యోధా!

ఓటమి అంటే
విజయానికి ఎంతో కొంత కాలం ముందుగా
కసుక్కున కాలిలో ముల్లులా దిగే, కళ్లల్లో గాలి విసిరే దుమ్ములాంటి అనుభవమే కదా
గెలుపు అంటే
ఓటములు చేసిన గాయాలకు మందు రాసి
రేపటి కోసం ఇంత నమ్మకాన్ని, ఊపిరిని సంపాదించి పెట్టుకోవడం కదా
రెంటినీ గుండెల్నిండా స్వీకరించిన వాడివి

మారడోనా!
మైదానంలో నీ ప్రతి విజయం వెనుక
జీవితం నిన్ను మోకాలి కింద తొక్కిపెట్టిన పరాభవం వుండే వుంటుంది
దేశం జెండాని నీ గుండెలకి హత్తుకొని ముద్దాడి
గాలిలో సగర్వంగా ఊపటానికి ముందుగా
కళ్లల్లో నీళ్లని ఉగ్గబట్టుకొని నీ నేల మొత్తం
ఆ క్షణం కోసమే ఎదురు చూసే వుంటుంది
యుద్ధాలు ఫిరంగి గొట్టాల్లోనే కాదు
నీ కాళ్ల మధ్య భూగోళంలా ఒదిగిపోయిన
బంతిలో కూడా వుంటుందని తెలియ చెప్పినవాడివి
శరీరంలో ప్రతి రక్తకణాన్ని
నీ కాలి పిక్కల్లోకి తీసుకొని
మైదానాల మీద గెలుపు కోసం యుద్ధం చేసినవాడివి
బతుకు తుఫాన్ హోరుగాలుల మధ్య
మనుగడ కోసం పరిగెత్తిన వాడివి కదా
నీ పరుగులో ఫిరంగులు పేలిన చప్పుడు వినిపించేది
పెళపెళమంటూ విరుచుకుపడే నీ కాళ్ల విన్యాసాలకు
అభిమానులు కొమ్ముబూరల శబ్దాలతో
చేసుకున్న సంబరాలేనా విన్నది నువ్వు?
బొలీవియా అడవుల్లో కార్చిచ్చై రేగిన జ్వాల
చేగువేరాని ప్రేమారా భుజం మీద ముద్రించుకున్నవాడివి
బటిస్ట కోట గోడల్ని బద్దలు కొట్టిన కాస్ట్రోని
కాలి మీద పచ్చబొట్టుగా గుర్తు పెట్టుకున్న వాడివి
రెడ్ ఇండియన్ డప్పు కొట్టిన లయతో సమానంగా బంతిని డ్రిబ్లింగ్ చేస్తూ
శతృదేశం గోల్ పోస్ట్ లోకి చొరబడ్డవాడివి
దేశమంటే ప్రజలందరి సామూహిక ఆత్మ అని
అది ప్రత్యర్ధితో క్రీడైనా
శత్రువుతో యుద్ధమైనా ఒకటేనని నమ్మిన యోధుడివి
రవి అస్తమించని సామ్రాజ్యాల గుండెల్లోకి
మూడో ప్రపంచ కత్తులు దింపిన వాడివి
ప్రపంచ పోలిసుల మీద
తుపుక్కున ఉమ్మేసినవాడివి

పడి లేవటం
చచ్చి బతకటం
ఓడి గెలవటం
తెలిసిన మారడోనా!
ఈ ప్రపంచానికి
నువ్విప్పుడో గొప్ప యుద్ధ జ్ఞాపకం

"నెత్తురోడుతున్న పదచిత్రం", "కవిత్వంలో ఉన్నంతసేపూ...." అనే  రెండు కవితా సంపుటల వయసున్న కవి.  సామాజిక వ్యాఖ్యానం, యాత్రా కథనాల్లోనూ వేలు పెట్టే సాహసం చేస్తుంటాడు.

Leave a Reply