మేరా ఇండియా మహాన్!

మేక్ ఇన్ ఇండియా!

“డాడీ.. డాడీ.. రోడ్డు మీద పెద పేద్ద మేకులు పాతుతున్నారెందుకు?”

“ఫార్మర్స్ ప్రొటెస్టులు చేస్తున్నారు కదా?, అందుకు!”

“మరి ఫార్మర్సు కాళ్ళకు గుచ్చుకుంటే సెప్టిక్ అవుతుంది కదా?”

“ఊ!”

“ఫార్మర్సుని గాయపరచడం నేరం కదా?”

“…………………………………………….”

“ఔనూ మరి అప్పుడు పంటలెవరు పండిస్తారు?”

“…………………………………………”

“అప్పుడు మనం యేమిటి తింటాం?”

“………………………………………….”

“మేకులు తినాలి!”

“………………………………………….”

***

మేడ్ ఇన్ ఇండియా!

దారికడ్డంగా ముళ్ళు కాదు, యేకంగా గునపాల్లాంటి మేకులు పరిచారు! సిమెంటుతో చదును చేశారు!

అయినా రైతులు ఆగలేదు! అడుగు ముందుకే వేశారు! నెత్తురు సుర్రున చిమ్మింది!

అదే అదునుగా లాఠీచార్జ్‍‌‍‌ తో పాటు వాటర్ చార్జ్ చేశారు!

నేలా మనిషీ తడిచి ముద్దయ్యారు! రోడ్లన్నీ నీళ్ళయ్యాయి! సిమెంటూ తారూ కరిగి కొట్టుకుపోయింది! అంతా బురద బురదయ్యింది!

నీళ్ళల్లో యినుప మేకుల మొనలు కిందపడ్డ సూర్యుళ్ళలా మెరుస్తున్నాయి!

రైతుల చేయి తగిలి మేకులు నార్లు అయ్యాయి?!

నారుని వుడిచాయి కొంగులూ తలపాగాలూ!

అంతే, అప్పటికప్పుడు అక్కడొక పంట పొలం వెలసింది!

***

ఫార్మర్స్ ఇన్ ఇండియా!

“నక్సలైటా?”

“కమ్యూనిస్టా?”

“ఫార్మర్ అయితే కాడు?!”

“మేకులు మీద కూడా నడుస్తూ వస్తున్నాడు?”

“ఆ బ్లడ్ శాంపిల్స్ తీసి వెంటనే ఇంటలిజెన్స్ వాళ్ళకు ఇన్వెస్టిగేషన్‌కు పంపించండి!”

***

ప్రాజెక్ట్స్ ఇన్ ఇండియా!

“పటేల్ స్టాట్యూ కట్టేశారుగ?!”

“ఇక్కడ యేదో ఆనకట్ట కడుతున్నట్టున్నారు?”

“ఆనకట్ట కాదు, ఫ్లైయ్యోవర్ అయ్యుంటుంది!”

“లేదు, కొత్త పార్లమెంటు భవనం కడుతున్నట్టున్నారు!”

“కాదు, కాదు చైనా వాల్‌లాగ ఇండియా వాల్ కడుతున్నట్టున్నారు?!”

“కడితే కట్టారు, దేశ సరిహద్దుల్లో కట్టాలిగాని, రాజధాని సరిహద్దుల్లోనా?”

***

బోర్డర్స్ ఇన్ ఇండియా!

“ప్రజలకూ ప్రభుత్వానికీ మధ్య ఖచ్చితంగా దూరం వుండాలి!”

“అదేంటి?”

“అప్పుడే ప్రజలకు శాంతి… ప్రభుత్వానికి భద్రత!”

“ఎలా?”

“ఇలా!”

***

వాటర్ ఫాల్స్ ఇన్ ఇండియా!

అప్పుడెప్పుడో వాళ్ళు తమ పంట పొలాలకు నీళ్ళు అడిగారు!

ఇవ్వలేదు!

అడిగినవాళ్ళ మీద యిప్పుడు ఆపకుండా వాటర్ ఫాల్స్!!

***

పీపుల్ పల్స్ ఇన్ ఇండియా!

“మనం లారీలూ బస్సులూ ఫ్రీగా వేసినా రారు గదరా?”

“ట్రాక్టర్ల మీద వచ్చేశారు సార్…”

“మనం రోజుకు వెయ్యి యిచ్చినా యింతమంది…?”

“ఔను, తేలేం సార్…”

“మనం మందు పోసినా….”

“ఇంతమంది రారు సార్…”

“బిర్యానీలూ భోజనాలూ పెట్టి అల్లుళ్ళలా చూసుకున్నా కూడా…”

“వాళ్ళకు వాళ్ళే వచ్చి రోడ్లమీద వంటలు చేసుకుంటున్నారు సార్…”

“వీళ్ళకు యేమి పట్టిందిరా?”

“అప్పటికీ అన్ని దారులూ మూసేశాం సార్… సిటీ అవుట్ కట్సులోనే ఆపేశాం సార్…”

“లాఠీచార్జీ వాటర్‌చార్జీ చేసినా…?”

“బెటాలియన్సుకు బెటాల్సియన్సు దింపినా వాళ్ళకు లెక్కలేదు సార్…”

“కేసులు పెట్టండి…”

“అరెస్టులేం కర్మ… అదృశ్యం కూడా చేస్తున్నాం సార్… వందలమందిని జైళ్ళలో తోస్తున్నాం సార్…”

“ఇజ్జత్ పోతోంది, యెలాగయినా కంట్రోల్ చెయ్యండి…”

“సార్… పవరూ యింటర్నెట్టూ కట్ చేశాం సార్… వాటర్ అందకుండా చేశాం సార్… టెంట్లూ టాయిలెట్లూ లేకుండా కూడా చే…”

“గుడ్…”

“కాని వాళ్ళు సోలార్ కరెంట్ తయారు చేసుకుంటున్నారు, బోర్లు తవ్వుకుంటున్నారు…”

“ఎవరి సపోర్ట్ వుందిరా వీళ్ళకి?”

“మనల్ని సపోర్ట్ చెయ్యని జర్నలిస్టుల మీద రోజూ కేసులు పెట్టి బొక్కలో వేస్తూనే వున్నాం సార్…”

“చంపి పారెయ్యాలి కొడుకుల్ని…”

“ఆల్రెడీ నూటాఅరవైమంది దాకా ఫార్మర్స్ పోయారు సార్…”

“ఛీ… దేశం పరువు పోయింది…”

“ఔను సార్… మన పరువు… అదే- దేశం పరువు పోయింది…”

“మన ఇంటలెక్చువల్సుని సినిమా ఆర్టిస్టుల్ని దించండి”

“క్రికెటర్సుని కూడా దించి స్టేట్మెంట్లు యిప్పించాం సార్…”

“దేశభక్తి లేన్నాకొడుకులు…?”

“అందుకే టెర్రరిస్టులని కూడా ట్రోల్ చేయిస్తున్నాం సార్…”

“ఖలిస్తాన్ వుద్యమమని… ఫార్మర్సుకు పాకిస్తాను మద్దతు వుందని కూడా మీడియాతో… మన ఐటీ వింగ్‌తో…”

“చాలదు, యింకా యేదో చెయ్యాలి…”

“చైనా హస్తముందని చెపుతున్నాం సార్… అవసరమైతే తాలిబన్ల హస్తముందని కూడా…”

“హు… ఆ రాముడే కాపాడాలి!”

“రామాలయానికి చందాలు దండిగా దేశమంతా వసూలు చేయిస్తున్నాం సార్…”

“బడ్జెట్ వచ్చినా కొద్దిగైనా డైవర్ట్ కాలేదా?”

“లేదు సార్… మనం రైళ్ళూ వోడలూ విమానాలూ బ్యాంకులూ యల్లైసీలూ స్టీల్ ప్లాంట్లూ యేమి అమ్మేసినా పట్టడం లేద్సార్…”

“దేశమంటే లెక్క లేదయ్యా జనాలకి…”

“ఔన్సార్… సర్… అసలు ఆ వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకుంటే?”

“అప్పుడిక అన్నిటి మీదా మనం వెనక్కి తగ్గాలి!”

“ఏం చేద్దాం సార్?”

“ఆ రైతుల్ని యెప్పటిలాగే చర్చలకు పిలవండి…”

“పన్నెండోసారి… సారీ… యెందుకు సార్…?”

“మరికొంత కాలం పోస్టుపోన్ చెయ్యడానికి…!”

“ష్యూర్ సార్… స్సూపర్సార్…”

***

మ్యూజియం ఇన్ ఇండియా!

శత్రుదేశాల వాళ్ళు దండెత్తి రాలేదు!

యుద్ధమూ లేదు!

శాంతి!

విత్తు మొలకెత్తినంత ప్రశాంతంగా! పొలంలోకి దిగినంత పట్టుగా! అదును చూసి పంట వేసినంత వొడుపుగా! చేలల్లోంచి వాళ్ళు ‘చలో’ అన్నారు!

అంతే, రాజు వులిక్కిపడ్డాడు! దారులు మూయించేశాడు! రహదారులు తవ్వించేశాడు! నడిచినంత మేర!

అంతర్గత భద్రతా సిబ్బంది నమ్మకమివ్వలేకపోయారు!

రాజు గారిప్పుడు తన కోట చుట్టూ లోతైన కందకం తవ్వించుకున్నారు!

ఆ కందకంలో నీళ్ళు నింపితే బావుంటుందన్నారు నమ్మినబంట్లు!

కాపలాదార్లను పెట్టినా ఆ నీళ్ళలో పెద్దపెద్ద మొసళ్ళను వదలాలన్నారు ఆస్థానబంట్లు!

అప్పుడు కోటలో దర్జాగా వుండి మీరు పాలించొచ్చునని కీర్తించారు ఘనాపాటిబంట్లు!

అప్పుడు కోట వొక మ్యూజియం అయిపోతుందన్నారు విదూషకులు!

***

ఫోన్ కాల్ ఇన్ ఇండియా!

“మాకూ రైతులకు మధ్య ఫోన్ కాల్ అంత దూరమే వుంది”

“మరి అరవైరోజులుగా రైతులు వుద్యమిస్తున్నారు కదా?”

“చెప్పాంగా… మాకూ రైతులకు మధ్య ఫోన్ కాల్ అంత దూరమే వుంది”

“మరి యిలా రోడ్లు తవ్వేస్తున్నారెందుకు?”

“హు… చెప్తే వినరా… మాకూ రైతులకు మధ్య ఫోన్ కాల్ అంత దూరమే వుంది”

“ఓహో… అర్థమైంది… అయితే టెలిఫోన్ కేబుల్స్ వెయ్యడానికి మీరు రోడ్లు తవ్వుతున్నారు!”

***

పవర్ ఇన్ ఇండియా!

“రైతుల మీద వాటర్ కెనాన్సుతో నీళ్ళు కొట్టడాన్ని యేవిధంగా సమర్ధించుకుంటారు?”

“రైతులకు నీళ్ళూ కరెంటూ కట్ చేశామని ప్రభుత్వ వ్యతిరేకులు ప్రచారం చేస్తున్నారు కదా?”

“అర్థం కాలేదు…”

“రైతుల మీద నీళ్ళు కొట్టి స్నానాలు చేయిస్తున్నాం…”

“ఆ…?”

“దేశభక్తి వుంటే అన్నీ పాజిటివ్‌గా కనిపిస్తాయి…”

“నిజమే సార్, రైతుల్లో చాలా కరెంటు వుంది, మీకు సప్లయ్ చేస్తారు…!”

“ఆ…!”

***

టాక్స్ ఇన్ ఇండియా!

“రండి కూర్చోండి… కూర్చోండి”

“రోడ్లమీదా మేకులే, యిక్కడా మేకులే, యెక్కడా మేకులే… యేమిటిది?”

“సమస్య మేకు లాంటిది, సో- చర్చిద్దామని!”

“మేకుల మీద కూర్చోమంటారా?”

“యస్… మీరు మధ్యలో లేచి వాకౌట్ చెయ్యకుండా బాగుంటుంది”

“ఏం మాట్లాడుతున్నారు?”

“ఓ డజను దఫాలు చర్చించాం, యీసారి చర్చలు విఫలం కాకూడదు… కూర్చుంటే లేవకూడదు, చర్చలు తేలేదాక!”

“మీరు మాత్రం యెప్పటికీ ఆ సీట్లో కూర్చుంటారా?”

“అంతేకదా? హహ్హహ్హా…”

“ఎప్పటికీ ఆ సీట్లో వుండేలా మీ మీదనుంచి మేకులు దించమంటారా?”

***

టెర్రరిస్ట్స్ఇన్ ఇండియా!

“కుక్కని కొట్టే ముందు పిచ్చికుక్కని చెయ్యాలి!”

“కోడిని కొయ్యాలంటే ముందు మసాలా నూరాలి!”

“కాదు, ఆ కోడిని ముందు యాంటీ సోషల్… యాంటీ నేషన్ కోడిని చెయ్యాలి!”

“అయితే… అర్బన్ నక్సలైటు కోడి?”

“ఊహూ… పాతదైపోతుంది…”

“మరయితే యీ కోడికి యే పేరు పెడదాం?”

“ఖలిస్తాన్ కోడి?”

“ఊ… పాకిస్తాన్ కోడి?”

“చైనా కోడి?”

“ఏదైనా యిది టెర్రరిస్టు కోడే!?”

***

పోయెట్రీ ఇన్ ఇండియా!

ప్రదానమంత్రిగారు తెలుగులో మాట్లాడారు!

“దేశమంటే మట్టి కాదోయ్… దేశమంటే మేకులోయ్!”

గురజాడ గుండె గతుక్కుమంది!

“సొంత కొంత లాభం మానుకు, పొరుగు వాడికి తోడుపడవోయ్…”

“ఎవరా పొరుగువాడు?” ఆదుర్దాగా అడిగారు గురజాడ.

అదీ తెలీదా అన్నట్టు చూసి గెడ్డం నిమురుకుని “ఆదానీలు… అంబానీలు” అని చెప్పారు!

ఏముంది?, గురజాడ గుండె మళ్ళీ ఆగిపోయింది!

***

డెఫినిషన్స్ ఇన్ ఇండియా!

అది పాదం అన్నారు కొందరు!

కాదు… ఆకలి పొట్ట అన్నారు మరికొందరు!

లేదు… మన గొంతు అన్నారు యింకొందరు!

కాదు కాదు… యీ దేశ అభివృద్ధి అన్నారు ఆర్ధికవేత్తలు!

లేదు లేదు… యీ దేశ భవిష్యత్తు అన్నారు ఆలోచనాపరులు!

కురుక్షేత్రంలో భీష్ముడు చావు వచ్చేదాక బాణముల మీద పడుకున్నాడు… మనదేశ రైతు చావు కాదు, బతుకు తేలేదాక మేకులమీద నడుస్తున్నాడు అన్నారు కవులు!

అది పాలకుల గుండె అన్నారు ఆవేశపరులు!

ప్రపంచ పటం మీద మన పరువు అన్నారు దేశభక్తులు!

మొక్కలు నాటే చోట మేకులు నాటింది యెవరు అన్నారు పర్యావరణవాదులు!

‘ఈ దేశం నోటికి అన్నం అందించాలంటే యెన్నెన్ని మేకులు మింగాలో కదా?’ అన్నారు రైతులు!

***

ట్వీట్ ఇన్ ఇండియా!

వన్ నేషన్!

వన్ గాడ్!

వన్ రేస్!

వన్ రిలీజియన్!

వన్ కల్చర్!

వన్ లాంగ్వేజ్!

వన్ పార్టీ!

వన్ ఎలక్షన్స్!

వన్ అండ్ ఓన్లీ ట్వీట్!

***

సెలబ్రిటీస్ ఇన్ ఇండియా!

“ఉద్యమం గురించి మనం యెందుకు చర్చించట్లేదు’ అని రెహన్నా అన్నదాంట్లో తప్పేముంది?”

“విదేశేయులెవరండీ మనగురించి మాట్లాడడానికి?”

“అవున్లెండి… విదేశీ పెట్టుబడులు ఆహ్వానించొచ్చు, యిదే రైతుల పంటని యెవరికైనా విదేశాలకైనా అమ్ముకోవచ్చు కాని…”

“దేశ సమగ్రతకూ సార్వభౌమత్వానికీ భంగం కాదా?”

“నిజమేనండి… మనదేశ రైతులు టెర్రరిస్టులు అయినప్పుడు, దాని మీద వొక ట్వీట్ చేస్తే అది ఖచ్చితంగా దేశ సమగ్రతకూ సార్వభౌమత్వానికీ భంగమే!”

“సమస్యలు వస్తే పరిష్కరించుకొనే శక్తి మనదేశానికి వుంది!”

“లేదని యెవరన్నారు?, చర్చించి పరిష్కరించమనే కదా అనేది?”

“దేశం ఐక్యంగా వుంది!”

“రైతులు ఐక్యంగా వున్నారు!”

“పాప్ స్టార్లూ పోర్న్ స్టార్లూ చెప్తే నేర్చుకోవలసిన స్థితిలో మనదేశం లేదు!”

“మరి రెహన్నా గ్రేటా థన్‌బర్గ్ ట్వీట్లు చేసిన తర్వాతే మీరు యెందుకు ట్వీట్లు చేశారు?”

“అది… అది… మా దేశమంటే మాకు భక్తి!”

“రైతులు మన దేశంలో భాగం కాదా?, వాళ్ళంటే ప్రేమ లేదా? వాళ్ళ సమస్య గురించి వొక్కసారి కూడా యెందుకు స్పందించలేదు?”

“ఇప్పుడు స్పందిచాల్సివచ్చింది?”

“అదే… యిప్పుడే యెందుకు?”

“అది… అది…”

“మిమ్మల్ని దేశ ప్రజలు యెలా ట్రోల్ చేస్తున్నారో చూశారా?”

“యెస్…..స్…”

“మీరు రైతుల పక్షం ప్రజల పక్షం కాదని బయటపెట్టుకున్నారు…”

“ఏం చేస్తాం… అంతా ఖర్మ!”

“నిజం చెప్పండి… జనం అర్థం చేసుకుంటారు!”

“మా బాధలు మీకు తెలీవండీ, మా యిళ్ళమీద పడి సోదాలు చేస్తారు… ఇన్కమ్ టాక్స్ అని ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అని… చివరకు సీబీఐ దాక అందరూ మా మీద దాడులు చేస్తారు”

“అర్థమైంది…”

“మీకేం అర్థం కాలేదు, అయితే మా మీద నెట్ జన్లు యిలా పడరు…”

“నిజమే….”

“ఏంటి నిజం? అవార్డులిచ్చిన వాళ్ళకి ఆమాత్రం సపోర్ట్ చెయ్యమా అండీ… ఆ…?”

“చెయ్యాలి…”

“మేమదే చేశాం!”

“ఔను, లేకపోతే లేనిపోని కేసుల్లో యిరికిస్తారు!”

“అంత ఇంటర్నేషనల్ ఫిగర్… గ్రేటా థన్‌బర్గ్ ట్వీట్ చేసిందని మన దిల్లీ పోలీసులు కేసు పెట్టారు, చూశారా?”

“ఔను, చూశాను!”

“రెహన్నా, గ్రేటా థన్‌బర్గ్, మీనా హారిస్ దిష్టిబొమ్మలు తగలబెడుతున్నారు… చూశారా?”

“చూశాను…”

“చూసి కూడా యిలా యెలా మాట్లాడగలుగుతున్నారండీ?”

***

ఈక్వాలిటీ ఇన్ ఇండియా!

“రిపబ్లిక్ డే అల్లర్లనిబట్టి అయినా అర్థం చేసుకోవాలి, యాంటీ సోషల్ యెలిమెంట్స్ మూమెంట్లోకి వచ్చేశారు!”

“అవునా?”

“మరి?, ఎర్రకోట మీద జెండా ఎగరేశారు చూళ్ళే?”

“అందరినీ కాకుండా కొంతమందిని కావాలనే కోటలోకి వదిలి, అవకాశమిచ్చి ఆపై దేశద్రోహులు అని చెప్పడానికి దేశభక్తులే ప్లాన్ చేసిందని అంటున్నారు”

“పొలిటికల్‌గా ఇష్యూని చూడకూడదు…”

“ఎవ్విర్‌థింగ్ యీజ్ పొలిటికల్! కార్పొరేట్ల చేతుల్లో అగ్రికల్చర్ మొత్తం పెట్టాలని ప్రభుత్వం చూస్తోంది. లేకపోతే వద్దు మొర్రో అంటే రైతుల అభివృద్ధికి యింత పంతం యెందుకు?”

“మాకు రైతులు వేరు కాదు, కార్పొరేట్లు వేరు కాదు, మేం యిరువురిని వొకేలా చూస్తున్నాం”

ఈ చర్చంతా వింటున్న రైతులు బుర్రలు గోక్కున్నారు!

ఇంతలో ‘రైతు వుద్యమాన్ని నడుపుతున్న ఆలిండియా కిషాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ నేతలు యీ దేశం విడిచి విదేశాలకు వెళ్ళిపోవడానికి వీళ్ళేదు’ అని ఆదేశాలు జారీ అయ్యాయి!

“పడ్డ పెద్ద కార్పొరేట్లపట్ల కూడా ప్రభుత్వం కఠినంగా వుంది!”

“ఔను, విజయమాల్యా నుండి నీరవ్ మోడీ వరకు అందర్నీ జాగ్రత్తగా దేశాలు దాటించేశారు!”

“వాళ్ళని ఇండియా రప్పించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది!”

“అంత శ్రమ ప్రభుత్వానికి యెందుకు?, నల్ల కుభేరుల లిస్టు బయటపెట్టమను చాలు, వాళ్ళని పట్టుకున్నంత ఫలితం!”

“అద్సరే, మమ్మల్ని దొంగలూ డెకాయిట్సుతో పోల్చారన్న మాట, బాగుంది” అన్నారు రైతులు!

“జై జవాన్… జై కిసాన్” అని దూరంగా ఎర్రకోట మీద నుండి ప్రతిధ్వనిస్తూనే వుంది!

***

విజన్ ఇన్ ఇండియా!

“ప్రపంచం గ్లోబల్ విలేజ్ అయిపోయింది, సో, యెవరు యేదన్నా మాట్లాడతారు!”

“అది బిజినెస్ వరకూ వోకే, బట్…”

“ఏ బిజినెస్ వుందని ట్రంప్‌గారికి ప్రచారం చేశారు!”

“దేశాల నాయకులు కలుసుకోవచ్చు, ప్రజలు కలుసుకోకూడదు”

“ఎందుకో?”

“అప్పుడు సరిహద్దులు చెరిగిపోతాయి!”

“మంచిదే, విశ్వమానవుడు ఆవిష్కృతమవుతాడు!”

***

(గౌరవ చిత్రకారులు సతీష్ ఆచార్య, అలోక్‌లతోపాటు అనేకమంది ఫోటోగ్రాఫర్లకు కృతజ్ఞతలతో)

#FarmersProtest #StandWithFarmers

పుట్టింది శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ. నివాసం హైదరాబాద్. చదివింది ఎం.ఏ తెలుగు, ఎం.ఏ పాలిటిక్స్. వృత్తి -ప్రవృత్తి రచనే. నాలుగు వందల కథలు, వంద జానపద కథలు, పాతిక వరకూ పిల్లల కథలు రాశారు. కథా సంపుటాలు: రెక్కల గూడు, పిండొడిం, దేవుళ్ళూ దెయ్యాలూ మనుషులూ, మట్టితీగలు, హింసపాదు, రణస్థలి. జానపద కథా సంపుటాలు: అమ్మ చెప్పిన కథలు, అమ్మ చెప్పిన కయిత్వం, అనగనగనగా, పిత్తపరిగి కత, అనగా వినగా చెప్పగా, ఊకొడదాం. అల్లిబిల్లి కథలు పిల్లల కథా సంపుటం. ఒక్కో కథా ఒక్కో పుస్తకంగా వచ్చిన మరో పన్నెండు పుస్తకాలూ- ఇంకా జాతీయాల మీద వచ్చిన పురాణ పద బంధాలు, పిల్లల సమస్యల మీద వచ్చిన ఈ పెద్దాళ్ళున్నారే వంటి పుస్తకంతో ఇరవైయ్యేడు వచ్చాయి. కొన్ని కథలు హిందీ, అస్సామీ, బెంగాలీ, కన్నడ భాషల్లోకి అనువాదమయ్యాయి.

బాసలో ‘కతలు కతలు’, మాతృకలో ‘కతలు వెతలు’, సారంగలో ‘మహారాజశ్రీ’ ‘కరోనా కహానీలు’, విరసం డాట్ ఆర్గ్ లో ‘మెయిల్ బాక్స్’ ‘బుర్ర తిరుగుడు కథలు’, మనంలో ‘వాట్సప్ కథలు’, రస్తాలో ‘ఈ పెద్దాళ్ళున్నారే’ కాలమ్స్ కు తోడుగా ‘కాదేదీ కథకనర్హం’ కొలిమి కోసం ప్రత్యేకం.

One thought on “మేరా ఇండియా మహాన్!

Leave a Reply