ఇంకా మిగిలేవున్న చేతుల్ని

మొత్తానికి అలవాటైతే అయింది కదా
టోపీ తీసినంత సులువుగా
తలను తీసి నేత పాదాల దగ్గర పెట్టడం
ఇక మీదటా అదే కొనసాగిద్దాం

నిజమే
ఈసారికి శతృవు ఎత్తు పారింది
దశాబ్దాల మన పిడికిళ్లు కూలిపోయాయి
ఇంకా మిగిలేవున్న చేతుల్ని ఎలా విస్మరించాం

ముక్కలుగా విరగ్గొట్టే
పురాతన తంత్రం ముందు
మూకుమ్మడిగా ఓడిపోయాం
అమ్మ మట్టిగాజుల్ని
కొవ్వొత్తి సెగమీద అతికి
హారం చేసిన కౌశలాన్ని ఎలా మరిచిపోయాం

ఏ మట్టిమనిషో పండిస్తే
గుంపులుగా గింజల మీద వాలే
కొంగలమైపోయాం
క్రెడిట్ కొట్టేసే బేరసారాల ఆటలో
నైపుణ్యాన్ని పెంచుకున్నాం

ఒకరికి తెలీకుండా మరొకరం
మన పగుళ్ళ రహస్యం తెలిపే ఎక్స్-రేల్ని
రాజ్యం టేబుల్ మీద పెట్టేందుకు పోటీలు పడ్డాం

నిన్నటి త్యాగాల ఛాయాచిత్రాలను
కరపత్రాల్లోంచి తీసేయండి
తేరగా వచ్చినదాన్ని
తెలివిగా ఖాతాలో వేసుకోవడం తప్ప
ఎలా చూసినా సరే
ఆ పిడికిళ్లకు వారసులం కాదు

ఎటూ అలవాటుపడ్డాం కదా
చిన్న చిన్న విదిలింపులకీ పాలవానలౌదాం
పోరాటాల సంగతి వదిలేయండి
స్టేటస్ల్లో ఎమోజీలై కురిస్తే చాలు

స్వపక్షం వెన్నుపోట్లకు
ఏనాడో చచ్చిపోయిన వాళ్ళం
కడుపులోదంతా మీమ్స్ గా వాంతి చేసుకుని
నిమ్మళ పడిపోదాం

ఎలాగో కండిషనింగ్ ఐపోయాం కదా
ఇక గొంతులు కుట్టుకుని
బుర్రలు తనకా పెట్టేసుకుని
మరో విడతా నెట్టుకొచ్చేద్దాం

జననం: ఒంకులూరు, శ్రీకాకుళం జిల్లా. కవి, రచయిత, ఉపాధ్యాయుడు.  వివిధ పత్రికల్లో కవితలు, అభినయ గేయాలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి.

Leave a Reply