ప్రజా యుద్ధ వ్యాకరణం

ఒక ప్రజాతంత్ర వుద్యమం. యిద్దరు సాంస్కృతిక యోధులు. వొక ప్రజా యుద్ధ క్షేత్రం. యిద్దరు వ్యూహ కర్తలు. వొక రాజకీయ కార్యాచరణ. యిద్దరు పథ నిర్దేశకులు. యిద్దరూ కాలం కన్న బిడ్డలు. వుద్యమం నెత్తుటి పొత్తిళ్ళలో పుట్టిన సృజనాత్మక రచయిత వొకరు. ఆ వుద్యమాన్ని గుండెకు హత్తుకొని దుఃఖాగ్రహ గీతాల్ని ఆలపించిన కవి మరొకరు. వొకరు భూమి పుత్రుడు. మరొకరు కోట్లాది భూమిపుత్రులతో కలిసి నడిచినవాడు. యిద్దరూ భూమితో మాట్లాడి నేరం చేసినవారే. వాళ్ళు అల్లం రాజయ్య, పెండ్యాల వరవరరావు. నేలతల్లితో వారిరువురూ చేసిన సంభాషణని రికార్డు చేసిన ‘పర్స్పెక్టివ్స్’ రాజయ్య కథా నవలా సాహిత్య సర్వస్వాన్ని ఆరు సంపుటాలుగా ప్రచురిస్తే వాటికి సంపాదకులుగా వ్యవహరించిన వరవరరావు సుదీర్ఘమైన విస్తృతమైన ముందుమాటలు రాశారు. ఆ ముందుమాటలన్నిటినీ మరో గ్రంథరూపంలో మళ్ళీ పర్స్పెక్టివ్సే అందించడం విశేషం. తెలుగు సాహిత్య చరిత్రలో యిది అనితరం. అపూర్వం.

కల్లోల సామాజిక చలనాన్ని సాహిత్యంలో నమోదు చేసిన రాజయ్య రచనలూ వాటిపై వివి చేసిన రాజకీయ వ్యాఖ్యానం రెండూ విశిష్టమైనవే. సాహిత్యాన్ని సామాజిక సందర్భాలకు ముడివేయడంలో వివి కే చేతనైన వొక ప్రత్యేకమైన శైలి వుంది. వ్యక్తీకరణ పద్ధతి వుంది. నిశితమైన చూపు వుంది. రచనా సంవిధానం వుంది. రాజయ్య సాహిత్యాన్నీ దాని వెనక వున్న సామాజిక ఆర్థిక రాజకీయ నేపథ్యాన్నీ వ్యాఖ్యానించే సందర్భంలో వివి అనేక చారిత్రిక విశేషాల్నీ వివరాల్నీ పాఠకుల ముందు కుప్పబోస్తాడు. అయితే ఆయన కేవలం చరిత్ర మాత్రమే చెప్పడు. దాన్ని రాజకీయాలతో జోడిస్తాడు. చరిత్ర నిర్మాణానికి కారణమైన ఘర్షణనీ అందుకు దోహదం చేసిన శక్తుల్ని మూలాల్లోకి వెళ్లి పట్టుకుంటాడు. పొలిటికల్ హిస్టరీకి పొలిటికల్ ఎకానమీని అన్వయిస్తాడు. దాన్ని రచయితగా రాజయ్య, అతని వ్యాఖ్యాతగా తాను – యిద్దరూ నమ్మిన విప్లవ భావజాల అవగాహనతో, ఆచరణతో సమ్మిళితం చేస్తాడు. స్థానికాకంశాలను జాతీయ అంతర్జాతీయ సంఘటనలకు అనుసంధానం చేస్తాడు. తత్ క్షణ దీర్ఘకాలిక వుద్యమాల అవసరాలతో బేరీజు వేస్తాడు. చరిత్ర కడుపులో దాగున్న వర్తమానాన్ని వెలికితీస్తాడు. వర్తమానం గర్భంలో మొలకెత్తే బీజాల్ని భవిష్యత్తుకు అందిస్తాడు. సాహిత్యాన్ని మొత్తం మానవ ఆచరణలో భాగంగా విశ్లేషిస్తాడు. కాల్పనికతనూ వాస్తవికతనూ కలిపి కుట్టే సన్నటి దారప్పోగును పట్టుకుంటాడు. సున్నితమైన మానవ సంబంధాల్ని వున్నతీకరించడంలో సాహిత్యం నెరవేర్చాల్సిన పాత్రని నిర్వచిస్తాడు. అది అంతిమంగా అతని మాట కాదు, ప్రజల గుండె చప్పుడుకు ప్రతిధ్వనిగా రూపొందుతుంది. చివరికి అది వొక విప్లవ తాత్విక చింతనగా ఆవిష్కారమోతుంది.

రాజయ్య రచనలకే కాదు వివి రాసిన యే ముందుమాటల్లోనైనా యీ లక్షణం గోచరిస్తుంది. వొక వాచకాన్ని చదువుతున్నప్పుడు లేదా వ్యాఖ్యానిస్తున్నప్పుడు… వుద్యమాచరణలో గొప్ప నిబద్ధతతో మానవీయంగా పాలుపంచుకున్న ప్రజాసమూహాల, వ్యక్తుల జ్ఞాపకాలు వారి జీవిత విశేషాలు వారి ఆశయాలు వాటి సాధనలో పొందిన గెలుపు వోటములు వారు చేసిన త్యాగాలు అమరత్వాలు వారి బంధు మిత్రుల శోకాక్రందనలు క్రోధోద్రిక్త ప్రతిజ్ఞలు అందుకు కారణమైన రాజ్యం అణచివేత పద్ధతులు వాటిని నడిపించే దృశ్యాదృశ్య శక్తుల దోపిడీ విధానాలు ఆయన హృదయంలో వొక్కసారిగా ముప్పిరిగొంటాయి. అవన్నీ కలిగించిన వుద్వేగంలోంచి పుట్టిన సంశ్లిష్ట/సంక్లిష్ట వాక్యం ఆయన ప్రసంగాల్లోనూ ముందుమాటల్లోనూ సంస్మరణ వ్యాసాల్లోనూ కనిపిస్తుంది. యిది ఆయనకే సొంతమైన అసాధారణ లక్షణం. వొకేసారి అది కవిత్వ పరిమళం అద్దుకుంటుంది. రాజకీయ దృక్పథాన్ని స్పష్టం చేస్తుంది. ఉపన్యాస శైలిలో మిశ్ర మౌఖికతని సంతరించుకొని వివి వచనానికి వైశద్యంతో కూడిన విలక్షణతని సాధిస్తుంది. వొక వాచకాన్ని గతితార్కికంగా అధ్యయనం చేసే సాహిత్య విమర్శకు కొత్త పరికరాల్ని అందిస్తుంది. సాహిత్య విమర్శని కూడా వొక సామాజిక శాస్త్రంగా అభివృద్ధి పరచడంలో వివి నిర్మించిన పరికల్పన యిది.

రాజయ్య రచనల్ని విశ్లేషించడానికి వివి తాను స్వయంగా నిర్మించుకున్న యీ వినూత్న పద్ధతిలో నాగేటి చాళ్ళలో పోరుబాటలో పగిలిన పాదాలనుంచి కాలువ కట్టిన నెత్తురు, వూపిరాడని బొగ్గు గుట్టల్లో కార్మికుల కాయం చిందించిన చెమట, అడవితల్లి పురుటినొప్పుల్లో స్రవించిన వుమ్మనీరు కలిపి రంగరించి రాజయ్య రాసిన చారిత్రిక కథనాలకి వనరుగా వుండిన ఉత్తర తెలంగాణ, గోదావరిలోయ ప్రజాయుద్ధ పంథా వొక రాజకీయ తాత్విక భూమికని యెలా యేర్పరచిందో చెబుతూనే – పారిస్ కమ్యూన్, రష్యా అక్టోబర్ విప్లవం, చైనా లాంగ్ మార్చ్, కెన్యా మౌ మౌ ఉద్యమం, మూడో ప్రపంచదేశాలు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగాచేసే యుద్ధాల దగ్గర్నుంచి దేశీయంగా స్థానికంగా జరిగిన వెనకటి తెలంగాణ సాయుధ పోరాటం, నక్సల్బరీ వసంత మేఘ గర్జన, శ్రీకాకుళం గిరిజన రైతాంగ ఉద్యమాల మీదుగా జల్ జమీన్ జంగిల్ యిజ్జత్ నినాదంతో కార్పోరేట్లకు వ్యతిరేకంగా పోరాడుతున్న వర్తమాన దండకారణ్య ఆదివాసీల జనతన సర్కార్ వరకూ అనేక పీడిత ప్రజానీకం కన్న సోషలిస్టు స్వప్నాల్నీ, అవి సాకారం కావడానికి అనేక ప్రజా సమూహాలు చేసిన అమోఘ సాహసాలనీ త్యాగాలనీ వొక సామాజిక శాస్త్రవేత్తగా విశ్లేషిస్తాడు. ప్రపంచవ్యాప్తంగా పీడనకు వ్యతిరేకంగా ప్రజలు రచించిన యుద్ధ వ్యూహాల్ని, పోరాట రూపాల్ని యీ నేలకు సైద్ధాంతికంగా అన్వయిస్తాడు. వొక్కమాటలో చెప్పాలంటే రాజయ్య రచనల విశ్లేషణ పేరుతొ వరవరరావు సూత్రీకరిస్తున్న ప్రజా యుద్ధ వ్యాకరణం యిది.

ఆదిలాబాద్ నుంచి అబుజ్ మాడ్ వరకు నల్లగొండ నుంచి నందిగ్రాం వరకు గత – వర్తమానాల్లో విరుద్ధ భావజాల సంఘర్షణలో ఆచరణలో చోటుచేసుకున్న అనేక సంఘటనల్ని సాహిత్యానికి అన్వయిస్తూ రాసిన ముందుమాటలివి. జగిత్యాల జైత్రయాత్రలో కదం తొక్కిన రైతు కూలీల మట్టిపాదాల అడుగుల సవ్వడి, సింగరేణి గనుల్లో సెమ్మెటలెత్తి సమ్మె కట్టిన సికాస శ్రేణుల ప్రాణ స్పందన, రగల్ జెండా నీడలో యింద్రవెల్లికి దండు కట్టిన గోండు కొలామీ అడవి బిడ్డల వూపిరి అలజడి రాజయ్య సృజనాత్మకతకీ వివి విశ్లేషణాత్మక విమర్శకీ పరిశీలనాత్మక వ్యాఖ్యకీ పునాదిగా నిలబడ్డాయి. ఈ క్రమంలో భూంకాల్ విప్లవం జంగల్ మహల్ పోరాటంతో కొల్లేజ్ అవుతుంది. సమ్మక్క సారక్క ల దగ్గర నుంచి బిర్సా ముండా రాంజీ గోండ్ కొమురం భీము వరకు సాంస్కృతిక వీరులు దేశమంతటా నడుస్తున్న ఆదివాసీ పోరాటాలకు స్ఫూర్తి దాతలు అవుతున్న వైనం సమున్నత స్థానంలో నిలుస్తుంది. పోరాటంలో సబ్బండ కులాలకు, జాతులకు చెందిన ప్రజలు అగ్రగాములుగా నిలవడంతో ఆగిపోక పోరాట రూపాల్ని నిర్ధారించడంలో నిర్ణాయక పాత్ర నిర్వహించాల్సిన అవసరం చర్చకు వస్తుంది. సామ్రాజ్యవాద మార్కెట్ కీ ఆదివాసీ తిరుగుబాట్లకీ వున్న చారిత్రిక సంబంధం అనివార్యంగా ముందుకు వస్తుంది. సాహిత్య విమర్శలో యిదొక రకం యెత్తుగడ. ప్రయోజనోద్దిష్టమైన ‘విప్లవ’ సాహిత్య ‘నీతి’ యిది. దీన్ని వివి వొక ప్రయోగంగా సాధన చేశాడనడానికి మనముందున్న ‘జైత్రయాత్ర’ నిలువెత్తు వుదాహరణ. కొలిమంటుకున్నది, కొమురం భీము నవలల తొలి ప్రచరణకు ఆయన ముందుమాటల్నీ, పర్స్పెక్టివ్స్ ప్రచురణగా వచ్చిన ఆరు సంపుటుల కోసం యిప్పుడు మళ్ళీ కొత్తగా రాసిన ముందుమాటలనీ పోల్చి చూస్తే యీ విషయం స్పష్టమౌతుంది.

దాదాపు మూడు దశాబ్దాలు (1973 – 2000) కాలంతో నడిచిన కలం అల్లం రాజయ్య. రాజన్న సాహిత్య మార్గం పై ప్రసరించిన వెలుతురు కిరణం వరవరరావు జైత్రయాత్ర (2008 -2019). మార్క్సిస్ట్ సాహిత్య సిద్ధాంతానికి, దాని వికాసానికి వివి అందించిన విలువైన చేర్పు యిది.

కరోనా పాపిష్టి కాలంలో సైతం ఫాసిస్టు పాలనకి వ్యతిరేకంగా పోరాడుతూ జైలు నిర్బంధం అనుభవిస్తున్న వారందరికీ వివి ద్వారా పర్స్పెక్టివ్స్ అందిస్తున్న రెడ్ సెల్యూట్ యీ పుస్తకం. అడుగడుగునా ఎన్ని అడ్డంకులు యెదురైనా ఆగనిదీ జైత్రయాత్ర. ఇది యిలా కొనసాగడానికి సహకరించిన రాజయ్యకీ, వరవరరావుకీ, పాణికీ మా కృతజ్ఞతలు. ఒక బాధ్యతతో తెస్తున్న యీ పుస్తకం రాజయ్య రచనలకే కాదు; మొత్తం సాహిత్య అధ్యయనానికే కొత్త చూపునిస్తుందని మా విశ్వాసం.

‘భౌతిక – సామాజిక దృగంశాలెప్పుడూ ప్రజల ఊహలలో కళాత్మకంగా మిళితమై వ్యక్తమౌతాయి’.

అందుకు నిండైన నిదర్శనం వివి రాజయ్యలు భుజం భుజం కలిపి చేసిన ‘జైత్రయాత్ర’.

సాహిత్య విమర్శకుడు. తెలుగు కన్నడ రాష్ట్రాల్లో ముప్ఫై ఏదేళ్లపాటు సంస్కృతం – తెలుగు పాఠాలు చెప్పి రిటైర్ అయ్యారు. ‘తెలుగులో మాండలిక కథాసాహిత్యం’ పై పరిశోధన చేసి అదే పేరుతో ప్రచురించారు. స్త్రీ వాద కథలు, నిషేధ గీతాలు, డక్కలి జాంబ పురాణం, రెండు దశాబ్దాలు కథ , జానపద చారిత్రిక గేయగాథలు, బయ్యారం ఖ ‘నిజం’ ఎవరిది?, కన్నీటి సాగరాలొద్దురా మల్లన్నా, నోబెల్ కవిత్వం, అదే నేల (ముకుందరామారావు), తొవ్వ ముచ్చట్లు (జయధీర్ తిరుమల రావు ), యుద్దవచనం (జూలూరి గౌరి శంకర్), పాపినేని శివశంకర్ కథలు, తాడిగిరి పోతరాజు కథలు, రాయలసీమ : సమాజం సాహిత్యం (బండి నారాయణస్వామి), బహుళ - సాహిత్య విమర్శ : సిద్ధాంతాలు, ప్రమేయాలు, పరికరాలు (పర్స్పెక్టివ్స్), 50 యేళ్ల విరసం : పయనం - ప్రభావం … వంటి పుస్తకాలకి సంపాదకత్వ బాధ్యతలు వహించారు. ‘వేమన దారిలో’ పేరున ఎంపిక చేసిన వేమన పద్యాలకు వ్యాఖ్యానం చేసారు. ‘సమకాలీనం’ పేరుతో కథా విమర్శ పై వ్యాస సంపుటి వెలువరించారు. ప్రగతిశీల ఉద్యమ సాహిత్యాన్ని ప్రేమించే ప్రభాకర్ అస్తిత్వ ఉద్యమాలు శకలాలుగా కాకుండా ఏకోన్ముఖంగా సాగుతూ అంతిమంగా పీడిత జన విముక్తికి దారి తీయాలని కోరుకుంటున్నారు.

2 thoughts on “ప్రజా యుద్ధ వ్యాకరణం

  1. అద్భుతమైన వ్యాసం ..అభినందనలు

    – ముకుంద రామారావు
    హైదరాబాద్

Leave a Reply