రాళ్లసీమను వెలిగించిన సింగిడి రాప్తాడు కథలు -2

రాయలసీమ కరువును గుండెను తాకేలా చెప్పిన కథ ‘కన్నీళ్లు’. ఎడారిని తలపించే రాళ్లసీమ కథ. గుక్కెడు నీళ్లకోసం తండ్లాడుతున్న మట్టి మనుషుల కథ. ఎన్నటికీ తీరని ఎత. భూగర్భ జలాలు అడుగంటి ఎండిన చెరువులు. బావులు. కుంటలు. గొంతెండుతున్న పల్లెలు. కన్నీళ్లింకిన మనుషులు. ఎంత చెప్పినా తీరని కష్టాలు. కన్నీళ్లు. కడగండ్లు. ఈ కథ ఆంధ్రప్రభ వారపత్రిక(24 జులై 1991)లో ప్రచురితమైంది. ఈ కన్నీళ్ల కథ చెప్పే వ్యక్తి అక్కడ నీళ్ల కోసం జనం పడుతున్న బాధల్ని ఇల్లిల్లూ తిప్పి చూపిస్తాడు. నీళ్ల కరువు ఎంత దుర్భరంగా ఉంటుందో అనుభవంలోకి తెస్తాడు. నిరుపేద జనం బిందెడు నీళ్ల కోసం కొళాయిల దగ్గర ఎట్లా పడిగాపులు పడతారో చెప్తాడు. నాలుగు రోజులకోసారి వచ్చే కొళాయి నీళ్ల కోసం పెద్ద యుద్ధమే జరుగుతుందక్కడ. కొళాయి దగ్గర వంతులు పెట్టడానికి డబ్బాలు, బిందెలు, పాత బిందెలు వెతికి తెస్తారు. వాటన్నిటినీ ఒకరి తర్వాత ఒకరు వరుసగా పేరుస్తారు. తమ వంతుకోసం ఎదురుచూస్తారు. మండే ఎండల్లో. చెమట చిత్తడిలో. ఎండలకి మండి కాలుతున్న నేలపై. నగ్న పాదాలతో. గొంతెండి కునారిల్లుతారు. ఉన్నట్లుండి ఆకాశం నుంచి ఏ ఒక్క చినుకూ రాలకపోతుందా అని ఎదురుచూసే ఎండిన బతుకుల మనుషులు. శతకోటి ఆశలతో నింగిని చూసే మనుషులు. నెర్రెలీలిన నేలల్లా.

కొళాయి నీళ్ల కోసం జరిగే తండ్లాటను కథకుడు ఇట్లా పరిచయం చేస్తాడు. ”కొళాయిలకి ఒక టైమూ, పాడూ ఉండదు. ఏ అర్ధరాత్రయినా రావొచ్చు. తెల్లవారి రావచ్చు. మిట్ట మధ్యాహ్నం రావొచ్చు. ఎప్పుడొచ్చినా పరుగెత్తాల్సిందే.

రాత్రిపూట రోజూ జాగరణే నీళ్ల కోసం. కొందరైతే ఏకంగా కొళాయి దగ్గరే మంచాలు వేసుకొని మరీ పడుకుంటారు.
ఉన్నట్లుండి ఏ మధ్యాహ్నమో, అర్ధరాత్రో కొళాయి దగ్గర కలకలం రేగుతుంది. నిద్రపోతున్నవాళ్లం గబగబా లేచి బిందెలు తీసుకొని పరుగెత్తుతాం. నీళ్లు వస్తుండవు అక్కడ. వంతుకి పెట్టిన బిందెలు కనబడలేదనో, వెనక్కు జరిపినారనో కొట్లాడుతుంటారు. ఉస్పూరనుకుంటూ వెనక్కు తిరిగివస్తాం.” అని బడుగు బలహీన వర్గాల పరిస్థితిని చెప్పాడు. కమ్మేసిన కరువు నుంచి తమను తాము ఎట్లా మలుచుకుంటున్నారో చెప్తాడు. ఇక్కడ ఒక్కో నీటి చుక్కా ప్రాణం నిలిపే అమ్మ చనుబాల ధార. నిత్యం ఎదురుచూస్తారిక్కడ. గుక్కెడు నీళ్ల కోసం. భూమిని చీల్చుకు మొలకెత్తే విత్తనంలా. నడిరేయిన కలగంటారిక్కడ. గర్జించే మేఘాన్నీ, కురిసే వాననీ. తడిసే నేలనీ. పారే వాగునీ. పొంగే ఏరునీ. కానీ, కలలన్నీ కల్లలైన మనుషులు వీళ్లు. కన్నీళ్లు నిండిన కల్లోల కలల మేఘాలు వీళ్లు. ఇక్కడి బాధమయ గాధల్ని చెప్తూ… పిల్లలు నీళ్లు బుడబుడా పోసేస్తే, చాలా కఠిన శిక్షలు విధిస్తుంది మా ఆవిడ. ఆమె కోసం అర్ధంచేసుకొని నేను కూడా చాలా జాగ్రత్తగా వాడుతుంటాను. ఎసట్లోకి నీళ్లు ఎక్కువ పోస్తే గంజి రూపంలో వఈథా అవుతాయని సరి ఎసరు పెడుతుందామె. పిల్లలు తాగి పారేస్తారని తానే టానిక్కులా జాగ్రత్తగా తాపుతుంది. స్నానానికి పిల్లలకి అరబకెట్టు, పెద్దలకి ముక్కాలు బకెట్టు, తలకయితే పూర్తి బకెట్టు రేషన్ పద్ధతిలో కేటాయిస్తుంది. అని అక్కడి వాస్తవ పరిస్థితిని పాఠకుల ముందుంచుతాడు. ఇట్లా బతకడం ఎంత కష్టం. ఎండిన మానులా. గొంతెండి విలవిల్లాడుతూ నేలరాలిన పక్షిలా. వడగాడ్పుకి అల్లాడే చిగురుటాకులా. ఎంత వేదన ఇది? ఇది ఒక్క అనంతపురం పరిస్థితేనా? కాదు. ఇది నల్లగొండ తండ్లాట కూడా. పాలమూరు అరిగోస కూడా. ధ్వంసమైన ఉత్తర తెలంగాణ పల్లెల గోడు కూడా. గాలిలో దీపంలా వణుకుతున్న మన్నెం. కన్నీళ్లింకిన ఉత్తరాంధ్ర. అగ్గిమేసిన పాలకొండలు. పాలకవర్గం ధ్వంసం చేసిన పల్లెలన్నిటిదీ ఇదే బతుకు. ఇదే తండ్లాట.

మండే ఎండల్లో రోడ్డు పనిచేసే కార్మికుల నేపథ్యంలో రాసిన కథ ఇది. కుతకుత ఉడికే డాంబర్ బకెట్లను పట్టుకొని తార్రోడ్డేస్తున్న చెమట చిత్తడి మనుషుల కథ. ఈ కన్నీళ్ల కథలోని మనుషుల గుండెతడి అర్థం కావాలంటే డైరెక్ట్ గా కథలోకి వెళ్లాల్సిందే. కథకుని కథనం తప్ప ఏ విశ్లేషణలూ సరితూగవు. కథకుడు తన కన్నీళ్లను మనలోకి ఒంపుతున్నాడిలా…
”వీధిలోకెళ్లిన మా ఆవిడ ”ఏమండీ ఇలా రండి” అంది.
”ఏం” అంటూ వెళ్లాను.
”ఎండకి కాళ్లు కాల్తుంటే వాళ్లెంత అవస్థ పడుతున్నారో చూడండి” అంది.
కూలీలు దిబ్బలో పడిన పాత చెప్పులు వెతుక్కుంటున్నారు. తెగిపోయిన వాటికి దారాలు కట్టుకొని వేసుకుంటున్నారు.
కడుపులో కెలికినట్లయింది నాకు.”

పై సంభాషణలు చదివితే మన లోలోపల ఎన్నెన్నో జ్ఞాపకాలు కదలాడుతాయి. గుండెల్ని తాకుతాయి. అతలాకుతలం చేస్తాయి. ఎక్కడా నిలువనీయవు. ఇవన్నీ గుండెతడి ఉన్న మనుషుల్లో మాత్రమే.

రోడ్డు నిర్మాణాల్లో చెమట చిందించే కార్మికులు ఎట్లా ఉంటారు? చాలీ చాలని సద్ది బువ్వ. చింపుల అంగీలు. మాసిన తువ్వాలలు. ఉంగటాలు తెగిన చెప్పులు. సొట్టుబోయిన సత్తురేకుల గిన్నెలు. పగిలిన రాతెండి గిలాసలు. పగుళ్లీనిన పాదాలు. చెమటతో తడిసిన దేహాలు. ఉప్పూరిన దేహాలు. ఇట్లాంటి శ్రమజీవుల బతుకుల్ని కథగా మలిచాడు గోపీ. ఈ కథలోని సన్నివేశాలు మనల్ని ఈడ్చుకుపోతాయి. ఎండల్లోకి. మండే ఎండల్లోకి. ఉక్కపోతల్లోకి. గాయాలైన పాదముద్రల్లోకి. బుక్కెడు బువ్వకోసం జీవితాన్నే పణంగా పెట్టిన మనుషుల బతుకుల్లోకి. చేయిపట్టి నడిపిస్తాయి. వాళ్ల జీవితంలో నెలకొన్న చీకట్లలోకి. వెన్నెల మాయమైన బతుకుల్లోకి. మన భద్రజీవితాలు బద్ధలయ్యే క్షణాల్లోకి. ఈడ్చుకుపోతాయి. పాఠకుల్నిట్లా తీసుకుపోయినపుడే కథకుడు సక్సెస్ అవుతాడు. అది వెంటాడే కథవుతుంది. కలకాలం నిలిచివుంటుంది. అట్లా గోపీ శ్రమైక జీవన సౌందర్యాన్ని మన కనుపాపల్లోకి వానచినుకై రాలుతాడు. కన్నీటి నదై ప్రవహిస్తాడు. మనలోకి. మన అంతరంగాల్లోకి. అలజడై. అలజడుల జడివానై. నిలువెల్లా కుదిపేస్తాడు.
రండి. సలసల కాగే ఎండల్లోకి. చెమటా, నెత్తురూ ఆవిరవుతున్న ఎండల్లోకి. మన అధునాతన వాహనాలు జెట్ స్పీడ్ తో దూసుకుపోయే రోడ్డు మీదికి. ఆ రోడ్డు పనుల్లో రడమండలమైన బతుకుల్లోకి.

”రోడ్డుకి ఒకపక్క పొయ్యి తవ్వి పెద్ద పెనంలో తారు వుడికిస్తున్నారు. నల్లటి బుడగల్తో కుతకుతమని వుడుకుతోంది.
కొంతమంది వుడికిన తారుని, కంకర రోలరుతో తిప్పి ఆ మిశ్రమాన్ని తట్టలకెత్తుతున్నారు. మరికొంతమంది ఆ కాలుతున్న మిశ్రమాన్ని పరుగెత్తి మోసుకుంటూ రోడ్డు వేస్తున్నారు. ఆ కూలీల్లో స్త్రీలు సైతం పనిచేస్తున్నారు.”
”ఎంత కర్మ జీవులండీ” పెదవి విరిచింది. మా ఆవిడ ఎలా గమనించిందో చెప్పులు లేకుండా పనిచేస్తున్న ఒక అమ్మాయిని పిలిచి లెట్రిన్ కెళ్లే చెప్పులు ఇచ్చింది.
ఆ అమ్మాయి చెప్పులు తీసుకుంటూ ”మామ్మ దేవతలట్లాటిదీ” అని కతజతగా చూసి వెళ్లింది.”
రోడ్డు దుమ్ము, తారు వాసనా ఇంట్లోకి వస్తుంటే తలుపులు వేశాము.
మధ్యాహ్నం ఒక గంట అయింది.
మా ఆవిడ కూరలు తరుగుతోంది.
నేను నవల చదువుతున్నాను.
తలుపులు కొట్టిన శబ్దమయితే మా ఆవిడ చూసింది. ఎదురుగా రోడ్డు పనిచేసే అమ్మాయి పొద్దున మా ఆవిడ చెప్పులిచ్చిన అమ్మాయి ఆప్యాయతతో, కృతజ్ఞత తో చూస్తూ కడపలో ఉంది.
”ఏమ్మా” అంది మా ఆవిడ.
”సంగటి దినేదానికి కుచ్చొన్నామమ్మా. తాగేదానికి అర కడవ నీళ్లు ఇయ్యమ్మ. బోరింగ్ పోయింది. వేరే బోరింగ్ చానా దూరంలో ఉంది.”అంది ఆ అమ్మాయి.
ఎదురుగా చెట్టుకింద చద్ది మూటలు తింటున్న కూలీలు కనిపిస్తున్నారు.
ఆ ఆవిడ గుటకలు మింగుతోంది. చెప్పలేక సతమతమవుతుంది.
నాకర్థం అయిపోయింది. ఇంట్లో ఉన్నదే అర బిందె నీళ్లు. బాత్ రూమ్ లో కూడా ఎక్కువ లేవు. రేపు కొళాయి వస్తుందో రాదో నమ్మకం లేదు.
ఉన్న నీళ్లు ఇవ్వలేక, ”నీళ్లు లేవు” అని చెప్పలేక ఉన్న స్థితిలో మా ఆవిడను చూస్తే జాలేసింది నాకు.
చివరికి ”కొళాయి రాలేదు. నీళ్లు లేవు” అని చెప్పింది గబగబా.
చిన్నబుచ్చుకొన్న మొహంతో కడవను చంక పెట్టుకొని వెళ్లింది ఆ అమ్మాయి. వెళ్తూ వెళ్తూ లెట్రిన్ బయట మూలకు పెద్ద బానలోకి తొంగి చూసింది. ఆ అమ్మాయి ముఖం వికసించింది.
”అమ్మమ్మా ఈ బానలో నీళ్లు తోడుకుందునా?” అని అడిగింది.
”అయ్యో అవి లెట్రిన్ నీళ్లు” అంది మా ఆవిడ.
”ఉన్నీలేమ్మా. యావో ఒగటి తాగుతాము. నీళ్లు లేనప్పుడు” అంది ఆ అమ్మాయి.
”వద్దు వద్దు. దొడ్డి చెంబులు ముంచిన నీళ్లు తాగకూడదు. రోగాలు వస్తాయి.అంది మా ఆవిడ. ”కన్నిగుండాయిలేమ్మా”అంది ఆ అమ్మాయి. ”వద్దమ్మా. అవి తాగకూడదు” అంది మా ఆవిడ అనునయంగా. ”ఉన్నీలేమ్మా. నీళ్లు యాడా దొరకవు” అక్కడున్న చెంబును తీసుకొని నీళ్లు తోడుకోటానికి సిద్ధమయింది ఆ అమ్మాయి. ”చెప్తుంటే వినపల్లేదా? నీళ్లు లేవు ఏమీ లేవు పో ఇక్కన్నుండి” ఈ సారి కోపంగా అంది మా ఆవిడ. ఆమె మొహంలో ఆప్యాయత స్థానంలో కఠినం చూసి మౌనంగా వెళ్లింది ఆ అమ్మాయి. మా ఆవిడ మొహం తిప్పేసుకుని గబగబా లోపలికెళ్లింది. ఆమె కళ్ల కొనల్లో మెరుస్తున్న కన్నీటి తడి నా చూపుల నుండి తప్పించుకోలేకపోయింది. ఇదీ కథ. గుక్కెడు నీళ్ల కోసం గొంతెండి అల్లాడుతున్న బీదజనం కథ.

పని చేసీ చేసీ అలసిపోయిన ఆ అమ్మాయి దూరంలో ఉన్న బోరింగ్ దగ్గరికి నడిచే శక్తి లేదు. అలసిపోయింది. కాళ్ల నొప్పులు. మండే ఎండ. నిలువెల్లా ఉబికివచ్చే చెమట. వేడికి కాలుతున్న పాదాలు. ఇక ఎట్లా వెళ్లడం? అంత దూరంలో ఉన్న బోరింగ్ దగ్గరికి. అందుకే పొద్దున తనకు పాత చెప్పులిచ్చిన ఇంటావిడ దగ్గరికి వెళ్లింది. ఆమెలో ఈ అమ్మాయికేదో ఆప్యాయత కన్పించివుండొచ్చు. తన శ్రమను చూసి తల్లడిల్లిన సున్నితమైన మనసున్నదనుకున్నదేమో. అందుకే అర కడవ నీళ్లివ్వమని అడిగింది. ఇచ్చేందుకు వాళ్లింట్లోనూ నీళ్లు లేవు. ఎట్లా ఆ అమ్మాయిని కాళీ కడవతో తిప్పి పంపడం అని ఆమె మనసుకు ఎంత కష్టంగా అన్పించిందో. నీళ్లు లేవని చెప్పింది. ఆ అమ్మాయి వెనుదిరిగింది. పోతూ పోతూ పక్కనే లెట్రిన్ పక్కనున్న నీళ్ల బానను చూసింది. అందులో నీళ్లతోనైనా దూప తీరుతుందనుకుంది. నీళ్లు తోడుకునేందుకు సిద్ధమైంది. అడిగింది. బానలో నీళ్లు తోడుకుంటానని.

”చెప్తుంటే వినపల్లేదా? నీళ్లు లేవు ఏమీ లేవు పో ఇక్కన్నుండి” ఈ మాటలన్న మహిళ మనసులోనూ కన్నీటి నది పొంగే వుంటది. నీళ్లివ్వలేనందుకు బాధపడే వుంటది. తన బిడ్డలాంటి బిడ్డ. మండే ఎండల్లో చెమటోడుస్తున్న బిడ్డ. గుక్కెడు నీళ్లకోసం వస్తే లేవని తరిమిన సందర్భం తనలో ఎన్నెన్నో కల్లోలాలు రేపే వుంటది. కాళీ కడవతో మౌనంగా వెనుదిరిగిన ఆ అమ్మాయి మనసు ఎంత తల్లడిల్లి వుంటదో. నీళ్లు లేకుండా బువ్వెట్టా తినేది? మిగిలిన రోడ్డుపనెట్టా పూర్తిచేసేది? చెట్ల కింద బువ్వతింటున్న కార్మికుల గొంతెట్లా తడపాలి? ఆమె మౌనంలో చెలరేగే ఎన్నెన్నో ప్రశ్నలు. ఎంత దు:ఖమిది? ఈ సన్నివేశం కళ్లల్లో మెదిలినప్పుడు మన లోలోపల దు:సంద్రం ఎగసిపడుతుంది. లెట్రిన్ నీళ్లు కూడా తాగడానికి సిద్ధపడ్డ శ్రమజీవులు. శ్రమ తప్ప ఇంకేదీ తెలియని మట్టి మనుషులు. అవి మంచి నీళ్లా, కాదా? జానేదేవ్. గొంతు తడిస్తే చాలు. దూపారితే చాలు.

కనీసం తాగేందుకు కూడా నీళ్లివ్వని పాలకులున్న దేశమిది. కూడు నివ్వలేని దేశం. గూడునివ్వలేని దేశం. నీడనివ్వలేని దేశం. కమ్మేసిన కరువులో తల్లడిల్లుతున్న రాయలసీమ. గొంతెండుతున్న రాళ్ల సీమ. ఎండిన పంటలు. గొంతెండిన జనం. వందల ఫీట్ల లోతు బోర్లేసినా నీటి చెమ్మ తగలని కరువు నేల. ఇట్లా అనంతపురం కరువు నేల కన్నీళ్లను మనలోకి ఒంపిన గోపీ గుండెతడి వున్న మనిషి. ఎంచుకున్న అంశాన్ని ఎక్కడా డీవియేట్ కాకుండా కథనం చేయడం ఒక కళ. అది ఒడిసిపట్టుకున్న కథకుడు గోపీ. పదాల పొదుపుతో స్పష్టంగా, సూటిగా, గుండెల్ని తాకేలా చెప్పడం గోపీ శైలి. పల్లెమంగలి కత్తిలాంటి పదునైన అక్షరం అది.

(ఇంకా ఉంది…)

ముకుందాపురం, నల్లగొండ జిల్లా. క‌వి, రచయిత, ప‌రిశోధ‌కుడు. ఇండిపెండెంట్ జర్నలిస్ట్. సాక్షి దిన‌ప‌త్రిక‌లో ఎనిమిదేళ్లు జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేశాడు. 'ఓయూ సాహిత్య వేదిక' వ్య‌వ‌స్థాప‌క స‌భ్యుడు, మొదటి కన్వీనర్. ఉస్మానియా యూనివ‌ర్సిటీ నుంచి 'విప్ల‌వ క‌విత్వంలో వ‌స్తురూప వైవిధ్యం'పై ప‌రిశోధ‌న (పిఎచ్. డి.) చేశాడు. రచనలు : 1. తూర్పార, 2. ఏరువాక (సాహిత్య విమర్శ). 'కొలిమి' వెబ్ మేగజీన్ ఎడిటోరియల్ లో పనిచేస్తున్నాడు.

Leave a Reply