ముండ్లదాపు

“ఎంతసేపు కూసుంటరింగా? జప్ప జప్ప గానియ్యాలె! పని మస్తున్నది”

“గిప్పుడే గిట్ల గూసున్నం. గీయింతకేనా?”

“ఓనరొచ్చి సూసిండంటె నా మీద గరమైతడు. జల్ది లేవుండ్రి”

“తిండి గూడ సక్కగ తిననియ్యవా ఏమన్నా? వస్తం పా! ఏయ్.. కానియ్యుర్రే! నీళ్ల కడవ ఏడున్నది?”

“అంగో! ఆ మూలకున్నది”

“కొన్నే తాగుండ్రి. మల్ల మిగలవ్! జర గా కడవ గిక్కడ పట్కరా బిడ్డా”

వొసంత లేశి బిందె తీస్కచ్చి వాళ్ల నడిమిట్ల పెట్టింది. అందరూ తలా గ్లాసెడు నీళ్ళు తాగిండ్రు. వొసంత గూడ గ్లాసందుకుని నీళ్లు గొంతులో ఒంపుకుంది. వేడిగున్నయి. గొంతు దిగలే. బలవంతంగ మింగింది. దూరంగున్న నీళ్ల పైపు కాడ అందరూ టిఫిన్ డబ్బలు కడుగుతుండ్రు.

“ఈ సోకుల మొగాయన పని.. పని అని మన మీద పడ్తడు. ఆయనెంత పనిమంతుడో దెల్వదా? కండ్లన్ని మన మీదనే ఉంటయ్. జర్రింత కూసుంటె సాలు కండ్లల్ల నిప్పులు పోసుకుంటడు”

“చిన్నగొర్రు! ఇనవడ్తది”

“ఇంగ ఈన్నే ఉన్నడా? యినొస్తె యినొచ్చె! నాకేం బయమా? ఇనవడాలనే అంటున్న. పొద్దుగాల పది గొట్టంగ వచ్చినమంటె సాయంత్రం దాంక పని చేస్తనే ఉంటం. తినే కాడ గిట్ట నిమ్మళం లేకపోతె ఎట్ల?”

అందరు గిన్నెలు కడిగినంక వొసంత తన డబ్బ కడగాల్నని పైపు కాడ కూసుంది. కడుపుల కలుక్కుమనగంనే దిగ్గున పైన్కి లేశింది.

“ఏమాయె పిల్లా? అట్ల లేస్తివి”

“ఏం లేదవ్వా!”

“జల్లి కడుక్కొ”

కిందికొంగి గిన్నె కడిగింది. అందరు డబ్బలు పెట్టిన తావుల తన డబ్బా పెట్టింది. చుట్టూ ఆడోళ్ల వంక చూశింది. ఎవ్వలు వచ్చెటట్టు లేరు. కొంచేపటికి ఇద్దరు కదిలిండ్రు. వాళ్లెన్క అడుగుల అడుగేసుకుంట కదిలింది. మగోళ్లు లేని తావు ఎతుక్కుంట సగం కట్టిన ఆ ఇంటి వెనకాల్కి పోయిండ్రు.

ఊరి చివరున్న ఆ దిక్కుల అప్పుడప్పుడె కొత్తిండ్లు మొలుస్తున్నయి. ఆడాడ సగం గట్టిన ఇండ్లు మమ్మల్నెన్నడు పూర్తి జేస్తరా అన్నట్టు చూస్తున్నయి.

“గింత పెద్ద జాగలున్నయ్ గాని, రెండు మూడు చెట్లన్నలేవ్! కంపచెట్లన్ని కొట్టేశిర్రు. గా దూరాన ఒక్కటున్నది. గట్ల పోదమా?”

“గంత దూరమెందుకు? గీ దిక్కు పోదంపా”

“అంతా బయలుంది. గా పక్కనే రోడ్డు. మొగబాడకవ్లొచ్చిర్రంటె ఆ అద్రగనంల చీరలల్లనే పోస్కుంటం. గా కంపచెట్ల కాడైతే ఎవ్వరుండరు”

“సరే! రప్పున నడు మల్ల”

“ముందుకు రా బుజ్జి! గట్ల ఎన్కెన్కకుంటవెందుకు?”

అడుగులు పడుతుంటె కడుపు భారమైంది వొసంతకు. నెత్తిమీది ఎండకు ముకమంత చెమట కార్తుంది. తాగిన గ్లాసుడు నీళ్ళు ఎప్పుడో అయిపోయి, గొంతు ఎండిపొయింది. ముగ్గురు కంపచెట్ల కాడికొచ్చిండ్రు. అటిటు ఎవరు లేనిది జూసి మోకాళ్ల మీద కూసున్నరు. వొసంత కడుపు మంట నిమిషంల దీరింది. పానం అల్కగైంది. ముగ్గురూ లేశి మల్ల అటిటు చూశి పని నడుస్తున్న తావుకు చేరుకున్నరు.

“పిల్వలేదేమే నన్ను మీరు పొయ్యేటప్పుడు?”

“ఏమో! మాకేందెల్సు? మాకేమన్న చెప్పినవా పిల్వమని? ఉచ్చవొయ్యేటప్పడు గుడ తోడు గావాల్న?”

“నీయవ్వ! పో.. ఆడ మీ మేస్త్రి పిలుస్తున్నడు. సిమ్టి సంచులెత్తాల్నంట. నువ్వు జర రా బుజ్జి నా యెన్కల”

వొసంత, బాలమ్మ కంపచెట్ల దిక్కు కదిలిండ్రు.

“ఎండమస్తుగున్నది గద ఇయాళ?”

“అవునవ్వా”

“దూపకు నీళ్లు తాగుదమంటె మల్ల ఊకె ఈడ్కి ఉర్కి రావాలె. గందుకే జర్రిన్నే తాగిన”

నడుస్తూ మాట్లాడుతున్నరు. వొసంతకిప్పుడు కడుపు ప్రాణం అలకగుంది. ఇందాక భారంగా పడ్డ అడుగులు ఇప్పుడు బలంగా పడుతున్నయి.

“ఇస్కూళ్ పోతున్నవా బుజ్జి? ఎంత సదువుతున్నవ్?”

“తొమ్మిదో తరగతి అయిపోయిందవ్వా! సెలవులిచ్చిర్రు”

“ఆ.. సదువుకోవాలె బిడ్డా! మా గాచారంల సదువు లేదు. ఇప్పటి పిల్లలకు సదువుకుంటనే బతుకు. మీ యమ్మ గిట్ల మస్తు కష్టపడ్తది. మీ నాయన కంటె ఎక్వ పన్జేస్తుండె! ఏ పనికైనా ముందుగాల తననే పిలుద్దురు. మీ నాయన ఉంటె ఫికర్ లేకుంటుండె. నిరుటి దినాలే వేరే! అప్పుడు గింత దూరం వచ్చేటట్టు ఉండెనా? మీ ఊర్లనే మస్తు పనులు. నాట్లేసుడు, కోతలు గోసుడు, తూర్పెత్తుడు, పత్తి దీసుడు.. అన్నిట్కి అన్ని ఉండె! గిప్పుడేమో సన్నపిల్లవి గింత దూరం రావాల్సొచ్చె”

బడికి సెలవులున్నప్పుడు ఊళ్లో కోతలకు పోవడం అలవాటే వొసంతకు. బయటూళ్లో కూలీకి రావడం ఇదే మొదటిసారి. ‘ఎండల్ల ఎందుకెలే బిడ్డా?’ అని అమ్మ అననే అన్నది. కానీ పదో తరగతికి పుస్తకాలు, బట్టలు కొనాలంటే పైసలు కావాలి. నిరుడు నాయన ఇచ్చిండు. నాయనమ్మ పేరే తనకు పెట్టిండు. అందుకనే “వొసంతమ్మా..” అని పిలుస్తుండె. ఎందాంక సదువుకుంటె అందాంక సదివిస్తనని మురిపెంగ అంటుడె. తొమ్మిది తరగతి పుస్తకాలిప్పిచ్చుకుంట గుడ “బాగా సదువాలే తల్లీ” అని మురిపెంగా అన్నడు. ఆ మాటన్న రెండు నెలల తర్వాత ఓ రాత్రి గుండెపోటొచ్చింది. నిద్రలనే కన్నుమూసిండు. ఇల్లు చీకటైంది. అమ్మకు తోడుగ తనూ, తమ్ముడూ మిగిలిండ్రు.

కంపచెట్లు దగ్గరికి రాగంనే బాలమ్మ మోకాళ్ళ మీద కూర్చుంది. మాటలు మాట్లాడ్తనే ఉంది.

“పొయిన్నెల వేరే ఇంటికాడ పనికొయినం. నాకేమో చెంబట్క వెట్టింది. ఇంగ సూడు తిప్పలు. తిండి తింటె సాలు కడుపంత ఒకటే సీదర. కూసుంటె మంట. లేస్తె మంట. పోదమంటె ఆ సుట్టుముట్టు అన్నీ ఇండ్లే! ఎవల్లింట్లకన్న పోయి అడుగదమా అని ప్రాణం కశిబిశి అయ్యిండే. అడిగితే ఏమంటరోనని మూడు దినాలు అట్లనే ఓప్కున్న. ఈడ గీ కంపచెట్లుండుడు జర నిమ్మళమైంది”

ఊర్ల కూలికి పోతే ఈ అవస్థ ఉండది. చుట్టూ చెట్లుంటయ్. ఎటుపోయినా ఎవళ్లడగరు. ఈ టౌన్ల కూలీకొస్తే ఇట్లాంటి ఇబ్బందులంటయని మొదటి దినమే అర్థమైంది వొసంతకి. అయినా అట్లనే ఏమనకుంట పనిచేసింది. మధ్యాహ్నం తోటి అమ్మలక్కలతో పాటు కంపచెట్ల చాటుకు పోయినంక గానీ బాధ తీరలే. అప్పటిసంది ఎంత దూపైనా కొన్నే నీళ్లు తాగతున్నది.

బాలమ్మ లేశి రాంగనే ఇద్దరు తిరిగొచ్చిండ్రు. ఇసుక తట్టలందుకుని పని మొదలుపెట్టిండ్రు.

*

ఇంటికి రాంగనే ముందుగాల బాత్రూం దిక్కు పోయినంక ఇంట్లోకి వచ్చింది వొసంత. ఇరవై మంది ఎక్కిన ఆటోల ఆ కుదుపులకు ఒళ్లంత ఇసుర్రాయి కింద నలిగట్టయ్యింది. ఇంకొంచెం ఆలీశమైతే బట్టల్లోనే పోసుకుంటనేమోనని భయపడ్డది. ఊర్ల బండి ఆగంగనే పైసలిచ్చేసి ఇంటికి ఉరికొచ్చింది. ముఖం కడుక్కుని తువ్వాలతో తూడ్సుకుంటుంటే రాజేశ్వరి వచ్చింది. ఇద్దరూ ఒకటే తరగతిల చదువుతున్నరు. దోస్తులు.

“ఏమే! ఇయ్యాళ ఇంత లేటైంది?”

వొసంత అద్దం ముందు నిలవడి బొట్టు దిద్దుకుంట “ఆటో నిదానమొచ్చింది” అన్నది

“నీ పని బాగుందే! నీగ్గావల్సిన బుక్కుల మందం పైసలు నువ్వే సంపాయించుకుంటున్నవ్. ఈసారి నువ్వే ఫస్ట్ ర్యాంకర్వి లే”

“నీగ్గిట్ట గావాల్నంటే నువ్వు గుడ రా! ఏ రోజు కూలీ ఆరోజొస్తది” రాజేశ్వరి ఏమంటదో అన్నట్టు చూసింది వొసంత.

“మాయమ్మ పంపుతదా? కాళ్లు ఇరగ్గొడ్తా అంటది. ఎప్పుడెప్పుడు పది పాసైతే పెండ్లి జేద్దమా అని ఉన్నరు. కూలికివోతా అంటె సదువు పూర్తిగ బంజేసి అటేపొమ్మంటరు. నీకంటె కుదిరింది గానీ నాకేడ అయితది?”

రాజేశ్వరికి ఇద్దరన్నలు. పదెకరాల ఎవుసం. ఇంట్ల రెండు, మూడు బర్రెలు. ఇన్ని ఉన్నంక కూలీకి పొయ్యే అవసరమేంది అనుకుంది వొసంత. వచ్చినా ఆ బాధలన్ని పడ్తదా? తనింట్ల గూడ చిన్నప్పుడు బర్రెలుంటుండె. పిడుగు పడి సచ్చిపొయినయ్. మళ్లీ కొనెటందుకు పైసలు కూడలే. కొందం కొందం అని నాయన అంటూ ఉండే. చేతికొచ్చిన కూలీ పైసలు ఎటోకటు పోతుండే. జరసేపు మాట్లాడి రాజేశ్వరి ఎల్లిపోయింది.

అమ్మకు జెరమొచ్చింది. రాత్రి వంట వొసంతే చేశింది. అమ్మకింత ఉప్మా పెట్టి, గోళీలిచ్చి తనూ, తమ్ముడూ అన్నం తినేశిండ్రు.

*

వొసంత గొంతుల గావరగావరగుంది. కడుపంత ఒకటే నొప్పి. పొద్దుగాల ఆటోలెక్కినప్పట్నుంచి అట్లనే అనిపిస్తుంది. ఎండదెబ్బ గొట్టిందేమో అనిపించింది. ఊకూకె దూపైతుంది. రెండుసార్లు కడవకాడికి పొయ్యి నీళ్దాగింది. జర నయమనిపించింది. ఆపైన అర్ధగంట నుంచి కడుపుల మంట. ఎవరన్న తోడొస్తె కంపచెట్ల దిక్కు పోదమనుకున్నది. పని నడుస్తున్నప్పుడు పోతె మేస్త్రీ తిడ్తడని ఎవరొస్తలేరు. అంతదూరం ఒక్కదాన్ని పోదమంటె ఆడ ఎవరుంటరో, ఏమంటరోనని బుగులు. మద్యానం దాంక అట్లనే ఓర్సుకుంట పన్జేశింది. ఇసుక తట్ట మోస్తున్నా,
ఇటుకలందిస్తున్నా పానం పోతున్నట్టుగనే అనిపించింది వొసంతకి. ఎవళ్ల పనుల్ల వాళ్లున్నరు. ఎవర్ని పిల్శి చెప్పేటట్టు లేదు. మద్దెమద్దెల మేస్త్రి జెప్ప జెప్ప పనిజెయ్యమని మాటలంటనే ఉన్నడు.

తినేటేళైంది. అందరు టిఫిన్ డబ్బలందుకున్నరు. వొసంతకు వశమైతలేదు. బాలమ్మ దగ్గరికి పొయ్యి “గట్ల కంపచెట్ల కాడికి తోడస్తవావ్వా?” అంది. “పద బిడ్డా! నాగ్గిట్ల గప్పటిసంది కడుపుబ్బరంగున్నది” అన్కుంట నడిశిండ్రు.

ఇంటెన్కికొచ్చి దూరంలున్న కంపచెట్ల దిక్కు అడుగులేస్తుండగనె బాలమ్మ అన్నది.. “ఓర్నియవ్వా! గీ శెట్లను గిట్ట కొట్టేస్తుండ్రెవరో? ఎంత గాచారమాయె?” వొసంత నీరసంగున్న కండ్లతొటి ఆ దిక్కుకు చూశింది. నలుగురు మొగోళ్లు గొడ్డళ్లతో కంపశెట్లను కొడుతుండ్రు.

“గీయింత ముండ్లదాపన్న ఉండెగదా అనుకుంటె అది గిట్ల లేకుండ జేస్తున్నర్రు. ఎటు పోవాల్నో ఏమో ఇగ?” బాలమ్మ గొంతు గరగరమన్నది.

వొసంతకు అంతసేపు ఆప్కున్న దుక్కం పొంగుకొచ్చింది. కండ్లకెంచి నీళ్లు కారుతున్నయ్. బాధ ఓపలేకపోతున్నది.

“అయ్యొ! ఏమాయె బుజ్జీ? ఎందుకట్ల కండ్లల్ల నీళ్లు దీస్తున్నవ్? ఏమైంది జెప్పు? అరె! బట్టల్ల ఉచ్చ వోస్కుంటన్నవేమి? అయ్యో.. ఏమాయెనే..” అరుస్తున్న బాలమ్మకు ఏమీ సమజైతలే!

అసలు పేరు వి.సాయివంశీ. పుట్టింది, పెరిగింది, చదివింది అంతా మహబూబ్‌నగర్ జిల్లాలో. 2019లో మొదలుపెట్టి ఇప్పటికి ఆరు కథలు రాశాను. 15 లైన్లలో కథ చెప్పే ప్రక్రియలో భాగంగా 30 దాకా 'మైక్రో కథలు' రాశాను. కథలు రాయడాన్ని, చదవడాన్ని ఇష్టపడతాను. జర్నలిజం వృత్తి.

2 thoughts on “ముండ్లదాపు

  1. పల్లెలో మా అమ్మ బ్రతికిన రోజులు గుర్తొచ్చాయి 🙌

  2. తెలంగాణ మాండలికం రాదంటూనే చాలా బాగ రాశారు వంశీ గారు కథ బాగుంది తెలంగాణ మాండలిక మంటే నాకు చాలా ఇష్టం మీకు అభినందనలు

Leave a Reply