మోడీ మూఢత్వం- కుప్పకూలుతున్న భారతం

కోవిడ్ 19 రెండవ వేవ్ భారత్ ను అతలాకుతలం చేస్తున్నది. దీనిని కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వ అలసత్వ వైఖిరితో దేశం ప్రపంచం ముందు నవ్వుల పాలవుతున్నది. రోజుకు మూడు లక్షల కేసులతో కరోనా దావానలం దేశాన్ని ముఖ్యంగా యువతను దహించివేస్తున్నది. సామాజిక మాధ్యమాలన్ని హస్పిటల్ బెడ్ కోసం, ఆమ్లజని సిలండర్ కోసం, ఆర్ధిక సహకారం కోసం అభ్యర్థనలతో నిండిపోతున్నవి. భయానకతతో మానవ సంబంధాలు అత్యంత అసహజంగా అమానవీయంగా మారుతున్నాయి. దేశ సంపద సృష్టిలో మేధో శరీర శ్రమతో పని చేసే ఒక తరం ప్రమాదకరమైన స్థాయికి నెట్టబడింది. యావత్ జాతి విలయానికి లోనైనప్పుడు పాలకులు ఎలా వ్యవహరించకూడదో ప్రపంచ దేశాలకు ఒక హెచ్చరిక అని మోడీ పై అంతర్జాతీయ మీడియా దుమ్మెత్తిపోస్తున్నది. అమెరికాతో సహా అనేక దేశాలు భారతదేశం తో ప్రయాణాలను రద్దు చేసుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు బైడెన్ గరిష్టమైన ప్రమాదకర హెచ్చరిక జారీ చేసి భారత్ లోని అమెరికన్ లను స్వదేశానికి రప్పించుకుంటున్నాడు. స్వయం కృతాపరాదం, అధికార దాహ చర్యలతో దేశంలో ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలిపోయింది అని, ఆధునిక భారత చరిత్రలో ఒక రెడ్ లెటర్ కాలంగా ఉండబోతుంది అని ప్రస్తావించారు.

కోవిడ్ మొదటి వేవ్ దేశంపై దండెత్తినప్పుడు ప్రజారోగ్య వ్యవస్థ లోపాలన్ని బహిర్గతం అయ్యాయి. వ్యక్తిగత రక్షణ కిట్లు, ఆక్సిజన్ కొరత, నిర్ధారణ పరీక్ష కిట్లు లలో, ఇతర కీలక వైద్య పరికరాలలో ఏ మాత్రం స్వయం స్వాలంబనలో లేమని తెలియవచ్చింది. ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలు తమ ఉత్పత్తి ప్రక్రియకు అవరోధం లేకుండా స్వల్ప కాల లాక్ డౌన్ లు విధించి తమ ఆర్థికాన్ని ఏదో మేరకు నెలకొల్పుకున్నాయి. మోడీ ప్రభుత్వం కనీస ముందు చూపులేకుండా అనాలోచిత ఆత్యంత కఠినమైన లాక్ డౌన్ విధించి మానవ జీవన కల్లోలానికి కారణమయ్యాడు. గత సంవత్సర కాలంగా కరోనా బారిన పడిన దేశాలన్నీ ఆరోగ్య వ్యవస్థకు సమృద్ధిగా నిధులు కేటాయించుకుని ప్రజారోగ్యం కోసం పాటుపడ్డాయి. కొవిడ్ నాశక మందులు, వాక్సిన్ పరిశోధన, ఉత్పత్తి పై యుద్ధ ప్రాతిపదిక పై దృష్టి సారించి పరిస్థితిని మెరుగుపరుచుకున్నాయి. తమ దేశ ప్రజల తక్షణ అవసరాలను తీరుస్తూ భవిష్యత్ కోసం నిల్వ చేసుకున్నాయి.

భారతదేశం మొదటి వేవ్ తో కకావికలంగా మారిన జీవన విధ్వంసం నుండి సరైన గుణపాఠాలు నేర్చుకున్నట్టే అనిపిస్తలేదు. దేశ ప్రజల ప్రయోజనాలకు పక్కన పెట్టి తన సొంత ఇమేజ్ పెంచుకోవడం కోసం అగ్ర దేశాలతో వేల కోట్ల విలువ గల రక్షణ సామాగ్రి ఒప్పందాలతో కాలం గడిపాడు. వాక్సిన్ ఉత్పత్తి చేసే దేశీయ సంస్థలతో వాక్సిన్ ల కోసం ఎలాంటి ముందస్తు ఒప్పందం చేసుకోలేదు. ఆర్ధిక సహాకారాన్ని అందించలేదు. ఎప్పటి లాగే వైద్యరంగానికి జిడిపిలో 5% నిధులు ఇవ్వాల్సి ఉండగా కేవలం 0. 5% మాత్రమే కేటాయించాడు. భారత్ బయోటెక్, సీరం సంస్ధలు ఉత్పత్తి చేసిన కోవాక్సిన్, కోవిశిల్డ్ టికాలను పెద్ద మొత్తంలో కొనుగోలు చేయలేదు. వాటి నుండి సుమారు 15 కోట్ల టీకా డోసులలో సగం రాష్ట్రాలకు పంపిణీ చేసింది. మిగతా సగాన్ని మైత్రి పేరుతొ 74 దేశాలకు ఉచితంగా ఎగుమతి చేసింది. అంతే గాకుండా అంటి వైరల్ డ్రగ్ రెమిడెసివర్ 11 లక్షల డోసులను విదేశాలకు ఎగుమతికి అనుమతిని ఇచ్చింది.

కోవిడ్ రెండవ ప్రమాద హెచ్చరిక చేసిన దేశీయ శాస్త్రవేత్తల, ప్రపంచ ఆరోగ్య సంస్థల సూచనల వెలుగులో చర్యలు యుద్ధ ప్రాతిపదికగా చేయాల్సిఉండగా అవేమి చేయకుండా కోవిడ్ వ్యాప్తికి దోహదం చేసే వినాశకర కార్యక్రమాలకు తెర తీశాడు. మోడీ అనుచర బృందం కరోనా దేశంలో కట్టడి చేసాము అని ప్రకటించారు. మానవ జీవితాన్ని కాపాడే వాక్సిన్ పట్ల శ్రద్ధ వహించకుండా, సమృద్ధి నిధులు ఇవ్వకుండా ప్రాచీన అంధ విశ్వాసాలను అతిగా శ్లాఘిస్తూ వాటిలోనే కరోనా పరిష్కారం ఉందనే విధానాలను అనుసరించడం ద్వారా మోడీ పాలకులు తాజా మృత్యుఘోషకు కారణమయ్యారు.

అభివృద్ధి ఎజెండా లేని, కేవలం ప్రజల విశ్వాసాలను, ఉద్వేగాలను రెచ్చగొడుతూ విచ్చిన్నకర విభజన రాజకీయాల అధికార దాహంతో అనేక రాష్ట్రాల ఎన్నికలకు ఎన్నికల కమిషన్ ద్వారా నోటిఫికేషన్ ఇప్పించారు. లక్షల మందితో సభలు సమావేశాల జరిగాయి. అంతే గాకుండా దేశంలో మెజారిటీ హైందవులు విశ్వసించే కుంభమేళా కు అనుమతిని ఇచ్చారు. ఈ కార్యక్రమాలన్నీ కరోనా హైపర్ సోనిక్ వేగంతో వ్యాపించడానికి దోహదమయ్యాయి. 136కోట్ల జనాభాలో కేవలం ఒక కోటి మందికి మాత్రమే రెండు దోసుల టీకాలను పొందారు. కేవలం 8% మాత్రమే మొదటి డోసును పొందారు. యు యస్ ఏ లో 50% మన పక్కన ఉన్న భూటాన్ లో 60% ప్రజలు వాక్సినేషన్ వేయించుకున్నారు. మన వాక్సిన్ కార్యక్రమం ఇలానే కొనసాగితే 2024 వరకు కూడా వాక్సిన్ ప్రజలందరికీ అందే అవకాశం లేదు. ఏ మాత్రం సన్నద్ధత లేకుండా హడావుడిగా 18 నిండిన అందరికి టీకా హామీ ఇచ్చారు.

ఈ విలయం నుండి బయటపడటానికి తక్షణమే అనేక చర్యలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాలి. ఆరోగ్య అత్యవసర పరిస్థితి ని ప్రకటించి ప్రవేట్ వైద్య రంగాన్ని ప్రభుత్వరంగం స్వాధీన పరుచుకోవాలి. ప్రస్తుతం దేశంలో అత్యధిక కరోనా మృతులు ఆక్సిజన్ లభ్యత లేని కారణంగా సంభవిస్తున్నాయి. రక్షణ ఒప్పందాలు రద్దు చేసుకొని ఆ నిధులను ఆక్సిజన్ ప్లాంటుల ఏర్పాటుకు కేటాయించాలి. మనిషి ప్రాణాలను కాపాడే అత్యవసర మందులను వ్యాపార మేధో సంపత్తి పేటెంట్ ఒప్పందం 1995 నుండి తాత్కాలికంగా రద్దు చేయాలి. 2020 లో భారత్, దక్షిణాఫ్రికాలు చేసిన ఈ అభ్యర్థనను వంద దేశాలు మద్దతు ఇచ్చాయి. కానీ అమెరికా, యూరోపియన్ యూనియన్ లు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో వ్యాపార, రక్షణ కోసం అమెరికా నేతృత్వంలో ఏర్పడిన క్వాడ్ సమూహంలో భారత్ ప్రధాన భాగస్వామిగా ఉంది. మోడీ ప్రత్యేక చొరవ తీసుకొని ట్రిప్స్ ను రద్దు చేయించడం, వాక్సిన్ ఉత్పత్తి కి ముడి సరకు సరాఫరా కు ఉన్న అవరోధాలను ఎత్తివేయించాలి. know-how సాంకేతికత ద్వారా త్వరితగతిన, సమర్ధవంతమైన టీకా కార్యక్రమం చేపట్టాలి. అన్ని మతాల ప్రజలు తమ ఆచార సాంప్రదాయాలను ప్రేమిస్తూనే శాస్రీయ వివేచనను పెంపొందించుకొవాలి. పురాతన విశ్వాసాల పట్ల మొండి ప్రేమను కలిగి ఉండి స్తబ్దతతో ఉండకూడదు. సైన్స్ ఆవిష్కరణలపై ఉత్సుకతను కలిగిఉండి అవి మానవ జీవితాన్ని కాపాడుతున్న వైనాన్ని గుర్తించండి. ప్రజలు జమ అయ్యే అన్ని రకాల కార్యక్రమాల పట్ల నిరుత్సహంగా ఉండాలి. మాస్క్ ధరించడం, మన కదలికలను నియంత్రించుకోవడం వంటిని పౌర విధిగా మారాలి. ప్రజారోగ్యం పట్ల కేంద్ర ప్రభుత్వ అలసత్వాన్ని ఆసేతు హిమాచలం, సమాఖ్య స్పూర్తిని కోరుకుంటున్న ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు అనేక ప్రజాస్వామిక రూపాలలో ఎత్తి చూపుతూ ఆరోగ్య వ్యవస్థ బలోపేతం చేయడం వైపుగా వారిని మెండ్ చేయాలి. ఇదే విధంగా ప్రజా వ్యతిరేక ఫాసిస్ట్ విధానాలను కొనసాగిస్తే వారికి నిలువ నీడ లేకుండా చేయడానికి ప్రజానీకం పూనుకోవాలి. నైరాశ్యం, నిస్పృహా లను తొలగించి కొత్త ఆశను కలిగించాలి. లేకుంటే వికసించే శక్తి సామర్ధ్యాలను కలిగి ఉండే విద్యార్థి యువత, శ్రామిక వర్గం బలహీనంగా మారి దేశం ఒక అచేతనావస్థకు మారే రోజులకు మరెంతో కాలం పట్టదు.

పత్రికా రచయిత, కవి. స్వగ్రామం-కడవెండి. ఉస్మానియాలో వృక్షశాస్త్రం, తత్వశాస్త్రం లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. వృత్తి- ప్రిన్సిపాల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, సమ్మక్క సారక్క తాడ్వాయి, ములుగు జిల్లా. సామాజిక సాహిత్య విద్యా పాఠశాల గా నడిపించే దొడ్డి కొమురయ్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు. తెలంగాణ ఇంటర్ విద్య గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. సామాజిక కార్యకర్తగా, పోటీ పరీక్షల శిక్షకుడిగా పని చేస్తున్నారు.

2 thoughts on “మోడీ మూఢత్వం- కుప్పకూలుతున్న భారతం

  1. కోవిడ్ రెండో సారి విజృంభించడం మోడి ప్రభుత్వం ఎలా విఫలమయిందో బాగా రాశారు

  2. విశ్లేషణ బాగుంది అన్నా

Leave a Reply