మా వూరి కథ

(మా ఊరి కథ, ఇది ఒక గ్రామం కథ కాదు. ఇపుడు ప్రతీ ఊరులో నడుస్తున్న చరిత్ర. పిడికెడు మంది లాభాల కోసం దేశవ్యాప్తంగా గనుల తవ్వకాల పేరు మీద, ప్రాజెక్టుల పేరు మీద సర్వం కోల్పోయి నిర్వాసితులవుతున్న కోట్లాదిమంది మూలవాసుల కన్నీటి గాథ. సోకాల్డ్ అభివృద్ధి పేరు మీద జరుగుతున్న ఈ విధ్వంసకాండలో ప్రజాభిప్రాయ సేకరణ పేరు మీద చట్టాలను ఎంత నిర్లజ్జగా అతిక్రమించబడుతాయో, ఎన్నికుట్రలు దాగి ఉంటాయో దృశ్యాలు ఆవేదనకు గురి చేస్తాయి. రాజకీయ పార్టీలు, చివరకు ట్రేడ్ యూనియన్ నాయకులు కూడా ఎలా మోసపూరితంగా వ్యవహరిస్తారో చూసి ఆందోళనకు గురవుతాం. ప్రజల గొంతు ఎలా అణచివేతకు గురిచేయబడుతుందో కళ్లకు కట్టే సజీవ కథనం ”మా వూరి కథ”.)

మందమర్రిలో మెగా ఓపెన్‍ కాస్టు ప్రారంభమవుతుందని తెలిసిన కాన్నుంచి నా మనసు మనసులో లేకుండాపోయింది. ఎందుకంటే మందమర్రి బొగ్గు గని పారిశ్రామిక ప్రాంతం నేను పుట్టి పెరిగిన ఊరు.. అక్కడే ఆ మట్టిలో నా బాల్యం, యవ్వనం, ఆరాట పోరాటాలు కలగలసిపోయినవి. జీవితంలో క్రీయాశీలకమైన ముఖ్య భాగమంతా అక్కడే గడిచిపోయింది…

అటువంటి నా వూరుకు ఓపెన్‍ కాస్టు గని మింగేయడానికి సిద్ధంగా ఉందనే భావన మనసుని బాధపెడుతుంది. మన ఆత్మీయులెవరైనా చనిపోతే వారితో మనకు ఉన్న అనుబంధం పొరలు పొరలుగా మదిలో సుళ్ళు తిరిగి దుఃఖాన్ని కలిగించినట్టు మందమర్రిని గురించిన ఆలోచనలు మనసులో మెదిలాయి.

మేం చదువుకున్న కార్మిల్‍ స్కూల్‍ చిన్ననాటి బాల్యమిత్రులు.. మాకు విద్యా బుద్ధులు చెప్పిన కార్మల్‍ స్కూల్‍ ఫాదర్‍.. మేం ఆడిపాడిన స్థలాలు, అంతా కూడా నా మదిలో మెదిలింది.

మా స్కూలు వెనుకవైపు కళ్యాణి ఖని ఫైవ్‍ ఇంక్లయిన్‍, దాని ప్రక్కన సిఎస్పి ఉంది. రోడ్డుమీద కాస్త ముందుకు పోతే కంపెని కట్టించిన వెంకటేశ్వర ఆలయం, దానికి ఎదురుగా రోడ్డు అవతలివైపు కంపెనీ క్వార్టర్స్. వాటి వెనుకవైపు మార్కెట్‍, దానికి ఒకవైపున ఫస్ట్ జోన్‍, ఆపైన సెకండ్‍ జోన్‍ ఉంటుంది.

మార్కెట్‍ ఏరియాలో ఇప్పుడిప్పుడు కొన్ని బిల్డింగ్‍లు వచ్చాయి, కానీ మా చిన్నప్పుడు ఆ బిల్డింగ్‍లు ఉండేవి కావు. కంపెనీ కట్టించిన రేకుల షెడ్‍లోనే కార్మికులకు అవసరమైన సరుకులు అమ్మే షాపులుండేటివి. మరోవైపున కూరగాయల మార్కెట్‍ ఉండేది. కూరగాయల మార్కెట్‍లో దుకాణాలన్నీ తడకలతో వేసిన గుడిసెలు. అక్కడ పొద్దుమాపు జనంతో చాలా సందడిగా ఉండేది.

వెంకటేశ్వరాలయం ఆనుకొని కంపెనీ స్కూలు ఉంది. ఆ రోజుల్లో కంపెనీ స్కూల్లో కార్మికుల పిల్లలకు అడ్మిషన్లు దొరకడం దుర్లభంగా ఉండేది. కార్మికుల పిల్లలకు అవసరమైన స్కూళ్లను ఏర్పాటు చేయటంలో కంపెనీ ఎప్పుడు శ్రద్ధ చూపలేదు. ఉన్న కొద్ది సీట్లు అధికారుల పిల్లలకు, పలుకుబడి కలిగిన వ్యాపారుల పిల్లలకు మాత్రమే దక్కేవి. దాంతో ఆ రోజుల్లో పిల్లల చదువుల కోసం కార్మికులు చాల పెద్ద పోరాటాలే చేయాల్సి వచ్చింది..

అలా ఆ రోడ్డు నుంచి ముందుకుపోతే సీఈఆర్‍ క్లబ్‍ వస్తుంది. దాని పక్కనే పాలవాగు, అది దాటగానే కంపెనీ వర్క్షాపు, స్టోర్స్ వస్తుంది. స్లోర్స్కు ముందువైపున రోడ్డుకు ఈవతలి వైపున టింబర్‍ డిపో ఉండేది. బొగ్గు బావుల్లో రక్షణ కోసం అవసరమైన ‘చాక్స్’ అక్కడ తయారు చేసేవాళ్లు. ఆ పనులను కంపెనీ కాంట్రాక్టరుకు ఇవ్వటం వలన అక్కడ కాంట్రాక్టు కూలీలు పనులు చేసేవాళ్లు. టింబర్‍ డిపోకు ఒక వైపున కోల్‍డిపో ఉండేది. అక్కడ కార్మికులకు కార్డుల మీద నెలకు ఇంత అంటూ నిర్ణిత మొత్తంలో ఉచిత బొగ్గు సప్లయి చేసేవాళ్లు… ఉచిత బొగ్గు కోసం కార్డులు పట్టుకొని స్త్రీలు, పిల్లలు పెద్ద సంఖ్యలో జిబజిబలాడుతు ఎప్పుడు గుమికూడి ఉండేవాళ్ళు. ఉచిత బొగ్గు సప్లయి సరిగా ఉండక గంటలకొద్ది సమయం పడిగాపులుపడేవాళ్ళు.

వర్క్ షాపు ముందు రోడ్డు రెండు భాగాలుగా చీలిపోతుంది. కుడివైపున పోయేదారి కళ్యాణి ఖని 1 ఇంక్లయిన్‍కు, దానిని ఆనుకొని ఉండే దారి సీఎస్సీకి పోతుంది. రెండో దారి కాస్త మలుపు తిరిగి రైల్వే ఓవర్‍ బ్రిడ్జి మీదుగా బస్టాండ్‍కు పోతుంది. ఓవర్‍ బ్రిడ్జికు ఒక వైపు రామన్‍ కాలనీ ఉంటే రెండో వైపు పాలవాగు మీద కట్టిన ఏడుకానల మోరీ ఉంటుంది.

మంచిర్యాల నుంచి మహారాష్ట్రకు పోయే రహదారి మీద మందమర్రి బస్టాండు ఉంటుంది. దానికి బస్టాండ్‍ అని పేరే కాని అక్కడ బస్టాండ్‍ వంటి నిర్మాణం ఏదీ లేదు. రోడ్డు మీదే బస్సులు ఆగుతాయి.

బస్టాండ్‍ నుంచి బెల్లంపల్లి వైపు ముందుకు పోతే కొద్ది దూరంలో ‘యాపల్‍’ వస్తుంది. అక్కడ ఒకప్పుడు యాప చెట్లు ఎక్కువగా ఉండేటివి కాబట్టి దానికి ‘యాపల్ల’ అన్న పేరు వచ్చింది. కాని ఇటీవల రోడ్డు వెడల్పులో అక్కడ చాలా చెట్లు కొట్టేశారు. యాపల్‍కు బస్టాండుకు మధ్యన ఒకనాటి కార్మికుల పోరాటానికి చిహ్నంగా అమరవీరుల స్థూపం ఉండేది. దొరల దొరతనానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం మొదటి సారిగా తిరుగుబాటు చేసిండ్లు. ఆ సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు కార్మికులు అమరులయ్యారు. వారి స్మృతికి చిహ్నంగా ఏర్పాటు చేసిన స్థూపాన్ని ప్రభుత్వం కూల్చివేసింది. చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగిన కాలంలో ఏర్పడిన వెసలుబాటు సమయంలో బస్టాండులో నిర్మించిన అమరవీరుల స్థూపం మాత్రం ఇప్పటికీ అమరుల పోరాట స్ఫూర్తిని ఎలుగెత్తి చాటూతూనే ఉంది.

యాపల్‍ బస్తీకి ఎడమవైపున చుట్టు కాంపౌండ్‍ గోడ, వాటి మధ్య పెరిగిన గుబురు చెట్ల మధ్యన దొరల బంగ్లాలు, మధ్యలో ఆఫీసర్ల క్లబ్‍ సకల సౌకర్యాలతో వెలిగిపోతుంది. అందుకు భిన్నంగా రోడ్డుకు ఈవతలి వైపు ఉన్న కార్మికుల బస్తీ ఒక మురికి కూపంగా ఉంటుంది. గుదిగుచ్చినట్టుండే కార్మికుల గుడిసెలు. ఆ రోజుల్లో ఎక్కువగా మ్యాగజీన్‍ అట్ట పెట్టలతో నిర్మించుకునే వారు. ఒక మనిషి ఎదురయితే మరో మనిషి తప్పుకుంటే తప్ప ముందుకు పోవడానికి వీలులేని ఇరుకు వీధుల్లో సరైన డ్రైనేజీ సౌకర్యం లేక పెంట కుప్పల మధ్య ఈగలు, పందులతో ఏండ్లకు ఏండ్లు జీవనం సాగించారు. కంపెనీ కార్మికుల పిల్లలకు సరైన విద్యా సౌకర్యం కల్పించకపోవడం వల్ల గుడిసెల మధ్య ఉండే ప్రయివేటు పాఠశాలల్లో కార్మికుల పిల్లలు చదువాల్సి వచ్చేది. అంతో ఇంతో చదువుకొని ఏ ఉద్యోగం దొరకక స్కూల్లు పెట్టుకొని నడిపే వాళ్ళు. అవీ కూడా సరిగా ఉండేటివి కావు. దాంతో చాలామంది పిల్లలు చదువులు అర్థంతరంగా ఆగిపోయేటివి. రోగాలతో రోష్ఠులతో ఈసురోమంటు ఆకలి మొఖాలతో దేబరించె పిల్లలు అంతటా దర్శనం ఇచ్చేవాళ్ళు.

గుడిసెల ప్రాంతంలో పొద్దుమాపు వంట కోసం వెలిగించే బొగ్గు పొయ్యిల వల్ల దట్టంగా పొగ కమ్ముకునిపోయి ఊపిరి సల్పనిచ్చేది కాదు. చివరికి కార్మికులు తాగేందుకు కూడా సరిగ్గా నీళ్లు దొరకని పరిస్థితులుండేవి. కంపెనీ వీధికి ఒక నల్లా ఏర్పాటు చేసినా అది ఎప్పుడు వస్తుందో, రాదో తెలిసేది కాదు. దాంతో నల్లాల కాడ చాంతాడంత క్యూలు కట్టేవారు. తరుచుగా అక్కడ నీళ్ల కోసం కొట్లాటలు జరిగేవి.

మానవ నివాస యోగ్యం కాని అపరిశుభ్ర వాతావరణంలోనే కార్మికుల కుటుంబాలు జీవనం సాగించాల్సి వచ్చేది. దాంతో రోగాలు రొప్పులతో సతమతమయ్యేవారు. రోగం వచ్చి కంపెనీ దవాఖానకు పోతే అన్ని రోగాలకు ఒకటే మందు అన్నట్టుగా ఎర్రసూది, తెల్ల గోలీలు ఇచ్చేవాళ్లు.

కార్మికులకు సరిపడా క్వార్టర్‍లు కట్టించకపోవడం వల్ల చాలా మంది కార్మికులు స్వంతంగా గుడిసెలు వేసుకొని నివసించేవాళ్లు. అట్లా ఏర్పాటు చేసుకున్న కార్మిక వాడల్లో ఏ సౌకర్యాలు కల్పించకున్నా వీధికో సారాయి కొట్టు, కల్లు కొట్టో తప్పకుండా ఉండేది.

యాపల్‍ బస్తీకి ఎదురుగా స్థానిక జనరల్‍ మేనేజర్‍ ఆఫీసు ఉంది. దాని దగ్గరలో మూసేసిన బొగ్గు బాయి ఆవరణలో పాత పోలీస్‍ స్టేషన్‍ ఉండేది. జీఎం ఆఫీసు వెనుక వైపున అంగడి బజారు అనే మరో కార్మిక బస్తీ ఉంది.

కార్మిక బస్తీలకు భిన్నమైన పరిస్థితి అధికారులు నివసించే ప్రాంతంలో ఉండేది. పరస్పర విరుద్ధమైన జీవిన విధానం కోల్‍బెల్ట్ ప్రాంతంలో కొట్టొచ్చినట్టుగా కనిపించేది. గని కార్మికుల పని పరిస్థితులు కూడా దుర్భరంగా ఉండేవి. బావి మేనేజర్‍, అధికారులు, కార్మికులను బానిసలుగా చూసేవాళ్లు. నిజాం దొరతనం బావుల మీద కొత్త రూపం సంతరించుకొని ఉండేది. బావి అధికారులు కార్మికులచే దొరలుగా పిలిపించుకుంటూ జులుం చెలాయించారు. అట్లా పిలువని కార్మికులను అరిగోసపెట్టారు. కార్మికులను స్వంత పనులకు వాడుకోవడం, ఇంట్లో పని మనుషులుగా, వంటలు వండటం, బట్టలు ఉతికించుకోవడం వంటివి చేసేవాళ్లు. ఒక బావి మేనేజరే కాదు చివరికి క్రింది స్థాయి వోవర్‍మెన్‍ల వరకు కార్మికులను పని మనుషులుగా వెట్టి చేయించుకోవడం సర్వసాధారణంగా జరిగేది.

ఆ రోజుల్లో బొగ్గు బావుల్లో రక్షణ కరువై నిత్యం ఎక్కడో ఒక్క చోట కార్మికుల రక్తం చిందిన రోజు ఉండేది కాదంటే అతిశయోక్తి కాదు. భూమి పొరల్లో ఊపిరి ఆడని వందల అడుగుల లోతుల్లో గర్మి ఫేసుల్లో కార్మికులు గుక్కెడు గుక్కెడు నీళ్లు తాగుతూ ప్రకృతితో జీవన్మరణ పోరాటం చేయాల్సి వచ్చేది. చివరికి కార్మికులకు కనీస అవసరమైన బూట్లు, లైట్లు వంటివి సరిగా ఇచ్చే వాల్లు కాదు. పాతబడిపోయిన చిరిగిన బట్టలతో, బిగించి కట్టిన పంచె, నెత్తిన టోపీ ఆహార్యంగా ఉండేది. ఆ రోజుల్లో బొగ్గు ఉత్పత్తిలో మానవ శ్రమ ప్రధాన పాత్రగా ఉండేది. అందులో టుబ్బుల్లో బొగ్గు నింపే ఫిల్లింగ్‍ కార్మికుల పని మరింత కష్టంతో కూడుకున్న పని. వారిది ‘ఫీసు’ రేటు పని, షిప్టులో ఇన్ని టబ్బులు నింపాలని ఉండేది. అట్లా నింపకుంటే కార్మికుని జీతంలో కోత పడేది. ఉత్పత్తికి అవసరమైన లాడీసులు కూడా మేనేజ్‍మెంటు సక్రమంగా సప్లయి చేసేది కాదు. దాంతో కార్మికులు లాడీసుల కోసం ఆందోళన చేయాల్సివచ్చేది.

బావిలో ప్రమాదం జరిగి, అంత వరదాక తమతో కలిసి ఉన్నవాడు, ఒకరికి ఒకరు కష్టాలు కన్నీళ్లు పంచుకున్నవాడు.. నవ్వుతూ, తుల్లుతూ పనిలోకి వచ్చి తమ ముందే ప్రమాదం జరిగి బండ కింద నలిగిపోయి ఆనవాళ్లు తెలియని స్థితిలో మాంసం ముద్దలుగా మారిన తమ తోటి వారిని, పొంగిపొర్లే దుఃఖాన్ని దిగమింగుకొని గంపల్లో ఎత్తుకొచ్చిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.

గని కార్మికుల కష్టాలు పనిలోనే అంతం కాదు. బయట సామాజిక జీవితంలో కూడా మొదలయ్యేది. ఈ కష్టాలను మరచిపోవడానికి బావి ముఖ ద్వారం మీదనే వెలిసిన సారా కొట్టో, కల్లు పాఖానో వారిని ఆకర్షించేది. సవ్వో, దోసవ్వో, తాగితే తప్ప కష్టాలు మరచిపోవడానికి మార్గం దొరికేది కాదు. అంతకు మించి వారికి వేరే దారేది కనిపించేది కాదు. దానితో కార్మికుల జీవితాల్లో సగభాగం సారా కొట్లే మింగేసేవి. బాగా తాగి సోయి తప్పి రోడ్డు మీద పడిపోయిన కార్మికులు తరచుగా ఎక్కడో అక్కడ కనిపించేవాళ్లు.

కార్మికులు ఏ సౌకర్యాలు కలిగించకున్నా ప్రభుత్వం మాత్రం ఉదారంగా లెక్కకు మించి, రూల్స్కు విరుద్ధంగా కార్మిక బస్తీల్లో సారా కొట్లకు పర్మిషన్‍ ఇచ్చింది. గుడిసెల మధ్య ఉండే సారా కొట్ల వల్ల తాగుబోతుల అరాచకాలతో స్త్రీలు బయటకు రావాలంటే భయపడేవాళ్లు. సారా కాంట్రాక్టర్లు స్వంత గుండాలను కలిగి ఉండేవాళ్లు. వాళ్ల ఆగడాలకు అంతు ఉండేది కాదు. వీరికి తోడు బస్తీల్లో గుండా గ్యాంగులు వెలిసి కార్మికులను భయభ్రాంతులకు గురి చేసేవాళ్లు. మీద పడి పైసలు గుంజుకోవడం, బలవంతంగా చందాలు వసూలు చేయటం, స్త్రీల మీద అరాచకాలు నిత్యకృత్యంగా ఉండేది. గుండాల మధ్య తరచుగా గ్యాంగ్‍వార్‍లు జరిగి చంపుకోవడం వంటి సంఘటనలు జరిగేవి. ప్రతి గుండా గ్యాంగ్‍కు ఏదో ఒక రాజకీయ పార్టీ నాయకుడి అండ ఉండేది. ఫలితంగా కాలరీ ప్రాంతంలో నామ మాత్రంగా పోలీసు స్టేషన్‍లు ఉన్నప్పటికీ రాజకీయ ఒత్తిళ్లకు తల ఒగ్గి గుండాల అరాచకాలను చూసీ చూడనట్టుగా ఉండిపోయేవాళ్ళు. ఏదైన పెద్ద సంఘటన జరిగి తప్పని పరిస్థితులలో గుండాలను అరెస్టు చేయాల్సి వచ్చినా, రాజకీయ పలుకుబడితో కొద్ది రోజుల్లోనే గుండాలు మళ్లీ బయటకు వచ్చి తమ అరాచకాలను కొనసాగించే వాళ్లు. ఫలితంగా బహిరంగంగా హత్యలు జరిగినా గుండాలకు భయపడి ఎవరు సాక్ష్యాలు చెప్పలేని పరిస్థితి ఏర్పడి కేసులు నిలువకపోయేటివి. దాంతో జనం గుండాలకు మరింత భయపడి పోయేవాళ్ళు ఒక మాటలో చెప్పాలంటే కాలరీ ఏరియా మొత్తంగా ఒక మాఫియా సంస్కృతి నెలకొని ఉండేది.

కాలరీ ప్రాంతంలో నెలకొన్న మాఫియా కల్చర్‍ను ఒక విధంగా ప్రభుత్వమే పెంచి పోషించింది. కార్మికులను తాగుబోతులుగా మార్చి అరాచకాలు సృష్టించి నిత్యం భయం భయంగా బ్రతికే పరిస్థితి కల్పించి కార్మికుల చైతన్యాన్ని నిర్వీర్య పరిచింది. తమ దోపిడిని సజావుగా కొనసాగించే కుట్రలో బాగంగానే ఇదంతా జరిగేది.

ఇంత జరుగుతుంటే కార్మిక పక్షం వహించి వారి హక్కులను, సంక్షేమాన్ని చూడాల్సిన కార్మిక సంఘాలు ఫక్తు పైరవీ సంఘాలుగా అవతరించాయి. కార్మికులు ఏదైనా పనిబడి వస్తే మార్కెట్‍లో సరుకులకు రేట్లు నిర్ణయించినట్టు పనిని బట్టి లంచాలు వసూలు చేసేవాళ్లు. కార్మిక సంఘాల నాయకులకు స్వంత గుండాలు ఉండేవాళ్ళు. వారి ద్వారా కార్మికుల నుంచి బలవంతంగా చందాలు వసూలు చేసేవాళ్ళు. గుండాలకు భయపడి కార్మికులు అన్ని సంఘాలకు చెందాలు చెల్లించే వాళ్లు. కార్మిక సంఘాల నిర్వీర్యమైన పాత్ర వల్ల మేనేజ్‍మెంటు శ్రమ దోపిడీకి, అణచివేత చర్యలకు ఎదురు సదరులేకుండా పోయింది. ఒకవేళ ఏదైన కార్మిక సంఘం తప్పని సరి పరిస్థితులలో సమ్మె నోటీసులు ఇచ్చినా మరో సంఘం వాటిని విఫలం చేసేటివి. వీటికి తోడు మా మందమర్రిలో మరో ప్రత్యేకమైన పరిస్థితి ఉండేది. కరుడుగట్టిన భూస్వాములే కార్మిక నాయకులుగా, గుండా నాయకులుగా పారిశ్రామిక వేత్తలుగా చెలామణి అయి ఒక భయపూరిత వాతావరణం నెలకొని ఉండేది. వారి చర్యలకు ఏమాత్రం ఎదురు చెప్పినా భూస్వామి గుండాలు చంపి రైల్వే ట్రాకు మీద గుర్తులేని శవాలుగా పారవేసేవాళ్లు. అటువంటి హత్యలకు దాతు ఫిర్యాదు ఉండేది కాదు..

కాలరీ ప్రాంతంలో నెలకొన్న అస్తవ్యస్థ పరిస్థితిలో పుట్టి పెరిగిన యువతరం అరాచకాలకు వ్యతిరేకంగా రగిలిపోయేవాళ్ళు. ఎమర్జెన్సీ చీకటి రోజులు కోల్‍బెల్ట్లోను రాజ్యమేలింది. అభ్యుదయ భావాలు కలిగిన అనేక మందిని జైల్లోకి తోశారు. కార్మిక హక్కుల మీద ఉక్కు పాదం మోపారు. డీఐఆర్‍. మీసా వంటి నల్ల చట్టాల మీద అనేక మందిని అరెస్టు చేశారు. అప్పటికీ సింగరేణిలో ప్రధానమైన రెండు జాతీయ సంఘాలు ఎమర్జెన్సీని సమర్థించటంతో కార్మికుల పరిస్థితి అగమ్యగోచరమైంది.

ఎమర్జెన్సీ చీకటి రోజుల తరువాత ప్రజల అసంతృప్తి ఒక స్ఫష్టమైన రూపానికి రాసాగింది. అప్పటికే ఉత్తర తెలంగాణలో నూతన చైతన్యం పాదుకొని గ్రామాలలో భూస్వామ్య వ్యతిరేక పోరాటంగా అంకురించింది. సింగరేణి కార్మికుల పునాదులు గ్రామీణ ప్రాంతంలో ఉన్నాయి. కార్మికుడి ఒక కాలు కాలరీలో ఉంటే మరోకాలు తమ స్వంత గ్రామంలో ఉండేది. ఆ విధంగా మొగ్గ తొడిగిన విప్లవ రాజకీయాల ప్రభావం ముఖ్యంగా వామపక్ష తీవ్రవాద నక్సల్బరీ రాజకీయాలు వారిని ప్రభావితం చేసింది.

గ్రామాలలో భూస్వాముల దొరతనం చెలామణి అయితే కాలరీ బాయి దొరల దొరతనం వాళ్ల మూల్గుల్ని పీల్చింది. విప్లవ భావాలు ఒంట పట్టించుకున్న విద్యార్థి, యువజనులు రాడికల్‍ భావాలతో బాయి బాయికి తిరిగి కార్మికులను చైతన్యవంతం చేశారు. ఫలితంగా కార్మిక వర్గం తమపై జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించడం మొదలైంది.

వరంగల్‍ ఆర్‍ఇసిలో విప్లవ భావాలు పుణికి పుచ్చుకున్న గజ్జెల గంగారాం చెదరని చిర్నవ్వుతో మురికి కూపాల్లాంటి కార్మికుల గుడిసె గుడిసెకు తిరిగి వారిని చైతన్య పరిచిండు. బొగ్గు బాయి పనిలో బుగ్గైనా కార్మికుల బ్రతుకులో విప్లవాన్ని రగిల్చిండు ఆదిరెడ్డి. బొగ్గులో పుట్టి బొగ్గులో పెరిగిన ఆనంద్‍, రగలుకొన్న రాకాసి బొగ్గులో నేర్చిన పోరు పాఠాలను మోసుకొని అదిలాబాద్‍ అడవులకు, గిరిజన గూడెలకు అటు తరువాత మొత్తం దేశానికే విస్తరించే పనిలో మునిగిపోయిండు. ఎంతమంది విప్లవకారులకు ఎన్ని పోరు పాఠాలు నేర్పంది నా బొగ్గుతల్లి.

అలా మొగ్గ తొడుగుతున్న చైతన్యాన్ని మొగ్గలోనే తుంచడానికి గుండాలను ఎగదోశారు. విప్లవిస్తున్న విద్యార్థి యువజనుల మీద గుండా దాడులు పెరిగిపోయాయి. ఫలితంగా గుండాల అరాచకాలను అరికట్టకుండా ఉద్యమం ముందుకు పోలేని పరిస్థితి ఏర్పడి, ఎదురు దాడికి దిగి బెల్లంపల్లిలో పేరు మోసిన ఇద్దరు గుండాలను రాడికల్స్ హత మార్చడంతో కాలరీ ప్రాంతంలో గుండాయిజం తగ్గుముఖం పట్టింది.

ఎప్పుడైతే గుండాల అరాచకం తగ్గాయో… అప్పుడిక పోలీసులే నేరుగా విప్లవకారులను అణచడానికి పూనుకున్నారు. ఉద్యమంలో ముందుకు వచ్చే వారిని అక్రమ అరెస్టులతో, చిత్రహింసలతో భయభ్రాంతులకు గురిచేయడం మొదలైంది. ఈ అటుపోటుల మధ్యనే బెల్లంపల్లి పట్టణంలో ముప్పయి సంవత్సరాలుగా కార్మికులు నివసిస్తున్న బస్తీని బలవంతంగా ఖాళీ చేయించి వ్యాపారులకు కట్టబెట్టాలని మేనేజ్‍మెంట్‍ చూసింది. కంపెనీ వ్యాపారులు కలిసి పోలీసుల అండదండలతో ‘‘బెటర్‍మెంటు కమిటీ’’ పెట్టి బుల్‍డోజర్లు తెచ్చి బలవంతంగా కార్మికుల బస్తీని ఖాళీ చేయించాలని చూసినప్పుడు బస్తీ వాసులతో కలిసి రాడికల్స్ పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. చివరికి ప్రజాగ్రహం ముందు కంపెనీ తలవంచక తప్పలేదు.

ఆ సంఘటన రాడికల్స్ పట్ల కార్మికుల విశ్వాసం ప్రబలేలా చేసింది. ఆ వెంటనే జరిగిన రాజేశ్వరి సంఘటన ఆ ప్రాంతంలో అంతవరదాక అనేక అణచివేతలకు గురయిన స్త్రీల కోపావేశాలకు లావాల పెల్లుభికేలా చేసింది. మధాందకారుడైన ఒక పర్సనల్‍ అధికారి కొడుకు, కార్మికుడి భార్య అయిన రాజేశ్వరిని బలత్కరించి ఆ విషయం బయటపడకుండా ఉండటం కోసం హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించడానికి చిన్న షెడ్డులో ఉరివేసి ఆత్మహత్యగా నమ్మింపజూసిండు. కంపెనీ అధికారులు పోలీసులు కుమ్మక్కయి హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించాలని చూసినప్పుడు కార్మిక స్త్రీల కోపావేశాలు కట్టలు తెంచుకున్నది. వేలాది మంది స్త్రీలు వీధుల్లోకి వచ్చి దోషిని శిక్షించాలని నినదించుతూ ఆందోళనకు దిగారు.

దోషులను అరెస్టు చేయలేదు సరికదా ఆందోళనకారుల మీద పోలీసులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి నల్గురి ప్రాణాలు తీశారు. అయినా ఉద్యమం ఆగలేదు. బందులు, హర్తాల్‍లతో ఆదిలాబాద్‍ జిల్లా కోల్‍బెల్ట్ ప్రాంతం అట్టుడికిపోయింది. చివరికి పోలీసులు దిగివచ్చి అధికారి కొడుకును అరెస్టు చేయక తప్పలేదు.

కార్మిక సమస్యలపై పోరాటాలు ఆరంభమయ్యాయి. ఎమర్జెన్సీలో కోత విధించిన లాభాల బోనసు పునరుద్ధరణ, కార్మికుల జీతాల నుంచి కోత విధించిన కంపల్‍సరి డిపాజిట్‍ తిరిగి చెల్లింపు వంటి సమస్యలపైన పోరాటాలు వెల్లువెత్తింది. బావిలో రక్షణ విషయమై, పనిముట్ల కోసం బాయి దొరల దొరతనంకు వ్యతిరేకంగా కార్మికులు సమ్మె పోరాటాలు ఎక్కుపెట్టారు.

కాలరీ ప్రాంతంలో వెల్లువెత్తిన నూతన చైతన్యం అన్ని రకాల అన్యాయాలను ప్రశ్నించేలా చేసింది. మందమర్రి కళ్యాణి ఖని 1 బావి సీఎస్సీ కాడ ప్రైవేటు లారీల్లో బొగ్గు నింపే కాంట్రాక్టు కార్మికుల శ్రమ దోపిడికి వ్యతిరేకంగా పోరాడేలా ప్రేరేపించింది. అక్కడ కార్మిక నాయకుడిగా చెలామణి అయ్యే భూస్వామి గుండాలదే ఇష్టారాజ్యంగా కొనసాగేది. పొద్దంతా కూలీలు బొగ్గు నింపితే సాయంత్రం భూస్వామి గుండాలు వచ్చి డబ్బులు వసూలు చేసుకొని అందులో సగం మాత్రమే కూలీగా ఇచ్చేవాళ్లు.

ఈ అన్యాయం మమ్ముల్ని నిలువనీయలేదు. అప్పుడు మేమంతా ఏఐటీయూసీలో పనిచేసే వాళ్లం. నాయకత్వమేమో చూసీ చూడనట్టుగా ఉండేవాళ్లు. యువకులమైన మేం దాన్ని సహించలేక అబ్రహం నాయకత్వంలో ఎదురుతిరిగాం. అది సహించలేని భూస్వామి తన గుండాలతో దాడి చేసి తీవ్రంగా గాయపరచి మాపై హత్యా ప్రయత్నం చేశారు. ఆ సంఘటన అంతవరదాక మందమర్రిలో భూస్వామి గుండాల అరాచకాలకు వ్యతిరేకంగా నివురు గప్పిన నిప్పులా ఉన్న జనం కోపం ఒక్కసారిగా పెల్లుబికేలా చేసింది. మరునాడు 1979, జనవరి 6న కళ్యాణి ఖని ఐదు ఇంక్లయిన్‍ కార్మికులు వందలాది మంది తమ పనులు బందు పెట్టి భూస్వామి గుండాలకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చారు. ఊరేగింపు ముందుకు సాగేకొలది వేలాది మంది జనం వచ్చి కలిసిపోయి మహా ప్రదర్శనగా మారింది.

ప్రజల కోపావేశాలు కట్టలు తెంచుకొని భూస్వామి అరాచకాలకు కేంద్రంగా ఉండే ఆయనకు చెందిన సినిమా థియేటర్‍ను దహనం చేశారు. అక్కడ నుండి ఊరేగింపు బస్టాండు ఏరియాలో దొరల సారా బట్టీలవైపు సాగింది. ఈ లోపున మంచిర్యాల నుంచి పోలీసు బలగాలు వచ్చి ఎటువంటి హెచ్చరికలు లేకుండా ఊరేగింపుపై కాల్పులు జరిపి పానుగంటి పోషం, కాటం చంద్రయ్య, శీలంశెట్టి నారాయణ, దుర్గయ్య అనే నల్గురు కార్మికులను పొట్టన పెట్టుకున్నారు.

అంతవరదాక ఎదురు లేకుండా సాగిన అణచివేతలను, దోపిడీని చైతన్యవంతమైన కార్మిక వర్గం సంఘటితమై ప్రశ్నించే సరికి పాలకులకు మింగుడు పడలేదు. వెల్లువెత్తుతున్న విప్లవోద్యమాన్ని మొగ్గలోనే తుంచివేయడానికి ఆఘమేఘాల మీద సాయుధ బలగాలను మోహరించారు. కార్మికుల ఆట, పాట, మాట మీద అప్రకటిత నిషేధం మొదలైంది. అక్రమ అరెస్టులు అక్రమ కేసులు మొదలయ్యాయి. ఈ అటుపోటులను ఎదుర్కొంటూనే కార్మికులు ఉద్యమించారు.

మందమర్రి మార్కెట్‍లో ఆదిలాబాద్‍ జిల్లా రాడికల్‍ యువజన సంఘం రెండవ మహాసభ సందర్భంగా జరిగిన బహిరంగ సభపై పోలీసులు దాడి చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి నాయకులను, వక్తలుగా వచ్చిన వారిని అరెస్టు చేశారు. ఈ నిర్భంధాలు ఏవీ కూడా చైతన్యవంతమైన కార్మిక వర్గాన్ని తమ పోరాటాల నుంచి వెనక్కి తగ్గించలేదు సరికదా మరింత మిలిటెంట్‍ పోరాటాలకు పురిగొల్పింది.

ఇవ్వాళ ఏ బావిమీదైతే ఓపెన్‍ కాస్టు గని పేరుమీద మేనేజ్‍మెంట్‍ మందమర్రిని మాయం చేయడానికి కుట్రలు పన్నుతుందో అదే బావి ఒకప్పుడు విప్లవ కార్మికోద్యమానికి కేంద్రంగా ఉండేది. విప్లవిస్తున్న కార్మిక వర్గాన్ని అణచటం కోసం ప్రభుత్వం, బ్రిటిస్‍ కాలం నాటి మస్టర్ల కోత చట్టపు దుమ్ముదులిపి కార్మికుల మీద అమలు జరిపింది. దానికి వ్యతిరేకంగా 1981లో కార్మిక వర్గం జరిపిన చారిత్రాత్మకమైన సమ్మె పోరాటానికి ఆ బావే కేంద్రమైంది. అనేక నిర్భంధాల మధ్య అక్రమ అరెస్టుల మధ్య 80 వేల మంది బొగ్గు గని కార్మికులు 56 రోజులు సుధీర్ఘ సమ్మె పోరాటం చేసి మస్టర్ల కోత చట్టాన్ని తిప్పికొట్టారు. ఆ చారిత్రాత్మకమైన పోరాటం క్రమంలోనే విప్లవ కార్మిక సంఘమైన ‘‘సింగరేణి కార్మిక సమాఖ్య’’ పురుడు పోసుకుంది. అటు తరువాత కాలంలో దాదాపు రెండు దశాబ్దాల పాటు వీరోచిత పోరాటాలు నిర్వహించింది.

అటుతరువాత కార్మిక వర్గం ఎన్ని పోరాటాలు చేసింది. ఎంత రక్తతర్పణ కావించింది ఎన్ని విజయాలు సాధించింది తలుచుకుంటే వొళ్ళు పులకరించిపోతుంది.

సికాస జాతీయ సంఘాల విద్రోహ పాత్రకు ఎండగడుతూనే కార్మిక సమస్యలపై వందలాది సమ్మె పోరాటాలు నిర్వహించింది. జాతీయ సమస్యలైన వేజ్‍బోర్డుల సత్వర పరిష్కారానికి సుదీర్ఘ సమ్మె పోరాటాలు చేసింది. కార్మికుల సంక్షేమం కోసం రోజువారి సమస్యలపైన, బాయిదొరల దొరతనానికి వ్యతిరేకంగా అణచివేతలకు వ్యతిరేకంగా అసమాన పోరాటాలు చేసింది. ఒక్కమాటలో చెప్పాలంటే భయం భయంగా బతుకుతున్న సింగరేణి కార్మికులను అసమాన పోరాట యోధులుగా తీర్చిదిద్దింది.

కేవలం కార్మికుల సమస్యలపైనే కాదు మద్యపాన వ్యతిరేక పోరాటం వంటి సామాజిక సమస్యలపై పోరాటాలు నిర్వహించింది. కార్మికుల ఇల్లు వొళ్లు గుళ్ల చేస్తున్న మత్తు పదార్థాల అమ్మకాలను నిషేధించాలని సికాస జరిపిన పోరాటాన్ని అణచటానికి గాంధేయ పాలకులు పోలీసు స్టేషన్‍లనే సారా కొట్టులుగా మార్చి సాయుధ పోలీసు పహారాల మధ్య సారా అమ్మకాలు సాగించారు. మద్యపాన నిషేధాన్ని కోరుతూ ఉద్యమిస్తున్న ప్రజల మీద, స్త్రీల మీద విచక్షణారహితంగా హింసను అమలు జరిపి నెత్తుటేర్లు పారించి సారా పోరాటాన్ని అణచివేశారు.

మా వూరు మందమర్రిలోని ప్రతి బావికి, ప్రతి కార్మిక బస్తీకి ఒక ఉద్యమ చరిత్ర ఉంది. ఇరుకు మురికి గుడిసెల మధ్యనే కార్మికులు పాలకుల కుట్రలను ఎదిరించే ఆలోచనలు చేశారు. సుతి మెత్తని కత్తిలాంటి నూతన స్టాండింగ్‍ ఆర్డర్‍ కుట్రలను బయటపెట్టారు. ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థలను నిర్వీర్య పరిచే నూతన బొగ్గు పాలసీల వంటి గ్లోబల్‍ కుట్రలను ఎండగట్టారు.

వెల్లువెత్తుతున్న కార్మికుల పోరాటాలను అణచడానికి కంపెనీ స్టయిన్‍ కంట్రోలింగ్‍ కమిటీల పేరు మీద, గ్రీవెన్స్ ప్రోసీజర్స్ వంటి కాలయాపన ఎత్తులను తిప్పికొట్టారు. దేశంలోని సకల సాయుధ బలగాలను మోహరించి కాలరీ ప్రాంతాన్ని సాయుధ పోలీసు క్యాంపుగా మార్చి పాలకులు, పాశిష్ఠు అణచివేత సాగించిండ్లు. విప్లవకారులను కనిపిస్తే కాల్చి వేయటం, అర్థరాత్రి ఇంటి మీద దాడులు చేసి మాయం చేయటం వంటి పోలీసు మార్క్ అరాచకాలతో కోల్‍బెల్ట్ తల్లడిల్లింది. ఎటువంటి ప్రజాస్వామిక విలువలను పాటించకుండా పదుల సంఖ్యలో సింగరేణి కార్మిక సమాఖ్య నాయకులను, కార్యకర్తలను బూటకపు ఎన్‍కౌంటర్‍ల పేరు మీద కాల్చిచంపారు.

వెల్లువెత్తిన విప్లవ కార్మికోద్యమాన్ని అణచటానికి పాలకులు ఎన్నికుట్రలు పన్నారు. ఎంత నిర్భంధం అమలు జరిపారు ఎంత అరాచకం సృష్టించారు.

ఒక వైపు ఫాసిస్ఠు అణచివేత కొనసాగిస్తూనే మరోవైపు సింగరేణిలో సంస్కరణలు తెచ్చారు. మరోవైపు సికాస ఏండ్లకు ఏండ్లుగా పాతుకుపోయిన అవకాశవాద ట్రేడ్‍ యూనియన్‍కు చరమగీతం పాడుతూ, కార్మిక వర్గ పోరాటాలకు నూతన జవసత్వాలు అద్ది తమ అసమాన త్యాగాలతో భారత దేశ కార్మికోద్యమ చరిత్రలోనే నూతన చరిత్ర సృష్టించారు. సింగరేణిలో విప్లవ కార్మికోద్యమాన్ని అణచడానికి పెద్ద కుట్రలే జరిగాయి. దోపిడీదారులు దేశ విదేశాల్లోని తమ అనుభవాలను కలబోసి నూతన అణచివేత విధానాలను సింగరేణి కార్మిక వర్గం మీద ప్రయోగించారు. ఎక్కడ విప్లవ కార్మికోద్యమం అంకురార్పన జరిగిందో అక్కడ తమ దోపిడిని తిరిగి నిలబెట్టుకోవడానికి సింగరేణిని ఒక ప్రయోగశాలగా మార్చారు.

ఫలితంగా దేశంలోని సకల సాయుధ బలగాల పదఘట్టణలతో అణచివేత కొనసాగించారు. కనిపిస్తేనే కాల్చివేస్తూ బూటకపు ఎన్‍కౌంటర్ల కట్టుకథలు అల్లి నల్లనేలను రక్తసిక్తం చేశారు. తీవ్ర నిర్భంధాలను ఎదుర్కొంటూనే ప్రతి బావి ఒక విప్లవ కేంద్రమైంది. ఇరుకు మురికి గుడిసెల్లోకే రేపటి బంగారు భవిష్యత్తును కలలుగంటూ తమ కలలను నిజం చేసుకోను ఉద్యమించారు. కార్మికుల గుడిసెల్లోనే కాదు కార్మికుల గుండెల్లో సికాస గూడుకట్టుకొన్నది. ప్రభుత్వ కుట్రలను భగ్నం చేస్తూ అసమాన పోరాటాలతో సింగరేణి కార్మిక వర్గాన్ని పోరాడే యోధులుగా తీర్చిదిద్దింది.

ప్రపంచ బ్యాంక్‍ ఎజంటుగా తనకు తాను ప్రకటించుకున్న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, సింగరేణిలో ప్రపంచబ్యాంక్‍ సంస్కరణలు అమలు జరుపాలంటే సింగరేణిలో పాదుకున్న విప్లవకార్మికోద్యమాన్ని అణచివేయకుండా సాధ్యం కాదని కుట్రలు పన్నాడు.

ఫలితంగా ప్రభుత్వ అణచివేతలతో, సాయుధ బలగాల పదఘట్టనలతో నల్లనేల నిండిపోయింది. ఏ ప్రజాస్వామిక చట్టాలు వర్తించని నిర్భంధం రాజ్యం ఏలింది. విప్లవకార్మికోద్యమ నాయకులు కనిపిస్తే కాల్చివేత యదేచ్చగా సాగింది. మిలిటెంట్‍ నాయకులను రాత్రికి రాత్రి ఇండ్ల నుండి ఎత్తుకపోయిన పోలీసులు తెల్లారే సరికి మాయం చేసి గుర్తు తెలియని శవాలుగా ప్రకటించడం మామూలైంది.

తమ న్యాయమైన సమస్యల మీద సమ్మె కట్టిన కార్మికులను భయభ్రాంతులకు గురి చేయటానికి పోలీసులు బావుల మీద యదెచ్చగా కాల్పులకు తెగబడ్డారు. ఆ సమ్మెకారులను రాత్రికి రాత్రి తుపాకి మొన మీద ఎత్తుక వచ్చి బలవంతంగా పనులు చేయించటం సర్వ సాదారణమైంది.

కత్తుల బోనులాంటి కోల్‍బెల్ట్లో నిత్య నిర్భంధంలోనే విప్లవకారులను కార్మికులు కడుపులో దాచుకున్నారు. వారికి అశ్రమించారు. వాళ్ళ అడుగుజాడల్లో పోరు బాట పట్టారు.

సింగరేణి కార్మిక సమాఖ్య చరిత్రంతా అసమాన త్యాగల చరిత్ర. పాలకుల ఫాసిస్టు నిర్భంధంలో ఒరిగిన వీరుని ఆశయాలను మోసుకుంటూ మునుముందుకు సాగారు.

ఆ పోరాటంలో ఎంతమంది అమరులైనారు….

పదమూడు సంవత్సరాలు విప్లవ కార్మికోద్యమానికి ఊపిరిలూదిన కట్ల మల్లేశ్‍ను గోదావరిఖనిలో కాల్చిచంపింది ప్రభుత్వం. వేలాది మంది జనం సమక్షంలోనే ఒంటి చెత్తో నాల్గవ వెజు బొగ్గు సమ్మెను నడిపించి కేంద్రం మెడలు వంచి లక్షలాది మంది బారతదేశ బొగ్గుగని కార్మికులకు వేజు బొర్డు సాధించిపెట్టిన సికాస నాయకుడు మాదిరెడ్డి సమ్మిరెడ్డి ఒక కార్మికుని ఇంట్ల షెల్టర్‍లో ఉండగా చుట్టు ముట్టిన వందలాది మంది పోలీసులు, అతన్ని లొంగ దీసుకోవటానికి అవకాశం ఉండి కూడా ఇంటిపైకప్పు నుండి పెట్రోల్‍ పోసి సజీవ దహనం చేసి తన రాక్షసత్వాన్ని నిరూపించుకున్నారు. ఇలా ఒకటా రెండా ఎంతమంది విప్లవకారులను హత్య చేసింది ప్రభుత్వం. ఎంత పాశవికత అమలు చేసింది ప్రభుత్వం.

నరరూప రాక్షసుడుగా మారిన చంద్రబాబు కోల్‍ బెల్టులో సాగించిన హింసాకాండలో ఓరిగిన అమర వీరుల రక్తంలో నల్ల నేల తడిసిపోయింది. దాదాపు రెండు దశాబ్ధాలుగా సాగిన ఈ పోరాటంలో చివరికి పాలక వర్గాల పాశవిక శక్తి పై చెయ్యిగా మారింది.

అప్పుడు మాత్రమే చంద్రబాబు నాయుడు తన ప్రపంచ బ్యాంకు విధానాలను సింగరేణిలో అమలు జరుపగలిగాడు. దేశంలో ఏ బొగ్గు పరిశ్రమలో లేని విధంగా గుర్తింపు సంఘం ఎన్నికలను తెచ్చి కార్మికుల చీత్కారానికి గురయిన జాతీయ సంఘాలను తిరిగి కార్మికుల నెత్తిన రుద్దిండు. అట్లా అధికారంలోకి వచ్చిన నాయకులు కార్మికుల హక్కులను తాకట్టుపెట్టి సొమ్ము చేసుకుంటుంటే చంద్రబాబు సంస్థలో ఎదురు సదురు లేకుండా ప్రయివేటీకరణ, కాంట్రాక్టీకరణ, ఔట్‍ సోర్సింగ్‍ అమలు జరిపాడు.

ఉత్పత్తిలో కార్మికుల ప్రాధాన్యత తగ్గిపోయింది. వారి స్థానంలో ఏ చట్టాలు వర్తించని అర్ధ బానిసలైన కాంట్రాక్టు కార్మికులు వచ్చి చేరారు. అటు తరువాత అధికారంలోకి వచ్చిన రాజశేఖర్‍ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్‍ ప్రభుత్వం అదే విధానాలను కొనసాగించింది.

ఫలితంగా బొగ్గు గనుల్లో యాంత్రీకరణ, ప్రయివేటీకరణ పెరిగిపోయింది. బొగ్గు ఉత్పత్తులు రెండింతలు మూడింతలు పెరిగింది. కాని కార్మికులకు పనులు లేకుండా పోయింది. ఇట్లా మిగులు బాటయిన కార్మికులను తొలగించడానికి పొమ్మనలేక పొగబెట్టినట్టు కార్మికులపై విపరీతమైన పనిభారం పెంచారు. అక్రమ డిస్మిస్‍లతో, చార్జిషీట్లతో వేధింపులు పెరిగిపోయాయి. గోల్డెన్‍ షేక్‍ హ్యాండ్‍ల పేర, వాలంటరీ రిటైర్మెంట్లతో కార్మికుల మెడలకు ఉచ్చు బిగించి ఉద్యోగాలు ఊడబీకి వీధుల్లోకి నెట్టివేశారు.

విప్లవోద్యమం బలంగా పని చేసినప్పుడు ఓపెన్‍ కాస్టులు అడ్డుకోవడం జరిగింది. ఎప్పుడయితే కార్మికుల ప్రతిఘటన తగ్గిందో అప్పుడిక అండర్‍ గ్రౌండ్‍ బావులను మూసివేస్తూ ఓపెన్‍ కాస్టు గనులను పెద్ద ఎత్తున ఆరంభించారు. ఆ మేరకు పర్యావరణ, జీవన విధ్వంసం పెరిగిపోయింది. బొగ్గు ఉత్పత్తులు గణనీయంగా పెరిగినా దాని ఫలితాలు మాత్రం స్థానికులకు అందకుండాపోయాయి. బొగ్గు సంపదను కొల్లగొట్టుకపోయే అంతర్గత వలస దోపిడికి సింగరేణి కేంద్రమైంది. ఓపెన్‍ కాస్టు పెనుభూతం తెలంగాణలోని గోదావరి పరీవాహక ప్రాంతాన్ని ఎడారిగా మారుస్తూ అది ఇవ్వాళ మందమర్రి కేసి కోరలు చాచింది.

నిర్భంధం వలన ప్రజల న్యాయమైన ఆకాంక్షలు నెరవేకపోవచ్చు. తాత్కలికంగా ఉద్యమాలు వెనుకపడిపోవచ్చు. కాని ఆ పోరాటంలో అసువులు బాసిన అమరుల ఆశయాలను మోసుకుంటూ దేశ వ్యాపితంగా ప్రజా ఉద్యమాలు నిర్మించడానికి నడుము బిగించిన అనేక మంది పోరాట యోదులకు ఉగ్గుపాలతో పోరు పాఠాలు నేర్పింది.

సింగరేణి ఒకప్పుడు ఒక కార్మిక బస్తీని ఖాళీ చేయాలని చూపినప్పుడు అగి కణాలై ఎదురు తిరిగిన చోట ఇవ్వాళ ఓపెన్‍ కాస్టు పేర ఊళ్ళకు ఊళ్ళు నాశనం చేస్తున్నా ఎటువంటి ప్రతిఘటన లేకుండా పోయింది. కోల్‍బెల్ట్లో ఇవ్వాళ విధ్వంసకర అభివృద్ధి వికటహట్టహాసం చేస్తుంది. స్వార్థంతో పుచ్చిపోయిన నాయకులు దానికి వంతపాడుతున్నారు. ఫలితంగా ఒకప్పుడు పోరాటాలకు నెలువైన మా మందమర్రిని నేడు ఓపెన్‍ కాస్టు పేర శాశ్వితంగా సమాధి చేయడానికి 13 ఫిబ్రవరి 2013న కుట్ర జరుగబోతుంది. కన్నతల్లిలాంటి మా వూట మందమర్రి భవిష్యత్‍లో లేకుండా పోతుందనే భావన నా మనసును బాధిస్తుంది.

2

నేను నా జర్నలిస్టు వృత్తిలో భాగంగా చాలా ఓపెన్‍ కాస్టు ప్రభావిత గ్రామాలను తిరిగాను. నిర్వాసితులైన ప్రజల కన్నీళ్ళు, కథనాలను పత్రికలో ఏకరువు పెట్టాను. అయితే వాళ్ళ రోదనలు, ఆవేధనలు అరణ్యరోధనగానే మిగిలిపోయాయి. నిర్వాసితులను చేసే సమయంలో కంపెనీ చెప్పే మాటలకు అటు తరువాత చేసే చేష్టలకు పొంతనే ఉండటం లేదు. ప్రకృతిని, పర్యావరణాన్ని మానవ జీవితాన్ని శాశ్వితంగా నాశనం చేసే ఓపెన్‍ కాస్టుల విషయంలో ప్రజలలో చాలా వ్యతిరేకత ఉంది. ప్రకృతికి భూమికి నష్టం కలిగించని అండర్‍ గ్రౌండ్‍ విధానంలో బొగ్గు తీసుకోవాలి తప్ప తరతరాలు బ్రతికిన ఈ భూమిని, ఈ భూమి మీద బ్రతికే సమస్త జీవరాశిని నాశనం చేయటం అన్యాయం అంటూ ప్రజలు చేసే అభ్యంతరాలు ఏవీ కూడా ప్రభుత్వాలు లెక్కచేయటం లేదు. యథేచ్చగా సాగుతున్న ఈ విధ్వంసం ఇవ్వాళ మా ఊరును మింగేయడానికి కోరలు చాపింది. ఫిబ్రవరి 13న నూతనంగా ఆరంబించే కళ్యాణఖని మెగా ఓపెన్‍కాస్టు విషయమై మెనేజుమెంట్‍ జరిపే పబ్లిక్‍ ఇయరింగు ఉంది. అదేరోజు నా బాల్య మిత్రుడు శంకర్‍ బిడ్డ పెండ్లి ఉంది.

చిన్నప్పుడు మేం ఇద్దరం మందమర్రిలోని కార్మల్‍ స్కూల్లో కలిసి చదివాం. కలిసి ఆడాం. కలిసి ఆలోచనలు పంచుకున్నాం. యవ్వనోత్సాహం ఉప్పొంగగా వామపక్ష విద్యార్థి సంఘంలో కలిసి పని చేశాం. ఆ రోజులు తలచుకుంటే ఇప్పటికి మనసు పులకిస్తుంది. ఎనక ముందు ఆలోచన ఉండేది కాదు. ఏది మంచి అనిపిస్తే అది ఆచరించాం. ఏది చెడు అనిపిస్తే దానిని వ్యతిరేకించాం. దేనికి భయపడని ఒక ఆవేశం ఆ రోజుల్లో మమ్ములను ముందుకు నడిపేది. ఆ క్రమంలో మేం చాలా బాధలు పడ్డాం. దెబ్బలు తిన్నాం. పోలీసుల అరెస్టులు. కేసులు ఎదుర్కొన్నాం అదో అద్భుతమైన జీవితం..

అదేరోజు పబ్లిక్‍ ఇయరింగ్‍ ఉండటం వలన బాల్య మిత్రుడి బిడ్డ పెండ్లికి పోలేకపోతున్నాననే బాధ ఒక మూలన వేదిస్తుంది. కాని తప్పదు. నేను పుట్టి పెరిగిన ఊరు చావు అంచున వ్రేలాడదీయబడుతుంది. పెద్ద కుట్రలు జరుగుతున్నాయి. ప్రజల స్పందన ఏమిటో… చివరికి ఎటు దారితీస్తుందో అన్న ఆందోళన వలన చివరికి పబ్లిక్‍ ఇయరింగ్‍కు బయలుదేరాను. రోడ్డు మీద పోతున్నాను కానీ నా మనసు మనసులో లేదు. గత వర్తమానాల మధ్య కొట్టుమిట్టాడుతుంది.

మందమర్రి, మంచిర్యాల పట్టణంకు దాదాపు 20 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. నా చిన్నప్పుడు చూసిన దానికి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది.

మాచిన్నప్పుడు లక్ష్మీ టాకీసు పట్టణానికి దూరంగా విసిరి వేసినట్టు ఉండేది. రోడ్డుకు ఇరువైపుల భూములన్నీ ఖాళీగా ఉండేటివి. మంచిర్యాలను ఆనుకొని ఉన్న ఏసిసి సిమెంటు ఫ్యాక్టరీ నుంచి వెలువడే దుమ్ముతో లక్ష్మీ టాకీసు ముందున్న భూములన్నీ కప్పబడిపోయి బూడిద వర్ణంలో ఉండేటివి. టాకీసు వెనుకవైపు దూరంగా ఉన్న గుట్ట వరకు పంట భూములుండేటివి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. భూములకు రెక్కలు వచ్చినవి. రోడ్డుకు ఇరువైపుల భారీ బిల్డింగ్‍లు, అపార్టుమెంట్లు చోటు చేసుకున్నాయి. అంతకు ముందు సింగల్‍ రోడ్డు కాస్త నాలుగు లైన్‍ల రోడ్డుగా మారిపోయింది. ఒకప్పుడు అక్కడ ఎందుకు పనికి రాదనుకున్న భూములు ఇవ్వాళ లక్షలు పలుకుతున్నాయి.

మంచిర్యాల పట్టణానికి ఒకవైపు శ్రీరాంపూర్‍, మరోవైపు రామక్రిష్ణాపూర్‍, ఆపైకిపోతే మందమర్రి బొగ్గు గనుల పారిశ్రామిక ప్రాంతాలున్నాయి. వాటికి సెంటర్‍గా మంచిర్యాల పట్టణం ఉంది. కార్మికులు షాపింగ్‍కు రావాలన్నా మంచిర్యాలకు రావాల్సి ఉండేది. అట్లా మంచిర్యాల అభివృద్ధికి అవి దోహదపడ్డాయి. కాని ఇప్పుడు కళ తప్పింది.

ఒకప్పుడు పొట్ట చేతపట్టుకొని కాలరీ ప్రాంతాలకు బ్రతుకవచ్చినవాల్లు, బొగ్గు పొక్కల్లో కార్మికులుగా ఏండ్ల తరబడి తమ నెత్తురును చెమటను దారబోసి చీకేసిన బొక్కలా అయిపోయి మళ్లీ పల్లేబాట పడుతున్నారు. కంపెనీ వాళ్లు రక్త మాంసాలు పిండుకొని నెత్తురుడిగిన కార్మికులను ఇక ఎంత మాత్రం నాకు పనికి రావని పిప్పిని ఉంచేసినట్లు ఉంచేసింది. కార్మికులకు రిట్రెంచ్‍ చేయడానికి కంపెనీ ఎన్నో ఎత్తులు ఎత్తింది. ఎన్నో కుట్రలు పన్నింది. ఎన్నో మాయలు చేసింది. దేశా విదేశాల్లోని దోడిపి దొంగల కుట్రలన్నీ కలబోసి కార్మికుల మీద ప్రయోగించింది. ఫలితంగా ఒకప్పుడు పోరాటాలకు నెలవుగా మారిన సింగరేణిలో ఇప్పుడు దెబ్బ కాచుకోవడం తప్ప ఎదురు దెబ్బ తీయలేని పరిస్థితి వచ్చింది.

మంచిర్యాలకు ఏసీసీ మధ్య దూరం అంతకొడితే రెండు మూడు కిలో మీటర్ల దూరం ఉండదు. ఒకప్పుడు మైదానాన్ని తలపించే చోట ఇప్పుడు కాలు బెట్టేందుకు కూడా ఖాళీ లేకుండా బంగ్లాలు వెలిశాయి. ర్యాలీ గడ్‍పూర్‍లో దొరికే సున్నపురాయి గుట్టలను ఏసీసీ సిమెంటు ఫ్యాక్టరీ ఏండ్లకు ఏండ్లుగా నోట్ల కట్టలుగా మార్చుకున్నది. ఇప్పుడు ర్యాలీగడ్‍పూర్‍ గుట్టలో సున్నపురాయి నిధులు అడుగంటినవి. వాటితో పాటే ఒకప్పుడు అక్కడి దట్టమైన అడివీ ఇవ్వాళ మైదానమైంది. ర్యాలీ గడ్‍పూర్‍ ఏరియాలోని గిరిజన గూడాలు కనుమరుగైనవి. కొండ చిలువలా సింమెట్‍ ఫ్యాక్టరీ వాళ్ల గ్రామాలను, వాళ్ల అడవులను మింగేసింది. సున్నపురాయి కొండల నుంచి పారే పలకల వాగు ఉనికి కోల్పోయి మురికి కూపంగా మారింది.

ర్యాలీగడ్‍పూర్‍ కొండల్లో దాగిన సహజ సంపద ఏసీసీ యాజమానులకు లాభాలు పండిస్తే ఆ ప్రాంతంలో బ్రతికే మూలవాసులకు బ్రతుకులేకుండా చేసింది. చెరుకు తీసిన పిప్పిలా ర్యాలీగడ్‍పూర్‍ నిస్సారమైంది. ఇక లాభాలు పిండుకోవడానికి అక్కడ మిగిలిందేమి లేదని తెలిసిన తరువాత ఏసీసీ ఫ్యాక్టరీని ఎత్తివేసింది. ఏసీసీ భూములపై కన్నేసిన భూమాఫియా ఎంసిసిగా సిండికేటయిపోయి అగ్గువ సగ్గువకు భూములు కొని రియల్‍ ఎస్టేట్‍గా మార్చి వేసారు.

ఏసీసీ దాటిన తరువాత వచ్చేది గద్దెరాగడి. ఒకప్పుడు అది గిరిజన గ్రామం. అక్కడ నాయకపోళ్లు లంబాడి వాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్లు. ఏసీసీ గద్దెరాగడి మధ్యన చిన్న వాగు ఉండేది. వర్షాలపై ఆధారపడి మొక్క జొన్నలాంటి పంటలు వేసేవాళ్లు. కాలం కలిసి వస్తే నాలుగు గింజలు రాల్చేది. లేకుంటే అదీ ఉండేది కాదు. ఎక్కువగా అడవి మీద ఆధారపడి బతికేవాళ్లు. అడవిలోని కంకబొంగులు కొట్టుకొని వచ్చి అటు మంచిర్యాలలోకాని, దాని చుట్టు ఉన్న పారిశ్రామిక ప్రాంతంలో అమ్ముకుని బ్రతికేవాళ్ళు.

ఏండ్లకు ఏండ్లుగా గద్దెరాగడి ఎటువంటి ఎదుగుపొదుగు లేకుండానే ఉండిపోయింది. కాని ఇటీవల ఊరు స్వరూపమే మారిపోయింది. ఇప్పుడు ఆ గ్రామంలో గిరిజనులు ఎవరు ఉండటం లేదు. మంచిర్యాలను పట్టణానికి అతి సమీపంలో ఉండటం, నేషనల్‍ హైవే పక్కనే ఉండటం వలన సహజంగానే రియల్‍ ఎస్టేట్‍ వ్యాపారుల కన్నుపడింది. అగ్గువ సగ్గువకు గిరిజనుల నుంచి భూములు కాజేసిండ్లు. అక్కడి ప్రజల అమాయకత్వాన్ని ఆసరగా చేసుకొని రియల్‍ ఎస్టేట్‍ వ్యాపారులు ఆక్రమించుకున్నారు. ఫలితంగా స్థానికులకు భూములు లేకుండా పోయాయి. ఒకప్పుడు ఎకరానికి నాలుగైదు వేలకు మించని భూముల ధర ఇవ్వాళ కోట్లకు పడగలెత్తి రియల్‍ ఎస్టేట్‍ వ్యాపారుల పంట పండించింది. కొట్లు కూడబెట్టుకున్నారు.

గద్దెరాగడి పైన రామక్రిష్టాపూర్‍కు పోయే రోడ్డు దాటి ఆపైన బొక్కలగుట్ట వాగు వరకు మంచిర్యాల పట్టణం విస్తరించింది. రోడ్డుకు ఇరువైపుల ఫంక్షన్‍ హాల్స్ వచ్చాయి. బంగ్లాలు లేచాయి. బొక్కలగుట్ట వాగు మూలమలుపు దగ్గర ఒకప్పుడు దట్టమైన అడవిలాగా పెరిగిన చెట్లుండేవి. అక్కడ దొంగల భయం ఉండేది. మేం యువకులుగా ఉన్నప్పుడు మందమర్రి నుంచి మంచిర్యాలకు సైకిల్ల మీద వచ్చి సెకండ్‍ షో సినిమాలు చూసిపోయేవాళ్లం. కాని ఎప్పుడు మాకు దొంగలు ఎదురుపడిన సందర్భాలులేవు. ఆ దొంగలకంటే దొరబాబుల్లా కనిపించే దొంగల కుట్రలకు బొక్కలవాగు బలైపోయింది. ఇప్పుడు అక్కడ దట్టమైన అడవిలేదు. మైదానంను తలపించే ఆ చోట ఇవ్వాళ రియల్‍ ఎస్టేట్‍ వ్యాపారులు ప్లాట్లుగా చేసి అమ్మకాలు సాగిస్తున్నారు.

బొక్కలగుట్ట వాగు వద్ద రోడ్డు మూల మలుపు కాడ ఎనకటి నిజాం కాలంలో కట్టిన ఎత్తున ఒక రోడ్డు బ్రిడ్జి ఉంటుంది. మామూలు కాలంలో చూస్తే బ్రిడ్జి ఇంత ఎత్తున ఎందుకు కట్టారా అని అనుమానం కలుగుతుంది. కాని వర్షా కాలంలో బొక్కలగుట్ట వాగు రెండు దరులను కమ్ముకొని నిండుగా హోరెత్తే శబ్దంతో పరుగులు పెట్టినప్పుడు కాని బ్రిడ్జి ఎందుకు అంత ఎత్తున కట్టారో అర్థం కాదు. ఒకప్పుడు బొక్కలగుట్ట వాగు దగ్గరున్న అడవిలోకి శ్రావణ మాసంలో వనబోజనాలకు వచ్చే వాళ్లతో సందడిగా ఉండేది. ఇప్పుడా అడవిలేదు. ఆ సంబురం లేదు. రోడ్డు వెడల్పు చేశారు కాని ఆ ఇరుకైన బ్రిడ్జిని అలాగే ఉంచారు. కొత్తగా వచ్చే వాహనదారులకు ఆ మూలమలుపు, కానరాక తరచుగా అక్కడ ప్రమాదాలు జరిగేవి. దాంతో రోడ్డు రవాణా వాళ్లు అక్కడ ఆక్సిడెంట్‍ స్పాట్‍ అంటూ ఒక హెచ్చరిక బోర్డును పెట్టి చేతులు దులుపుకున్నారు.

బొక్కలగుట్ట వాగు దాటిన తరువాత పులిమడుగు వస్తుంది. అది కూడా ఒక గిరిజన గ్రామం. అక్కడ లంబాడివాళ్ళు ఎక్కువగా ఉంటారు. గిరిజన తెగకు చెందిన నాయకపోళ్ల కుటుంబాలు కూడా కొన్ని ఉన్నాయి. రోడ్డు సైడ్‍ కొద్దిగా బిల్డింగ్‍లు ఉన్నవి కాని వాటి వెనుకాల ఉన్న పూరి గుడిసెలు మాత్రం ఎదుగు పొదుగు లేని వాళ్ల జీవితాలను తెలియజేస్తుంది. ఆ రోజుల్లో పులి మడుగులోని లంబాడీలు తమ సంప్రదాయక పద్ధతిలో ఇప్ప పువ్వు సారాను కాసి కాలరీ ప్రాంతంలో అమ్ముకునే వాళ్లు. దాంతో ఆ గ్రామం మీద సారా కాంట్రాక్టర్ల గుండాలు తరుచుగా దాడి చేసి సారాబట్టిలను ధ్వంసం చేయడం, దొంగసారా కాశారని అక్రమంగా నిర్భంధించి చిత్రహింసల పాలు చేయడం వంటి అనేక సంఘటనలు జరిగినవి. అటువంటి ఒక సంఘటనలో ఆ గ్రామానికి చెందిన ఒక గిరిజన అమ్మాయిని ఎత్తుకుపోయిన గుండాలు రోజుల తరబడి నిర్భంధించి చెరిచిన సంఘటనపై నేను రాసిన వార్తా కథనం ఆ రోజుల్లో ఒక పెద్ద సంచలనం సృష్టించింది. దాంతో ఒత్తిడి పెరిగి తప్పని సరి పరిస్థితులలో పోలీసులు విచారణ జరిపిండ్లు కాని, రాజకీయంగా, ఆర్థికంగా బలవంతులైన సారా కాంట్రాక్టర్ల ఒత్తిడికి ఆ కేసు నీరుగారిపోయింది. బాధిత అమ్మాయికి ఎటువంటి న్యాయం జరుగలేదు.

పులిమడుగు ఎగువన బొక్కలవాగు పక్కన ఉన్న గుట్టలో గోండు రాజుల కాలం నాటి నాగదేవత గుడి ఒకటి ఉంది. గుట్టలోని ఒక పెద్ద బండరాయిని తొలచి ఏకశీలపై గుడిని, గుడిలోని పడగ విప్పినట్టుగా ఉండే ఐదు అడుగుల నాగదేవత విగ్రహాన్ని మలిచారు. ఆ గుడికి ముందుభాగాన రాయితో కట్టిన ద్వారం ఉంది. ఇప్పటికి నాగపంచమి నాడు చట్టు పక్కల గిరిజనులు అక్కడ పూజలు చేయడం ఆనవాయితీ. కొండల నడుమ, పక్కనే జలజల పారే వాగు ఒడ్డున, అందమైన ప్రకృతి ఒడిలో ఉన్న ఆ గుడి వాతావరణం ఎంతో ఆహ్లాదబరితంగా ఉంటుంది. కాని అంతటి ప్రాధాన్యత కలిగిన గుడికి పాలకుల నిర్లక్ష్యం వలన ఎటువంటి ఆదరణ లేకుండా పోయింది.

పులిమడుగు దాటిన తరువాత మందమర్రిని ఆనుకొని ఉండే మేడారం గ్రామం వస్తుంది. ఇప్పుడు మందమర్రి పట్టణం అక్కడి వరకు విస్తరించింది. రోడ్డుకు ఇరువైపులా కొత్తగా పెట్రోలు బంకులు, వాహనాల రిపేరింగ్‍ షాపులు వెలిశాయి. మేడారం, మందమర్రికి మధ్యన రోడ్డుకు అడ్డంగా దేవాపూర్‍ సిమెంట్‍ ఫ్యాక్టరీ కోసం వేసిన రైల్వేలైను ఒకటి ఉంది. అక్కడున్న గేటుకు కాపలాగా చిన్న రేకులషెడ్డు వేసి గేట్‍ కీపర్‍ను కాపలా పెట్టారు. రోజు మొత్తంలో ఒకటో, రెండు సార్లో గూడ్స్ వ్యాగన్లు అటు ఇటు పోతాయి తప్ప ఆ పట్టాల మీద పెద్దగా రవాణా ఏది ఉండదు. దాంతో అతను రోజంతా నిస్సారంగా దిక్కులు చూస్తుంటాడు.

రోడ్డుకు కుడివైపున ఉన్న చెలుకలను ఆనుకొని పాలవాగు ఒడ్డున దొరగారి మామిడి తోట ఉంది. మందమర్రి మండలంలోని మామిడిగట్టు మామిడి తోటలకు ప్రసిద్ధి. అక్కడ పండే మామిడి కాయలు దేశవిదేశాలకు ఎగుమతి అవుతాయి. అదిగో అటు వంటి అంటుమామిడిని దొర కాయిష్‍ పడి తెచ్చి సువిశాలమైన ప్రాంతంలో మామిడి తోట పెట్టిండు. ఒకప్పుడు చిక్కటి అడవిలా ఉండే మామిడి తోట ఇప్పుడు సరైన ఆలనాపాలన లేక పలుచబడిపోయింది. దొరగారి మామిడి తోటను మందమర్రి ఊరును రెండుగా చేస్తూ మహారాష్ట్ర వైపు సాగే రైల్వేలేను ఉంది. మామిడితోటకు ఎగువన కొద్ది దూరంలో మందమర్రి రైల్వే స్టేషన్‍ ఉంటుంది.

మందమర్రి బస్టాండు చేరుకునే సరికి అక్కడ పెద్ద సంఖ్యలో చీటా డ్రెస్‍ సాయుధ పోలీసులు ఉన్నారు. రోడ్డుకు ఇరువైపుల బారు తుపాకులు వేసుకొని చేతిలోని లాఠీలను జులిపిస్తూ జనం గుంపులుగా పోగవ్వకుండా చెదరగొడుతున్నారు. ఓపెన్‍కాస్టు విషయమై ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతున్న దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యగా కంపెనీ పోలీసులను పిలిపించింది. అది చూసిన తరువాత ప్రజల చిన్న అసంతృప్తినైనా సాయుధ బలగాలను ఉపయోగిస్తే తప్ప అణచి పెట్టలేని దుస్తితిలో ఒక ప్రజాస్వామిక వ్యవస్థ ఉండటం ఎంత విషాధం అన్పించింది.

అయినా మా వూరికి ఈ అణచివేతలు కొత్త కాదు కదా! గత పాతిక ముప్పయి సంవత్సరాలుగా నిరాటంకంగా సాగుతున్న ప్రభుత్వ దమణకాండకు ప్రజలు అలవాటు పడిపోయారు. సాయుధ మూఖలను ప్రజలు గుర్తించినట్టే లేదు. ఎవరి పనిలో వాళ్లు. చాలా యదాలాపంగా కదిలిపోతున్నారు. ఎక్కడో, ఏ గుడిసెలోనో, ఏ కార్మికుడి క్వార్టర్‍లోనో అగ్గి రాజుకుంటుంది. అది మెల్ల మెల్లగా రగిలి దావాగ్నిలా మారటం మందమర్రి కొత్తేమి కాదు కదా!

బహుశా సర్కార్‍కు అదే భయం కావచ్చు… అందుకే ఇంత ఆర్భాటం ఇంత ముందు జాగ్రత్తగా బలగాలను మోహరింపూ. రోడ్డు పక్కన నిలిచిన అమరవీరుల స్థూపం, ఒక నాటి కార్మికుల పోరాటాలకు అసమాన త్యాగాలను సమున్నతంగా ఎత్తి పడుతూ ఉదయం సూర్యకాంతిలో ఎర్రగా మెరిసి పోతుంది. స్థూపం చివరణ ఉన్న సుత్తి కొడవలి ఆ ఎండకు ప్రతిపలిస్తూ రేపటి ప్రపంచం శ్రమ జీవులదే అంటూ ఎలిగెత్తి చాటుతున్నట్లుగా మనసు ఉద్విగ్నత చెందింది.

నేను రావడం దూరం నుంచే కనిపెట్టిన జర్నలిస్టు మిత్రుడు రవి వచ్చి చెయ్యి కలిపిండు. అక్కడ పోలీసు బలగాలను చూసిన తరువాత అప్రయత్నంగానే నోటి నుంచి ‘‘మందమర్రిలో మళ్ళీ యుద్ధ వాతావరణం వచ్చింది’’ అన్నాను.

‘‘నిజమే అన్న రెండు రోజుల ముందు నుంచే ఈ హడావిడి మొదలైంది. సీఈఆర్‍ క్లబ్‍లో క్యాంపు వేసిండ్లు… పబ్లిక్‍ ఇయరింగ్‍ అయితే కాని క్యాంపు ఖాళీకాదేమో’’ అన్నాడు రవి.

‘‘చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్లాలని చూస్తుంది ప్రభుత్వం’’ అన్నాను.‘‘చూడబోతే అలాగే ఉంది’’ అంటూ తలాడించిండు.

‘‘మెడమీద కత్తి పెట్టి ప్రజలు తమ అభిప్రాయం చెప్పమంటే ఏం చెబుతారు’’ అన్నాను.

‘‘ప్రజలు తమ అభిప్రాయం చెప్పటం సంగతి అటు తరువాత… అసలు ప్రాజెక్టు క్రింద నిర్వాసితులయ్యే గ్రామ ప్రజలు పబ్లిక్‍ ఇయరింగ్‍కు రాకుండా పోలీసులు ఆ గ్రామాలను దిగ్బంధనం చేసి ఎవరి ఇండ్ల నుంచి బయటకు రాకుండా చెస్తాండ్లట’’.. అన్నాడు.

‘‘ఎక్కడ’’
‘’ఎర్రగుంటపల్లె, దుబ్బగూడెం’’లో
పద విషయం ఏమిటో తెలుసుకుందాం’’ అంటూ బండి స్టార్ట్ చేశాను.

మూసివేతకు గురైన కళ్యాణి ఖని 2, 2ఏ, సోమగూడెం 3 బొగ్గుబావుల మధ్యన ఎర్రగుంటపల్లె గ్రామం ఉంటుంది. దాదాపు రెండు వందల కడపలుంటాయి. ఆ వూరి చుట్టు విస్తరించిన బొగ్గు బాయిల వల్ల బావులో, బొర్లలో నీరు లేకుండా పోయింది. వర్షకాలంలో మాత్రం ఊరు చుట్టు ఉన్న రాళ్ళవాగు, కాశిపేట వాగు వలన కొంత వ్యవసాయం సాగుతుంది.

‘‘ఎర్ర గుంటపల్లికి చేరుకునే సరికి అక్కడ వందలాది మంది పోలీసులు వారి మధ్యన స్త్రీలు, పిల్లలు, వృద్ధులు అనే బేధం లేకుండా గ్రామస్థులు ఉన్నారు. అంతా ఉద్రిక్తంగా ఉంది.

‘‘ఇదే అన్యాయమయ్యా, మముల్ని పబ్లిక్‍ ఇయరింగ్‍కు పోనియ్యమంటే ఎట్లా. కంపెనోనికి మా బాధలు ఎట్లా చెప్పేది? అటువంటప్పుడు ఇదంతా ఎందుకు’’ ఎవరో నడీడు వయస్సున్న పెద్ద మనిషి ఎస్సైతోని వాదులాడుతున్నడు.

ఎస్సైకి ఈ పరిస్థితి మింగలేక కక్క లేకుండా ఉంది. ‘‘పోనిస్తం కాని పై నుంచి పర్మీషన్‍ రావాలి’’ అంటూ అసహనంగా అంటున్నాడు.

‘‘ఏం పర్మిషన్‍? ఎందుకు పర్మిషన్‍? మేమేమన్న లడాయికి పోతానమా? నిన్న గాక మొన్న కంపినోడు వచ్చి పంచాయితీ ఆఫీసుకాడ కాగితాలు (కరపత్రాలు) పెట్టి పోయిండు. అందులోనేమో ఆదివారం నాడు ప్రజాభిప్రాయ సేకరణ ఉంది… గ్రామస్తులు వచ్చి తమ అభిప్రాయం చెప్పాలన్నారు. మమ్ముల్ని అక్కడికి పోనియ్యకుంటే ఎట్లా మరి’’ ఇందాకటి పెద్ద మనిషి మళ్లీ అడుగుతాండు…

ఎస్సైకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదు. విలేకర్లను చూసిన తరువాత ఆయన పరిస్థితి మరి ఇరకాటంలో పడ్డది’. ఆయన మమ్ముల్ని సమీపించి. ‘‘ఏం చెప్పాలి సారు పై నుంచి ఆదేశాలు అట్లా ఉన్నాయి’’ అంటూ తన నిస్సాహాయతను వెల్లగక్కిండు.

బొగ్గు గనుల కింద భూముల సేకరణ సందర్భంగా కంపినోడు వెయ్యని ఎత్తులు లేవు.. చెయ్యని కుట్రలు లేవు. గతంలో బొగ్గు గనుల కింద భూములు కోల్పోయిన వాళ్లకు కంపెనిలో ఉద్యోగాలు ఇచ్చేవాళ్లు. ఇప్పుడు అది బందైపోయింది. దాంతో నిర్వాసితుల్లో వ్యతిరేకత పెరిగింది.

(ఇంకా వుంది…)

రచయిత. తెలుగు సాహిత్యంలో పి.చందు గా సుపరిచితుడు. అసలు పేరు ఊరుగొండ యాదగిరి. వరంగల్ ఉర్సులో 1954 సెప్టెంబరు 24 న వీరమ్మ, మల్లయ్య దంపతులకు జన్మించారు. ఎల్.బి. కాలేజీలో బి.కాం చదివారు. సింగరేణిలో ఉద్యోగ విరమణ చేశారు. "శేషగిరి", "నల్లమల", "భూదేవి", "నెత్తుటిధార", "శృతి", "బొగ్గులు" తదితర పదిహేను నవలలు రాశారు. సుమారు వంద కథలు రాసి "భూ నిర్వాసితులు", "జులుం", "గుమ్మన్ ఎగ్లాస్ పూర్ గ్రామస్థుడు", "సమ్మె కథలు" కథా సంపుటాలు ప్రచురించారు.

One thought on “మా వూరి కథ

  1. ఇది మా ఊరి కథ కాదు చందన్నా ! సింగరేణి కార్మిక ఉద్యమ చరిత్ర. నవల ప్రారంభమే ఉద్వేగ భరితంగా ఉంది.

Leave a Reply