మురిసిన మువ్వలు

మనసు నిండా మల్లెలు గుభాలించాయి. కళ్ళలో కాంతులు వెలిగాయి. దేహంలో ఏదో తత్తర పాటు. కళ్ళలో మాటిమాటికి ఊరే ఆనందభాష్పాలు. చదివిందే చదువుతోంది. చేతిలోఉన్న పేపర్ ను మాటిమాటికీ పెదవుల దగ్గరికి తెచ్చుకొని ముద్దాడుతోంది నవీన.
ఆమె, ఆమె చేష్టలు అర్థం కాక అయోమయంగా చూస్తోంది ఆమె అత్త సంతోషిని.
కుర్చీలో కూర్చొని తనకు తానే మాట్లాడుకుంటూ చేతులు రెండు జోడించి దండం పెడుతూ, దైవాన్నిస్మరించుకుంటున్న నవీనను,
భర్త రమణయ్యను పిలిచి చూపించింది సంతోషిని.
ఆయనకు ముందు, ఆమె ధోరణి అయోమయంగా అనిపించినా, ఏదో ఒక మంచి కబురై ఉంటుందినుకుని, “వెళ్ళు, అమ్మాయి సంతోషానికి కారణం అడిగి తెలుసుకో అన్నాడు” భార్యను రమణయ్య.
‘కొడుకుపోయిన దగ్గర నుండి కోడలును, మనుమణ్ణి పువ్వుల్లో పెట్టి సాకుతున్నది సంతోషిని. ఎంత చేసినా, ఎవరోఒకరుఏదో ఒకరితో అనని మాటలు చెవిన పడుతూనే ఉన్నాయి . అయినా కూడా మనసులో పెట్టుకొని, కోడలును ఏమనలేకపోయింది.

“ఏమమ్మా , సంతోషమ్మ కోడలితో ఇంటెడు చాకిరీ చేయిస్తావట” కదా! అని ఒకరు.
“కాలు మీద కాలేసుకుని కూర్చుని ఒక్కదానితో పనంతా చేయిస్తావట కదా!” అని ఒకరు.
మనుమన్ని అసలే పట్టించుకోవట కదా, అని ఒకరు.
‘ఇలా చెప్పే వారి మాటలు వినిబాధపడింది సంతోషమ్మ. ఎంతో మంచిగా చూసుకున్నా ఇలా అందరు అంటుంటే కోడలుతో మాట్లాడటం తగ్గించింది. మౌనంగా ఉంటోంది.
అయినా పాపం తనకెవరన్నారనుకుంటూ, దగ్గరికి వెళ్లే లోపే కళ్ళు తెరిచిన నవీన అత్తగారిని చూసి కారుతున్న కన్నీటిని తుడుచుకోకుండా కాళ్లకు దండం పెట్టింది.’

“ఏమైందమ్మా! నవీన. పోస్ట్ వచ్చిన దగ్గర నుండి చూస్తున్న ఏముంది అందులో” అన్నది సంతోషమ్మ.
ఎప్పటిలా ప్రేమగా మాట్లాడిన అత్తగారిని చూడగానే ఆమె గొంతు మూగ పోయింది. వారం పది రోజుల నుండి అత్తగారి ప్రవర్తన అంతు పట్టడం లేదు. మాటలో తీపి కరువైంది ఇల్లంతా మూగనోము పట్టినట్లు ఉండిపోయింది.
‘అది చేయమ్మా ! యిది చేయమ్మ అని చెప్పే, అత్తగారు మాటలు రానట్టు మౌనంగా ఉండడం ఇన్నాళ్లు తట్టుకోలేక పోయింది నవీన. తన సంతోషాన్ని ఎవరితో పంచుకోవాలో అర్థం కాలేదు. అందుకే కనపడని దేవునికి మొక్కుకుంటుంది. తన కొడుకు అరవిందున్నా ఎత్తుకొని వాడికి అర్థం కాకున్నా, చెప్పుకునే దాన్ని. వాడు స్కూలుకు వెళ్లాడని అనుకుంటూ, మౌనంగా ఉన్న కోడల్ని మళ్లీ కుదిపింది సంతోషమ్మ .
“ఏమైందమ్మ, ఏమైంది అని”మళ్ళీ అడిగింది.
మీరొకసారి ఇటు రండంటూ, తల్లిలా ఆదరించే అత్తగారిని తండ్రి లాంటి మామయ్య దగ్గరికి తీసుకుని వెళ్లింది నవీన. వారిద్దరినీ పక్కపక్కన నిలబెట్టి ఇద్దరి ఆశీర్వాదం తీసుకున్నది నవీన.
కోడలు ప్రవర్తన అర్థం కాక అయోమయంగా చూస్తున్న మామ గారి చేతిలో పోస్ట్ లో వచ్చిన పేపర్ ను పెట్టింది.
అది చదివిన రమణయ్య సంతోషానికి అంతులేదు. “సంతోషి మనమ్మాయికి బ్యాంకు ఉద్యోగం వచ్చింది అన్నాడు” సంతోషంతో రమణయ్య.
అవునా! అంటూ నవీనను దగ్గరికి తీసుకొని నుదుటిమీద ముద్దు పెట్టుకున్నది సంతోషమ్మ. గబగబా వంట గదిలోకి వెళ్లిచక్కెరతెచ్చి కోడలు నోట్లో పోసింది. భర్తకు పెట్టింది.
నవీన, దినేష్ లది ప్రేమ వివాహం. నవీన తల్లిదండ్రులకు వీరి వివాహం ఇష్టం లేదు. ఒక్క కూతురైనా నానా మాటలని బయటకు పంపించేశారు.
కొడుకు కోర్కెను కాదలేకపోయారు సంతోషమ్మ, రమణయ్య.
తన గుండె గూటిలో ప్రేమ దీపం వెలిగించిన ‘నవీన’ను కన్నవారి అనుమతితో వివాహం చేసుకొన్నాడు దినేష్. వారికి ఒక కుమారుడు అరవింద్. చక్కగా సాగే సంసారం. అనుకోకుండా ఒక ప్రమాదంలో దినేష్ దూరమయ్యాడు.
చెట్టంత కొడకును పోగొట్టుకున్న వారి బాధ వర్ణనాతీతం. కాని కోడలు నవీన, మనుమడు అరవింద్ ల కొరకు బాధను భరిస్తూ వారి బాగుకొరకు తమ బాధను మనసులోనే దిగమింగుకున్నారు.
అనుకోకుండా ప్రమాదంలో మరణించిన భర్త, ఊహ తెలియని కొడుకుతో అత్త, మామల ఓదార్పులతో నవీన బాధను మర్చిపోతూ కొడుకులో భర్తను చూసుకుంటూ అత్తమామల దగ్గరే ఉంటున్నది.
దినేశ్ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేసేవాడు. రామణయ్యకు వచ్చే పెన్షన్తో ఇల్లు సుఖంగా గడిచిపోయేది.
కొడుకు దూరం కాగానే కుటుంబం ఒడిదుడుకులను ఎదుర్కొన్నది.
ఒక నిశ్చయానికి వచ్చిన రమణయ్య, సంతోషమ్మలు కోడలి ఆగిపోయిన చదువును చదివించారు. ఏదో ఒక ఉద్యోగం చేసుకుని తన కాళ్ళ మీదతాను నిలబడాలన్నది వారి ఆలోచన. ఇంత జరిగినా తన దగ్గరకు రాని తల్లిదండ్రులను వదిలేసి అత్తమామలనే అమ్మానాన్నలుగా చూసుకునేది నవీన.
కోడలును బ్యాంక్ కోచింగుకు మనుమన్ని పాఠశాలకు పంపిస్తూ శరీరం సహకరించకున్నా, అన్ని పనులు తానేచూసుకుంటున్న సంతోషమ్మ మనసు విరిగేలా ముచ్చట్లు చెప్పే నారదమ్మల మాటలు నమ్మి,”బంగారం లాంటి కోడలును బాధ పెట్టాననుకున్నది “సంతోషమ్మ.
‘పాపం చేతకాకున్నా, అన్ని పనులు చేసుకొని నాకు చదువుకోవడానికి టైం ఇచ్చి అన్ని తామై చదివించిన పెద్దవాళ్ళను చెప్పుడు మాటలతోకష్టపెట్టాననుకున్నది’ నవీన.
“కొడుకు చనిపోయినా ఉట్టిగానే ఇంట్లో ఉంచుకుంటున్నారనుకున్నావా? రేపు నీకు ఉద్యోగం వస్తే అదంతా వాళ్లకే కదా! అనేవారొకరు.
“ముసలి వయసులో దిక్కులేని చావు చూస్తామని నిన్ను దగ్గరకు తీశారు అనేవాళ్ళు” ఒకరు.
“ఎప్పటికైనా అత్తమామలు తల్లిదండ్రులు కాలేరు, చక్కగా నీ తల్లిదండ్రులకు దగ్గరికి వెళ్లి పొమ్మనే వాళ్ళు” ఒకరు.
‘ఇలా చెప్పుడుమాటలకు బానిసై , వారి మనసును కష్టపెట్టాననుకున్నది ‘నవీన.
‘పాపం కొడుకు దూరమైనా, ఆ కొడుకును తనలో చూసుకుంటూ, మనుమన్ని ఆప్యాయంగా పెంచే వాళ్ళనే అనుమానించానని ఆలోచిస్తూ వాళ్లకు ఇంకెప్పుడు కష్టం కలిగించను. కనిపెంచిన తల్లిదండ్రులు కష్టకాలంలో చూడకున్నా, అంతకంటే ఎక్కువ ప్రేమతో చూసుకున్న అత్తమామలే నాకు అమ్మానాన్నలు అనుకున్న నవీనకు మనసు’ కుదుటపడింది.
కోడలు సంతోషానికి ఇంకా బలం ఇవ్వడానికి స్కూలుకు వెళ్లి అరవిందును తీసుకు వచ్చాడు రమణయ్య. మనసులోని ఆలోచనను చేసి చూపించిన మామ గారికి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంది నవీన.
‘ఇంకెప్పుడూ చెప్పుడు మాటలు నమ్మొద్దు అనుకున్నారు అత్తా, కోడలు మనసులలో.’
“అత్తయ్యా ! అని ఏదో చెప్పబోయే నవీనను ఆపి, పచ్చగా ఉన్న ఇంటికి నిప్పంటించే వాళ్ళు ఉంటారు. అమ్మా! నవీనా మనం ఎప్పుడూ చెప్పుడు మాటలు నమ్మొద్దు.
మీ అత్తయ్య, నువ్వు మీరిద్దరు చేసిన పొరపాటు అదే. మనుషుల చాడీల మాటలకు దూరంగా ఉండటం నేర్చుకోండి. ఒకవేళ వాళ్ళు చెప్పినప్పుడు మీ ముందే అడుగుతానంటే , వాళ్ళ బండారం బయటపడుతుంది. నిజం తెలుస్తుందన్నాడు”రమణయ్య.
ఇన్నాళ్లు మీరు ఒకరితో ఒకరు మాట్లాడు కోకుండా, నాకు నా మనవడికి నరకం చూపారు మీరిద్దరు. ఇప్పటినుండి మన ఇంట్లో ప్రేమ దీపం వెలగాలి అన్నాడు రమణయ్య మనుమన్ని ఎత్తుకుని ముద్దాడుతు. ఆ ఇంట్లో సంతోష సరిగమలు నవీనమయ్యాయి.
ఆ రాత్రి అందరి భోజనాలయ్యాక అరవింద్ ను పక్కన పడుకోపెట్టుకొని జోకొడుతున్నది సంతోషమ్మ.
ఏదో జ్ఞాపకం వచ్చినట్టు దిగ్గున లేచి కూర్చున్న రమణయ్య సంతోషీ! అనగానే, అవును నేను అదే ఆలోచిస్తున్న బాబు పెద్దవాడవుతున్నాడు. నవీనకు ఉద్యోగం వచ్చింది. మనం ఇంకెన్నాళ్ళుంటాం. మరపు మానవ సహజం.
నవీన మనసు తెలుసుకొని మన దినేష్ లాంటివాన్ని ఇంటికి తెచ్చుకుంటే, అరవింద్, నవీనలకు మనకు సంతోషమేకదా! అన్నది సంతోషమ్మ. అవునని తలూపుతూ భార్యను మెచ్చుకోలుగా చూస్తూ, నవీన భవితకు మళ్ళీ పెళ్ళితో మార్గమేయాలన్న ఆలోచనతో నిద్రలోకి జారుకున్నాడు రమణయ్య.

Leave a Reply