ములాఖత్…

మూలాఖతై నువ్వొస్తే
రాలిన కన్నీటిని
గుండెలోకి ఓంపి
చెమర్చిన కళ్లతో
చెదిరిన నవ్వుతో..
ఇనుప తెరల వెనుక
నేను…


కన్నీరై నువు
పలకరిస్తే
మౌనమై
మాట్లాడుతాను
మన ఎడబాటు నీ వలపోతై
నా గుండెలమీద
ప్రహిస్తుంటే..
జైలుగోడలే సాక్ష్యంగా నిలిచేనా!
జైలు నుండి జైలుకు
నా విడుదల కోసం…
నిద్రలేని కన్నీటి రాత్రులెన్ని
గడుపుతున్నావో…


నాన్నేడనే కన్నబిడ్డల
కలవరింతలకు
కన్నీటి జోలపాటలే
జాడలాయేనా…
సంకెళ్లు దేహానికి
కానీ కలలకు కాదు నేస్తమా…
ఎవరులేని
ఎవరు రాని
ఈ నిశి రాతిరి
నీలాకాశాన
సుక్కల సోపతిలో
అల చంద్రవంకనై
వస్తాను..


సుడులుతిరిగే
జ్ఞాపకాల పూతై
నీ పెదవులపై పూస్తాను
ఉషోదయ కాంతులైన
నీ నీలి కనులలో
కన్నీరెందుకు నేస్తమా?


కాలమెప్పుడు
ఆకురాలే ఉండదు..
ఆకుపచ్చని వసంతమై
వస్తూనే ఉంటుంది..
జైళ్లులేని ప్రపంచాన్ని
వాగ్దానం చేస్తూనే ఉంటుంది…

సూర్యాపేట జిల్లా తుమ్మల పెన్ పహాడ్ గ్రామం. బీటెక్ చదివారు. కవి, విద్యార్థి ఉద్యమ నాయకుడు. తెలంగాణ విద్యార్థి వేదికలో పనిచేస్తున్నారు.

 

 

2 thoughts on “ములాఖత్…

  1. కాలమెప్పుడూ ఆకురాలే ఉండదు. ఇది నిజం.

Leave a Reply