మిస్ వర్ల్డ్, మిస్ యూనివర్స్ (ప్రపంచ సుందరి, విశ్వ సుందరి) వంటి పోటీల విషయంలో అభ్యుదయ, విప్లవ భావాలు గలవారికి ఉండే వ్యతిరేకత అందరికీ తెలిసింది. వాళ్ళు దానిని సామ్రాజ్యవాదం స్త్రీ శరీరాన్ని మార్కెటు వస్తువుగా, చెరబండరాజు మాటల్లో చెప్పాలంటే ‘అంగాంగాన్ని తాకట్టు పెట్టినట్టుగా’ చూశారు. అందాల పోటీల్లో పాల్గొనే స్త్రీలు ఆత్మవిశ్వాస ప్రకటన కోసం, అంతస్సౌందర్య ఆకర్షణ కోసం ఆ పోటీల్లో పాల్గొంటారని, పురుషులు అంగసౌష్ఠవ ప్రదర్శనల వంటివి తప్పు కానప్పుడు స్త్రీల అందాల పోటీల్లో పాల్గొంటే తప్పేమిటి అనేవాళ్లూ కూడా ఉండవచ్చు. అభిప్రాయాలూ ఎట్లా ఉన్నా ఇవాళ ఇవన్నీ మార్కెట్ ప్రయోజనాలతో ముడిపడి తప్ప విడిగా చూడలేని పరిస్థితి ఉంది. 1997 లో అనుకుంటాను అమితాబ్ బచ్చన్ ఎబిసీ అనే సంస్థ స్థాపించి బెంగళూరు లో అంతర్జాతీయ అందాల పోటీ నిర్వహించాడు. అంటే మిస్ వర్ల్డ్ పోటీని తన సంస్థ ద్వారా స్పాన్సర్ చేశాడు. ఆ పోటీల నిర్వహణను ఖండించడమే కాకుండా క్రియాశీలంగా వ్యతిరేకించడానికి ఎ ఐ ఎల్ ఆర్ సి, విరసం, సి ఎం ఎస్, మొదలైన సంస్థల నుంచి ఇరవై మంది దాకా హైదరాబాదు నుంచి బెంగళూరు పోయారు. కాకరాల మద్రాసు నుంచి వచ్చారు. బెంగళూరు టౌన్ హాల్ దగ్గర స్థానిక శివసుందర్, పిడిఎఫ్, ఏఐపీఅర్ఎఫ్ ప్రొఫెసర్లు, బాబయ్య, గోవిందరావు, వాసు, మల్లిక్, నాగరాజు, మొదలైన వారితో కలిసి నిరసన ప్రదర్శన లో పాల్గొని అరెస్టయ్యారు. ఒక రాత్రంతా పోలీసు లాకప్ లో గడిపారు. అప్పటి సి.ఎం.ఎస్ కార్యదర్శి కూడా హైదరాబాదు నుండి పాల్గొన్నది.
అయితే ఇటువంటి విశ్వసుందరి (మిస్ యునివర్స్) పోటీని కూడా ఒక అర్థవంతమైన సందర్భం కోసం, స్వేచ్ఛ ప్రజాస్వామ్య ఆకాంక్షల కోసం ఉపయోగించుకున్న ఒక మిస్ యూనివర్స్ పోటీలో పాల్గొన్న యువతి మాత్రం ప్రతి ఒక్కరూ తనవైపు తల తిప్పి చూసేలా చేసింది. ఆమె తుజార్ వింట్ ల్విన్. ఆమె మైన్మార్ సైనిక ప్రభుత్వం ప్రజలపై, ప్రదర్శనకారులైన ప్రజాస్వామ్యవాదులపై అమలు చేస్తున్న హింసా, దౌర్జన్యం, మారణకాండ గురించి నిరసిస్తూ గొంతెత్తింది.
సాధారణంగా ర్యాంప్ పై ప్రదర్శన ముగిసాక ఈ పోటీలో పాల్గొనేవాళ్లు ప్రదర్శించే ‘వాక్ సౌందర్యం’ కూడా వాళ్ల ఎన్నికకు దోహదం చేస్తుంది. అటువంటి సందర్భాల్లో ఎక్కువ మంది అంతస్సౌందర్యం గురించి, స్త్రీ శక్తి గురించి, ముఖ్యంగా ప్రపంచ శాంతి గురించి మాట్లాడుతుంటారు.
అక్కడ ఆమె అమెరికన్ ప్రేక్షకులకు ప్రపంచానికి ప్రజాస్వామిక శక్తులపై మిలిటరీ విరుచుకుపడి అమలు చేస్తున్న మారణకాండను వివరించింది. ఫిబ్రవరిలో బలవంతంగా అంగ్ సాన్ సూకి ప్రభుత్వాన్ని పడగొట్టడం గురించి మాట్లాడింది. “మా ప్రజలు చనిపోతున్నారు. ప్రతిరోజు కాల్పులకు గురవుతున్నారు” అని ఒక రికార్డెడ్ వీడియో సందేశం వినిపించింది. ఏప్రిల్ లో మైన్మార్ లో జరిగిన ఒక అందాల పోటీలో యాంగన్ (రంగూన్) నుంచి పాల్గొన్న ఒక యునివర్సిటీ విద్యార్థిని తాత్మడా (జాతీయ సైన్యం) దౌర్జన్యం గురించి చాలా ఉద్వేగపూరితమైన ప్రసంగం చేసింది.
ఇటువంటి పోటీల్లో పాల్గొనేవాళ్లను సెలబ్రిటీలు అంటారు. వీళ్లు మాట్లాడితే మాటలకు చాలా ప్రభావం వస్తుంది. ప్రభుత్వాలు ఈ అభిప్రాయాలను గణనలోకి తీసుకోవాల్సి వుంటుంది. మైన్మార్ లో జరిగిన సైనిక కుట్ర, దాడి గురించి మాట్లాడి మళ్లీ మైన్మార్ లో ప్రవేశించలేమని, మిలిటరీ జుంటా కన్నెర్రకు గురవుతామని తెలిసినా వాళ్లు ఈ అరుదయిన అవకాశాన్ని ప్రజల పక్షం మట్లాడడానికి ఎంచుకున్నారు. ఫ్లోరిడా లో తుజార్ వింట్ ల్విన్ తీసుకున్న నిర్ణయం, సౌందర్య పోటీలకు వెళ్తూ ఆమె విమానం ఎక్కే ముందు ఫ్లోరిడా వీధుల్లో చేసిన ప్రదర్శన ఆమెకు జీవన్మరణ సవాల్ అయినా ఆమె ఆ సవాల్ ను స్వీకరించింది. బహుశా ఆమె ఆ పోటీల తర్వాత మైన్మార్ కు ఇంక తిరిగిరాకపోవచ్చు. అక్కడామెకు ఆ కిరీటం కూడా దక్కకపోవచ్చు. కానీ ఆమె ప్రపంచ వ్యాప్తంగా ప్రజల హృదయ వేదికల మీద సాహస కిరీటాన్నలంకరించి కూర్చుంది.
1988 లో సఫ్దర్ హష్మీ అనే ప్రసిద్ధ ప్రజాకళాకారున్ని ఢిల్లీ దగ్గర ఘజియాబాదు లో ప్రదర్శిస్తుండగా కాంగ్రెస్ గూండాలు హత్య చేసారు. అదే సంవత్సరం ఢిల్లీలో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ కు ముఖ్య అతిథిగా వచ్చి షబనా అజ్మీ ఆ సంఘటన ప్రస్తావించి ‘హల్లా బోల్’ అని నినాదమిస్తూ ఆయనకు జోహార్లు పలికింది.