యిమరస

దుక్కి దున్నినప్పుడల్లా
కాసులకు బదులు పెంకాసులు మూట గట్టుకొన్న

బాడిసెతో మొద్దు చెక్కి నప్పుడల్లా
బతుక్కో రూపమొస్తదనుకుంటే
చెక్కపొట్టు పొగల ఊపిరాడకపాయె

సారె మీద కుండ నున్నగవుతుంటే
కల మాగుతున్నదనుకున్న
పర్రెలొచ్చిన కుండైనదె

కొలిమి వూదినప్పుడల్లా
జ్వాల దీపంతయి
ఇల్లు నిలవడతదనుకున్న
చింతనిప్పుల సెగలో వేగుతున్నట్లుండె

బంగారానికి అందాలద్దుతున్నప్పుడల్లా
అందమైన జీవితం ఊరించేది
ముక్కుపుడకకు చాలని సంసారమాయె

వల విసిరి
చెరువుగట్టున నిల్చున్న
కౌసు కన్నీళ్లై స్రవిస్తున్న

ఈతాకులతో చాప లల్లిన
తాటాకులతో బుట్ట లల్లిన
పొదరిల్లు అల్లుకోలేని పొట్టి బతుకయ్యె

దొరగారి కాలికి, చెప్పు చేసి, తొడిగిన
మెప్పు సంగతి దేవుడెరుగు
మెతుకు సంగతి ఎవ్వరి కెరుక?

అగ్గిపెట్టెల చీరకు సృష్టికర్తను
పేనిన దారాలే ఉరితాళ్లయి
ఉసురు తీయడం చూస్తివా

మురికి బట్టల కంపు వొదిలింపుకు గాడిద చాకిరే
ఇంపైన బతుకిస్తదనుకున్న
చాకిరేవు బండై నీల్గుడేనాయె

తాతలకు తండ్రులకు పిల్లలకు
రాతం చేసిన మంగలి కత్తి
గాటు వడని పనితనం
చేతికందని జుట్టు లెక్క
తెలివి జెయ్యలేక పోతి నా వోళ్ల

సబ్బండ కులాన్ని
సబ్బండ వృత్తిని
శ్రమైక జీవన సౌందర్యానికి
శ్రమైక జీవన సౌభాగ్యానికి
నా పనిముట్లే తరతరాల చిహ్నాలట

కాలాల కాలాల కాలాల తిరిగే ఇరుసుల

నాతో నీకేమొచ్చె
నీతో నాకేమొచ్చె

బాంచెన్ కాల్మొక్తా !!!

జననం: సిద్ధిపేట. విశ్రాంత ఉపాధ్యాయుడు. రచనలు: 'గోరుకొయ్యలు', 'పట్టు కుచ్చుల పువ్వు', 'విరమించని వాక్యం' (కవితా సంపుటాలు). మంజీరా రచయితల సంఘం సభ్యుడు.

Leave a Reply