యుద్ధగీతం… సుద్దాల హనుమంతు

కాలుకు గజ్జెకట్టి… భుజాన గొంగడి వేసుకొని… తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పల్లెపల్లెకు పాటయి ప్రవహించిన గెరిల్లా. తన గొంతుకను పాటల తూటాగా మలచి ప్రజాశక్తులను ఉద్యమాల బాట పట్టించిన కంచు కంఠం. జానపదుల భాష, యాసలను బాణీలుగా మలచి పాటలో బతుకు పరిష్కారం చూపిన గాయకుడు సుద్దాల హనుమంతు. పాత నల్గొండ జిల్లా మోత్కూరు మండలం పాలడుగు గ్రామంలో 1910, డిసెంబర్లో నిరుపేద చేనేత కుటుంబంలో బుచ్చిరాములు, లక్ష్మినరసమ్మ దంపతులకు జన్మించాడు. వారికి ఆరుగురు సంతానం నలుగురు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. వారందరిలో చివరగా జన్మించిన హనుమంతు అసలు ఇంటి పేరు గుర్రం. జీవన పోరాటంలో భాగంగా ఆయన గుండాల మండలం సుద్దాల గ్రామంలో స్థిరపడటంతో ఆ ఊరి పేరే ఆయన ఇంటి పేరుగా మారింది. సుద్దాల హనుమంతు పేరు ఒక్క తెలంగాణ సమాజానికి మాత్రమే పరిమితం కాలేదు. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆయన సాహిత్యభావజాల ప్రచారంతో ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. చివరి నిజాం నిరంకుశ పాలనపై పోరాడే ప్రజల పక్షం నిలబడి తన పాటలతో ప్రజాఉద్యమాలకు ప్రచారం కల్పిస్తూ ప్రజాకవిగా ప్రజానీకం హృదయంలో నిలిచిపోయాడు. నిజాం వ్యతిరేకోద్యమంలో ఎన్ని నిర్బంధాలు ఎదురైనా గుండె ధైర్యంతో ఒక చేత్తో పెన్ను పట్టుకొని తన పాటలతో ఉద్యమకారులను ఉత్తేజ పరుస్తూ ప్రజల్ని సాయుధులుగా ముందుకు నడిపించిన సాహిత్య యోధుడు. అంతేకాకుండా గెరిల్లా పోరాటంలో నిబద్ధతగా తన భుజానికి తుపాకీ ధరించి సాయుధ దళాలతో కలిసి రాజకీయ నిర్మాణంలో తనదైన పాత్రను పోషించిన కమ్యూనిస్టు యోధుడు హనుమంతు. ఈయన తండ్రి బుచ్చిరాములు ఆయుర్వేద వైద్య వృత్తి ద్వారా కుటుంబ బతుకు బండిలాగుతుండేది. హన్మంతు బాల్యం నుంచే హరికథలు, నాటకాలు, పాటల పై తన అభిరుచిని పెంపొందించుకున్నాడు. తన గ్రామంలో హరికథలు చెప్పే అంజనదాసుకు శిష్యుడిగా ఆయన బృందంలో చేరాడు. చిన్న వయసులోనే బతుకుతెరువు కోసం ఉద్యోగానికి హైదరాబాద్ చేరాడు. ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసేవాడు. మరోవైపు ఆనాటి హైదరాబాద్ నగరంలోని నిజాం ప్రభుత్వ వ్యతిరేక భావజాలంతో ప్రజల్లోకి వెళ్తున్న ఆర్యసమాజం కార్యకలాపాలకు ఆకర్షితుడై కార్యకర్తగా పనిచేయడం ప్రారంభించాడు.

1944లో భువనగిరిలో రావి నారాయణరెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఆంధ్రమహాసభలో స్వచ్ఛంధ కార్యకర్తగా తన కార్యాచరణ మొదలు పెట్టాడు. క్రమంగా రావి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో కమ్యూనిస్టు పార్టీలో సాంస్కృతిక విభాగం బాధ్యతలు స్వీకరించాడు. బాల్యంలో తనకున్న సంప్రదాయ హరికథలు, జానపద గేయాలు పాడిన అనుభవాన్ని జోడించి గ్రామాల్లో, పట్టణాల్లో ఎక్కడ మీటింగులు, పోరాటాలు జరుగుతున్నా అక్కడ హనుమంతు ప్రత్యక్షమయ్యేది. తన కలం, గళం కలగలిపి ప్రజల్ని ఉద్యమానికి కార్యోన్ముఖులను చేయడంతో సుద్దాల హనుమంతు గారి పాత్ర కీలకంగా మారింది.

ఏడో నిజాం పాలన కాలంలో తెలంగాణ గ్రామీణ సమాజంలో దొరలు, భూస్వాములు ఉత్పత్తి వర్గాల ప్రజానీకం చేత తమ గడీలలో వెట్టి చాకిరీ చేయించుకుంటున్న రోజులవి. గ్రామాల్లో రెవిన్యూ ఉద్యోగులు, పోలీస్ పటేల్, మాలీ పటేళ్ల సేవల కోసం అట్టడుగు వర్గాల ప్రజల వెట్టిచాకిరీ జరగనిదే ఆ ఊళ్లలో ఏ కార్యక్రమం జరగదనడంలో అతిశయోక్తి లేదు. ఓ రోజు నిజాం సైనికులు నల్లగొండ జిల్లాలోని ఓ గ్రామంలోని మాదిగవాడకు పోయారు. పనులకి రావాలంటూ సైనికులు గర్జించడంతో అప్పటికే తిండిలేక తోలుకప్పుకుని అస్థిపంజరంలా ఉన్న ఒక నడివయస్కున్ని గుర్రాల మీదున్న సైనికులు లాక్కెళ్లుతున్న ఆ దృశ్యాన్ని చూసి ఆగ్రహంతో ఊగిపోతూ మనుస్సులో ఉప్పొంగిన అలల అక్షరాలై రాసిన గీతమే…

‘వెట్టి చాకిరీ విధానమో రైతన్నా ఏంజెప్పిన తీరదు కూలన్నా మాదిగన్న మంగలన్న మాలన్న చాకలన్న/వడ్రంగి వడ్డారన్న వసిమాలిన బేగరన్న/ కుమ్మరన్న కమ్మరన్న కూలన్న రైతన్న/అన్ని పనులు వాళ్లతో దొరలందరు చేయించుకొనెడి’ అంటూ ప్రజల బాధను తన ఆవేదనగా స్వీకరించి పాటకు పదనుపెట్టిన పోరాట యోధుడు హనుమంతు.

నిజాం కాలంలో పల్లెటూర్లలో ఉత్పత్తి కులాల్లోని పిల్లలకు చదువు అందని ద్రాక్షనే. రెక్కాడితే గానీ డొక్కాడని సామాజిక, ఆర్థిక పరిస్థితులతో సతమతమైపోయేవారు. భూస్వాముల గోజలు కావలి ఉండటానికే బాల్యమంతా గడిచిపోయేది. దొరలిచ్చే చాలీచాలని పాత చింపులతో పాలబుగ్గల జీతగాళ్ల జీవితాలపై హనుమంతు రాసిన పాట ఎంతో ప్రచారాన్ని పొందింది. బాల కార్మికుల వెట్టి బతుకులను కళ్ల ముందు చిత్రికపట్టి శ్రోతను కన్నీళ్లుకార్చేలా చేస్తుంది. ‘పల్లెటూరి పల్లగాడ పసులగాసే మొనగాడ/ పాలుమరిసి ఎన్నాళ్లయిందో/ ఓ పాలబుగ్గల జీతగాడా/చాలీచాలని చింపులంగి చల్లగాలికి సగము ఖాళీ/ గోనేచింపు కొప్పెర పెట్టావా…’ అంటూ రాసిన గేయం మాభూమి సినిమాలో తెరకెక్కింది. ఈ పాటను దేవరుప్పుల గ్రామానికి సంధ్య పాడి శ్రోతలను కంటతడి పెట్టించి బాలకార్మికుల జీవితాలపై ఆలోచింప చేసింది. దీంతోనే మాభూమి సంధ్యక్క తెలంగాణ సమాజంలో గుర్తింపు పొందారు.

ప్రజల దోపిడీ, పీడనకు కారణం ఆనాటి నిజాం ప్రభుత్వంలో భాగస్వామ్యమైన జాగీర్దారి, జమీందారి వ్యవస్థ అనుసరించిన వెట్టిచాకిరి, అణచివేత, దోపిడీ విధానాలే. ఎన్నో ఆశలతో చెమటోడ్చి/ దున్నుకున్న భంజరు భూమికన్నుగట్టి మాయపన్ని/ తన్నిగుంజుకునే భూస్వామి/అన్న నీవు కన్న కలలు/ వ్యర్ధమాయ గదో వ్యవసాయ కూలీ. మరోపాటలో భూమి, భుక్తి, వెట్టి విముక్తి కోసం సమసమాజ స్థాపనే లక్ష్యంగా సాగాలంటూ తన కలాన్ని ఝళిపించారు. ‘ప్రజా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం/ ప్రజాప్రభుత్వం సాధిస్తం నిజాములో ప్రతీ బజారులో మా/ ధ్వజం ఎర్రనిది జెండా ఎగరేస్తం’ అంటూ తన పాటల ఈటెలతో పాలకుల వెన్నులో చలిపుట్టించిన తొలి ప్రజావాగ్గేయకారుడు సుద్దాల హనుమంతు. 1948 హైదరాబాద్ పోలీసుయాక్షన్ తరువాత కొద్దికాలం బొంబాయిలో గడిపారు. సుదీర్ఘ కాలం ప్రజాపోరాటాల్లోనే తన జీవితాన్ని గడిపిన హనుమంతుగారు గొంతు క్యాన్సర్ తో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. నిరంతం పాలకుల పై యుద్ధభేరిని మ్రోగించిన ప్రజాగొంతుక సుద్దాల గ్రామంలో 1982 అక్టోబర్ 10 మూగబోయింది. చనిపోయేనాటికి ఆయన వయస్సు 74 సంవత్సరాలు. జీవితమంతా పీడిత ప్రజానీకం కోసం గొంతెత్తి పాడిన సుద్దాల హనుమంతు జీవితాన్ని నేటి ఆధునిక సాహిత్యకారులు అధ్యయనం చేసి ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది.

పుట్టింది వడ్డిచర్ల, జనగామ జిల్లా. నెల్లుట్లలో పెరిగాడు. జనగామలో సదివిన మట్టి పెడ్డ. వరంగల్లు నగరంలో వలస బతుకు మనుగడ. ఉపాధ్యాయ బోధన విద్యలో నల్లబల్ల మీద అక్షరాలకు అభద్ర కూలీ గొంతుకవుతాడు. చాయ్ నీళ్లు లేకున్నా సాహిత్య సాన్నిహిత్యాన్ని కోరుకుంటాడు. కవి, రచయిత, జర్నలిస్ట్, పరిశోధకుడు, అధ్యాపకుడు. ప్రముఖ తెలుగు పత్రికల్లో పాత్రికేయుడిగా పని చేశాడు. ప్రస్తుతం ఉస్మానియా యునివర్సిటీలో 'తెలుగు సాహిత్యంలో చేనేత వృత్తి జీవనచిత్రణ'పై పరిశోధన చేస్తున్నాడు.

Leave a Reply