రాళ్లసీమను వెలిగించిన సింగిడి రాప్తాడు కథలు

ఇప్పుడు మీకొక సాహసిని పరిచయం చేస్తాను. కత్తి వాదరకు ఎదురు నిలిచే సాహసిని. కత్తికంటే పదునైన అక్షరాన్ని. అక్షరం, ఆవేశం కలగలిసిన కథల్ని చెప్తాను. రాళ్లసీమను వెలిగించిన సింగిడి పాటల్ని చెప్తాను. అతనో ప్రవాహం. ఎక్కడా నిలువని ప్రవాహం. అతని అక్షరం దేనికీ తలవంచని ఎగసే సంద్రం. అతడు రాసింది కొన్ని కథలే. అయినా అవి మనల్ని జీవితాంతం వెంటాడే కథలు. కల్లోలం రేపే కథలు. మానని గాయాల వలపోతల్ని కళ్లముందుంచిన కథలు. రాళ్లసీమను వెలిగించిన సింగిడి రాప్తాడు కథల పరిచయమిది.

అతడు – “ప్రేయసీ… వొక కథ చెప్పనా”! అంటూ సున్నిత హృదయాన్ని ఆవిష్కరించాడు. పచ్చటి పంట పొలాల్లో సీతాకోకచిలుకై వాలాడు. నదులు, వాగులు, కొండలు, కోనల్ని ప్రేమించాడు. మనుషుల్ని ప్రేమించాడు. మనుషుల్లోపలి విధ్వంసాన్ని చూసి అతని గుండెలో ఎంత వలపోతో! మరెన్ని కన్నీళ్లో! వెంటాడే గాయాలు. కులం చేత వెలి బతుకు. అతని మనసులో ఎంత కల్లోలం చెలరేగిందో? ఎన్ని కన్నీటి సంద్రాలు ఉప్పొంగాయో. బాధల్నించి విముక్తి కోసం అక్షరాలై పోటెత్తాడు. మనుషుల్ని తడిపే ప్రవాహమయ్యాడు. రాళ్ల సీమ బతుకు వెతల ‘కన్నీళ్లు’ కథలల్లాడు. ‘యేదీ యేకవచనం’ కాదని, కోట్లాది గళ గర్జనల జడివానయ్యాడు. అతని కవిత్వమంతా రుధిర స్వప్నాల జాడలే. వీరులు నడిచిన తొవ్వల్లో పూసిన మోదుగు పూల రెపరెపలే. పల్లె పల్లెనూ కదిపే, గుండె గుండెనూ తడిపే వెన్నెల జలపాతాలే. అతని అక్షరాల్నిండా ఆరని కుంపట్ల సెగలే. రగిలే రణన్నినాదాలే. ఊరుకూ వాడకూ మధ్య నిలువెల్లా మొలిచిన అడ్డు గోడల్ని కూల్చే విధ్వంసి అతడు. అతని తపనంతా మనుషుల్ని చీల్చే కుట్రల్ని కూల్చడమే. అతని జీవితమంతా అలజడే. ఎక్కడా నిలువనీయని ప్రవాహమే.

ఎంచుకున్న ప్రేమ బంధం కరిగిన స్వప్నమైంది. తీరని వేదన మిగిల్చింది. ఒకానొక తెల్లవారుజామున తన కలలకు ఉరితాడు బిగించి, ఊపిరొదిలాడు. తనను తాను రద్దు చేసుకున్నాడు. మనందరికీ జ్ఞాపకమయ్యాడు. అతడు- పల్లె మంగలి కతల కల్ప. గొంతెత్తిన వెలుతురు పిట్టల పాట. విప్లవ స్వాప్నికుడు. కవి. కథకుడు. విప్లవ స్వాప్నికుడు రాప్తాడు గోపాలకృష్ణ.

గోపీ నక్సల్బరీ తరం (1968)లో పుట్టాడు. అనంతపురం జిల్లా రాప్తాడు సొంతూరు. తండ్రి కోర్టులో గుమస్తా. వానొస్తే మురుగు వాగులా పారే ఇంటిదారి. దోసిళ్లతో నీళ్లెత్తిపోసిన జ్మాపకాల చిత్తడి బతుకు. అలజడి. అతని బతకంతా అలజడే. డిగ్రీ తర్వాత అనంతపురం రచయితలకు దోస్తయిండు. తన రచనకు మెరుగులు దిద్దుకున్నాడు. కళ్లెదుట కన్పించే బతుకుల్ని కన్నీటి కథలల్లాడు. కులం చేసిన గాయాలు, అవమానాలు, వెలివేతలతో నడవాల్సిన దారినెంచుకున్నాడు. రాడికల్ రణన్నినాదాల్ని గొంతెత్తి నినదించాడు. విప్లవ రాజకీయాల దారి నడిచాడు. విప్లవ రాజకీయాలు, విప్లవ సాహిత్యంతో జీవితాన్ని పెనవేసుకున్నడు. విప్లవం అతని ఊపిరైంది. అట్లా 1992 గుంటూరు సభల్లో విరసం సభ్యుడయ్యాడు. కొంత కాలం కర్నూలులో టీచర్ గా, లెక్చరర్ గా పనిచేశాడు. అతని గుండెల్నిండా జగిత్యాల పోరుదారే. జైత్రయాత్రలో వీరులు నడిచిన తొవ్వను ముద్దాడాడు. అక్కడే 1994లో ఓ ప్రైవేటు కాలేజీలో అధ్యాపకుడిగా చేరాడు. కొంతకాలానికి ఇంటిదారి పట్టాడు. కర్నూల్ లో సొంతంగా స్కూల్ పెట్టడం అతని స్వప్నం. అందుకోసం చేయని ప్రయత్నమంటూ లేదు. విద్యా బోధన గురించి చదవని పుస్తకాల్లేవు. చేయని ప్రయోగాల్లేవు. పిల్లలతో పిల్లవాడై తిరిగాడు. బతుకును రంగు రంగుల సింగిడి చేసుకున్నాడు. ఒంటరి గోపీ జీవితంలోకి ప్రేమ ఓ వసంతాన్ని వాగ్దానం చేసింది. ఓదార్పునూ, తోడునూ వాగ్దానం చేసిన ఓ హృదయం దొరికింది. శిశిరం చిగురించి వసంత గీతమయ్యాడు. అంతలోనే ఆ ప్రేమ దూరమైంది. కులం వల్ల. పెద్దల వెలివేత వల్ల. అతని కలలన్నీ కల్లలైనయని తల్లడిల్లాడు. పగలంతా మిత్రులతో మాటలు. రాత్రయితే అలముకునే ఒంటరితనం. 9 సెప్టెంబర్ 1999 రాత్రంతా మిత్రులతో కలసి కవిత్వమయ్యాడు. అదే రాత్రి ఏ చీకట్లు అలుముకున్నయో. ఏ ఒంటరితనం తరిమిందో. తెల్లవారు జామున ఉరివేసుకున్నాడు. గోపీ చనిపోయాక అతని రచనల్ని విరసం కర్నూలు యూనిట్ ‘యేదీ యేకవచనం కాదు’(కవిత్వం), ‘అతడు బయలుదేరాడు’(కథలు) ప్రచురించింది. ఇవి సాహసి గోపీ కథలు. వెంటాడే కథలు.

**

కోట్లాది మహిళల అంతరంగ వేదనను చిత్రించిన కథ సీతమ్మత్త. ఇది ఒక సీతమ్మ కథ మాత్రమే కాదు. నాటి సీత నుంచీ నేటి సీతల దాకా దగాపడ్డ మహిళల సులుకుపోట్ల గాయాల వర్తమానం. కలలన్నీ కల్లలైన కన్నీళ్ల కథ. పితస్వామ్య సంకెళ్లలో బందీలుగా ఉన్న స్త్రీల కథ ఇది. 14 జనవరి 1994, ఆంధ్రజ్యోతి వారపత్రికలో అచ్చయింది.

ఓ రోజు కథకుడు తన దగ్గరి బంధువు సీతమ్మత్తను చూడటానికి వెళ్లాడు. ఆమె భర్త గుండె నొప్పితో చనిపోయి అప్పటికే మూడు నెలలైంది. ఆమెను పలకరించటానికి ధర్మవరం వెళ్లాడు. కథకుడి తండ్రికి సీతమ్మ దగ్గరి బంధువు. వాళ్లకు పల్లెలో ఐదెకరాల భూమి ఉన్నది. చినుకు పడితే ఆ భూమిలో బంగారం పండించొచ్చు. సీతమ్మ పెద్ద కూతురికి పెళ్లయింది. చిన్న కూతురు చదువుతోంది.

ధర్మవరం చేరేసరికి రాత్రయింది. రాత్రి భోజనాలయ్యాక సీతమ్మ, ఆమె కూతురు, కథకుడు డాబాపైకి వెళ్తారు. చల్లగాలిలో మాట్లాడుతుంటారు. ఆమె ప్రపంచ విషయాలన్నీ మాట్లాడింది. అందులో తన భర్త గురించి ఒక్క మాటైనా లేదు. భర్త చావు, దినాల సంగతులేమైనా చెప్తుందేమోనని ఎదురు చూశాడు. ఆమె అసలేమీ జరగనట్టే వుంది. ఆ విషయాన్ని పొడిగించడం ఇష్టం లేనట్టుంది. ఆమె ఆంతర్యం అర్థం కాక టాపిక్ మార్చాడు. అతనికి తన మిత్రుడి సంగతి గుర్తొచ్చింది. మిత్రుడికి సీతమ్మ కూతురితో పెళ్లి సంబంధం గురించి మాట్లాడాలనుకుంటాడు.

అత్తా… శ్రీనివాసులు అని మా ఆఫీసులో పనిచేస్తున్నాడు. నా కంటే ఐదేళ్లు చిన్నోడు. మంచి పిల్లోడు. మన కుటుంబంతో చాలా స్నేహంగా ఉంటాడు. ఏ బరువు బాధ్యతలూ లేవు. మన ఉమకి మంచి సంబంధం అవుతుంది. ఆలోచిస్తావా? అన్నాడు. ఆమె ఏమీ మాట్లాడలేదు. కొద్దిసేపు మౌనం. తర్వాత స్థి…. బిడ్డకు నేను పెండ్లి చేయదలుచుకోలేదు. దాని చదువు అది చదువుకొని , దాని కాళ్ల మీద అది నిలబడి , దాని జీవితం అదే నిర్ణయించుకుంటుంది అని స్థిరంగా చెప్పింది. సూటిగా. పెండ్లీ, సంసారం అంటేనే యాసిరికి వచ్చింది నాకు అని స్థిమితంగా చెప్పింది. ఆమె ఆలొచనలూ, మాటలూ కథకుడికి కొత్తగా అనిపించాయి. ఆశ్చర్యపోయాడు. అతనికి ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి.

గోడకు ఆనుకొని మళ్లీ మొదలు పెట్టింది. అప్పుడు విప్పింది. ఆమె అంతరంగ కల్లోలాన్ని. ఎన్నడూ ఎవ్వరికీ చెప్పుకోని సునామీని. రెప్పల మాటున దాచుకున్న వేన వేల కన్నీటి సంద్రాల్ని. నడిరాత్రి దాకా చెప్తూనే ఉన్నది. మానని గాయాలను. వలపోతను. గాయమైపోయిన గతాన్ని. నింగిలో వెలిగే చుక్కల సాక్షిగా. చెప్తూనే ఉన్నది. ఆ మసక చీకటిలో. ఇన్నాళ్లుగా తన బతుకులో అలముకున్న చీకట్లను. వెలుగు కోసం పడిన తపనను. ఊపిరాడక తండ్లాడిన దీనత్వాన్ని చెప్పింది. ఎందుకు చేయాలో చెప్పు నాయనా పెండ్లి. పెండ్లి చేసుకొని యేండ్లు సంసారంచేసి నేనేం బావుకున్నానని. అది వొక జీవితమేనా? అన్నది పొలమారిన గొంతుతో. మళ్లీ అందుకున్నది. మీ మొగోళ్లు అప్పులూ, సప్పులూ, సొంతిల్లూ, సంపాదన గురించి మాత్రమే మాట్లాడతారు. ఆ ఇండ్లలో ఆడోళ్ల బతుకు ఎట్లా వుంటుందో ఎప్పుడయినా ఆలోచిస్తారా? అని ప్రశ్నించింది. ఆ ప్రశ్నలో భూకంపం ఉన్నది. గోపీ కథను యధాతథంగా చెప్తేగాని అర్థం కాదు. ఆ కథలోని తీవ్రత. కన్నీళ్లు. బతుకు బండి చక్రాల కింద పడి నలిగి నలిగి నుజ్జునుజ్జయ్యే స్త్రీల అంతరంగం. మీ అమ్మా, మా అమ్మా… మనందరి అమ్మల బతుకుల్లోని అల్లకల్లోల కన్నీటి సంద్రాలు.

చుట్టూ పరుచుకున్న చీకటి సాక్షిగా చెప్తోంది సీతమ్మ. వెలుగులీనే కళ్లతో. తుఫాను తర్వాతి ప్రశాంతతలా. వాన వెలిసిన తర్వాత స్థిమితమైన నింగిలా. ప్రాణాల్ని ఉగ్గబట్టుకొని చదవండి. `పెండ్లి కాకమునుపు గుణసుందరి` సినిమా చూసి ఎలుగ్గొడ్డుతో వొక ఆడది సంసారం ఎట్లా చేసుంటుందబ్బా! అని ఆశ్చర్యపడినాను. దుక్కమొచ్చి కండ్లనిండా నీళ్లు పెట్టుకుంటి. మీ మామతో సంసారం ఎలుగ్గొడ్డు కంటే అధ్వానం తండ్రీ! ముప్పై ఏండ్లలో యా దేవుడూ నన్ను రక్షించలేకపాయ మీ మామ బారి నుంచి!

నా కంటూ వొక బతుకు వుండిందా? పక్కింటి వాళ్లతో మాట్లాడినా అనుమానమే. సంవత్సరానికొకసారి సినిమాకి పోతే మొగోళ్లు వుంటారని చెప్పి ఆడతిప్పి, ఈడ తిప్పి సగం సినిమా అయినపోయినాక ఏ డొక్కు కుర్చీలోనో కూలేసేవాడు. తను బయటికి పోతానే ఇంటికి వాకిలి ఏసుకోవడం మర్చిపోతే మళ్లీ వచ్చి మా శనిద్రం వదలగొడ్తాండె. ఆఖరికి నేను కట్టే చీరలూ, రైకలూ, లంగాలూ నా ఇష్టం వచ్చినట్లు కట్టలేదు. తను తెచ్చిండేవే కట్టుకోవల్ల. వద్దులే నాయన, కడుపు చించుకుంటే కాల్ల మీద పడుతుందని చెప్పుకుంటూ పోతే ఈ రాత్రంతా, రేపు పొద్దంతా చెప్పొచ్చు.

మహానుభావుడు ఇంట్లో వుంటే కాళ్లు, చేతులూ ఆడక పట్టుకున్న సామాన్లు పట్టుకున్నట్టే జారిపోతాండె.
చిన్నప్పుడెప్పుడో హిట్లరు పాఠం చదువుకోనుంటిమి. వానికి పదిరెట్లు మించినోడు మీ మామ. ప్రతాపమంతా నా మిందా, పిల్ల మిందే. ప్రపంచానికేమే నోట్లో నాలుక లేనోడు.
సచ్చిపోయిన్నాడు నలుగురి కోసమన్నా రెండు కన్నీటి బొట్లు రాలకపాయె. మిగిలుంటేనా రాలేకి!

ఏమి మా అత్త ఇంత తెగించి మాట్లాడుతుంది అనుకుంటావేమో పాపోడా! నిజం చెప్పుతాను నీకంటే నాకెవుడుండాడు. మీ మామ సచ్చినంకనే హాయిగా వుంది. ‘ఇన్నాళ్లు ఎట్ల బతికినానా` అని తలుచుకుంటే గుండె దడ పుడతాది. ఇంకెందుకు నాయనా దానికి పెండ్లి. దాని బతుకూ నా మాదిరి కాకున్నా, సుఖంగా, సొతంత్రంగా బతుకుతాదనే నమ్మకం లేదు. దాని బతుకు దాని నిర్ణయానికే వదిలేస్తాను“ అంది గాద్గదికమైన గొంతుకతో. ఆ గొంతులో దశాబ్దాల బాధ గూడు కట్టుకొనింది. ఆర్తి వుంది. ఆవేదన వుంది.

ఎంతో సజావుగా సాగిపోతుందనుకున్న అత్త కాపురంలో ఇంత బడబానలం వుండేదని అర్థమయ్యే పాటికి నాలో ఏవో విచిత్రానుభూతులు కనిపించాయి. మాట్లాడ్డానికి మాట రాక స్తబ్దంగా వుండిపోయాను.

“ఏదో మనసు వుండబట్టలేక అన్నీ కక్కేస్తి. నా భారమంతా దిగినట్లుంది. ఎట్లనన్నా అర్థంచేసుకో, నువ్వూ వొక మగోడివే కదా!
పొద్దుపోయింది. పండుకో. నేను కిందికి పోతాండ. అని నీళ్లచెంబు నా తలసాటున పెట్టి తాంబూలం తట్ట తీసుకొని మెట్లు దిగి వెళ్లిపోయింది.
ఇంకెక్కడి నిద్ర.

ఇదీ కథ. నిద్రపోనివ్వని కథ. నిదురలోనూ, మెలకువలోనూ వెంటాడే కథ. మనచుట్లూ ఎన్నెన్ని జీవితాలు చీకట్లలో మగ్గిపోతున్నాయో చెప్పిన కథ. చివరి వాక్యంతో మెరిపించే కథనమే రాప్తాడు శైలి. అలవోకగా చెక్కిన శిల్పం. కళ్లముందున్న చాలా చిన్నచిన్న విషయాలను ఒడుపుగా అల్లే కథల గిజిగాడు రాప్తాడు. ఒక్కో వాక్యం గుండెను తాకేలా రాస్తాడు. గుండెతడి వున్న వాక్యాలవి. ఒక దశ్యానికీ, మరో దశ్యానికీ మధ్య భావాలు సింగిడై మెరుస్తాయి. వాన చినుకై కురిసి, లోలోపల నెగళ్లను రాజేస్తాడు. ఆరని మంటల్లోకి నడిపిస్తాడు.

రాళ్లసీమలో చిగురించిన రాప్తాడు గోపాలకృష్ణ ఏ విమర్శకుడి తూనికరాళ్ల దగ్గరా ఆగిపోలేదు. ఏ తక్కెడా తన అక్షరాల కన్నీటిని, గుండె తడి బరువును తూచలేవని అతనికి తెలుసు. అందుకే సాగిపోయాడు గోపి. ఏరువాక తొలకరై. చిమ్మచీకట్లలో వెలిగే మిణుగురై. సాగిపోయాడు. ఆరుద్రపూవులా. అంతరంగాల్ని అల్లుకుంటూ. పెనవేసుకుంటూ. ఇంకెప్పటికీ మనకు ఎదురవ్వని గోపీ, తన అక్షరాలతో కరచాలనం చేశాడు. తన కథలపై కర్రచాలనం చేసే కరుకు గుండెల్ని మీటుతూ. తన అక్షరాలతో గోడల్ని ధ్వంసం చేస్తూ. వెళ్లిపోయాడు. వెనుదిరగకుండా.

పితృస్వామ్య నగ్న స్వరూపాన్ని చెప్పిన మరో కథ కుబుసం. మెజార్టీగా ప్రతి ఇంట్లోనూ బయటికి ఆదర్శాలు. లోపల అణచివేతలు. దౌర్జన్యాలు. అవమానాలు. అనుమానాలు. వివక్ష. ఆదర్శాల ముసుగులో కొనసాగుతున్న హింసను విప్పిన కథ ఇది. దేహాల దాహాల కోసం పరితపించినంతగా ప్రేమల్ని నిలుపుకోలేని మగ దురహంకారంపై నిప్పులు చెరిగిన కథ. ఇది 13 మార్చ్ 1992, ఆంధ్రజ్యోతి వారపత్రికలో అచ్చయింది.

ఈ కథంతా ఫస్ట్ పర్సన్ లో నడిచింది. ప్రయివేట్ స్కూల్ లో టీచర్ గా పనిచేసే ఓ మహిళ కథ ఇది. నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునేదాకా విశ్రాంతి లేని బతుకు ఆమెది. తెల్లారినప్పట్నించీ పనులే పనులు. పొద్దున తొమ్మిది గంటలకల్లా స్కూల్ లో ఉండాలి. తెల్లారితే స్కూల్ లో ఇన్ స్పెక్షన్. దానికోసం ప్రిపేరవుతూ అర్ధరాత్రి దాకా మేల్కొని ఉన్నది. దీంతో మరుసటి రోజు నిద్రలేచేసరికి ఏడైంది. టెన్షన్. టెన్షన్.

కాలంతో పరుగెత్తుతోంది. రాత్రి ఎంగిలి గిన్నెలు తోమింది. అన్నం, కూరం వండేసరికి ఎనిమిదైంది. చేయాల్సిన పనులింకా మిగిలేవున్నాయి. ఈ పనుల మధ్యే స్కూల్ గుర్తొస్తోంది. ఇన్ స్పెక్షన్ గుర్తొస్తోంది. తుఫాన్ లో చిక్కిన పక్షిలా ఐంది. అప్పటికింకా పళ్లు తోమలేదు. స్నానం చేయాలి. చంటిదానికి స్నానం చేయించి, సీసా పాలు సిద్ధంచేసి ఆయాకు అప్పగించాలి. జడల్లుకోవాలి. ఆయనకో క్యారియర్, ఆమెకో క్యారియర్ కట్టాలి.

ఇన్ని పనుల మధ్య కాళ్లూ, చేతులూ ఆడని స్థితి. ఆమెలో ఇంత గందరగోళం జరుగుతున్నా ఆయన తాపీగా సిగరెట్ తాగుతున్నాడు. న్యూస్ పేపర్ లో లీనమయ్యాడు. రెండోసారి కాఫీ కావాలని ఆర్డర్ వేశాడు. ఫ్లాస్క్ లో కాఫీ కప్పులోకి వంచి ఆయనకిస్తుంటే గుర్తొచ్చింది… ఇంకా కసువూడ్చలేదని. కాలం పరుగెడుతోంది. కాలంతో తనూ, తనతో కాలమూ పోటీ పడుతున్న విషాద సందర్భం.

ఆమె అంతరంగాన్ని విందాం. అతలాకుతల మవుతున్న మనసుతో ఏమండీ… ఎన్ని పనులున్నాయో చూడండి. టైం చూస్తే ఎనిమిదయింది. చంటిదానికి స్నానం చేయించి నేనూ చేసేస్తాను. అంతలోపల మీరు ఆ పేపర్ కాస్తా పక్కన పడేసి, తలుపులేసుకుని కసువూడ్చండి“ అన్నాను. నేనెప్పుడూ ఎరుగని, వూహించని విధంగా ఆయన మొహంలో రంగులు మారాయి. నా మాటలు ఆయన చెవిని సోకనైనా సోకినాయో లేదో ఆయన చేతివేళ్లు అయిదూ నా చెంపను అంటుకున్నాయి.

హస్తం గుర్తు ఒక స్త్రీని ధీమాగా పార్లమెంటుకు నడిపించి వుండవచ్చు. కానీ నా చెంప మీద హస్తం గుర్తు నన్ను స్కూలుకి నడిపించలేకపోయింది. వారం రోజులు బయటి ప్రపంచానికి నా మొహం చూపించలేకపోయాను. ఉద్యోగం వూడిపోయింది.“

ఈ పరిస్థితి ఈ కథలో ఉన్న మహిళది మాత్రమేనా? కాదు. ఎంతమాత్రమూ కాదు. ప్రతి మహిళ పరిస్థితీ ఇంతే. భర్త పోస్టు అధికారానికి చిహ్నం. అణచివేతకు పర్యాయపదం. హింసకు ప్రతిరూపం. భార్యల్ని అడిగితే తెలుస్తుంది భర్తల అసలు స్వరూపమేమిటో.

మళ్లీ ఆమె మాటల్లోనే విందాం. “కొత్త దంపతులమైన మేము మా వూరి దగ్గరగా వున్న మహాబలిపురానికి హనీమూన్ కి వెళ్లాం. ఒక కాటేజీ అద్దెకు తీసుకున్నాం. ఆ నాల్గు రోజులూ ఈ ప్రపంచాన్ని మరిచిపోయాం. నాకు ఆయనా, ఆయనకి నేనూ తప్ప మరేమీ కనిపించలేదు. మనుషులెవ్వరూ లేని చోట ఇసుక, వెన్నెల్లో, బండరాళ్ల దగ్గర సముద్రపు కెరటాలలో ఆడుకుంటూ, ఇసుక గవ్వలేరుకుంటూ, నీళ్లలో తడుస్తూ, ఒకరికొకరు వుద్రేకమౌతూ, కౌగిలించుకుంటూ… చలం మైదానంలోని అమీర్ గా, అతని ప్రియురాల్లాగ గడిపాం. అంతకంటే మించిపోయాం.

చలం సిగ్గుపడి రాయలేకపోయాడేమో… మా శృంగార చేష్టలు వాళ్లకంటే ఎక్కువగా ఉన్నాయి.

ఒకరోజు నేను ఇసుకలో కాళ్లు చాపుకుని కూర్చున్నాను. ఆయన ఇసుకలో పడుకుని అటూ ఇటూ దొర్లుతూ వచ్చి నా పాదాలను ముద్దుపెట్టుకున్నాడు.

ఛీ, ఏంటండీ మగాళ్లు ఎక్కడయినా అలా పాదాలు తాకవచ్చా? అన్నాను.
ఎందుకు తాకకూడదూ? అని శ్రీకృష్ణుడు సత్యభామ చేత కాలిదెబ్బలు తిన్న ఘట్టాన్ని గుర్తుచేశాడు.

మరొక రోజు గదిలో చీకట్లో నన్ను నగ్నంగా చేసి నా వొళ్లంతా ముద్దులు కురిపిస్తూ చెప్పలేని చోట కూడా చుంబించాడు.

ఛీ.. ఛీ… ఏమిటీ అసహ్యం? అని వారించాను గట్టిగా.

వాత్సాయన కామసూత్రాలను విపులంగా చెప్పి ఉదయాన్నే మహాబలిపురం గుడులన్నీ వెతికి ఒక స్తంభం మీద చెక్కిన వివిధ శంగార భంగిమల్ని చూపించాడు. ఆ తరువాత నా సందేహాలకన్నింటికీ సమరం పుస్తకాలలో సమాధానాన్ని చూపించాడు. అప్పటికీ నేను అంగీకరించలేదు. కానీ ఆయన్తో వాదించలేదు. ఆ విధంగా నాకు తెలియని నా శరీర ధర్మాల్ని బోధించిన గురువాయన.

నేను నీకోసం, నీవు నా కోసం అని డైలాగు చెప్పిన మొగుడాయన. శారీరక సంబంధాలకీ, సంసారిక సంబంధాలకీ వేరు వేరు ధర్మాలుంటాయని నిరూపించిన మగవాడు ఆయన.

అవునులే… మగాళ్లు చీకట్లో ఆడవాళ్ల కాళ్లు పట్టుకోవటానికీ, వాత్సాయన భంగిమల్లో చేయటానికీ చారిత్రక ఆధారాలూ, శాస్ర్త ఆధారాలూ వున్నాయి కానీ, ఏ ఆధారాలూ లేకుండా ఆయనయినా ఇంట్లో కసువెలా వూడుస్తారు?

అయినా, ఆయన వొక మేలు చేశాడు. నీవూ నేనూ వొకటే అనే విశ్వాసంలో దాగున్న రహస్యాన్ని బైటకి లాగి నా అనుభవంలోకి తెచ్చాడు. శతాబ్దాల కాలం నా ఆలోచనలపై అల్లిన పొరను వదిలి సరికొత్తగా వెలుగులోకి తొంగిచూశాను“.

ఇదీ కథ. భావుకత్వ మాయల లోయల్లో ఊపిరాడకుండా ప్రేమను కురిపించే మగవాళ్ల దౌర్జన్యాల కథ. మగాడిదంతా దేహాల దాహమే. స్త్రీలది గుండెను తాకే ప్రేమ. మనుషుల్లోని చీకట్లను తుదముట్టించే ప్రేమ. తమ ప్రేమను అందుకోవడానికి యోగ్యతలేనివాళ్లకు దగ్గరై విలపిస్తారు. కాలం మిగిల్చిన గాయాలను తడుముకుంటారు. ఇంకెన్నటికీ మానని గాయాలతో విలవిల్లాడుతారు. ప్రేమ కోసమే బతుకుతారు. ప్రేమనందిస్తూ బతుకుతారు. ఈ ప్రేమ రహిత లోకాలను వెలిగిస్తూ.

(ఇంకా ఉంది…)

ముకుందాపురం, నల్లగొండ జిల్లా. క‌వి, రచయిత, ప‌రిశోధ‌కుడు. ఇండిపెండెంట్ జర్నలిస్ట్. సాక్షి దిన‌ప‌త్రిక‌లో ఎనిమిదేళ్లు జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేశాడు. 'ఓయూ సాహిత్య వేదిక' వ్య‌వ‌స్థాప‌క స‌భ్యుడు, మొదటి కన్వీనర్. ఉస్మానియా యూనివ‌ర్సిటీ నుంచి 'విప్ల‌వ క‌విత్వంలో వ‌స్తురూప వైవిధ్యం'పై ప‌రిశోధ‌న (పిఎచ్. డి.) చేశాడు. రచనలు : 1. తూర్పార, 2. ఏరువాక (సాహిత్య విమర్శ). 'కొలిమి' వెబ్ మేగజీన్ ఎడిటోరియల్ లో పనిచేస్తున్నాడు.

Leave a Reply