రాజ్యాంగంలోని ప్రజానుకూల అంశాలను కాపాడుకొనే పోరాటాలూ రాజ్యాంగవాదమూ ఒకటి కాదు: పి. వరలక్ష్మి

1. ‘ఫాసిస్టు సందర్భంలో రాజ్యాంగవాదం’  పుస్తకానికి నేపథ్యం ఏమిటి? విరసం మహాసభల థీమ్‌గా దాన్ని ఎందుకు ఎంచుకుంది? 

ఫాసిజమే దీనికి నేపథ్యం. మునుపెన్నడూ లేనంతగా ప్రజాస్వామిక సంస్కృతి విలువలు పూర్తిగా ధ్వంసం అయిపోతూ,  విద్వేష రాజకీయాల్లో ప్రజలు చిక్కుకుపోయారు. ప్రజాస్వామ్యానికి నాలుగు స్థంభాలు అని చెప్పుకునేవి కార్పొరేట్‌ నిరంకుశత్వాన్ని ఏ ముసుగులూ లేకుండా మోస్తున్నాయి. దేశం అతి పెద్ద ప్రమాదంలోకి జారుకుంటున్నది. ఈ ప్రమాదాన్ని ఎంత లోతుగా మనం అర్థం చేసుకుంటున్నాం అనే ప్రశ్న ఒకటైతే, దీన్ని ఎదుర్కోడానికి ఎలా సిద్ధమవుతున్నాం అనే ప్రశ్న కూడా మనమందుంది. వీటికి సమాధానాలు మాత్రం చాలా అస్పష్టంగా, గందరగోళంగా ఉన్నాయి. 

ఎన్నికలు దగ్గర పడ్డాయి కాబట్టి ఓటు ద్వారా ఫాసిజాన్ని ఓడించాలనే పిలుపు ముందుకు వచ్చింది. నిస్సందేహంగా దీనికి చాలా ప్రాధాన్యత ఉంది. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఎన్నికల్లో ఓడించడం ద్వారా ప్రజలకు ఏ చిన్న వెసులుబాటు దొరికినా మంచిదే. ఫాసిస్టు బీజేపీకి, మిగతా బూర్జువా ఎన్నికల పార్టీలకు తేడా ఉంది. అయితే ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఒక పార్టీ అధికారంలోకి రావడం, పోవడం మీద ఫాసిజం ఓటమి ఆధారపడి ఉండదు. ఫాసిజం రావడం వెనక రాజకీయార్థిక పరిణామం ఉంది. ఇది అంత సులువుగా పోయేది కాదు. ఒక వేళ ఈసారి ఎన్నికల ద్వారా ప్రభుత్వం మారినా ఐదేళ్ల తర్వాతో, పదేళ్ల తర్వాతో మళ్లీ ఇంతకన్న బలంగా విపత్తు రావచ్చు. ఫాసిజం సమాజంలో, ప్రజల మనసులో ఎంతగా నాటుకుపోయిందో మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు దాదాపు అన్ని పార్టీలు హిందూ మెజారిటీ భావన చుట్టే మాట్లాడాల్సిన స్థితికి చేరాయి. ‘‘నేనూ హిందువునే, అయోధ్య రాముడ్ని మేం వ్యతిరేకించడం లేదు’’ అని ఎవరికి వారు నిరూపించుకుంటున్నారు. ఎందుకంటే ప్రజల మౌలిక సమస్యలను అడ్రెస్‌ చేసే శక్తిగానీ, రాజకీయార్థిక విధానం గానీ వారికి లేదు. ఈ స్థితినుండి దేశాన్ని బైట పడేసేది ప్రజా చైతన్యమే. ప్రజలు తమదైన ఎజెండాను పాలకులు ముందు పెట్టి నిలదీయగలగాలి. తమ హక్కులను కాపాడుకొనేందుకు ఉద్యమాల్లోకి రావాలి. ఎన్నికల సన్నివేశంలో తక్షణ కార్యక్రమం ఉన్నా ఫాసిజానికి వ్యతిరేకంగా చాలా లోతైన విశాలమైన ఉద్యమాలు జరగాల్సిన అవసరం ఉంది. 

అలాగే మన రాజ్యాంగ విలువల్ని, ఆదర్శాలను కాపాడుకోవాలని ప్రజాస్వామిక ఆందోళన ముందుకు వచ్చింది. అది పూర్తిగా ఆహ్వానించదగింది. అయితే ‘‘సేవ్‌ కాన్‌స్టిట్యూషన్‌’’ అంటున్నప్పుడు మనం మర్చిపోతున్న విషయం ఏంటంటే పాలకులు ‘రాజ్యాంగబద్ధంగా’నే అనేక ప్రజావ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు. ప్రజలు వాటిని నిరసించకుండా ఉండేందుకు రాజ్యాంగబద్ధంగానే అణచివేత చట్టాలను తీసుకొస్తున్నాయి. ఇక్కడ చాలా వేగంగా రెండు పరిణామాలు జరుగుతున్నాయి. అవి ఒకదానికొకటి సంబంధం ఉన్నవి. ఒకటి : రాజ్యాంగంలోని ప్రజానుకూల అంశాలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. రెండు : అదే సమయంలో రాజ్యాంగం బూర్జువావర్గ ప్రయోజనాలకు అనుగుణంగా అమలవుతోంది. ప్రజలు చట్టపరిధిలోనే, రాజ్యాంగబద్ధంగానే ఉద్యమించాలి అంటే వాళ్లు అనేక నిర్బంధ చట్టాలను తీసుకొస్తున్నారు. అప్పుడు కదిలినా, మెదిలినా అది చట్టవ్యతిరేకమే అవుతుంది. ప్రజలు పోరాడి సాధించుకున్న ప్రాథమిక హక్కులను తొలగించే అవకాశం కూడా పాలకులకు రాజ్యాంగమే ఇచ్చింది. అందువల్ల ప్రజలకు పాలకుల మీదే కాక రాజ్యాంగం మీద కూడా విమర్శనాత్మక దృష్టి పట్టుబడాలి. దీనికి రాజ్యాంగవాదం ప్రతిబంధకమవుతుంది. దాన్ని అధిగమించకపోతే ప్రజాపోరాటలకు నష్టం. ఫాసిజానికి వ్యతిరేకంగా అనేక తలాల్లో జరగాల్సిన పోరాటాల పట్ల అలర్ట్‌ చేయడానికే ఈ విషయాన్ని చర్చనీయాంశం చేయాలనుకున్నాం.  

2. పుస్తకం మీద జరుగుతున్న చర్చ గురించి ఏమంటుకుంటున్నారు? 

చాలా భిన్నమైన స్పందనలొస్తున్నాయి. నిజానికి ఈ థీమ్ ప్రకటించినప్పటినుండే అవన్నీ వ్యక్తమవుతున్నాయి. చాలా అత్యవసరమైన చర్చ లేవనెత్తారు అని విప్లవాభిమానులు, ప్రజాస్వామికవాదులు అన్నారు. ఈ సభల్లో ఇతర భాషల ప్రతినిధులు కూడా పాల్గొంటున్నందువల్ల కరపత్రం ఇంగ్లిష్ లో కూడా వచ్చింది. బైటి ప్రాంతాల మిత్రులకు  కూడా విస్తృతంగా పంపించాం. వాళ్లు  దీని మీద చాలా ఆసక్తిని కనపరిచారు. మహాసభల్లోనే కీనోట్‌ ఇంగ్లీషు అనువాదం గురించి అడిగారు. వెంటనే ట్రాన్స్‌లేట్‌ చేయమని కూడా కోరారు. 

విరసం మహాసభల్లో నేను కీనోట్‌ ప్రసంగం చేసిన వెంటనే అంతకు ముందెప్పుడూ సాహిత్య, రాజకీయ చర్చల్లో కనపడని యువకులు చాలా ఉత్సాహంగా తమ అనుభవాన్ని పంచుకున్నారు. ఇప్పుడు ‘మీరు చెప్పిన కోణంలో రాజ్యాంగాన్ని అధ్యయనం చేస్తాం’ అన్నారు. చాలా తాజాగా సందర్భానికి తగినట్లుగా ఉంది అన్నవాళ్లున్నారు. ’మీరు చెప్తున్నవన్నీ వాస్తవమే అయినా ఇప్పుడీ చర్చ చేయడం వల్ల మిత్రులు దూరమవుతారేమో‘ అని అనుమానించినవాళ్లు ఉన్నారు. ‘ఈ టాపిక్‌ ఇప్పుడెందుకు లేవనెత్తారు అనుకున్నాం కానీ చదివాక ఇప్పుడు స్పష్టత వచ్చింది’ అన్నవాళ్లున్నారు. ‘కొన్ని భిన్నాభిప్రాయాలున్నప్పటికీ చాలా ఆలోచించాల్సిన విషయాలు ఇందులో ఉన్నాయి’ అన్నవాళ్లున్నారు. పుస్తకం విడుదలయ్యాక రెండు మూడు రోజుల్లోనే చదివి చాలా లోతైన అధ్యయనం, పరిశీలనలు ఉన్నాయని అభినందించారు.  

మరోవైపు నుండి రాజ్యాంగాన్ని విమర్శించడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ విమర్శలొచ్చాయి. ముఖ్యంగా రాజ్యాంగం దళితులకు రక్షణ కల్పించిందని, వారిని మనుషులుగా గుర్తించిందని, వారి జీవితంలో ఎంతో మార్పు తీసుకొచ్చిందని, ఈ ప్రయోజనాలు వారికి దక్కకుండా చేయాలనే ఉద్దేశంతోనే రాజ్యాంగం మీద దాడి చేస్తున్నారని అన్నారు. రాజ్యాంగాన్ని విమర్శించడమంటే అంబేద్కర్‌ను తక్కువ చేయడమని అన్నారు. ‘రాజ్యాంగవాదం’ అనే పదాన్ని తిట్టుగా తీసుకుని అది రాజ్యాంగం ద్వారా హక్కులు పొందుతున్న పీడిత ప్రజలను అవమానించడమని భావించారు. రాజ్యాంగవాదం, రాజ్యాంగవాదులు `ఈ పదాలను మాత్రమే తీసుకుని పుస్తకం చదవకుండానే ఒక అభిప్రాయానికి వచ్చి కూడా విమర్శిస్తున్నారు. ఒక్క విమర్శలేనా, ఆరోపణలు, నిందలు కూడా ఎదురవుతున్నాయి. ఇంత భిన్నమైన, విస్తృతమైన ప్రతిస్పందన వచ్చిందంటేనే ఈ అంశానికున్న ప్రాముఖ్యత అర్థమవుతోంది.

ఇటువంటి స్పందనలు, ప్రశ్నలను ముందే కొంత ఊహించాం. అందుకే పుస్తకంలో చాలా వరకు వివరణలు కూడా ఇచ్చాం. పుస్తకంలో చర్చించినవి, బైట జరుగుతున్న చర్చల కన్నా కూడా ఇంకా విస్తృతమైన చర్చకు స్కోప్‌ ఉన్న అంశం ఇది. 

3. రాజ్యాంగాన్ని పరిరక్షించాలని వివిధ సమూహాలు, ప్రజాస్వామికవాదులు పోరాడుతున్నారు. మీరేమో రాజ్యాంగాన్ని విమర్శిస్తున్నారు. గత మహాసభల్లో ఫాసిస్టు వ్యతిరేక ఐక్య సంఘటనకు పిలుపిచ్చిన విరసం ఇప్పుడు ఈ చర్చను లేవనెత్తడం వల్ల ఐక్యతకు నష్టం కలగదా? 

ఇటీవలి కాలంలో రాజ్యాంగంలోని ప్రజాస్వామిక విలువలను, ఆదర్శాలను తీసుకుని పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ప్రజల  ప్రజాస్వామిక ఆకాంక్షలు ఆ విధమైన వ్యక్తీకరణ తీసుకున్నాయి. ఇవి ఇంకా బలపడవలసి ఉంది. దీన్ని తప్పనిసరిగా ఆహ్వానించాల్సిందే. రాజ్యాంగంలోని ప్రజానుకూల అంశాలను కాపాడుకునే విషయంలో విరసం మొదటి నుంచి ప్రజల పక్షాన దృఢంగా నిలబడి ఉంది. అందులో ఎటువంటి తడబాటు లేదు. అదే సమయంలో ప్రజాస్వామిక విలువల్ని, ప్రజాస్వామిక వాతావరణాన్ని సమాజంలో నెలకొల్పాలంటే రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అనే ఉద్యమం సరిపోదు. రాజ్యాంగంలోని సానుకూల అంశాలు అమలు కావడానికి,  కాపాడుకోడానికి రాజ్యాంగానికి బైట ఎన్నో పోరాటాలు జరిగాయనే సంగతి మర్చిపోకూడదు. ప్రజానుకూల విషయాలు వాటికవిగా అమలు కాలేని పరిమితి మన రాజ్యాంగానికి ఉంది. రాజ్యాంగంలో పాలకవర్గాలకు అనుకూలించేవే చాలా ఉన్నాయి. రాజ్యాంగబద్ధంగానే పాలకులు అనేక అకృత్యాలు చేస్తున్నారు. రాజ్యాంగబద్ధంగానే ఫాసిస్టులు అధికారంలోకి వచ్చారు. అసలు చరిత్రలో ఫాసిజం ఎక్కడైనా ఎన్నికల ద్వారానే, రాజ్యాంగబద్ధంగానే అధికారంలోకి వచ్చింది. అందువల్ల రాజ్యాంగాన్ని మనం కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుంది అనుకోవడం భ్రమ. 

అలాగే రాజ్యాంగాన్ని విమర్శించడం అంటే,  అందులో భాగమైన హక్కులను, ఆదర్శాలను తిరస్కరించడం కాదు.  అవి సుదీర్ఘకాలం ప్రజలు పోరాడి సాధించుకున్నవి. వాటిని ఎలా కాదంటాం? అసలు వాటి కోసం ప్రాణత్యాగాలు చేసిన ఉద్యమ చరిత్ర కూడా తెలుగు సమాజానికున్నది. దీన్ని కొనసాగిస్తూనే మౌలిక విషయాన్ని ఎత్తి చూపవలసి ఉంటుంది. ముందే చెప్పినట్లు ఫాసిజాన్ని ఓడిచడం అంటే ఒక పార్టీని ఎన్నికల ద్వారా అధికారం నుండి దించేయడం కాదు. తాత్కాలిక ఊరట కోసం ఆ పని కూడా జరగాల్సిందే, సందేహం లేదు. అయితే ఫాసిజంపై పోరాటం అంటే అది దీర్ఘకాలం జరగాల్సిన పోరాటం. దానికి దగ్గరి దారి ఉండదు. ఎందుకంటే అది సమాజంలో మార్పు తీసుకురావడానికి జరగాల్సిన పోరాటం కాబట్టి. అందుకోసం క్షేత్రస్థాయి ప్రజాఆచరణకు ఉండాల్సిన మౌలిక అవగాహన పట్ల స్పష్టంగా ఉండాల్సిందే. ఇది సైద్ధాంతిక రాజకీయ అంశం కాబట్టి దీనితో విభేదించేవారు తప్పకుండా ఉంటారు. వారితో చర్చిస్తూనే ఫాసిస్టు వ్యతిరేక ఐక్యకార్యాచరణలో కలిసి నడుస్తాం. ఐక్యసంఘటన అంటేనే ఉమ్మడి శత్రువుపై వేరువేరు పక్షాలు కలిసి పనిచేయడం. దీని ప్రాధాన్యత మాకు తెలుసు. సాహిత్య సాంస్కృతిక రంగాల్లో మా ఆచరణే దీనికి గీటురాయి. అందరూ తమ తమ రాజకీయ దృక్పథాలతోనే ఫాసిజాన్ని గుర్తిస్తారు. దాని ప్రకారమే ఫాసిస్టు వ్యతిరేక పోరాటం నిర్మిస్తూ ఉంటారు. భాగమవుతూ ఉంటారు. ఏ రాజకీయ చర్చలు  లేకుండా, రాజకీయాలకు అతీతంగా ఫాసిస్టు వ్యతిరేక ఐక్య పోరాటం చేద్దామని ఎవరైనా అనుకుంటే తప్పక ఆ పోరాటం ఓడిపోతుంది. అలాగే ఎవరు కూడా తమ సిద్ధాంతాలను, రాజకీయాలను వదిలేసి ఐక్యసంఘటనలో భాగం కారు. ఈ విషయం అన్ని పక్షాలకు తెలుసు. తెలిసినా విప్లవోద్యమాన్ని మాత్రమే వేలెత్తి చూపుతుంటారు. పైగా మీరు విమర్శలను స్వీకరించాలి అంటుంటారు. ఇది ఎంతదాకా అంటే నిందలను కూడా భరించాలి అనేదాకా. 

‘‘ఈ చర్చంతా ‘ఇప్పుడు’ అవసరమా?’’ అని కూడా అడుగుతున్నారు. ఇది ఉద్యమ అవసరం కదా, ఇప్పుడు కాకపోతే మరెప్పుడు? ఎన్నికల్లో తేల్చుకుందాం లెమ్మని ఐదేళ్ల దాకా వేచిచూసే స్థితి ప్రజల చొరవను, చైతన్యాన్ని స్తబ్దతకు గురిచేస్తుంది. ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ అనుకోవడం కాదు. ప్రజలకు కావల్సినవి పోరాడి సాధించుకోవాలి. ఏ పార్టీ అయినా రాజ్యం, దాని స్వభావం ఒకటే. రాజ్య స్వభావాన్ని గుర్తించని ఫాసిస్టు వ్యతిరేక చైతన్యం బూర్జువా పార్టీల పరిధిలోపలే ఉండిపోతుంది. దానికి రాజ్యాంగవాదం కూడా దోహదం చేస్తుంది. ప్రభుత్వ రాజకీయార్థిక సాంస్కృతిక నిర్ణయాల్లో నిరంతరం ప్రజలు క్రియాశీలంగా జోక్యం చేసుకోకపోతే ప్రజాస్వామ్యానికి అర్థమే లేదు. ఆ చొరవను పెంచే పని ఉద్యమాలు చేయకపోతే సమాజాన్ని ఫాసిస్టుల చేతికి శాశ్వతంగా అప్పగించినట్లే. ఫాసిస్టు వ్యతిరేక పోరాటానికి రాజ్యాంగంలోని కొన్ని ఆంశాలు ఆసరా అవుతాయి. కానీ వాటి ద్వారానే ఫాసిస్టు వ్యతిరేకపోరాటం చేసి విజయం సాధించడం అయ్యే పని కాదు. 

‘ఈ చర్చ ఇప్పుడెందుకు?’ అనే ప్రశ్నకు కీనోట్‌లోనే సమాధానం ఉంది. 

‘‘రాజ్యాంగం మీద విమర్శనాత్మక దృష్టి ఉన్నవాళ్లు కూడా ఫాసిస్టు ప్రమాదం ఇంత తీవ్రంగా ఉన్న సమయంలో ఇది అవసరమా? అనవచ్చు. ‘ఇప్పుడు అందరికీ రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం, రాబోయే ఎన్నికల్లో ఫాసిస్టులను దించేయడమే లక్ష్యం కావాలిగాని..’ అని అంటారని కూడా మాకు తెలుసు. 

ఇలాంటి  వాదనల్లో చాలా వాటికి  ఫాసిస్టు సందర్భంలో ప్రాధాన్యత ఉన్నది. అయితే రాజ్యాంగవాదం అనేక  మార్గాల్లో ఎప్పటి నుంచో పుట్టి పెరుగుతున్నా ఫాసిస్టు వ్యతిరేక పోరాటంలోని ప్రజాస్వామిక ఆకాంక్షల నుంచి కూడా అది ముందుకు వస్తున్నది. అందువల్ల గతంలోలాగే ఇప్పుడు కూడా దాన్ని చర్చనీయాంశం చేయాల్సిందే. నిజానికి అనేక రూపాల్లో దాగి ఉన్న రాజ్యాంగవాదం ఫాసిస్టు వ్యతిరేక సందర్భంగా స్పష్టతను సంతరించుకుంటున్నది. బలపడుతున్నది. అందువల్ల  దాటవేయడానికి వీల్లేదు.

ఫాసిస్టు వ్యతిరేక పోరాటాన్ని బలోపేతం చేయడానికి సూత్రబద్ధమైన ఉమ్మడి ప్రాతిపదికలను కాపాడుకుంటూనే, ఆ దిశగా ఉద్యమిస్తూనే, ఫాసిస్టు ప్రమాదం నుంచి దేశాన్ని కాపాడుకోవాల్సిన తక్షణ ఉద్యమ అవసరాన్ని పరిపూర్తి చేయడానికి పూర్తి నిబద్ధతతో పని చేస్తూనే, ఈ వాతావణంలోంచి  పుట్టుకొస్తున్న రాజ్యాంగవాదాన్ని ఎదుర్కోవలసి ఉంది. 

వాతావరణం అన్ని రకాలుగా ప్రశాంతంగా, సానుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే సత్యం చెప్తామనడానికి లేదు. చరిత్ర అలాంటి విరామ అవకాశాలను ఆహ్లాదభరితంగా అందివ్వదు. మన వాదనలో సత్యం ఉందని అనుకుంటే ఎలాంటి సంక్లిష్ట సమయంలో అయినా దానికి కట్టుబడి చెప్పవలసిందే.’’ 

4. అంబేద్కర్‌ను ఉదారవాది అని, రాజ్యాంగవాది అని కించపరిచారని అంటున్నారు? 

రాజ్యాంగాన్ని విమర్శించడం అంటే అంబేద్కర్‌ను విమర్శించడం (అని అనుకోవడం వల్ల)అనే భావన నుండి ఇటువంటి అభిప్రాయాలు వస్తున్నాయి. రాజ్యాంగ రచనలో అంబేద్కర్‌ది కీలక పాత్ర. అయితే అంబేద్కర్‌ ఆలోచనలను రాజ్యాంగం (పూర్తిగా) ప్రతిఫలించలేదు. ఆయన అభిప్రాయాలనన్నింటినీ  రాజ్యాంగ సభ ఆమోదించలేదు. అనేక పరిమితుల్లోనే అంబేద్కర్‌ తన ఆలోచనలను కొంతమేరకు రాజ్యంగంలో పొందుపరచగలిగాడు. అందువల్ల అంబేద్కర్‌ అంటే రాజ్యాంగం, రాజ్యాంగమంటే అంబేద్కర్‌ కాదు. ఈ మాటంటేనే ఆయన కృషిని తక్కువ చేసినట్లవుతుంది. గొప్ప సోషల్‌ సైంటిస్ట్‌, సాంఘిక విప్లవకారుడు అయిన అంబేద్కర్‌ను రాజ్యాంగానికి పరిమితం చేయడం అన్యాయం కదా? 

సమాజ మౌలిక మార్పులో రాజ్యాంగం సాధనం కావాలనే అవగాహన అంబేద్కర్‌కు ఉంది. దానికి అనుగుణంగా ప్రజలు ఎట్లా ఉండాలో కూడా ఆయన చెప్పాడు. అందుకనే మన సామాజిక, ఆర్థిక లక్ష్యాలను సాధించడంలో రాజ్యాంగబద్ధ పద్ధతులకు కట్టుబడి ఉండాలని, విప్లవపు రక్తపాత పద్ధతులను వదిలివేయాలని, పౌర శాసనోల్లంఘన, సహాయ నిరాకరణ, సత్యాగ్రహం వంటి పద్ధతులనూ వదిలివేయాలని ఆయనంటాడు. అదే సమయంలో అనేక వైరుధ్యాలమయమైన ఈ సమాజంలో రాజ్యాంగం అమలువుతుందా అనే సందేహం కూడా వ్యక్తం చేశాడు. ఆనాటి చారిత్రక పరిస్థితుల్లో ఒక లోతైన ఆలోచనాపరుడి సంఘర్షణ అంబేద్కర్‌లో చూడొచ్చు. ఈ చర్చంతా కీనోట్‌లో (41, 42 పేజీల్లో) ఉంది. 

రాజ్యాంగం ద్వారా మౌలిక మార్పు సాధ్యం అనుకోవడమంటే రాజ్యాన్ని తటస్థంగా చూడటం. ఇది ఉదారవాద భావన. ఉదారవాదం అనేది రాజకీయ, సైద్ధాంతిక వైఖరికి సంబంధించినది. ఇది తిట్టుపదం కాదు. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, రాజకీయ సమానత్వం అనేవి ఉదారవాద భావనలే. పెట్టుబడిదారీ విధానం, ఆధునికతా వికాసంలో భాగంగా ఈ విలువలు ముందుకొచ్చాయి. సామాజిక పురోగతిలో వాటి పాత్ర చాలా ఉంది. రాచరిక వ్యవస్థకు, ఆధునిక పెట్టుబడిదారీ వ్యవస్థకు గల తేడాలో మనం దాన్ని చూడొచ్చు. రాచరిక పాలనలో, కులవ్యవస్థ నిలువనీటిలో కుళ్లిపోతున్న మన సమాజంలో కూడా మార్పును చూడొచ్చు. 

అయితే వచ్చిన చిక్కు ఏంటంటే ఉదారవాదం వ్యక్తిగత ఆస్తి హక్కును సమర్థిస్తూ పెట్టుబడిదారీ వ్యవస్థకు అనుకూలంగా ఉంటుంది. కమ్యూనిస్టులు ఏమంటారంటే సంపద కొద్ది మంది చేతిలో ఉన్నప్పుడు సమానత్వం సాధ్యం కాదు అని. అలాగే వర్గసమాజంలో రాజ్యం తటస్థంగా ఉండదు. దానికి బూర్జువా వర్గస్వభావం ఉంటుంది. అంటే సంపదగలవారే సమస్తాన్నీ నియంత్రిస్తారు. మన దేశంలో కార్పొరేట్‌ నియంతృత్వం ఫాసిజం పీటముడి వేసుకుపోయాయి. 

అందువల్ల రాజ్యాంగానికుండే ఈ స్వభావాన్ని గుర్తించనివారు రాజ్యాంగం ద్వారా అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని అనుకుంటారు. అన్ని సమస్యలకూ రాజ్యాంగాన్ని కేంద్రం చేసి ఆలోచిస్తారు. 

ఇక్కడ సమస్య ఏమిటంటే అంబేద్కర్‌కుండే విమర్శనాత్మక దృష్టి అంబేద్కర్‌వాదులకు లేకపోవడం. ఆయన సమానత్వం, సోదరత్వం అనే భావనలకు చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. వాటి కోసం పోరాటాలు చేయడమేగాక రాజ్యాంగంలో శాసనబద్ధం చేయడానికి ప్రయత్నించాడు. అయినా ఆయనకు చాలా సందేహాలు ఉండేవి. రాజ్యాంగం ద్వారా సామాజిక సమానత్వాన్ని అశిస్తూనే, మన సమాజంలో ఇది ఎంతవరకు సాధ్యం అని అంబేద్కర్‌ అనుమానం వ్యక్తం చేశాడు. అత్యంత విషాదంగా ఆనాడు అంబేద్కర్‌కున్న అనుమానాలు  నిజమయ్యాయి. 

5. అంటే రాజ్యాంగం ద్వారా దళితులకు మేలు జరగలేదంటారా? 

చాలా మేలు జరిగింది. దీన్ని కాదనడానికి లేదు. కనీసం మనుషులుగా కూడా గుర్తింపు లేని సమూహాలకు ‘పౌరుల’నే గుర్తింపునిచ్చింది రాజ్యాంగం. సమాజంలో అంతకు ముందులేని అవకాశాలనిచ్చింది. ఫ్యూడల్‌ సమాజంలో కులవ్యవస్థ కింద అత్యంత దుర్భరంగా జీవించే సమూహాలకు రాజ్యాంగం కొంత ఆలంబన అయింది. మేం దీన్ని గుర్తించలేదని, లేదా దళితులుకు మేలు జరగడం మాకు ఇష్టం లేదని, అందుకే రాజ్యాంగాన్ని కాదంటున్నామని కూడా విమర్శ వచ్చింది. ఇది చాలా అన్యాయమైన ఆరోపణ. విరసం, విప్లవోద్యమ ఆచరణ కనీసంగా తెలిసినవాళ్లెవరూ ఈ ఆరోపణలు చేయలేరు. ‘కీ నోట్‌’లో దీని గురించి కూడా స్పష్టంగా ఉంది.  

‘‘రాచరిక పాలనతో పోల్చుకుంటే ఉదారవాద ప్రజాస్వామ్యం, దాని రాజ్యాంగబద్ధత, చట్టబద్ధ పాలన అనేవి నిస్సందేహంగా ప్రగతిదాయకం. సామాజిక అభివృద్ధిలో భాగంగా ఈ మార్పును చూడాలి. ఉదారవాద, పార్లమెంటరీ ప్రజాస్వామ్య రాజ్యం, రాజ్యాంగం ఏ జీవన రంగాల్లో ఎలాంటి మార్పులు ఏ మేరకు తేవడానికి అవకాశం ఉందో గుర్తించాల్సిందే. అట్లాగే అత్యంత దుర్భరంగా జీవిస్తూ, మరే రకంగా సమాజంలో కనీస రక్షణ లేని సమూహాలకు రాజ్యాంగం ఏదో ఒక మేరకు ఆలంబనగా ఉండటాన్ని గుర్తించాలి. రాజ్యాంగ ఆచరణ వల్లనే సమాజంలో వస్తున్న మార్పులను గమనించాలి. అయితే అవి ఎలాంటి మార్పులో కచ్చితమైన అంచనా ఉండాలి. ఉదారవాద రాజ్యాంగ ఆచరణలో పెట్టుబడిదారీ వర్గం అనుమతి ఇచ్చిన మేరకే ప్రగతిశీల మార్పులకు అవకాశం ఉంటుంది. దేనికంటే మౌలికంగా ఇది వర్గ సమాజం కాబట్టి. ఈ నేపథ్యంలో రాజ్యాంగాలకు ఉండే ఈ ఉదారవాద పాత్రను ఎక్కువా చేయకుండా, తక్కువా చేయకుండా అంచనా వేయాలి. దీన్ని గుర్తించడమంటే రాజ్యాంగం మౌలికంగా యథాతథ స్థితిని కాపాడుతూ ఉంటుందని, రాజ్యం మీద అధికారం ఉన్న వర్గ ప్రయోజనాలను కాపాడటమే దాని స్వభావమని ఎంత గుర్తిస్తే అంతగా అది తేగల మార్పులను కచ్చితంగా గుర్తించడానికి వీలవుతుంది. ఈ ముఖ్యమైన విషయాన్ని ఎంత విస్మరిస్తే అంతగా రాజ్యాంగం పరమ భావనగా మారే ప్రమాదం ఉంది. అది దోపిడీ, అణిచివేతలకు పాలకవర్గానికి ఉపయోగపడే పనిముట్టు అనే విషయం విస్మరించి సామాజిక ప్రగతికి, విముక్తికి మంత్రదండం అని భ్రమపడే పరిస్థితి ఏర్పడుతుంది.’’ 

మాకు ఉన్న ఈ విమర్శనాత్మక దృక్పథం మీద ఎంతయినా చర్చించవచ్చు. మేం సిద్ధం. విచిత్రమేమంటే మేం రాజ్యానికి, రాజ్యాంగానికి, పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి వర్గ స్వభావం ఉంటుంది, మన దగ్గర కుల స్వభావం కూడా ఉంటుందని అంటే, దాని గురించి ఈ విమర్శించేవారిలో ఒక్కరు కూడా మాట్లాడలేదు. రాజ్యాంగం తటస్థంగా ఉండదు అనే మా  వైఖరితో పేచీ ఉంటే దాన్ని నిరూపించాలి. అవేవీ చేయకుండా  రాజ్యాంగం కులనిర్మూలనకు సాధనం అని, మాకు కుల నిర్మూలన ఇష్టం లేదు కాబట్టే   కాబట్టే రాజ్యాంగం మీద దాడి చేస్తున్నామనే విమర్శ చేశారు. రాజ్యాంగం సామాజిక మార్పుకు కొంత దోహదం చేసిన మాట నిజమే. అది పీడిత కులాలకు అంతకు ముందు నిరాకరించబడిన  హక్కులనిచ్చింది. ఉదాహరణకు పౌరులందరికీ ఆస్తి హక్కు. బ్రాహ్మణీయ కులవ్యవస్థ కొన్ని కులాలు మాత్రమే ఆస్తి కలిగి ఉండాలంది. ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ఆస్తిని కలిగి ఉండొచ్చు, సమకూర్చుకోవచ్చు. అయితే ఒక వర్గం చేతిలో లేదా కొన్ని కులాల చేతిలో ఇబ్బడిముబ్బడిగా కేంద్రీకృతమైన సంపదను కూడా వారి హక్కుగా గుర్తించింది. ఈ వర్గం మొత్తం పరిపాలనను, ప్రభుత్వ విధానాలను శాసిస్తుంది. ఈ వర్గానికి రాజ్యాంగ మార్గదర్శకత్వం ఉంది. అందువల్ల రాజ్యాంగం మౌలిక మార్పును తీసుకొచ్చే అవకాశం లేదు. మౌలిక మార్పు అంటే కేవలం దోపిడీ రద్దు మాత్రమే కాదు. ఆ మాట చాలా విస్తృతమైనది. అందులో కులనిర్మూలన కీలక అంశం. రాజ్యాంగం దానికదే కులాన్ని నిర్మూలిస్తుందని అనడం అంటే కులవ్యవస్థను చాలా తేలిక చేసినట్లవుతుంది. కులనిర్మూలనకు కూడా రాజ్యాంగపరిధికి అవతల పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సిందే

6. రాజ్యాంగవాదం అనే మాట కొత్తగా వింటున్నాం. ఏమిటి రాజ్యాంగవాదం అంటే? 

ఇది కొత్త పదం ఏమీ కాదు. కొత్తకొత్త పదాలు సృష్టించి ఎందుకు గందరగోళపరుస్తారు అని కొంతమంది అడుగుతున్నారు. కాస్త వెటకారంగా కూడా మాట్లాడుతున్నారు. కానీ ఇది చాలా పాతది. దీని గురించి వికీపీడియా వంటి చోట్ల కూడా వివరాలు దొరుకుతాయి. 

సాధారణంగా రాజ్యాంగం అంటే ఏమిటి అన్నపుడు ప్రభుత్వ అధికారాన్ని కొన్ని రాజకీయ సూత్రాల ప్రకారం నియమబద్ధం చేసేది అనుకుంటాం. తద్వారా అది ప్రభుత్వాన్ని ప్రజలకు బాధ్యత పడేలా చేస్తుంది అనుకుంటాం. రాజ్యాంగానికి ఈ నిర్వచనమే ఇస్తారు. దీనిని అనుసరించి ‘ప్రభుత్వాలు గానీ, అధికారులు గానీ తమ ఇష్టానుసారం పాలించడం కాదు, అత్యున్నత రాజ్యాంగ చట్టంలో నిద్దేశించిన పరిమితుల ప్రకారం నడుచుకోవాలి, దాని ప్రకారమే విధానాలు అవలంబించాలి’ అంటుంది రాజ్యాంగవాదం. ఈ వాక్యాలను తిరగరాస్తే మంచిది. నిజానికి రాజ్యాంగవాదం అనే మాటను కూడా పాజిటివ్‌ అర్థంలోనే వాడతారు, ఉదారవాదం లాగా. ఉదారవాదానికి ఉన్న పరిమితులే దీనికీ ఉంటాయి. ఈ వ్యవస్థకు అతీతంగా రాజ్యాంగం ఉంటుంది అనుకుంటారు రాజ్యాంగవాదులు. రాజ్యం గానీ, రాజ్యాంగం గానీ వర్గ దృక్పథంతోనే ఉంటాయి. రాజ్యానికి వర్గ స్వభావం ఉంటుంది అని నమ్మేవాళ్లు కూడా రాజ్యాంగం తటస్థం అనుకుంటారు. కానీ రాజ్యాంగం కొన్ని ఉదాత్త భావనలకు చోటిచ్చినా దాని మొగ్గు బూర్జువా వర్గం వైపే ఉంటుంది. దాని ప్రయోజనాల కోసమే పని చేస్తూ ఉంటుంది. భారత రాజ్యాంగం అగ్రకులాలకు అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు. కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే అది మనకు అర్థమవుతుంది. పౌరహక్కుల సంఘం నాయకుడు ప్రొ.శేషయ్య మన రాజ్యాంగంలోని వైరుధ్యాల గురించి ఎప్పుడో రాశాడు. ఇక్కడొక సంగతి మీకు గుర్తుచేయాలి. చట్టబద్ధపాలన గురించి పౌరహక్కుల సంఘం ఎంతగా పోరాడిందో, అందుకు రాజ్యం ఆ సంఘం నాయకులు ఆరుగురిని అత్యంత క్రూరంగా హత్యలు చేసిన సంగతి. దాని వర్గప్రయోజనాల కోసం రాజ్యం ఎంతకైనా తెగబడుతుంది. సుప్రీం కోర్టు కూడా దాన్ని నియంత్రించలేదు. సుప్రీం కోర్టు ప్రస్తావన ఎందుకు అంటే అత్యున్నత న్యాయస్థానం రాజ్యాంగ పరిరక్షకురాలిగా వ్యవహరించాలి కాబట్టి. ఇప్పుడు వీథి రౌడీలకు కూడా విచ్చలవిడి అధికారాలు వచ్చేశాక చట్టబద్ధపాలన గురించి ఇక ఏం మాట్లాడుకోవాలి! 

ఫ్రెంచి రాజ్యాంగాన్ని అధ్యయనం చేసి అందులోని వైరుధ్యాల గురించి మార్క్స్‌ అద్భుతంగా విశ్లేషిస్తాడు. వర్గాలున్న చోట రాజకీయ సమానత్వం ఎలా సాధ్యం అన్నది ముఖ్యమైన ప్రశ్న. మరి మనదేశంలో కులం కూడా ఉంది కదా? అందుకే సరిగ్గా ఆవైపు నుండి ఇలాంటి ప్రశ్న అంబేద్కర్‌ కూడా వేశాడు. ‘‘రాజకీయాలలో మనం ఒక మనిషికి ఒక ఓటు ఒక విలువ అనే సూత్రాన్ని గుర్తిస్తాం. కానీ మన సామాజిక ఆర్థిక జీవనంలో ఒక మనిషికి ఒక విలువ అనే సూత్రాన్ని నిరాకరించడం కొనసాగిస్తాం.’’ కాబట్టి ఇక్కడ చెప్తున్నది రాజ్యాంగం ద్వారానే మనం అన్నీ సాధించుకోవచ్చు, ఇంత మంచి రాజ్యాంగం ఉండగా మనకింకేం కావాలి అనుకోవడంలోని సమస్య గురించి. రాజ్యాంగ సర్వస్వవాదం రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వమే కాదు, ప్రజలు నడుచుకోవాలంటుంది. అది ఎలా ఉంటుంది అంటే పోలీసు అనుమతి తీసుకొని ధర్నా చేయడం లాగా. ఎందుకంటే ప్రజలు చట్టాన్ని గౌరవించాలి కదా. మేం శాంతియుతంగా, చట్టబద్ధంగా ఉద్యమిస్తున్నాం అని నిరూపించుకుంటూ ఉండాలి. అందువల్ల ప్రభుత్వం విధించే ఆక్ట్‌ 30, సెక్షన్‌ 144 నుండి యుఎపిఎ దాకా అన్నిటికీ లోబడి ప్రజలు మసలుకోవాలి. వీటి బైట జరిగే ఏ ప్రజాపోరాటాన్నీ రాజ్యాంగవాదం అంగీకరించదు. మా ప్రశ్న ఏమిటంటే రూల్‌ ఆఫ్‌ లా ఎవర్ని నియంత్రిస్తోంది? ప్రభుత్వాన్నా, ప్రజలనా? రాజ్యాంగవాదం వల్ల నష్టం ఏమిటంటే అది ప్రజల క్రియాశీలతను దెబ్బతీస్తుంది. నిజానికి ప్రజలు అనేక వైపుల నుండి, సమాజపు అనేక పొరల్లో నుండి చాలా సృజనాత్మకంగా పోరాటాలను రూపొందించుకుంటారు. వాటిని మనం గుర్తించి ముందుకు తీసుకెళ్లగలిగితే చాలా మేలు జరుగుతుంది.

ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా స్పష్టం చేయాలి. రాజ్యాంగాన్ని తమ పోరాటాలకు ఆసరాగా తీసుకున్న పీడిత ప్రజలను రాజ్యాంగవాదులని కటువుగా విమర్శించామని అంటున్నారు. రాజ్యాంగంలోని ప్రజానుకూల అంశాలను కాపాడుకునేందుకు జరిగే పోరాటాలూ రాజ్యాంగవాదమూ ఒకటి కాదు. కనుక ఆ పోరాటాలు చేస్తున్న ప్రజలు  రాజ్యాంగవాదులు కాదు. రాజ్యాంగవాదాన్ని చర్చనీయాంశం చేయడమంటే ఈ పోరాటాలను తక్కువ చెయడం కాదు.  దీని గురించి కీనోట్ లోనే కాదు కరపత్రంలోనూ స్పష్టంగా ఉంది.

7. ఒకవైపు రాజ్యాంగాన్ని ఫాసిస్టులు ధ్వంసం చేస్తుంటే మరో వైపు నుండి విరసం రాజ్యాంగం మీద దాడి చేస్తున్నదని, ఇది దళితులకు ఆసరాగా ఉన్న రాజ్యాంగాన్ని లేకుండా చేసే కుట్ర అని అంటున్నారు. 

రాజ్యాంగాన్ని ఫాసిస్టులు పూర్తిగా ధ్వంసం చేయడం లేదు. దాన్ని శుభ్రంగా వాడుకుంటున్నారు. ఫాసిస్టులు ధ్వంసం చేస్తున్నది రాజ్యాంగంలోని ప్రజానుకూల అంశాలను. దాని కోసం వారు రాజ్యాంగబద్ధ ఎన్నికల ద్వారానే అధికారంలోకి వచ్చారు. మెజారిటీ ఓట్లను ఎలా సంపాదించుకోవాలో వాళ్లకు బాగా పట్టుబడిరది. చట్టసభల్లో మెజారిటీ పక్షానికి ఉండే అధికారాలను యధేచ్ఛగా ఉపయోగించుకుంటున్నారు. ఏది రాజ్యాంగబద్ధం, ఏది రాజ్యాంగవిరుద్ధం, ఏది చట్టబద్ధం, ఏది చట్టవిరుద్ధం అనేవి మనం అనుకున్నట్లుగా ఉండవు. రాజ్యం అనుకున్నట్లుగానే ఉంటాయి. ప్రజలకు హక్కులైనా, ప్రభుత్వానికి అధికారాలైనా వాటి పరిధిని నిర్దేశించేది ప్రజలు కాదు, పాలకవర్గమే. అందుకే ఈ పరిధి దాటి ఆలోచించాలి, ఉద్యమించాలి అని విరసం చెప్తున్నది. 

రాజ్యాంగంలోని ప్రజానుకూల అంశాలను కాపాడుకోవాలన్నా రాజ్యాంగ పరిధిలో అది సాధ్యం కాదు. అధికార్లకు విజ్ఞాపనలు చేసి, పిటిషన్లు వేసి హక్కుల్ని సాధించుకోవడం వీలు కాదు. ఎన్నో ఉద్యమాలు చేసిగాని వన్‌ ఆఫ్‌ సెవెంటీ, ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ చట్టం వంటివి రాలేదు. అలా సాధించుకున్నవి కూడా ఇప్పుడు కోల్పోయే పరిస్థితి. నిజానికి రాజ్యాంగాన్ని విమర్శనాత్మకంగా చూసే ఉద్యమాలే ప్రాథమిక హక్కుల అమలు కోసం ప్రాణత్యాగాలకు కూడా వెరవని అద్భుతమైన పోరాటాలు చేశాయి. 

‘‘అసలు భారత రాజ్యాంగం మమ్మల్ని పౌరులుగా చూస్తుందా?’’ అని ఆదివాసులు అడుగుతున్నారు. ఈరోజు భారత ప్రభుత్వం దండకారణ్యంలో వాళ్ల గూడేల మీద బాంబులు వేస్తున్నది. మణిపూర్‌ ఆదివాసీ తెగలను ఊచకోత కోస్తున్నారు. ‘‘భారత రాజ్యాంగం మాకిచ్చిన హామీ ఏమైంది?’’ అని కశ్మీరీ ప్రజలు అడుగుతున్నారు. భారత రాజ్యాంగం ప్రకారమే పాలకవర్గం స్వతంత్ర రాజ్యాలైన కశ్మీర్‌ను, కొన్ని ఈశాన్య రాష్ట్రాలను దురాక్రమించి కలిపేసుకున్నది. ఇట్లా దురాక్రమించబోయే ప్రాంతాన్నంతా కలిపి భారతదేశం అని గుర్తిస్తున్నట్లు రాజ్యాంగం మొదట్లోనే ఉంటుంది. జాతుల విషయంలో ఇదీ మన రాజ్యాంగానికి ఉండే విప్లవాత్మక స్వభావం!  ఈ సమూహాలతో అన్ని అధికార పార్టీలు ఒకే విధంగా నడుచుకున్నాయి. అందుకని వీటికి సమాధానం ఎన్నికల్లో ఉండదు, రాజ్యాంగంలో ఉండదు. ప్రజాపోరాటాల్లోనే ఉంటుంది. 

8. ఏ రాజ్యాంగంలోనైనా లోపాలు సహజం. ఇప్పుడున్న రాజ్యాంగాన్ని కాదంటే మీరు చూపించే ప్రత్యామ్నాయ రాజ్యాంగం ఏమిటి? 

రాజ్యాంగాన్ని వ్యక్తులో సంస్థలో ప్రతిపాదించరు. ఒక చారిత్రక క్రమంలో ప్రజా ఆచరణలో, వర్గపోరాటాల నుంచి రాజ్యం, రాజ్యాంగాలు రూపొందుతాయి. మన రాజ్యాంగం కూడా ఒక చారిత్రక దశలో అలా రూపొందిందే. అప్పటికి అది ఎంతో కొంత ప్రగతిదాయకం కావచ్చు. కొంత ప్రగతిదాయక పాత్ర పోషించినవి కూడా తర్వాత దశలో మార్పును అనుమతించక నిలువనీరుగా మారిపోతాయి. ఇరవై ఏళ్లకే మన రాజ్యాంగ స్వభావాన్ని నక్సల్బరీ గుర్తించింది. దాని సుదీర్ఘ వర్గపోరాట ఆచరణలో ప్రజల మౌలిక సమస్యలను ముందుకు తీసుకొచ్చింది. పీడిత కులాలు, ఆదివాసుల ఉద్యమాల వల్ల రాజ్యాంగంలో కొన్ని సవరణలు వచ్చాయి. చాలా విషయాలు చర్చనీయాంశం అయ్యాయి. నక్సల్బరీ అయితే నిజమైన అర్థంలో ప్రజా రాజ్యాధికారం గురించిన మౌలిక విషయాలను తన ఆచరణ క్రమంలో ప్రతిపాదించింది. 

అయితే ప్రత్యామ్నాయ రాజ్యాంగం అనే బ్లూ ప్రింట్‌ ఎక్కడా సిద్ధంగా ఉండదు. చరిత్రలో రాజ్యాంగాలు అలా ఏర్పడలేదు. కమ్యూనిస్టు మానిఫెస్టో కూడా నిర్దిష్ట చారిత్రిక భౌగోళిక స్థితిగతులను బట్టి ఆయా దేశాల విప్లవాలు అన్వయించుకుంటాయి. ఏ ప్రత్యామ్నాయాలైనా వ్యవస్థలోని వైరుధ్యాల నుండే, ఘర్షణ నుండే పుట్టుకొస్తాయి. ఏ విమర్శ లేకపోతే ఏ ప్రగతి ఉండదు. లోపాలు సహజం అని గమ్మునుంటే మార్పు ఎలా సాధ్యం?  

Leave a Reply