యాడున్నదో బిడ్డ

నిండు సందమామ-పండు వెన్నెలతీరు యాడున్నదో బిడ్డ యాడున్నదో గూడులేని పక్షి గువ్వోలె ఎగురుతూ ఆకాశమే తన హద్దన్నదో భూమాత ఒడి తనకు ముద్దన్నదో యాడున్నడో బిడ్డ యాడున్నదో

సదువుల్లోమేటి తానాయెనో
ప్రేమలో సాటెవరు లేపాయెనో
కొండంత ధైర్యము గోరంత కోరిక నిప్పులా బతికినా నిజమాయెనో | స్వార్థచింతనలేని గుణమాయెనో | ఏమాయెనోబిడ్డ ఏమాయెనో

ఇల్లెట్ల మరువంగ మనసొచ్చెనో
పల్లెట్ల విడువంగ కాల్లొచ్చెనో
ఆటలల్లో మేటి పాటలల్లో మేటి
నీకెవరు సాటని మురిసితినో
నినుజూసి బాధలె మరిసితినో ఏమాయెనో బిడ్డ ఏమాయెనో

అమ్మానే ప్రేమలు ఏమాయెనో
నాన్ననే మమతలు ఎటువాయెనో లోకమే తన తల్లి లోకమే తన తండ్రి శోకార్థుల గుండె నోదార్చెనో అన్నార్థులాకలి కడతేర్చునో ఏమాయెనోబిడ్డ ఎటువాయెనో ||నిండు॥

అడివనక పల్లెనక పోతుంటినో
ఆపదలు ఏ తీరు పొంచుండెనో తారలోలె కండ్లు తళుక్కుమంటుంటే
ఏ ఊరు ఉద్యమ ఎరుపాయెనో
ఆ మెరుపుల్లో నీ రూపు ఎరుపాయెనో. ॥నిండు॥

ఎగిలివారక ముందె కలలొచ్చెనో పొద్దుపొడుపై తట్టి మేల్కొల్పొనే
దిగ్గున నేలేసి దిక్కులు జూడంగా
భల్లున తెల్లారె మనసంతనో
పక్షుల కిలకిలలు వినిపించెనో

వెలుగాయెనో బిడ్డ వెలుగాయెనో చెట్టుకొమ్మన చిలుక పలుకాయెనో ఎటువాయెనో బిడ్డ ఎటువాయెనో మదిలోన ఆశల మొలుకాయెనో

(పోరాట బిడ్డల స్మృతిలో…)

పుట్టింది కరీంనగర్ జిల్లా వేములవాడ. కవి, రచయిత, గాయకుడు. విప్లవోద్యమ నాయకుడు. అసలు పేరు కూర దేవేందర్. కలం పేరు మిత్ర. అమర్ పేరుతో సీపీఐ(ఎం.ఎల్.) జనశక్తి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశాడు. రచనలు : 1. మిత్ర తెలంగాణ పాటలు, 2. పొదుగు, 3. వరుపు, 4. మిత్ర జనం పాటల సవ్వడి (పాటలు); 5. చితాభస్మంలోంచి...(కవిత్వం); 6. తెలంగాణ డప్పు దరువు, 7. తెలంగాణ ధూం ధాం, 8. తెలంగాణ కోలాటం పాట, 9. ముంబై తెలంగాణం, 10. బహుజన బతుకమ్మ, 11. వీరతెలంగాణ (నృత్యరూప గానాలు).

Leave a Reply