మా వూరి కథ-2

నిర్వాసితుల వ్యతిరేకతకు అణచటానికి నిర్బంధం ఒక్కటే సరిపోదని బావించిన కంపెనీ మాయమాటలు చెప్పి మోసం చేయడం నేర్చింది.

పోలీసులు రంగ ప్రవేశం చేసి, ప్రజలను బలవంతంగా కుప్పేసి మీటింగ్‍లు పెట్టిండ్లు, ‘‘గనుల వల్ల గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. దేశాభివృద్ధి కోసం బొగ్గు ఉత్పత్తి అవసరం, బొగ్గు లేకుంటే కరంటు లేదు. కరంటు లేకుంటే అభివృద్ధి లేదు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే పాలు అమ్ముకునే వాళ్ళు ఎక్కువ పాలు అమ్ముకోవచ్చు కూలినాలికి డోకా ఉండదు. చదువుకున్న పిల్లగాండ్లకు ఉద్యోగాలు వస్తాయి’’. అంటూ ప్రచారం చేయడం షరా మామూలైపోయింది.

ప్రజల చుట్టు సాయుధ పోలీసుల పహరాల మధ్య సాగే ఇటువంటి మీటింగ్‍లలో ప్రజల గొంతు ఎక్కడ పెకులుతుంది. అటువంటి మీటింగ్‍లు ఏర్పాటు చేయడానికి ముందే పోలీసులు ఊరిలో వ్యతిరేకించే వారి వివరాలు సేకరించి వారిని నయానా భయానా లొంగదీసుకోవడం, అట్లా కూడా వినని వారిని దొంగ కేసులు పెట్టి జైల్లకు పంపడం వంటి అన్ని రకాల దుర్మార్గాలకు పాల్పడ్డారు.

అయితే ఇప్పుడు ఆ ఎత్తులు కూడా పని చేసినట్లు లేదు. ఎందుకంటే ఎర్రగుంటపల్లె వాసులు, ఓపెన్‍ కాస్టును వ్యతిరేకిస్తూ ఇప్పటికే పలు రకాలుగా తమ ఆందోళనలను వ్యక్తం చేసిండ్లు. సర్వే పనుల కోసం వచ్చిన కంపెనీ అధికారులను గ్రామంలో అడుగుపెట్టనివ్వలేదు. మండలాపీసు ముందు ధర్నాలు నిరసన ప్రదర్శనలు చేసిండ్లు.. దాంతో ఎట్లాగూ గ్రామస్థుల నుంచి వ్యతిరేకత వస్తుందని భావించిన కంపెనీ అసలు వారిని అక్కడికి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసింది.
గ్రామస్థుల కంటే అక్కడ సాయుధ పోలీసులే ఎక్కువగా ఉన్నారు. ఊరిలోకి వచ్చే మేయిన్‍ రోడ్డును ఆక్రమించుకున్న పోలీసులు ఊరిలోకి ఎవరు రాకుండా, ఊరి నుంచి ఎవరు పోకుండా కట్టడి చేస్తాండ్లు….

‘ఇదంతా చూస్తుంటే జనం గొంతు నొక్కి పెట్టి కంపెనీ తమ పంతం నెగ్గించుకోవాలని చూస్తుంది’ అనిపించింది. పోలీసు నిర్భంధంలో ఉన్న ప్రజలను ఫోటోలు తీయబోతుంటే రిజర్వు ఎస్సై పరుగున వచ్చి ‘‘పోటోలు తీయటానికి వీల్లేదు’’ అన్నాడు.
‘‘అదేంది. పత్రికా స్వేచ్చమీద ఆంక్షలు విధిస్తున్నారా’’ అన్నాను.

‘‘అదంత మాకు తెలువదు… ఫోటోలు తీయాలంటే మా సారు పర్మీషన్‍ తీసుకొని రావాలి’’ అన్నాడు విసురుగా…
ఆయన మాటలేమి లెక్క చేయకుండా నేను ఫోటోలు తీసే ప్రయత్నం చేశాను. అతను వెంటనే నా దగ్గరున్న కెమెరాను గుంజుకొని’’ ఏం నీకు మంచిగా చెబితే అర్థం కాదా! విలేకర్లయితే మీకేమన్నా కొమ్ములున్నాయా… మంచి మాటలకు వినకుంటే లాఠీలకు పని చెప్పాల్సి వస్తుంది.’ అన్నాడు కటువుగా.
ఈ గందరగోళాన్ని కనిపెట్టిన స్థానిక ఎస్సై పరుగున వచ్చి ఆయన దగ్గరున్న కెమెరాను తీసుకొని మళ్ళీ నాకిచ్చి ‘‘సారు కాస్త పరిస్థితి అర్థం చేసుకొండి, పై నుంచి ఆదేశాలు అట్లా ఉన్నాయి’ అన్నాడు అనునయంగా.
పోలీసుల వలయంలో చిక్కుకున్న జనం గోల గోలగా అరుస్తున్నారు.

‘‘మమ్ముల్ని పబ్లిక్‍ ఇయరింగ్‍కు పోనివ్వాలి’’.
‘‘మా బ్రతుకులను నాశనం చేసే ఓసీపీలు వద్దు’’,
‘‘పోలీసు దౌర్జన్యం నశించాలి’’ అంటూ నినదించసాగిండ్లు.
పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఏ క్షణంలోనైనా జనం మీదికి పోలీసులు విరుచుకుపడవచ్చునని అనిపించింది. అంతకు ముందు కాసిపేట ఓసీపీకి వ్యతిరేకంగా అక్కడి ప్రజలు జరిపిన పోరాటం విజయవంతం కావడంతో ప్రభుత్వం దానిని ఒక గుణపాఠంగా తీసుకున్నది.
కాసిపేట ప్రజల పోరాటం ఒక విరోచిత సంఘటన

కాసిపేట మండలం గిరిజన ప్రాంతం. భారత రాజ్యాంగంలోని షెడ్యూల్‍ 5 కింద నోటిపై చేయబడిన మండలం. ఆ మండలంలోని సోమగూడెం ప్రాంతంలో తొంబైలో మొదట అండర్‍ గ్రౌండ్‍ బావులు ఆరంభమయ్యాయి. బొగ్గు గనులు వస్తే తమ బ్రతుకులు బాగుపడుతాయని ఉద్యోగాలు వస్తాయని ఆశించిన వారికి నిరాశ మిగిలింది. ఒకప్పుడు దట్టమైన అటవీ ప్రాంతంగా ఉన్న సోమగూడెం ప్రాంతంలో ఇప్పుడు చూస్తామంటే కూడా ఒక చెట్టు కూడా కానరాకుండాపోయింది.

సోమగూడెం గ్రామానికి ఆ పేరు రావడం వెనుక ఒక కథ ఉంది. వెనుకటి రోజుల్లో ఆ అడవిలో పులులు తిరుగుతుండేవట. అటువంటి రోజుల్లో ఒక సారి ఒక పులి గిరిజనుడైన ‘సోము’ అనే వాని మీద దాడి చేస్తే ఒంటి చేత్తో ఆ పులిని చంపాడని.. అటువంటి ‘సోము’ ఉండే గూడెం కావున ఆ గూడానికి సోమగూడెం అనే పేరు వచ్చిందని ఒక ప్రతీతి.

అటువంట సోమగూడెంలో బొగ్గు గనులు వచ్చిన తరువాత జంతువులు కాదు కదా మనుషులు కూడా బతుకలేని పరిస్థితి వచ్చింది. కాసిపేట మండలంలోని సోమగూడెం, ముత్యంపల్లి, గోండుగూడెం, కోమటిచేను, పెద్దనపల్లి, సండ్రల్‍పాడ్‍. పెద్ద ధర్మారం, చిన్న ధర్మారం, మామిడిగూడెం గ్రామాలలో వచ్చిన బొగ్గు గనుల వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. బావులు, బోర్లు ఎండిపోయి సాగునీరు కాదు కదా తాగేందుకు కూడా గుక్కెడు నీళ్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. దీనితో కాసిపేట మండలం ప్రజలు తాగునీటి కోసం పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది. వాళ్ల భూములు గుంజుకున్న కంపెనీ వారికి తాగడానికి గుక్కెడు నీళ్లు ఇవ్వలేదు. నీళ్లు అడిగిన ప్రజల మీదికి పోలీసులను ఉసిగొల్పింది. కాని ప్రజలు వెనక్కి తగ్గలేదు. తీవ్ర నిర్భంధాలను ఎదుర్కొంటు గ్రామస్థులు పిల్లా పాపలతో వచ్చి బావుల మీద బైఠాయించారు. వారం రోజులు ఒక్క బొగ్గు పెల్ల బయటకు రాకుండా బావులు బందు పెట్టించిండ్లు… అప్పుడు కాని కంపెనీ దిగి వచ్చి మంచినీళ్లు పైపులైను వేయలేదు.

కాసిపేట మండలంలో కంపినోడు ఒక వైపు బొగ్గు తవ్వుకుంటూ భూమిని బొర్రెలు చేస్తూపోతుంటే మరోవైపు కాసిపేట మండలంలో అపారంగా ఉన్న సున్నపురాయి నిలువల మీద కన్నేసిన బిర్లా కంపెనీ పెట్టని కోటలా ఉన్న గుట్టల మధ్యన ఉన్న దేవాపూర్‍లో సిమెంటు ఫ్యాక్టరీ పెట్టింది. కూతవేటు దూరంలో ఉన్న బొగ్గు బావుల నుంచి ఆ ఫ్యాక్టరీకి బొగ్గు సప్లయి జరుగుతుంది. చుట్టు అలుముకున్న కొండల మధ్యలో పారే సల్పలవాగు నీళ్లను మల్లించుకుంది. ఆ విధంగా అక్కడి సంపద బిర్లా కంపెనీకి లాభాలు పండిస్తే దేవాపూర్‍ చుట్టు ప్రక్కల కొండల నడుమ ఉండే ముప్పయి గిరిజన గూడెంలకు బతుకులేకుండా చేసింది. సిమెంటు ఫ్యాక్టరీ నుంచి నిరంతరం వెలువడే దుమ్ము, ధూళి వలన సారవంతమైన భూములన్నీ బూడిదమయమైపోయాయి. బీడుబారిన భూముల్లో ఆరు కాలాలు కష్టపడ్డా గింజరాల్చని దుస్థితి నెలకొంది. దాంతో మారుమూల అడవిలో అడవి జంతువుల్లా తమ బతుకేదో తాము బతికే గిరిజనుల బ్రతుకుల్లో విషం చిమ్మింది. చివరికి తరతరాలుగా గిరిజనుల దాహార్తి తీర్చిన సల్పలవాగు సిమెంటు ఫ్యాక్టరీ వదిలే వ్యర్థాలతో, రసాయనాలతో కలుషితమైపోయి విషపూరితమైంది.

దేవాపూర్‍ సిమెంట్‍ ఫ్యాక్టరీ రాకముందు అడవిలో కలకలలాడిన ముప్పయి గూడెంల గిరిజనుల బ్రతుకు నాశనమైంది. రోడ్డున పడ్డ చేపల్లా విలవిలలాడారు. సహజసిద్ధమైన పచ్చటి వాతావరణంలో తమ బతుకేదో తాము బతికిన గిరిజనులు బతుకు ఆగమైంది. తినే కంచం గుంజేసుకొని ఎంగిలి మెతుకులు ఎగజల్లినట్లుగా కంపెనీ కొద్దిమంది యువకులకు ఫ్యాక్టరీలో కాంట్రాక్టు కార్మికులుగా ఉపాధి కల్పించింది. వారంత ఇప్పుడు సిమెంట్‍ లోడింగ్‍, అన్‍లోడింగ్‍ పనులు చేస్తున్నారు. సిమెంట్‍ దుమ్ములో రోజుకు పన్నెండు గంటలు పనులు చేస్తున్నారు. నిరంతరం సిమెంటు దుమ్ములో పనులు చేయడం వలన వారు ఊపిరితిత్తులు చెడిపోయి అర్థంతర చావులకు బలి చేయబడుతున్నారు. చాలా మంది జనం బతుకుదెరువు వెతుక్కుంటూ వలసపోయారు. ఎటుపోలేక మిగిలిన వాళ్లు అందిన కూలీనాలీ చేసుకుంటూ చావలేక బతుకుతున్నారు.

దేవాపూర్‍ సిమెంట్‍ ఫ్యాక్టరీ గిరిజనుల జీవితాలనే కాదు వారి సంస్కృతి, సంప్రదాయాన్ని క్రమంగా మింగేసింది… పారిశ్రామిక విష సంస్కృతి అమాయక గిరిజన సంస్కృతిని నాశనం చేసింది. చివరికి అమాయక గిరిజన స్త్రీలు బ్రతుకు దెరువులేక పావులా పర్కకు ఒళ్లు అమ్ముకునే దుస్థితికి నెట్టివేసింది. ఆ విధంగా కాసిపేట మండలం సోకాల్డు అభివృద్ధి పాదాల క్రింద నలిగిపోయింది. ఇప్పుడిక కొత్త ప్రమాదం ముంచుకొచ్చింది….

కాసిపేట మండలంలో దాదాపు ముప్పయి సంవత్సరాలుగా నడిచిన అండర్‍ గ్రౌండ్‍ గనులు మూసివేతకు గురయ్యాయి. అండర్‍ గ్రౌండ్‍ గనుల్లో వదిలేసిన బొగ్గును తీయడానికి కంపెనీ కాసిపేట ఓపెన్‍ కాస్టు చేయాలని తలచింది. ఎందుకంటే అండర్‍ గ్రౌండ్‍ బొగ్గు గనుల్లో నాలుగో వంతు బొగ్గు మాత్రమే తీయడానికి వీలవుతుందని, మిగితా మూడు వంతుల బొగ్గు తీయాలంటే ఓపెన్‍ కాస్టులే శరణ్యం అంది కంపెనీ…

అట్లా కంపెనీ కాసిపేట ఓపెన్‍ కాస్టుగా గనిని తెరమీదకు తేవడంతో కాసిపేట మండలంలో మళ్ళీ కలకలం రేగింది. ఓపెన్‍ కాస్టును వ్యతిరేకిస్తూ ప్రజలు ఆందోళనకు దిగారు…

‘‘నలుబై ఏండ్లుగా మా భూముల్లోని బొగ్గు తవ్వుకుంటూ మా బ్రతుకులను ఆగం చేసిండ్లు. ఇంత వరదాక మేం ఎట్లా బతికినామో, ఏం తిన్నామో.. ఏం తాగినామో పట్టించుకోలేదు..ఇప్పుడు మీరు మా భూములు తీసుకున్నప్పుడు ఇచ్చిన మాటలేమి నిలబెట్టుకోలేదు.. మా పోరగాండ్లకు ఉద్యోగాలు ఇస్తామన్నారు. అదిస్తం, ఇదిస్తం అంటూ ఆనాడు బుదగరించి మాయమాటలు చెప్పి మమ్ముల్ని బుట్టలో వేసుకొని నిండా ముంచిండ్లు. మా భూముల్లోని బొగ్గు సంపద తవ్వుకొని పోయిండ్లు… ఆ బొగ్గుతోని కరంటు తయరవుతదంటా. అట్లా తయారైన కరంటు ఎవని ఇంటికి వెలుగునిచ్చిందో కాని మా బ్రతుకులయితే చీకటి చేసింది. అదిపాయే అయ్యిందేదో అయ్యింది. మా ఖర్మ ఇట్లా కాలబడ్డదనుకున్నం. బొగ్గు గనుల కింద భూములు పోయినా, బతుకు దెరువులేకపోయినా ఏదో అందిన కష్టం చేసుకుంటూ మానేల మీద మేం చావలేక బతుక్కుంటూ వస్తున్నం. ఇవ్వాళ కంపినోడు మళ్ళీ వచ్చి మా భూముల్ల ఓపెన్‍ కాస్టు చేస్తాడంట.. మేం నిలబడే చోటు లేకుండా ఈ భూమిని మాయం చేస్తండట.. గా పనికి మేం ఒప్పుకోం… మాకు ఓసీపీలు వద్దు… మీ అభివృద్ధి వదవద్దు.. మా బ్రతుకేదో మమ్ముల్ని ఇట్లా బ్రతకనియ్యండి’’ అంటూ ఆనాడు కాసిపేటకు చెందిన వెంకటమల్లమ్మ అన్న మాటలు నాకింకా గుర్తుంది… కాని ప్రజల కష్టాలు, కన్నీళ్లు ఎవరికి కావాలి… నయాన, భయాన లొంగతీసుకొని ఉన్నవి, లేనివి అమ్ముకొని సొమ్ము చేసుకోవడమే నేటి పాలకుల నీతి అయినప్పుడు…

కాసిపేట ప్రజల ఆందోళనలు ఎవరు పట్టించకోలేదు. అంతటా జరిగినట్టే, జరుగుతున్నట్టే బలవంతంగా ప్రజలను ఖాళీ చేయించాలిని చూసింది కంపెని. ఓపెన్‍ కాస్టుల కింద భూములు సేకరించే సమయంలో గతంలో మేనేజ్‍మెంటు అనుసరించిన కుటిల నీతిని, అక్కడ అమలు జరపాలని చూసింది. ఎప్పటిలాగే నాయకులు కంపెనికి వంత పాడారు. ప్రజల పోరాటాలకు అండగా నిలిచిన స్వచ్చంధ సంఘాలను, హక్కుల సంఘం వాళ్లను, పర్యావరణ పరిరక్షణ సంఘాల వారిని ప్రజల దరిదాపుల్లోకి పోకుండా పోలీసులు నిర్భంధం అమలు జరిపిండ్లు….

అభివృద్ధికి అడ్డుతగులుతున్నారని, అన్నలకు అన్నం పెడుతున్నారని పోలీసులు ఊరోల్ల మీద దొంగ కేసులు పెట్టిండ్లు. కాసిపేట మండలానికి చెందిన కార్మికులను చేరదీసి కంపెనీ ఓసీపికి సహకరించకుంటే మిమ్ముల్ని దూర ప్రాంతాలకు బదలి చేస్తామంటూ బెదిరింపులకు గురిచేసింది. దీనితో కార్మికులు వెనుక ముందాడుతుంటే ఆ పోరాటం ఏదో మేమే చేస్తామంటూ స్త్రీలు ముందుకు వచ్చిండ్లు. బలవంతంగా ఇండ్లు ఖాళీ చేయించడానికి వచ్చిన పోలీసులకు అడ్డుగా నిలిచిండ్లు… మా ప్రాణాలు తీసినంకనే మా భూముల్లోకి రావాలి’’ అంటూ మొండికేసిండ్లు… ఓసీపీకి వ్యతిరేకంగా కాసిపేట ప్రాంతపు స్త్రీలు చూపిన చొరవ, ధైర్యం అనన్య సామాన్యమైంది.

అయితే ఈ నిరసనలు, ఈ ఆందోళనలు చెవిటి వాని ముందు శంఖం ఊదినట్టు అయ్యింది. ప్రజల నిరసనల మధ్యనే 2002 ఆగష్టు చివరి వారంలో కంపెనీ ప్రజాభిప్రాయ సేకరణకు ఉపక్రమించింది.

కాసిపేట, ముత్యంపల్లి, సోమగూడెం, గోండుగూడెం, తదితర గిరిజన గ్రామ పంచాయితీలలో ఓపెన్‍ కాస్టుకు వ్యతిరేకంగా తీర్మాణాలు చేసి ప్రభుత్వానికి విన్నవించారు. చివరికి కాసిపేట మండల ప్రజాపరిషత్‍ అధ్యక్షరాలు శ్రీమతి శిలోజు కళావతి ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించి ఓసిపీని వ్యతిరేకిస్తూ ఏకగ్రీవ తీర్మాణం చేశారు.

అందుకు బదులుగా పోలీసులు కళావతి భర్తపై నక్సలై్ల•కు సహకరిస్తున్నాడని దొంగ కేసులు పెట్టిండ్లు. షెడ్యూల్‍ ఏరియాలో కొత్త ప్రాజెక్టు రావాలంటే ఆయా గ్రామ పంచాయితీల ఆమోదం ఉండాలన్న రాజ్యాంగ నిబంధన ఒక పెద్ద అడ్డంకిగా మారింది. ప్రజా సంఘాలు కోర్టులో అదే అంశాన్ని లేవనెత్తారు. దీనితో యాజమాన్యం ఇరకాటంలో పడిపోయింది. అయినప్పటికీ కంపెనీ ఏ నిబంధనలను లెక్కచేయకుండానే పబ్లిక్‍ ఇయరింగ్‍ పెట్టింది. ప్రజలు ఎవరు రాకుండా చేసి, తమ అనునాయులతోని, ప్రలోభాలకు గురిచేసి తెచ్చిన కిరాయి మనుషులతోని ప్రజాభిప్రాయ సేకరణ తమకు అనుకూలంగా వచ్చిందనిపించుకోవడానికి ప్రయత్నించింది.

గతంలో కూడా చాలా చోట్ల కంపెని ఇటువంటి ఎత్తుగడలనే ప్రయోగించి ప్రజాభిప్రాయం తమకు అనుకూలంగా వచ్చిందని ప్రాజెక్టులు ఆరంభించింది. ఆ విధంగా ఓపెన్‍ కాస్టులను వ్యతిరేకించిన ప్రజల నోళ్లు నొక్కేసింది. ప్రజల ఆందోళనలను ఉద్యమ రూపంకు తీసుకుపోయే నాయకత్వం లేక సమర్థించే రాజకీయ పార్టీలు లేక చాలా చోట్ల ప్రజల వ్యతిరేకత విజయవంతం కాలేకపోయింది.

అటువంటి పాత చరిత్రను కాసిపేట ప్రజలు తిరగరాసిండ్లు. ఒకవైపు ప్రత్యక్ష ఆందోళనలు చేస్తూనే మరోవైపు న్యాయ పోరాటం చేశారు. ప్రజా సంఘాలు వారికి అండగా నిలిచాయి. నిర్భంధాలను ఎదుర్కొన్నారు. పబ్లిక్‍ ఇయరింగ్‍కు పోకుండా పోలీసులు అడ్డుకుంటే పెద్ద యుద్ధమే చేశారు. పోలీసుల కండ్లు గప్పి అడ్డదారిన వందలాది మంది పబ్లిక్‍ ఇయరింగ్‍ జరుగుతున్న ప్రాంతాలకు చేరుకున్నారు. ఓపెన్‍ కాస్టులకు వ్యతిరేకంగా తమ అభిప్రాయలను స్పష్టం చేసారు. దానితో ఎమి చెయ్యలేని పరిస్థితిలో అప్పటి జిల్లా కలెక్టరు ప్రజాభిప్రాయం ప్రతిపాదిత ప్రాజెక్టుకు వ్యతిరేకంగా వచ్చిందని పేర్కొనక తప్పలేదు. ఫలితంగా కాసిపేట ఓపెన్‍ కాస్టును కంపెనీ విరమించుకోకతప్పలేదు.

ఆ విధంగా కాసిపేట ప్రజలు జరిపిన పోరాటం ఓసీపీ వ్యతిరేక పోరాటంలో ఒక చరిత్రగా నిలిచిపోయింది. అనుభవం ఓపెన్‍ కాస్టుకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలకు స్ఫూర్తిగా ఇస్తే, అదే సమయంలో కంపెనీకి మరికొన్ని గుణపాఠాలు నేర్పింది. అణచివేత చర్యలకు మరింత పదును పెట్టుకునేలా చేసింది.
అందులో భాగమే ఎర్రగుంటపల్లి మీద పోలీసులు దాడి చేయడం. గ్రామాన్ని దిగ్భంధనం చేయడం.. చూస్తుండగానే ప్రజల పెనుగులాట పోలీసులు అణచివేత ఉద్రిక్తతలకు దారితీస్తుంది. అది ఇప్పుడో, అప్పుడో భగ్గుమనే పరిస్థితికి చేరుకుంటుంది. ఇంతలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే వస్తున్నట్లుగా సమాచారం అందింది.

ఎమ్మెల్యే స్థానికుడు. మందమర్రికి చెందిన వ్యక్తి. ఒకప్పుడు మాతో పనిచేసిన వాడు. కార్మిక కుటుంబాల నుంచి వచ్చినవాడు. కార్మికుల కష్టసుఖాలు తెలిసిన వ్యక్తి.

తమకు మద్ధతుగా ఎమ్మెల్యే వస్తున్న సంగతి తెలిసి ఎర్రగుంటపల్లి వాసుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. దానితో వారు ఓసీపీలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేయసాగారు. దుమ్మురేపుకుంటూ ఎమ్మెల్యే వాహనం వచ్చింది. దానితో పాటు మరో రెండు వాహనాలలో అనుచరులు వచ్చిండ్లు. వాహనం దిగిన ఎమ్మెల్యే మమ్ముల్ని కనిపెట్టి దగ్గరగా వచ్చిండు.

‘‘అన్నా ఏంటీ పరిస్థితి’’ అన్నాడు పరిచయపూర్వకంగా చేతులు కలుపుతూ…
‘‘చెప్పడానికి ఏముందీ ఇదీ పరిస్థితి’’ అన్నాను పోలీసు వలయంలో చిక్కుకున్న జనాలను చూయిస్తూ… అప్పటికే జనం పోలీసు వలయాన్ని చేదించుకొని ఎమ్మెల్యేను చుట్టుముట్టారు.

‘‘ఇదేం అన్యామన్న పబ్లిక్‍ ఇయరింగ్‍కు పోకుండా మమ్ముల్ని ఆపటం ఎంతవరకు సమంజసం’’ అంటూ జనం ఒక్కసారిగా ప్రశ్నించ సాగారు.
ఎమ్మెల్యేకు పరిస్థితి అర్థమైంది. ఆయన దగ్గరగా ఉన్న పోలీసు అధికారిని పిలిచి ‘‘ఎందుకు ఆపుతాండ్లు. ఎవరు ఆపమని చెప్పిండ్లు’ అన్నాడు కోపంగా…
అప్పటి వరదాక జనం మీద కోపంతో చిందులు తొక్కన ఎస్సై ‘‘మాదేం లేదూ సార్‍. పై నుంచి ఆర్డర్స్ అట్లా ఉన్నాయి’’ అంటూ నసిగిండు.

‘మీకు ఆర్డర్‍ ఇచ్చింది ఎవరు?’ అంటూ ఎమ్మెల్యే కటువుగా ప్రశ్నించేసరికి ఎస్సైకి క్షణకాలం ఎటుపాలుపోలేదు. ‘‘డీఎస్పీ’’ అన్నాడు.
‘‘సరే మీ సార్‍తోనే మాట్లాడుతాను’’ అంటూ ఎమ్మెల్యే డీఎస్పీకి ఫోన్‍లో మాట్లాడారు. ‘‘ఎఫెక్టెడ్‍ గ్రామ ప్రజలను పబ్లిక్‍ ఇయరింగ్‍కు పోకుండా ఆపే అధికారం మీకు ఎక్కడిది..! ఇదేమన్నా ప్రజాస్వామ్యామా! పోలీసు రాజ్యమా!’’ అంటూ విరుచుకుపడ్డారు.

డీఎస్పీ ‘‘మాదేం లేదు సార్‍. పై నుంచి ఆర్డర్స్ అట్లా ఉన్నాయంటూ’’ నసిగిండు.
‘‘ఏం తమాషాగా ఉందా మీకు! వీన్ని అడిగితే వాన్ని, వాన్ని అడిగితే వీన్ని అంటారు’ పబ్లిక్‍ అక్కడికి పోకుంటే ఇక పబ్లిక్‍ ఇయరింగ్‍కు అర్థం ఏమిటి? మీరు ఇలా చేసేదుంటే పబ్లిక్‍ ఇయరింగ్‍ నడువనిచ్చేది లేదు’’ అంటూ తెగేసి చెప్పిండు.

‘‘సార్‍ నేను పై వారితో మాట్లాడి చెబుతాను’’ అన్నాడు డీఎస్సీ వినయంగా.
‘‘మీరు ఏం చేస్తారో చెయ్యండి. వీళ్లను ఆపేదుంటే వారితో పాటు మేం కూడా ధర్నా చేస్తాం. పబ్లిక్‍ ఇయరింగ్‍ ఎట్లా జరుగుతుందో చూద్దాం’’. అని ఫోను పెట్టేసి. ఎమ్మెల్యే పోయి జనంలో కలిసిండు..

జనంలో హుషారు ఎత్తింది. ‘ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం’ అంటూ యువకుడు ఒకరు గొంతు చించుకున్నడు.

‘‘ఆంద్రోళ్ళ రాజ్యం, పోలీసు రాజ్యం’ అంటూ జనం వంతపాడిండ్లు.
‘‘మన ఊళ్లను బొందలగడ్డలుగా చేసి ఓసీపీలను వ్యతిరేకిద్దాం ‘వ్యతిరేకిద్దాం వ్యతిరేకిద్దాం’’
‘‘బూటకపు పబ్లిక్‍ ఇయరింగ్‍ బహిష్కరించండి’’ అంటూ జనం నినాదాల హోరెత్తింది.

జనంతో పాటు ఎమ్మెల్యే గొంతుకలిపిండు. ప్రజల్లో ఉత్సాహం నెలకొంది. జనాలనుద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడసాగిండు. జనం నిశ్శబ్దమైండ్లు.

‘‘అక్కలారా అన్నలారా! ఇవ్వాళ మన గొంతు మీద తుపాకి పెట్టి ఆంధ్ర సర్కార్‍ పబ్లిక్‍ ఇయరింగ్‍ జరపాలని చూస్తాండ్లు. పబ్లిక్‍ ఇయరింగ్‍లో ప్రాజెక్టు కింద ప్రభావిత గ్రామ ప్రజలు తమ అభిప్రాయాలు చెప్పడానికి ఉద్దేశించబడింది. అటువంటి పబ్లిక్‍ ఇయరింగ్‍కు గ్రామ ప్రజలు పోకుండా ఆపడం ఏమిటి? ఇదేం న్యాయం. అటువంటప్పుడు పబ్లిక్‍ ఇయరింగ్‍కు అర్థం ఏమిటి? ఎవరిని మాయ చేయడానికి. ఓపెన్‍ కాస్టు కింద మునిగిపోయే గ్రామ ప్రజలను రాకుండా చేసి తమ తొత్తులతోని అనుకూలంగా మాట్లాడించి అదే ప్రజాభిప్రాయ సేకరణగా నమోదు చేసి మన ఊళ్లను బొందలగడ్డలుగా చేయ్యాలని చూస్తోంది కంపెనీ’. అన్నాడు ఆవేశంగా మళ్ళీ అంతలోనే ‘‘ఈ కుట్రలను సాగనిచ్చేది లేదు. ‘నా బొందిలో ప్రాణం ఉండగా మీకు అండగా నేను ఉంటాను’’ అన్నాడు.

జనం ఒక్కసారిగా పెద్ద గొంతుకతో ‘ఇదేం రాజ్యం ఇదేమి రాజ్యం.. పోలీసు రాజ్యం పోలీసు రాజ్యం’ అంటూ నినదించసాగిండ్లు.

ఎమ్మెల్యే మళ్లీ మాట్లాడసాగిండు. ‘‘ఊళ్లను బొందలగడ్డలుగా చేసే ఓపెన్‍ కాస్టులను టీఆర్‍ఎస్‍ పార్టీ వ్యతిరేకిస్తుంది. ఓపెన్‍ కాస్టుల వల్ల భవిష్యత్తులో ఈ ప్రాంతాలలో మనిషికి మనుగడ లేకుండా పోతుంది. మా ఊళ్ళను శాశ్వితంగా నాశనం చేసి మన బ్రతుకుల్లో మన్ను పోసి, ఆంధ్రసర్కార్‍ బొగ్గు తవ్వుకపోతామంటే సహించేది లేదు’’

దేశాభివృద్ధి పేరు మీద వేల సంవత్సరాలు ఈ ప్రాంత ప్రజలకు నిలువ నీడను ఇచ్చి, పంటలు ఇచ్చి, సాది సవరచ్చిన చేసిన కన్నతల్లి లాంటి ఈ భూములను మాయం చేస్తామంటే సహించేది లేదు’’ అంటూ ‘‘అతను ఆవేశంగా రెండు చేతులు గాల్లో ఆడిస్తూ పదండి పోదాం. పబ్లిక్‍ ఇయరింగ్‍ ఎట్లా జరుగుతుందో చూద్దాం’’ అంటూ జనాలను ఉత్తేజపరిచిండు.

దాంతో జనం ఒక్కసారిగా పోలీసు వలయాన్ని చేదించుకుని ముందుకు కదిలారు. జనం నినాదాలు మిన్నంటాయి. ఏమి చేయలేని నిస్సహాయ పరిస్థితులలో అక్కడి పోలీసులు ఉండిపోయారు.

4

ఊరేగింపు కొద్ది దూరం పోయిందో లేదో మరిన్ని వాహనాలు వారికి ఎదురైనవి. వ్యానుల నుంచి దిగిన పోలీసులు లాఠీలు జులిపిస్తూ ఒక్కసారిగా జనం మీద పడ్డారు.
ఆ ప్రాంత ప్రజాప్రతినిధి అసెంబ్లీ మెంబర్‍ అని చూడకుండా అందరికంటే ముందు నడుస్తున్న ఎమ్మెల్యేను చుట్టు ముట్టిండ్లు పోలీసులు. ఎమ్మెల్యే తన నిరసన తెలియజేస్తూ అక్కడే రోడ్డు మీద బైఠాయించిండు.

‘‘పోలీసుల జులం నశించాలి, ఓపెన్‍ కాస్టులను వెంటనే రద్దు చేయాలి’’ అంటూ జనంతో గొంతుకలిపిండు.
ఇంకా ఆలస్యం చేస్తే ప్రమాదమని భావించిన పోలీసులు రోడ్డు మీద బైఠాయించిన ఎమ్మెల్యేను అరెస్టు చేసిండ్రు. జనం మీద లాఠీలతో విరుచుకుపడి చెదరగొట్టిండ్లు. అందిన వారిని అందినట్టుగా అరెస్టు చేశారు.

దుబ్బగూడెంలో కూడా పోలీసులు ప్రజలకు పబ్లిక్‍ ఇయరింగ్‍కు పోకుండా అడ్డుకుంటున్నారంటూ’ అక్కడి నుంచి జర్నలిస్టు మిత్రుడు ఒకరు ఫోను చేసిండు.
మా కళ్ళముందే ప్రజాస్వామ్యం అపహస్యం చేయబడుతుంది. దోపిడికి, అన్యాయానికి ప్రజలు అణిగి మణిగి ఉన్నంత కాలమే ప్రజాస్వామ్యం, ప్రజలు అన్యాయానికి వ్యతిరేకంగా ఏమాత్రం గొంతు విప్పినా ఆ గొంతులను నొక్కెయడానికి ప్రభుత్వం సాయుధ బలగాలను ఎగదోయడం ఇక్కడ సర్వసాధారణమైపోయింది.

ఒకప్పుడు కాలరీ ప్రాంతంలో గుండాయిజం పెచ్చరిల్లి అరాచకం ప్రబలిపోయి, స్త్రీలపై అత్యాచారాలు పెరిగిపోయినప్పుడు ఆవేశం చెందిన యువకులు గుండాలకు వ్యతిరేకంగా ఎదురుతిరిగిండ్లు. అప్పుడు ఆ గుండాలకు రక్షణగా పోలీసులు వచ్చిండ్లు. మురికి కూపాలను మరిపించే కార్మికుల గుడిసెల ప్రాంతంలో పది అడుగులకు ఒక సారాకొట్టు పెట్టి కార్మికులను తాగుబోతులుగా తయారు చేసి వారి మూల్గులను పీల్చే సారా అమ్మకాలకు వ్యతిరేకంగా, గుడిసెల ప్రాంతం నుంచి సారా కొట్లు ఎత్తివేయాలని స్త్రీలు నినదించినప్పుడు సారా కాంట్రాక్టర్లకు మద్దతుగా వచ్చిన పోలీసులు స్త్రీల మీద లాఠీలు ఝులిపించిండ్లు. మదమెక్కిన బాయి దొర కొడుకు ఒక కార్మికుడి భార్యను బలవంతంగా చెరిచి, హత్య చేసినప్పుడు న్యాయం కావాలని వీధుల్లోకి వచ్చిన స్త్రీల మీద లాఠీలే కాదు తుపాకి తూటాలు కురిపించి నలుగురి ప్రాణాలు తీసింది ప్రభుత్వం. బొగ్గు బావుల్లో రెక్కలు ముక్కలు చేసుకునే మాకు తాగేందుకు గుక్కెడు నీళ్ళు కావాలి. దెబ్బలు తాకితే హాస్పిటల్లో మందులు కావాలి అంటూ తమ నిరసన తెలియజేసేందుకు ఊరేగింపులు తీసిన కార్మికుల వీపుల మీద ఇదే లాఠీలు విరిగాయి. ఇప్పుడు మళ్ళీ అదే బీభత్సం. అదే అణచివేత పునరావృతమైంది.

ఎమ్మెల్యేను అరెస్టు చేశారనే వార్త క్షణాల మీద మందమర్రి అంతటా ప్రాకిపోయింది.

తెలంగాణ బొగ్గు గని కార్మి సంఘం కార్యకర్తలు, టి.ఆర్‍.ఎస్‍. పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి ఆందోళనలు మొదలు పెట్టారు. రోడ్డు మీద బైఠాయించిండ్లు. ఊరంతా అట్టుడికిపోతుంది. అదిరించి బెదిరించి గుట్టు చప్పుడు కాకుండా మొక్కుబడిగా ముగిస్తామనుకున్న పబ్లిక్‍ ఇయరింగ్‍ కాస్త రసాభసాగా మారింది.

ధర్నా, రాస్తారోకోలు తీవ్రరూపం దాల్చింది. జనం ఎక్కడికి అక్కడ గుమిగూడి ప్రభుత్వాన్ని, సింగరేణి యాజమాన్యంను దుమ్మెత్తి పోస్తున్నారు. ఒక చోట ఇద్దరు కార్మికులు మాట్లాడుకుంటున్న మాటలు నాలో ఆసక్తిని కలిగించింది.

‘‘ఇంత నిర్భంధం.. ఇంత రాద్ధాంతం అవసరమా’’ అంటున్నాడు అందులో ఒకరు.
మరొకతను ఈ మాత్రం తెలువదరా పిచ్చి సన్యాసి అన్నట్టుగా గమ్మత్తుగా నవ్వి చెప్పసాగిండ్రు…
‘‘కాసిపేట ఓసిపీని బందు పెట్టుకున్న తరువాత కంపినోడు తెలివి మీరిండు… అటువంటి చరిత్ర మళ్లీ పునరావృతం కాకుండా చావు తెలివి ప్రదర్శిస్తాడు’’ అన్నాడు.

ఆ మాటలు నిజమే అనిపించింది. బొగ్గు బావులలో రెక్కలు ముక్కలు చేసుకోవడం తప్ప ఏమి తెలియనట్టు ఎంతో అమాయకంగా కనిపించే కార్మికులలో ఎంత నిశిత పరిశీలన ఉంటుంది. ఏవో పొడి పొడి మాటల్లో కట్టికొట్టి తెచ్చే అన్న పద్ధతిలో సూటిగా చెప్పిన వారి మాటలు ఎంత అర్థవంతమైనవి. అటువంటి చైతన్యమే లేకుంటే భారతదేశ కార్మికోధ్యమ చరిత్రలోనే సింగరేణి కార్మికులు నూతన చరిత్ర సృష్టించే వాళ్ళా!

సమాజంలో ఎంతో వెనుకబడిన వారుగా భావించే కాసిపేట గిరిజనులు జరిపిన పోరాటానికి కంపెనీ తలవంచక తప్పలేదు. అనేక చోట్ల ఓపెన్‍ కాస్టులకు వ్యతిరేకంగా ప్రజలు నిరసన వచ్చినప్పటికి వాటన్నింటిని మాయ చేసి మతపరించి యథేచ్చేగా ఓసీపీలు తీసుకువచ్చిండ్లు.. కాని ఆ ఎత్తులు కాసిపేట గిరిజనుల ముందు పారలేదు. దానితో కంపెనీ రూట్‍ మార్చింది. ఏ కాసిపేటలో నైతే మూసేసిన అండర్‍ గ్రౌండ్‍ గనులకు ఇప్పుడు కొత్తగా ఓసిపి క్రిందికి తెచ్చిండు. అధనంగా మందమర్రి మండలంలోని మూసివేతకు గురైన బావులకు చేర్చి. సారా పాతదే కాని సీస కొత్తదైంది.. ఎత్తుగడలు మార్చిండు.. పబ్లిక్‍ ఇయరింగ్‍కు నిర్వాసిత గ్రామాల ప్రజల వస్తే ఎట్లాగు ప్రాజెక్టును వ్యతిరేకిస్తారనే ముందు చూపుతునే నిర్భంధం అమలు జరిపారు. కాని వాళ్లు ఊహించని విధంగా ప్రతిఘటన మొదలైంది.

ఒకవైపు ఈ తతంగం జరుగుతుండగానే మరోవైపు మూసేసిన కళ్యాణిఖని బావి ఆవరణలో పబ్లిక్‍ ఇయరింగ్‍ తంతు మొదలైంది. జిల్లా కలెక్టర్‍, పర్యావరణాధికారి, కంపెనీ సంబంధిత డైరెక్టర్లు, స్థానిక జీఎం, తదితర శాఖాధికారులు వచ్చారు. పెద్ద షామియానాలు వేసి భారీ ఏర్పాట్లు చేశారు.

బస్టాండు నుంచి యాపల్‍ మీదుగా కేకే2 బావి మూలమలుపు వరకు, రోడ్డుకు ఇరువైపులా సాయుధ పోలీసులను మోహరించారు. మందమర్రి ఒక యుద్ధ వాతావారణాన్ని తలపిస్తుంది. వారిని దాటుకొని మూసేసిన బావి ముఖ ద్వారం చేరుకునే సరికి అక్కడ పదుల సంఖ్యలో ఉన్న సాయుధ పోలీసులు ఒక్కొక్కరిని నిశితంగా అనుమానంగా పరిశీలిస్తున్నారు..

హెడ్‍ కానిస్టేబుల్‍ ఒకరు ‘‘బండిని అటువైపు పెట్టి పొండి’’ అంటూ దూరంగా చెయ్యెత్తి చూయించిండు. దాంతో కాస్త ముందుకు పోయి రోడ్డు వారనున్న ఒక చెట్టు కింద వాహనాన్ని నిలిపి వెనక్కి వచ్చాం. కానీ పోలీసులు మమ్మల్ని లోపలికి పోనియ్యకుండా ఆపిండ్లు. కాని కంపెనీ అధికారులను, వారి అనుచర వర్గాల వాహనాలను మాత్రం లోపలికి పోనిస్తున్నారు.

అది చూసి ‘‘ అన్నా ఇందులో కూడా వివక్షేనా’’ అన్నాడు రవి…

ఆ మాటలేవి నాలో ఆసక్తి కలిగించలేదు. యాంత్రికంగా ముందుకుపోతున్నాం కాని నా మనసు మనసులో లేదు. కేకే2 బాయి ఆవరణలోకి అడుగుపెడుతుంటే గత స్మృతులు ఉక్కిరి బిక్కిరి చేయసాగింది.

ఒకప్పుడు దాదాపు రెండు వేల మంది కార్మికులతో కళకళలాడిన బాయి ఇప్పుడు కళ తప్పింది. బాయి మూసేసిన తరువాత అక్కడ ఉండే మ్యాన్‍ వే షెడ్డు, సైకిల్‍ షెడ్డు, కార్మికుల రెస్టు రూములు, ఇంటిపైకప్పులుగా ఉండే సిమెంటు రేకులు, తలుపులు, దర్వాజలు తొలగించడం వల్ల మొండి గోడలతో బోసిపోయి ఉన్నాయి. ఇరువై నాలుగు గంటలు లాడీసుల రవాణా ధ్వనులతో ఉండే బంకరు మూగపోయి చాలా ఏండ్లయింది. కనుచూపు మేర నల్లటి దుమ్ము పేరుకుపోయి ఒకనాటి అవశేషాలకు గుర్తుగా మిగిలిపోయాయి. విరిగిపోయిన చక్రాలు, పనికిరాని లాడీసులు, వాటి మధ్యన అడ్డం దిడ్డంగా పెరిగిన పిచ్చి మొక్కలు పరుచుకొని ఉన్నాయి. పబ్లిక్‍ హియరింగ్‍ కోసం పాత ఆపీసు వెనుకవైపున బుల్‍డోజర్లతో చదును చేసి ఏర్పాట్లు చేసిండ్లు. వందల సంఖ్యలో సాయుధ పోలీసులను మోహరించారు.

కంపెనీ అధికారులు ఆడికి ఈడికి తిరుక్కుంటూ హడావిడిపడిపోతూ ఏర్పాట్లలో మునిగిపోయిండ్లు. ఒకప్పుడు ఈ ప్రాంతంలోకి పొట్టకూటి కోసం ఉద్యోగార్థమై వచ్చిన వాళ్లు అటు తరువాత కార్మిక నాయకులుగా ఎదిగి నేడు ఇన్నోవా కార్లలో ఇస్త్రి నలగని బట్టలో వచ్చిన వారికి ఎదురేగి ఆహ్వానం పలుకుతూ ముందు వరుసలో వేసిన మెత్తటి సోఫాల్లో కూచోబెట్టి చిరునవ్వులు చిందిస్తూ యోగక్షేమాలు విచారిస్తున్నారు.

అవును ఒకప్పుడు ఆ బావి మీదకి అడుగు పెట్టాలంటే వెన్నులో వణుకుపుట్టిన కార్మిక నాయకులు ఇవ్వాళ చాలా దర్జాగా ఆర్భాటంగా అక్కడికి చేరుకుంటున్నారు. తొండ ముదిరి ఊసరవెల్లిగా మారినట్టు పెట్టుబడి లేని వ్యాపారంగా మారిన ‘ట్రేడ్‍’ యూనియన్‍ నాయకులుగా కోట్లు కూడబెట్టుకొని అటు తరువాత రాష్ట్రస్తాయి నాయకులుగా ఎదిగి ప్రజాప్రతినిధులుగా, ఎమ్మెల్యేలుగా ఎదిగిపోయి రాష్ట్ర రాజధానిలో చక్రం తిప్పుతూ బిజీగా కాలం గడిపే నాయకులు కంపెనీతో లోపాయికారి ఒప్పందాలు చేసుకొని ఆఘమేఘాల మీద మంది మార్భలాన్ని వెంటేసుకొని వచ్చిండ్లు….

పబ్లిక్‍ ఇయరింగ్‍ సజావుగా జరుగడానికి కంపెనీ ముందు తమకు అనుకూలమని భావించిన ట్రేడ్‍ యూనియన్‍ నాయకులతో కలిసి కుట్రలు పన్నింది. ఉచిత మస్టర్లు ఇచ్చి మందమర్రి, శ్రీరాంపూర్‍ ఏరియాల బావుల నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులను సమీకరించింది. అట్లా వచ్చిన వాళ్లు ముందు వరుసలో చాలా భాగం ఆక్రమించిండ్లు. దాంతో అసలు ప్రాజెక్టు మీద తమ అభిప్రాయం చెప్పాల్సిన ప్రజలు కూచోడానికి చోటు లేకుండా పోయింది. వాళ్లు ఎక్కడో దూర దూరంగా అంచులపొంటి నిలుచున్నరు. స్త్రీలకు కూడా కూచోడానికి చోటులేదు.

మరోవైపు జనం నిరసనలు కొనుసాగుతూనే ఉన్నాయి. ‘‘అక్రమంగా అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలి’ అరెస్టు చేసిన వారిని విడుదల చేయకుంటే ప్రజాభిప్రాయ సేకరణ జరుగనిచ్చేది లేదు అంటూ పెద్ద పెట్టున నినధించసాగారు.

ఆందోళనకారులను అదుపు చేయడంలో పోలీసులు విఫలమవుతున్నారు. పరిస్థితి మరింత చేయి దాటిపోతుందని భావించిన పబ్లిక్‍ ఇయరింగ్‍ ప్రధాన అధికారి జిల్లా కలెక్టర్‍ జోక్యం చేసుకోకతప్పలేదు.

‘‘ఎవరిని అరెస్టు చెయ్యరు. ఒకవేళ ఎవరినైనా అరెస్టు చేసేదుంటే వెంటనే విడుదల చేస్తారు’’ అంటూ నమ్మించ చూసిండ్లు.

‘‘ఎమ్మెల్యేను ఎర్రగుంటపల్లి, దుబ్బగూడెం వాసులను అరెస్టు చేశారు’’ అంటూ ఓ యువకుడు పెద్ద గొంతకతో అరిచిండు. ‘‘అందరిని వదిలిపెడుతారు’’ అన్నాడు కలెక్టర్‍ మైకులో. వాళ్లు వచ్చేదాక సభ జరుగనిచ్చేదిలేదు ఎవరో అరిచిండు.
నినాదాల హూరెత్తింది.

ఎనభైదశకంలో ఏ కేకే2 బావి మీదకైతే సింగరేణిలో విప్లవ కార్మికోద్యమానికి అంకురార్పణ జరిగిందో అదే చోట నేడు విధ్వంసం విలయతాండవం చేస్తుంది. నిజాం దొరలను మించిపోయిన బాయి దొరల దొరతనాన్ని ప్రశ్నించిన చోట. ఇప్పుడు ఆక్రందనలు ఆవేదనలు మిగిలాయి.

ఎంత విచిత్రమైంది కాలం. మా కండ్ల ముందే అణిగి మణిగి ఉన్న కార్మిక వర్గం అగ్ని కణాలై ఈ భూమ్మీద దోపిడి పీడనలు పోయి సమసమాజం కావాలని కలలు కంటూ అసమాన త్యాగాలతో సృష్టించిన త్యాగాల చరిత్ర గత చరిత్రగా మిగిలిపోవాల్సిందేనా..!

ఆఫీసు ముందు దుమ్ముకొట్టుకపోయి ఉన్న వేప చెట్టు నీడలోనే ఆనాడు కార్మికులతో జరిగిన ఫిట్‍ కమిటీ సమావేశం సంఘటన కండ్ల ముందు మెదిలింది. పాత చరిత్రను తిరుగరాస్తామని వాళ్ళు ఆనాడు ఊహించి ఉండకపోవడచ్చు. ఫిట్‍ కమిటీలంటే చాయ్‍ – లడ్డూ కమిటీలనే అపవాదును తొలగించి నిజమైన అర్థంతో బావిలో పని చేసే వివిధ సెక్షన్‍ కార్మికులతో కూడిన ఫిట్‍ కమిటీ సమావేశం కార్మిక సమస్యల మీద సుదీర్ఘంగా చర్చించింది.

మృత్యుకుహరాలుగా మారిన బొగ్గు గనులల్లో రక్షణ ఎంత కరువైందో ప్రశ్నించారు. కార్మికులను కనీసం మనుష్యులుగా చూడని బాయి దొరల దొరతనాన్ని ప్రశ్నించారు. కార్మికుల సమస్యలను అడ్డంగా పెట్టుకొని పైరవీకారులుగా మారిపోయిన కార్మిక సంఘాల నాయకుల విద్రోహల గురించి చర్చించారు. ఒక్క కార్మికుల సమస్యలే కాదు అవినీతిలో కూరుకుపోయిన అధికారులు బొగ్గు ఉత్పత్తి అవసరమైన లాడీసులను కూడా సక్రమంగా సప్లయి చేయలేని బాధ్యత రహితమైన నిర్లక్ష్యాన్ని నిలదీశారు. అస్తవ్యస్థ పరిస్థితులను చక్క దిద్దడానికి కార్మికులతో కూడిన పిట్‍ కమిటి నడుము బిగించింది ఆ చెట్టు నీడనే…

అప్పటికీ యథేచ్చగా సాగిస్తున్న అణచివేతలకు శ్రమదోపిడికి చరమగీతం పాడేందుకు అంకురార్పణ జరిగింది అక్కడే. చీకటి పొక్కల్లో గర్మీ ఫేసుల్లో ఊపిరి ఆడటం లేదు దొరా….! తాగేందుకు గుక్కెడునీళ్లు ఉంటలేవు దొరా! అంటే ఎందుకు నేరమైపోయిందో ఆలోచించారు. కార్మికుల చమట రక్తంతో తడిసిన బొగ్గు ఎవని ఇంట్ల వెలుగు నింపిందో కార్మికుల గుడిసెల్లో ఒక బల్బు ఎందుకు వెలుగటం లేదో యోచన చేశారు.

ఒక నాయకుని దోపిడితో మరో నాయకుడు వేలు ఎత్తి చూపకుండా దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్టుగా దొంగల రాజ్యం నెలకొన్న పరిస్థితులను, వాళ్ల లంగాతనాన్ని ప్రశ్నించారు. అడుగు అడుగునా వెలిసిన సారా కొట్లు కార్మికుల జీతం అసలే అంతంత మాత్రం.. అందులో సగభాగం సారాకొట్టే కాజేస్తే కార్మికులు బ్రతికేది ఎట్లా అని ఆలోచనలు చేసింది అక్కడే.

దోపిడి సమాజంలో కష్టాల్లో నిండా మునిగిపోయిన కార్మిక వర్గం ఒక్కసారిగా జూలు దులిపి, ఈ అస్తవ్యస్థ సమాజాన్ని చక్కదిద్దెందుకు నడుము బిగించింది ఇదిగో ఈ మూతబడిన కేకే2 బావి వద్దే. సభలో ఏదో కలకలం రేగింది.. నా ఆలోచనలు తెగిపోయాయి. పోలీసుల లాఠీలు ఆ గొంతులను అణచలేకపోయింది.

‘‘అరెస్టు చేసిన వారి విడుదల చేయాలి’’,
‘‘మా గొంతు మీద కత్తి పెట్టి ఇదేం ప్రజాభిప్రాయ సేకరణ’’,

‘‘అరెస్టు చేసిన వారిని విడుదల చేయకుంటే ప్రజాభిప్రాయ సేకరణ జరుగనిచ్చేది లేదు’’ గోలగోలగా నినదిస్తున్నారు.
కష్టం చేసి చేసి మొద్దుబారిన చేతులను ఎత్తి పిడికిలి బిగించి నినదిస్తున్నారు. పీక్కపోయిన మొఖాలు ఆకలి, ఆవేదన ఆందోళన కలగలిసిపోయిన మొఖాలు, ఆవేశంగా అరుస్తున్నాయి. ప్రజాభిప్రాయ సేకరణ నిర్వర్తించడానికి వచ్చిన ఆదిలాబాద్‍ జిల్లా కలెక్టర్‍కు ఈ పరిస్థితి ఏమి అర్థం కావడం లేదు. పర్యావరణాధికారి ఏ భావం స్పష్టం కాని జడ పదార్థంలా బిగుసుకుపోయి మిరి గుడ్లేసుకొనిచూస్తుండిపోయిండు. కంపెనీ అధికారులకు ఏమి చేయ్యాలో పాలుపోవడం లేదు. పోలీసు అధికారులకు మాత్రం ప్రజల ఆందోళన కోపం తెప్పించింది. మరోసారయితే జనాల మీద విరుచుకుపడే వాళ్ళే కానీ, ఇప్పుడు అది సమయం కాదని సంయమనం పాటించసాగిండ్లు…

ఇక లాభం లేదనుకున్న కలెక్టర్‍ మైకందుకున్నాడు. ‘‘ఎవరు ఆందోళన చేయవద్దు. పబ్లిక్‍ ఇయరింగ్‍ సజావుగా జరిగేలా సహకరించాలి’’ అంటూ విజ్ఞప్తి చేసిండు.

(ఇంకా వుంది…)

రచయిత. తెలుగు సాహిత్యంలో పి.చందు గా సుపరిచితుడు. అసలు పేరు ఊరుగొండ యాదగిరి. వరంగల్ ఉర్సులో 1954 సెప్టెంబరు 24 న వీరమ్మ, మల్లయ్య దంపతులకు జన్మించారు. ఎల్.బి. కాలేజీలో బి.కాం చదివారు. సింగరేణిలో ఉద్యోగ విరమణ చేశారు. "శేషగిరి", "నల్లమల", "భూదేవి", "నెత్తుటిధార", "శృతి", "బొగ్గులు" తదితర పదిహేను నవలలు రాశారు. సుమారు వంద కథలు రాసి "భూ నిర్వాసితులు", "జులుం", "గుమ్మన్ ఎగ్లాస్ పూర్ గ్రామస్థుడు", "సమ్మె కథలు" కథా సంపుటాలు ప్రచురించారు.

Leave a Reply