కాల్చిన కమ్మని ఎండు తునకల్లాంటి కవిత్వం ‘యాలై పూడ్సింది’

కనుమరుగవుతున్న యాసనే భాషగా మలచి కవితలు అల్లుతున్న నేతగాడు పల్లిపట్టు నాగరాజు కవితల మంటలు యాలై పూడ్సింది. త్తూరు జిల్లా రంగనాథ పురం మిట్టిండ్లల్లో ఉదయించిన నల్ల సూరీడి బాటలో ముళ్ళతో పాటు సామాజిక కంచెలనూ దాటుకుంటూ తెలుగు ఉపాధ్యాయునిగా ఎదిగి తాను ఎదిగి వచ్చిన సమాజాన్ని మరువక ఆ సమాజంలో వెలుగులు నింపే ప్రయత్నం చేయటం అభినందనీయం.

“రాగి చెంబైనా రేషన్ బియ్యమైనా రాలిపడ్డ మామిడి పండైనా సాకేదైనా శవాలం మేమే” అంటూ కంచికచర్ల కోటేశు నుండి నేటి దాకా వెలి వాడ బిడ్డల పై జరుగుతున్న దాష్టీకాన్ని కనుపాపలపై చిత్రీకరించారు. నేను పీల్చే గాలి అందరూ పీల్చేదే నేనున్న నేల అందరూవుండేదే నా ఇల్లెందుకు ఊరవతల అంటూ అనాదిగా అణచి వేయబడుతున్న తన జాతి పక్షాన నిలబడి ఎక్కుపెట్టిన ప్రశ్న. ఈ ప్రశ్నకి జవాబిచ్చే స్థితి లో రాజ్యం లేదు.

యాలై పూడ్సింది కవితలో “కొన్నాలికలో బెల్లం పూసుకుని అంగిట్లో ఇషం బెట్టుకుని భలే మాట్లాడతారే” అంటూ కుహనా దేశ భక్తుల రంగు బైటపెట్టే పని తన అక్షరాలకు ఇస్తూ “యవుడు కూడు వోడు తింటా వుంటే కూటి కుండ కాడా కూటి సట్టి కాడా కారుకూతలేంది ఈ కత్తి గాట్లేంది అని విరుచుకుపడుతూ సాల్లే సాల్లే పొద్దు మొలస్తా వుంది మీ మోసకారి పాటల్కి ఇంకా ఇంకా మా మద్దెల వాయించలేమని” ఖరా ఖండి గా తన ఎజెండాని ప్రకటించాడు.

ఆవు భయం కవితలో “ఏ పూటా అంత కసువేసి గుక్కెడు నీళ్ళు పెట్ట నోడు దొడ్లో పేడ తీసి శుద్ది చేయనోడు మా జాతిపై విరుచుకు పడే” హక్కెక్కడిదని నినదించారు. నేను పలానా కవిత లో “నేను నలుపు తోలోడ్నో నలిగిన గుడ్డ లోడ్నో” అని తనను తాను పరిచయం చేసుకుంటూ “నా చెప్పులపై నడిచి నా డప్పులతో వూరేగి నా సప్పరంలో కొలువు తీరేదాకా నా నెత్తురు తో మాట్లాడుతుంటాను” అని మరుగుతున్న రక్త అంతిమ లక్ష్యాన్ని చేరవేసారు.

కర్రి సూరీడు కవితలో “కాల్చిన కమ్మని ఎండు తునకలంటి కమ్మని ముద్దులు” లో ఎంచుకున్న పదం ఎండుతునక తన సామాజిక నేపథ్యం లోనిదే. అమ్మ ప్రేమని వ్యక్త పరచుటకు తన దైనందిన జీవితంలోని పదాల నే వాడారు. “నా కర్రి సూరీడా అని పిలిచినప్పడుల్లా నా చర్మం కింది సింధు నాగరికత నిద్దుర లేస్తుందని” తన మూలాలను వెతుక్కునే పనిలో పడ్డాడు.

పిచ్చుక వాలిన కిటికీ కవితలో పర్యావరణాన్ని యాది చేసుకుంటూ అంతరించి పోతున్న పిచ్చుక పక్షాన తనదైన శైలిలో “ఎప్పుడూ మీ గురించేనా? మీ ఎగుడుదిగుడు దారుల గురించేనా మీరూ మేమూ మనదైన లోకానికి ఊపిర్లూదే పచ్చని చెట్టు గురించో పచ్చని కొమ్మ పై మా రెక్కల సప్పుడు గురించో పాఠమెప్పుడెడతారన్నట్టూ ప్రశ్నలు వర్షిస్తూ ఎగిరెళ్లి పోయింది పిచ్చుక” అని బాధ పడ్డారు. ఇళ్ళు కవితలో “ఈడ నీటిపైన గాలిపైన నిలబడిన నేల పైనా సంతకం చేయడానికి ఎవరికెన్ని హక్కులున్నాయో మా చెమట తడిసి పూస్తున్న మట్టి తోట లో మాకు అన్ని పాదులున్నాయని ” ఈ నేల ఎవడి సొంతం కాదని సమాన హక్కులు అవకాశాల కోసం గళ మెత్తారు. సపాయమ్మలు కవితలో “మా సపాయమ్మలు పట్నం పిల్లకి చిక్కు తీసి కొప్పు బెడతారంటూ” కంటి నిండా నిద్ర కడుపు నిండా కూడు కరవైన తనాన్ని వట్టిపోయిన కట్టెలోంచి కనిపించే నరనరం న్యాయం చూపెటు తుందని” ఒకే కవితలో శుభ్ర పరచే అమ్మల పనితనాన్ని వాళ్ళ ఆకలి ని సమాజం ముందెట్టారు.

కరవు ఋతువు లో “చుక్కరాలని ఈ మట్టిలో దుక్కమే నవ్వుతుంది దుక్కమే ఏడుస్తుంటుంది దుక్కమే ఎక్కిరిస్తుంటుంది” అని దుక్కం కోణాలను వర్షించని నేలలో స్పృశించారు. అలాగే కొనసాగిస్తూ “ఇక్కడ కాలం పొడువుతా ఒక్కటే ఋతువు కరవు కొడవళ్ళతో నమ్మకపు గొంతులు కోస్తూ ” అని నేల వేదనని కన్నీటి పర్యంతం చేసారు.

బాల్య స్మృతులలో చేపల పాపత్త తనకి మాత్రం రుక్మత్త యే అంటూ ఆ కవితలో మానవసంబంధాలను సామాజిక చేతనను ఆవిష్కరించారు. “ముతక కోకైనా మట్టసం గా కట్టుకుని” కరువాళ్లు అమ్మిన అత్త “దూది చెట్టులా నెరసిన జుట్టు తో పిసంగి పైరులా గాలికి వంగి పోయి నడుస్తున్నా” బతుకు పోరాటంలో సడలని పట్టుదల ను కవి పాత్రతో చెప్పించారు. “దొంగ నా బట్ట” లో తిట్టు కన్నా ఆప్యాయతను పండించారు. “ఒక మెత్తాడో ఒక కరువాడో ఇచ్చి కాల్చుకు తినమంటే సిగ్గు” పడ్డ బాలుడు ఈ సూరీడు. ఊరూ వాడా ఏ ఇంటైనా సద్ది నీళ్ళో సంగటకవనమో తినిపోయే రుక్మత్త” కవుడు కుంచం లేని గుండె తో దీవించేది”. కులమూ గట్రా పట్టించుకోని రుక్మత్త ల అవసరం ఈ సంఘంలో ఎంతైనా ఉంది.

వాళ్ళు ప్రవహిస్తున్నారు కవితలో “మట్టి పిడికిళ్ల ప్రవాహమై మట్టి పాదాల ప్రళయమై కాలం నుదిటి పైన నెత్తుటి పాద ముద్ర వేసి కాలం కులుకుదనం పై కాండ్రించి ఉమ్మి వేసి జనం ప్రవహిస్తున్నారు… ఎండిన దేహాలకి ఎన్ని ఎండలైనా లెక్కేమిటని వాళ్ళు ఎడతెగని ప్రవాహమై ” అన్నదాతల మార్చ్ కి అండగా కదిలారు. సమాధి పై చెట్టు కవితలో “ఎలాగూ వాళ్ళు నా దేశభక్తిని పరీక్షిస్తూ ఏదో ఒక చట్టాన్ని వలపన్ని బలి తీసుకుంటారు కదా! మీరు గుడ్లప్పగించి మీ వంతుకోసం చూస్తుంటారు” అని నిద్రావస్థ లో మాకేమిటని తన దాకా వచ్చేదాకా వేచి చూసే జనాన్ని ముల్లు కర్ర తో పొడిచారు.
ఇంటి ని కలగంటున్నాను లో “నా ఇంటిని నా ఇంటి లాంటి ఇళ్లున్న వీధులని వివక్షలు లేని వీధుల సమూహ దేశాన్ని నా ఇంటి చుట్టూ కంచెలు లేని అంత మట్టి ని కల గంటున్నాను” అన్న కవి కల నెరవేరాలని ఆశిద్దాం.

యాలై పూడ్సింది (కవిత్వం), కవి: పల్లిపట్టు నాగరాజు, ప్రతులకు : పల్లిపట్టు నాగరాజు, (టీచర్), 4-68 నారాయణస్వామి నగర్, రాజగోపాల పురం, సత్యవేడు మండలం, చిత్తూరు జిల్లా, పిన్ : 517588. ఫోన్: 9989400881.

పుట్టింది సూర్యాపేట. పెరిగింది నాగార్జున సాగర్. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్ మెంట్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్. విద్యార్థి దశలో ఎస్. ఎఫ్. ఐ. లో పని చేశారు. సామాజిక ఆర్థిక సమస్యలను కవితా వస్తువులు గా తీసుకుని  కవిత్వం రాస్తున్నారు.  వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి.

2 thoughts on “కాల్చిన కమ్మని ఎండు తునకల్లాంటి కవిత్వం ‘యాలై పూడ్సింది’

  1. అద్భుతమైన సమీక్ష. సర్ పల్లిపట్టు కవిత్వానికి నిండుదనం తెచ్చారు.సహృదయతో అక్షరాన్ని హత్తుకున్నారు. అభినందనల వర్షం కురిపించారు.ఇరువురికి అభినందన శుభాకాంక్షలు.. మీ ఆది ఆంధ్ర తిప్పేస్వామి

Leave a Reply