సంఘటిత పోరాటాలే విముక్తి మార్గం: రత్నమాల

(తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వెల్లువలో ఉదయించిన రత్నమాలది మార్క్సిస్టు వెలుగు దారి. ఆమె తెలుగు నేలపై తొలి తరం మహిళా పాత్రికేయురాలు. నాలుగు దశాబ్దాలకు పైగా ప్రజా ఉద్యమాలతో మమేకమవుతున్నారు. నోరులేనోళ్లకు నినదించే గొంతుకయ్యారు. హక్కుల కోసం రాజీలేని పోరాటం చేస్తున్నారు. పాఠశాల స్థాయి నుంచి ప్రజా ఉద్యమాలే తన కార్యరంగం. కార్మిక, మహిళా, హక్కుల సంఘాల్లో ధిక్కార స్వరం ఆమెది. విప్లవ సాహితీ సాంస్కృతికోద్యమంలో వెలుగు దారి ఆమెది. మార్క్సిస్టు ఆచరణే ఆమె గమనం. లెనినిస్టు, మావోయిస్టు నిబద్ధతే ఆమె గమ్యం. ఆమె జీవితమే ఓ ఉద్యమం. ‘కొలిమి’తో రత్నమాల సంభాషణ…)

మీ బాల్యం, విద్యాభ్యాసం గురించి చెప్పండి.
నేను పుట్టింది మా అమ్మమ్మవాళ్ల ఊరు. కర్విరాల కొత్తగూడెం(తుంగతుర్తి దగ్గర). మా బాపుది కుక్కడం గ్రామం, సూర్యాపేట తాలూకా నల్లగొండ జిల్లా. మా బాపమ్మకు మా ఊర్లో ముగ్గురు దోస్తులుండేది. ఒకామె బ్రాహ్మలు. మరొకామె కోమట్లు. ఇంకొకామె వడ్రంగి. ఈ నలుగురూ మా ఇంట్లో రోజూ పచ్చీసు ఆడుకుంటూనో, ముచ్చట్లు పెట్టుకుంటూనో గడిపేటోల్లు. ఎక్కడైనా అరుదుగా పుస్తకం దొరికితే వాళ్లకు చదువు రాదు కనుక నాతో చదివించుకునేటోల్లు. అప్పుడు నేను మూడో తరగతి అనుకుంట. మామూలు నవలలు, కథలు, వారపత్రికలు ఫరవాలేదు కానీ, రామాయణం, భారతం, బాగవతం వచనంలోనే అయినా కొన్ని చోట్ల అక్షరాలు కూడబలుక్కొనయినా వాళ్ల కోసం చదివి వినిపించేదాన్ని. ఇట్లా కలిగిన సాహిత్యాభిరుచి ఎక్కడ పుస్తకం దొరికినా, అది నాకా వయసులో అర్థమయ్యే స్థాయి అయినా కాకపోయినా లెనిన్ వలసవాదం, కమ్యూనిస్టు ప్రణాళిక మొదలుకొని శ్రీశ్రీ, తిలక్, శరత్, చలం రాహుల్ సాంకృత్యాయన్ రచనలు, కాకలు తీరిన యోధుడు మొదలైన అభ్యుదయ సాహిత్యం చదివిన. మా అమ్మ శకుంతలమ్మ అమ్మగారింట్లో, పంచాయితీ గ్రంథాలయాలు అందుబాటులో ఉండటంతో నేను ఏడో తరగతి పూర్తిచేసే నాటికే చదవగలిగాను.
మా అమ్మమ్మ వాళ్ల ఊర్లో రెండు, మూడు తరగతులే ఉండె. మా ఊర్లెగూడ అంతే. నాకు ఆరేడేండ్లున్నపుడు మా ఊరికి దగ్గర్నే ఉన్న పెద్ద ముప్పారంల సదివిచ్చిండ్రు. అక్కణ్నే తెలిసినోళ్ల ఇంట్లె ఉంచిర్రు. వాళ్లు దూరపు బంధువులు. ఏడో తరగతి వరకు మా ఊరు కుక్కడం నుంచి పెద్ద ముప్పారానికి కాలినడకన పోయేటోల్లం. ఆడ, మగ తేడాల్లేకుండా కలిసి చదువుకున్నం. అందరం కబడ్డీ ఆడేటోల్లం. బడికి పోయేటపుడు పచ్చని పొలాల్లోంచి నడిచిపోయేటోల్లం. ఆ చెట్టూ చేమలూ, ప్రకఈతి లో ఆడుతూ పాడుతూ సాగేటోల్లం. ఎనిమిదో తరగతికి సూర్యాపేటకు ఒచ్చినం. పాత బస్టాండ్ దగ్గరున్న జెడ్పీ స్కూల్ లో చదివిన. అప్పుడు గాంధీ పార్క్ ఎదురుగా ఉండేటోల్లం. గుంటూరులో 12 ఏండ్లకే ఆంధ్రా మెట్రిక్ పరీక్ష పాసయిన. తర్వాత హైదరాబాదొచ్చిన. రెడ్డీ కాలేజీలో పీయూసీ చదివిన. పీయూసీ కోర్సులో మాదే చివరి బ్యాచ్. డిగ్రీ ఆంధ్ర మహిళా సభలో చదివిన. డిస్టెన్స్ లో ఎం.ఏ చేసిన.

మీ కుటుంబ నేపథ్యం?
మా బాపుది కుక్కడం గ్రామం. వ్యవసాయ కుటుంబం. బాపువాళ్ల తండ్రి చిన్నపుడే చనిపోయిండు. అన్నదమ్ములు కొంత మోసం చేసి తనకు రావాల్సిన వాటా రాకుండ చేసిండ్రు. అందుకే చాలా కష్టపడ్డడు. ఒకరైతుగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్నడు. అమ్మ కుటుంబంలో ఉన్న భీంరెడ్డి వంశస్తుల్లాగ నాయకుల పేరు రాలేదు. కొత్తగూడెంల కామ్రేడ్ వెంకయ్య ఉండె. అయితే అందరూ ఈయన్ని ”కామ్రేడ్ ఎంకా…” అని పిలిచేటోల్లు. అగ్రవర్ణ దొరలేమో ‘కామ్రేడ్ దొరలు’. నేను మా అమ్మవాళ్లను అడిగిన. ఆయిననేమో ”కామ్రేడ్ ఎంకా…” అనుడేంది? వీళ్లనేమో ”కామ్రేడ్ దొరా..” అని పిలుసుడేంది అని. అందరి ముందు ఇట్లంటవా అని మా అమ్మవాళ్లు బాగ కొట్టిండ్రు. చిన్న వయసులో ఆ పుస్తకాలు చదవడం వల్ల ఆ విలువలు మనసులో నాటుకుపోయినయి. కమ్యూనిస్టులు సీపీఐ, సీపీఎంలు గా విడిపోయినపుడు ”ఏందీ గోడల మీద ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని రాసిండ్రు. మీరెందుకు ఇంతమంది అయిండ్రని” అడిగిన. అన్నీ నీ వయసుకు మించిన ప్రశ్నలడుగుతవని కోప్పడేవాళ్లే తప్ప సమాధానాలిచ్చేటోల్లు కాదు. ”అక్కన్నేమో అట్ల రాస్తరు. ఎవరింట్లెనన్న అన్నం తినొస్తె ఎక్కడబడితె అక్కడ తినొచ్చినవా అని ఎందుకు కొడ్తరు”? అనేదాన్ని. ఆచరణకూ, సిద్ధాంతానికీ వైరుధ్యం అనే సైద్ధాంతిక అవగాహన లేదుగానీ, వీళ్లొకటి మాట్లాడుతరు, ఒంకొకటి చేస్తున్నరని తెలిసేది. చిన్పప్పట్నించీ మా బాపు కూడా ముక్కుసూటిగ ఉండేది. శానా పద్ధతిగ ఉంటడని ప్రజలందరూ చెప్పేటోల్లు. నాక్కూడా మా బాపు లక్షణాలే ఒచ్చినయంటరు శానా మంది.

మీకు సాహిత్యంపై ఆసక్తి ఎట్లా కలిగింది?
చిన్నప్పుడే నాకు నాకు సాహిత్యం పట్ల ఆసక్తి మా బాపమ్మ నుంచే. ఆమె పేరు చిలకమ్మ. ఆమె ఇంట్లోనే పాటలు పాడుకునేది. ఆమె పాడిన పాటల్లోని కొన్ని చరణాలు ఇప్పటికీ గుర్తే. ”పడతి సీతనుదెచ్చి పంతాన చెరబట్టి /రావణుండేపాటి రాజ్యమేలె? /సారంగధరకాల్లు సాహిగా నరికించి /చిత్రాంగి ఏపాటి చెలువొందెను?”. మా చుట్టుపట్టు గ్రామాలన్నీ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ప్రభావం ఉన్న గ్రామాలు. మా ఊరి పంచాయితీ లైబ్రరీలో మంచి మంచి పుస్తకాలుండేవి. మహాప్రస్థానం, గోర్కీ ‘అమ్మ’లాంటి పుస్తకాలు అక్కడే పరిచయమైనయి. ప్రతీ ఇంట్లోనూ సాహిత్య పుస్తకాలుండేవి. మా బాపమ్మ, అత్తమ్మలు, వాళ్ల దోస్తులు, చుట్టుపక్కల మహిళలకు చదువు రాదు. అందుకే వాళ్లు కథలు, నవలలు లాంటి పుస్తకాలు సదివి వినిపించుకునేటోల్లు. నేను చదువుతుంటె వినేటోల్లు. ఎక్కడ చూసినా పోరాట సాహిత్యమే ఉండేది. ప్రజాసాహిత్యం తప్ప మిగతా పుస్తకాలేవీ చదవలేదు. బహుశా నాకు సాహిత్యంపై అట్లా ఆసక్తి కలిగిందేమో. పాఠశాలలో ఉన్నపుడే పాటలు, కవితలు రాసేదాన్ని. ఎవరికీ చూపించకుండా వాటిని నోటుపుస్తకాల్లోనే ఉంచేదాన్ని.

ప్రజా సాహిత్యం కాకుండా ఇతర సాహిత్యం ఏమైనా చదివారా?
మా అమ్మ అమ్మగారిల్లు, అత్తగారిల్లు రెండు గ్రామాలూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం బలంగా సాగిన గ్రామాలు. అందువల్ల నాకు దొరికిన పుస్తకాలు అభ్యుదయ సాహిత్యమే. ఇంత మంచి సాహిత్యం అందుబాటులో ఉండటం వల్లనేమో ఇప్పటికీ డిటెక్టివ్ నవలలు కానీ, మరే ఇతర చౌకబారు సాహిత్యం గానీ పనిగట్టుకొని చదవాలనుకున్నాఒక్క పేజీ కూడా చదవలేదు.

ఎప్పట్నించి రాస్తున్నారు?
పాఠశాలల వయసు నుంచే రాస్తున్న. 1967-69 వరకు దాదాపు నేను చదివిన పుస్తకాలు అతితక్కువ అయినా పాఠశాలలో భోజన విరామ సమయంలో మరో ఖాళీ సమయంలో వీలుచిక్కినపుడు నా స్పందనలు నోటుపుస్తకంలో రాసేదాన్ని. అట్లా 1967- 69 వరకు 40 నుంచి 50 కవితల దాకా రాసుకున్న. మా అమ్మక్క(పెద్దమ్మను తెలంగాణలో అమ్మక్క అంటరు) మల్లు స్వరాజ్యం భర్త వీఎన్ పెద బాపు(మల్లు వెంకటనర్సింహారెడ్డి) సహధ్యాయులు చూడామణి, మరో అమ్మాయి కృష్ణకుమారి ఇట్లా నలుగురైదుగురు అప్పట్లో నా కవిత్వానికి శ్రోతలు. పాఠకులు. ఊర్లోనే నెలకోసారి కవిరాజు టైప్ ఇనిస్టిట్యూట్ వారు నిర్వహించే కవి సమ్మేళనంలో పాల్గొనడానికి కూడా మా ఇంట్లో అనుమతి దొరికేది కాదు. ఎప్పుడన్నా మా ఇంటికి వచ్చినపుడు వీఎన్ పెదబాపు కొత్తగా ఏం రాశావని అడిగి, చదివించుకొని ప్రోత్సహించేటోల్లు. ఆ తరువాత నేను ఎంఏ చదివే రోజుల్లో నాతో పాటు చదువుకొనే బాలసరస్వతి, ఈనాడులో పనిచేస్తున్నపుడు మా జమున నా కవిత్వాన్ని చదివి మెచ్చుకొనే పఠితలు. ఇట్లా నా బాల్యంలో, కౌమారంలో రాసిన కవిత్వం కాగితాల్లోనే ఉండిపోయింది. అట్లా నోటుపుస్తకంలో అక్కడక్కడ శ్రద్ధగా ఉన్న కవిత్వాన్ని మా పెద్ద తమ్ముడు (ముక్కాల వెంకట రమణారెడ్డి) (తన చేతిరాత నా రాతకంటే చక్కగా కుదురుగా ఉండేది.) అన్నీ ఒక చోట నోటుపుస్తకంలో రాసిచ్చిండు.

ఈ మధ్యే పాత పుస్తకాల దొంతరల మధ్య అవి దొరకడంతో, అందులోంచి కొన్ని కవితలు ఒక సంకలనం వేసిన. మా తమ్ముడికి సాహిత్యంలో అంతగా ఆసక్తి లేకోపోయినా “మా అక్కయ్య పాపం ఇట్లా ఎక్కడపడితే అక్కడ అన్నీ పోగొట్టుకుంటుంది” అనే ఒక సానుభూతితో అన్నీ ఒకచోట రాసిపెట్టినందువల్లే ఇప్పుడిట్లా పాత కవితల్ని పుస్తకంగా వేసిన. పాతవి, అముద్రితాలు ఎందుకు వేసుకోవడం అనుకున్న. కానీ, కళలైనా, సాహిత్యమైనా మరే బౌద్ధిక, సృజనాత్మక శక్తి అయినా అనగనగా రాగమే కదా. ‘నా తొలి రోజుల సాహిత్య వ్యక్తీకరణ ఇది’ అని చెప్పడానికి అముద్రిత, పాత కవితలు సంకలనం వేసిన.

ఏయే కలం పేర్లతో రచనలు చేశారు? మీ రచనల వివరాలు చెప్పండి.
విమోచన, జనశక్తి పత్రికల్లో ‘నీలిమ’ పేరుతో కొన్ని రచనలు చేసిన. మా అమ్మాబాపు పెట్టిన పేరు అరుణ. మా అమ్మవాళ్ల బాపమ్మ పేరు రత్తమ్మ. 1930లో వచ్చిన కరువులో రత్తమ్మ దొరసాని ఊరోళ్లందరికీ జొన్న గట్క వండి, సల్ల కలిపి పోసేదట. ఆమె చనిపోయిన తర్వాత ఊరోల్లందరూ నన్ను రత్తమ్మ దొరసాని అని పిలిచేటోల్లు. ఆ రత్తమ్మ పేరే స్కూల్ లో చేరినపుడు రత్నమాల అని రాసిండ్రు. అట్లా అరుణ రత్నమాలగా మారింది. ఇక నా రచనలు… ‘గమనం – ఘర్షణ – గమ్యం'(కవిత్వం, పాటలు, కథలు, వ్యంగ్య రచనలు), ‘సామ్రాజ్యవాద దోపిడీ మండలాలు’, ‘ప్రజలు – నిర్వాసిత సమస్యలు – పాలకులు’, ‘దాక్షిణ్యవాదం నుంచి దండకారణ్యం దాక భారత మహిళా ఉద్యమం’. మరి కొన్ని.

జర్నలిజంలోకి ఎట్లా వచ్చారు?
ఉద్యమ ప్రభావిత ప్రాంతం కావడం వల్ల నాలో సామాజిక అవగాహన పెరిగింది. అప్పటికే కవితలు, పాటలు రాస్తుండేదాన్ని. అదే సమయంలో ఈనాడు పత్రిక జర్నలిజంలో ప్రవేశానికి ప్రకటన ఇచ్చింది. పరీఓ రాసి సెలక్టయిన. అప్పుడు ఈనాడు సంపాదకవర్గంలో ఎస్వీఎస్ సుబ్బారాయుడు, రామోజీరావు, ఏబీకే ప్రసాద్, టీవీ కృష్ణ ఉన్నారు. అంతకు ముందు తెలుగు జర్నలిజంలో అమ్మాయిలెవరూ ఉండేవాళ్లు కాదు. నాతోపాటు ఆరుగురం చేరినం. రిపోర్టర్ గా చేరాలని ఆసక్తి ఉండేది. కానీ, అమ్మాయిలు రిపోర్టింగ్ లో ఉండటమేమిటి? అయినా కవిత్వం రాసేవాళ్లు జర్నలిజానికి పనికి రారు అని ఎస్వీఎస్ సుబ్బారాయుడు ఒక్కడే వ్యతిరేకించిండు. నా రచనలు, ఇంటర్వ్యూ నచ్చి రామోజీరావు, ఏబీకే ప్రసాద్ లు సెలెక్ట్ చేసిండ్రు. ఈనాడును ఓన్ చేసుకుని పనిచేసినం. రెండేండ్లల్లనే మిగతా పత్రికలన్నిటిని బీట్ చేసినం. రిపోర్టింగ్ చేయాలని ఉన్నా డెస్క్ లోనే చేయాల్సి వచ్చింది. అట్లా ఈనాడులో 1975 నుంచి 1977వరకు చేసిన. ఆరుగురమూ లెఫ్ట్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవాళ్లమే. అంతకు ముందు ఆంధ్రపత్రికలో లలిత అనే అమ్మాయి ఉండేది. కళ్యాణి అనే అమ్మాయి యూఎన్ఐ పీటీఐలో ఉండేది. ఈనాడులో వేజ్ బోర్డు అమలు చేయాలని నేషనల్ స్ట్రగుల్ నడిచింది. ఈ స్ట్రగుల్ లో తీసేసింది మా ముగ్గుర్నే. ”ఆంధ్రప్రదేశ్ న్యూస్ పేపర్స్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ” ఏర్పాటు చేసినం. ఆ కమిటీలో వైస్ ప్రసిడెంట్ గా చేసిన. ఎక్కువగా నేను సాహిత్య సంస్థల్లో కాకుండా ట్రేడ్ యూనియన్ లో పనిచేసిన. డిగ్రీ చదివేటప్పుడే అడ్డగుట్ట బీడీ కార్మికుల దగ్గరికి పోయి పనిచేసిన.

‘నూతన’ పత్రికను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
ఈనాడు నుంచి బయటకు వచ్చినంక 1978లో ‘నూతన’ పత్రికను ఏర్పాటు చేసినం. అప్పటికే సృజన పత్రిక ఉన్నది. అది విప్లవ రాజకీయాచరణతో నడిచేది. అయితే నూతన ద్వారా జనరల్ రీడర్స్ కోసం ఒక ప్రోగ్రెసివ్ పత్రిక ఉంటే బాగుండేదని మాట్లాడుకునేటోల్లం. ఈ పత్రిక విద్యార్థుల్లోకి, గ్రామాల్లోకి పోవాలనుకున్నం. ఈ పత్రికకు లక్నారెడ్డి, నిజామాబాద్ నుంచి వేణు, సాంబశివరావు సహకరించేవాళ్లు. మా ఇల్లే నూతన ఆఫీసుగా నడిపినం. పత్రిక నడిపే క్రమంలో సీవీ సుబ్బారావు చేసిన వ్యాఖ్యానాలు, సూచనలు, సలహాల ప్రభావం ఉన్నది. మా తమ్ముళ్లు, చెల్లెండ్లు అందరూ కలిసి పత్రిక పోస్టింగ్ పనులు చేసేవాళ్లు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కూడా సహకరించేవాళ్లు. కొత్త రచయితలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఏర్పాటుచేసిన పత్రిక ఇది. ఇది యువతరం కోసం పెట్టిన పత్రిక. అల్లం రాజయ్య నవల ‘ఊరేగింపు’ నూతనలోనే ప్రచురితమైంది. రమేష్ ప్రెస్ లో ప్రచురించేవాళ్లం. విమోచన పత్రిక నుంచి హెచ్చార్కె, నమ్ము ఆ ప్రెస్ లో కలిసేవాళ్లు. ‘విమోచన’, ‘నూతన’ పత్రికల ప్రూఫులు మేమందరమూ కలిసి చూసేవాళ్లం. ఒకరికొకరం సహకరించుకొనేవాళ్లం. ఒకే కమిటీగా ఏర్పడి రెండు పత్రికల్ని నడిపిద్దామనుకున్నం. కొద్దిరోజుల్లోనే విబేధాలొచ్చి పత్రిక ఆగిపోయింది. ఆ తర్వాత కాలంలో కూడా నూతన పత్రికను ఇవ్వమని చాలా మంది అడిగిండ్రు. కానీ, నేనివ్వలేదు. నూతన నాలుగేళ్ల పాటు నడిచింది.

మీ రాజకీయ అవగాహనను ప్రభావితం చేసిందెవరు?
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తి నన్ను అత్యంత ప్రభావితం చేసింది. తర్వాత కాలంలో కొండపల్లి సీతారామయ్య, సీవీ సుబ్బారావు. చెరబండరాజు కుటుంబంతో అనుబంధం ఉండేది. చెర మలక్ పేట కాలేజీలో పనిచేసేటపుడు మా ఇంట్లో (నల్లకుంట ప్రాంతం) సైకిల్ పెట్టి అక్కణ్నించి బస్సులో మలక్ పేట పోయేవాడు. విరసం కంటే ముందే చెరబండరాజు కుటుంబంతో అనుబంధం. శ్యామల, ఉదయినితో స్నేహం కొనసాగింది.

విప్లవ రాజకీయాల్లోకి ఎట్లా వచ్చారు?
నూతన పత్రిక నడిపే క్రమంలో ప్రజా సంఘాలతో పరిచయాలు ఏర్పడ్డయి. పీఓడబ్ల్యూలో పనిచేసిన. అన్ని సంఘాల మహిళలు ఐక్య సంఘటనగా పీఓడబ్ల్యూలో ఉండేవాళ్లు. నాకు చిన్నప్పట్నించీ కేఎస్, అనసూయ ఆంటీ పరిచయమే. మా ఇంటి పక్కనే ఉండేవాళ్లు. చిన్నప్పట్నించీ విప్లవ రాజకీయాల్లో ఉన్నవాళ్లతో పరిచయం ఉన్నది. ఎమర్జెన్సీ తర్వాత మొదట జనరల్ బాడీ మీటింగ్ విజయవాడలో జరిగింది. ఈ మీటింగ్ కు పోతున్న, మీరొస్తరా? అని అల్లం రాజయ్య ఉత్తరం రాసిండు. వెంటనే నేను వెళ్లిన. అక్కడ నేను విరసంలో చేరేటపుడు చర్చ జరిగింది. సిటీ యూనిట్ లో చేరకుండా డైరెక్ట్ గా జనరల్ బాడీలో సభ్యత్వం ఎట్లా ఇస్తరని కొందరు వ్యతిరేకించిండ్రు. ”ఆమె ఒక పత్రికా ఎడిటర్. తనంతట తానే వచ్చి సభ్యత్వం తీసుకుంటానంటే మనమెట్లా వద్దంటాం” అని కేవీఆర్, టీఎంఎస్, వీవీ అన్నరు. అట్లా విరసంలోకి వచ్చిన.

ఇప్పటి మహిళా ఉద్యమాలు ఎట్లా ఉన్నాయి?
జీవన్మరణ పోరాటంలో భాగంగా ఆదివాసీ మహిళల్లో పెరుగుతున్న ప్రతిఘటనా శక్తి, నిర్మాణాత్మక పోరాట దక్షత, సంఘటిత శక్తిని సమన్వయం చేసుకొని అంతిమ విజయం దాకా కొనసాగించే ప్రయత్నం కనబడుతుంది. ఉద్యమ ప్రాంతంలో ముఖ్యంగా దండకారణ్యంలో లక్షన్నర సభ్యత్వం కల్గిన క్రాంతికారీ ఆదివాసీ మహిళా సంఘటన్ ప్రభావంతో ఆదివాసీ మహిళల్లో పెరుగుతున్న సంఘటిత, నిర్మాణాత్మక పోరాట పటిమ, నిబద్ధత నిర్భయ దాడుల పట్ల దేశవ్యాప్తంగా పెల్లుబికిన ఆందోళనలో ఎంతమాత్రం కనిపించదు. కొన్ని సంవత్సరాలు మహిళల సమస్యలపై తక్షణ స్పందనలున్నప్పటికీ ప్రతి ఆందోళన దేశవ్యాప్తంగా జరుగుతున్నప్పటికీ గాలివాటంగా, నిర్మాణాత్మక లక్ష్యం, దశ దిశ లేకుండా ఎవరి దారి వారిదే, ఎవరి గోల వారిదే అన్న తరహాలో జరుగుతున్న విషయం శ్రద్ధగా పరిశీలిస్తే అర్థమవుతుంది.

1970వ దశకం చివరి నుంచి 1980 దశకం ప్రథమార్థం వరకు దాదాపు ఐదేళ్లకు పైగా (1978- 1983 వరకు) దేశ వ్యాప్తంగా నిర్మాణాత్మకంగా సంఘటితంగా సమన్వయంతో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్జీఓలు మొదలుకొని వామపక్ష పార్టీలు, అధికార పాలక పక్ష, పార్లమెంటరీ పాలకవర్గాల పార్టీలు, మార్క్సిస్టు, లెనినిస్టు, మావోయిస్టు ఆలోచనా విధానం నమ్మే మహిళా సంఘాలు, మహిళా ఉద్యమకారులు స్వాతంత్ర్య (ఎటానమస్), స్త్రీవాద మహిళా సంఘాలు, స్త్రీవాదులు, హక్కుల సంఘాల మహిళలు ఐక్యంగా అనేక కార్యక్రమాలు నిర్వహించి లైంగిక బలాత్కార చట్టంలో ప్రభుత్వంతో తాము కోరిన విధంగా (ప్రత్యామ్నాయ ముసాయిదా చట్టం ప్రతిపాదించి) చట్టం తెచ్చే వరకూ నిరంతరం పోరాడిన నిబద్ధత, నిర్మాణ దక్షత, పోరాట పటిమ 1980వ దశకం తర్వాత కనిపించడం లేదు. ఇప్పుడు భారతదేశంలో (దండకారణ్య ఆదివాసేతర పోరాటంలో, ఈశాన్య రాష్ట్రాలు, కశ్మీర్ కాకుండా) వేల సంఖ్యలో రకరకాల మహిళా సంఘాలున్నాయి. కానీ, నిర్మాణాత్మకమైన సంఘటిత మహిళా ఉద్యమం గానీ, స్త్రీ పురుష సమానత్వం పట్ల స్పష్టమైన అవగాహన దృక్పథం మాత్రం లేదని స్వప్నిక, జ్యోతిసింగ్ పాండే, అయేషాలపై లైంగిక దాడుల సందర్భంగా జరిగిన ఆందోళనల తీరుతెన్నులు పరిశీలిస్తే అర్థమవుతుంది.

మహిళా ఉద్యమాలు ఎట్లా ఉంటే సమస్యలు పరిష్కారమవుతాయి?
ఏ సమస్యకు ఆ సమస్య మాత్రమే, ఎవరి సమస్య వారి సమస్యగానే చూసే పాక్షిక దృష్టి కోణం, కొన్ని సంవత్సరాలుగా నూతన ఆర్థిక విధానాలు, సరళీకరణ, ప్రపంచీకరణ ప్రభావంతో పరాయీకరణ చెందుతున్న వివిధ అస్తిత్వ ఉద్యమాల్లో ఎవరి దారి వారిదే, ఎవరి గోల వారిదే అన్న ధోరణి బలంగా వేళ్లూనుకుంది. విడివిడిగా పైకి కనిపించే వాటి మధ్య లోతుగా పరిశీలిస్తే తప్ప కనిపించని అంతర్లీన సంబంధం ఉంటుంది (మార్క్స్) అన్న విషయాన్ని ఈ ఉద్యమాల్లో పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఎవరి ఉద్యమాలు వారు చేసుకుంటూనే అందరూ కలిసి చేయాల్సిన ఉద్యమాల్ని, పోరాటాల్ని పట్టించుకోని తనానికి దారి తీస్తుంది. ఈ ధోరణి సమస్య పరిష్కార మార్గ దశ దిశలను, ఉద్యమాల పోరాట గమనం – గామ్యాలను గందరగోళానికి గురి చేసి వివిధ పీడిత శ్రేణులను, పీడిత ప్రజా శ్రేణుల్ని ఒకరిపై ఒకరిని శత్రువులుగా మోహరించే దుస్థితికి దోహదం చేస్తున్నది. అంతిమంగా ఉద్యమాలు, పోరాట ఫలితాలను సమస్య పరిష్కారానికి కాకుండా సమస్యను మరింత జఠిలం చేసే విధంగా రాజ్యం మలుచుకోగలుగుతున్నది. ప్రతి సమస్యకూ బహుళ కోణాలుంటాయని, పరిష్కారం కోసం సమగ్ర దృక్పథంతో మూలాల్లోకి వెళ్లి కారణాలు వెతకాలన్న దృష్టి కోణం పాక్షిక ఉద్యమాలకు ఉండదు. కొన్నేళ్లుగా ఈ పాక్షిక దృక్కోణం వల్ల సామూహిక లైంగిక బలాత్కారం పట్ల ఆందోళన సందర్భంగా కఠిన శిక్ష, ఉరిశిక్ష, సైంటిఫిక్ విధానం ద్వారా నపుంసకులను చేయడం వంటి తప్పుడు పరిష్కార మార్గాల గురించి పదే పదే వినపడ్డా వాళ్లను సరిదిద్ది అవగాహన కల్పించే ప్రయత్నాలు జరగలేదు. గాలి దుమారంలా ఎగసిపడ్డ ఉద్యమాలను నిర్మాణాత్మకంగా మలిచే ఏకీకృత సమస్య సమగ్ర దృక్పథం కొరవడుతుంది.

దండకారణ్య మహిళా ఉద్యమాల గురించి చెప్పండి.
దండకారణ్యంలో ఆదివాసీ క్రాంతికారీ మహిళా సంఘటన్ లక్షకు పైగా సభ్యుల్ని కలిగి ఉండటంతో పాటు కరడుగట్టిన తెగ పితృస్వామ్య భావజాలాన్ని, విలువలను, తెగ పెద్దల పెత్తనాన్ని, సామాజిక దురాచారాలను ఎదిరించే విధంగా ఆదివాసీ మహిళ చైతన్యాన్ని, పోరాట పటిమను, సామాజిక, రాజకీయ అవగాహనను పెంపొందిస్తూ జనతన సర్కార్ ల అధ్యక్ష, కార్యదర్శుల స్థాయికి, మిలీషియాలో గెరిల్లా దళాలకు నాయకత్వం వహించే స్థాయికి వాళ్లను తీర్చిదిద్దింది. స్త్రీ పురుష సమానత్వ భావజాలాన్ని, ఆచరణను స్త్రీలు, పురుషులు మొత్తంగా ఆదివాసీ సమాజానికంతటికీ అలవర్చుతుంది. జనాభాలోనే కాదు, అన్ని పోరాట రూపాల్లో జనతన సర్కార్ ల ఆధ్వర్యంలో రూపొందుతున్న సమసమాజ నిర్మాణంలో సగ భాగంగా సాధికారంగా ఎదుగుతున్నరు ఆదివాసీ సమాజంలో స్త్రీలు. ఇక్కడ 15 ఏళ్లకు పైగా 33శాతం రాజకీయ రిజర్వేషన్ ల బిల్లు గోడకు కొట్టిన బంతిలా పార్లమెంటు గోడల మధ్య గిరికీలు కొడుతూనే ఉంది.

అక్కడ ఆదివాసీ మహిళలు బహుభార్యత్వానికి, బలవంతగా ఎత్తుకొని పోయి చేసే పెళ్లిళ్లు, బాల్య వివాహాలను, రవికెలు తొడుక్కోవద్దనే తెగ కట్టుబాట్లను, బహిష్టు సమయంలో ఊరి బయట ఉండటం వంటి దురాచారాలు ఎదిరించి రూపుమాపుతున్నరు. భూస్వాముల నుండి ఆక్రమించిన భూములు, పోడు వ్యవసాయ భూములు మహిళలకు వాటా ఇవ్వడం, భార్య భర్తలకు ఇద్దరికీ కలిపి పట్టాలివ్వడం, ఆడపిల్లలకు కూడా ఆ స్థలం లో వాటా, భూమిలో వాటా పట్టాలు ఇవ్వడం వంటి ఎన్నో ఆర్థిక సమానత్వ చర్యలు తీసుకుంటున్నరు. ఆదివాసీ సమాజం స్త్రీ, పురుషులు సమానం అన్న అవగాహన పెంచడం ద్వారా పురుషుల, మొత్తంగా ఆదివాసీ సమాజ సమ్మతి సాధించడం ద్వారానే ఈ విప్లవాత్మక ఆచరణలు సాధ్యం చేయగలుగుతున్నరు.

అక్కడ స్త్రీలు నాగలి దున్నుతారు, కానీ కళ్లంలోకి రాకూడదు, విత్తనాలు చల్లగూడదు. అట్లనే వేటలో పాల్గొనవచ్చు కాని, వేటలో జంతువు కోసి వాటాలు పంచే ‘కర్బ’ జాగ కి మాత్రం స్త్రీలు ప్రవేశిస్తే అరిష్టంగా భావించి అనుమతించరు. ఇది తప్పు అని ఆడ, మగ అందరూ సమానం, స్రీలకు నిషేధిత ప్రాంతం అనడం అసమాన భావజాలం అని ఎంత చెప్పినా ఆదివాసీ పురుషులు, గత తరం స్త్రీలు అంగీకరించలేదు. అయితే ముందుగా జనతన సర్కార్ ఆధ్వర్యం లో సమిష్టి వ్యవసాయ క్షేత్రాల్లో, సమిష్టి వేటలో, తర్వాత కర్బలో స్త్రీలు అరిష్టం అని చెప్పి నిషేధించిన అన్ని పనుల్లో స్త్రీలను భాగస్వామ్యం చేశారు. స్త్రీలు పాల్గొంటే అరిష్టం అన్న ఆదివాసీ సమాజ మూఢ నమ్మకాలను తొలగించారు. వ్యక్తి గత వ్యవసాయ పనుల్లో, ఊరుమ్మడి వేటలో ఇప్పుడు స్త్రీలకు నిషేధిత ప్రాంతం అనేది లేకుండా చేయగలిగారు. ఆదివాసీ మహిళ ఈ రోజు స్వేచ్ఛగా తన భావాలను అభిప్రాయాలను చెప్పుతున్నది. గ్రామాలలోని మహిళా సంఘాలన్నీ, జనతన సర్కార్లలో, మిలీషియాలో నిర్మాణాత్మకంగా పని చేస్తున్నయి. రాజకీయ, ఆర్థిక, సామాజిక విషయాలపై అవగాహన పెంచుకున్నరు. వర్గ పోరాటంలో సాయుధంగా కదులుతున్నరు. నూతన ప్రజాస్వామిక రాజకీయ చైతన్యంతోపాటు, గెరిల్లా యుద్ధంలో సైనికులుగా, నాయకురాళ్లుగా మహిళలు ఎదిగారు.

మహిళా సర్పంచులు, మండలాధ్యక్షుల్ని భర్తలు భార్యల్ని డమ్మీల్ని చేసి ఆ పదవులకు చెందిన కుర్చీలో తామే కూర్చుని వ్యవహారాలు నడిపిస్తున్న స్థితిలో ఉన్న దండకారణ్యేతర సమాజంతో పోలిస్తే దండకారణ్య మహిళా ఉద్యమం, అక్కడి జనతన సర్కార్లు, స్త్రీ పురుష సమానత్వ సాధన, స్త్రీల సాధికారత దిశగా గొప్ప ముందడుగు. అద్భుత ఆచరణాత్మక విజయం. అనుసరణీయం ఆదర్శ నమూనా.

అందుకే భారతదేశంలో అనేకానేక ధోరణులు చెందిన మహిళా సంఘాలున్నాయి. రాజీకీయ పార్టీల అనుబంధ మహిళా సంఘాలు, విదేశీ నిధులు, దేశీయ నిధులతో నడిచే మహిళా సంస్థలు వందలు, వేలు ఉన్నాయి. సంఘటనలు జరగ్గానే తక్షణ స్పందనలు అలజడులు, ఆందోళనలు, ప్రచార సాధనాలు హడావుడి, ఎవరి దారి వారిదే. ఎవరి గోల వారిదే. సమన్వయం, సంఘటిత కొనసాగింపు లేదు. కానీ దండకారణ్యంలో ఆదివాసీ మహిళలు రాజ్యం పై పితృస్వామ్యం పై ఏక కాలంతో జమిలిగా పోరాడుతున్నారు. దండకారణ్య క్రాంతికారీ ఆదివాసి మహిళా సంఘటన నేతృత్వంలో రాజ్యం పై పితృస్వామ్యం పై పోరాడుతూ జనతన సర్కార్ నిర్వహణలో పాల్గొంటూ సమ సమాజ నిర్మాణంలో తమ వంతు బాధ్యత నెరవేరుస్తున్నారు. అందుకే భారతదేశంలో మహిళా సంఘాలున్నాయి. దండకారణ్యంలో మహిళా ఉద్యమం ఉంది.

తెలుగు నేలపై ప్రస్తుత మహిళా సంఘాలు ఎట్లా ఉన్నాయి?
అసలు ఈ రోజుల్లో స్త్రీల సమస్యల గురించి మాట్లాడని వాళ్లు లేరంటే ఆశ్చర్యం కాదు. అయితే స్త్రీల సమస్యల గురించి మాట్లాడే వాళ్లందరి ఆలోచనా విధానాలు, దృక్పథాలు, సైద్ధాంతిక అవగాహన ఒకటి కాదు. పని విధానాలు వేరయినంత మాత్రాన తప్పు పట్టవలసిన అవసరం లేదు. కానీ ఆర్థిక, రాజకీయ తదితర స్వప్రయోజనాల కోసం అంటే ఓట్ల రాజకీయాల వాళ్లయితే ఓట్ల కోసం, స్వచ్ఛంద సంస్థల వాళ్లయితే దేశ, విదేశీ నిధుల కోసం స్త్రీల సమస్యలపై మాట్లాడటం, పనిచేయడం పట్ల స్త్రీ విముక్తి లక్ష్యంగా పనిచేసే మహిళా ఉద్యమకారులు, మహిళా సంఘాలు అప్రమత్తంగా ఉండాల్సి వుంది.

స్త్రీ విముక్తికి పరిష్కార మార్గం?
మహిళా ఉద్యమాలు పితృస్వామ్యంపై పోరాడుతూనే సమసమాజ నిర్మాణం కోసం కూడా కృషి చేయాలె. ప్రస్తుత వ్యవస్థ వర్గ, కుల, మత, పితృస్వామ్య సమాజం. మహిళా ఉద్యమాలు తన పోరాటాన్ని దీనిపై కేంద్రీకరించాల్సి వుంది. సంఘటిత పోరాటాలే విముక్తి మార్గం.

మీ గమనం-ఘర్షణ- గమ్యం ఏమిటి?
నేను చిన్నప్పట్నించీ స్త్రీవాదినే. అంతటితో ఆగిపోలేదు. స్త్రీవాదం నా వ్యక్తి చైతన్యమైతే, మార్క్సిజం (గతితార్కిక చారిత్రక భౌతికవాదం) నా ప్రాపంచిక దృక్పథం. గతితార్కిక భౌతికవాదం నిబద్ధతకు ఆస్కారమిచ్చింది. నేను విప్లవ రచయితల సంఘంలో ఉన్నాను. కనుక విప్లవ రచయితల సంఘం ప్రణాళిక, మార్క్సిజం- లెనినిజం- మావోయిజం నా నిబద్ధత. ఈ నిబద్ధతే నా కార్యాచరణ. నా కార్యచరణే నా కవిత్వం, ఇతర సాహితీ ప్రక్రియలు, వ్యక్తీకరణలు.

ముకుందాపురం, నల్లగొండ జిల్లా. క‌వి, రచయిత, ప‌రిశోధ‌కుడు. ఇండిపెండెంట్ జర్నలిస్ట్. సాక్షి దిన‌ప‌త్రిక‌లో ఎనిమిదేళ్లు జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేశాడు. 'ఓయూ సాహిత్య వేదిక' వ్య‌వ‌స్థాప‌క స‌భ్యుడు, మొదటి కన్వీనర్. ఉస్మానియా యూనివ‌ర్సిటీ నుంచి 'విప్ల‌వ క‌విత్వంలో వ‌స్తురూప వైవిధ్యం'పై ప‌రిశోధ‌న (పిఎచ్. డి.) చేశాడు. రచనలు : 1. తూర్పార, 2. ఏరువాక (సాహిత్య విమర్శ). 'కొలిమి' వెబ్ మేగజీన్ ఎడిటోరియల్ లో పనిచేస్తున్నాడు.

Leave a Reply