యుద్ధం అనివార్యమైన చోట…

గాయపడ్డ భూమిని
వెన్నుపోట్లకి చీలిన చర్మం నాది
ఖాళీ చేసిన ఇళ్ళ దర్వాజాల్ని
దుఃఖంతో చెమ్మగిల్లిన గోడల్ని ప్రేమిస్తుంటాను
గడ్డ కట్టించే చలి గాలుల్లో పాత జ్ఞాపకాల్ని మోస్తుంటాను
ఇళ్ల ముందు, రహదారుల మీద,  గోడల వెనుక నుండి
దూసుకొస్తున్న మృత్యువులా
బిడ్డల్ని పోగొట్టుకున్న తల్లుల కన్నీళ్లలా
మంచు నామీద ఎప్పుడూ కురుస్తూనే వుంటుంది

జీవితాలు శిధిలం అవుతాయేమో కానీ
చరిత్ర ఎప్పుడూ చలనశీలమే
అది రక్తాన్ని కన్నీళ్లనీ మోసుకుంటూ
శతాబ్దం నుండి శతాబ్దాల్లోకి ప్రవహిస్తూనే వుంటుంది
దశాబ్దాల నుండీ నా గుండెలపై మిలటరీ టాంకర్లు
నన్ను తొక్కుకుంటు వెళ్తున్న చరిత్ర నీకిప్పుడు కనిపించదులే
చిత్రహింసలు, మరణదండనలు, ఊచకోతలూ లేకుండా
ఏ భూమి స్వంతంత్రమైంది?
కొత్త చరిత్ర అంకురించిన తరువాతనే
పాత చరిత్ర అర్థమౌతుంది

నీకు ఇప్పుడు నేనేంటో తెలియాలంటే రా!
ఆయుధాలు పక్కన పడేసి నిస్సైన్యంగా రా!
శీతలమైన నా మట్టి మీదకి రా
మొదటి అడుగులోనే
నీ కాళ్ళకి వెచ్చటి నెత్తురు అంటుకుంటుంది
నువ్వెప్పటికీ తుడుచుకోలేని మరక ఏర్పడుతుంది
ఎక్కడికి వెళ్ళినా పచ్చి నెత్తుటి వాసనొకటి
నీ వీపునతుక్కొని వెన్నాడుతుంది
డెబ్భై ఏళ్ళ నెత్తుటి ప్రవాహంలో తడిసిన నేల ఇది
చూడు చూడు ఇక్కడి యాపిల్ పండ్లలో కూడా
తూటాలు దిగి వుంటాయి
తుపాకుల మోతలకి భయంతో
మంచుకొండలు కరిగి నీరై పోతుంటాయి

నాకంటూ ఓ నేల
భాష కట్టుబాటూ కట్టుబొట్టూ వున్నప్పుడు
నా మతమొక్కటే నన్నో తుపాకీని చేసి నిలబెడుతుందా?
విప్పారుతున్న నా పసివాళ్ల కళ్లలోకి బుల్లెట్ రవ్వలు పోసి
నా నేల మొత్తం మీద చీకటి కొట్టాలతో కప్పేసి
ప్రపంచం నుండి నన్ను ఒంటరి చేసి
నా సమాజం మీద జైళ్లని బోర్లించి
ఊచల బైట నుండి వికటాట్టహాసాలతో నన్ను కౌగిలించుకుంటే
నేనో ఆక్రోశపు నినాదం కాకుండా మరేమవుతాను? 
కుందేలు చర్మంలాంటి నా ధవళ భూమిని
రెండు ముక్కలు చేసి రెండు పిల్లులు చెరో వైపు ఈడ్చుకెళుతుంటే
నేను గుండెలు పగిలేలా ఓ మందుపాతర కాకుండా మరేమవుతాను?

****

నిజమైన సరిహద్దులెప్పుడూ భౌగోళికం కాదు
ఎక్కడెక్కడ జాతులు తగాదా పడుతుంటాయో
అవే సమూహాలకు సరిహద్దులు
ఒక జాతిని మరొక జాతిని గాయపరిచినప్పుడే
మనిషికీ మనిషికీ సరిహద్దుల రాళ్లు లేస్తాయి
స్వేఛ్ఛా నినాదాలెప్పుడు ఇనుప బూట్ల కింద నలిగిపోతుంటాయో
అక్కడే సరిహద్దుల కంచెలు మొలుస్తుంటాయి
ఎవరి ఉనికి వారిదే అనుకుంటూ
కరచాలనాలు చేసుకోవాలిసిన జాతులు
ఒకే దేశ చిత్రపటంలో ఇరుక్కుపోయి బతుకుతుంటే
మనిషికీ మనిషికీ మధ్య సమాధులే సరిహద్దు రాళ్లు అవుతుంటాయి
స్వంత అస్తిత్వానికి తప్ప ఏ పరాయి ప్రభువుకీ మోకరిల్లని
జాతి గౌరవం నుదుటి మీద విద్రోహాలు గొడ్డళ్లు దింపుతున్నప్పుడు
శాంతి నాకొక సుదూర స్వపం
వర్తమానంలో అది శత్రువు వాడే భాష!

నీకు శాంతి కావాలంటే
నేను స్వతంత్రం అవాలి!

"నెత్తురోడుతున్న పదచిత్రం", "కవిత్వంలో ఉన్నంతసేపూ...." అనే  రెండు కవితా సంపుటల వయసున్న కవి.  సామాజిక వ్యాఖ్యానం, యాత్రా కథనాల్లోనూ వేలు పెట్టే సాహసం చేస్తుంటాడు.

Leave a Reply