మృణాల్‌సేన్‌ – తెలుగునేల అనుబంధం

ప్రత్యామ్నాయ బెంగాలీ సినిమా త్రయంలో చివరివాడు మృణాల్‌సేన్‌ 2018 డిసెంబర్‌ 30న తన 95వ యేట మరణించాడు. రుత్విక్‌ఘటక్‌, సత్యజిత్‌రేలకన్నా ఎక్కువకాలం జీవించాడు. ఎక్కువ సినిమాలకు కూడ దర్శకత్వం వహించి ఉంటాడు. రుత్విక్‌ఘటక్‌ బెంగాలీ సినిమాలోకి ఆదివాసీ, జానపద వీరగాధలు, చిటగాంగ్‌ , కళాసంప్రదాయం మొదలు ఒక సుదీర్ఘ విప్లవ సంప్రదాయాన్ని, సామ్రాజ్యవాద, భూస్వామ్య వ్యతిరేక సంప్రదాయాన్ని , విప్లవ దేశీయ కాల్పనికతతో, నాటకీయతతో తెస్తే, సత్యజిత్‌రే అచ్చమైన జీవిత వాస్తవికతను తెచ్చాడు. వర్తమాన భారతాన్ని పూర్తిగా మన ఊహలకు, వ్యాఖ్యానాలకు వదిలివేస్తూ అద్భుతమైన నిరపేక్షకాలు సటిల్‌గా కళాకారుడుగా తెచ్చాడు. రే జపాన్‌ సినిమా నుంచి ఆసియా ప్రత్యామ్నాయాన్ని తెస్తే (ఇటాలియన్‌ ‘బైస్కిల్‌ తీఫ్‌’ ప్రభావం అయితే అందరిమీదా ఉంటుంది) మృణాల్‌సేన్‌ మార్క్సిజాన్ని, జర్మనీ ఫ్రెంచ్‌ విప్లవ తత్వాన్ని తెచ్చాడు. అయితే నిత్యజీవితంలోని చిన్న చిన్న సంఘటనల చుట్టూ కథ అల్లి సమకాలీన సంక్లిష్ట, సామాజిక, ఆర్థిక రాజకీయ వాతావరణాన్ని చూపడంలో ఆయన తనదైన ముద్ర బెంగాలీ సినిమా మీదనేకాదు, హిందీ సినిమా మీద కూడ వేసాడు.

అట్లా ఆయన ‘భువనషోమ్‌’ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు కూడ పరిచయమై వాళ్ల హృదయాల్లో చోటుచేసుకున్నాడు. ఆ సినిమాలో తన సందుపళ్ల మధ్యన సిగార్‌ ఇరికించుకొని ఉత్పల్‌దత్‌ కొత్త మ్యానరిజమ్స్‌ ప్రవేశపెట్టి చెప్పే బెంగాలీబాబు డైలాగులు ఆ సినిమా చూసిన వాళ్లెవరూ ఇప్పటికీ మరచిపోరు. బహుశా అప్పటినుంచే ఉత్పల్‌దత్‌ హిందీ సినిమాల్లో కూడ చాలపెద్ద క్యారెక్టర్‌ యాక్టర్‌ అయ్యాడు. బహుశా బెంగాలీ నాటకరంగం మీద గాఢమైన ముద్రవేసి, నక్సల్బరీ ప్రభావంతో ‘కల్లోల్‌’, ‘తీర్‌’ వంటి నాటికలు రాసి చారుమజుందార్‌ దగ్గర తాను కళ గురించి నేర్చుకున్నానని చెప్పిన ఉత్పల్‌దత్‌ ఈ సినిమాతో నటుని అవతారమెత్తాడు. పాపులర్‌ నటుడయ్యాడు. ఈ సినిమాలోనే అమితాబ్‌ బచ్చన్‌ స్వరం కూడ వింటాం.

నిత్యజీవిత కథలతో ఆయన తీసిన ‘ఏక్‌దిన్‌ అచానక్‌’, ‘ఏక్‌దిన్‌ ప్రతిదిన్‌’ మధ్యతరరగతి కుటుంబాల ఇరవై నాలుగు గంటల జీవితాలు చిత్రిస్తుంది. అందులో ‘ఏక్‌దిన్‌ ప్రతిదిన్‌’లో ఇంట్లో ఎదిగిన మొదటి కూతురు మాత్రమే ఉద్యోగం చేసి ఇల్లు వెళ్లదీస్తుంది. తమ్ముడు నిరుద్యోగి. తండ్రి రోగిష్టి. కూతురు ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటానంటే కుటుంబం కుప్ప కూలిపోతుంది కనుక, తల్లి, తమ్ముడు, ఇంట్లో ప్రతి కుటుంబ సభ్యుడు ఆమె ఉద్యోగజీవితంలో ఏ యువకునితో ప్రేమలోపడి పెళ్లి ప్రతిపాదన తీసుకొస్తుందోనని భయపడుతుంటారు. మాటిమాటికీ బాధ్యతలు గుర్తుచేస్తుంటారు. ఈ సినిమా ఆధారంగా చాలకాలానికి తెలుగులో జయప్రద నాయికగా వచ్చి, సినిమాకు, ఆమెకు విశేష ఖ్యాతి తెచ్చిన ‘అంతులేనికథ’ చూసినవాళ్లకు ఇంతకన్న చెప్పాల్సింది లేదు.

మృణాల్‌సేన్‌ ‘కఫన్‌’ (ప్రేంచంద్‌) కథ ఆధారంగా ‘ఒక ఊరి కథ’ సినిమా తీయాలనుకున్నపుడు మొదట చెరబండరాజుతో మాటలు రాయించాడు ఈ సినిమా మృణాల్‌సేన్‌ దర్శకత్వంలో తీయాలనుకున్న రవి. ఆ తర్వాతకాలంలో నర్సింగరావుతో కలిసి ‘మాభూమి’ తీసిన రవి ఇపుడు అమెరికాలో సెటిల్‌ అయ్యాడనుకుంటాను. కాని ఎందుకో సినిమా స్క్రిప్టుకు ఆ సంభాషణలు సరిపోలేదు. చెరబండరాజు సంభాషణలు రాస్తున్న రోజుల్లో నేను సీతారాంబాగ్‌లో ఉండి ఆ ప్రయత్నాలు చూస్తూ అట్లా మృణాల్‌సేన్‌ గురించి విన్నాను. ఎందువల్లనో కాని ఆ సినిమా విజయవంతం కాలేదు. ఆ తర్వాత వాణిశ్రీని నాయికగా పెట్టి ‘కొండమ్మ’ అనో మరొక అటువంటి పేరుతోనో మృణాల్‌సేన్‌ ఇంకొక సినిమాకు కూడ దర్శకత్వం వహించాడు. కాని అదికూడ విజయవంతం కాలేదు. అయితే అప్పటికే హైదరాబాదులో, వరంగల్‌ ఫిల్మ్‌సొసైటీలో మేము మృణాల్‌సేన్‌ సినిమాలు బెంగాలీలో అప్పటికి ఎన్ని తెప్పిస్తే అన్ని చూడగలిగాము. ఆయనకున్న నక్సల్బరీ ప్రభావ కమిట్‌మెంట్‌ను పోల్చుకోగలిగాము. నక్సల్బరీ ప్రభావంతో ఆయన 1970-72 మధ్య ముఖ్యంగా సిద్ధార్థ శంకర్‌ రే కాలంలో ఆయన కలకత్తా నగరంలో పారించిన యువరక్తం, భీభత్సం నేపథ్యంలో మూడు సినిమాలు తీసాడు. అందులో ‘కలకత్తా 71’ లో రెండు దృశ్యాలు మేం మిత్రులం ఎప్పుడూ మామధ్య చర్చించుకుంటుండే వాళ్లం. ఒకటి – ఒక జనపనార మిల్లు యజమాని తన డైనింగ్‌టేబుల్‌ మీద బెంగాల్‌ కరువుకాలంలో (చిత్తప్రసాద్‌ / ప్రశాంత్‌ముఖర్జీ) వేసిన ‘ఆకలి’ చిత్రాన్ని పెట్టుకుంటాడు. తనతో వింందుకు పిలిచిన ఇతర మిత్రులైన మిల్లు యజమానులకు (లాకవుట్‌కు విరుద్ధంగా కార్మికులు సమ్మెచేసిన రోజుల్లో) ఆ చిత్రాన్ని చూపుతూ తాను ఎపటైట్‌ కోసం – తనజీవితంలో ఎపుడో చిన్నప్పుడే మరచిపోయిన ఆకలిని గుర్తు చేసుకోవడానికి ఆ చిత్రాన్ని పెట్టానంటాడు. రెండవది, కార్మికులు జీవన ప్రమాణాలకు తగిన కూలీరేట్లు పెంచాలని సమ్మెచేస్తే యజమానులందరూ లాకవుట్‌ చేసి, కార్మికుల పోరాటానికి వ్యతిరేకంగా ‘ప్రపంచ పెట్టుబడిదారులారా ఏకంకండి!’ అని కలకత్తా వీధుల్లో ఊరేగింపు తీస్తారు.

మేం ఈ సినిమా వరంగల్‌లో 80లలో చూసినరోజుల్లో భూస్వాముల భూములన్నీ రాడికల్స్‌, రైతుకూలీసంఘం నాయకత్వంలో భూమిలేని పేదలు స్వాధీనం చేసుకొని భూస్వాములు గ్రామాలు వదిలి పట్టణాలు చేరారు – ముఖ్యంగా కరీంనగరర్‌ జిల్లాలో హుజురాబాద్‌ తాలూకాలో గూడూరు భూస్వామి చెన్నకేశవరెడ్డిని గోపగాని రవి, ఆగయ్యల నాయకత్వంలో దళం చంపినాక ఇంక గ్రామాల్లో భూస్వాములు ఉండలేని స్థితి వచ్చి భూసంబంధాలు మారినవి. గతంలో సోషలిస్టు పార్టీ బలంగా ఉన్న రోజుల్లో అందులో ఉండి క్రమంగా ధనికరైతులైన వాళ్ల పట్టు పెరిగింది. అటువంటి ఒకరరిద్దరు ధనికరైతులు జిల్లాపరిషత్‌ ఛైర్మన్‌, ఎంఎల్‌ఎ, సమితి అధ్యక్షుడు వంటివాళ్ల ట్రాక్టర్లు తగులబెట్టి, ఆస్తులు జప్తు చేసి రాడికల్స్‌ చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. అటువంటి గ్రామాల్లో పార్టీలోకి వచ్చి విద్యార్థి ఉద్యమం నుంచి నాయకత్వానికి ఎదిగిన సహచరితో పాటు తూర్పు డివిజన్‌కు పార్టీ నిర్మాణానికి వెళ్లిన సమ్మిరెడ్డి గ్రామం కనుకులగిద్దెలో ‘ధనికరైతులారా ఏకంకండి!’ అని ఒక ఊరేగింపు తీసారు. ఆ ఊరేగింపు గురించి నేనారోజుల్లో ‘కలకత్తా 71’లో చూపిన పెట్టుబడిదారులారా ఏకంకండి ఊరేగింపు దృశ్యం గురించి మీటింగులలో వింటుండేవాణ్ని.

తెలుగుసమాజాన్ని ఎక్కువగా ప్రభావితం చేసిన సినిమా ‘మృగయా’. ఎందువల్లనో కానీ చాల హిట్‌ అయిన కమర్షియల్‌ సినిమాలు తెచ్చే జమ్రుద్‌ టాకీస్‌ (అబిడ్స్‌, హైదరాబాదులో -ఇపుడులేదు) ‘మృగయా’ మార్నింగ్‌షో తెచ్చింది. ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత – ఈ సినిమా ఒడియాలో భగవతీచరణ్‌ పాణిగ్రాహి రాసిన ‘షికారీ’ కథ ఆధారంగా మృణాల్‌సేన్‌ తీసాడు. (ఆ కథలో ఉన్న ‘విప్లవహింస’ గురించి, సిద్ధాంతవ్యాసమే రాసి పిఎచ్‌డి తీసుకున్న మనోరంజన్‌మొహంతి ఒక అద్భుతమైన విశ్లేషణవ్యాసం రాసి ఇటీవల కలకత్తాలో ఆ పుస్తకం రివైజ్డ్‌ ఎడిషన్‌ ‘బంధనాల్లో వికసించే ఊహ, సృజనాత్మకశక్తి’ అనే సెమినార్‌లో విడుదల చేసినపుడు ఆ పేపర్‌ చదివాడు.)

అది బ్రిటిషిండియా రోజుల్లో ఒక బ్రిటిష్‌ ఆఫీసర్‌ ఒక ఆదివాసీ యువకునితో అడవిలో వేటవ్యసనంలో స్నేహం చేసుకొని తనకు కుందేలు మొదలు పులివరకు వేటాడే నైపుణ్యాలు నేర్పిన ఆ యువకునికి బహుమానాలు ఇస్తూ, ఇంటికి తీసుకవచ్చి, తాను, తన భార్యతో తన డైనింగుటేబుల్‌ మీద భోజనం పెడుతూ స్నేహం పెరిగిన నేపథ్యంలో ఆ యువకుడు ఆదివాసీ యువతిని పెళ్లిచేసుకొని మొదటిరాత్రే – యజమాని మంచెమీదికి అడవిమృగం నుంచి పంటను కాపాడడానికి వెళ్లాల్సివస్తుంది. అందుకోసమే, ఆ అవకాశం కోసమే చూస్తున్న యజమాని – మహాజన్‌, అతని ఇంట్లో దూరి అతని నవవధువును బలాత్కరించడానికి ప్రయత్నిస్తే, ఆమె తీవ్రంగా ప్రతిఘటిస్తుంది. ఆ ప్రతిఘటనలో ఆమె వేసిన కేక, మంచెమీద ఉండేలుతో జంతువులను తోలుతున్న సహచరునికి వినొచ్చి ఆ ఉండేలు వేగంతోనే వచ్చి – మూలకున్న గొడ్డలితో ఆ యజమాని తలనరికి, ఆ తలను ఒక చేతిలో పట్టుకొని బ్రిటిష్‌ దొర దగ్గరికి పరుగెత్తుతాడు అన్నిటికన్న విలువైన బహుమానం పొందుతాననుకొని. ఆ దృశ్యాన్ని చూసిన బ్రిటిష్‌ దొర, దొరసాని పోలీసులను రప్పించి అరెస్టు చేయిస్తారు. వాళ్లే సాక్ష్యంగా అతనికి ఉరిశిక్ష పడి, ఉరితీస్తారు. సినిమా ముగిసాక మామాలుగా ఎండ్‌ (ముగిసింది) అని కాకుండా ‘స్టాండప్‌’ అని తెరమీద పడినపుడు అందరికందరం – సినిమాలో అంతే లీనమై లేచినిలబడి – ‘భూమయ్య కిష్టాగౌడ్‌ జిందాబాద్‌ ’ నినాదాలు ఇస్తూ బయటికి వచ్చాం. ఆ సినిమాహాల్లో ఉన్న చాలమందికి భూమయ్య కిష్టాగౌడ్‌ల ఉరరిశిక్షరద్దు ఉద్యమం, ఎమర్జెన్సీలో డిసెంబర్‌ 1, 1975న వాళ్లను ఉరితీయడం తెలుసు. వాళ్లు ఆ ఇద్దరి గురించిన సినిమాగానే దాన్ని భావించారు. మాలో కొందరికైనా ఆదిలాబాదు జిల్లా గిన్నెదరి భూస్వామి లచ్చుపటేల్‌ను చంపిన కేసులో భూమయ్య కిష్టాగౌడ్‌లకు ఉరిశిక్ష పడిందని తెలుసు. లచ్చుపటేల్‌ చేసిన దుర్మార్గాలు సహించలేక ప్రజలు దళానికి చెప్పుకుంటే ఈ ఇద్దరు అతని తలనరికి ఇట్లాగే చేతుల్లో పట్టుకొని ఊళ్లో ఊరేగారని చెప్పుకున్న దాంట్లో నిజానిజాలు నాకు తెలియవు. కాని శ్రీకాకుళంలో అటువంటి వర్గశత్రు నిర్మూలనలు, వాళ్ల తలలు ఉట్లలో వేళ్లాడదీయడం విన్నాం, ఆదివాసుల కసికి సంబంధించిన కథనాలు.

నక్సల్బరీ కాలం నుంచి కూడ రాజ్యహింస, నిర్బంధాలకు వ్యతిరేకంగా, ప్రజావిజయాలకు సంబంధించిన సంఫీుభావ ప్రకటనలల్లో, సంతకాల సేకరణలో, సహకారంలో మృణాల్‌సేన్‌ వెంటనే తన సంతకం చేసేవాడు. తన సంఫీుభావం ప్రకటించేవాడు. ‘ఆట, మాట, పాట బంద్‌’ చేసి – 1985-89 మధ్యకాలంలో ఎన్టీఆర్‌ అమలు చేసిన రాజ్యహింస, నిర్బంధాల కాలంలో ఎఐఎల్‌ఆర్‌సి చేసిన అఖిలభారత ప్రచార యాత్ర (40 వేల కిలోమీటర్లు – ముఖ్యంగా అప్పటి ఆర్‌వైయల్‌ అధ్యక్షుడు బిఎస్‌ రాములు, జెఎన్‌ఎం సంజీవ్‌, పద్మ తదితరులు)కు కలకత్తాలో ఆయన సంఫీుభావం అందించాడు. అట్లాగే 1992లో కలకత్తాలో ఎఐపిఆర్‌ఎఫ్ (ఆలిండియా పీపుల్స్‌ రెసిస్టెన్స్‌ ఫోరమ్‌) ఏర్పడి ప్రథమ మహాసభలు జరిగినపుడు ఆహ్వానసంఘంలో ఉండడానికి అంగీకరించాడు. 30 ఏళ్ల నక్సల్బరీ సభలు (కలకత్తా) వంటి ఎన్నో సందరర్భాల్లో నేను ఆయనను కలకత్తాలో కలిసాను. ఆయన సహకారం ఎప్పుడూ ఉండేది.

ఒక విచిత్రమైన సన్నివేశం చెప్పి ఆయన – కల్లోల బెంగాల్‌ ప్రతినిధిగా, కల్లోల తెలుగు నేలతో ఉన్న అనుబంధాన్ని – మరచిపోలేని సందర్భంతో ముగిస్తాను.

దేశవ్యాప్తంగా ఎనభైలలో కేంద్రంలో రాజీవ్‌గాంధీ, రాష్ట్రంలో ఎన్టీఆర్‌ల అధికారంలో అమలైన రాజ్యహింస, నిర్బంధాలలో ఆదివాసులు, దళితులు, మైనారిటీలు – ప్రజాస్వామిక ఉద్యమాల్లో ప్రజలు ప్రాణాలు ఒకరిద్దరు కాకుండా సమూహంగా కోల్పోయినపుడు, నిర్వాసితులైనపుడు నిజనిర్ధారణ చేసి, అచ్చం కోర్టుపద్ధతిలో విచారణ చేయడానికి ‘ఇండియన్‌ పీపుల్స్‌ హ్యూమన్‌రైట్స్‌ కమిషన్‌’ – బొంబాయి పియుడిఆర్‌ కార్యదర్శి సెబాస్టియన్‌ సెక్రెటరీ జనరల్‌గా, ఎపిసిఎల్‌సి కార్యదర్శి బాలగోపాల్‌ కార్యదర్శిగా ఏర్పడిరది. బాలగోపాల్‌ ఈ ఏర్పాటుకన్న ముందు, కలకత్తాకు వెళ్లి మృణాల్‌ సేన్‌ను ఛైర్మన్‌గా ఉండడానికి ఒప్పించాడు. ఈ కమిషన్‌ బీహార్‌లో ఎంకెఎస్‌ఎస్‌ పబ్లిక్‌ మీటింగ్‌పై పోలీసుకాల్పులు, చింతపల్లిలో 600 గుత్తికోయల ఇళ్లు తగులబెట్టడం వంటి ఇంకా రెండుమూడు సంఘటనలపై దేశంలో ముంబై మొదలైన వేరువేరు ప్రాంతాల్లో సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులతో పీపుల్స్‌ ట్రిబ్యునల్స్‌ ఏర్పాటు చేసి న్యాయస్థానం పద్ధతిలో విచారణ నిర్వహించి సమగ్రమైన నివేదికలు ప్రజలముందు, ప్రభుత్వం ముందు ఉంచింది. అయితే చింతపల్లిపై ట్రిబ్యునల్‌ విచారణ విశాఖపట్నంలో రిటైర్డ్‌ న్యాయమూర్తులతో మొదలయ్యాక గ్రేహౌండ్స్‌ హాల్‌లో ప్రవేశించి బాధితులను, సాక్షులను చెదరగొట్టారు. దానితో న్యాయమూర్తులు కూడ వెనక్కి పోవాల్సివచ్చింది. ముఖ్యంగా ఈ సంఘటన డాక్టర్‌ రామనాథం హత్యను, నక్సలైటు మిస్సింగ్‌ కేసును, ఇటువంటి ఇంకా కొన్ని ఉద్యమ నిజసంఘటనలు కలిపి ఉమామహేశ్వరరావు అద్భుతమైన సినిమా ‘అంకురం’ తీసాడు. రామనాథం డాక్టర్‌ వంటి పాత్రను చారుహసన్‌ డాక్టర్ మిత్రగా అద్భుతంగా నటించాడు. ముగ్గురు ఆడపిల్లల తండ్రి విలువలు గల టీచర్‌గా బాలయ్య పెద్దకూతురు ట్రెయిన్‌నుంచి అదృశ్యమైన నక్సలైటు పాపను తీసుకొని, అతని ఆచూకి కోసం పోరాడిన పాత్రగా రేవతి, నక్సలైటు పాత్రలో గెస్ట్‌ ఆర్టిస్ట్‌ ఓంపురి అద్భుతంగా నటించారు. డాక్టర్‌ గారి క్లినిక్‌లో ప్రవేశించి ఆయనను పాయింట్‌బ్లాంక్‌గా చంపడమే కాకుండా క్లినిక్‌ను చిందరవందర చేసిన దృశ్యం (లక్ష్మగౌడ్‌ చిత్రంలో – మార్క్స్‌ కొటేషన్‌తో అజరామరమైంది) సినిమాలో డాక్టర్ మిత్ర క్లినిక్ లో జరుగుతుంది. వరంగల్‌జైలు నుంచి విడుదలైన ఆర్‌ఇసి మెస్‌వర్కర్స్‌ను బస్కీలు తీయిస్తూ ఆర్‌ఇసి దాకా నడిపించి గర్భిణిగా ఉన్న నక్షత్రను హింసించిన ఎస్‌ఐ యాదగిరిరెడ్డి వంటి పాత్ర ఇందులో న్యాయవాది దగ్గరికి తమ గూడాలు తగలబెట్టడానికి గ్రేహౌండ్స్‌ వచ్చారని లాయర్‌కు విన్నవిస్తుంటే, లాఠీచార్జి చేసి చెదరగొడితే ఒక ఆదివాసీ స్త్రీకి గర్భస్రావం అయినట్లుగా, ఆ క్రోధంతో ఆ సిఐని చంపినట్లు చూపుతాడు. ఇందులో కొంత డ్రామా మెలోడ్రామా ఉంటుంది.

ఈ చింతపల్లి గుత్తికోయల ఆరువందల ఇళ్లు తగులబెట్టిన విషయంలో పీపుల్స్‌ ట్రిబ్యూనల్‌ వేయడానికి చేసిన ప్రయత్నం, కృషి వివరించడానికి బాలగోపాల్‌ కలకత్తాలో మృణాల్‌సేన్‌ దగ్గరికిపోతూ తాను కలకత్తా పోతున్నాను – ఫలానా కంపార్ట్‌మెంట్‌ అని విశాఖపట్నం చలసానికి ఫోన్‌చేసి చెప్పాడు. ఫలక్‌నుమా విశాఖపట్నం ఉదయం 4 గంటలకు చేరుతుంది. ఆ కంపార్టుమెంట్‌, బెర్త్‌ మొదలు ట్రెయినంతా వెతికినా చలసానికి బాలగోపాల్‌ కలవలేదు. ట్రెయిన్‌ వెళ్లిపోయింది. అసలే చాల గడ్డురోజులు, రెండువైపులా కిడ్నాపులు జరుగుతున్న రోజులు గనుక ఆందోళన చెంది చలసాని కన్నబిరాన్‌కు, ఎపిసిఎల్‌సి అందరికీ సమాచారం అందించాడు. దేశమంతా ఈ వార్త ప్రచారం అయింది. బాలగోపాల్‌ కోసం ఎపి హైకోర్టు సుప్రీంకోర్టుల్లో హెబియస్‌కార్పస్‌ వేసారు. మృణాల్‌సేన్‌కు తెలియచేసారు. మృణాల్‌సేన్‌ను బాలగోపాల్‌ మర్నాడు కలవాల్సి ఉన్నది. (డిసెంబర్‌, 86) ఫలక్‌నుమా ఆ సాయంత్రం దిగి, మర్నాడు ఉదయం బాలగోపాల్‌ మృణాల్‌సేన్‌ ఇంటికి వెళ్లేవరకు ఆయన సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు.

ఆరోజు పేపర్‌ కూడ చూడకుండా వెళ్లిన బాలగోపాల్‌కు తాను చేసిన చిన్న పొరపాటు ఇంత ఆందోళనకు కారణమైందని తెలిసి చాల నొచ్చుకున్నాడు. అదేమిటంటే చలసానికైతే చెప్పాడు కాని, ఆయన పైన బెర్త్‌ ఎక్కి అక్కడ నిద్రపోయాడు. చలసాని వచ్చినపుడు ఆయన గాఢనిద్రలో పైబెర్త్‌లో ఉన్నాడు. అది బాలగోపాల్‌ చెప్పిన నిర్దిష్టమైన బెర్త్‌ కాదు కనుక చలసాని, అన్ని కంపార్ట్‌మెంట్‌లలో ముఖ్యంగా ఇటు, అటు వాటిల్లో నిర్దిష్ట నెంబరు గల బెర్త్‌లు మాత్రమే చూసి ఆందోళన చెందాడు. అక్కడినుంచే వెంటనే కన్నబిరాన్‌కు తెలియచేసి, అందరికీ తెలియచేయమన్నాడు. మృణాల్‌సేన్‌తో చింతపెల్లి గురించిన ట్రిబ్యునల్‌ విషయం, చేసిన కృషి, ప్రగతి వివరించి తిరిగివచ్చి, కన్నబిరాన్‌ సూచనపై ఇక్కడ హైకోర్టులో, మర్నాడు సుప్రీంకోర్టులో హాజరయి తన తరఫున హెబియస్‌కార్పస్‌ గురించి ఏర్పడిన గందరగోళం, అసౌకర్యాల కోసం క్షమాపణ చెప్పుకున్నాడు. ఈ చింతపెల్లిలో తగులబెట్టిన గుడిసెలు చూసి, గుత్తికోయలతో మాట్లాడడానికి విఎస్‌ కృష్ణ స్కూటర్‌పై వస్తున్నపుడే అక్కడ రోడ్డువేస్తున్న రోడ్డురోలర్‌ నుంచి ఆయన భుజంమీంచి చెయ్యి దాకా కాలుతున్న తారుపడినా, అడవి దాటి రోడ్డెక్కే దాకా కృష్ణకు చెప్పకుండా బాలగోపాల్‌ ఓర్చుకున్నాడట. అట్లా బాలగోపాల్‌ పనివ్యగ్రత 1985-86 లలో మృణాల్‌సేన్‌ పీపుల్స్‌ హ్యూమన్‌రైట్స్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా ఉండడానికి పురికొల్పింది. సినిమాను ఒక సామాజిక, రాజకీయ కళా వ్యక్తీకరణగా చూసి, చూపిన మృణాల్‌సేన్‌, దేశ సామాజిక, రాజకీయ స్థితిగతులకూ అట్లాగే స్పందించాడు.

నీల్‌ ఆకాశ్‌ నీచే (1958) నుంచి ప్రత్యేకంగా నక్సలైటు ఉద్యమం, బంగ్లాదేశ్‌ యుద్ధం సందర్భంగా తీసిన కలకత్తా 71-72 ఇంటర్వ్యూ (73) ఎక్‌ దిన్‌ ప్రతిదిన్‌ (79) మాత్రమే కాక, చాలమంది దృష్టికి రాని ఆకాశ్‌కుసుమ్‌ వరకు మృణాల్‌సేన్‌ కలకత్తా జీవితాన్ని చిత్రించినట్లు మఖ్యంగా మధ్యతరగతి జీవితాన్ని చిత్రించినట్లు ఎవరూ ఏ నగర జీవితాన్ని చిత్రించలేదు. బెంగాలీమాట కోల్‌టోలా అంటే నీటికుళాయి కింద స్థలం అని అర్థం. కింది మధ్యతరగతి కుటుంబాల ఉమ్మడి అవసరంకోసం ఏర్పాటుచేసిన వీధి (కమ్యూనిటీ) ట్యాప్‌ అని అర్థం. అక్కడ నీళ్లు తెచ్చుకోవడం, బోళ్లు కడుక్కోవడం, బట్టలు ఉతుక్కోవడం మొదలు ఉతికినబట్టలకు ఉద్యోగాలకు పోయేవాళ్లు గంజిపెట్టుకోవడం వరకు నీళ్లు పడి నాచు ఏర్పడి స్త్రీలమధ్యన గొడవ మొదలై, అందరూ కలిసి శుభ్రం చేయడంలో విప్లవాల నగరంలో స్ఫులింగాలు జ్వాలలయ్యాయంటాడు. ప్రేమ్‌కుమార్‌ బిస్వాస్‌ ‘నీల్‌ఆకాశ్‌ నీచే’ మహాదేవివర్మ కథ మీద ఆధారపడి తీసిన చైనా ఇమిగ్రంట్‌ వర్కర్‌ వాంగ్లూ ఒక గృహిణి బసంతి మధ్య ప్లెటోనిక్‌ లవ్ కథ – స్వతంత్ర భారతం (47 తర్వాత) నిషేధానికి గురయిన మొట్టమొదటి రాజకీయ సినిమా.

(30 డిసెంబర్‌ – మృణాల్‌సేన్‌ వర్థంతి)

Leave a Reply