మేల్ ఇగో

చీకటిని చీల్చే ఆక్రందనలు
వినిపిస్తూ ఉంటాయి

బీటలు బారిన గోడ గుండెల్లో
గుబులు ప్రతిద్వనౌతూ ఉంటుంది

ఇంకో‌సారి చేస్తావా …ఆ..
అంటూ రాకాసి హెచ్చరిక
వినిపిస్తూంది తెరలు తెరలుగా

దేహం పై చర్మం ఒలుచుకుపోతున్న
ధ్వనికి గాలి తెర వణుకుతుంది

కోపం పంటి కింద పడి
పటపటమంటున్నట్టు
పక్కటెముక కింద పడ్డ
దెబ్బ
దబ్బున ఓ నిండు మనిషిని పడేసిన
సవ్వడి గోడలు దాటి వీధి చివరిని తాకి

అక్కడే ముడుచుకొని కూచున్న జాగిలం
చెవిలోకి దూరిపోతుంది

తన్నిన తర్వాత అలసటని
తగ్గించుకోవడానికి బయటికొచ్చిన అతడు
ఉమ్మిన ఉమ్ములోంచి
ప్రభుత్వ దుకాణపు బ్రాంది వాసన కు
ఆ పరిసరమంతా మత్తులోకి జారుతుంది

అతడి తాగుడికి బానిసైన
హింస
ఆమె దేహమ్మీద
నొప్పిని గడ్డకట్టిస్తుంది

ఆమె నిట్టూర్పులు
భయంలో నిదుర నటిస్తున్న పిల్లల
కళ్ళలో పీడకలలౌతాయి

మనో నిబ్బరం బండరాయి గా మారిన
ఆమె కాసేపటికి ఓపికని గెలుస్తుంది

అతడి కడుపాకలి తీర్చడానికి కంచాన్నీ
శరీరాకలి తీర్చడానికి పక్కని సిద్ధం చేస్తుంది

హింస తర్వాత కూడా
సిగ్గుపడకపోవడం
మేల్ ఇగో ముఖ్యలక్షణం

రెండు ఆకళ్ళూ
తీర్చుకొన్నాక
అతడికి నిద్రపట్టింది

ఆమె ఎప్పుడూ
శూన్యంలోనే కదా తొంగుండేది

కడప జిల్లా ప్రొద్దుటూరు వాసి. 1998 నుంచి కవిత్వం, కథలు రాస్తున్నారు. ఇప్పటి వరకూ 100 కు పైగా కవితలూ 12 కథలూ, అడపా దడపా వ్యాసాలు రాశారు.

Leave a Reply