మూంగ్ ఫలీ

(మలయాళ మూలం: కమలా దాస్
అనువాదం: కాత్యాయని)

జస్మిత్ అహ్లువాలియా, తన నాలుగేళ్ల పాప బిట్టూ కు స్నానం చేయించి లేచేసరికల్లా ఇంటిముందు ఆటో రిక్షా వచ్చి ఆగింది. గురుదాస్పూర్ నుండి అమ్మ వచ్చింది. “ప్రతిసారీ గురునానక్ జయంతికి కానీ రావు కదమ్మా! ఈసారి ముందుగానే వచ్చేశావ్, ఎంత బావుందో!” ఆనందం పట్టలేక పోయింది జస్మిత్.

“బిట్టూ తల్లి నాకోసం ఏడుస్తున్నట్టు పీడ కలొచ్చిందమ్మా! ఆగలేక పోయా!”

బిట్టూ అప్పటికే తల్లి చేతుల్లోంచి విడిపించుకుని అమ్మమ్మ మోకాళ్లకు చుట్టుకుపోయింది.

“స్టేషన్ లో చెప్పిందానికన్నా ఒక్క పైసా కూడా ఎక్కువ ఇవ్వనయ్యా,” అంటూ ఆటో డ్రైవర్ తో గొడవ మొదలెట్టింది పెద్దావిడ.

“నేను ముసలిదాన్ని, మొగ దిక్కు లేనిదాన్ని. గురుదాస్పూర్ లో పాలు అమ్ముకుంటూ పొట్టపోసుకుంటున్న దాన్ని. ఐదు రూపాయలు తప్ప, పైసా ఇవ్వను”

“ఇవ్వమని నేను మాత్రం అడిగానా పెద్దమ్మా,” అన్నాడు డ్రైవర్, పైకి మడిచిన సల్వార్ లోంచి పసిమి వన్నెలో మెరుస్తున్న జస్మిత్ పాదాలను అబ్బురంగా చూస్తూ. “మీరసలు డబ్బులు ఇవ్వనన్నా నోరెత్తను” అని కూడా అన్నాడు.

పెద్దావిడ, తన ఛాతీ దగ్గరి జేబులోని గుడ్డ సంచి లోంచి ఐదు రూపాయల నోటు బయటికి తీసింది. నిండుగా వున్న సంచికేసి ఆనందంగా చూస్తూ “కాస్త చాయ్ తాగుతావా అమ్మా,” అని అడిగింది జస్మిత్.

ముసలావిడ చిరాకుపడింది. “టీ తాగటం చర్మానికి మంచిదికాదని ఎన్నిసార్లు చెప్పాను? తాజా గులాబీలా నవనవలాడుతూ ఉండే దానివి ముప్పయ్యేళ్లు దాటకుండానే ముసలి దానిలా తయారయ్యావు చూడు. లస్సీ తాగొచ్చు కదమ్మా! మన రోహిణి రోజుకు పద్దెనిమిది పింట్ల పాలు ఇస్తోంది తెలుసా! ఒకటో, రెండో పింట్లు ఉంచుకుని మిగతావి అమ్మేస్తా. ఓ డబ్బా నిండా రాయిలాంటి గట్టి నెయ్యి, బిట్టూ తల్లి పేరిట పోస్టాఫీసు లో వేద్దామని మూడొందల రూపాయలు పట్టుకొచ్చా.”

“నువ్వెంత మంచిదానివమ్మా,” అంది జస్మిత్, తల్లి ఒళ్ళో కూచున్న బిట్టూ కేసి మురిపెంగా చూస్తూ.

“ఇంతకూ నీ చదువరి మొగుడు, అదే, మాస్టర్జీ ఏడీ? ఇప్పటికీ రాత్రయ్యేదాకా ఇంటికి రావడం లేదా” అడిగింది తల్లి చుట్టూ పరికిస్తూ.

“ఆయన నన్నెంత బాగా చూసుకుంటారో నీకు తెలీదా అమ్మా. తనేమన్నా తాగుబోతా, తిరుగుబోతా చెప్పు? నాకూ, పాపకూ ఏ లోటు రానివ్వకూడదని ట్యూషన్లు కూడా చెప్తున్నారు. ఒక్కోదానికీ అరవై రూపాయలు ఇస్తారు. స్కూలు జీతంకన్నా ఎక్కువ వస్తోంది మరి!”

“రోజులు బాగాలేవు తల్లీ. చీకటిపడ్డాక నువ్వు ఒంటరిగా ఉండటం మంచిది కాదు.”

“ఇక్కడ భయమేం లేదులేమ్మా.అందరూ మనకు తెలిసిన వాళ్ళే. కీడు తలపెట్టే మనుషులెవరూ లేరు.”

“కానీ వేరే మతాల వాళ్లు… అదే, హిందువులు కూడా ఉన్నట్టుంది కదే తల్లీ!”

“హిందువులుంటే నీకేమి ఇబ్బంది? వాళ్లూ సిక్కుల్లాంటి వాళ్లేకదా!”

“చివరికి నీక్కూడా సిక్కులంటే పడకుండా వచ్చిందా తల్లీ!” అంటూ ఏడుపు మొదలెట్టింది పెద్దావిడ. మనవరాలిని గట్టిగా గుండెలకు హత్తుకుని వెక్కిళ్లు పెడుతోంది.

“ఈ మధ్యన మనవాళ్ళ మీద ఎంతెంత దుర్మార్గాలు జరుగుతున్నదీ నీకసలు తెలుసా? నీ మొగుడు మహానుభావుడు పేపర్లు చదవడా? అకల్ తఖ్త్ లో జరిగిందేమిటి? అంత అన్యాయాన్నిచూసి ఎట్లా వూరుకోగలం?”

“నాకు ఇవేమీ తెలీదులే అమ్మా! నా భర్తనూ, బిడ్డనూ చూసుకోటానికే సరిపోతోంది. ఈ రాజకీయాలు చూసుకోటానికి, దేశాన్ని చక్కదిద్దేందుకు నేనేమన్నా ప్రధాన మంత్రినా?”

“వాహ్! వాహ్! ఏం తెలివి మాలిన మాటలే! నీ అంత మొద్దు మొహాన్ని నేను చూడలేదమ్మా! నీ జాతిని సర్వ నాశనం చేస్తున్నా నీకు చీమ కుట్టినట్టన్నా లేదు!”

ఇంతలో గుమ్మం దగ్గర నుంచి “మూంగ్ ఫలీ, మూంగ్ ఫలీ!” అనే కేక వినబడింది. “బిట్టూ పాపకు షింగాడా కూడా తెచ్చా.”

“ఎవరక్కడ?” అంటూ మనవరాలిని ఒళ్లోంచి దింపి లేచింది పెద్దావిడ.

దాదాపు డెబ్బై ఏళ్ళ వ్యక్తి తలపై బుట్టతో నిలబడున్నాడు. దాన్ని కిందికి దించి, లోపలికి తొంగి చూస్తూ, “బేటీ జీ! ఇంట్లో పొయ్యి వెలిగించి ఉంటే కాసిని వేడి నీళ్లు పెట్టివ్వు తల్లీ,” అని కేకేశాడు. “ఈ చలికాలం వచ్చిందంటే చాలు, ఛాతీలో నొప్పి. నూనె మిల్లు నడుస్తున్నట్టు దడదడలాడి పోతుంది.”

“ఎవరయ్యా నువ్వు? నా కూతురు నీకు వేడి నీళ్ళు అందించాలా? ఎవరిచ్చారు నీకీ స్వతంత్రం?” అంటూ మండి పడింది వృద్ధురాలు.

అతడు చేతులు జోడించి చిరునవ్వు నవ్వాడు. “ఈ వీధిలో నాకు అందరూ తెలుసు పెద్దమ్మా, మిమ్మల్ని చూట్టం ఇదే మొదటిసారి. మాది ఢాకా. దేశం చీలిపోయిన నాటినుంచి ఢిల్లీ లోనే ఉంటున్నా. నాపేరు గురుచరణ్. ఒక్కగానొక్క కూతురు ముస్లిం కుర్రాడిని పెళ్ళాడి నన్ను వదిలేసింది. దాని కబురైనా తెలీదు. అయినా తప్పు నాదే లేమ్మా. ఆ కుర్రాడిని ఇష్టపడ్డానని పిల్ల చెప్పగానే కర్ర తీసుకుని గొడ్డును బాదినట్టు బాదేశా. దాని మనసు విరిగి వెళ్ళిపోయింది. నాన్నను మరిచే పోయింది. నా బిడ్డ వయసు ఆడపిల్లలను చూసినప్పుడల్లా, తనే గుర్తొచ్చి ఏడుపు ఆగదు. నీకూ తెలుసుగా జస్మిత్ తల్లీ?” అన్నాడు అతడు కళ్ళు తుడుచుకుంటూ.

“ఔను, షిం గాడాలు తెచ్చానన్నావు కదా, ఏవీ?” అంది జస్మిత్ మాట మారుస్తూ.

వృద్ధురాలు మౌనంగా చూస్తుండి పోయింది. అతడు బుట్ట లోంచి చిన్న కుంపటి తీసి, బొగ్గులేసి వెలిగించాడు. దానిపై మూకుడు పెట్టి, ఎర్రటి బట్టలో కట్టిన పల్లీలను దాన్లో వేశాడు. వేగుతున్న పల్లీల వాసన గదంతా వ్యాపించింది. బిట్టూ ముక్కు పుటాలు పెద్దవి చేసి గట్టిగా పీల్చింది.

“చాచాజీ, మూంగ్ ఫలీ ఇవ్వు,” అంటూ గులాబీ రేకులాంటి చిట్టి అరచేతిని ముందుకు చాపింది. అతడు ఆ చేతిని ముఖానికి అద్దుకుంటూ ఒక్కొక్క వేలినీ ముద్దాడుతున్నాడు. “అట్లాగే బంగారు తల్లీ ఈ పప్పులన్నీ నీకే,” అన్నాడు నవ్వుతూ.

అతడి ముందు పన్నొకటి ఊడిపోయింది. మిగతా పళ్ళన్నీ పాన్ తో ఎర్రగా గారపట్టాయి. “ఛ, దరిద్రపు మొహం,” అనుకుంది పెద్దావిడ కంపరంగా. తన కూతురు తడిసిన సల్వార్తో, తలపై చున్నీ అయినా లేకుండా అతడి ముందు అంత చనువుగా కూచోవటం చిరాకు పుట్టించింది.

“ఆ పల్లీ లేవో కొనుక్కుని అతన్ని పంపించు. వేరే వాళ్ళకి కూడా అమ్ముకోవాలిగా!”

“నాకు తొందరేమీ లేదులే అమ్మా. ఆమాటకొస్తే పైసలు కూడా అవసరం లేదు. ఇంట్లో ఉన్న గింజలు ఏడాది పాటు కడుపు నింపుతాయి. ఏదో మనుషులను కలవడానికనే ఇట్లా పల్లీలు అమ్మడం. ఒంటి గాడిని, నా కొంపలో మంచీ చెడూ ఏముంటుందమ్మా? ఇట్లా పసి బిడ్డల నవ్వులూ తల్లుల మాటలూ చేవినబడుతుంటే మనసు చల్లబడుతుంది.”

“నేనిప్పుడు నిన్నేమీ అనలేదయ్యా,” అంది ముసలావిడ కాస్త నెమ్మదైన గొంతుతో. అతడి మాటల్లోని నిజాయితీ ఆమె కోపాన్ని కొంచెం తగ్గించింది. “కొత్త మనుషులను నమ్మటం మంచిది కాదని నా కూతురికి చెప్పుకుంటున్నా. మా రోజులు బాగా లేవు. ఏ తప్పూ చెయ్యకున్నా సిక్కులను బతకనిచ్చే పరిస్థితులు లేవు.”

“ఇక్కడ మాకేమీ ఇబ్బంది లేదులేమ్మా. అందరూ మాతో బాగుంటారు. బిట్టూ వాళ్ల నాన్నకు మంచి స్నేహితులంతా హిందువులే – సుఖియాజీ, దేవీ దయాళ్… అందరూ ఎంత మంచి వాళ్ళనీ! తోడబుట్టిన వాళ్ళకన్నా ప్రేమగా చూసుకుంటున్నారు. ఈయనకు జబ్బు చేసినప్పుడు రోజుకు రెండుసార్లు రావడం, అంత దూరాన పూసా రోడ్డు దాకా పోయి, మద్రాసు డాక్టరు దగ్గర మందులు తీసుకు రావడం, అన్నీ వాళ్ళే చేశారు, తెలుసా?”

“అరే, మాష్టర్జీ అట్లా పరిగెత్తుకుని వస్తున్నారేమిటమ్మా?” అంటూ అరిచాడు పల్లీల అతడు.

రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వస్తున్న భర్తను చూసి ఆశ్చర్య పడింది జస్మిత్. ఏమైందని అడుగుతుంటే ఆమె గొంతు వణికింది. ఆయన పని చేసే స్కూల్ ను ఎవరైనా తగలబెట్టలేదు కదా, అనిపించింది.
ఆమె భర్త వాకిట్లోని చార్ పాయి మీద కూలబడి తలమీదున్న నీలం రంగు టర్బన్ ను తీసేశాడు. “ఏమైంది నాయనా, ఏదో భూతాన్ని చూసినట్టు అట్లా వణికిపోతున్నావేమిటి?” అడిగింది అత్తగారు.

“భూతం కాదమ్మా, అంతకన్నా భయంకరమైన మనుషులను చూశా, నావంటి వాళ్లనందరినీ చంపి పారేస్తున్నారు. ఆమె… చనిపోయింది… చంపేశారు.”

“ఎవరు… ఎవర్ని చంపేశారు?” అయోమయంగా అడిగింది.

“ఇంకొంచెం మూంగ్ ఫలీ ఇవ్వు చాచా జీ,” అంటూ మారాం చేస్తున్న బిట్టూ అల్లరి మధ్య నుంచి, ఆయన గొంతు బలహీనంగా పలికింది, “ఇందిరా గాంధీ,” అంటూ.

“అయ్యో, అయినా అంతా ఆ భగవంతుడి అభీష్టం. అఖల్ తఖ్త్ మీదికి సైన్యాన్ని తోలినప్పుడు ఆలోచించాలి కదా!”

“నోర్ముయ్,” అంటూ మండి పడింది జస్మిత్. “నువ్వేం వాగుతున్నావో తెలుస్తోందా?”

“ఆమె బాడీ గార్డులే ఆమెపై కాల్పులు జరిపి హత్య చేశారు. వాళ్ళిద్దరూ సిక్కులే. అందుకు బదులుగా సిక్కులందరినీ వెదికి మరీ చంపుతున్నారు. నగరమంతా హత్యాకాండ సాగుతోంది. ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చా. ఇక్కడికి కూడా వచ్చేస్తారిక.”

“వాళ్లెవరు ప్రీతం, ఎవరు చంపుతున్నారు సిక్కులను? హిందువులేనా?” అడిగింది అత్తగారు.

“ఏమో అమ్మా, నాకు తెలీదు వాళ్లెవరో.”

“హిందువులని మీరెందుకు అనుకుంటున్నారమ్మా,” అన్నాడు పల్లీల వ్యాపారి, పాప చేతిలో పప్పులు పెడుతూ.

“ఇప్పుడెలా, వాళ్లు ఇక్కడికి వచ్చేస్తే ఏమిటి మన గతి? ఏం చేద్దాం?” వణికి పోతోంది జస్మిత్.

“అంతమంది ఉన్నారు, ఎట్లా తప్పించుకుంటాం?” ప్రీతం కు కూడా దిక్కు తోచడం లేదు.

“ఏం మాట్లాడుతున్నావయ్యా? ఆ హిందువులు నీ భార్యను చెరిచినా నోరు మూసుకుని పడుంటావా, పిరికిపందా! నువ్వొక మగాడివా? సిక్కు జాతిలో చెడ పుట్టావు కదరా!” ఆగ్రహంతో ఊగిపోయింది అత్తగారు.

“ఇంకొక్క మాట అన్నావంటే మర్యాదగా ఉండదు అమ్మా! ఆయన్ని అనవసరంగా మాటలంటే వూరుకోనని ఎన్ని సార్లు చెప్పాను నీకు?” అంది కోపంగా జస్మిత్.

“ఇంట్లోకి పోండి, వాళ్లు వచ్చేస్తున్నారు,” అన్నాడు ఆందోళనతో పల్లీల అతడు. జస్మిత్ ను ఇంట్లోకి నెట్టి, పాపను తన బుట్టలో పెట్టి, పల్లీలు మూట కట్టిన ఎర్ర గుడ్డను విప్పి పైన కప్పాడు.

“నువ్వు బట్టలు మార్చుకుని చీర కట్టుకో. వెనకాల గుమ్మం లోంచి వచ్చెయ్యి బెహెన్ జీ,” అని చెప్పాడు జస్మిత్ తో.

“నా భార్యాబిడ్డలను ఎక్కడికైనా తీసుకు పోగలరా గురుచరణ్ జీ,” అడిగాడు ప్రీతమ్.

“నా ఇంటికి తీసుకుపోతానయ్యా. పాకిస్థాన్ నుండి నా బిడ్డ వచ్చేసిందని చెప్పుకుంటా. నువ్వు తొందరగా జుట్టు కత్తిరించేసుకుని పారిపో. ప్రాణం కాపాడుకోవాలి ముందు.”

“అయ్యో, నా గతేం కాను భగవంతుడా,” అంటూ గుండెలు బాదుకుంటూ ఏడవసాగింది పెద్దావిడ.

ఓ పెద్ద గుంపు వీధిలోకి దూసుకొచ్చింది. వాళ్లు అప్పటికే ఆరు ఇళ్లకు నిప్పు పెట్టేశారు. చలి కాలపు సంధ్యా కాంతిలో మంటలు చెలరేగుతున్నాయి. “రక్తానికి రక్తం బదులు తీర్చుకుంటాం,” అనే కేకలు నలువైపులా.

“పో, వెళ్లి ఎదిరించు కొజ్జా వెధవా!” అంటూ అల్లుడిని ముందుకు నెట్టింది ముసలావిడ. “నువ్వు సర్దార్ జాతిలో పుట్టావని గుర్తు పెట్టుకో,” అంటూ గడగడలాడుతున్న ప్రీతమ్ ను బయటే వదిలేసి ఇంట్లోకి వెళ్ళి గడియ వేసుకుంది.

అప్పటికే పల్లీలమ్మే అతడు జస్మిత్ ను, పాపను తీసుకుని వెళ్ళిపోయాడు.

వాళ్లు గుమ్మం లోపలికి వచ్చేశారు.

“అన్నా, నన్ను చంపకండి. నేనేం తప్పు చేశాను, ఎవరికి హాని చేశాను?” పూడుకు పోతున్న గొంతుతో వేడుకుంటున్నాడు ప్రీతమ్.

అల్లుడి పెనుకేక, వాళ్ల తిట్లూ ముసలావిడకు వినబడ్డాయి. “ఇంటికి నిప్పు పెట్టండిరా” అని ఎవరిదో అరుపు వినిపించింది. ఆమె నేలపై కూలిపోయింది. భయంతో కొయ్యబారి పోయింది. భగవంతుడిని ప్రార్ధించాలనుకుంది. గొంతు పెగల లేదు.

***

లజపత్ నగర్ లోని గురుచరణ్ ఇంట్లో ఇరుగు పొరుగు ఆడవాళ్ళంతా చేరారు, అతడి కూతురిని చూడటానికి. “నీ కూతురి వయసు యాబై ఐదని చెప్పావ్, చూస్తే ముప్పయ్యేళ్ళ దానిలా ఉంది. ఆ పాకిస్తాన్లో మంచి తిండీ, పోషణా దొరికేట్టుంది కదయ్యా!” అన్నారు వాళ్ళు.

“అమ్మా సీతా, వీళ్ళందరూ మన పొరుగిళ్ళ వాళ్ళమ్మా,” అంటూ పరిచయం చేశాడు ఆయన. “అందరికీ కాస్త చాయ్ పెట్టి, పాపకు పాలు పట్టమ్మా,” అని పురమాయించాడు.

“అట్లాగే పితాజీ,” అంది జస్మిత్ వినయంగా తలొంచుకుని.

నెల్లూరు జిల్లాలో పుట్టి పెరిగారు. ప్రస్తుతం హైదరాబాద్ లో నివాసం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తెలుగు సాహిత్యంలో పిఎచ్.డి చేశారు. సాహిత్యం, సామాజిక శాస్త్రాల అధ్యయనంలో, ముఖ్యంగా సాహిత్య విమర్శలో ఆసక్తి. మిత్రులతో కలిసి "చూపు" పత్రికను కొంతకాలం నిర్వహించారు. సాహిత్య, సాహిత్యేతర గ్రంథాల అనువాదం, రచన వంటి అంశాల్లో కృషి చేస్తున్నారు.

One thought on “మూంగ్ ఫలీ

  1. Katyayani garu very well written story. Living in Delhi , I have witnessed any such incidents.

Leave a Reply