పిండు. ‘రాళ్ల వానలో నేను పోరాడతాను’ అంటూ సాగిపోయిండు.

తనలోకి తనే ముడుచుకుపోయే సున్నిత హృదయుడు కనుకనే ప్రతిదీ నిశితంగా పరిశీలించడం అలవాటైనట్టు కన్పిస్తది. అతడు ఏకాంతంగా మాట్లాడుతాడు. తనలో తనే. తనతో తనే. అది మనందరితో జరిపే సంభాషణ. గాయపడ్డ సంభాషణ. ఆరని నెత్తుటి గాయాల సంభాషణ. విముక్తి దారుల వెతుకులాటల్లో జారిపోని చూపు. గమ్యమెంత దూరమో తెలుసు. అది ఎడతెగని ప్రయాణమనీ తెలుసు. చేరాల్సిన మార్గంలో ముళ్లుంటాయనీ తెలుసు. తెలిసీ ఎంచుకున్న దారుల్లో సాగుతున్న వీరుల తొవ్వల్ని పాడే సాంస్కృతిక సైనికుడతను. మనుషులు మందుపాతరలుగా ఎందుకైనారో నిజంగా మీకు తెలీదా అని ప్రశ్నిస్తున్నడు. అతనికి నీడలేని నిరుపేదలెందరో కనిపించిన్రు. బువ్వలేని మనుషులతో దోస్తానయింది. ఆకలి బాధలు చూసి తల్లడిల్లిండు. అందుకే వ్యవస్థను ధ్వంసం చేయాలనే తపన తనది. ఆ ధ్వంస విధ్వంసాల్లోంచే కొత్త సృష్టిని కలగన్నడు.

అతనికి…
కలలలోనూ రాబందులు కనబడి కలతచెందిన వాళ్లు
కళ్లల్లో మంచు పర్వతాలు కరిగిపోయిన వాళ్లు… కనిపించిన్రు. వాళ్లంతా రాజ్యం ఉక్కు పాదాల తొక్కిడిలో జీవిత పరిమళం ఆవిరైపోయినవాళ్లు. పుట్టిన నేలన శరణార్థులుగా బతుకుతున్న వేలాదిమంది బతుకుల్ని గురించిన వలపోత ఉన్నదీ కవిత్వమంతా.

”శరీరాలు అంగాలు చేయబడి
అంగాలు అంగట్లో పెట్టబడి
భూమిలోకి కుంగిపోయినవాళ్లు…”. అట్లా కుంగిపోయి చిధ్రమైన బతుకుల్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నడు కవి. వాళ్లకోసం ఏమీ చేయలేమా? అని తనలో తాను మథనపడ్డడు. ఆ దారి కోసం రేయింబవళ్లు ఆలోచించిండు.

”సొంత దేశంలో శరణార్థులు
వాళ్లందరిలో నేను కన్పిస్తున్నాను
నా రెండు కళ్లల్లో వేనకు వేలుగా నేనే కన్పిస్తున్నాను
లక్షల కళ్లల్లో లక్షోపలక్షలై నేనే కన్పిస్తున్నాను…” అంటూ రూపాంతరవాసం చేసిండు. మనుషుల్ని భూమిలోకి తొక్కినవాళ్ల గురించి తెలుసుకున్నడు కనుకనే మనుషులు మందుపాతరయ్యే అనివార్యతను అక్షరాల్లోకి ఒంపిండు.

”యిల్లు ఊరిమధ్యే అయినా… వునికి వేయి ఆమడల దూరం…” ఉన్న పల్లె మంగలి బతుకుల్లోని చీకట్లను కవిత్వం చేసిండు గోపీ. కులం ఉరితాడుకు వేలాడుతున్న వెలి బతుకుల్ని కన్నీళ్లతో అక్షరం చేసిండు. కులం అల్లిన కట్టుకథల్ని, సామెతల్ని దునుమాడిండు. ఊరందరి గడ్డాలు, క్షవరాలు కొరిగితే గాని ఆరోజుకింత తిండి ఉండని బతుకులు మంగలోళ్లవి. పనిలేని మంగలోడు పిల్లి తలగొరిగినట్టు అనే కుల దురహంకార సామెతల్ని అల్లిన పైమెట్టు కులాలోల్లని నిగ్గదీసి అడిగిన అక్షరం గోపీది.

”మడుపు కత్తి తప్ప
కాసింత మడిచెక్క లేని
నా పేదరికం గురించి
మాట్లాడండి నా దొరలారా
పస్తులు వుండలేక
నా పూర్వీకులు
పిల్లి మెడను కోసింటారు గానీ
తలను గొరిగేంత
వెర్రి బాగులోల్లు కాదు బాబులారా
అంత వెర్రిబాగులోల్లయితే
యీ దేశానికి తలకట్టు వుండనే వుండదు…” అంటూ సున్నితంగా హెచ్చరించిన భావుకుడతను. మంగలి బతుకుల్ని హేళన చేస్తూ మాట్లాడే దోపిడీ కులాల ఇంటి గుట్టంతా తెలిసిన మూలాల మతలబేదో అతని అక్షరాల నిండా పరుచుకుంది. అడుగడుగునా కులం చేసిన అవమానాల్ని, గాయాల్ని తడుముకుంటూ తన అక్షరాలకు గుండెతడినద్ది కొలిమి రాజేసిండు. అతని అక్షరాల్నిండా ఎన్నెన్నో కలలు. కల్లోల కలలు. ఉరిమే కలలు. మెరిసే కలలు. కన్నీళ్లతో తడిసిన కలలు. బతుకంతా వెంటాడిన మానని గాయాల కలలు. కొన్ని కల్లలైన కలలు. మరికొన్న జీవితాన్ని ఉజ్వలంగా వెలిగించిన కలలు. కలల రాదారిలో విముక్తి గీతమై మార్మోగిన క్షతగాత్రుడతడు. గాయాల విముక్తి దారిని కలగన్న మెలకువ అతనిది.

”నా విద్యను తక్కువజేసి మాట్లాడినపుడు
దిగమింగుకున్న అవమానం
మంగలి ఎచ్చులన్న మరుక్షణమే
నేను ఆగ్రహిస్తే…
మీ మొగాలు పెచ్చులు పెచ్చులయిపోవూ…” అంటూ ప్రకటించిన ధర్మాగ్రహం గోపీది.

”మీ పెళ్లిల్లకీ పేరంటాలకీ
పేగులు నోటికొచ్చేట్లు మేళం వాయిస్తాను
డొక్కలు బిగబట్టి డోలు వాయిస్తాను
కాలి గోళ్లు తీస్తాను మాలీసు చేస్తాను
యింత జేసినా
యింటి మంగలోడు అంటారు
యింటి వెనకాల విస్తరేస్తారు… ”అంటూ కన్నీళ్లయి మన కళ్లెదుట కన్పిస్తాడు గోపీ. మనల్ని నిలువెల్లా దు:ఖ సంద్రంలో ముంచెత్తుతాడు. ఏమని చెప్పాలి? ఆ గాయాల తలపోతను. కన్నీళ్ల వలపోతను. మంగలి కత్తి పదునును. ఎంతని రాయాలి? యిల్లు ఊరి మధ్యే అయినా… వునికి వేయి ఆమడల దూరం ఉన్న బతుకుల్ని. ఎన్నడైనా ఆలోచించామా మనం? వాని బతుకెక్కడో. మెతుకెక్కడో అని. కులాల తక్కెడలో పాసంగాన్ని పసిగట్టిన పదును అతనిది. ఎంత నాజూకుగా ఉన్నా, కులం ఉరితాడుకు వేలాడే జీవితాల వెతుకులాట ఇది.

”పాటను నిషేధించారు
ఆటను నిషేధించారు
మాటనూ నిషేధించారు
ఇప్పుడేకంగా పోరాటాన్ని నిషేధించారు
ఎవడిచ్చార్రా హంతకులకి హక్కుల్ని కాలరాసే హక్కు?…” అంటూ హంతక రాజ్యాన్ని ప్రశ్నించిండు గోపీ. హక్కులపై అణచివేతల్ని ప్రతిఘటించకపోతే ప్రాణాలుండవని తెలుసు. అందుకే పోరాటాన్ని ఎంచుకున్నడు. కలంతో. కన్నీళ్లతో. రాయకుండా వుండలేని తనమేదో అతణ్ని హైపర్ సెన్సిటివ్ గా మార్చిందేమో. ఊహల్ని నిజం చేసుకొనేందుకు చేయని ప్రయత్నమంటూ లేదని చెప్తరు గోపీ మిత్రులు. ఎడతెగని అన్వేషణల్లో ఏయే చీకట్లు అలుముకున్నయో. ఆ శశిని ఏ నిశి కమ్మిందో. ఒకానొక తెల్లవారుజామున తన కలల్ని ఉరితాడుకు వేలాడేసిండు. బతుకంతా ఉజ్వల గీతమైనోడు, సహచరుల గుండెలపై మరణ వాంగ్మూలం రాసి వెళ్లిపోయిండు. ఇక యేదీ యేకవచనం కాదంటూ.

లాల్ సలామ్… కామ్రేడ్ రాప్తాడు గోపాలక్రిష్ణ.

ముకుందాపురం, నల్లగొండ జిల్లా. క‌వి, రచయిత, ప‌రిశోధ‌కుడు. ఇండిపెండెంట్ జర్నలిస్ట్. సాక్షి దిన‌ప‌త్రిక‌లో ఎనిమిదేళ్లు జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేశాడు. 'ఓయూ సాహిత్య వేదిక' వ్య‌వ‌స్థాప‌క స‌భ్యుడు, మొదటి కన్వీనర్. ఉస్మానియా యూనివ‌ర్సిటీ నుంచి 'విప్ల‌వ క‌విత్వంలో వ‌స్తురూప వైవిధ్యం'పై ప‌రిశోధ‌న (పిఎచ్. డి.) చేశాడు. రచనలు : 1. తూర్పార, 2. ఏరువాక (సాహిత్య విమర్శ). 'కొలిమి' వెబ్ మేగజీన్ ఎడిటోరియల్ లో పనిచేస్తున్నాడు.

2 thoughts on “అలజడుల జడివాన ‘రాప్తాడు’ కవిత్వం

Leave a Reply