మార్పు

సాకలవ్వ ఊరు దిరిగిపోయింది. మునిమాపు తిరిగిపోయింది. చంద్రుడు చింత కేలాడ దీసినట్టుగున్నాడు. చిమ్మెట్లు ఉండీ ఉండీ పలుకుతున్నాయి. సన్నగా పైరగాలి తోలుతున్నది.

వాకిట్లో వియ్యంకులిద్దరు నుల కమంచాలల్లో పండుకొన్నారు. పిల్ల ఏదో ఆటకు సంబంధించిన పాట పాడిపాడి నిదురబోయింది.

“అయితే బావా! గట్లయ్యందన్నమాట. ఏమైన దురుజెట్ట కాలమచ్చింది. కాదంటవా?” సాంబయ్య తుపుక్కున మంచం కింద ఊంచి గంగయ్యవేపు తిరిగిండు.

మంచంలో పక్కగోలుగా పండుకొని సుట్ట తాక్కుంట ఎర్రగా మెరుస్తున్న సుట్ట కొరుకునే సూస్తున్న గంగయ్య మాట్లాడలేదు. నిజానికి అతని మనుసు ఇక్కడ లేదు. పట్నపు బజార్లలో అక్కడి నుండి సబ్ జైల్లోని కొడుకు మీదున్నది.


“మనకెందుకు బావా! ఆవు లావులు కొట్లాట్లై లేగల కాళ్ళరిగినట్టు – అచ్చేటిది రాకమానదు. ఎనుకటినుంచచ్చె ఇలవరిసె గిప్పుడు ఒక్క పెట్టున మారదా? సంక లేవడితె ఖార్జం కండ్లబడ్డది. దొరలంటే కొండల కొంటోల్లు – దున్నపోతు గట్టుతోని పోట్లాటబెట్టు కున్నట్టు – డబ్బు, ఇజ్జె, ఖానూన్లు, కచ్చీర్లు మంది మార్బలం గలిగినోల్లు. గాళ్ళతోని ఇరోధం బెట్టుకుంటే మన బతుకేమయిద్ది? ఆకుకు అందకుంట పోకకు పొందకుంటయి పోద్ది – నాకైతే ఎటుసూసిన గిందట ఫాయిదా కనిపిత్తలేదు. అల్లుడంటె జెరుచ్చిలి మనిషి – నువ్వన్నజెర కొడుకు బుద్దిగానెం సెప్పద్దా? గౌరవ్వ ఏడ్చేడ్సి సగమైతంది. ఏం భాగెమచ్చె”. సాంబయ్య ఇట్ల ఏదో చెప్పుతూనే ఉన్నాడు.

అయినా గంగయ్య మాట్లాడలేదు. అతని మనుసులో ఎన్నెన్నో విషయాలు కలివిడిగా, విడివిడిగా తిరుగుతున్నాయి. చుట్ట నేలమీద రాసి ఆర్పి మంచంలో లేచి కూర్చున్నాడు. పందిరి గుంజకు అతుక్కుపోయి కోడలు గౌరమ్మ మాటా పలుకు లేకుండా నిలబడున్నది. చింతమీద చంద్రుడు పాండురోగం సోకినవాని తీరుగా పాలిపోయి వెలుగుతున్నాడు. ఆ వెలుతురులో గౌరమ్మ సగం మాత్రమే కనిపిస్తోంది. మిగితా సగం పందిరికింది నీడలో కలిసిపోయింది.

గుడి సెలోపల గౌరమ్మతల్లి లచ్చిమి గుడ్డి దీపం వెలుతురులో మాడు సెక్కలు కాళ్లు బారజాపుకొని తింటున్నది.

“గౌరవ్వా గిన్నన్ని మంచినీళ్లు దేవే” అన్నాడు గంగయ్య.

గౌరమ్మ కంచు చెంబుతో మంచినీళ్లు తెచ్చి మామకిచ్చింది. నీళ్లు గటగట తాగి చెంబు కోడలుచేతికిస్తూ కోడలు కళ్ళల్లోకి చూశాడు గంగయ్య.

గౌరమ్మ కళ్ళల్లో తడి…

గంగయ్య తల పునుక్కున్నాడు. రెండు చేతులతో తలనొక్కుకుంటూ కాసేపు నేలచూపులు చూశాడు.

మనుసు సుమ్మర్లు చుట్టుకపోతున్నది. “ఎప్పుడత్తడో కొడుకు? వచ్చినా మళ్ళ తకురారు రాదని గ్యారంటేంది? అగ్గిరాజుకున్నంక మంటుండకుండపోద్దా? ఊరినిండా పోలీసోల్లు దిగిండ్లు. పనిపాటలు చేసుకబతకడమే గగనమైపోయింది – నన్ను ముట్టుకోకు నామాల కాకన్నా ఊళ్లెజరిగే తంతు జరుగకపోదు – పోలీసోని దుడ్డుకు గరీబోల్లంత ఒక్కటే! నాకే జికరు లేదన్నోడే అలుకగ దొరుకుతడు – కొడుకు కొండయ్య జేసింది తప్పని కండ్లార సూసుకుంటనే ఎట్లంటడు? అసలు మంచిపనే సేసిండని తనకు తెలుసు. తన గుండెకు తెలుసు. ఊళ్లోల్లందరికి ఎరికే – కని వియ్యంకుని కెట్లజెప్పాలె?”

“సేతులు కాలి బొగ్గలచ్చినంక ఆకులు బట్టుకొనేంభార్గం?” లచ్చిమి కంచం కడుగుతూ అన్నది.

“ఆకులే లేంది ఏం జేత్తమే అవ్వ? ఒడ్డుమీద నిలుసుండి పొలంల బురద గురించి మంచి సెడ్డలు సెప్పచ్చు – మరి బురదలకు దిగందే బువ్వలేదే?” గౌరమ్మ తల్లిని నిలదీసింది.

“నీకూ అచ్చినాది రేషం – నువ్వూ అయింటి కోడలువైతివి. మాసాలు సంబుడం సూడబోతే!” ఎందుకనో మాటలు పూర్తి చేయకుండానే లచ్చిమి గునిసింది.

“నాకైతె పాడు ఎవారము తీర్గనే గన్పట్తోంది బావా! గిప్పుడు గుడ్డచ్చి పిల్లనెక్కిరిచ్చి నట్టు ఆడు దొరగాదు దొంగంటె ఆడుదొర కాకుంటపోతడా? బావా మన సేతుల్లే మున్నది? అంత బమ్మరాసినరాత. ఆని అదురుట్టం గట్లున్నది – ఆడు నోసిపుట్టుకున్నడు. ఆని పున్నెం మంచిది ఆనికి తాతలు తండ్రులు బూములు సంపాయించి యిచ్చిండ్లు. ఎద్దుముఁ బొడుసుక బతికెటోల్లం మనము – మనకు సంఘాలెందుకు, గింగాలెందుకు? ఎనుకటినుంచి మన తాతలు తండ్రులు బతుక లేదా? మనం బతుకుతలేమా? రేపు నీ కొడుకు బతకడా?”

“మా బతుకుతున్నం కుక్క బతుకులు. సచ్చిన మీయవ్వ గిట్లసానా కతలు చెప్పేది…” గౌరమ్మ తండ్రికి ఓమాట తగిలేసింది.

“ఏడువు బిడ్డా! ఏడువు! నీకే గట్లుంటే మజ్జెన నాదేంబోయింది. కడుపు నొచ్చినోడు ఓమ బుక్కుతడు – అల్లునితోటట్టు నువ్వుపోయి జేల్ల కూసుండు మాదేం పోతది.” సాంబయ్య ముఖం ముడుచుకున్నాడు.

“ఇంతకూ నువ్వనేదేందిరా సాంబా?” గంగయ్య సూటిగా చూస్తూ అన్నాడు.

“ఏమంటడూ! దొరలతోని ఇరోధం పెట్టుకోవద్దంటడు – దొరలు మనలను సత్తెనాశిడం జేసిన మన కర్మ అని మూలకు కూకుండుమంటడు – తన తీర్దనే బిడ్డ పెండ్లికి అయిదు నూర్లప్పుదెచ్చి ఏలుముద్దెరేసచ్చి అయి పెరిగి పెరిగి ఎకురం
పెరడి తినికూసుంటె నొసటిరాతని కాలెక్కలు మలుసుక పండుమంటడు” గౌరమ్మ.

“మజ్జన నిన్నెవడు మాట్లాడుమన్నడే?” అంతెత్తు బిడ్డమీదికి లేసిండు సాంబయ్య.

“కట్టమో ! సుకమో మేం గట్ల బతుకుతన్నం – నిన్నెవడు సాకునాలు జెప్పమన్నడు మజ్జెన” గౌరమ్మ పోట్లాటకు దిగింది.


“పిల్లకాక్కేమెరుక ఉండీలదెబ్బ – పోరీ! పుర్రెల పురుగ్గిన మెసులుతందా?” లచ్చిమి కీకలేసింది.

“ఔర సాంబ! దొర మాదండోడు. ఆనికి ఎదురాడద్దు – ఆడు కొట్టినా తిట్టినా, భూములు గుంజుకున్నా, కూల్లెగబెట్టిన – దండుగలుతిన్నా ఆడోల్ల ఖరాబు సేసినా! ఆని ఇట్టా రాజ్జెం సత్తెనాశిడము జేసిన సచ్చినట్టు పడుండాలెననె గదర నీ మాటలకర్థం. పడుంటే మంచిదే. సచ్చినపాము కసోంటిది రేషమత్తది. కని పడుండనోల్ల గురించి నువ్వూ నేను నెత్తి నోరు కొట్టుకుంటె ఆగుతరా? సేనుపండి పంట సేతికచ్చేయాల్లకు రాళ్లవాన గొట్టద్దనుకుంటం. దానికాలమత్తె ఆగుద్దా? ఎండకాలం రాకపోతే మంచి గుండనుకుంటం, రాకమానుతదా!

ఎండకాలమత్తది – సెట్ల ఆకులు రాలిపోతయి. మళ్ల ఆనకాలమత్తది. కొత్త సిగురులు పుట్టుకత్తయ్ -” గంగయ్య ఏదో ఆలోచిస్తున్న వానిలాగా కాసేపాగిండు.

“కోరి కష్టాలు తెచ్చుకోవద్దన్నది మంచిమాటే – మనది కట్టుపు పుటక – గౌరవ్వా పుంజులు గుయ్యంగ లేసి మనూరికి పోదాం – రెండామెడ నడువాలె – కూసంత కూరుకుదియ్యిపో – నువ్వెందుకు ఫికరుపడుతవవ్వా!” అని వియ్యంకుడి ముడుచుకున్న ముఖం చూసి చిన్నగా నవ్విండు.

“ఈ పారి మీ అల్లుడు ఇంటికచ్చినంక మీదగ్గరికే తోలిత్త. అత్త మామగలిసి ఆనికె సెప్పవల్సిందేదో చెప్పుండ్లి” గంగయ్య.

“ఆఁ! అసలు ఆక్కుబోతే తాలు ఎదురెక్కచ్చిందట – కని పెంచిన అవ్వయ్యే కొడుకు జేసేపనికి సంబురపడంటె మజ్జెన మాకే మచ్చె….” లచ్చిమి మెటికలిరిసింది.

“అప్పటినుంచి సూత్తన్న ఇద్దరూ ఒకటే ఇదయిపోతండ్లు. ఇంతకూ ఆడు సేసిన నేరమెందోంట?” గంగయ్య శాంతంగా అన్నాడు.

“అంగి బతుక నిలబడి బతుకుతననటం-” గౌరమ్మ.

“మీరు గోదార్లె అరదల కొట్టుకపోతమంటె మజ్జెన మాకేంది కడుపునొప్పి” సాంబయ్య కంఠంలో తీవ్రత ఉన్నది.
“ఏదో అగైనెంపోరి దానితోనేంది-నేనోకత సెప్పుతినర సాంబా!” గంగయ్య.

“కతలకే మచ్చె-కొడుకు జేల్లకు బోయిండని సిన్నమెత్తురంధి లేదు మనిషికి” సాంబయ్య గొనిగిండు.
“ఛత్ సెవులు గోసిన కుక్కోలే కొడుకో! కొడుకు… కొడుకుకేమయ్యిందిరా! ముందు గీ కతిను…నాకా నిదురచ్చెటట్టులేదు…నేనచ్చిన పనిగా లేదు-” గంగయ్య మాట జారిన్నని నాలిక కొరుక్కున్నడు…


“అచ్చిన పనింకేంది బావా?” సాంబయ్య…

“గదేరా! గీకత నీకెప్పటినుంచో సెప్పాల్ననుకున్న….” గంగయ్య మాట మార్చిండు.
“మామా నేనింట నాకుజెప్పే…” మంచాల పడుకొన్న గౌరమ్మ చెల్లెకు ఎప్పుడు తెలివి బడ్డదో ఉరుకచ్చి గంగయ్య తొడల మీద కూర్చున్నది.

పాలిపోయిన వెన్నెల తేటపడి వెన్నెల వెండిరేకుల్లా పరుచుకొంది. ఎక్కడో ఎవరి దొడ్డిలోనో ఆవు అదే పనిగా దాని మెడలోని బొనుగ ఊపుతోంది. గంగయ్య కథ గునాయించుకుంటున్నవాని లాగా కాసేపు మవునంగా ఉన్నాడు. ఉమ్మేసి చుట్టూ ఉన్న వాళ్ల నందరిని చూశాడు. సాంబయ్య, లచ్చిమి, గౌరమ్మ వినేందుకు సిద్ధంగా వున్నట్టు గమనించి సరాయించి గంగయ్య కథ మొదలు పెట్టాడు.

“దచ్చన్న రాజాన ఓ ఊరట…..” గంగయ్య కంఠం కొంచెం హెచ్చింది. పాట తీరుగా రాగయుక్తంగా చెప్పడం సాగించాడు.

“ఊరెంటే ఊరుగాదు. కూసంత పెద్దూరేనట. గ ఊళ్లే సాకలి, మంగలి, మన్నే, గౌండ్ల, మస్కురు, మాదిగ, ఆడ, కమ్మరి, కుమ్మరి, గొల్ల, కాపు, పెర్క గిట్ల సబ్బండ వర్నాలు బతుకుతున్నరట. ఆగో గసొంటి ఊరికి ఉత్తురాన పెద్ద సెరవు. సెరువు కొమ్ముకు ఊడలమర్రి ఉన్నయ్. మళ్లింక దచ్చెనాన సిన్నఏరు, ఏటి ఒడ్డున మద్ది సెట్లు. మద్ది సెట్లు కీతల తాళ్లతోపు – మరి తూరుపుకు తుమ్మల బీళ్లు దాటితె నల్లరేగల్లు, నల్లరేగల్లు దాటితే టేకువనం ఉన్నయ్.

తూరుపునుంచి పడమటికి సాగిన గుట్ట – గుట్టమీన టేకు, సండ్ర, బిలుగు, కొడిశెలు, సెన్నంగులు, నల్లమద్దులు, నారేపల అడవి ఉన్నదట.” గౌరమ్మ నిప్పుతెచ్చి మామకిచ్చింది. గంగయ్య సుట్టముట్టిచ్చి రెండు దమ్ములు గుంజి రైలింజనులాగా పొగవదిలిండు.

సాంబయ్య చెవులు రిక్కించి వింటండు – చేతులు తుడుసుకుంటచ్చి లచ్చిమి అరుగుబండమీద కూలబడిపోయింది. పిల్ల ఊకొడుతున్నది. గౌరమ్మ వెన్నెలను చూస్తోంది…

“మనం దచ్చినానున్న ఏట్లెదిగి తేటంగ పార్తన్న నీళ్లల్ల మొఖం కడుక్కోని ఒడ్డెక్కుతె మద్ది సెట్లకింద గొడ్డపోరగండ్లు ఆటలాడుకుంట కన్పిత్తరు. కడవలు నెత్తులమీన బెట్టుకొని ముచ్చట్లు బెట్టు కుంట నీళ్లకచ్చె ఆడోళ్ళు కన్పిత్తరు. ఇంకొంచెం ముంగటికి నడిపై తొళ్లు – తాళ్లల్ల మనం బొయ్యె తొవ్వబందుకు తాటికమ్మల గుడిసె. గుడిసె ముంగట నురుగులుగక్కే కల్లు లొట్లు – తాటి రేకలుబట్టి గుట్కీ గుట్కిన కల్లుదాగే మనుషులు – మోకులు భుజాలకేసుకొని ఉరుకులు పరుగులుబెట్టే గౌండ్లోల్లు – గుడిసె ముంగట ఇరిగిన తాటిమాను పక్క సెనిగల గుట్టోడు రాందాసుంటడు. ఆడు మెడలు తిప్పుకుంట ఏదో పదం పాడుతుంటడు. మీ అయ్యకైతె గ పాటలింటె సలిజెరమత్తది. సరేపిల్లా గ గుడిసెదాటి కుసంత దూరం నడిత్తె కూలిపోయిన గుడిశెలు. ఆ గుడిశెళ్ల కుమ్మరోనిల్లు గన్పిత్తది. ఆడ కుమ్మరి పెదలింగయ్య సపుకూ సపుకున కుండలు సరుత్తంటడు. ఆన్నుంచి కూసంత ముంగటికి నడిత్తె అడ్లో లిల్లు. అడ్ల శంభయ్య దెబ్బ దెబ్బకు మూలుగుకుంట పెద్ద బాడిషె ఆడిత్తంటడు. శంభయ్య ఇల్లు దాటితె కమ్మరి రాజయ్య కొలిమి మండుతంటది… గిట్ల ఇల్లిల్లు దిర్కుంటబోతె మూడు పానాదులత్తయి. ఆడ ఆంజనేయుని గుడి – గుడి దాటుతె గూనిండ్లు. గ గూనిండ్ల ముంగట షావుకారి పాపయ్య దుకాన్ల తీరిపారి కూసుండి ఎవన్నో తిడుతాంటడు.

ఆన్నుంచి సీదానడిసి ఉత్తరం కెళ్ళి తిరుగుతె బజారు పెద్దదయితది. గదాంట్ల కొంతదూరం నడితివో పెద్ద మట్టి గోడ గన్పిత్తది. మట్టి గోడపొంట నడుసుకుంట బోతె ఏనుగలంత బండలతోటి గట్టిన పెద్దరువాజ గన్పడ్డది. పగటించయితె గది తెరిసుంటది. నాత్రి బోతె క గమాగిన తలుపులు గన్పడ్తయి. తెరిసున్నప్పుడు లోపటికి సూత్తివా కంటి సూపు అందనంతదూరంల తూరుపు మొఖం చేసిన బంగుళ – బంగళకు ఎడమ, కుడి పక్కల సోలుపుగ సెన్నిండ్లుంటయి.

గట్ల ఇంకా ముంగటికిబోతె ఊరవతల ఇసిరేసినట్టున్న కూలిపోయిన గుడిసెలు మాదుగులయి. మాదిగోళ్ళ గుడిశెలకు కుడిశెయిబాజు మామిడితోట. పెద్ద పెద్ద గడ్డాములు. గడ్డాముల ముంగట గుర్రాల సోవడసొంటి పసుల కొట్టాలు కన్పడ్తయి. గయిదొర కొట్టాలు. కొట్టాల బందుకు ఒక్క దినమంతా గుర్రంమీన కూకుండి ఎంత దిరుగుతవో గన్ని భూములు దొరయి. సెరువెనుక – ఊరుసుట్టు – అన్నీ దొర బూములే. తుమ్మల బీళ్లు దొరయే. ఆటవతలి అయిదునూర్లెకరాల టేకు వనము దొరదే. తుమ్మల బీళ్లల్ల పదిమంది గా సేగొడ్లు, బర్లు మేసుకుంట గన్పడ్తయి.” పిల్ల ఆవులించింది. గంగయ్య మళ్ళీ సుట్ట ముట్టించాడు.

“అవునే సిన్నకోడలా! ఊరంటె ఎట్లుంటదో ఎరికయ్యిందా?”

“కత సెప్పుతనని శాత్రం సెప్పవడితివి. నాకు మాఎరికే గిది ఊరేనాయే” పిల్ల తల్లి దగెరికురికింది.

మిగతా ముగ్గురు ఆసక్తిగా వింటున్నారు.

“దొరంటె దొరగాదు. పెద్ద పులిపంత. తలువారుకట్టు మీసాలు. కడు ముంతలంత చెంపలు. మోకాళ్ళదనుక సేతులు. గొర్లకోళ్ళదిన్న సెత్తాయె. మాదండి సెత్త. ఆరోగసొంటి దొర పేరు గోపాల్ రావు దొర.

గోపాల్రావుదొర లేసుడే బారెడు పొద్దెక్కినంక లేత్తడు. లేసిండంటె సాకలి మల్లయ్య ముంతల నీళ్లుబోసుకొని పాయఖానకాడ తయారుగుండాలె. ఆడికేయి అచ్చిండంటె సాకలి సెంద్రయ్య ఏపపుల్ల బట్టుకొని ఆజరు బలుకాలె. సలసల కాగేనీళ్లు దా సెంకటి పట్టుకరావాలె. మంగలి నంబయ్య కుర్సిదెచ్చేయాలె. గప్పుడు తోలుదీసిచ్చిన ఏప్పుల్ల సుతారంగ నమిలి సలసల మరిగెనీళ్లు సేతులమీన ఎంకటి బోత్తాంటె దొర మొఖం కడుగుతడు. గప్పుడు కాపు అంతమ్మ నవ్వుకుంట మెత్తటి తువ్వాల దేవాలె. గిండ్ల ఏది తక్కువైనా ఎవడు ఎనుకైనా ఆని ఈపు జమిడికె మోత మోగుద్ది…

అగో గట్ల మొకం కడుక్కొని అర్రల కచ్చెటాల్లకు కోడిగుడ్డట్లు గరం గరం గుండాలె. గయి సుందరమ్మ పట్టుకరావాలె. ముంగటున్న బల్ల తళతళ మెరువాలె. గ బల్లమీన గాజుగిలాస బరండి కీసుండాలె. బరండి రెండు పావులేసి ఎనిమిది కోడిగుడ్డట్లు దినేటాల్లకు సుందరమ్మ తువ్వాలందియ్యాలె. సికిలేటు డబ్బ సేతికియ్యాలె. దొరసికిలేటు నోట్లే బెట్టుకుంటె అగ్గి పెట్టెనీకి అంటుబెట్టాలె. గప్పుడు దొర సిట్టసిమాంట నోరిప్పుతడు. సుందరమ్మను తిట్టరానితిట్టుదిట్టి – భయంతోని ముద్దగట్టుక పోయిన సుందరమ్మ బుజాలు పట్టుకొని కుర్సిల నుంచి లేత్తడు.

లేసి బంకులకు నడుత్తడు. ఆడ సుంకరోల్లు, పని పాటలోల్లు అంగంగి దండాలు బెట్టాలె. మంగలి శాయి మల్లయ్య తట్టుకుర్సి దులుపాలె. దొర అంతూ పొంతూ లేకుంట ఊరు పేరు లేకుంట కసిన్ని తిట్లు తిడుతడు. అంచిన మొక మెత్తకుంట ఇనే కాడికిని ‘పోండి’ అంటె సెప్పిన పనిమీద కురుకాలె. గప్పుడు షేక్దారు రాములచ్చి దండంబెట్టి ఊళ్లి ముచ్చట్లు జెప్పాలె. దొర తిట్లతోనే పాలేరోల్లకు పనులు జెప్పుతడు. షేక్దారెల్లిపోయినంక పట్టె నామాల పాసుపండ్ల అయ్యగారు జంజిర ప్పోస తీడుకుంటచ్చి కసేపు దొరను ‘ఇందురినివి – సెందురునివి’ అనుకుంటనే ఊళ్లి ముచ్చట్లు సెప్పి పోతడు. దొర సికిలేటు మీన సికిలేటు అయిదు సికిలేట్లు దాగేటాల్లకు రావాల్సినోల్లచ్చి పోవాలె. అప్పటికి అంబటేల్లయ్యింది.

గప్పుడు మంగలి శాయిమల్లయ్య అరుక్కిందినుంచి అరుగుమీనికెక్కి అనికే సేతులతోని దొరబనీనిప్పాలె – తళతళమెరిసే ఇత్తడిగిన్నెల సబ్బునురుగుబెట్టి – ఆడోల్ల సక్కదనంమీన ముచ్చట్లు బెట్టుకుంట జేగర్తగ గడ్డంగీకాలె. గడ్డం గీకి సలువ సేసిన గుడ్డతోని తుడిసి – గిన్నెల కొబ్బరినూనేసుకొని సల్ల సెముటలు బెట్టంగ మాలీష్ జేయాలె. మాలీషయిపోయిందంటె పది బిందెల ఉడుకు నీళ్లు గంగాళంల బోసుకొని సుందరమ్మ తైన గుండాలె. దొర తానాల అర్రలకచ్చినంక సాకలి సెందురయ్య ఎత్తుపీటెయ్యాలె. పీటమీన కూసుండబెట్టి సుందరమ్మ పరాసికా లాడుకుంట తానం సేపియ్యాలె. సాకలి సెందురయ్య సలువ ధోతి అందియ్యాలె. సుందరమ్మ తువ్వాలతోని ఒళ్లు దుడువాలె. గప్పుడు దొర ధోతి గట్టుకొని బంగుళెక్కుతడు. బంగుళమీన దేవునర్రల ఆరతి పల్లెం, పట్టు సీర గట్టుకొని దొర్సాని తయారుగుంటది. దొర ఆరతి కండ్లకద్దుకొని – దేవునికి దండంబెట్టి – మళ్ల కిందికి దిగుతడు. బోజినాలర్రల – కోడికూర, చాపల పులుసు, మీగడ పెరుగు ఆసన బియ్యపన్నం, జింక ఏపుడు, ఆవునెయ్యి గిట్ల బోజినం బెట్టుకొని దొర్సా నుండాలె. దొర అదింత ఇదింత అంటిముట్టనట్టు దింటడు. దొర్సాని సెయ్యిమీన నీళ్లు బోత్తాంటే – చెయ్యి కడుక్కుంటడు. సుందరమ్మ, తువ్వాలందియ్యాలె. మేడెక్కె టాల్లకు బరండి కీసుండాల, బరండి దాగినంక గలుమ ముంగట సెప్పులుండాలె – సెప్పులు తొడుక్కున్నంక సాకలి సెందురయ్య సేతికి సిమ్మం మూతికట్టె ఇయ్యాలె. దొర బంకుల్ల కచ్చేటాల్లకు సుంకరోడు తయారుగుండాలె. గప్పుడు దొర సైగజేత్తడు. సైగనుబట్టి ఒరుగుడు మెత్తలబండి ఉరికిరావాలె. మొండోడు దొరకు దండంబెట్టి నిలుసోవాలె – దొర సికిలేటు ముట్టించి బండెక్కుతడు. మొండోడు అనికే సేతులతోని ఆరుగట్టె దొర చేతికియ్యాలె. దొర సెప్పులుబట్టుకొని సుంకరోడు ఎనుకురుకాలె. దొర చేతుల ఆరుగట్టె ‘చెల్’ మంటది. కయిలు ముచ్చుకోల్లాగెలు కస్సున ఉరుకాలె. ఆటి ముంగట ఎగపోసుకుంట సుంకరోడురుకాలె.

బండి బహిట్లకచ్చిందంటె మనుషులెవ్వలుండద్దు. ఉంటే గింటే రుమాల్లు బీక్కొని చేతుల పట్టుకొని పబ్బతి బట్టాలె. బండ్లు గిండ్లు ఎదురత్తె బండిపడదునికి పక్కకు బట్టుకోవాలె. ఎవడన్న కానకపోతే ఆని కర్మము బలిగిందే. బండి ఆగకుంట ఉరుకుతాంటది. కాలికుండలు, కట్టెలబండి దొరకెదురత్తె తోలు పికుల గొట్టుడే. నీల్లకడవలెత్తుకొని ఆడిపోరగండ్లు ఎదురయితే ఎటోల్లటు ఉరుకాల్సిందే. దొర నజరు బడ్డదా? గది మాపటికి ఇంటికి రావాల్సిందే – బండి ఊళ్లినుంచి రాంగ – పంచాతులోల్లు, పడావులోల్లు అనుమండ్ల గద్దెకాడ కుప్పకూడుండాలె. ఆడ గుడి సేపు బండాగుతది. ఆడు కూసున్నోల్లు ఒక్క పారే దండాలు బెడుతరు… పంచాతులోల్లు ఏడ్సుకుంట సంగతేందో చెప్పుకుంటరు.

పంచాతు పెద్దదయితే దొర బండి దిగుతడు. సుంకరోడు కాళకింద చెప్పులేత్తడు. కుర్సి పెద్దరయితు మీదిపంచెతోని తుడుత్తడు. తిట్లతోని దొర పంచాతు తెంపుతడు. ఆరుగట్టందుకొని తప్పన్నోన్ని అట్టలు దేలగొడ్తడు – తప్పొప్పులు దొరిట్టమే. దండుగ పైసలు మాలిపటేల్ కీసలబెట్టుకొనిపోయి దొర గుమత్తకియ్యాలె. ఆన్నుంచి బండి తాళ్లల్లకు నడుత్తది. ఆడ బండాగుతె గౌండ్ల పెద్దిరాయుడిరికత్తడు. తాడి సెట్ల మామూల్ల సంగతి సుంకరోడడుగుతడు… ఆన్నుండి బండి కదిలిందంటె గొర్లమంద లెదురయితయి. గొల్ల కొమురయ్య ఉరికత్తడు. సుంకరోడు అంతు గొర్రెపిల్లలడుగుతడు. గొల్లోడు పొడేలును మోసుకపోయి ఇంట్లదించి రావాలె. ఆన్నుంచి బోతె సిల్లర రైతుల కల్లాలత్తయి. బక్క సక్క రైతుల కల్లాలముంగట బండాగుతది. సుంకరోడు బాకీలడుగుతడు. బత్తాలు బండ్లమీన గుమ్ములర్రలకుబోవాలె. బండి సెరువు కట్టెక్కుతె నీరటికాళ్లు బండెనుక ఉరికిరావాలె.

గట్ల బండి సేండ్లు సెలుకలు దిరుక్కొని నెత్తిమీనికి పొద్దచ్చెటాల్లకు ఎడ్ల కొట్టం కాడికి సేరుకుంటది.

కొట్టంకాడ గప్పుడే ‘ఆంబోతు’ మెడలిసురుకుంటది.”

గంగయ్య చెప్పడమాపి సాంబయ్య ముఖంలోకి చూసిండు… లచ్చిమి చెంపకు చెయ్యాన్చుకొని వింటున్నది. గౌరమ్మ వాకిట్లో కూర్చుండి మామ మొఖం పులుకు పులుకున చూస్తున్నది… మామ వెన్నెల రాత్రుల్లు, చలికాలం నెగడిదగ్గర జనాన్ని కు ప్పేసి ఇలాంటి కథలు ఎన్నో చెప్పగా తనూ విన్నది.

గంగయ్య మళ్ళీ చెప్పడం సాగించాడు. –
“ఆంబోతంటె ఆంబోతుగాదు. గుండుకొమ్ములు, ఏనుగుపొట్ట, కయిలి ముచ్చు కొండసొంటి ఊపురం – కాటికెకండ్లు. బొక్కపూసల పంతాడు – ఎడం కాలుకు ఎద్దు సెలితాడు.

రోమంబీకుతె రోమంతోని నెత్తురు జిమ్మాలె. సెయ్యేతే అందనికోడె.

ఓసారి దొర సడ్డకునింటికి సుట్టం సూపుబోయిండు. సడ్డకుడు పొలాలు సేండ్లు దిప్పి గొడ్లమందను సూ పెట్టిండు. గొడ్డమందల ఆంబోతును సూసి దొరకండ్లు నిలబడి పోయినయ్. గమందల గసొంటి కోల్లాగెలు కానున్నయి. తనో ఆంబోతును బెంచాల్నని దొరకు కాయిష్ బడ్డది. గముచ్చెట షేక్దారు రాములుతో నన్నడు.

“ఔనుండ్లి – మన మందల అంబోతులేక అన్ని పొట్టిగిత్తలే ఎదుగుతున్నయ్. మనకు నాగండ్లకు గావాల్నంటే ఏలకేలుబెట్టి ఎడ్లను కొనుడైతంది. మనం అమ్మాల్నంటే గీములక్కాయలకే మత్తది….? నామనుసుల ఎప్పటినుంచో ఆంబోతు గావాల్నని ఉన్నది దొరా” రాములన్నడు.

గప్పుడు దొర మనుషుల తరిమిండు. ఉత్తురంబోయినోడు ఉత్త సేతు లచ్చిండు. దచ్చినంబోయినోడు దీలెపడచ్చిండు. తూరుపు బోయినోడు తిరిగి తిరిగి సచ్చిండు. పడమటికి బోయినోడు పగ్గాన్ని ఆంబోతును నలుగురు మనుషులతోటి పట్టిచ్చు కచ్చిండు. గీ ఆంబోతును సూసేటందుకు ఊరు ఊరంత ఒడ్డున ఒరిగింది. మందిని జూసి ఆంబోతు సింగిబింగాడింది. పట్టెనామాలయ్య గారు ఆపక్క ఈ పక్క జూసి ఆటెన్క పంచాంగంజూసి తిథి నచ్చెత్రంజూసి అన్ని అవ్వల్డర్టగున్నయన్నడు. జిట్టి తలిగిందని మంగలోనితోని జీడిగింజలు తింపిచ్చి అగ్గిలేపిచ్చిండు.

అందరెల్లిపోయినంక –


“దొరా! ఈ కోడె చూడవోతే శృంగారంగున్నది” – అయ్యగారు గుటికిల్లు మింగిండు.

దొర కలవరపడి సూసిండు – “దీని ఊపురం మీద సుడున్నది.” “ఉంటేందో సెప్పు.” “దీన్ని నాగలికి కడితే భూదేవి వలపోస్తది – వర్షాలు ఆగిపోతయి.” “దుత్తిరి ఎక్కన్నుంచి దొరికినవయ్యా! గిదీన్ని మందమీదికి తెచ్చిన.”
“మంచిమాటే కాని దొరవారు… దీన్ని దేవుని పేరుమీద విడిచి పెట్టాలె. వేములవాడ రాజేశ్వరస్వామి కన్ను చాలా బాగున్నది. తమరింట చూస్కోండి లక్ష్మి తాండవ మాడుతది.”

దొరకు సమఝకాలే – అయ్యగారు తెలజెప్పిండు. దొర కడుపు కదిలేటట్టుగ నవ్విండు.

అగోగట్ల గీ ఆంబోతు ఊరుమీనికచ్చింది.

మల్ల గిప్పుడు దొర ఆరుగట్టె సుంకరోనిమీని కిసిరేసిండు. ఎనుకనుంచి సుంకరోడురికచ్చి చెప్పులు కిందేసిండు. దొర బండి వడదునికి సెప్పులు తొడుక్కొని దొడ్లెకు నడిసిండు. రామలచ్చడు కుర్సెత్తుకచ్చి ఏసిండు. దొరకుర్సిమీన కూసుండ కుంటనే ఆంబోతును ఆపక్కీపక్క సూసి – ఏడన్న మైలంటిదేమోనని తనఖీ చేసిండు. కర్మము పలుగనే పలిగింది. కుడిపక్కన జోరీగ ఆలనే ఆలింది. దొర పాలేరోల్లను పెండ్లమాలు దిట్టిండు. రామలచ్చడు గజగజ అనికిండు.
దొర కుర్సీ మీద కూసుండ కుంటనే ఎనుక కు మిండు. మల్ల గజ్జెలకచ్చులం కదిలింది. గడీల గజ్జెలకచ్చులం ఆగేటాల్లకు పొద్దంగుతది. మోటర తయారు బెట్టుకొని డ్రైవరు మొగిలయ్యుంటడు.

దొర మోటరెక్కుతడు. మోటరు తాలూకాకు బోద్ది. ఇగ ఆడతాగి తందనాలాడి ఏ తెల్లారంగనో మల్లింటికత్తడు…”

గంగయ్య ఒక క్షణం కథ చెప్పడం ఆపాడు…

అప్పటికి నడిఝామురాత్రి తిరిగిపోయింది. గుడ్డెంకడు మూడు బజార్ల దగ్గర ఒగ్గుకథ మొదలేసిండు. వానికంఠం అంతకంతకు తీవ్రమైపోతోంది. కథలో పరశురాముడు గొడ్డలి భుజానేసుకొని కనిపించిన రాజునల్లా నరికి పారేస్తున్నడు. ఎవడో సుతిపట్టుకుంట మధ్య మధ్య “ఒహో…ఆఁ…..ఆహాఁ” అంటూ అక్కడక్కడ వచనం చెప్పుతున్నాడు. ఏడ సడీ సప్పుడులేదు. గుడ్డెంకని బొంగురు గొంతు కొంచెం జీరవోయి అదేదో ఏడుపుతీరుగా వినిపిస్తోంది. సాంబయ్య లేచి వాకిట్లో నుండి గుడిసె వెనుకకు పోయి ఎడ్లముంగటి సొప్పదంటు దగ్గరేసి వచ్చిండు. లచ్చిమికొంగు నేలమీద పరుచుకొని ఒరిగిపోయింది. గౌరమ్మ చెల్లె పక్కలో పండుకొన్నది. ఆమె కళ్లముందు మొగుడు కొండయ్య రూపమే కదులుతోంది.


“ఇంటన్నరా! శాత్రం పురాంగ అయిపోలే” గంగయ్య ఆవుళించి అన్నాడు. సాంబయ్య తలూపిండు, గౌరమ్మ “సెప్పు… సెప్పు” మన్నది.

“ఇవ్వారనుక దొరకత సెప్పుకచ్చిన, దొరల సంగతి ఊళ్లి పార్టీకె పోరి కాన్నుంచెరికే – కని గ ఆంబోతు సంగతే సెప్పుకోవాలె….

ఆంబోతు కరకర పొద్దుపొడి సేటాల్లకు లేచి నిలబడ్డది. నిలబడేటాల్లకు మాల మదనయ్య ఇనుపతట్ట బట్టుకచ్చి దానికిందబెడుతడు. తట్టల సిలసిల ఉచ్ఛబోత్తది. ఎర్టెకండ్ల ఎడ్డి సమ్మయ్య ఎరకలతట్ట బట్టుకొని నిలుసుంటడు. తట్టల పెంటబెడ్తది. రామలచ్చయ్య ఉరికచ్చి ఆంబోతు మెడల తలుగిప్పి దొడ్లి నుంచి ఈతలికి బట్టుకత్తడు. ఎండపొడల ఆంబోతు ఒళ్ళిరి కుంటది. మదనయ్య దాని పక్క అరిగడ్డి పరుపు దీసి గొడ్లకేత్తడు. రామలచ్చయ్య, సమ్మయ్య, కాశెలు బిగగట్టి కసేపు ఆంబోతుకు సల్ల సెముటలు బెట్టంగ మాలీస్ జేత్తరు. సుక్కయ్య బకిట్ల నీల్లు బట్టుకొని తయారుగుంటడు. ముగ్గురు నీల్లుబోసి, ఒళ్ళుగీకి పెయ్యి కడుగుతరు. తల పంచెలూడబీకి మెత్తగ తుడుత్తరు. మదునయ్య పల్లిపిండి, ఉలువపప్పు కలుపుకత్తడు. మదునయ్య తట్ట నోటికాడబట్టుకుంటె అంటీ ముట్టనట్టు తింటది. సుక్కయ్య నీల్లుబెట్టి మూతితుడుత్తడు. అప్పటికే దొరచ్చిపోతడు. గప్పుడు రామలచ్చయ్య తలుగు విప్పదీత్తడు. ఆంబోతు అడుగులో అడుగేసుకుంట పడారి గోడ దాటి బజాట్లకచ్చి నిలుసుండి పెఢీల్ రంకేత్తది. గరంకెకు బజాట్ల యన్ని పారిపోతయి. ఎదురుంగ ఏదుండద్దు – ఉంటే కొమ్ముల మీనేసుకుంటది.

ఆంబోతు గట్ల అడుగులడుగేసుకుంట – పక్క సూపులు సూడకుంట ఊరు దిక్కు నడుత్తది – ఊళ్లి ఆంబోతు ఈ కొసకు జొచ్చిందంటే ‘ఆంబోతత్తందన్న ఆర’ ఆ కొసకు సేరుకుంటది – అది బజాట్లకచ్చిందంటే బజాట్ల మనుషులు ఎక్కడోల్లడక్కడ ఆగి పోవాల్సిందే – బండ్లు ఓరగొగొట్టుకొని నిలబెట్టుకోవాల్సిందే. అది గన్పడ్డదంటే ఊరోల్లు పబ్బతులు బట్టుకొని కోతిమొక్కులు మొక్కుకుంట నిలబడి అదిపోయినంక కదులుతరు.

గట్ల ఆంబోతు ఆడాడలు దిరుగుతది. అక్కన్నుంచి సీదా దచ్చినానికి తిరిగి తుమ్మల బీళ్లు దాటుద్ది – తుమ్మల బీళ్లకావల ఎకురా అంకురం భూములున్న బక్క రైతుల అరువాలు దాని కండ్ల బళ్తాయి. తుమ్మల బీట్లినుంచి సీదా ఎవని పెరట్లనో జొత్తది.
మంచెల మీద పోరగండ్లు లబ్బర లిబ్బర మొత్తుకుంట పీపాలు, రేకు డబ్బాలు కొడుతరు…రైతులు కాళ్లువనుకంగ ఎటూదోసక ఆగమాగమురుకుతరు …ఎవడో పడుసోడు కండ్లకు నెత్తురు రాంగ ముల్లుగర్రబట్టుకొని ఉరికత్తడు. నెత్తురు బొట్లోలె నీల్లుగట్టుకొని పెంచిన మక్కకర్రలు పడుగ్గు పడుగ్గునిరుగంగ ఆంబోతు పెరట్ల ఉరుకులు పరుగులు బెడది. కొమ్ములతోని సిమ్ముతది. పీసుల పీకి పారేత్తది… పడుసోని ముల్లుగర్ర గాలిలకు లేత్తది. ఆనయ్య పడుకుంట లేసుకుంట ఉరికత్తడు… సేతులకట్టె గుంజుకుంటడు.

రాయేశ్వరస్వామి గంపంత కన్ను బెట్టుకొని ఏడున్నవో బాంచెన్ – నీకు ఏం మొక్కులు తక్కువ జేసిన బాంచెన్….” ముసలోడు గజగజ వనుక్కుంట మొక్కుతడు.

వేములవాడ రాయేశ్వరసామి మొర ఇనడు. పెరడిసత్తె నాశిడం పుత్రపూజ చేసినంక అంబోతు మల్లో పెరట్ల కురుకుతది.

వారీ! సాంబయ్య! అంబోతు పెరట్ల సొచ్చిందంటే ఆని పెరడికి అగ్గిమల్లె దాకినట్టె, ఆనింటికి అగ్గిదాకినట్టె, ఆని అరువం దొంగలు దోసినట్టె. అంతవరదనుక అదలకుంటచ్చిన ఆంబోతుకు ఏం బుడుతదోరా! పెరడి కన్నడితే పెరడంత గతి తిరిగినట్టు ఉరుకుతది. పొల్లు పొల్లు కాంగ సెంగలిత్తది. పెఢీ పెథిన లెంకలేత్తది…

కండ్ల ముంగట అరువం సత్తెనాశిడం కాంగ దూరంగా నిలుసుండి సేతులకు రుమాలు దీసుకొని కండ్లపొంట నీల్లు దీసుకుంట వలవల ఏడువాల్సిందే.

ఆరుగాలం కట్టపడి, నోటికాడికచ్చిన పంట సత్తెనాశిడం కాంగ రైతుకు కండ్లకు నెత్తురత్తది. కడుపుల పేగులు నోటైకత్తయి. ఆంబోతును తరిమి గొట్టాల్నంటే రెండు భయాలు ఊరోల్లకు. ఒకటేమొ దొర బతుకనియ్యిడు… రెండోది దేవునికి కోపమొత్తది. ఇద్దరికి కోపమచ్చినంక మరింక గీ భూమ్మీన బతకడం కట్టం…

ఆంబోతు గట్ల ఏష్టచ్చెదనుక సయ్యాటలాడి ఎసల్లేల్లకు మెల్లెంగ కంచెలకెల్లి బోతది.

కంచెల్ల గొడ్లబోయిలు గజగజ అనుకుతరు. ఆంబోతు ఎదబడ్డది. ఆంబోతును జూత్తేనే ఆవులు పెండబెట్టి ఎటుదటు ఉరుకుతయి. ఉరుక సాతగానిది దొరికిందంటే సచ్చిందే. గట్లకంచెల్ల ఎడ్ల గొడ్ల సెదురగొట్టి బారెడు పొద్దున్న దనంగ మల్ల ఊరుసొత్తది.


ఎదురొచ్చిన కట్టెల బండ్లు ఆగిపోతయి…కాండ్ల మీని బక్కెడు గజగజ లాడ్తయి.. ఊళ్లి పోరగాండ్లురుకుతరు… ఇండ్లకు మళ్లిన గొడ్లు ఆగమాగమయితయి… నీల్లకు బోయిన ఆడోల్ల కాళ్లు తత్తరబడ్డయి… మునిమాపటేల్ల ఊరును గజగజలాడిచ్చి గప్పుడు దొడ్డి తోవబడ్తది. గప్పుడు ఊరు ఊపిరి దీసుకుంటది.

అగో గట్ల దొరకు, దొర ఆంబోతుకు ఎదురు లేకుంట కొన్ని ఏండ్లు గడిసినయి.

గ ఊళ్లె దొరతోని, దొర ఆంబోతుతోని ఎన్ని బతుకులు సెడిపోయినయో లెక్కలేదు…

గిది గిట్లుండంగ బతుకు దెరువులేక బొగ్గుబాయిలకు బోయిన లచ్చన్న, బాయి దొరలు బాయి లాంగ్ బార్ సేత్తె పుట్టినూరికి పెండ్లాం పిల్లలతోని తరలచ్చిండు. కోటి అవతారాలెత్తినా కోండ్రకు మించింది లేదని గునాంచుకున్నడు. తెల్లంగీలు, సన్నపు దోతులిడిసి దొడ్డంగీలు, దొడ్డు ధోతులు గట్టిండు.

కరువుకు, గత్తరకు, అప్పుకు, సప్పుకు, మంచికి సెడ్డకు ఊడ్సుకపోంగ లచ్చన్న అయ్య ఆశన్న కాకుల గద్దలగొట్టి రెండెకురాల పెరడి దక్కిచ్చిండు. గ దక్కిన పెరట్ల నెత్తురు కలికలి జేసుకొని, మన్నుబుక్కి మన్నేర్దిండు లచ్చన్న – ఊళ్లోల్లందరు ‘పాపం పోరడు బవుకట్టపోతని’ మెచ్చుకున్నరు. అచ్చినేడు లచ్చన్న పెరడు కంకవనమోలె పెరిగిపోయింది. పెరడుజల్లుపీసు మీనుండంగ ఆంబోతు సొచ్చింది.

ఆశన్న ఆంబోతు సుట్టు తిరుక్కుంట కోతి దండాలు బెట్టిండు. ఆంబోతు దండాలు దా సెండు ఖాతరుజెయ్యలే – ఎటూ సాతకాక బాయిగడ్డమీనికెక్కి మొఖాన కొంగుబెట్టుకొని ఏడ్పిండు. ఏడిత్తె కండ్లనీల్లే పోతయని లచ్చన్న ములిగట్టె అందుకొని పెరట్లకురికిండు. ఆంబోతును అదిలించిండు – ఆంబోతయితె ఎల్లిపోలేగని సందెలు బడే యేల్లకు దొర దగెర నుంచి పిలుపచ్చింది. పోవన్నా అద్దా అని ఇసారపడేటాల్లకే సుంకరోల్లు గడిలకు గుంజుకపోయిండ్లు – నోరుదెరిసి కట్టం సుకం జెప్పుకుందామను కునేటాల్లకే నోరు మూసిండ్లు – కండ్లల్ల నెత్తురు జిమ్మేటాల్లకే కట్టేసిండ్లు – కండ్లు మూసి తెరిసేటాల్లకు లచ్చన్న నెత్తురు ముద్దయిపోయిండు. మరి కాసేపటికి బహిట్ల దుబ్బల పడిపోయిండు.

సూసిన ఊరిజనం కొందరు ‘చ్చొచ్చొ’ అన్నరు. ఊరి పెద్దలు ‘మెడబలిమి’ అన్నరు. ఆడోల్లు ‘పాపమా పచ్చిభూతా’ అన్నరు. పడుసోల్లు ‘కాదు గిది అన్నాయెం’ అన్నరు. లచ్చన్న తల్లి భూదేవి కొడుకును లేపుకొని దొర గడిమీన ఇంతమన్నుబోసి ఇంటికి దీసుకపోయింది. లచ్చన్న పెండ్లం ముత్తమ్మ సప్పుడుకాని ఏడుపు ఏడ్సుకుంట దెబ్బలకు ఉప్పుకాపింది. ఆశన్న కడుపుదేవి గ నాత్రంత సిల్లులు బడ్డ గుడిసెకప్పు సూసుకుంట ఉపాసం పన్నడు. లచ్చన్న కోలుకోను నెల్లాల్లు బట్టింది. మంచాల నెల్లాలు ఎన్నో ఇసారాలు దోసినయ్. తనొక్కడు ఎదురుతిరిగితే ఏమయితదో తెలిసొచ్చింది. మరెట్ల బతకడమో ఎంత ఇసారం జేసినా అంతు సిక్కలే…? మరంద్చేత బతుకాల్నంటే ఎదురుతిరుగక తప్పదు… అట్లా గుంజాటన పడుకుంట తిరుగంగనే పక్కూల్లల్ల బీదబిక్కి ఆర్తలు దెలిసినయ్…

జగిత్యాలన బెట్టిన రైతు కూలోల్ల మీటింగు బోయిండు. బతుకు దెరువు గురించి పక్కూల్లోల్లు సెప్పిన, సేసిన ముచ్చట్లు సెవులేసుకున్నడు. ఎన్నుకు కడులంటుక పెయిన బక్క పిలగాడొకడు లచ్చన్న సడ్డుకుని కొడుకంట ఊళ్లెకచ్చిండు….నాత్రి బడి షురుజేసిండు.

ఇగ గప్పటి నుంచి లచ్చన్న బక్క పిలగాడు కాలుకు బట్టకుంట – తిన్నకూడు పెయిన బట్టకుంట ఇల్లిల్లు దిగొండ్లు – మోటలు గొట్టేకాడ ముచ్చట్లు బెట్టిండ్లు. నాగండ్లు నడిసేకాడ ఇసారాలు జేసిండ్లు – కోతలు గో సేకాడ కతలు సెప్పిండ్లు…. ఏడేంది ఏడబడితాడ తిరిగి లచ్చన్న జనం నోట్లె నాలికయ్యిండు.

జనం ఇసారాలు ఒక్కటయినయ్. రోజుకొకని బూమి గద్దలు తన్నుక పోతుంటె రోజుకొకని ఈపుమీద అట్టలు దేల్లాంటే – కడుపుకు జాలనోల్లు, తన్నులు గుద్దులు దిన్నోల్లు, దండుగలు, ఎట్టీలు జేసినోల్లు సాటుమాటుకు గుసగుస లాడిండ్లు – మంచెల మీద పదాలు మొదలయినయ్. సెలుకలకాడ సేండ్లకాడ పదాలు జోరయినయి. సిటుక్కున సీకటయ్యిందంటే ఊళ్లున్న పడుసు పోరగండ్లు గుజులు కట్టేటోల్లు – దప్పులు గొట్టెటోల్లు, పంబాల పెద్దలు జమిడికే సెటోడు. సాకలి మల్లయ్య సుతిపట్టెటోడు… అగ్గిగట్ల రాజు కుంటంది. బక్క పిలగాడు పక్కూల్లు దిరుగబట్టిండు.

గది సూసిన సాడిగొట్టోల్లకు నిప్పు సంగతి ఎరికగాలే – పాటలు పాడ్రే భాగోత మేత్తరు గావచ్చునుకున్నరు. ఆడలాల్జి సిరుతల రామండెమేత్తరు గావచ్చనుకున్నరు.

ఓనాడు…
సాకలి సెందురు ఏదో ఖ్యాలిలుండి దొరనెత్తిమీద సలసల మసిలే ఉడుకు నీల్లు గుమ్మరిచ్చిండు. దొర పెయిమీన బొగ్గలు బొడిసినయ్. సెందురు ఈ పుట్టిన గుబ్బలు దేలినయ్. గుబ్బలు సూపుకొని సెందురు అందరిముంగట ఏడ్పిండు. అక్కడున్నోల్లంత ఏడ్సిండ్లు. ఏంజెయ్యాల్నో ఎవలకు తోసలే. ఏం జెయ్యకుంటనే పది దినాలు గడిసిపోయినయ్.

అంతట్లనే ఆనకాల మచ్చింది – గడియ పుర్వతు లేకుంటయిపోయింది.

గంతటనే సర్కారోల్ల మోటర్లచ్చి మాదుగులకు ఇండ్ల జాగాలిత్తమన్నరు. దొర ఊరుబందుకున్న గొల్ల ఎంకటి రెండెకురాల పెరడి సూ పెట్టిండు. సర్కారోల్లు మల్లచ్చి ఎంకటి లబలబ మొత్తుకోంగ ఇండ్ల జాగల పట్టాలు పంచి పెట్టిన మన్నరు.

లచ్చన్న గ నాత్రి అందరిని కు ప్పేసి “అయిదు నూకురాల బూమిగల్గిన దొర – పరంపోగులు, షికం, కారజ్ కిత్తాలు ముడ్డికిందేసుకున్నదొర – అగో గ దొర పెరడి ఊరిబందుకు ఇరువై ఎకురాలున్నది గదాంట్లనే ఇండ్లు గట్టుకుందాం” అన్నడు.

గ మాట మంచిమాటగనే దోసింది… నాత్రికి నాత్రే దొర పెరట్ల గుడిసెలు లేసినయ్.

తెల్లారి దొర సింగిబింగాడి మాదుగుల బిలిపిచ్చి –
“వారీ! మాదుగులు ఎనుకటినుంచి కట్టానికి, సుఖానికి మిమ్ముల ఆదుకుంటత్తా గీ పని జేసిండ్లు బిడ్డా! మంచి మాటకు ఇయ్యల్ల గుడిసెలు పీక్కుంటరో, లాపోతే….” దొర ఇంట్లకుబోయిండు.

మాదుగులు ఇండుపీకలేదు – నాత్రి గుడిసెలు కాలిపోయినయ్. మాదుగుల మనుసులు మండినయ్.

కరకర పొద్దు పొడిసేటాలకు గడి ముంగట ఊరిజనం సేరిపోయిండ్లు. ఎవడు మొత్తుకునేది ఆడు మొత్తుకున్నడు. నెత్తి మీదికి పొద్దచ్చేదనుక గడిముంగట కూసున్నరు. బంగుళమీన్నుంచి సూసిన దొరకు లచ్చన్న బండెక్కి ఏందో సెప్పడం, కనిపిచ్చింది. ఎట్ల కుప్పకూడిన జనం అట్లనే ఎల్లిపోయిండ్లు –
ఊరు బయంతోని బిగుసుకపోయింది.

రెండో నాడు కోతకచ్చిన లచ్చన్న మక్క పెరడు దొర గొడ్లమంద ఏర్లు లేకుంట పీక్కతిన్నయ్ – ఏడుపుల్లనుంచి కోపం పుట్టకముందే పోలీసులచ్చి లచ్చన్నను తాలూకా రానాకు పట్టుకపోయిండ్లు – పోలీసోల్లు ఊళ్లెజొచ్చి కనిపిచ్చినోన్నల్ల తన్నిండ్లు. పట్టుక పోయేటోల్ల పట్టుకపోయిండ్లు – కడుపుల్ల మంటలు రవులుతున్నయ్.

దొర సంబుర పడీ పడకముందే ఓట్లల్ల రాణి పోయి రాజచ్చిండు. జేల్లల్లోల్లను ఇడిసి పెట్టిండ్లు. జేల్లకు పోయినోల్లు మల్లచ్చెటాల్లకు ఊరు పాడుబడ్డది. ఎవ్వడూ మాట్లాడడు. కంషెత్తడు.

“రోగం తిరిగింది లంజ కొడుకులకు” అనుకున్నడు దొర. కని నిచ్చానికి రోగం ముదిరింది.

ఈసారి ఊళ్లెకు అచ్చెపోయేటోల్లెక్కువయిండ్లు – ఇంతట్లకే ఆనకాల మచ్చింది.

కయికిల్లకెగబడే కూలోల్లు ‘కూల్లు పెరుగాలన్నరు’ … ‘నేంబెంచనే పెంచ నన్నడు’ దొర. కూలోల్లు దిగిరాలే. కారణాలు దెలిసిన దొర కారాలు మీరాలు నూరిండు. కయికిల్లెక్కినయ్. నాట్లే సేటాల్లకు నారు దొయ్యలు పొట్టకచ్చినయ్.
ఈసారి దొర గజ్జెల కచ్చులం అచ్చెటాలకు అనుమండ్ల గద్దెకాడ పంచాతులుంట లేవు. ఆన్నుంచి తాళ్లల్లకచ్చెటాల్లకు తాళ్ళను గౌండ్లోల్లసంఘమే హర్రాజు పాడింది. సెట్లమామూల్లు బందయినయ్. గొల్లోల్లసంఘం అంతు పిల్లలు, ఎట్టిమందలు బందుజేసింది. జంగలాతు మామూలు బందయి పోయినయ్.

గియ్యన్నేంది దొరపని కుడిదిలబడ్డ ఎలుక సందమయ్యింది – దొర జేసేపనులు దొరజేత్తనే ఉన్నడు – పోలీసోల్లు “ఊఁ” అంటె ఉరికత్తనే ఉన్నరు – రోజుకొకన్ని పట్టుకపోతండ్లు – ఎవరో జమానతుబడి ఇడిపిచ్చుకత్తండ్లు – ఊరు ఊరంత ఒక్కటయితే దొరపట్టు పోలీసోల్లయ్యిండ్లు. తన్నులు గుద్దులతోని జనం అంగిపోతరనుకుంటే అంతకంతకు రెచ్చిపోయిండ్లు.

రెచ్చిపోయినజనం చుట్టూ పదూళ్ల మందితో గలిసి దొర కట్టా సేసుకున్న అడివి అయిదు నూర్ల ఎకరాల్లో తమకుగా వాల్సిన కర్రను గొట్టుకున్నరు – కచ్చులాలు కదులకముందే జంగలాతోల్లు, పోలీసోల్లు కదిలచ్చిండ్లు – కట్టెలకు తుపాకులకు కసేపు ఇష్టం జర్గింది. కట్టెలిరిగిపోయినయ్. బండ్లు జంగలాతు అమీనింటికి బోయినయ్.

గిది గిట్టుండగ మాలిపటేలోడు మంగలి అంకూశవ్వను గుంజిండు. దిక్కు లేరనుకున్న అంకూశవ్వకు మాలిపటేలోడు కండ్లు మూసిదెరి సెటాల్లకు సుట్టూర మంది గిరేసుకున్నరు. మామిండ్లల్ల మాలిపటేలోని మొత్తు కునుడు మాయమయ్యింది. మాపటేల్లకచ్చిన పోలీసోల్లకు మామిడితోట్ల మాలిపటేలోని శవంగాదు గదా ఎర్రమట్టి సుత దొరుకలేదు. నాత్రి బరండికీసలు దాగి ఇసారాలుజేసి కేసులు రాసిండ్లు – లచ్చన్నను మల్ల జీబెక్కిచ్చుకపోయిండ్లు –
మక్కంకు లిరిసిండని మాదిగిపీరయ్యను దొరనెత్తురు కక్కంగ గొట్టిండు – కుప్పకూడిన జనం మక్క పెరడుకే ఎసరుబెట్టిండ్లు. ఊళ్లోలందరిని దొమ్మి’ కేసు లిరికిచ్చిండు…

గప్పుడు ఊళ్లోలందరు దొర పనులు బందుజేసిండ్లు…

ఏరుట కచ్చిన పెసరు గుడ్డాలు పలపల పలిగి బూమిల గల్సినయ్ – దొడ్లల్ల పసురాల దొడ్లల్లనే పెండలు బెట్టినయ్ – దొర లేసేటాల్లకు సాకలి సెందురుడు పండ్లపుల్ల ఇయ్యలే – దొర పట్నమురికిండు – పోలీసోల్లు గొడ్లిడి సిండ్లుకని వాటిని కాయరాక దొరను మనుసుల తిట్టుకుండ్లు – సుందరమ్మ రాక దొర్సాని సేతులు పొక్కులచ్చినయ్.

ఆరందినాలు గడిసేటాల్లకు దొర గడంత పాడుబడిపోయింది. దొరకు గడ్డం బెరిగింది. పోలీసోల్లు సాకలోన్ని దొరికిచ్చుకున్నరు. ఆడు పానంబోయినా సంఘాన్నిడువనన్నడు.

ఊరు గడిమీనికచ్చింది. సాకలి మల్లయ్యను ఇడిపిచ్చుకున్నది.

దొరకు బుగులు జొచ్చింది. ఎనుకాముంగట ఇసారం జే ఎటుచూసిన ఏడేమానుకలున్నది. క్యాంపుబెట్టిన పోలీసోల్లు పీక్కతింటండ్లు. పనులోల్లురాక గడి మురిగిపోద్ది. కూడు కుమ్ములేక తామంత మురిగిపోతరు. మాలిపటేల్‌కు బట్టిన గతి తనకు బడితే?

గిట్ల ఇసారం జేసుకొని పెండ్లాంపిల్లల ఎంటేసుకొని బతికుంటే బరండన్న తాగచ్చునని ఎవడు సెప్పిండోగని పాణబయం బట్టుకొని – ఏడియాడ ఇడిసిబెట్టి నగ నట్రా, నగదు బట్టుకొని ఐదరాబాదు పట్నానికెల్లిపోయిండు. గడి తలుపులు మూసుకున్నయ్. గడికి తాళంకప్పబడ్డది. ఎడ్లు, గొడ్లు ఆగమయినయ్. షేకేదార్లు ఆగమైన సేతను సూసుకోలేక దెంకపోయిండ్లు.”

“గదంత మా ఎరికేగని గ ఆంబోతు సంగతి జెప్పు” సాంబయ్య.

“అత్తన్నరా! గాడికే అత్తన్న….” గంగయ్య ఇత్తడి సెంబులనీళ్లు గటగట తాగిండు.

“మనుషులు బతుకుదెరువు లేకపోతె దేశాలు దెగిచ్చుకపోతరు. దొరకు పైకమున్నది. పట్నంల బతుకపోయిండు. ఆగమైన పసురాలు ఆడివిల దిని అడివిల బన్నయ్. మరి పసురం గ ఆంబోతేడబోద్ది…? ఆంబోతుకు అడివి తెలువది. తనంతతాను దినుడు తెలువది.

ఆంబోతు లేసెటాల్లకు ఉచ్చబట్టేటోడులేడు. పెండదీ సెటోడు లేడు. మాలీషు జే సేటోడులేడు. పల్లిపిండి పట్టెటోడులేడు. నీల్లు మూతికాడ బట్టెటోడులేడు. పెయి కడిగెటోడులేడు…
ఆంబోతు పెండదొక్కి పెండలబన్నది. సలువగుడ్డసొంటి పెయ్యి దుబ్బ, రొచ్చు పెండంటి వికారమై పోయింది. గోమార్లు పెయ్యంత బట్టినయ్. మూడోనాడు ఆకలికాగలేక తలుగుదెంపుకొని దొడ్డెనుక పనుగడి ఇరుగదొక్కి ఈతలకచ్చింది. కడుపుల సురసుర కాలంది. దానికి నిలుసుండి నీల్లు దాగటం, నిలుసుండి మేయటం తప్ప అంగితినుడెర్కలే ఎర్రిలేసిన దానితీర్గ బజార్ల వెంట ఉరికింది…

ఊళ్లె దిరుగంగ గదాన్ని సూసి ఎవడూ కోతి దండంబెల్టలేడు – ఎవడు ఆగిపోవుటం లేదు. గియ్యేమి సూడకుంట తుమ్మల బీడుదాటి రైతుల పెరండ్లమీన పడ్డది. ఒక్క బుక్క అలవాటుసొప్పున మేత అందుకున్నదో లేదో? బాణపుల్లతీర్గ ఒకడురికచ్చి పడెల్లున పంతమీన కొట్టిండు. కండ్లు పులపొడిసేటాల్లకే పెఢీ పెడిన దెబ్బలు, పోరగండ్లు మట్టి పెళ్లల అర్షం గురిపిచ్చిండ్లు. ముసులోల్లు అనెకెల్ల ముల్లుకట్టెలతోని పొడిసిండ్లు. తిట్లు. దెబ్బలు. కోపంతోని బుసకొట్టబోయిన ఆంబోతు పెయ్యంత ముల్లుగుచ్చ సందులేకుంట సిదుగబొసిడిండ్లు. ఎటూ సాతకాక ఆరువంల నుంచి గెట్టుమీని కురికింది… కట్టెలు బట్టుకోని రైతులు దానెంటబడ్డరు.
.
గెట్టుమీన నిలుసుండి ఆంబోతు కసేపు ఇసారంజేసింది. పసురానికి గిది సమయ్ కాలేదు. పబ్బతి బట్టి మొక్కే రైతులకేం బుట్టిందో? ఆన్నుంచి ఇంకో సేను – ఇంకో సేండ్ల ఇంకిన్ని దెబ్బలు.

మాపటేల్లదనుక ఎర్రిలేసిన కుక్కోలెదిరిగింది… దాని పెయ్యంత పచ్చి పుండయి పోయింది. వనికే కాళ్లతోటి పశురాలు ఇండ్లకు సేరేయేల్లకు ఊళ్లిసొచ్చింది. ఇంకా అడుగుబొడుగు మిగిలిన పసురాలు ఆంబోతును ఖాతరుజేయలే. ముసలావులు తాక్కుంట బోయినయ్. పొట్టిగిత్తలు పెడీ పెడిన లెంకలేసి గెదిమినయ్. పసుల పోరగండ్లు తోకమట్టబట్టి కొట్టిండ్లు. అటురికి ఇటురికి దాని లంగులు దెగినయ్. సందెలుబడేయేల్లకు గడి ముంగటికి జేరుకున్నది.

గిట్ల నెల దినాలు ఆంబోతు ఆడు గొట్ట వీడు గొట్ట ఊర్లె తిర్గింది. డొక్కలు బొక్కల కంటినయి. తోక మట్టుకాడ గాయమయ్యింది. దెబ్బలు పుండ్లయినయ్. పుండ్ల మీద ఈగలు ఈపులు బెట్టినయ్. గిప్పుడు ఆంబోతు దొబ్బుతే పది జాగల్ల పడేటట్టు గయిపోయింది.

ఆఖరుకు ఓనాటి అంబటాల్లకు తిరిగి తిరిగి బేజారైపోయి అనికే కాళ్లతో గడి ముంగటి కచ్చింది – మోరెత్తిగడిని పులుకు పులుకున జూసింది – పటపట కండ్లపొంట నీళ్లుగా రంగ గడిసుట్టు గత్తి దిరిగింది. ఆఖరుకు మరింక కదులరాక
వారీ సాంబయ్య! గజగజ అనుక్కుంట – సిలసిల ఉచ్ఛబోసి పెండబెట్టి దబ్బెల్లున భూమ్మీన కూలబడిపోయి – గిలగిల తన్నుకుంట ‘అంబా’ ‘అంబా’ అనుకుంట జానెడు నాలికెల్లబెట్టి పానమిడిసింది. వారీ సాంబడూ! ఎందుకు
సచ్చిందో ఎరికయ్యిందా? ఆంబోతుకు ఊరిసంగతి ఎరికయ్యిందన్నమాట.” గంగయ్య దీర్ఘంగా నిట్టూర్చి చప్పున నోరుమూసుకొని మౌనంగా ఉండిపోయాడు. అప్పటికి ఊళ్లి కోల్లు కూసినయ్. వెన్నెల పడమటివేపు ముఖం మాడ్చుకున్నది. సింతచెట్లనీడలు తూరుపు వేపు పెరిగిపోయినయి. తెల్లారేచుక్క తూరుపుదిక్కున జిగేల్ జిగేల్ మని మెరుస్తోంది. గంగయ్య తుపుక్కున ఊంచాడు.

సాంబయ్య మంచంలో లేచి కూర్చున్నాడు. అతని శరీరం ఎందుకో దేవుడు పూనిన విధంగా వనుకుతోంది…. కండ్లల్లో గుబగుబ నీళ్ళూరినయ్. ఆ గుడ్డి వెన్నెలలో గంగయ్య ముఖం తేరిపారి చూశాడు. నిద్రలేని గంగయ్య కండ్లు కమ్మరి కొలుము లోలె మండుతున్నాయి… మంచంలో కూర్చున్న గంగయ్య గుడిమెట్టుతీరుగా కనిపించాడు.

ఎలుగురాసిన గొంతుకతో గంగయ్య ఇట్లా చెప్పుకొచ్చాడు –
“వారీ! సాంబడూ! కాలం మారుతుంది – మనుషులు మార్తన్నరు. బాంచె గాడు బతుకు గురించి తెలుసుకున్నడు. బాంచెగాళ్ళంతా సంఘమయి తండ్లు. నలనల్లనీ రేగళ్లను బలుకదున్ని పుట్ల కొద్ది దాన్నెం పండిచ్చి లోకాన్ని సాదుకచ్చె బాంచెగాడు, గుట్టలు పలుగొట్టి బంగుళాలుగట్టిన బాంచెగాడు. ఇనుము, ఇత్తడిజేసిన బాంచెగాడు. అగో గసొంటి బాంచెగాడు గడిముంగటకచ్చి అట్టలుగట్టిన సేతులు కొడవండ్లు, గొడ్డండ్లుజేసి మర్రేసిండు. వారీ! సాంబయ్య కొలిమి అంటుకుని రవులుకున్నది. సెమట మండుతంది. ఇగ సూసుకోరా బాంచెగాళ్ళదెబ్బ! గిప్పుడు సూస్కో! ఆంబోతు ఎద్దే – అది మిగతా ఎడ్లతీర్గ బతికితే మనం కడుపుల పెట్టుకొని పూజలు సేత్తం. కని మంది సొమ్ములు గమండితోని, బలుపు తోని ఖరాబు చేసిందనుకో – గది ఆంబోతు తీర్గ ఎరుక సేసుకోవో? పసురం తీర్గ కానకుంటివో గది నీతప్పు… గిన్నేండ్లు మన నెత్తి మీనికెక్కి సవారి జేసిన దొరల కేగతి పట్టనున్నదో ఇసారంజేయి….సాంబయ్యా! నా కొడుకును ఎనకకు బొమ్మనాల్నో ముంగటికి నడువుమనాల్న నువ్వే సెప్పు…. మనమే అని తొవ్వల నడువన్నో! నువ్వే సెప్పు…..” గంగయ్య కంఠంలో కొంచెం తీవ్రత తగ్గింది.


“వారీ! సాంబడూ! కాలం మారుతుంది – మనుషులు మార్తన్నరు. బాంచె గాడు బతుకు గురించి తెలుసుకున్నడు. బాంచెగాళ్ళంతా సంఘమయి తండ్లు. నలనల్లనీ రేగళ్లను బలుకదున్ని పుట్ల కొద్ది దాన్నెం పండిచ్చి లోకాన్ని సాదుకచ్చె బాంచెగాడు, గుట్టలు పలుగొట్టి బంగుళాలుగట్టిన బాంచెగాడు. ఇనుము, ఇత్తడిజేసిన బాంచెగాడు. అగో గసొంటి బాంచెగాడు గడిముంగటకచ్చి అట్టలుగట్టిన సేతులు కొడవండ్లు, గొడ్డండ్లుజేసి మర్రేసిండు. వారీ! సాంబయ్య కొలిమి అంటుకుని రవులుకున్నది. సెమట మండుతంది. ఇగ సూసుకోరా బాంచెగాళ్ళదెబ్బ! గిప్పుడు సూస్కో! ఆంబోతు ఎద్దే – అది మిగతా ఎడ్లతీర్గ బతికితే మనం కడుపుల పెట్టుకొని పూజలు సేత్తం. కని మంది సొమ్ములు గమండితోని, బలుపు తోని ఖరాబు చేసిందనుకో – గది ఆంబోతు తీర్గ ఎరుక సేసుకోవో? పసురం తీర్గ కానకుంటివో గది నీతప్పు… గిన్నేండ్లు మన నెత్తి మీనికెక్కి సవారి జేసిన దొరల కేగతి పట్టనున్నదో ఇసారంజేయి….సాంబయ్యా! నా కొడుకును ఎనకకు బొమ్మనాల్నో ముంగటికి నడువుమనాల్న నువ్వే సెప్పు…. మనమే అని తొవ్వల నడువన్నో! నువ్వే సెప్పు…..” గంగయ్య కంఠంలో కొంచెం తీవ్రత తగ్గింది.

“నా కొడుకు మొదటోడె కాదన. నా కొడుకు గ నిప్పులగుండల నుంచి మీదికి తేలత్తడని సంబురపడలేను… ఆడు గదాంట్ల మలిగిపోయిన నేను ఏడ్వ! ఏడ్సేటందుకేమున్నది? ఈ కొట్లాటలు సకల పంటలు దీసిన మనకు సంబురమా?

గౌరవ్వా! బిడ్డా! నాకో మనుమన్నియ్యితల్లీ! నా కొడుకు జండెత్తుకొని ముంగటికి నడిసే మనుమన్నియి… నాతల్లీ!” ఎందుకో గంగయ్య కంఠం ముద్దముద్దగా రాసాగింది.

గౌరమ్మ లేచివచ్చి మామ నోరు మూసింది. గుబగుబ నీళ్ళూరిన అతని కళ్ళు తుడిచింది.

సాంబయ్య అమాంతం లేచి గంగయ్య కాళ్ల మీద పడిపోయిండు. గంగయ్య పాదాలమీద వెచ్చటి కన్నీల్లు –

గంగయ్య మరేమి మాట్లాడలేదు. సాంబయ్యను లేపి కూర్చుండబెట్టాడు. “పసురాన్ని బావా! పసురాన్ని” సాంబయ్య గొనుగుతూనే ఉన్నాడు.

“గౌరవ్వా పోదాంనడు బిడ్డా! తెల్లారింది” గంగయ్య తలకు రుమాలు చుట్టుకున్నడు.

లచ్చిమి ఇంకా బెక్కుతోంది.

గౌరమ్మ చీరె మూట పట్టుకొని తయారయ్యింది…. లచ్చిమి బిడ్డను బిగ్గరగా కౌగలించుకొని ఏడ్సింది. కుంకుం బరినె దెచ్చి ఎర్ర కుంకుంబొట్టు బిడ్డనుదట బెట్టింది.
గంగయ్య లేచి నిలుచున్నాడు. మలికోడి కూసింది.

గంగయ్య గుదుప కర్రకు కోడలు బట్టల మూట తగిలిచ్చుకున్నాడు. మామ ముంగట కోడలు వెనుక తూరుపురేకలు బారుతుండగా తూరుపు వేపు నడిచారు…

సాంబయ్య లచ్చిమి కరకర పొద్దు పొడి సేదాకా భీరిపోయి చూసుకుంటూ నిలబడి పోయారు…

దారి పొడుగునా కోడలుకు మరిన్ని కథలు చెప్పుతూనే ఉన్నాడు రైతు కూలి సంఘ అధ్యక్షుడు గంగయ్య…

(సృజన మాస పత్రిక, జులై 1981)

పుట్టింది గాజుల ప‌ల్లి, మంథ‌ని తాలూకా, క‌రీంన‌గ‌ర్ జిల్లా. న‌వ‌ల‌లు: 'కొలిమంటుకున్నది', 'ఊరు', 'అగ్నికణం', 'కొమురం భీమ్'(సాహుతో కలసి), 'వసంత గీతం', 'టైగర్ జోన్'. కథా సంపుటాలు : 'సృష్టికర్తలు', 'తల్లి చేప', 'అతడు'. 100కు పైగా క‌థ‌లు, కొన్ని క‌విత‌లు, పాట‌లు, వ్యాసాలు, అనువాదాలు, 4 నాట‌కాలు రాశారు. 1979 నుంచి విప్ల‌వ ర‌చ‌యిత‌ల సంఘంలో స‌భ్యుడిగా కొన‌సాగుతున్నారు.

Leave a Reply