రగులుతున్న ‘ఈశాన్యం’

పూర్వం రాజుల కాలంలో రాజ్యాల మధ్య యుద్ధాలు జరిగేవి. ఆధునిక కాలంలో దేశాల మధ్య సరిహద్దు వివాదాలు, యుద్ధాలు మనం చూస్తూనే ఉన్నాం. కానీ, ఒకే దేశంలో రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం సాయుధ ఘర్షణగా రూపొందండం, ఇరు రాష్ట్రాల పోలీసు బలగాలు రంగంలోకి దిగి, ఒకరి పై ఒకరు తుపాకులు పేల్చుకోవడం, ఆ దొమ్మీ లో కొందరు పోలీసులు తూటాలకు బలి కావడం ఎప్పుడయినా కన్నామా? విన్నామా? ఇది వింతగా అనినిపించినా, ఇలాంటి సంఘటన జరిగింది. ఈ సంవత్సరం (2021) జులై నెల26 వ తారీఖు నాడు భారత దేశం లోని రెండు రాష్ట్రాలయిన అస్సోమ్, మిజోరాంల మధ్య సరిహద్దు వివాదం చిలికి చిలికి గాలి వానై రెండు రాష్ట్రాలకు చెందిన భద్రతా దళాలు కాల్పులు జరుపుకొని, అసోంకు చెందిన ఆరుగురు పోలీసుల, ఒక పౌరుని మృతి కి కారణమయ్యారు.

మరీ ఆశ్చర్యకరమయిన విషయమేమిటంటే కేంద్రంలో బి జె పి ప్రభుత్వం రాజ్యమేలుతోంది. అసోంలో బిజెపి ప్రభుత్వం కొలువుతీరి ఉంది. మిజోరాంలో బిజెపి మిత్ర పక్షం మిజో నేషనల్ ఫ్రంట్ అధికారంలో ఉంది. ఈశాన్య రాష్ట్రాలన్నీ వాటి అభివృద్ధి కోసం పరస్పరం సహకరించుకోవాలని సంకల్పం చెప్పుకొని అందరు ముఖ్యమంత్రులతో “నెడా”(నార్త్ ఈస్ట్ డెమొక్రటిక్ అలయన్స్) అన్న సంఘటన ను ఏర్పాటు చేసుకున్నారు. దానికి సంధాన కర్త, చైర్మన్ అసోం ముఖ్యమంత్రి, బిజెపి నేత హిమంత బిశ్వ శర్మ. అందరు ఒక గూటి పక్షులే. ఒక తాను గుడ్డలే. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఇద్దరు ముఖ్యమంత్రులను పిలిచి అడపా దడపా మాట్లాడుతూనే ఉన్నాడు. వారి భేటీ లో ఏం మాట్లాడుతున్నారో తెలియదు, బయటికి మాత్రం మేం సామరస్యం గా సరిహద్దు సమస్య పరిష్కరించుకుంటాం అని చెపుతున్నారు. అలా చెప్పిన రెండు రోజులకే ఈ కాల్పులు జరిగాయి. ఆరుగురు పోలీసులు, ఒక పౌరుడు మరణించారు. అసోం కు చెందిన ఒక జిల్లా పోలీసు సూపరింటెండెంట్ తో సహా 60 మంది ప్రజలు తీవ్ర గాయాల పాలయ్యారు. మా వైపు నుండి ఏ ప్రేరణ లేకుండా, నిష్కారణంగా ఏకపక్షంగా మిజోరాం వైపు నుండి కాల్పులు జరిగాయని, ఆ కాల్పులలో మా జవాన్లు అసువులు బాశారని అసోం ముఖ్యమంత్రి మిజోరాం ను నిందించగా, అది అబద్దమని మొదట అసోం పోలీసులే కాల్పులకు తెగబడ్డారని, మేం ఎదురు దాడి మాత్రమే చేశామని మిజోరాం ముఖ్యమంత్రి జోరం తరంగ్ ప్రకటించాడు. ఈ ప్రకటనలు చూస్తే, అచ్చం భారత్ పాకిస్తాన్ దేశాలు లేదా భారత్ చైనా లు పరస్పర ఆరోపణలు చేసుకున్నట్టుగా లేదూ! ఇద్దరు ముఖ్యమంత్రులు చిత్రమయిన రీతిలో ఒకరి పై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు.”కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ముందు మౌనంగా తలూపి, సామరస్యంగా ఉంటామని ఒప్పుకొని తిరిగి వచ్చిన అసోం ముఖ్యమంత్రి రెండు కంపినీల పోలీసులను, వారి తో పాటు కొంతమంది పౌరులను మా భూభాగం లో ఉన్న ‘వేరెంగటీ’ అన్న గ్రామం పైకి పంపి లాఠీ ఛార్జ్, బాష్ప వాయు ప్రయోగం చేశా”రని మిజోరాం ముఖ్యమంత్రి ప్రకటన చేస్తే,”అసోం పోలీసులు వెంటనే వెనక్కి వెళ్లిపోవాలని, లేకుంటే మా ప్రజలు శాంతించర”ని, హింస ఆగదని కోలాసిబ్ (మిజోరాం లోని ఒక సరిహద్దు గ్రామం) జిల్లా పోలీసు సూపరింటెండెంట్ మాకు వర్తమానం పంపించాడని, ఇదేమి పరిపాలన, ఇట్లా అయితే మేమెట్లా పరిపాలించేది అని అసోం ముఖ్యమంత్రి ఎదురు ప్రకటన చేస్తాడు.

అయితే, న్యూ ఢిల్లీ లోని సెంటర్ ఫర్ లాండ్ వార్ ఫెర్ స్టడీస్ సంస్థ లో రీసర్చ్ అసిస్టెంట్ గా పని చేస్తున్న జాసన్ వాహ్ లాంగ్ క్షేత్రస్థాయి అధ్యయనం ద్వారా వెల్లడి చేసిన వివరాల ప్రకారం మిజోరాం భూభాగం లో ‘మిజో పవర్ డిపార్ట్మెంట్’ కు చెందిన వారు ఒక గ్రామస్తునితో కలిసి తమ శాఖ కు సంబంధించిన పని చేసుకుంటూ ఉండగా కొంతమంది “గుర్తు తెలియని” వ్యక్తులు వారిపై దాడి చేసి గాయపరిచారు. దానికి ప్రతీకారంగా గ్రామస్తులు మిజోరాం పోలీసు భద్రతా దళ సిబ్బంది తో కలిసి సరిహద్దు వద్ద ఉన్న అసోం పోలీసులపై కాల్పులు జరిపారు. ఆ దాడి లో తుపాకులు, చేతి బాంబులు, బాష్ప వాయువు యథేచ్ఛగా ప్రయోగించారు. ఆ మరునాడే అస్సాం ముఖ్యమంత్రి 4000 మంది పోలీసు కమెండో లను మిజోరాం అస్సాంల సరిహద్దు గుండా మోహరించి మిజోరాం లోకి ప్రయాణాలు మానుకోవాలని తన ప్రజలను హెచ్చరించాడు. అటు వైపు నుండి మిజోరాం పోలీసులు అసోం ముఖ్యమంత్రి పైన ‘హత్యా యత్నం’ నేరం మోపుతూ కేసు నమోదు చేశారు. ఆ కేసు లో నలుగురు పోలీసు ఉన్నతాధికారుల పేర్లను కూడా చేర్చారు. అస్సామ్ వాళ్ళూ ఊర్కోలేదు. మిజోరాం రాష్ట్రానికి చెందిన ఒక పార్లమెంట్ సభ్యునిమీద, ఆరుగురు పోలీసు అధికారుల మీదా “బెదిరింపు ప్రకటనలు” చేసి అస్సామ్ ప్రజానీకం లో అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.
అస్సామ్ దక్షిణ ప్రాంతం లోని బారక్ వ్యాలీ లో స్థానికులు మిజోరాం వైపు వెళ్లే దారులను నిరవధికంగా దిగ్బంధం చేస్తున్నామని ప్రకటించి కోవిడ్ నిర్ధారణ కిట్స్ తో సహా అన్ని నిత్యావసర వస్తువుల సరఫరాను అడ్డు కుంటు న్నారు. మిజోరాం లోని ముఖ్యమయిన కేంద్రం బైరబి కి ఉన్న ఒకే ఒక్క రైల్వే లైన్ ను ధ్వంసం చేసారు అస్సాం లోని ఆందోళనకారులు.”రోడ్డు దిగ్బంధం, రైల్వే లైన్ ధ్వంసం కావడం మూలాన రాబోయే రోజుల్లో నిత్యావసర వస్తువులు, జీవనం గడవడానికి అంతగా అవసరం లేని వస్తువులకు కూడా తీవ్రమయిన కొరత ఏర్పడవచ్చు. వినియోగాన్ని కొంత తగ్గిస్తే, మన దగ్గర ఉన్న వస్తువులు కొన్ని ఎక్కువ రోజులు మనం వినియోగించుకోవచ్చు . అందుచేత, ప్రజలు అన్ని వస్తువులను పరిమితంగా వాడుకోవాలని, దాచి పెట్టుకోకూడదని” మిజోరాం ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసేంతవరకు సమస్య సాగదీయబడింది. తదనంతర పరిణామాలలో ఇరు ప్రభుత్వాల ప్రతినిధులు ప్రాథమికంగా చర్చలు జరిపి పోలీసు కేసు లన్నింటినీ ఉపసంహరించుకోవాలని నిర్ణయించారు. అలాగే శాశ్వత పరిష్కారం లభించేంతవరకు వివాదాస్పదం గా ఉన్న సరిహద్దు రేఖల నుండి నాలుగు కిలోమీటర్ల దూరం వరకు పోలీసు బలగాలను ఉపసంహరించుకోవాలని కూడా నిర్ణయించారు. కానీ దారుల దిగ్బంధం గురించి, నిత్యావసర వస్తువుల సరఫరా పునరుద్ధరణ గురించి సానుకూలమయిన నిర్ణయం తీసుకొనలేకపోయారు.

ఈ వివాదానికి తక్షణ కారణం ఏదయినా కావచ్చు. కాని, అసలు విషయం ఏమిటంటే, ప్రకృతి వనరులు పుష్కలంగా లభిస్తున్న ప్రాంతం అది. ప్రకృతి వనరులపై ఎవరి ఆధిపత్యం ఉండాలన్నదే తగాదా రాజుకోవడానికి మూలా కారణమని చెప్పవచ్చు. సారవంతమయిన భూమి, పంటలకు మాత్రమే కాదు ఖనిజ సంపద కూడా మెండు గా ఉన్న భూమి. ఆ ప్రాంతపు భూమి, కొండలు వ్యాపారానికి వ్యక్తుల, రాష్ట్రాల ఆర్ధిక ప్రయోజనాలకు అనువయిన వనరులు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చేసిన ప్రకటన లో కూడా ఆ సూచన స్పష్టం గానే ఉంది. ఆయన మాటల్లోనే “వివాదమంతా రక్షిత అటవీ ప్రాంతం గురించే కాని, భూమి గురించో, మైదాన ప్రాంతం గురించో కాదు”.

రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు తగాదాకు 100-150 సంవత్సరాల నేపథ్యం ఉంది. దీని మూలాలు బ్రిటిష్ వలస పాలనలో ఉన్నాయి. ఆ కాలం లో ఈశాన్య ప్రాంతం గా అస్సాం, అప్పటి సంస్థానాలు మణిపూర్, త్రిపుర లు ఉండేవి. 1947 లో దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అస్సాంను విభజించి నాగాలాండ్, మేఘాలయ, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలను ఏర్పాటు చేశారు. మిజోరాం కు 1987లో ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తి సిద్దించింది. అస్సాం, మిజోరాం రాష్ట్రాల మధ్య 165 కిలో మీటర్ ల సరిహద్దు, అస్సాం, నాగాలాండ్ మధ్య 500 కి. మీ. ల సరిహద్దు, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ మధ్య 800 కి. మీ.ల సరిహద్దు, అస్సాం, మేఘాలయ మధ్య 884 కి. మీ. ల సరిహద్దు ఉంటుంది. ఈశాన్య రాష్ట్రాల మధ్య సరిహద్దు తగాదాలు తీవ్రస్థాయిలో ఉన్నాయని చరిత్ర చెపుతోంది. అస్సాం ముఖ్యమంత్రి, బి జె పి కి ఆ ప్రాంతంలో ముఖ్య నాయకుడు అయిన హిమంత్ బిశ్వాస్ శర్మ ఈశాన్య రాష్ట్రాలలో తన ప్రాబల్యం ప్రదర్శించడానికి, తన ఆధిపత్యం నిలుపుకోవడానికి ఒక పక్కా వ్యూహంతో దుందుడుకు చర్యలతో అస్సామ్ మిజోరాం మధ్య సాయుధ ఘర్షణకు కారకుడయ్యాడు అని కొన్ని పత్రికలు విశ్లేషించాయి. ఈ విశ్లేషణ వాస్తవాలకు వ్యక్తీకరణ కూడా కావచ్చు. చెప్పలేం.

అస్సాం, మిజోరాం రాష్ట్రాలు రెండూ బంగ్లాదేశ్ సరిహద్దు ల్లో ఉంటాయి. అస్సాం, మిజోరాం మధ్య సరిహద్దు వివాదం 1875 లో బ్రిటిష్ పాలకులు కచార్ మైదానాల నుండి లుషాయి కొండ ప్రాంతాలను విడదీయడంతో ప్రారంభమయ్యింది. ఇప్పుడు కచార్ ప్రాంతము అస్సాంలో ఉన్నది. లుషాయి కొండలు కొన్ని మిజోరాంలో మరికొన్ని మణిపూర్ లో ఉన్నాయి. బ్రిటిష్ వారి కాలం లో మిజోరాంను లుషాయి కొండలు అనే పిలిచే వారు. ఆ కాలం లో లుషాయి కొండలు అస్సామ్ లో ఒక జిల్లా. అదే బ్రిటిష్ ప్రభుత్వం 1933 లో భాషలను, తెగలను ప్రాతిపదిక గా చేసుకొని మరొక సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో మణిపూర్ ను లుషాయి కొండల నుండి వేరు చేసింది. 1933 సర్వే చేసేటప్పుడు మిజోల పౌరసమాజాన్ని ఎవరూ సంప్రదించలేదని, మా అభ్యంతరాలను పరిగణన లోకి తీసుకోలేదని, అది మాకు సమ్మతం కాదని, 1875 సర్వేనే మాకు అంగీకారమని మిజోరాం, కాదు కూడదు 1933 లో చేసిన బ్రిటిష్ అధికార ప్రకటనే సరి అయినదని అస్సామ్ వాదిస్తున్నాయి. భూమి, కొండ ప్రాంతాలు మావంటే మావఁని ప్రజలు ఘర్షణకు దిగడం చాలా కాలం నుండి జరుగుతూ వస్తున్నది. ఆ ఘర్షణలు ఈ మధ్య కాలంలో అంటే బి జె పి ప్రభుత్వం అధికారం లోకి వచ్చినప్పట్నుంచి పతాక స్థాయికి చేరుకున్నాయి. 509 చదరపు మైళ్ళ పరిధి లో విస్తరించి ఉన్న రక్షిత అటవీ ప్రాంతం తమదని మిజోరాం వాదిస్తూ ఉండగా, మిజోరాం అక్రమంగా తమదని వాదిస్తున్నదని దానికి తాము సరేమిరా అంగీకరించమని అస్సాం చెపుతున్నది. ఆ అడవుల్లో ఎవరూ నివాసం ఏర్పాటు చేసుకోవడానికి వీలు లేదు. కాని కొన్ని సంవత్సరాలనుండి ప్రజలు అక్కడ నివసిస్తూనే ఉన్నారు. పనులు చేసుకుంటూనే ఉన్నారు. ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. మిజోలు తాము భారతీయులమని అనుకోవడమే లేదని అస్సాం పౌరులు ఫిర్యాదు చేస్తారు. మా తాత ముత్తాతల నుండి అంటే 100, 150 సంవత్సరాలనుండి ఈ భూమి ని మేము సాగు చేస్తున్నామని, ఇప్పుడు మమ్మల్ని ఆక్రమణదారులని, భూమి ని ఆక్రమించారని అనడం అన్యాయమని మిజో ల వాదన. బంగ్లాదేశీ శరణార్థులతోనే అసలు సమస్య అని మరికొందరి ఉవాచ. కాలక్రమంలో అసోం, మిజోరాం ప్రభుత్వాలు చర్చల పర్యవసానంగా “ఎవరికీ చందని భూభాగం” గా వివాదాస్పదమయిన ప్రాంతాన్ని గుర్తించి యధాపూర్వస్థితి కొనసాగించాలని నిర్ణయించాయి. కాని ఆ ఒప్పందం చాలా సార్లు ఉల్లంఘన కే గురవుతున్నది.

1875లో సర్వే చేసినా, 1933 లో అధికారిక విభజన జరిగినా, అవి సామ్రాజ్యవాదుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చేసిన అంచనాలే నన్నసంగతి మరువరాదు. ఆ తదుపరి ప్రజలు అప్పుడు ఉనికిలో ఉన్న భౌగోళిక పరిస్థితి కి అనుకూలంగా తమ ఉపాధిని వెతుక్కున్నారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదులు భారత దేశ పరిపాలనా రంగం లో నిలదొక్కుకుంటున్న సందర్భం లో అస్సాం రాష్ట్ర సరిహద్దుల కావల చమురు, టీ, రబ్బర్, బొగ్గు నిక్షేపాలు బయటపడ్డాయి. ఆ నిక్షేపాలను తమ ఆర్ధిక ప్రయోజనాలకు అనుకూలంగా మలుచుకోవటానికి వీలుగా బ్రిటిష్ సామ్రాజ్యవాదులు చట్టాలు, సరిహద్దు విభజన చేసుకున్నారు. ఆ నిక్షేపాలను వెలికితీయడం లో భాగంగా ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. ఉపాధిని వెతుక్కుంటూ ప్రజలు పలు ప్రాంతాల నుండి వలస వచ్చారు. అక్కడే స్థిరపడి పోయిన వారు ఉన్నారు. సరిహద్దు కావల అప్పటి తూర్పు బెంగాల్ నుండి వచ్చినవారు ఉన్నారు. ఈనాటి బంగ్లాదేశ్ నుండీ పొట్ట పోషించుకోవటం కోసం వస్తూ ఉండవచ్చు. అక్కడ స్థిరపడ్డ వాళ్ళు ఇళ్ళు కట్టుకుంటారు, పొలాలను తమ పేరున రిజిస్టర్ చేసుకుంటారు. వ్యాపారాలు చేసుకుంటారు. కాంట్రాక్టులు చేపడతారు. ఈ చారిత్రిక నేపథ్యాన్ని అర్థం చేసుకోకుండా వారందరు దురాక్రమణ దారులు, ఆక్రమణదారులు, బంగ్లాదేశ్ ముస్లింలు – వారికిక్కడ స్థానం లేదని వాదిస్తే ఎట్లా?

విభిన్న జాతుల, విభిన్న మతాల, విభిన్న భాషల, విభిన్న సంస్కృతుల విచిత్రమయిన కూడలి ఈశాన్య రాష్ట్రాలు. జాతుల అస్తిత్వాన్ని సమగ్రంగా అవగాహన చేసుకోకుండా, ఆ యా జాతుల సంస్కృతులను గౌరవించకుండా వ్యవహరిస్తే ఈ సరిహద్దు సమస్య కూడా అపరిష్కృతంగానే మిగిలిపోతుంది అన్నది సరి అయిన ఆలోచన. మెజారిటీ మతం మైనారిటీ జాతులమీద, సంస్కృతులమీద అణిచివేత చర్యలు చేపట్టడం అగ్నికి ఆజ్యం పోసిందనే చెప్ప వచ్చు. ముస్లిం మతస్తులు, ముఖ్యంగా బంగ్లాదేశ్ నుండి వలస వచ్చిన వారు పెద్ద సంఖ్యలోనే ఈశాన్య రాష్ట్రాలలో నివాసం ఉన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పౌరసత్వ సవరణ చట్టాన్ని అసోం ప్రభుత్వం సంపూర్ణంగా సమర్థించింది. అధిక సంఖ్యలో ఉన్న క్రిష్టియన్ మతస్తులను ఇబ్బంది పెట్టె రీతిలో గోవధ నిషేధ చట్టాన్ని కేంద్రం ఆమోదించింది. దానిని బిజెపి, దాని అనుకూల ఈశాన్య రాష్ట్రాలలో ఉన్న ప్రభుత్వాలు సమర్థించాయి. జాతి ఆధిక్యతను మరొక జాతి మీద ప్రదర్శిస్తే కాలక్రమంలో ఫలితాలు వికటిస్తాయి కానీ సమస్య పరిష్కారానికి సానుకూల వాతావరణం ఏర్పడదు అన్న సంగతి పాలకులు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. మిజోరాం తో తలెత్తిన సమస్య పరిష్కారానికి చర్చలు, సంప్రదింపుల మార్గం కాకుండా సుప్రీం కోర్టు తలుపు తడతానంటున్నాడు అస్సాం ముఖ్యమంత్రి. న్యాయ వ్యవస్థ జోక్యం అన్ని వేళలా అవసరం ఉండకపోవచ్చు. చాలా సందర్భాలలో అది సమస్య అపరిష్కృతంగా మరి కొంత కాలం కొనసాగటానికి తోడ్పడుతుంది కాని, సత్వర పరిష్కారానికి బాటలు వెయ్యదు. అరుణాచల్ ప్రదేశ్ తో అస్సాం కు వివాదం గురించి 1989 లో సుప్రీం కోర్టు లో వ్యాజ్యం దాఖలు చేస్తే అది ఇంకా విచారణ దశలోనే ఉండడం గమనార్హం.

బంగ్లాదేశ్, భూటాన్, మైనమార్, టిబెట్ భారత దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించే ఓ ఇరుకయిన ప్రాంతం ఇప్పుడు సరిహద్దు సమస్యలతో సతమతమవుతూ వున్నది. దేశంలోని ఇతర ప్రాంతాలతో ఈశాన్య రాష్ట్రాలను కలిపే మార్గం ‘సిలిగురి కారిడార్’. ఆ సిలిగురి కారిడార్ చైనా కు సమీపంలో ఉన్న దృష్ట్యా భారత దేశం ప్రత్యేక శ్రద్ద తీసుకొని ఈశాన్య రాష్ట్రాల సరిహద్దు సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది.

ఈ ఏడు దశాబ్దాలుగా సరిహద్దు సమస్య ముదిరి పోయి అపరిష్కృతంగా ఉండడానికి, ఈశాన్య రాష్ట్రాల ప్రయోజనాలు కూడా కారణం. సరిహద్దులు తమవి కాకుండా పోతున్నందు వల్ల ఆ యా రాష్ట్రాలు కోల్పోయే ఆదాయ వనరుల గురించి ఆ ప్రభుత్వాలు సహజంగానే ఆలోచిస్తాయి. కాని రాష్ట్ర ప్రభత్వాల ప్రయోజనాలు కాకుండా ప్రజా ప్రయోజనాలు కేంద్రం గా ప్రయత్నాలు కొనసాగాలి. దానితో పాటు స్థానిక ప్రజల చారిత్రిక, సాంస్కృతిక, సాంప్రదాయ హక్కులకు భంగం కలగకుండా పరిష్కారం ఆలోచించాలి. రాజకీయ ఆధిపత్యం సుస్థిర పరచుకోవాలన్న ఆలోచనా ధోరణి ని బి జె పి మార్చుకొని అస్సామ్ మిజోరాం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కోసం మార్గాలు వెతకాలి. ఆ ధోరణి ని మార్చుకుంటుందా అన్నది అసలయిన ప్రశ్న.

రచయిత, రిటైర్డ్ ప్రిన్సిపల్. ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్న కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘ ప్రధాన కార్యదర్శిగా, ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్ సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. రచనలు: విధ్యంసక అభివృద్ధి (అనువాదం) తొలి తెలగాణం, భూంకాల్ తిరుగుబాటు (అనువాదం) షోయబుల్లా ఖాన్, Song of Furrows (Translation) River- the Song of Tomorrow (Tr) Father! Grow up Like Me! (Trans.) వీక్షణం పత్రిక సంపాదక వర్గ సభ్యుడు. పాలమూరు పత్రిక సంపాదకుడు (ప్రచురణ ఆగిపోయింది). ప్రస్తుతం తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి కో- చైర్మన్

6 thoughts on “రగులుతున్న ‘ఈశాన్యం’

 1. రాజేంద్ర బాబు గారు రాసిన రగులుతున్న ఈ శాన్యం వ్యాసం చాలా సుభోదాత్మకంగా ఉంది. రచనా విధానం , presentation
  చక్కగా ఉన్నాయి. బాబు గార్కి అభినందనలు.
  బి ఎస్ రాజు

 2. రగులుతున్న ఈశాన్యం వ్యాసం బాగుంది.జాతుల మీద ఆధిపత్య భావజాలం ఎలా పనిచేస్తుందో చక్కగా వివరించిన రాజేంద్రబాబుగారికి అభినందనలు.
  జాతిసమస్యమీద నిష్పక్షపాతంగా ఆలోచించేవారు విధిగా చదవాల్సినవ్యాసం

 3. రాజేంద్ర బాబు గారి రగులుతున్న ఈశాన్యం వ్యాసం ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాల మధ్య రగులుతున్న సరిహద్దు సమస్య తీవ్రతకు అద్దం పట్టింది. రచయితకు అభినందనలు🌹🙏

 4. విశ్లేషణ బాగుంది. కాకపోతే బ్రిటీష్ వారి కాలం నుండి వున్న సమస్యను ఆరు దశాబ్దాలకు పైగా పాలించిన కాంగ్రెస్ పార్టీ పరిష్కరించకుండ వున్న విషయాన్ని కూడా చెబితే మంచిగుండేది. ఒక్క బిజెపి ని అనడం కరెక్ట్ కాదు.

 5. దేశం లోని అన్ని రాజకీయ పార్టీలు కొంత కాలం నుంచి చెప్పుకోదగ్గ కాలం పాలనలో ఉన్నాయి. జనతా పార్టీ కాలం నుండి పాలక ఐక్య వేదిక లే పాలిస్తున్నాయి. ప్రాంతీయ పార్టీ లకి ఈ ఏలుబడిలో స్థానం వుంది. ఏ రాజకీయ పార్టీ కూడా ప్రజల ప్రజా స్వామిక స్వేచ్ఛను హక్కులను గుర్తించి పాలించటం లేదు. ఈశాన్య రాష్ట్రాలు అక్కడి ప్రజల ఆకాంక్షలు, పరిస్థితులు ఏ పార్టీ కి అర్థం కాలేదు. రాష్ట్రాల పాలనాధికారాల విషయంలో వలస పాలకుల ఆధిపత్య విధానాలు ముదిరాయి. ఒకరి మీద మరొకరు పై చేయిగా ఈ ముదుర్లు ఏలుతున్నారు. పార్టీల అభిమాన ఆలోచనలు ప్రజా వ్యతిరేక ఆలోచనలుగా తేలి పోతున్నాయి. ఈశాన్య రాష్ట్రాలు మౌలిక అభివృద్ధికి నోచుకోక దోపిడీ పీడనలకు గురవుతున్నాయి. ఈ విషయం రాజేంద్ర బాబు గారి వ్యాసంలో చదువుకో గలుగుతాము.

Leave a Reply