మొనదేలి…

నియంతా …

బొట్టూ బొట్టూ పోగైన నెత్తురు
పొంగి పొంగి వస్తుంది
ఏ ట్యాoకులతో
దున్నుతావిప్పుడు…

పాలకా…

మిణుగురూ మిణుగురూ కలిసి
శీతల చీకట్ల మీద వెచ్చని నెగళ్లను ముట్టిస్తున్నాయి చూడు… ముసురుకుంటున్న
ఈ జన ధూపాన్ని
ఏ జైల్లో బంధిస్తావిప్పుడు

పీడకా…

నీవు ధ్వంసిoచిన మా దేహాలన్నీ మొండిబారి, మొనదేలి
నాలుగు కూడళ్ళ మధ్యలొ నిలబడ్డాయి చూడు
ఏ కత్తులతో ఉత్తరిస్తావ్?

మండుతున్న జనం గుండెలయల్ని
అర్పివేయబూనుతావు..
నడీ జనసంద్రంలో కల్లోలం రేపి..
అలలనన్నీ తీరానికే కట్టేయాలని చూస్తావ్..

జన కంటకా….

అవిచ్చిన్న మా రక్తాంకిత చరిత్రను..

ఉండీ ఉండీ అన్ని నిశ్శబ్ధాలను లయంచేసే
మా పిడికిలి విశృంఖలత్వాన్ని..

నిరంకుశ మీ తుఫాను బీభత్సాలను
నిర్లక్ష్యoగా ఢీకొనే
జన ముక్తకంఠాలను
పూడ్చిపెట్టతరమా నీకు?

( NRCని ధిక్కరిస్తున్న ప్రజల కోసం… )


జననం: పాలమూరు జిల్లా. కవి, రచయిత. విరసం సభ్యుడు. రెండు కవితా సంపుటాలు ప్రచురించారు.

Leave a Reply