మై హౌస్… మై పైప్‌లైన్!

ఇల్లే!

ఇంటిని నడిపే పెద్దలే! మమ్మల్ని కనిపెట్టుకు వుండాల్సిన అయ్యా అమ్మే! కష్టసుఖాలు చూడాల్సిన వాళ్ళే! మా బాధ్యత పడాల్సిన వాళ్ళే! మేం నమ్మిన వాళ్ళే! మా నమ్మకాన్ని నిలబెట్టాల్సిన వాళ్ళే!

వాళ్ళే! ఎవరో కాదు, వాళ్ళే! అపరాత్రి కాదు అర్ధరాత్రి కాదు, పగలే పట్టపగలే!

ఇంట్లో దొంగలు పడలేదు?!

మా అయ్య… మా ఘనమైన అయ్య చెంబూ చేటా తీసుకెళ్ళి అమ్మేశాడు! గిన్నీ ముంతా తీసుకెళ్ళి అమ్మేశాడు! బిందీ బకెట్టూ తీసుకెళ్ళి అమ్మేశాడు! కంచమూ మంచమూ తీసుకెళ్ళి అమ్మేశాడు!

తాగుబోతోడు అని తిట్టడానికి లేదు?!

అయ్యకదా… అధికారం వుంది కదా… ఆడెంతంటే అంతే కదా… కిక్కురుమానడానికి లేదు కదా… అలాగని గక్కురుమనకుండా వుండలేం కదా…?!

అప్పుడుకీ యేటిది?… అని అడగకుండా వుండలేదు?!

మీకోసమే అన్నాడు! మీ క్షేమం కోసమే అన్నాడు! మీ సంక్షేమం కోసమే అన్నాడు!

ఆగలేదు! కోళ్ళు తీసికెళ్ళి సంతలో టోకున అమ్మేశాడు! మేకలకీ గొర్రెలకీ మేత పెట్టలేమని దాణా దండుగని తీసికెళ్ళి అమ్మేశాడు! గొడ్డూ గోదా తీసుకెళ్ళి అమ్మేశాడు!

ఆవుని పూజించినోడే?! పాలిచ్చే ఆవులయితే మాత్రం రోజూ గడ్డి పెట్టలేమని అమ్మేశాడు!

దొంగతనంగా అమ్మలేదు! దర్జాగానే అమ్మేశాడు!

గారకాయల్లాటి పిల్లల ముఖం చూడకుండా గాదిలోని బియ్యం అమ్మేశాడు! నిండు నెలల దానిలా వున్న పాతర్లో దాచిన ధాన్యం అమ్మేశాడు! పప్పులు అమ్మేశాడు! ఉప్పులు అమ్మేశాడు! ఉప్పు దాచుకున్న దాకా అమ్మేశాడు! పాలదాకమ్మేశాడు! పాలదాక గోక్కునే గోకురూ అమ్మేశాడు!

ఆగలేదు. జీవనాధారమయిన పండే పొలమూ అమ్మేశాడు! పొలం పక్కనున్న పుట్టా అమ్మేశాడు! పుట్టని ఆనుకొని వున్న గట్టూ అమ్మేశాడు! గట్టు మీద చెట్టూ అమ్మేశాడు!

అన్నీ అమ్మి యేమిటి చేస్తావు? అని అడిగితే, అన్నీ యెక్కడ అమ్మినాం, యింకా అమ్మాల్సినవి చాలా వున్నాయని మాయయ్యకి మాయమ్మ వత్తాసు పలికింది! అసలు మాయయ్య అంతా తీసుకెళ్ళి మాయమ్మ చేతిలో పెట్టినాడు!

మేం యెంత కష్టపడి అమ్ముతున్నామో మీకు తెలీదని కూడబలుక్కొని అన్నారు!

పిల్లల్ని చంకనెత్తుకొని ముద్దు చేసి ముక్కులోని బంగారపు పోగు లాగి అమ్మేశాడు! చేరదీసి చెవిలోవి బంగారపు పోగులు తీసుకెళ్ళి అమ్మేశాడు! మొల మీద మొలతాడు కూడా లాగేశాడు! ఎవరైనా కొనకపోతారా అన్నాడు!

కూర్చున్న కుర్చీలాగి అమ్మేశాడు! పడుకున్న పరుపు తీసి అమ్మేశాడు! చివరకు చాప మీద పడుకుంటే అదీ తీసికెళ్ళి అమ్మేశాడు!

కోకలు అమ్మేశాడు! రైకలు అమ్మేశాడు! పంచెలు అమ్మేశాడు! గోసి లాగేసి అమ్మేశాడు! అవి నేసే మగ్గమూ అమ్మేశాడు! మగ్గంలో పేనుతున్న దారమూ అమ్మేశాడు!

పోయ్యిమీదవి అమ్మేశాడు! పొయ్యి కిందవి అమ్మేశాడు! రాలిన బూడిదా యెంతకో కొంతకు అమ్మేశాడు!

కంటికి కనబడితే చాలు మాయం చేశాడు!

ఇదంతా మీ కోసమే అన్నాడు! ఓ పద్ధతి ప్రకారం అన్నీ అమ్ముకొని నగదు సమకూరుస్తాను అన్నాడు! అందుకు నాలుగేళ్ళు పడుతుంది అన్నాడు!

కోట్లు కూడేసి యేమిటి చేస్తావు? అని అడిగినాం!

లక్షల కోట్లు కూడేస్తానన్నాడు!

ఇంట్లో గదులు ఖాళీ అయిపోతే యెవర్నో పిలిచి మీరు లీజుకు తీసుకోండి అన్నాడు! అమ్ముతాం కొనుక్కోండి అన్నాడు! వాళ్ళు కొన్నా మనకే హక్కులుంటాయని మా పిల్లలతో చెప్పాడు!

ఇల్లమ్మేశాడు! ఇంటి ముందు రోడ్డు అమ్మేశాడు! పెరట్లో నుయ్యి అమ్మేశాడు! నూతిలోని నీళ్ళమ్మేశాడు! నీళ్ళు చేదుకొనే చేద అమ్మేశాడు! నీటిలోని చేపలూ జెల్లలూ అమ్మేశాడు!

తరతరాలుగా తాతలు తండ్రుల నుండి వొచ్చిన కాపాడుకొచ్చిన వారసత్వ సంపద అలాగ అమ్మేస్తే యెలాగ అని అడిగితే-

ఉమ్మడి ఆస్తి యెవరి చేతికో అందించి చేతులు దులుపుకుంటే యెలాగ… దాన్ని కాపాడే బాధ్యత యింటి పెద్దగా నీదే కదా… అని అడిగితే-

నా యీక మీరు పీకలేరు అన్నట్టు చూశాడు!

బొక్కలో తోసేస్తాను అన్నట్టు చూశాడు!

ఈ కుటుంబాన్ని నడిపే బాధ్యతా బరువూ నాది అన్నాడు! ఆ బాధ్యత కోసమే అమ్ముతున్నానని అన్నాడు!

మాయయ్య చేసిన పనే మరో తాగుబోతోడు చేసినాడని తాట తీసి ఠాణాలో పడేసినారు!

మాయయ్య చేసిన పనే మరో దొంగ చేసినాడని కుమ్మేసి జైళ్ళో పడేసి కేసులు పెట్టినారు!

మాయయ్య చేసినంత కాదు కదా కనీసం అవసరానికి యింట్లో పూచిక పుల్ల అమ్మినా  సంసారివేనా అనేసి తిట్టిపోసేసినారు!

అందుకే మాయయ్యను చూస్తే మా కుటుంబానికి చాలా గర్వంగా వుంటుంది!

ఆదాయం లేనప్పుడు ఆస్తులు అమ్మి డబ్బు చేసుకోవడమే ఆర్ధిక అభివృద్ధి! దేశాభివృద్ధి! కుటుంబాభివృద్ధి!

అమ్మితే వచ్చినంత డబ్బు కష్టపడితే రాదు గాక రాదు!

మీ మౌలిక సదుపాయాల కోసమే నా వుపాయం అన్నాడు గర్వంగా మాయయ్య!

పుట్టింది శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ. నివాసం హైదరాబాద్. చదివింది ఎం.ఏ తెలుగు, ఎం.ఏ పాలిటిక్స్. వృత్తి -ప్రవృత్తి రచనే. నాలుగు వందల కథలు, వంద జానపద కథలు, పాతిక వరకూ పిల్లల కథలు రాశారు. కథా సంపుటాలు: రెక్కల గూడు, పిండొడిం, దేవుళ్ళూ దెయ్యాలూ మనుషులూ, మట్టితీగలు, హింసపాదు, రణస్థలి. జానపద కథా సంపుటాలు: అమ్మ చెప్పిన కథలు, అమ్మ చెప్పిన కయిత్వం, అనగనగనగా, పిత్తపరిగి కత, అనగా వినగా చెప్పగా, ఊకొడదాం. అల్లిబిల్లి కథలు పిల్లల కథా సంపుటం. ఒక్కో కథా ఒక్కో పుస్తకంగా వచ్చిన మరో పన్నెండు పుస్తకాలూ- ఇంకా జాతీయాల మీద వచ్చిన పురాణ పద బంధాలు, పిల్లల సమస్యల మీద వచ్చిన ఈ పెద్దాళ్ళున్నారే వంటి పుస్తకంతో ఇరవైయ్యేడు వచ్చాయి. కొన్ని కథలు హిందీ, అస్సామీ, బెంగాలీ, కన్నడ భాషల్లోకి అనువాదమయ్యాయి.

బాసలో ‘కతలు కతలు’, మాతృకలో ‘కతలు వెతలు’, సారంగలో ‘మహారాజశ్రీ’ ‘కరోనా కహానీలు’, విరసం డాట్ ఆర్గ్ లో ‘మెయిల్ బాక్స్’ ‘బుర్ర తిరుగుడు కథలు’, మనంలో ‘వాట్సప్ కథలు’, రస్తాలో ‘ఈ పెద్దాళ్ళున్నారే’ కాలమ్స్ కు తోడుగా ‘కాదేదీ కథకనర్హం’ కొలిమి కోసం ప్రత్యేకం.

5 thoughts on “మై హౌస్… మై పైప్‌లైన్!

  1. అమ్మేస్తాడు. ఏమని అడిగితే కుమ్మేస్తాడు.

  2. ఓటర్లు మతం మత్తులో ఊగుతున్నంత కాలం అన్నీ అమ్ముతరు. ఆఖరికి ఈ దేశం ప్రజలను కూడా అమ్మే స్కీం వస్తుందేమో !

  3. అన్నీ అమ్మేస్తారు. ఇంకా ఎంతమందికి అమ్మలో నిర్దారణ కాలేదు

Leave a Reply