మూలం: మౌమిత ఆలం
అనువాదం: ఉదయమిత్ర
నేను యుద్ధం గురించి
సౌందర్యాత్మకంగా చెప్పనని
మా మిత్రులు నిందిస్తుంటారు
అది యుద్ధంగాదని
మారణహోమమని
వాళ్లను సరిదిద్దుతాను
వాళ్లను సంతోష పరచడానికి
కాళ్లు తెగి
నేల మీద మూలుగుతున్న
చందమామ గురించి రాస్తాను
రెక్కలు తెగిన
చందమామ రక్తమోడుతుంటది
ఆకలిగా ఉన్న రాత్రి
పగలును మింగేస్తుంది
సూర్యుడు తన ప్రకాశాన్ని కోల్పోతాడు
మా మిత్రులు
రక్త మోడుతున్న చంద్రుని కోసం
మసకబారిన సూర్యుని కోసం
ఆకాశంలో వెతుకుతుంటారు
నేనేమో
భూమికేసి చూడమంటాను
వాళ్లు
ముఖాలు తిప్పేసుకుని
వేరే వార్తలు చూడడం మొదలు పెడతారు
ఇప్పుడు చెప్పండి
నేను సౌందర్యాత్మకంగా
రాసేది ఎట్లా