పిల్లలకు దసరా సెలవులు మొదలై వారం దాటినా గాని రేపు పెద్ద బతుకమ్మ అనంగ ఇయ్యాల్ల సాయంత్రం మా పిల్లల్ని తోల్కోని ఊరికి వచ్చిన.
ఊళ్ళోకి ఎంటర్ అవ్వగానే ‘దానకుంట కట్ట‘ మా కనగర్తి టాంక్ బండ్.
గత ఏడాది నీళ్ళు లేక ఎండుకపోయిన మా దానకుంట ఈసారి పోయినేడాదన్నే వర్షాలు పడ్డప్పటికి ఎండాకాలంల మిషన్ కాకతీయ కింద పూడిక తీయించడం వల్ల నీళ్లు నిలిచినయి.
కట్ట మీద ఎనుకటి తుమ్మ చెట్ల బదులు పూల చెట్లు కన్పిస్తన్నయి. ఊరిలోకెళ్లి రెక్కలిడిచిపోయిన వారు వాళ్ళ అమ్మల, తాతల, తల్లిదండ్రుల పేరిట ఇచ్చిన చెట్ల కింది సిమెంట్ బేంచులు. ఊరందరు తాగిన సర్కారు మంచి నీళ్ళ బావి పడావు పడి ఆ జాగలో కొత్తగా కట్టిన ఆంజనేయస్వామి గుడి.
ఇంటికొచ్చి తానం చేసి లుంగీ లేకపోతే మా బాపు దోతినే లుంగీలాగా కట్టుకొని మా ఇంటి ముందు గద్దె మీద పండుకున్న. చిన్నప్పటి నుండి నా బతుకమ్మ జ్ఞాపకాలు మొదలైనాయి.
ఊళ్ళోకి ఎంటర్ అవ్వగానే ‘దానకుంట కట్ట‘ మా కనగర్తి టాంక్ బండ్. గత ఏడాది నీళ్ళు లేక ఎండుకపోయిన మా దానకుంట ఈసారి పోయినేడాదన్నే వర్షాలు పడ్డప్పటికి ఎండాకాలంల మిషన్ కాకతీయ కింద పూడిక తీయించడం వల్ల నీళ్లు నిలిచినయి.
కట్ట మీద ఎనుకటి తుమ్మ చెట్ల బదులు పూల చెట్లు కన్పిస్తన్నయి.
ఊరిలోకెళ్లి రెక్కలిడిచిపోయిన వారు వాళ్ళ అమ్మల, తాతల, తల్లిదండ్రుల పేరిట ఇచ్చిన చెట్ల కింది సిమెంట్ బేంచులు. ఊరందరు తాగిన సర్కారు మంచి నీళ్ళ బావి పడావు పడి ఆ జాగలో కొత్తగా కట్టిన ఆంజనేయస్వామి గుడి. ఇంటికొచ్చి తానం చేసి లుంగీ లేకపోతే మా బాపు దోతినే లుంగీలాగా కట్టుకొని మా ఇంటి ముందు గద్దె మీద పండుకున్న. చిన్నప్పటి నుండి నా బతుకమ్మ జ్ఞాపకాలు మొదలైనాయి.
ఇప్పటికీ మా ఊరంటే, ఊరికి రావాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తది. ఊరనగానే చిన్నప్పటి సంతోషాలతో పాటు అనేక అవమానాల, వెక్కిరింతల, ఇబ్బందికర సంఘటనల జ్ఞాపకం వస్తుంది.
కామన్ మ్యాన్ లా బస్సులో రాలేను.
కాస్తా ఊరి నుండి ఎదిగిన దళితుల వలె నిబ్బరంగా, ధిక్కారంగా కార్ లో రాలేను. ఊరికి పోవుడంటేనే ఒక మానసిక సంఘర్షణ. ఊరిలోకి కార్ ఎంటర్ కాగానే ఎటూ చూడకుండా ఉండేందుకు పడుకున్నట్లు నటిద్ధామనుకున్నాను. కానీ సుఖం వస్తే మొఖం కడగా వీలు కానోని లెక్క చేసినట్లు అయిందనుకుంటారని కూర్చున్నా.
బ్లాక్ స్క్రీన్ ని వెహికిల్స్ కి తొలగించిన ప్రభుత్వ నిర్ణయంపై కోపం వచ్చింది.
ఒక బీసీ గా వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన నాకే ఊరు చేసిన గాయం ఇలా ఉంటే దళితులకి ఊరంటే ఎంత కోపం, అసహ్యం, ఆవేశం ఉంటదో అర్థం చేసుకోవచ్చు.
“ఈ ఊరు కాలిపోనూ…, “ అనే మా అవ్వ తిట్టు యాదికొచ్చింది. వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన నా వ్యక్తిత్వమే కొంచెం అబ్నార్మల్ అనుకునేవాళ్లూ దళితుల వ్యక్తిత్వం అంతా ధిక్కారంగా, మోరగా, మోటుగా ఎందుకుంటదో అర్థం చేస్కోవాలి .
ఊళ్ళకి సొత్తంటే … పెద్దోల్లు ఎవరన్న కనిపిస్తే వెహికల్ ఆపాల్నా లేదా గ్లాస్ దించి విష్ చేస్తూ, నమస్తే పెడితే సరిపోతుందా? చిన్నప్పుడు మాకు అప్పులిచ్చినోళ్ళు కనపడితే ఏమిటీ పరిస్థితి?
వాళ్లలో దొరసాని మొదలు కోమట్లు మొదలు సాలోల్లు, గౌండ్లోల్లు, కుర్మోల్లు, మన్నెపొల్లు కూడా ఉన్నారు. అందులో కొద్దిగనే ఆరు వందల రూపాయలే అయినప్పటికి నేను యూనివర్సిటీ కి పోయే టైమ్ లో ఇచ్చి ఏడాది తరువాత “ కొడుకు చదువుకే ఇత్తిని నాకు వడ్డెందుకక్క అని తిరిగి అసలు డబ్బులు మాత్రమే తీసుకున్న మా మన్నెపొల్ల మధురవ్వ చిన్నమ్మ అంటే నాకు ఇప్పటికీ చాలా ప్రేమ.
నేను ఇప్పటికీ ఎవరికన్న డబ్బులు ఉంటే ఇస్తాను. లేకుంటే లేదు. కానీ అడిగిచ్చినాననో, ఫైనాన్స్ ఇంకేదో పేరు చెప్పివడ్డీ తీసుకోలేను. కారణం… ఆ చిన్నమ్మే. ఆమె ప్రేమగల్ల చూపులు రూపం నేనెప్పుడు మరచిపోలేను నా జీవితంలో.
ఊళ్ళోకచ్చేటపుడు అందరి మెంటాలిటీ ఇట్లనే ఉంటదేమో సగటు శ్రామిక, ఉత్పత్తి కులాలనుండి ఊరి నుండి ఎదిగి సర్కార్ కొలువు చేసెటోళ్లందరిది.
నాకు దసరా పండుగ అనగానే కొత్త బట్టలు గుర్తొస్తాయి. కొత్త బట్టలు లేక ఎంగిలి పూల బతుకమ్మ (చిన్న బతుకమ్మ) రోజు ఊరందరు మా ఇంటి దగ్గరి శివుని గుడికి వచ్చి ఆడుతారు.
దోస్తులు, ముఖ్యంగా బడిలోని ఆడ పిల్లలు అటు నుండి వచ్చినప్పుడు ఇంట్లో మూలకి దాక్కుంటే తప్ప ఎలాగైనా కనపడుతానని ముందే మా పొలం కాడికి పోయేటోన్ని. ఎప్పుడో రాత్రి పూట వచ్చేవాన్ని.
నాకే కాదు, చాలా మంది గ్రామీణ మొదటి తరం చదువుకునే పిల్లలకి బతుకమ్మంటే ఒక వెక్కిరింత అప్పుడు. బడి యూనిఫాం మాత్రమే మాకు కొత్త బట్టలు… ఊరికి పోయిన, పెండ్లీలకు పోయిన.
మాటల వాడుకంలో కూడా అనుకోకుంటే అసలు ‘బంగారు బతుకమ్మ‘ అనడం చాలా ఇబ్బంది.
వెండి బతుకమ్మ అనుడు కూడా ఇబ్బందే.
అంటే గింటే ‘రాతెండి బతుకమ్మ‘ , ‘మట్టి బతుకమ్మ‘ అనడం మంచిది.
రౌతెండి అంటే సామాన్య జనం తినే వండుకునే గిన్నెలు. అట్లనే ‘బంగారు తెలంగాణ‘ బదులు ‘మట్టి తెలంగాణ‘ అని అనాలే. మట్టి తెలంగాణ అంటే ఈ నేలని ఈ మట్టిని ఈ వనరులని కాపాడుకునుడు. దుక్కి దున్నినట్లు, తవ్వుటం పెట్టినట్లు ఈ నేలని కాపాడుకుంటూ పొతం చేసుకుంటూ ఆ నేల ఇచ్చే ఫలాల్ని సమానంగా అనుభవించుడు.
మన ఇండ్లల్లో చిన్న పిల్లల్ని సైతం ముద్దు చేస్తూ మొదట ‘మా కొండ (వెండి), మా చక్కెర అని ఆ తర్వాతనే మా బంగారం అంటారు లాస్ట్ కి. బంగారం అనే పదం అంతా దూరం సామాన్య ప్రజలకి. మా అవ్వకి మెడలో నల్ల పూస గుండ్లు పుస్తెలు, చెవికి కరిగిస్తే ఏమి మిగలదు అనే పెళ్లినాటి కమ్మలు తప్ప ఇంకేమీ ఉండకపోయేవి నా ఎరుకలో. ఆ కమ్మలు కూడా పదే పదే వంద రెండు వందలు, ఐదు వందలకి కుదబెట్టబడేవి కోమట్ల దగ్గర. అప్పులిచ్చెటోల్ల దగ్గర. మా అవ్వ నా పెండ్లి ముందు నాకు పిల్లనిచ్చేటోల్లు చూస్తరని బర్రెనమ్మి కాళ్ళ కడాలు చేయించుకుంది. నా పెండ్లి అయినంక నాకు నౌకరీ వచ్చినంకా పుస్తెల తాడు (బంగరం ) ఆమె మెడలోకి వచ్చింది. పంట మీద మాత్రమే రెండు రోజులు చేతిలో పైసలు ఆడి శేటుకి కట్టంగా, అప్పు కట్టేవరకు కనపడ్డ పైసలు రైతు ఇంట్లో ఇక ఎన్నడూ కనపడవు. రైతు ఇంట్లో పరిస్థితి ఏ రోజుది ఆ రోజుకి కట్టం చేసుకుని తినే కూలీలకంటే అటీనం (అతి హీనం).
నా స్నేహితులలో క్లాస్ మేట్స్ మా మేరోళ్ళ రాజు గాడు. గముండ్లోల్ల రాజు, కుర్మోల్ల బీరయ్య, దూదేకుల యూసుఫ్ గాడు, కోమట్ల శేషు, అవుశలొల్ల శీనుగాడు. నాకు ఇంకో క్లోజు ఫ్రెండ్ చాకలి కుమార్. చదువు కోసం వేరే ఊరికి పోయిండు అప్పటికే. కోమట్ల శేషుకి, గవుండ్లొల్ల రాజు దగ్గర, బాజ కొట్టబోతే యూసుఫ్ దగ్గర, ఓదెల మల్లన్న పట్నాలకి జగ్గు ఊపడానికి పోతే చిల్లర దొరికే కుర్మ బీరయ్య దగ్గర తప్ప మా ఇంకెవ్వరి దగ్గర ఇండ్లళ్లలో రూపాయి ఉండకపోయేది.
మా ఇంట్లో బ్యాంక్ పంట అమ్మినంక నాలుగు రోజులు మా బాపు కీసలో, మా అవ్వ బొడ్డు సంచిలో ఉండేది. పంట మీద పెట్టుబడికి మాత్రమే ఇస్తానని కిరాణా సామాను మాత్రమే ఇస్తానని చెప్పే శేట్ దగ్గరికీ చిన్న చిన్న ఖర్చులోస్తే వెల్లలేడు రైతు.
రైతు తన దగ్గరి కోల్లనో, మగ దుడ్డెలనో, మేక పిల్లలనో, తిండికుంచుకున్న వడ్లనో, చివరకు ఇంట్లో తవుడునో అమ్మాల్సిందే. మార్కెట్ సంస్కృతి పెరిగి ఊళ్ళల్లో వాతావరణ, సామాజిక సంబంధాలు దెబ్బ తిని పల్లెటూరు తన రూపం కోల్పోయింది. ప్రభుత్వం కోళ్ళని, గొర్లని, మేకల్ని, కూరగాయ విత్తనాలని అందరికీ అందజేయాలే. మళ్ళీ గ్రామీణ వ్యవస్థని ఒక దారిలో పడగొట్టాలి. అందుకే నేను బర్లు, గొర్లు, పందులు, కోళ్ళు ఏవి ప్రభుత్వం ప్రజలకి అందచేసిన సపోర్ట్ చేస్తాను. విమర్శించే వాళ్ళు మరింత మంచి ప్రత్యామ్నయం చూపిస్తే మంచిది.
నేను చిన్నగా ఉన్నప్పుడూ పాలు చీకేవాడిని. చిన్నోడిని అవడంతో మా అవ్వ నన్ను తనతో పాటు ఊర్లకి తీసుకెళ్ళేది. ఒకసారి ఒక పాలీస్టర్ అంగీ కొనుక్కొని నాకు తొడిగి ఏదో ప్రభోజనానికి పోతే బల్ల మీద కూసున్న నా అంగీ పట్టన పగిలితే అందరిలో ఇజ్జత్ అనిపిచ్చి మా అవ్వ నా మీద కొంగు కప్పుకొని ఇంటికి తీసుకచ్చిందట. అందుకే అలా ఏదైనా ఊరికి వెళ్లాలంటే మా గవుండ్లొల్ల కనుకలచ్చక్కని పట్టగొలుసులు అడుక్కునేది మా అవ్వ. నాకు వాళ్ళ మనుమడు పవన్ అంగీ లేదా చెడ్డీ అడిగి వేసేది.
** ** **
ఇట్లా నా ఆలోచనలకి అడ్డంగా మా ఇంటి ముందు కుమ్మరి రామయ్య తాత వచ్చిండు. వ్యవసాయంలో లాభం లేక, నీళ్ళు లేక ఉన్న రెండెకరాలు బీడు పెట్టి పాతవే ఉన్న రెండు బర్లు సాదుకుంట పాలమ్ముకుంట బతుకుతాండ్రు బార్య భర్తలిద్దరూ.
“ ఏం సంగతి తాత, సెనార్తి! ఎట్లున్నది మీ రాజ్యాన వాన వరస “ అన్నడు.
“ అక్కడ గిట్లనే ఉంది” అన్న.
“మా కంటే మానేట్ల కడుపుల పేగులేళ్ళేతట్లు ఇసుకంత ఒడిసి వాగు తరీక మారి చెట్లు మొలిచినయి. ఆ పక్కోడు ఈ పక్కోడు తలగపడి మట్టి పోసి కూడుపుకుంటా వాగునే మాయం చేసిండ్రు. నీకు తెల్వని కథనా? మానేట్లకెళ్లి కాలువ నీళ్ళు గంగలెక్క ఎగేసుకచ్చి వాగొడ్డంతా రెండు పంటలు తీసినం. ఇప్పుడు సుక్క లేదు వాగులో. ఎప్పుడన్నా వాన పడితే అండ్లకే ఇంకుకపోతన్నయి. బావులు పోయినయి. చెలిమెలు పోయినయి. చేన్లు పోయినయి. పంటలు పోయినయి పాడి పోయింది. ఇండ్లల్ల బావులు కూడ ఎండిపోయినయి. వాగు కడుపు చీరి ఇంత పైపు లైను వేస్తే నల్లాల మంచి నీళ్ళు తాగుకుంట కోపెను బియ్యం, పింఛను పైసలతోని బుడ్డకప్పలెక్క, లట్టగువ్వల లెక్క ఉబ్బి బతుకుతండ్రు మనుషులు“ అన్నడు.
“వత్తాంటే తొవ్వపొంట పెచ్ఛెరువు పైన పంటలు బాగానే ఉన్నాయి కదా తాత“ అని అడిగిన.
“మీ అన్నసోంటోల్లు ఇజ్జతు మానానికి ఇంకేం పని చేయబుద్ది కాక ట్రాక్టరుల మీద, మట్టి పనులల్ల సంపాదించిందంత పెట్టి మానేట్లకెళ్లి నాలుగు కిలోమీటరుల పొడువు పైపులైనేసుకొని పండించుకుంటార్రు. అండ్లేమి లేదు. ఎవ్సముల ఏతులకు –తులు రాలకొట్టుకునుడు తప్ప. దానికి దొంగ కరెంట్, దొంగ మీటరులు, పైపు లైనులు పగులుడు, మోటార్లు కాలుడు. ఎన్నేషాలు. ఆఖరికి తుఫానొచ్చి ఒక్క రోజు కోసం మానేరు డామ్ గేటులెత్తితే పోయినసారి ఎక్కడియక్కడ మోటార్లు పైపు లైనులు పీక్కనేపాయే. ఎవని కోసం అక్కరకు రాని సేత. నీ అక్క అందుకే నేను ఎవుసమే బందు పెట్టిన నా —డ్డలది బతికినంత కాలమాయే“.
“గవర్నమెంట్ హరిత హారం కింద చెట్లు పెట్టిచ్చుడు, మిషన్ కాకతీయ కింద చెర్వులు తవ్విచ్ఛుడు అందుకే కదా తాత! పోయినేడాది చుక్క నీళ్ళు లేకుండే ధానకుంటలో. ఈసారి చూసినవ. నీళ్ళు పోసుకున్నట్లు ఉన్నది“ అన్నాను నేను.
‘” ఎహే…, అవన్నీ –జె వేషాలు. అందరూ దొంగలేనయ్య రామచంద్రా! గవర్నమెంటోడు, ఉజ్జోగస్తులు, రాజకీయాలు చేసేటోడు, సదుకున్నోడు అందరూ. నా పుట్క కొద్ది చూడలే ఈ కథ. ఊల్లెన్నడన్ననీళ్ళు లేక వాకిట్ల అలుకు చల్లక ఇడిసిపెట్టినమ?ఇది కలీగం. నాశడగాలానికి కాకుంటే ఇంకేంది? ఎన్ని సెరువులు తవ్వితే మానేరు మునుపటి లెక్క కావాలే. ఎన్ని చెట్లు నాటితే నాశనం చేసిన కనుకుల గుట్టని, గుట్ట మీది సెట్లని తెత్తం. నాకు సెప్తవు కానీ తియ్యి“ అని దూరంగా కాండ్రకించి ఊంచిండు రామయ్య తాత. కండ్లల్లో దుఖం. చేతుల్లో పట్టరాని కోపంతో రగిలిపోవుకుంటా కొద్ది సేపు దమ్ము తీసుకుంటా గమ్మున ఉండిపోయిండు.
పరిస్థితి ఎటో పోయేటట్లు ఉన్నదని మా అవ్వ బయటికి వచ్చింది.
“ ఏమి ముచ్చటనే మామ! నీ ముచ్చట పాడుగాను. పోరడు రాక రాక పండుగగోలే ఇంటికత్తే వానెంబడిపడ్డవు. మీరే ఉన్నరా ఇగ లోకమ్మీద “ అని మందలిచ్చుకుంట ఇద్దరికీ చాయే తెచ్చింది కోపులల్లా.
ఇక కలిసేటట్లు లేదని టీవీల ఏదో బతుకమ్మ మీద చర్చ చూస్తున్న బాపు కూడా బయటకు వచ్చిండు.
“మాట్లాడనియ్యలేవు ఏమైతంది. నలుగురు నాలుగు ముచ్చట్లు మాట్లాడితే దేనికైనా తొవ్వ దొరుకుతది“.
మళ్ళీ తనే “వానికి తెలువని ముచ్చటనా? కానీ నౌకారిగాడు నౌకారిగాని లెక్కనే ఉండాలి. గవర్నమెంట్ అట్టిగనే జీతాలిచ్చి సాత్తందా వీళ్ళని?” ఈ మాట పరోక్షంగా నా కోసమని అర్థమవుతుంది.
“ఆడేం మంచిగున్నది ఈడు నౌకరీ చేసే కాడ. కేశవులు చిన్నాయిన కొడుకు కొంరన్ని సూత్తే తెలుత్తలేదా? బాయిల పని సేత్తే… చిన్న పోరాడేనాయే. ఇప్పటికీ నాలుగు సార్లు కడుపు చీరీరి. లోపల దిగి పని చేసే బాయిలు పొయ్యి ఓపెన్ కాస్టులే వచ్చే. మొన్న ఎండాకాలంల నాలుగు రోజులు ఉండత్తనని పోతే ఇంట్ల బోరింగులల్ల నీళ్ళు ఎల్లక డ్రమ్ములల్ల తెప్పిచ్చుకుంటంటే సూడబుద్ది కాక సప్పుడు జేయక రెండే దినాలకు పీక్కొని వచ్చిన. అంత దుబ్బ దూళి మన్ను మశానమేనాయే. ఆడేడా బతికేటట్లు ఉన్నది.“
“ నేనదే అంటున్న వెంకన్ , వీళ్లందరు కొట్లాడుతేoది? ఆయ్నే ముక్కెమంత్రి ఇందుకే అయిండా?” రామయ్య తాత.
“అందుకే శేత్తాండు కదా తాత. ఒక్కసారే అయితద అంతా. ఇయ్యాలనే మొదలైందా కనుకుల గుట్ట బండ తీసుడు. ఇరువై ఏండ్ల దగ్గరికి వత్తంది. మానేరు ఇసుక లారీల కథ పదిహేనేండ్లకి వత్తoది“ అనే నా మాట పూర్తయ్యిందో లేదో
కోపంగా“ నన్ను మత్పరియ్యకుర్రయ్య. నాకు కిరిమి లేత్తది. కోపమత్తే నా అంత జెట్ట లంజెకొడుకే లేడు. అదే ఓపెన్ కాస్టులని ఆపుతేంది. ఇప్పుడన్న ఈ గుట్టల్ని నాశనం చేసుడు, ఇసుకని దోచుకపోవుడు ఆపుతేంది?“ నా మీద వ్యక్తిగత ద్వేషంలాగనే మాట్లాడుతుండు. సగటు ప్రభుత్వ ఉద్యోగి జనానికి తమ ఆవేశాన్ని వెళ్లకక్కుకునే అవకాశాన్నిచ్చే ఒక వేదిక.
“నీ ఇంట్ల పీనుగేళ్ల. ఇదేదో కథకే ఉందే. పోయి పోయి పొరని మీద పడ్డడు. అదే అన్నీ సర్కారోడే ఎందుకు చేయాలే. మనం చేయొద్దా? ఎవనికి కడుపుల మంట ఉంటే వాడు చెయ్యాలే. ఆది మధుసూదన్, తాళ్ళపెళ్ళి లచ్చుమను తోని కలిసి కమ్మునిస్ట్ పార్టీల ఇరవై ఏండ్లు పోరాటం సేత్తిమి? పోయి పోయి లచ్చుమను సర్పంచు కాంగానే ఎన్నడు లేనిది ఇసుక తీసుకపోవుడు మొదలాయే. ఆపినమా? ఆగకపాయే! అందరం కలిసి లచ్చుమనుని తిడితిమీ.
ఎక్కడోడు అక్కడ వార్డ్ నంబరులు, గుడ్డోడు, గూనోడు అందరూ లేత్తిరి. ఎవని సక్కల వాడే కాంట్రాక్టరోని దగ్గర పైసలు తినిరీ. మలుసుకపండిరి. అదే అప్పుడే అందరూ కలిసి లొల్లి సేత్తే ఇసుకకొట్టుకపోవుడు ఆగకపోవునా? ఊల్లే గిప్పుడీ కరువుండునా?“ ముచ్చట పెద్దగైతందని వినడానికి వస్తున్న ఎదురింగ ఇల్లు మధురమ్మతో చెప్పుతంది మా అవ్వ.
“ ఏంది పిలగా నీకేమి పని లేదా? ఇంతంత తాగినట్టున్నవు. బుక్కెడంత తిని సప్పుడు సేయక పండుపో. ఓ… తెగని రామండమంత ముందేసుకున్నవు.“ మధురమ్మ రామయ్య తాతని అదులగొట్టింది.
రామయ్య తాత నోట్లో నోట్లో అనుకుంట నెత్తoత గోక్కుంట తువ్వలని జబ్బమీదేసుకొని వెల్లిపోయిండు.
*** *** ***
మా గౌండ్లోల్ల వీరన్న తెచ్చిన ఈతకల్లు రెండు గిలాసలు తాగిన. ఫేస్ బుక్కు ఓపెన్ చేసిన. ఫేస్ బుక్కులో ఎవరో తెలంగాణ, ఖమ్మం అమ్మాయి ఒక పువ్వు ఫోటో పెడితే దాని మీద ఒకటే కామెంటులు.
“ సీతమ్మ వారి జడ కుచ్చులు“, ” సీతమ్మ గారి జడ గంటలు“.
వాళ్ళు ఎవలా అని చూస్తే ప్రస్తుతానికైతే ఇక్కడొల్లే కానీ ఆంధ్రోల్లు. మీరు ఆడితే ఆడుoడ్రి. లేకుంటే లేదు. కాని మాకు తెల్వని ఈ పేర్లు పెట్టకూర్రి అని అనాలన్పించింది. భాషాభిమానం. నా తెలంగాణ భాషాభిమానం. తెల్వని పేర్లు పలికి సానికి పోయేది లేదు. సడకు మీద తట్టుకొని పడేది లేదు. ఐతే ఆ పూలేoటియంటే – పట్టుకుచ్చులు. సెరువు కట్ట పొంట నెత్తిన బతుకమ్మని సింగిడోలే ఎత్తుకపోతుంటే మా కనుకవ్వ శవరం కొప్పున మిలుక్కుమనే ఎర్రని చుక్క ( నక్షత్రం) పట్టుకుచ్చు పువ్వు.
మా ఊరికిపోయినప్పుడల్లా మా అవ్వ కనుకవ్వ అంటది ‘పెద్ద చదువులే పదారు పద్దెనిమిది దాక సదివితివి. పెద్ద సారువే అయితివి. కొంచెమంత సానిగా మాట్లాడుతేంది బిడ్డా. పురాగా సదువుకోనోని లెక్క మాట్లాడవడితివి. పది పాస్ కానోడు సుత డిళ్ళకుగామాట్లాడ్తరు ఒక్కొక్కలు“ అని నొచ్చుకుంటది నా భాష చూసి.
నిజానికి నా భాష మా అవ్వ భాషే. మా బాపు అప్పట్లో ఐదు దాకా చదుకున్నోడు కాబట్టి, పేపరో గీపరో చదివే అలవాటు ఉంది. కాబట్టి పుస్తక భాష కొంచెం ఉంటది. కానీ మా అవ్వది అచ్చ తెలంగాణ భాష. అందుకే మనం మాట్లాడేది మాతృ భాషనే. తల్లి బాసనే.
నేను నా ఊరికి పాసి పదేండ్లు దాటింది.
ఈ పదేండ్లలో ఊరి పరిస్థితి ఆర్ధిక, రాజకీయ ,సామాజిక విషయాలలో ఇంకా అధ్వానమై ఉంటదని నా ఆలోచన. కాని నేను నిత్యం నా ఉద్యోగం ప్రజల మధ్యనే కాబట్టి ఊరి గురించి మాట్లాడే జ్ఞానం నాకుందని భావిస్తున్నాను.
పదేండ్ల కింద మా ఇంట్లో రంగుల బతుకమ్మ ఆలోచనే లేకుండే. రోహిణిలో లేదా ముర్ఖశీలలో వర్షం రాంగానే మా ఇంట్లో ఉట్టికి కట్టిన లేదా దుగుట్లో పెట్టిన పాత బట్ట పేగులో కట్టిన ఇత్తునపు గింజల్ని( బీర, చిక్కుడు, గుమ్మడి, గోరంట, పట్టుకుచ్చులు ఇంట్లో సరానికి, దూలాలకి కట్టి ఉంచిన ఆనిక్కాయ (సోరకాయ) ని తీసి ఇంటి దగ్గర అంపుల నీళ్ళు పోయే కొస్సకు, గోడ పొంట, మా ఇంటికి పక్కొల్ల ఇంటికి మద్య ఉండే దడి పొంట మద్య బండల పొంట, పొలము కాడి తుమ్మ చెట్టు కింద బాయి చుట్టూ మా అవ్వ చెట్ల గుడ్డాలు పెడుతున్నా అని తడి నేలని కొడవలి కొస్సతో పొడుసుకుంట ఆ పొక్కలల్ల గింజలు వేసేది. అవే బొడ్దమ్మ వరకు పూలు పూసేది. బొడ్డమ్మకి పెద్దగా పూలవసరం లేదు. పైగా వాడ మొత్తానికి ఒక్కటే బొడ్డమ్మ. వినాయకుడు నీల్లల్ల పడ్డంక తిరుగు వారం రోజు కుమ్మరి మట్టి లేక పుట్ట మన్నుతో చేసే బొడ్దమ్మ ఆట మొదలైనప్పటి నుండే మా ఇంట్లో మా అవ్వ బాపు అక్కలందరూ మా పొలం పనులకు, మక్క పెరడు కాడికి లేదా వంతుల కిందా లేదా కైకిలి కి పోయినపుడు పని మద్యలో లేదా తిరిగి ఇంటికచ్చేటప్పటి నుండే తొవ్వలో కనిపించే పోలాలెంబడి గట్ల పొంట బీడు భూములల్ల కన్పించే గునుగు కోసుకచ్చి ఇంట్లో మూలకి కోల్ల అంచెలు, గంపలు పక్కన వేసేది.
ఎంగిలి పూల బతుకమ్మ రోజు మామూలుగా కేవలం గుమ్మడి పూలు లేదా కట్ల పూలతోనే చిన్న బతుకమ్మని పేర్చేది. రోజూ అంతే. ఐతే అసలు సంగతంతా పెద్ద బతుకమ్మ రోజే ఉంటది. ఈ పెద్ద బతుకమ్మ రోజు కోసమే గత పది రోజులుగా కోసుకోస్తున్న గునుక పువ్వుని ఆరబెట్టడం, కత్తిరియ్యడం , కట్టలు కట్టడం చేత్తరు. తాంబాలంలో లైన్ కో సహజ రంగు కోసం గుమ్మడాకులు, బీరాకులు (పచ్చని, గ్రీన్, గునుగు తెలుపు), పట్టుకుచ్చులు (ఎరుపు), బంతిపూలు, తంగేడు పూలు (పసుపు), కట్లపూలు (నీలి), గోరంట పూలు (గులాబి) పైన గుమ్మడి పువ్వుతోని బొడ్డెమ్మని పెట్టి రీల్ దారపు ఉండ తో కట్టి ఊదుబత్తులు అంటుపెట్టి రాయేషుని గురిగి ఉన్న దుగుడు దగ్గర పెట్టి ఉంచెటోల్లం.
పెద్ద బతుకమ్మని తయారు చేసుడు, ఆడవాళ్ళ నెత్తిల చుట్టబట్ట పెట్టి బతుకమ్మ పెట్టుడు. చెరువు కాడా మళ్ళీ నీళ్ళల్లా పడేసుడు అంతా మగాళ్ళదే మా బాపుదే ఆ పని.
ఈ మద్య కావాలనే తొమ్మిది రోజుల బతుకమ్మని సహజంగా ఆడే బతుకమ్మకి, కొత్త కొత్త పేర్లు సృష్టించి ప్రచారం చేసి బ్రాహ్మణీకరించాలనే ప్రయత్నం చేస్తుండ్రు.
దాండియా నృత్యాలు, డీజేలు పెట్టి ఎగరడం బీసీల, బహుజనుల, శూద్రుల, శ్రమ సంస్కృతినే అవహేళన చేయడమే. అది బతుకమ్మకే అవమానం. శ్రమజీవుల ఆట దగ్గరికి మహిళల రూపంలో బ్రాహ్మణులు రావడం, మంత్రాలు చదవడం, అటువంటి పద్దతులో వస్తే వెంటనే వ్యతిరేకించాలి.
నా ధృష్టిలో బతుకమ్మ కేవలం శ్రమని చేసే మహిళల పండుగ. మగాళ్ళకి దూరంగా తమ కష్టాల్ని, దు:ఖాలని, సంతోషాలని, రహస్యాలని, పాటల రూపంలో, చప్పట్లు కొడుతూ ఆడుకునే పండుగ. ఇదెప్పుడో పుట్టిందో తెలువదు. కానీ బహుశా గజ్జె పుట్టక ముందే పుట్టి ఉండాలి. లేదా కేవలం మహిళల పండుగ కాబట్టి ఎలాంటి శబ్ధ వాయిధ్యాలు వాడుకంలో లేకుండాలి. ఇది ఇక్కడి మూలవాసుల పండగ. ఇన్ని శతాబ్దాలుగా తన రూపాన్ని మార్చుకోకుండా వస్తున్న బతుకమ్మ ని గత పది సంవత్సరాలుగా మసి చేసే, మాయం చేసే ప్రయత్నాలు నడుస్తున్నాయి. ఈ సంవత్సరమే మంచెర్యాల్ లో కోలాటం నేర్పే బ్యాచ్ ఒకటి ఉడుం లెక్క మా ఇంట్ల సొచ్చింది. నా బార్య బిడ్డ ఈ బతుకమ్మకి ముందే నెల రోజులుగా కోలాటం , దాండియా నేర్చుకున్నారు. మా ఊళ్ళో మా మేన కోడలు పరిస్థితి సేమ్. కష్ట సుఖాల, జ్ఞానాన్ని పంచుకునే బతుకమ్మ డీజే సౌండ్ లకి సహజమైన బతుకమ్మ చప్పట్లని మరచి పాటలని మరచి వేరే రూపంలోకి మారిపోతుంది.
నా జ్ఞాపకాల వరకు 1988కి ముందు….
పాత సర్పంచు దొరని రాత్రి పూట సీపీఐ ( సిపాయోల్లు) కార్యకర్తలు బడి బియ్యము దొంగతనంగా ఎత్తుకపోతుండ్రని దొరకబట్టి కొట్టి గ్రామ పంచాయితీ ఆఫీసులో కట్టేసి తెల్లారి పోలీసులకు అప్పజెప్పినందుకు దొర సిగ్గుతో ఊరిడిచిపోయిండు. దానితో వాళ్ళ అన్న కొడుకు ఊరంతా చిన్నదొరగా పిల్చుకునే దొర పెద్ద కొడుకు కాంగ్రెస్ నుండి ఎన్నికల్లో నిలవడ్డడు. పోటీగా తెలుగుదేశం పార్టీ నుండి ముదిరాజ్ కులానికి చెందిన పిట్టల నర్సయ్య, సీపీఐ నుండి మున్నూరుకాపు ఆది మధుసూదన్ నిలబడ్డరు. దొరే గెల్సిండు మళ్లీ.
పెద్ద బతుకమ్మ రోజు సాయంత్రం పూట పంచాయితీ డప్పు సప్పుడు పెట్టించేది ( దూదేకుల బ్రాస్ బ్యాండ్ ). ఊరు ఊరంతా మడక రాఘవరెడ్డి దొర ఇంటి దగ్గర గుండ్ల ( చిన్న గుట్ట లాంటి రాళ్ళు) కాడ అందరు ఆడేది. వ్యవసాయం చేసే రెడ్డి కుటుంబాలు కూడా ఆడినప్పటికి బతుకమ్మ అంటే బీసీ కులాలదే. (మా ఊరిలో దొరలు, చౌదరి, రెడ్డిలు. వెలుమలు లేరు.) మాదిగ, మాల, ఫక్కీర్ కుటుంబాలు సత్తు అడుక్కునేడివి అక్కడ. దొరల కుటుంబాలల్లో నుండి దొరసానులు చూడడానికి వచ్చేది బతుకమ్మని. వాళ్ళింట్లో పాలేరులు లేదా పాలేరుల బార్యలు లేదా వాల్లిండ్లల్ల పనిచేసే ఆడవాల్లు బతుకమ్మలు ఎత్తుకచ్చేది. మొత్తానికి మా ఊళ్ళో బతుకమ్మ బీసీ కుటుంబాలదే మొదట. చాకలి వాళ్లకి కొత్త చీరెలు లేకుంటే ఇంటి ఆమెని అడిగి ఆ ఒక్క రోజు ఉతకడానికి వేసిన మంచి చీరెని ఆపుకొని కట్టుకునేది.
“ఇద్దరక్క చెల్లండ్లని ఉయ్యాలో ఒక్కూరికిచ్చిరుయ్యాలో
ఒక్కడే మాయన్న ఉయ్యాలో చూసన్న పోడాయే ఉయ్యాలో
ఒక్కేసి పువ్వేసి చందమామ ఒకజాము పొద్దాయే చందమామ
ఒకజాము పొద్దుకి చందమామ శివుడాచ్చే వేలాయే చందమామ
“ఇద్దరన్నదమ్ములు ఉయ్యాలో బాయి తొడియ్యంగా ఉయ్యాలో
బాయిలో ఉన్నది ఉయ్యాలో బంగారి బిందె ఉయ్యాలో
“ ఏమేమి పూవప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ
గుమ్మడి పూవప్పునే గౌరమ్మ గుమ్మడి కాయప్పునే గౌరమ్మ
ఐతే మా ఊళ్ళోనైతే కమ్యూనిస్ట్ పార్టీ ప్రభావంతో బీసీలు ముఖ్యంగా మున్నూరుకాపు, పద్మశాలీ, ముదిరాజ్ లాంటి కుటుంబాలు 1985 నాటికే దళితుల ఇండ్లల్లో తినడం పార్టీ సిద్ధాంతాలు జనాల్లోకి పోవడంతో వచ్చిన చైతన్యంతో 1990 నాటికి దళితులు ఊరవతలి పెద్ద చెరువు మత్తడి దగ్గర ఆడడం మొదలు పెట్టిండ్రు. వారికి రెగ్యులర్ బతకమ్మ పాటలు పెద్దగా రాకపోవడంతోనో, ఇష్టం లేకనో విప్లవ గీతాలని మార్చి పాడేవారు. బీసీ కులాల కమ్యూనిస్ట్ మహిళలు కొందరు వెళ్ళి అక్కడ ఆడేవారు. వాళ్ళ ఆటని ప్రోత్సహించుటకు కమ్యూనిస్ట్ పార్టీ బలం పెంచుటకు.
“ కొంగు నడుముకు చుట్టవే బతుకమ్మ కొడవళ్ళు చేపట్టవే బతుకమ్మ
“ రక్షక భటులంటూ భక్షక భటులచ్చి నీ మానముని దోచిరా బతుకమ్మ
నీ ప్రాణముని తీసిరా బతుకమ్మ”
1990 నాటికి ఎస్సీలు, బీసీలు కలిసి బతుకమ్మ ఆడే పరిస్థితులు వచ్చినాయి. బీసీల, శూధ్రుల బతుకమ్మ కాస్తా బహుజన బతుకమ్మగా మారింది.
1994 నాటికి స్థానిక సంస్థలల్లోవచ్చిన రిజర్వేషన్ వల్ల బీసీ మహిళా ముదిరాజ్ సర్పంచు కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికయింది. ఆమె చేతిలో పద్మశాలి సీపీఐ మహిళా కేవలం ఐదు ఓట్ల తేడాతో ఓడిపోయింది.
దొరల పెత్తనమే ఉన్నా, వారి కనుసన్నులల్లో సర్పంచు నడిచినా గాని ఈ కాలంలో మడక రాఘవరెడ్డి దొర (మాజీ సర్పంచ్ 25 యేండ్లు) ఇంటి దగ్గరి గుండ్లల్ల సాఫ్ చేయించకపోవడంతో, ఆసక్తి చూపకపోవడంతో ఎస్సీలు, బీసీలు కలిసి ఊరి పెచ్చెరువు (పెద్ద చెరువు ) పై వేరు వేరు గుంపులుగా ఐనా సరే ఆడడం మొదలు పెట్టిండ్రు. మిగతా దొరల కుటుంబాలు వారికి దగ్గరగా, ఆ వాడదిక్కు ఉండే ( ఎల్లాపి, గొల్ల కురుమ, పద్మశాలి, విశ్వబ్రాహ్మణ) కుటుంబాలు ఊరి మొదట్లో ఉండే దానకుంట చెరువుపై ఆడడం మొదలుపెట్టిండ్రు. పెద్ద చెరువు దగ్గరి బతుకమ్మలో పాత సాహిత్యం పోయి కొత్త పాటలు చేరినాయి. నిషేధం ఉండడంతో విప్లవ పార్టీల పాటలు ప్రకృతి, పంటలు, కోతలు లాంటి వాటి గురించి మాట్లాడుతూనే అందులో పోరాటం గురించిన సాహిత్యం ఉండేది.
“ పొద్దూ పొద్దున లేసి
పొలమెల్లినాడే – పొలమెల్లినాడే
…..
…..
ఆనల్ల ముసురుల్లా నారే మోసిండే
నారే మోసిండే
…..
దొరని ఇంటికాడ దొరకబట్టిండ్లే
దొరకబట్టిండ్లే “
“మీ ఇంటెనుక మా ఇంటెనుక – ఓరస్సాగుమ్మడి
ఏమి గుడ్డలు బోద్దామక్క – ఓరస్సాగుమ్మడి
….
….
గట్ల నుండి చెట్ల దాకా – ఓరస్సాగుమ్మడి
చెట్లనుండి చెలుకా దాకా- ఓరస్సాగుమ్మడి
ఊరిదొరలు పంచుకున్నారు – ఓరస్సాగుమ్మడి
…
…
భయము లేదు గీయము లేదు ఓరస్సాగుమ్మడి
భూములుంటే గుడ్డాలుంటాయి – ఓరస్సాగుమ్మడి “
“మల్లె చెట్టు కిందీకెళ్లి మదానో నా వొయ్యారి
పొయ్యేటోల్లు ఎవ్వారయ్యా మదానో నా వొయ్యారి
పోయేటోల్లు —— మదానో నా వొయ్యారి “
అలా బీసీల, దళితుల బహుజన బతుకమ్మగా కాస్తా పోరాట బతుకమ్మగా మారింది. కేవలం వాళ్ళ బాధలని వెళ్ళబుచ్చుకునే, సంబరపడే, వ్యంగ్యంగా సమాజం మీద కసి ని తీర్చుకునే తీరొక్క పూల బతుకమ్మ పోరాట బతుకమ్మ గా మారింది. ఆ బతుకమ్మ ఏర్పర్చిన సమ్మేళనం వల్ల, సంఘటితం వల్ల ఊళ్ళో అనేక మార్పులు జరిగినాయి. మహిళా సంఘాలు ఏర్పడ్డవి. అనేక సంఘటనలు ఊళ్ళో ప్రజా కోర్ట్ లో పరిష్కారమయ్యేడివి.
సారా వ్యతిరేకంగా ఉద్యమం మొదలు పెట్టిండ్రు. తాలూకా ఆఫీస్ ముట్టడికి సుల్తానాబాద్ పోతే లాఠీ చార్జి దెబ్బలు తిన్నరు ఆడొల్లు మొగోళ్ళు. ఈ సంఘటనలోనే ఆది మధుసూదన్, తాళ్ళపెళ్లి లక్ష్మణ్ లని ఏ కీలుకి ఆ కీలు విరిచిండ్రు.
మంచాల శెపమై పన్నరు కొన్ని రోజులు వాళ్ళు. అప్పటికే అట్రాసిటీ చట్టం వచ్చింది. కమ్యూనిస్ట్ నాయకుడు తాళ్లపల్లి లక్ష్మణ్ బీసీ లకు చట్టం గురించి అవగాహన చేయించేవాడే తప్ప ఎవరి మీద కేసులు పెట్టించలేదు. పెట్టినా కానీ డ్రాప్ చేయించేవాడు. అందుకే అతనొక దళిత నాయకుడు కాదు. అందరి నాయకుడిగా మారిండు. కానీ అదే చట్టం తెలిసిన ఒక ఎస్సై తన మీద మాట జారినందుకు అందరి ముందు గళ్ళ పట్టిండు. క్షమాపణలు చెప్పిండు ఆ ఎస్సై.
అప్పటికి గత ఐదు ఏండ్లుగా అధికారం ప్రత్యక్షంగా తమ చేతిలో లేకపోవడంతో ఊరిలో నక్షల్లైట్ల కార్యకలాపాలు పెరిగి గ్రామ పంచాయితీ ఆఫీసు దగ్గర అర్ధ రాత్రి ఎనుకౌంటర్ జరగడంతో, పొత్కపల్లి పోలీసు స్టేషన్ పేల్చివేయడంతో ఇబ్బందుల వల్ల దొరలు పట్టణానికి వెల్లిండ్రు.
ఊళ్ళల్లో ఓపెన్ టూరింగ్ థియేటరులు మాయామయినవి. తెల్ల కల్లు, సారా దుఖానాల స్థానంలో 1996 లో వైన్ షాప్ లు, బెల్ట్ షాప్ లు వచ్చినాయి. పది పాస్ అయ్యే విద్యార్థుల సంఖ్య పెరిగింది. పట్టణాలు చేరిన దొరలు సినీమా టాకీసులు, కాలేజీలు, వైన్స్ లాంటి బిజినెసులు చేసిండ్రు.
ఆ ఊళ్ళో కమ్యూనిస్టు పార్టీ స్థాపకులు కమ్యూనిస్ట్ పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల్లాంటి ఎన్నో దెబ్బలు తిని త్యాగాలు చేసిన ఆది మధుసూదన్ మున్నూరుకాపు, తాళ్లపల్లి లక్ష్మణ్, మాదిగ యువకులు 35 ఏండ్ల వయసులో ఆదర్శ వివాహం, స్టేజి మ్యారేజి కట్నం తీసుకోకుండా చేసుకున్నారు.
2001 నాటికి ఎస్సీ రిజర్వేషన్ కావడంతో కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన తాళ్ళపెళ్లి లక్ష్మణ్ పోటీ చేసిండు. దొరలు కొత్తగా పుట్టిన పార్టీలో చేరీ చీరలు జాకీట్లతో ఊళ్ళోకచ్చి పంచీర్రు. కానీ జనం ఏకపక్షంగా భారీ మెజార్టీతో కమ్యూనిస్ట్ సర్పంచు ని గెల్పించిండ్రు. సర్పంచు అయినంక రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా మొదట దొర గడి గోడ ముందు నిలవడి కూలగొట్టించిండు ఆ కమ్యూనిస్ట్ సర్పంచు. ఆ తర్వాత ఊళ్ళోకి ఇసుక రెడ్డి దొర బయటి నుండి వచ్చిండు. మానేరు ఇసుక కాంట్రాక్టర్. ఊళ్ళోకెళ్లి ఇసుక తీసుకపోతంటే ఊరు ఊరంతా తిరగబడింది.
ముఖ్యంగా ఆ ఇసుక పోవాలంటే మానేరు ఒడ్డుమీదనున్న దొర భూములకెళ్లి పోయే సదర్ తొవ్వనే. దొర ఊళ్ళోకెళ్లి ఇసుక పోవడమే తప్పని ముందుకొచ్చి లొల్లి చేసిండు. దొర వెంట దొర అండ చూసుకొని ఊరోళ్ళందరూ తిరగబడ్డారు. వెహికల్ లల్లో గాలి తీసిర్రు. వాహనాలు ధ్వంసం చేసిండ్రు. బండoదుకొని కాంట్రాక్టర్ మీద ఎత్తెయ్యబోయింది గౌండ్ల తోట బుచ్చిమల్లవ్వ. తాటిపెళ్లి ఆయిలన్న, వుడిగే సదయ్య, రాయిళ్ల ఓదెలుతో పాటు అందరి మీద కేసులయినయి.
పలుకుబడి ఉన్నోళ్ళు బయటపడ్డరు. ఒక్కొక్కలని తీసుకపోయి రోకలి బండలేసి తొక్కిర్రు. ఎవరిని వదిలిపెట్టలే. వినాయకుని మండపం దగ్గర పండుకున్నోల్లని కూడా అర్ధరాత్రి పట్టుకపోయిండ్రు. దొర కి కాంట్రాక్టర్ కి మధ్య తొవ్వ గురించి ఒప్పంధం కుదిరింది. ఆ తర్వాత వార్డ్ మెంబర్ లకి సర్పంచ్ అందరితో మాట్లాడి గ్రామ పంచాయితీ తీర్మానం చేసిండ్రు. ఆ ఇసుక కాంట్రాక్టర్ 2004లో కొత్త పార్టీ నుండి టిక్కెట్ ఆశించి రాకపోవడంతో అదే పార్టీ రంగు బ్యానరులతో కరీంనగర్ నుండి స్వతంత్ర ఎమ్మెల్యేగా పోటీ చేసిండు.
మా దొర ఊళ్ళోకొచ్చి కొత్త పార్టీ తరపున మాట్లాడడం మొదలుపెట్టిండు. మానేరు ఇసుక తీసుక పోవుడు మొదలు కనుకుల గుట్టలు మొత్తం ఆంధ్రోడే ఎత్తుకపోతుండని, మన నిధులు, నీళ్ళు, ఉద్యోగాలు అన్ని దోపిడీకి గురవుతున్నాయని ఉపన్యాసం ఇచ్చుడు మొదలు పెట్టిండు. వాళ్ళ తమ్ముడికి సంబంధించిన ఒక చిన్న కుటుంబ గొడవల్లో సర్పంచ్ ని వాళ్ళ కులస్తులే తీవ్రంగా కొట్టిండ్రు. సచ్చిపోయిండని వదిలేసిపోయిండ్రు. వాళ్ళకి కొత్త పార్టీ సపోర్ట్ ఉంది. సర్పంచ్ ఆరు నెలలు మంచానికి పరిమితం అయిండు.
ఈ లోగా ఊరు ఊరంతా దుబ్బ మన్ను మశానం. ఇసుక లారీలకు అంతు లేదు పొంతు లేదు. సర్పంచు మీద విమర్శలు మొదలైనయి. అతని వ్యక్తిత్వం గురించి కామెంట్లు చేయడం మొదలుబెట్టిండ్రు. కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వస్తే ఏమో జరుగుతుందన్నా భ్రమలు పోయి జనానికి జై తెలంగాణ నినాదం మంచిగనిపించింది. 2003లో ఊళ్ళోకి హార్వెస్టర్ ( వరికోత మిషన్ ) వచ్చింది. ఊరిలోని కూలీలకు గుత్త పనులు పట్టుకొని ఎక్కువ కట్టం చేసుకొని బ్రతికే కూలి కుటుంబాల నోట్లో మన్ను పడింది.
అప్పుడు కాకతీయ యూనివర్సిటీలో చదువుతున్న నేను ఇంటికొచ్చినప్పుడు ఏమైంది మీ కమ్యూనిస్ట్ పార్టీ, కార్మిక కర్షక పార్టీ? అని మా బాపుని అడిగిన. కర్షకులకి మంచిదే కదా. ఆరుగాలం కష్టపడ్డంకా కల్లములల్లో, వానాకో వరదకో పోయే వడ్లు గింజ లేకుంట ఇంట్ల పడుతున్నయి. కూలిలోళ్ళకి ఏదైనా తొవ్వ చూడాలే అన్నడు. పైగా బ్యాంక్ లోనుతో ట్రాక్టర్ కొనుక్కున్న మా అన్న ఆ హార్వెష్టర్ యజమానితో మిషన్ కోసిన పంట వడ్లని ఇండ్లల్లకి జారకొట్టే ఒప్పందం చేసుకున్నడు.
కుల వృత్తులు పోయినయి. కూలీలు పోయినయి. పెండ్లీలు చేయలేక అనేక మంది బీసీ కులాల అమ్మాయిలు కులాంతర ప్రేమ వివాహాలు చేసుకున్నారు. పరువు హత్యలు జరిగినయి.
ఇప్పుడు దొర కొత్త పార్టీ ప్రతినిధి ఊరిలో. అంతకు ముందు బీసీ వ్యక్తి బిరుదు రాజమల్లు (మున్నూరు కాపు- తెలుగు దేశం పార్టీ ) ఎమ్మెల్యే 1994లో మా నియోజకవర్గానికి. దొరలు ఊల్లల్లకి పోవడానికి భయపడే సందర్భంలో బైకుల మీద తిరిగే అందరితో రాజమల్లన్న అని పిలిపించుకొబడే వ్యక్తి ఆయన. ఏదో ఊరిలో దొర వర్గీయులతో చిన్న గొడవ జరిగితే ఎమ్మెల్యే తాగి వచ్చి గొడవ చేసిండని ప్రముఖ పత్రికల మేన్ మొదటి పేజీల్లో వచ్చింది. బిరుదు రాజమల్లుకి 1999లో బీజేపీ తో పొత్తులో భాగంగా టీడీపీ టిక్కెటివ్వలేదు. బీజేపీ రెడ్డి గెలిచిండు. 1994 లో బిరుదు రాజమల్లు చేతిలో ఓడిపోయిన నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రెడ్డి దొర కాంగ్రెస్ నుండి కొత్త పార్టీలోకి చేరిండు.
2004లో మళ్ళీ ఎన్నికలొచ్చినయి. కాంగ్రెస్ రెడ్డి దొర కొత్త పార్టీ నుండి ఎమ్మెల్యే గా, స్థానిక సంస్థల్లో వాళ్ళ ప్రతినిధులే గెల్చిండ్రు. మా ఊరి పాత సర్పంచ్ దొర ఊళ్ళోకచ్చి కూలగొట్టబడ్డ గడీ గోడల్ని సదిరి వెనుకకి జరిగి మళ్ళీ కొత్త గోడ పెట్టుకున్నడు. సున్నాలేయించిండు. ప్రస్తుత సర్పంచ్ గౌడ్ వారి పార్టీ, వాళ్ళకి అనుకూలుడే. మళ్ళీ దొర ఇంటికి మంది పోవుడు మొదలెట్టిండ్రు. బతుకమ్మ తెలంగాణ పోరాట సాంస్కృతిక చిహ్నమయింది. దొర బతుకమ్మ ఏర్పాట్లు చేయించిండు. బతుకమ్మలకి ప్రైజులు ప్రకటించిండు.
ఆ రోజు పెద్ద బతుకమ్మ దొర ఇంటి ముందు బ్యాండ్ సప్పుడు మోగింది. దొరసాని ఇంతకు ముందులా కాకుండా తానే స్వయంగా నెత్తి మీద బతుకమ్మ ఎత్తుకొని అడుగు బయట పెట్టింది. ఆమె అంతకు ముందు దొరసానులాలెక్క కాదు . పట్నం చూసినమే.సదువ్వుకున్నామే. మనుషులని సదివినామే. ఆమె చుట్టూ పది మంది బీసీ మహిళలు, ఐదుగురు దళిత మహిళలు చేరిండ్రు. అందరినీ ఆత్మీయంగా మందలిస్తూ మాట్లాడుతది. అన్ని రోజులు కమ్యూనిస్ట్ పార్టీలో చేసి నిరాశ చెందిన చీఫ్ లిక్కర్ మందు తాగుడుకి అలవాటు ఐనా ఓ సీనియర్ కార్యకర్త దొరని, దొరసానిని చూసి ఈల వేసుకుంటా ఎదురుగా పోయి ఎగురుడు మొదలు పెట్టిండు. గతంలో దొరకి పడని ఇంకో దొర, దగ్గరి బెల్ట్ షాపుల్లో చీఫ్ లిక్కరు తీసుకుంటండు జనం కోసం.
ఐతే ఇవన్నీ ఒక ఎత్తు. ఆ బతుకమ్మ పైన ఉన్న జెండా ఒకెత్తు. అంతకు ముందు ఎర్రజెండాని చూసి శివాలెత్తిన జనం అదే బాణీలో కొత్త పాటలందుకున్నరు.
“అరె అయ్యోనివా నువ్వు అవ్వోడివా తెలంగాణానికి తోటి పాలోడివా “
“ తెలంగాణ వచ్చే దాకా తెగించి కొట్లాడుడే “
అనుకుంటా పాడుకుంటా బతుకమ్మని ముందుకి తీసుకపోతుండ్రు.
కొద్ది సేపట్లో దొరసాని ఎత్తుకొస్తున్న బతుకమ్మ ముందు ఉసీల్ల పుట్టలెక్క చేరిండ్రు జనం. పెద్ద బతుకమ్మ మునుపెన్నడూ లేనంత వేడుకగా సాగిపోతంది. మాదిగల డప్పుల చప్పుళ్ళు, ఒగ్గు డోల్లు, బ్యాండ్ చప్పుళ్లతో మునుపెన్నడూ ఎరగనంత గొప్పగా ఊరి నుండి బయలుదేరి పెచ్చెరువు కట్ట దిశగా సాగుతుంది మా ఊరి సద్దుల బతుకమ్మ.