రాగో మనకేం చెబుతోంది?

సాధన రాసిన రాగో నవల చివరి సన్నివేశం ఇలా ఉంటుంది.

‘జైనక్కకు పార్టీ సభ్యత్వం ఇచ్చి కొద్ది రోజులే అయింది కానీ విస్తరణలో భాగంగా పోతున్న కొత్త ఏరియాకి జైనిని డిప్యూటీగా పంపాలని డివిసి అనుకుంటున్నది. మీ అభిప్రాయం ఏమిటి?’ అంటూ వినోద్ అసలు విషయం బయట పెట్టాడు.

‘నేను అంతటి బాధ్యతలు చేయలేనేమో’ అంటున్న జైని మాటలు ‘మా అందరికి ఇష్టమే’ అన్న సభ్యుల కోరస్ లో ముగినిపోయాయి.

‘జైనక్క డిప్యూటీగా చేయగలదు. కానీ కొత్త దళానికి పంపడమే మరోసారి ఆలోచించాలి. తెల్సినవాళ్లు ఉండి గైడ్ చేస్తే జైని బాగానే చేయగలదు’ అంది గిరిజ.

ఈ మాటతో నవల ముగిసిపోయింది. ఇలా అర్ధాంతరంగా అయిపోయిందేమిటి? అని కొంత మందికి అనిపించవచ్చు. ఒక వాచకం ఎక్కడో ఒక చోట ముగిసిపోవాల్సిందే. ఇక్కడ ఆగిపోయింది. అయితే ఈ ముగింపు అనేక విషయాల మీద ఫోకస్ ఇచ్చింది.
ఓపన్ ఎండెడ్ ముగింపుగా దీన్ని భావించవచ్చు. ఉత్తమ కల్పనా సాహిత్య లక్షణం ఇది. తద్వారా విప్లవోద్యమానికి అవసరమైన చర్చ చాలా చేయడానికి నవల ఆస్కారం ఇచ్చింది.

రాగో కథా నాయకి కామ్రేడ్ చైతు అమరత్వ సందర్భంలో నవలలోని అనేక విషయాలను చర్చించవచ్చు. విచిత్రమేమంటే ఇంత కాలం రాగో గురించి ఇతరులు మాట్లాడుతూ వచ్చారు. ఉద్యమంలో ఆమె ఏమవుతుంది? ఆమె కొనసాగుతున్న ఉద్యమ భవితవ్యం ఏమిటి? అని తర్కించారు. ఆ ఉద్యమంలోని సమ సమాజమనే ఆదర్శం నిజమయ్యేనా? అని సందేహించారు. ఇప్పుడు వ్యక్తిగతంగా రాగో జీవితం ముగిసిపోయింది. నవల ఎక్కడ ముగిసిపోయిందో అక్కడ మొదలు పెట్టి మరోసారి చూద్దాం. రాగో మనకేమైనా చెబుతోందా? మనం వినాల్సిన మాటలు ఏమైనా ఉన్నాయా? ఆలోచిద్దాం.

రాగో విప్లవోద్యమంలోకి వచ్చి జైనిగా మారింది. పార్టీ సభ్యురాలయింది. డిప్యూటీ కమాండర్ గా ఎదిగింది. కల్పనా సాహిత్యం ఈ ఒక మనిషి గురించిన వివరాలు చెప్పి ఊరుకోదు. ఆ మనిషిలోని సకల సృజనాత్మక శక్తుల వికాస క్రమాన్ని చిత్రిస్తుంది. దాన్ని ఆటంకపరిచే శక్తులతో తలపడే తీరును వర్ణిస్తుంది. అయితే ఆ శక్తులు బైట ఉండి నియంత్రించేవి మాత్రమే కాదు. మనుషుల ఆలోచనల్లో భాగమైపోయి ఉంటాయి. వ్యక్తిత్వ నిర్మాణం మీద ప్రభావం వేసి ఉంటాయి. ఆ శక్తులు అమూర్తంగా చెల్లాచెదరుగా ఉండేవి కాదు. సంబంధాలుగా వ్యవస్థీకృతమై ఉంటాయి. భౌతిక వాస్తవంగా కొనసాగుతుంటాయి. వాటితో తలపడాలంటే మొదట తమ వ్యక్తిత్వంలో, ఆలోచనల్లో ఉన్న వాటితో విమర్శనాత్మకంగా వ్యవహరించాలి.

వ్యక్తుల్లో ఇది ఎలా సాధ్యమో కల్పనా సాహిత్యం వర్ణిస్తుంది. దీనికి ఎన్నెన్ని అవకాశాలు ఉంటాయో చిత్రిస్తుంది. ఇష్టం లేని పెళ్లి విషయంలో రాగో తెగ సంబంధాలతో ఘర్షణ పడుతుంది. ఆ పంజరం నుంచి బైటికి వస్తుంది. తల్లిదండ్రులు, కుటుంబం వంటి సంబంధాల్లోంచి కొత్త సంబంధాల్లోకి వెళుతుంది. అంటే ఆదివాసీ సంస్కృతి, ఆచారాలు, రివాజులతో కూడిన భావజాల సంబంధాల నుంచి బైటికి వస్తుంది. కొత్త మనుషుల పరిచయాల్లోకి వెళుతుంది. వాళ్లున్న భావజాల సంబంధాల ప్రభావానికి లోనవుతుంది. విప్లవ రాజకీయాలు, చైతన్యం, లక్ష్యం వల్ల ఆమెలో చైతన్యం మొదలవుతుంది.

రాగో అనే వ్యక్తి సంసిద్ధతను, ఆమె భాగమైన భావజాల సంబంధాల పాత్రను కలిపి ఈ నవల అద్భుతంగా చిత్రించింది. ఇది దీని గొప్పదనం. ఈ క్రమమే రాగో వ్యక్తిత్వంలోని పరిణామంపట్ల పాఠకుల్లో విశ్వసనీయత కలుగుతుంది. అందుకే ఈ నవలలో రాగో ఎంత కనిపిస్తుందో అంతే ఆమె భాగమైన విప్లవోద్యమం కనిపిస్తుంది. విప్లవోద్యమ ఆచరణలో భాగంగా దళ జీవితం, పోరాటం, నిర్మాణం, లక్ష్యం, కార్యక్రమం, దాని వెనుక ఉన్న సిద్ధాంతం అన్నీ నవలలో ఉన్నాయి.

నవలలో రాగో పాత్ర ప్రధానంకాని సన్నివేశాలు కూడా ఉన్నాయి. అయితే ఆ సన్నివేశాలు, అందులోని మనుషులు, వాళ్ల సంబంధాలు లేకుండా రాగో లేదు. ఆమె జైనిగా మారడం వెనుక దళంలో ఉన్న విప్లవకరమైన సంబంధాల పాత్రను చిత్రించడం రచయిత ఉద్దేశం. ఆ సంబంధాల వల్లనే తన వ్యక్తిత్వంలోని ఆదివాసీ కట్టుబాట్లు, భావజాలం మీద రాగో హేతుబద్దంగా ఆలోచించడం మొదలు పెట్టింది.

ఈ నవల ఆరంభంలో ఇష్టం లేని పెళ్లిని కాదనుకొని వచ్చిన రాగో కనిపిస్తుంది. ఆ తర్వాత మహిళలకు సంకెళ్లుగా మారిన రివాజుల మీద హేతుబద్దమైన విమర్శ ప్రకటించగల జైనీగా కనిపిస్తుంది. మధ్యలో రాగో క్రమంగా జైనిగా రూపాంతరం చెందే దశ కూడా కనిపిస్తుంది.

సరిగ్గా తను పూర్వ జీవితంలో లాగే ఒక ఆదివాసీ యువతి పెళ్లి సమస్య పంచాయితీ అవుతుంది. ఇల్లరికం వచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోనని అంటుంది. అప్పుడు జరిగిన పంచాయితీలో జైని రివాజుల మీద చాలా కచ్చితమైన హేతుదృష్టితో మాట్లాడుతుంది. తాను వ్యక్తిగా ఏ భౌతిక పరిస్థితుల్లో పుట్టిందో వాటితో వ్యూహాత్మకంగా తెగతెంపులు చేసుకొని వాటిపై విప్లవాత్మక విశ్లేషణ ఇచ్చే స్థాయికి ఎదిగింది.

ఇది కేవలం తనలోని ఆదివాసీ మూలాలపై హేతుబద్ధ వైఖరిగానే మిగిలిపోలేదు. తాను భాగమైన విప్లవోద్యమ చారిత్రక పాత్ర దాకా విస్తరించింది. దళం నిర్వహిస్తున్న వర్గపోరాటం లేకుంటే రాగోలో ఈ మార్పు సాధ్యం కాదు. దండకారణ్యంలో రాగోలందరూ పితృస్వామ్యం మీద, తెగలోని పెత్తందారీతనం మీద హేతుదృష్టి సంతరించుకోడానికి కారణం వర్గపోరాటమే. అంటే జైనిగా రాగో మారడానికి రాజకీయ నిర్మాణం, దాని లక్ష్యం కారణం. నవలా రచయితగా సాధన దీన్ని దళంలోని మనుషుల భావజాల సంబంధాల వైపు నుంచి చిత్రించారు. ఈ కొత్త మానవ సంబంధాల్లో ఆచరణ నుంచి రాగోలో మార్పు క్రమాన్ని చూపించారు. అది నవలలో అడుగడుగునా కనిపిస్తుంది.

రాగో దళంలోకి వచ్చినప్పటి నుంచి వ్యక్తిగతంగా కూడా సన్నిహితంగా ఉండిన గిరిజ ముగింపులో అన్న మాటలను ఈ వైపు నుంచి చూడాలి. రాగో రాజకీయ కార్యకర్తగా ఎదిగిన తీరు ఆమెకు తెలుసు. రాగోనే కాదు. గిరిజ కూడా అలాగే తయారై ఉంటుంది. మనుషుల మధ్య సంబంధాల్లోని ఆచరణే వాళ్లలోని సృజనాత్మకతను, శక్తి సామర్థ్యాలను వెలికి తీస్తుంది. అందుకే గిరిజకు నమ్మకం. జైనీ డిప్యూటీ కమాండర్‌గా పని చేయగలదని. అయితే అప్పటికి ఆమె ఆ పని చేయాలంటే తెలిసిన వాళ్ల గైడెన్స్ అవసరం అంటుంది.

విప్లవోద్యమం అంతిమంగా అలాంటి ఉన్నతమైన సంబంధాల్లో మనుషులను భాగం చేయడం ద్వారా ఉన్నతీకరిస్తుంది. అది కేవలం మనుషుల ఉన్నతీకరణే కాదు. ఆ క్రమంలో సంబంధాల ఉన్నతీకరణ కూడా. పాత భావజాల చట్రాల నుంచి కొత్త భావజాల వైఖరులకు చేరుకోడానికి మనుషుల ఆచరణే షరతు. అంటే ఆచరణ ద్వారా మనుషులు కొత్త కలెక్టివ్ గా మారాలి. కథ, నవల సాహిత్యం దీన్ని చిత్రిస్తుంది.

అయితే ఈ నవలకు ముందుమాట కోసం బాలగోపాల్ రాసిన ‘మనిషి చరిత్ర మార్క్సిజం’ అనే వ్యాసం కథా సాహిత్యానికి వస్తువెప్పుడూ ‘మనిషే’ అని ఆరంభమవుతుంది. దాన్ని వివరిస్తూ ఆయన మనుషులు అని కూడా అంటారు. కరెక్టుగా చెప్పాలంటే కథా సాహిత్యానికి వస్తువెప్పుడూ భావజాల సంబంధాలే అని ఉండాలి. ఇంకా బాగా చెప్పాలంటే భావజాల చట్రానికి – అంతకంటే లోతుల్లో ఉండే సామాజిక సంబంధాల వ్యవస్థకు ఉండే సంపర్కమే కాల్పనిక సాహిత్యానికి వస్తువు. దాన్ని మనుషుల మధ్య ఉండే సంబంధాలు, అనుభవాలు, ఉద్వేగాల వైపు నుంచి సాహిత్యంలో చిత్రిస్తారు. ఇట్లా కాకుండా మనిషిని విడిగా చూసి, మనిషే సాహిత్య వస్తువు అనడం కుదరదు. భావజాల సంబంధాల చట్రంలోంచి సామాజిక సంబంధాల చట్రంతో సాగే సంపర్కంలో భాగంగా మనుషుల అనుభవాలను, ఉద్వేగాలను చూడాలి. దేనికంటే మనుషులు విడివిడిగా ప్రకృతితో సంపర్కంలోకి వెళ్లలేరు. ఉత్పత్తిలో పాల్గొనలేరు. అలాగే ప్రకృతిలో భాగమైన మానవ సమాజ చరిత్ర నిర్మాణంలోనూ వ్యక్తులుగా భాగం కాలేరు.

బాలగోపాల్ తన వ్యాసంలో ఇది వ్యక్తుల గురించిన చర్చ కాదంటారు, ప్రజా సమూహం గురించి అంటారు. కానీ ‘మనిషి’ అనే భావన చుట్టూ అంతా తిప్పారు. సమూహం అనే భావన కూడా అంత కచ్చితమైనది కాదు. వేరే సందర్భాల్లో ఈ భావన సరిపోతుందేమోగాని సాహిత్యాన్ని, చరిత్రను చూడ్డానికి పనికి రాదు. కానీ ఆయన చరిత్రలో భాగమైన సోషలిస్టు వ్యవస్థను కూడా ఇలాగే చూశారు. సోషలిజం నిలబడటానికి కార్మికవర్గ చైతన్యం అత్యంత ప్రధానమైనది. దానితోపాటు ఒక వ్యవస్థగా అంతర్గత, తార్కిక నియమాలు, పని పద్ధతులు, ప్రక్రియలు గల భౌతిక వ్యవస్థగా నిలదొక్కుకోవడాన్నిబట్టి దాని భవితవ్యం ఉంటుంది. 20వ శతాబ్దపు సోషలిస్టు నిర్మాణ ప్రయత్నాలు ఈ సమస్యలను ఎదుర్కొన్నాయి. దానికి ఆ విప్లవాలు జరిగిన వ్యవస్థల, సమాజాల ఆంతరంగిక ప్రత్యేకతలు కూడా కారణం. బాలగోపాల్ ఈ విషయాన్ని వ్యక్తులు, సమూహాల వైపు నుంచి, వాళ్లు సంతరించుకోవాల్సిన సహజీవన సంస్కృతి వైపు నుంచి చూస్తారు. అంటే చైతన్యం వైపు నుంచి మాత్రమే చూశారు. అది ముఖ్యమే. దానితోపాటు సమ సమాజమనే ఆకాంక్షకు తగిన తర్కంతో పని చేసే నిర్మాణాలుగా ఆ సోషలిస్టు వ్యవస్థలు ఎదుర్కొన్న సమస్యలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. బాలగోపాల్ దీన్ని పట్టించుకోలేదు. మనిషికి-చరిత్రకు ఉన్న సంబంధంలోని ఎగుడుదిగుళ్లలో కారణాలు చూశారు. దీని వల్ల ఆయనకు సహజంగానే చరిత్రలో మనిషి (లేదా ప్రజా సమూహం) నెరవేర్చే కర్తవ్యాల గురించి సందేహం కలిగింది. అసలు అలాంటి కర్తవ్యాలు మనిషికి లేదా కార్మికవర్గానికి స్వాభావికమా? అనే ప్రశ్నదాకా వెళ్లారు.

చరిత్రలో ఒక వ్యవస్థ మరో వ్యవస్థగా మారడానికి కారణాలను చూడాలి. పెట్టుబడిదారీ వ్యవస్థను ధ్వంసం చేయాల్సిన అవసరాలను గుర్తించాలి. ఒక వ్యవస్థగా సోషలిజం పని చేసే నియమాలను అన్వేషించాలి. 20వ శతాబ్ది సోషలిస్టు నిర్మాణ ప్రయత్నాలు వెనక్కి వెళ్లడానికి కారణాలు కనుక్కొని గుణపాఠాలు తీసుకోవాలి.

బాలగోపాల్ తన వ్యాసంలో కొంత తాత్విక చర్చ, కొంత రాజకీయ చర్చ కూడా చేశారు. ఈ రెండు వైపుల నుంచి ఆయన 20 శతాబ్ది సోషలిస్టు ప్రయత్నాల్లో తలెత్తిన సమస్యలను సమస్యలుగా చూడలేదు. సంక్షోభాన్ని సంక్షోభంగా చూడలేదు. ఆ ప్రయత్నం కొంత చేశాడని అంగీకరించే వాళ్లకు కూడా ‘మనిషి’ పాత్ర మీద ఆయన వెలుబుచ్చిన సందేహమే ప్రధానంగా కనిపిస్తుంది.

సాధనకు తాను నవల రాస్తున్నాననే ఎరుక ఉంది. ఒక సమిష్టి ఆచరణలో కొనసాగుతున్న విప్లవోద్యమంలో భాగంగా రాగో గురించి రాస్తున్నాననే స్పష్టత ఉంది. అందువల్ల రాగోను భాగం చేసుకున్న విప్లవాచరణకు ఉండే ఉన్నత రూపాలను చిత్రించే దిశగా నవలను నడిపారు. మనుషుల మధ్య, ఒక రాజకీయ లక్ష్యంగల నిర్మాణంలో, చరిత్రను అర్ధం చేసుకోగల దృక్పథం వెలుగులో రాగో ముందుకు పోగలదని గిరిజకు నమ్మకం ఉంది.

ఇది వ్యక్తిగా గిరిజకు ఉన్న విశ్వాసం కాదు.

రాగో తన పరివర్తన ద్వారా, దానికి చోదకమైన ఆచరణ, చారిత్రక దృక్పథం ద్వారా తప్పక ఈ పని చేయగలదని ఆమె చెప్పడంతో నవల ముగుస్తుంది. కల్పనా సాహిత్యం కాబట్టి ఈ మాట ఏ వైపు నుంచైనా వినిపించవచ్చు. ఈ మాట ఆ సన్నివేశంలో గిరిజ అంటుంది కాని, నవల అంతటా ఉన్న రాగో పరివర్తనా క్రమమే పాఠకులకు ఆ భరోసా ఇస్తుంది.

అత్యంత నికృష్టమైన పెట్టుబడిదారీ వ్యవస్థలో నేను సర్దుకపోను, ఎంత సుదూరమైనా సోషలిజం దిశగానే నేను సాగిపోతానని రాగో చెబుతోంది. ఇప్పుడు నవలలోని నిజపాత్ర తన జీవితంతో, అమరత్వంతో కూడా మనకు ఇస్తున్న సందేశం ఇదే.

కవి, రచయిత, విమర్శకుడు, వక్త. విరసం కార్యవర్గ సభ్యుడు. గతంలో విరసం కార్యదర్శిగా పని చేశారు. రచనలు: 'కలిసి పాడాల్సిన గీతమొక్కటే' (కవిత్వం), 'అబుజ్మాడ్' (కవిత్వం), 'నేరేడు రంగు పిల్లవాడు' (కథలు), 'జనతన రాజ్యం', 'సృజనాత్మక ధిక్కారం'. రెండు దశాబ్దాలుగా మార్క్సిస్టు దృక్పథంతో విమర్శలో కృషి చేస్తున్నారు.

Leave a Reply