రాసినదానికి కట్టుబడి వుండడం వరవరరావు ప్రత్యేకత: మీనా కందసామి

(చరిత్ర నిర్మిస్తున్న ప్రజలతో కలిసి గొంతెత్తి నినదిస్తున్న కవి వరవరరావు. ప్రత్యామ్నాయ ప్రజా రాజకీయాలను ప్రచారం చేస్తున్నారు. కాలాన్ని కాగడాగా వెలిగిస్తున్నారు. మార్క్సిజం, లెనినిజం, మావోయిజం వెలుగులో చరిత్రతో కలిసి ప్రవహిస్తున్నారు. యాభై ఏళ్లకు పైగా నిత్య నిర్బంధాన్ని ఎదుర్కొంటున్నారు. ఆయన కవిత్వం సమకాలీన సామాజిక, రాజకీయ, సాంస్కృతిక చరిత్రకు ప్రతిబింబం. వరవరరావు కవితల్నించి ఎంపిక చేసిన కొన్ని కవితల ఆంగ్లానువాదం, Varavara Rao : A Life in Poetry పేరుతో పెంగ్విన్ సంస్థ ప్రచురించింది. దీనికి సంపాదకులు ఎన్.వేణుగోపాల్, మీనా కందసామి. ఈ పుస్తకాన్ని జులై 13న హైదరాబాద్ లోని లమకాన్ లో ఆవిష్కరించారు.

కవిగా, వ్యక్తిగా వరవరరావు గురించి, ఈ అనువాదం గురించి మీనా కందసామి, ప్రముఖ కవి శివారెడ్డి, వి.శ్రీధర్ (ప్రొఫెసర్, అనువాదకుడు); చందనా చక్రవర్తి (శాస్త్రవేత్త, రచయిత్రి) మాట్లాడారు. మీనా కందసామి ఉపన్యాసం తెలుగు అనువాదమిది.)

నన్ను ఇక్కడకు ఆహ్వానించినందుకు వేణుగోపాల్ గారికి కృతజ్ఞతలు. ఈ సాయంకాలం ఇంత సమయం గడిచినా ఈ సభలో వున్న మీకందరకీ కృతజ్ఞతలు. ఈ సమావేశం గురించి అరుంధతీ రాయ్ మాట్లాడినప్పుడు తానుకూడా ఈ అద్భుతమైన పుస్తకావిష్కరణ సభలో వుండి వుంటే బాగుండేదని అని అన్నారు. అందరికీ వందనాలు చెప్పమన్నారు.

నేను చెప్పవలసిన విషయాలు చాలా వున్నాయి. అయితే దురదృష్టవశాత్తు నేను చెప్పలేని విషయాలు కూడా అనేకం వున్నాయి. వరవరరావు కవిత్వాన్ని ఒక సంకలనంగా తీసుకురావడానికి మేం కృషి చేయడం వెనుక అనేక కారణాలున్నాయి. ఎన్ని సవాళ్లు ఎదురైనా, ఎన్ని త్యాగాలు చేయాల్సి వచ్చినా మేం ఈ కర్తవ్యాన్ని కొనసాగించాం. ఆయన తన 17వ ఏట నుండి రాయడం ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన 80లలో వున్నారు. ఆయన రచనలు చదవడం, ఆయన గురించి తెలుసుకోవడం ఎప్పుడు ప్రారంభించానన్నది ప్రధానమైన అంశం. భారతదేశంలో నిరసన అంటే ఏమిటో, రాజ్యాన్ని సవాల్ చేయడం అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి ఆయన సాహిత్య కృషి ఒక భాండాగారం లాంటిది.

ఆయన సాహిత్యాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభించినప్పుడు, స్వాతంత్ర్యానంతర భారతదేశంలో రాజ్యం తన ప్రజలకు వ్యతిరేకంగా ఎందుకు మారిందో తెలుసుకోగలిగాను. ఎందుకంటే స్వాతంత్య్రం కోసం అంత పెద్ద పోరాటాన్ని జరిపి, మనల్ని మనం పరిపాలించుకుంటున్నాం. ఒక ప్రజాస్వామ్యాన్ని నిర్మాణం చేయడానికి మనం ప్రయత్నిస్తున్నాం. వరవరరావును మరింతగా చదివినప్పుడు ప్రజాస్వామ్యం గురించి అంబేద్కర్ చెప్పిన మాటలు నా ఆలోచనల్లోకి వచ్చాయి. సమాజంలో వర్గ వ్యత్యాసాలు, లైంగిక వ్యత్యాసాలు కొనసాగుతున్నప్పుడు, మీరు ఆర్థిక విధానాల గురించి చట్టాలు చేస్తూపోతుంటే, మీరు ఒక పేడ కుప్పమీద పెద్ద భవంతిని నిర్మాణం చేస్తున్నట్లు వుంటుంది. వరవరరావు కవిత్వం ఈ వాస్తవాన్ని మన కళ్ళముందు వుంచుతుంది. పరిస్థితులు మారనప్పుడు, వర్గ వ్యత్యాసాలు యథాతథంగా వున్నప్పుడు, పితృస్వామ్యం, కుల అణచివేత కొనసాగుతున్నప్పుడు మనం పై పై మెరుగులు ఎన్ని దిద్దినా ఉపయోగం లేదు. ఎంతచేసినా ఆ భవంతి ఒక పేడ కుప్పమీద వున్నట్టే లెక్క. ఆయన సాహిత్యమంతా ఇది అన్యాయమని చాటిచెప్పుతోంది. అది అద్భుతమైన చరిత్ర. నిరసన చరిత్ర. అదే సమయంలో అది అన్యాయాలను ఎలుగెత్తి చాటే చరిత్ర కూడా. రాజ్యాన్ని ఎదుర్కొనే కవులు, అంతటి శక్తివంతమైన కవుల గురించి తెలుసుకోవడం చాలా ఆసక్తిదాయకమైన అంశం.

వరవరరావు గురించి ఆలోచిస్తుంటే, ప్రారంభం నుండి, ముఖ్యంగా ఒక కవిగా ఆయన నిరంతరం కవిత్వం రాయడమే కాదు, కవిగా గుర్తించబడాలంటే ఏమి రాయాలో అదే రాస్తున్నాడని నాకనిపిస్తుంది. ఆయనిది మెటా భాష. రాజ్యాన్ని సవాల్ చేస్తూ కవిత్వం రాయడమంటే ఏమిటో తెలియచెప్పే కవిత్వం. ఆయన సాహిత్యంలో కవిత్వం గురించిన గేయాలున్నాయి, రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాయడం గురించిన కవితలున్నాయి, జైలు కవితలు కూడా వున్నాయి. ఇక్కడ ఆయనకు అద్భుతమైన ప్రాధాన్యత వున్నదని నేననుకుంటాను. దాని గురించే ఇక్కడ, ఈ వేదిక నుంచి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఇక్కడ మనం కేవలం వరవరరావు గురించి మాత్రమే మాట్లాడుకుంటాం. అంటే ఒకే దృశ్యాన్ని చూస్తున్నట్టు. అత్యంత శక్తివంతుడైన ఒక వ్యక్తిని చూస్తున్నాం. తన జీవిత కాలంలో అనేక కష్టనష్టాలను భరించిన వ్యక్తి గురించి మాడ్లాడుకుంటున్నాం. బహుశా ఇంతకాలం జైలు జీవితాన్ని అనుభవించిన ఒకే ఒక్క రచయిత మన దేశంలో వరవరరావు మాత్రమేనని నా అభిప్రాయం. అందుకు మనం గర్వించాలి. అదే సమయంలో వరవరరావు శక్తి గురించి, కవిత్వం గురించి, నిబద్దత గురించి మాట్లాడుకునే క్రమంలో మనం ఈ దేశ స్థితిని చూసి సిగ్గుతో తలవొంచుకోవాలి. నిజాన్ని నిర్భయంగా చాటే కవులను జైళ్లపాలు చేస్తున్నందుకు పాలకులు సిగ్గుపడాలి. ఈ ఉదయం నా రాష్ట్రంలో జరిగిన ఒక సంఘటనను వరవరరావు సందర్భంతో పోల్చి చెప్పాలనుకుంటున్నాను. మా రాష్ట్ర ముఖ్యమంత్రి వైరముత్తు అనే వ్యక్తిని ఆయన నివాస భవనంలో కలవాలని నిర్ణయించుకున్నాడు. ఈ వైరముత్తుపైన అనేకమైన “మీ టూ” ఆరోపణలున్నాయి.

ఒక కవి భయాన్ని ఎలా అధిగమించగల్గుతాడు?

తమిళంలో మేం సంగం కాలం నాటి గొప్పతనం గురించి మాట్లాడతాం. 2000 సంవత్సరాల క్రితం నాటి కవిత్వం గురించి మాట్లాడతాం. దురదృష్టం ఏమిటంటే అనేకమంది కవులు ఆశ్రయం కోసం రాజకీయ నాయకుల తరఫున వకాల్తా పుచ్చుకుని మాట్లాడతారు. అలానే రాజకీయ నాయకులు కూడా కవులతో కలిసి తిరగాలనుకుంటారు. అలాంటప్పుడు ఏమి జరుగుతుంది. ఒకపక్క అధికారానికి దగ్గరగా వుండే వైరముత్తు లాంటి కవులుంటారు, మరోపక్క నిర్బంధంలో వున్న వరవరరావు లాంటి కవులుంటారు. ఈ దేశం ఎంత దుర్మార్గంగా వుందో ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో తెలియజెప్పటానికి ఇది ఉదాహరణ అనుకుంటాను. ఈ సమయంలో మీరంతా వరవరరావు గురించి మాట్లాడతారు. అయితే ప్రజల ఊహల్లో అలాంటి కవులు మాత్రమే వుండరు. అనేక రకాలుగా రాజీపడిపోయే కవులను వారు చూస్తారు. అలాంటి కవిత్వం రాసేవాళ్ళని కూడా గమనిస్తారు. కవులు, ప్రత్యేకించి సాహిత్య మిత్రులు, తాము రాసిన సాహిత్యాన్ని విలువైనదిగా భావించే రచయితలు కూడా వుంటారు. అంటే అనేకరకమైన రచయితలు వుంటారన్నమాట. అలాంటప్పుడు వరవరరావు ప్రత్యేకత ఏమిటి? ఏమిటంటే తాను రాసినదానికి కట్టుబడి వుండడం, అందుకు తగిన మూల్యాన్ని చెల్లించడం. ఆయన కవిత్వంలోని గాఢత గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను.

వరవరరావుతో నా మొదటి పరిచయం ఒక కవిగా కాదు. పీపుల్స్వార్ పార్టీకి, ప్రభుత్వానికి మధ్య చర్చల సందర్భంగా ఆయన మధ్యవర్తిగా వ్యవహరించడం నా మొదటి పరిచయం. ఒక తమిళ వ్యక్తిగా దీన్ని నేను శ్రీలంక ప్రభుత్వం తమిళ టైగర్లతో చర్చ జరపడం లాంటిదిగా భావిస్తున్నాను. చర్చలు జరుగుతాయనే ఆలోచనే ఇక్కడ ప్రధానం. గెరిల్లాల తరఫున మాట్లాడడానికి సంసిద్ధుడైన వ్యక్తిగా, విప్లకారుల తరఫున కాకపోయినా, కనీసం అటు ప్రభుత్వానికి ఇటు విప్లవకారులకి మధ్య సంభాషణలో పాల్గొనడానికి సిద్ధపడడానికి ఎనలేని సాహసం కావాలి. అంతేకాదు, ఆ వ్యక్తి వాళ్ళ నమ్మకాన్ని చూరగొన్నవాడై వుండాలి. సాయుధులైన వ్యక్తుల విశ్వాసాన్ని పొందడం అంత తేలిక కాదు. ఎందుకంటే సహజంగానే నీ చేతుల్లోకి ఆయుధం వస్తే ఇతరుల పట్ల నీకు విశ్వాసం సన్నగిల్లుతుంది. నీ చేతుల్లోకి ఆయుధం రాగానే నిన్నెవరో వేటాడుతున్నారని నీకు తెలుస్తుంది. నువ్వు ఎవరినీ విశ్వసించడానికి అవకాశం వుండదు. అలాంటి స్థితిలో వాళ్ళ విశ్వాసాన్ని చూరగొనడం ఎంత కష్టం.

నేను పోరాట సాహిత్యం గురించి పనిచేసినప్పుడు ఎల్టిటిఈ మహిళా యోధుల కవితలు అనేకం అనువాదం చేశాను. తుపాకులు పట్టుకున్న మహిళలు ఇంకా ఎందుకు కవిత్వం రాస్తున్నారో అర్థం చేసుకునే ప్రయత్నం చేశాను. వాళ్ళు తమకోసం తాము పోరాడడానికి, ఇతరులను కాపాడడం కోసం పోరాడడానికి అవసరమైనంత సాధికారికతను పొందారన్నది స్పష్టం. వాళ్ళు మేధావులుగా మారడానికి అవసరమైన అవకాశాన్ని కవిత్వం వాళ్ళకిస్తుందని నేను గుర్తించాను. అంటే మనం వార్తా కథనాలు ఎలా రాస్తామో వాళ్ళు కవితలు రాసే పద్ధతి అదన్నమాట. అక్కడ వాళ్ళు రాస్తారు. అది వాళ్ళ మానిఫెస్టో. విప్లవకారులకు కవిత్వం అలా ఉపయోగపడుతుంది. వరవరరావు ఎన్నడూ సాయుధుడు కాలేదుగాని అలాంటి కవిత్వమే రాస్తున్నాడు. కవిత్వానికుండే అన్ని శక్తియుక్తుల్ని ఆయన గ్రహించాడు. ఈ అనువాదం చేయడానికి మమ్మల్ని ఏది పురికొల్పిందో కూడా కొంత మీకు చెప్పాలనుకుంటున్నాను. వరవరరావులాంటి కవి ఇంగ్లీషు భాషా పాఠకులకు ఎలా అర్థమౌతాడు. వేణుగోపాల్ ఈ జరుగుతున్నది అంతా గమనిస్తూ విచారంలోకి, నిరాశలోకి వెళ్ళిపోయాడు. ఇవన్నీ రాజకీయ కవితలు కదా అని ప్రజలు అనుకుంటారు. అయితే భారతీయ రచయితల ఇంగ్లీషు రచనల్లో ఇలాంటిది వుందా? అలాంటి కవిత్వాన్ని మనం దగ్గరకు తీసుకుంటామా? దాన్ని చదివి, నిజమే! కవిత్వమంటే ఇదే అనుకుంటామా? లేక ఇదంతా మేధావుల వ్యవహారమనుకుంటామా? విషయాల్ని అర్థంకాని రీతిలో చెప్పడమనుకుంటామా? మనకు కఠిన వాస్తవాలను గుర్తించం.

అనువాదం ఎలా వుండాలని మీరు అనుకుంటారో, అలా ఈ అనువాదం వుందని నా అభిప్రాయం. ఇతర సంస్కృతులలో, భాషలలో ఇలాంటి ఉద్వేగభరిత కవిత్వానికి అవకాశం వుంది. అలాంటిది ఇక్కడ మనం దాన్ని ఎందుకు ప్రోత్సహించకూడదు. వరవరరావు రాసిన ‘కవిత్వం’ అనే కవితను ఇక్కడ చదవాలనుకుంటున్నాను. ఆయన ఏమంటారంటే

“కవిత్వం దాచనక్కర్లేని నిజం / ప్రభుత్వం అక్కర్లేని ప్రజ / అమృతం అక్కర్లేని జీవితం / జేబులు వెతికినా / టేబుల్ మీద పుస్తకాలు, కాగితాలు / పొర్లించి తెర్లుచేసినా /
బీరువా సొరుగులు / బీరపువ్వులాంటి హృదయ కుహరం తెరిచి చూసినా పరిచి చూసినా / కవిత్వం తప్ప రహస్యం లేదు”.

ఆయన ఇంకా ఇలా అన్నారు :

“నీ కర్థంకాని నా ప్రమాదకర వ్యక్తిత్వం ప్రభావమంతా కవిత్వ రహస్యమే |
కవిత్వం రాజ్యాన్ని రద్దు చేసే బహిరంగ రహస్యం / అది నా గుండెలో సలుపుతుండగానే /
ఎవరికి చేరాలో వారికి చేరిపోతుంది / నా ఊహల్లో ఉదయిస్తుండగానే / ఉద్యమాన్ని ఉత్తేజపరుస్తుంది
నా కవిత్వం ఉద్యమం ఉగ్గుపాలతోనే ఊపిరి పోసుకున్నది.” (30-12-1987)

ఇది చాలా ఆసక్తిదాయకమైన అంశం. ఆయన ప్రభుత్వం గురించి మాట్లాడేటప్పుడేగాక కవిత్వం గురించి మాట్లాడేటప్పుడు కూడా అది రహస్యం కాదని అంటారు. ఈ రెండు సందర్భాల్లోనూ అమలవుతున్న చిత్రహింసలను ప్రస్తావిస్తారు. ఆయన నిఘాను మాత్రమేగాక, సెన్సార్షిప్ను కూడా సవాల్ చేస్తున్నారు. ఆయన భావనలో కవిత్వం హృదయగతం. అందులోకి నీవు తొంగిచూడలేవు. ఎవరూ తమ గుండెను రాజ్యంతో పంచుకోరు. నీవు దేన్నైనా పంచుకుంటావు. నీకు సంబంధించిన గణాంకాలను, నీ పేరును, నీ జన్మదినాన్ని, నీ కనుగుడ్ల (ఐరిస్) స్కానన్ను, చేతివేళ్ళ గుర్తులను పంచుకుంటావు. కాని అసలైన నీ అనుభూతులను రాజ్యంతో పంచుకోవు. తమకు సంబంధించినది తామే వుంచుకోవాల్సిన అవసరం వుందని నేననుకుంటాను. అది నీది మాత్రమే. నేను చూడలేని నీ సామ్రాజ్యమది. అక్కడ నీవు సర్వస్వతంత్రుడువి. అక్కడ నీ స్వీయనిర్ణయాధికారం చెలామణి అవుతుంది. అక్కడ నీకు నీవే పాలకుడువి. అది స్వతసిద్ధమైనది. అదే సమయంలో తనమీద విధించబడుతున్న సెన్సార్షిప్ను అది గుర్తిస్తుంది, దాని గురించి మాట్లాడుతుంది.

నన్ను సెన్సార్షిప్ గురించి మాట్లాడమన్నారు. అయితే అదంత తేలికైనది కాదు కాబట్టే ఎక్కడ మొదలు పెట్టాలో నాకర్థం కావడం లేదు. దానికి కారణం అనేక అవరోధాలు – చట్టంపేరిట అవరోధాలు. వాస్తవాలకు సంబంధించిన అవరోధాలు. మనం బలంగా నేలూని మనం మాట్లాడిన ప్రతిమాటా, మనం రాసిన ప్రతి కవితా యథాతథంగా వుండాలని పోరాడతామా? అయితే చివరకు పుస్తకం బయటకు రాదు. అయితే పుస్తకం బయటకు రావడమే ప్రధానమా అని నేనాలోచిస్తున్నాను. అది నాకు సంబంధించిన పుస్తకమే అయితే నేనెలాంటి నిర్ణయం తీసుకునేదాన్నో నాకే తెలియదు. ఎందుకంటే స్వయంగా నేను రాసిన పుస్తకం పంపిణీ కాలేదు. సరే, నా పుస్తకాన్ని ప్రజలు చదవకపోతే చదవకపోనీ. కాని వరవరరావుకు సంబంధించి నేను నిర్ణయం తీసుకోలేను. నేను 30లలో వున్నాను. నేను ఇంకొంత కాలం ఎదురుచూడగలను. ఆయనకు సంబంధించి వేచిచూసే సమయం లేదు. ఆయన సజీవుడుగా వుండగానే మనం ఏదోఒకటి చేయాల్సిన అవసరం వున్నది. వరవరరావు కవిత్వాన్ని సెన్సార్ చేయడానికి జరిగిన ప్రయత్నాలన్నీ నా ఆలోచనల్లోకి వస్తున్నాయి. ఈ మాట వాడకూడదు, ఆ మాట వాడకూడదు. నువ్వు ఎవరినీ నియంత అని పిలవకూడదు అన్న సందర్భాలున్నాయి. ఈ కవిత 70లకు 80లకు చెందింది. అందులో ఇందిరాగాంధీ ప్రస్తావన వున్నది. నీవు కేవలం నియంత అనే పదం మాత్రమే ప్రయోగిస్తే, ప్రజలు ఆ నియంత ఇంకెవరో అనుకుంటారు. నీవు ఏం చేస్తావు? అందుకే నీవు కవిత కింద పాదసూచిక రాయాలి. ఈ నియంత ఇందిరాగాంధీ అని. మరెవరో నియంత కాదు. తప్పుడు ప్రభావానికి లోనుకాకండి. కవిత్వం సార్వకాలికం అంటాం. కవిత్వం సార్వజనీనమని కూడా అంటాం. విప్లవకారుడు అనే పదం కూడా అలాంటిదే.

మీకు వరవరరావు తెలుసు. ఆయన పేరు వినగానే ప్రజల ఊహల్లో విప్లవకారుడు మెదులుతాడు. నీవు ప్రత్యేకించి విప్లవమనీ, విప్లవకారుడనీ రాయనక్కరలేదు. జిందాబాద్ అని, ఇంక్విలాబ్ అని రాయనవసరం లేదు. వీటన్నంటి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వరవరరావు వాటన్నంటికీ ప్రతీక. ఆయన ఆచరణ, జీవితం, జైళ్ళలో గడిపిన సంవత్సరాలు, చిత్రహింసలు, దెబ్బతినని ఆయన మనోనిబ్బరం. ఆయన్ను ఎవరు ఎలా సెన్సార్ చేస్తారన్నది అప్రస్తుతం. ఆయన తనదైన చోటును సంపాదించుకున్నారు. ఈ అనువాదమంతా పూర్తి అయ్యాక కొంతమంది తమాషాగా ఏమన్నారంటే, ఆయన కవిత్వాన్ని అనువాదం చేసే క్రమంలో దాని అంతర్గత సారాన్ని మనం అందుకోలేకపోయామేమో, అందుచేత మరొక అనువాదం అవసరమని. దాన్ని సమర్థించే మొదటి వ్యక్తిని నేను. ఆయన కవిత్వాన్ని అందరూ చదవడానికి వీలుగా శానిటైజ్ చేశాం. ఇప్పటి వర్తమానం గురించి భవిష్యత్తులో రాసేటప్పుడు కవిత్వానికి ఏమి జరిగిందో మనకు తెలుస్తుంది. ఇలాంటి తిరుగుబాటు స్వభావం కలిగిన రాడికల్ కవిత్వానికి జన్మనివ్వడం చాలా కష్టమైన విషయం. కొన్ని సందర్భాలలో నీ బిడ్డ శ్వాసించాలని నీవు కోరుకుంటావు. కాని అందుకోసం చాలా విషయాలని నీవు త్యాగం చేయాల్సి వస్తుంది. ఈ సంకలనాన్ని బయటికి తెచ్చే క్రమంలో జరిగిన మంత్రసానిత్వం గురించి నేనేమీ గర్వంగా అనుకోవడం లేదు. ఈ పుస్తకాన్ని వరవరరావు చూడాలన్న కోర్కె కారణంగా నేను రాజీలకు అంగీకరించాల్సి వచ్చింది. ఇదంతా ఆయన గమనిస్తున్నారనే నేను అనుకుంటాను. మనల్ని అణచివేస్తున్నవాళ్ళకంటే మనం ఎక్కువ కాలం జీవిస్తాం. సత్యం మనకంటే ఎక్కువ కాలం జీవిస్తుంది.

దీని గురించి మాట్లాడడం చాలా కష్టంతో కూడుకున్న పని. నేను హింస గురించి ఎప్పుడూ రాస్తూనే వుంటాను. అది నా మనస్సునంతటినీ ఆవరించి వున్నది. అయితే రాజ్య హింస, లేదా ఏ రకమైన హింస అయినా మొదటిసారి మన అనుభవంలోకి వచ్చినప్పుడు దాన్ని ఎలా అర్థం చేసుకుంటామో మనకు తెలియదు. రెండోసారి అలా జరిగినప్పుడు మన ప్రతిస్పందన ఒక రకమైన అల్లకల్లోలంతో కూడుకుని వుంటుంది. ప్రజలు తమపై హింస ప్రయోగించబడుతుందేమోనని తాము నిర్బధానికి గురౌతామేమోనని భావించి హింసకు దూరంగా వుంటారు. ఇలాంటి సెన్సార్షిప్ భారతీయ మేధావులు, ప్రచురణకర్తల, మీడియా, పత్రికాధిపతుల మనస్సునంతటినీ ఆక్రమించిందని నా అభిప్రాయం.

అంటే మనపై నిర్బంధం రావడానికి పూర్వమే, ఏదైనా జరగడానికి ముందే సెన్సార్షిప్ ప్రారంభమైందన్నమాట. ప్రతిస్థాయిలోనూ సెన్సార్షిప్ ప్రారంభమౌతుంది. ప్రజలు సమస్యల్లో చిక్కుకోవడానికి ఎదురుచూడరు. అందుకే తమ స్వరాల తీవ్రతను తగ్గిస్తారు. సెన్సార్షిప్ అంటే అంతిమంగా కోర్టు కేసులు, జైళ్ళశిక్షలు. అంటే మనం పెద్ద మొత్తాన్నే చెల్లించుకోవాలన్నమాట. అది అంత తేలికైన పనికాదు. ఎవరితోనైనా ఘర్షించమని ఎవరిపైనా వత్తిడి చేయలేం. నీ గొంతు నొక్కివేయడానికి ఎక్కడ మీట నొక్కాలో అందరికీ తెలుసు. వరవరరావు కవిత్వాన్ని పరిశీలిస్తే అది ఒక పార్టీకి సంబంధించినది కాదని మనం గుర్తిస్తాం. పాలకులు ఎవరైనా రాజ్య యంత్రాంగాన్ని ఆయన ప్రశ్నిస్తారు. ఆ దృష్టితో చూసినప్పుడు ఆయన విమర్శ ఒక పార్టీపై విమర్శ కంటే ప్రధానంగా రాజ్యం మీద విమర్శ.

ఇక్కడ మరొక విషయం చెప్పాలనుకుంటున్నాను. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి జరిగినదానిపట్ల రచయితలెవ్వరూ పట్టించుకోలేదు, గోల చేయడం లేదు. తమ గళాలను వినిపించడం లేదు. అది కాంగ్రెసుకు సంబంధించిన సమస్యగానో, ఎన్నికల సమస్యగానో మనం చూస్తున్నాం. కాని వాస్తవానికి ఎవరో ఒక వ్యక్తినో, అనిర్దిష్టమైన ఒక సమూహాన్నో అప్రతిష్టపాలు చేసాడన్న నెపంతో ఎవరికైనా రెండు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తే అది సరైంది కాదు. ఇదంతా రాహుల్ గాంధీని అనర్హుడుగా ప్రకటించడం కాదు, రేపు నీవు ఏమి రాయడానికి అవకాశం లభించబోతుందనేది దీనితో ముడిపడి వుంది. నీవు విమర్శిస్తానంటే ఎంత విమర్శించవచ్చు? ఒక పార్లమెంటు సభ్యుడే వ్యవస్థను సవాల్చేసే అవకాశం లేకపోతే రచయితల గతి ఏమికావాలి? నా ప్రసంగానికి ఇంకా ఎంత సమయం వుందో లేదో కాని ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. అది మన కథనాల మీద ఎవరి ఆధిపత్యం వుండాలన్న దాని గురించి.

కేవలం రాజ్యం మాత్రమే కాదు, ఆదానీ లాంటి వ్యక్తులు కూడా కథనాలను తమ చేతుల్లోకి తీసుకుని వాటిపై ఆధిపత్యం పొందాలనుకుంటున్నారు. ప్రజాస్వామ్యం చాలా గొప్పదని, ప్రేమించదగిందని, మనం ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నామని కొందరంటారు. మా నాన్నను తన పరీక్షలకు జవాబులు ఇంగ్లీషులో రాయమని అడగితే ఏమి రాయాలో తనకు తెలియక, ఆవుకు నాలుగు కాళు గంటాయి, అది చెట్టుకింద వుంటుంది, గడ్డి తింటుంది. ఆవు ఒక జంతువు అని రాసిన సంఘటన నాకు గుర్తుకు వస్తున్నది. ఆవు గురించి నీకు చాలా తెలుసునని చెప్పడానికి మళ్ళీ మళ్ళీ ఈ వాక్యాలే రాస్తావు. అలానే ప్రజాస్వామ్యం గురించి కూడా. అయితే ఇదంతా ఒక వ్యక్తికి సంబంధించినది కాదు. ఒక్క వ్యక్తే అలా వుంటే అతడు తననుతాను అందరిముందూ బహిర్గతం చేసుకుంటాడు. కాని దీని వెనుక ఎంత వ్యాపార ప్రకటన వున్నది. మేం ఆసుపత్రులమీద పెట్టుబడులు పెడుతున్నామని ఆయన అకస్మాత్తుగా ప్రకటిస్తాడు. దానితో తాము అమలుపరుస్తున్న పీడననంతటినీ ప్రజల దృష్టి నుండి మళ్ళిస్తాడు. ఇది చాలా ప్రమాదకరమని నేననుకుంటున్నాను. ఒకరకంగా చూస్తే వాళ్ళు కథలు చెప్పడంలో నైపుణ్యం సంపాదిస్తున్నట్టున్నారు. అణచివేత వ్యవస్థలు, నయా ఉదారవాదం కింద వాళ్ళు మంచి కథకులుగా తయారౌతున్నారనుకుంటున్నాను. ఇక్కడ ఘర్షణ వున్నది. అది కవిత్వానికి కల్పనకు మధ్య ఘర్షణ. ఎవరు వాస్తవాలు మాట్లాడుతున్నారు, ఎవరు మంచి కథనాలు అల్లుతున్నారు? ఇలాంటి పరిస్థితులలో ఎలాంటి తళు కుబెళుకులు, మెరుగులు లేకుండా వరవరరావులాంటి వాళ్ళు సమాజంలో వున్న అమానవనీయత గురించి అంతే సూటిగా, కరకుగా తమను తాము వ్యక్తీకరించుకుంటున్నారు. ఆయనకున్న ధైర్యసాహసాలలో వెయ్యో వంతైనా మనకు వచ్చేటట్లు ఆయన కవిత్వం మనల్ని ప్రోత్సహించాలి.

లాల్ సలామ్!

(అనువాదం : సి.యస్.ఆర్. ప్రసాద్)

2 thoughts on “రాసినదానికి కట్టుబడి వుండడం వరవరరావు ప్రత్యేకత: మీనా కందసామి

  1. Rare poets like him—rayadam-ade patinchdam vari prathykatha —
    Maa jilla viplava KAVI.
    I am proud to say that HE IS MY FRIEND PLUS i know his family
    Great gentlemen
    Meena garu —nice one

Leave a Reply