మద్దునూరులో దొర పెంచి ఊరిమీదికి ఉల్ఫాగా ఒదిలిపెట్టిన జన్నెకోడె- ఊరివాళ్ల పంటలు నాశనం చేసి – గొడగొడ ఏడ్పించిన జన్నెకోడె. దొరలాగ సకల భోగాలననుభవించి- ఊరి మీదపడి ఊరిని కకావికలు చేసిన జన్నెకోడె. రైతుకూలి సంఘం ఏర్పడి- అంచెలంచెలుగా పోరాటాలు నడిపి – దొర గుండాలను, దొర పెట్టించుకున్న పోలీసు క్యాంపును, పోలీసులను, కేసులను, చట్టాలను ఎదురించి పోరాడి- చివరకు 1979 చివరలో దబ్బు దస్కంతో ఊరిడిసి దొర పట్నం పారిపోయేలాగా పోరాడిన రైతుకూలీ సంఘం. దొర జిత్తుల మారి మనిషి గన్క, డబ్బున్నోడు గన్క, అగ్రకులం గన్క పట్నం పారిపోతే- ఆయన తన అధికార దర్పానికి దొరతనానికి గుర్తుగా పెంచిన జన్నెకోడె మిగతా పశువుల్లాగా బతుకలేక- ఊరోళ్లందరిలో జరిగిన మార్పు గ్రహించలేక – గడిముందు పడిపోయి ప్రాణమిడిసిన కథ.
1980 ఆరంభంలో నాకు ఆ కథ మొదట చెప్పినవారు అప్పటికి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలల్లో దాదాపు 80 శాతం ప్రజలకు అనేక రకాలుగా పరిచయమైన రఘు అనే నల్లా ఆదిరెడ్డి. అప్పటికే రకరకాల పనుల మధ్య, ఉద్విగ్నతల మధ్య ఉన్న నేను పెద్దగా పట్టించుకోలేదు. నా కాలపు నా సహచరులైన యువకుల్లాగా నా వంతు కర్తవ్యంగా- అప్పటికే చిన్నపాటి ఉపన్యాసకుడిగా – సహచరులందరిలాగా గ్రామాలు, పట్టణాలు, సింగరేణి కార్మికులల్లో తిరుగుతుండేవాన్ని. ఒకపక్క ప్రభుత్వ నిర్బంధం కొనసాగుతుండగానే – గ్రామాలలో మీటింగులు జరుగుతుండేవి. కార్మిక బస్తీలల్లో- చిన్నచిన్నబృందాల మీటింగులు జరుగుతుండేవి.
అలాంటి మీటింగులల్లో కూచుండి ఆసక్తి కొద్ది నేను వింటుండేవాన్ని. అలాంటి సందర్భాలల్లో- చాలాచోట్ల దొరతనం కూలిపోక తప్పదు… అనే సందర్భంలో జన్నెకోడె కథ రకరకాలుగా ఎవరి అవగాహన మేరకు ఉపన్యాసకులు చెప్పడం విన్నాను.
అట్లా 1980 నుండి ‘జన్నెకోడె’ అత్యంత విషాదకరంగా దొర గడి ముందు చనిపోవడం వెంటాడుతూ ఉండేది. నా బాల్యం పల్లెల ఎడ్లు, గొడ్లతో గడిచింది. ఎడ్లను మేపడం, వ్యవసాయ పనుల మూలంగా ఎడ్ల స్వభావం, మా ఎడ్లతో గల అనుభవం లోలోపల గూడుకట్టుకొని ఉంది. చనిపోయేదాక రోషంతో మాటపడని పెద్దమ్మది, కొంచెం వ్యవహారంగా తన పని తను చూసుకునే గంగదేవి – అవి చనిపోయినప్పుడు మాయింట్లో మనిషిపోయినట్లే తల్లడిల్లాం.
ఇప్పటికి ఆ ఎడ్లు గుర్తొస్తే కళ్లు నీళ్లతో నిండిపోతాయి. నా జీవితాన్ని ప్రభావితం చేసిన కర్ర రాయమల్లన్న మా పాలేరుగా చాలాకాలం పనిచేశారు. ఆయన ఎడ్లతో మాట్లాడేవారు. నా చిన్నతనం వెన్నెంపల్లిలో చూసిన వందలాది గొడ్లమందలు- ఎదకోడెలు (జన్నెకోడెలు) ఎన్నెన్నో.
ఇదంతా సరె. గడి ముందు ఒర్లుతూ చనిపోయిన ‘జన్నెకోడె’ రకరకాలుగా కన్పించేది. లోలోపల పెరుగుతూ పోతున్నది. కలలోకొస్తున్నది. అర్థరాత్రి నిదురలేపుతున్నది. నిద్ర పట్టేదికాదు.
ఒకరాత్రి అట్లా సిగరెట్లు తాగుతూ కూచున్న నన్ను రఘు ‘‘ఏమయ్యింది’’? అని అడిగాడు.
‘‘ఏమిలేదు జన్నెకోడె’’అన్నాను.
‘‘అంటే నువ్వు కూలిపోక తప్పని దొరతనం గురించి బాధ పడుతున్నవా? జన్నెకోడె గురించా?’’
ఏం చెప్పాలి? ఇంత నిర్ధాక్షిణ్యంగా జరుగుతున్న పోరాటంలో – వేలాది ఎకరాల పంటలు నాశనం, దిక్కుమొక్కు లేక జనం ఊళ్లకూళ్లు చెదిరి పోవడం – వందలాది కేసులు. వేలాది మంది జైల్లల్లో. అప్పటికే చాలామంది కార్యకర్తలు, ప్రజలు భూస్వాముల గుండాలతో, పోలీసు కాల్పుల్లో చనిపోయారు.
ఇప్పడీ మాటలు రాస్తున్నాననుకొని – వాటి ఒత్తిడిని, ఉద్వేగాన్ని అనుభవించడం ఎంతకష్టం – మృత్యువుకు మిల్లిమీటర్ల దూరంలో- నాయకులు తిరుగుతున్నారు.
నేనేది చెప్పకుండానే ‘‘పెటీ భూర్జువా వర్గం ముఖ్యంగా కవులు, రచయితలు, మేధావులు విప్లవం గురించి కలలుగంటారు. రాస్తారు. కాని కొట్లాట ఇదిగో గిట్లనే ఉంటది. నిజం. పోరాటం మధ్యయుగాల కరుడుగట్టిన భూస్వామ్యంతో జరుగుతుంది. అదేమంత మర్యాదగా ఉండదు. అది మరింత ముందుకు పోవాలంటే ఉద్వేగాలతో కాదు. నిజాన్ని ఒప్పుకొని అందులో లీనం కావాలి.
ఒకటి రెండు ఊళ్లల్లో మొదలైన పోరాటాలు ఇవ్వాళ్ల రాష్ట్ర వ్యాపితమయ్యాయి. సింగరేణి – ఆదివాసి ప్రాంతాలల్లోకి విస్తరించాయి. ఈ విషయాలన్ని రాసిన నీకు నాకన్నా ఎక్కువ తెలుసు. భూస్వామిక భావజాలం ఒక్క దొరకు మాత్రమే లేదు. మనందరి లోపల ఉన్నది. కాని అది కూలిపోక తప్పదు. కూల్చకుండ ప్రజలు ఈ పీడన నుండి బయట పడరు. అక్క చెప్పింది నువ్వు జన్నెకోడె గురించి కలువరిత్తన్నవట’’
‘అయితే’
‘నువ్వే ఆలోచించు’ తను మొదట మద్దునూరులో 1975లో ప్రైవేటు టీచర్గా ప్రవేశించిన దగ్గరి నుండి ఆ వూరిలో జరిగిన పోరాటాలన్ని చెప్పుకొచ్చారు. దాదాపుగా అవ్వన్ని క్రాంతి పత్రికలో నాగేటి చాళ్లల్లో రగిలిన పోరాటాలల్లో చెప్పినవే. కొన్ని వివరాలు ఎక్కువగా.
ఉదయం నాలుగున్నరకు డికాషన్ తో చాయ్ పెట్టుకున్నాం. ‘‘నేను ముంజం రత్నయ్య వదినె కొడుకుగా ఆ వూరిలో కాలుపెట్టాను. అంటే గౌడ కులమన్నమాట. ఆయన కొడుకునైతే ఆయన పనులన్ని చేయాలి. తాళ్లల్ల నుంచి పెద్ద కల్లుకుండ నెత్తిమీద కల్లు మండువా కాడికి మోయాలి. మధ్యలో ఒక మోరి జబ్బల బనీను -ఎగ గట్టిన ధోతి- నెత్తిమీద పెద్ద కల్లులొట్టి – మోరికాడ లొట్టి దించుకున్న. కండ్లల్ల నుంచి నీళ్లు కారిపోతున్నయి. రెడ్డి పుటుక పుట్టి – గీ కల్లులొట్లు మోసుడేంది? గిదేం విప్లవం? ఈడి నుంచి ఇటే చెంగోబిల్ల అంటే. మోరిమీద కూసున్న. ఆలిశ్యమయ్యిందరని – ముంజం రత్నయ్య ఎదురచ్చిండు. నా ముఖం చూసిండు. కడుపు తలబెట్టిండు. బిగ్గర అలుముకున్నడు. తన కళ్లల్లో నీళ్లు. నా జీవితంలో ఇలాంటది ఎన్నడు ఎరుగను.
ఆయన లొట్టెత్తుకున్నడు. నేను వెనుక నడిచిన. కాని చాలా రోజుల తరువాత రత్నయ్య కొడుకునేనన్పించింది’.
‘‘నువ్వు రెండు జిల్లాల పేదవాళ్ల కొడుకువైనవు’’ అనాలనుకున్న. కాని అనలేదు. ఆయన పుండు లాంటి చలిలో వెళ్లిపోయాడు. నేను ఉదయం ఆరు గంటల డ్యూటీకి పోయిన. వందలాది కార్మికులు హడావిడిగా ఫ్యాక్టరీ లోపలికి పోతున్నరు. టైంకీపర్ గా వాళ్లకు పంచింగు కార్ట్సు యిస్తూ క్యాజువల్ లేబరును పిలిచి వాళ్లందరిని పనుల మీదికి పంపాను. వాళ్లు నేను వేరువేరు కాదని ఫీలింగు.
అప్పటికి పెద్దిశంకర్ ను 2 నవంబర్1980న గోదావరి ఆవలి తీరం మొహిబిన్ పేట మహారాష్ట్రలో పోలీసులు కాల్చేశారు. అది అడవిలోకి వెళ్లిన తొలిదళం. అందరూ చిల్లంకల్లం అయిడ్లు. వాతావరణమంతా యమ ఉద్రిక్తంగా ఉన్నది. అది మహారాష్ట్రలో జరిగింది. కనుక బొంబాయి పౌరహక్కుల సంఘం తరపున కోబాడ్ గాంధీ, రాధా అయ్యర్, సంజయ్ సింఘ్వి ఇంకా నలుగురు వచ్చారు. చంద్రపూర్ లో ఉన్న లాయర్, పౌర హక్కుల నేత, కార్మిక నాయకుడు చందుపట్ల క్రుష్ణారెడ్డి నా క్లాసుమేటు. ఆయన వరవరరావుకు నాకు వాళ్లను పరిచయం చేశారు. అందరం కలిసి మొహిబిన్ పేట వెళ్లాం. రాత్రి మమ్ములను పోలీసులు ఆపారు. అప్పుడు పేర్వారం రాములుగారు జిల్లా యస్.పి. వివరాలు రాసుకొని వొదిలిపెట్టారు.
అటవీ ఉద్యమం ఆ తరువాత విస్తరించింది. గోండు, కోలాం లాంటి ఆదివాసుల గురించి అనేక వార్తలు, పాటలు, వాళ్ల ఆచారాలు, పెండ్లీలు-ఎన్నెన్నో కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లయింది. పెద్ది శంకర్ వార్త దేశవ్యాపితంగా ప్రచారం అయ్యింది. ప్రజాస్వామిక వాదులు, రచయితలు, కళాకారులు చాలామంది. ఆదిలాబాదుకు వచ్చేవారు. నన్ను కలిసేవారు.
అప్పుడు పెను ప్రవాహం పారుతోంది. దాంట్లోనే ఉండటం వలన దాని హోరు తెలువడంలేదు. పైగా ఎడతెరిపిలేని సంఘటనలు. ఒకపక్క పల్లెల్లో భూములు దున్నడాలు. దొరల సాంఘీక బహిష్కారం. పోలీసు క్యాంపులు. కోర్టుకేసులు. జైల్లు. ములాకతులు. బేలు కోసం వకీలును కలువడాలు. మరోపక్క మందమర్రి, బెల్లంపల్లి, గోదావరిఖనిలో కార్మికుల సమ్మెలు. బందులు, వేలాది మంది కార్మికుల ఊరేగింపులు. ఆదివాసుల అడివి నరుకుడు. అటవీ అధికారుల తరుమడం. గిన్ని సంగతులల్లోపడి కొట్టుకపోవడం. ప్రాప్త కాలజ్నతంటరు గదా… అది.
ముంజం రత్నయ్య గురించి చాలా కథలు చెప్పేవాళ్లు. ఆయన మా వూరికి వచ్చి మా నాయనను కలిసిన గుర్తు. పొట్టిగా కుది మట్రంగా – మొఖంలో ఎలాంటి దిగులు కన్పియ్యకుంట నింపాదిగా ఉండేటోడు. ఆయన మార్క్సిజం అర్థం చేసుకొని – వెనుకడుగు వేసిన పోరాటాల మీద ‘‘ ఒక్కడుగు- వెనుకకు, రెండడుగులు ముందుకు’’ అని చెప్పిండని విన్న. పంట’ కథ రాసి పారేసిన ఇంతకు ముందే.
ఆయన గంగ దాటి ఆదివాసీ ప్రాంతంలో దళ నాయకుడయ్యారు. ఆయనతో పాటు ఆవూరి పూజారి కోడలు అడవిలకు పోయింది. అక్కడ కల్లు కుండలు మోసిన ప్రయివేటు పంతులు రఘు రెండు జిల్లాల ప్రియతమ నాయకుడయ్యాడు. ఊరి నుంచి పరారైన దొర ప్రజలకు బాకీ పడ్డ దండుగల డబ్బు సుమారు ఇరువై లక్షలతో (అంటే ఇప్పుడు అరువై రేట్లు. పన్నెండు కోట్లు) తన దగ్గరి డబ్బు, దస్కం పట్నంల భూములు కొని రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మొదలైండు. గిసోంటి అనుభవంతో వరంగల్, ఖమ్మం, నిజామాబాదు, మెదక్ జిల్లాల్ల రైతుకూలి సంఘాలు భూములు దున్నుతున్నాయి. సుడిగాలిలా సుట్టుకపోతంది.
ఇదంతా పైకి కన్పించే ప్రవాహం. కాని లోపల తమ కుటుంబ సభ్యులు చనిపోయినవారు ఏంమాట్లాడకుండ మూగిన మేఘాల్లాగా ఉండేవారు. అరెస్టయిన కుటుంబాల వాళ్లు చేతులెత్తి దండంబెట్టి ‘‘అయ్యా మా బతుకు మమ్ముల బతుకనియ్యండి. కలోగంజో తాగి బతుకుతం. కేసులు- పోలీసోల్లతోని మా పజీతు పోతుంది’అనెటోల్లు. పత్రికలు, మేధావులు- ఉద్యోగులు- ‘‘గిదంత భాగనే ఉందిగని గంత హింస అవసరమా? నక్సలైట్లు- పోలీసుల మద్య ప్రజలు నలిగి పోతున్నరని’’ అనేటోల్లు. అన్ని సందర్భాలల్లో ఎలాంటి ఆవేశకావేశాలకు లోనుకాకుండా – రఘును అలుముకున్న రత్నయ్యలాగా నాయకులు ప్రజలను గుండెలకదుముకునేవాళ్లు. తిండి తిప్పలు లేకుండా నిద్రహారాలు మాని నీళ్లల్లో చేపల్లాగా ఎక్కుపెట్టిన తుపాకుల నీడలో రాత్రి పగలు, పల్లెలు, గనులు, అడవులు తిరిగేవారు.
ఇదంతా ఎట్లా సాద్యమైంది? మళ్లీ జన్నెకోడె గుర్తకొచ్చింది. ఇదంతా జరుగుతుండగానే అడివంటుకున్నది. వాంకిడిలో పులిమీద వచ్చిన పొరకల సారు ఆదివాసులు అట్లా ఒకరికొకరు చెప్నుకున్నారు. షావుకార్లు దోచిన ఎవరి నగలు వాళ్లు తీసుకొమ్మన్నరని సుమారు ఇరువై వేలమంది ఆదివాసులు వాంకిడి షావుకార్ల ఇండ్లలో జొరబడి సామానులు తీసుకపోయారు. గొడ్డండ్ల శబ్దాలతో అడవి దద్దరిల్లింది. తుడుం మోతలతో మోగింది. గోదావరి ఆవలి ఒడ్డుకు జరిగిన అనేక రైతుకూలీ పోరాటాల నుండి ఆరితేరిన వాళ్లు – సిగరేణి బిడ్డలు ఆదివాసులకు తోడయ్యారు. గిరిన రైతుకూలి సంఘం ఏర్పడింది.
ఈ గొడవల్లోనే మార్క్సు, లెనిన్, యెనాన్ రిపోర్టు లాంటివి మళ్లీ చదివాను. క్రాంతులు, సృజనలు- యజ్నం కథ- గోర్కి లూహన్ చదువుతనే ఉన్న. నా మెదడు దారి దొరకని అడివిలాగా అయిపోయింది. 1980 ఏప్రిల్ మొదటి వారం నుండే ఇంద్రవెల్లి రైతుకూలీ సభల సన్నాహాలు మొదలయ్యాయి. కరపత్రాలు ఉపన్యాసకులు వచ్చేవాళ్లు, పోయేవాళ్లు. గద్దర్ రావడం యమ బిజీబీజీ. వరసగా మూడు వారాలు నా సహ ఉద్యోగులతో మాట్లాడుకొని నైట్ డ్యూటీ నేను ఇంద్రవెల్లి బయిలెల్లే సరికి సాయంకాలం మూడయ్యింది. బస్టాండు కొచ్చెసరికి గాలికన్నా వేగంగా వార్త తెలిసింది. అత్యంత క్రూరంగా జలియన్ వాలాబాగ్ లోలాగా కాల్పులు జరిగిన విషయం తెలిసింది. అన్నీబందు.
అరవై మంది చనిపోయి- మూడువందల మంది గాయపడిన విషాదం నన్ను మరింత కలకలం రేపింది. జన్నెకోడెస్థానే-అడవి-తుపాకుల మోత నిదుర పట్టేదికాదు. ఎవరికి చెప్పుకోవాలి?
కాని డా. గోపినాథ్ నాయకత్వంలో డాక్టర్లు, వేణుగోపాల్ పౌరహక్కుల వాళ్లు అన్నిరాష్ట్రాల నుండి వచ్చి అంత ఉద్రిక్త పరిస్థితిలో ఆదివాసులను గుండెలకత్తుకున్నారు. వాళ్ళ నాయకులు వాళ్లతో పాటే ఉండి ఓదార్చారు. కొమురం భీంను నైజాం పోలీసులు కాల్చేసిన తరువాత సుమారు నలుబై సంవత్సరాలు ఆదివాసులు ఆ విషాదం నుండి కోలుకోలేదు. కాని ఇంద్రవెల్లి ఘటన తరువాత ఆరు నెలలకే ఆదివాసీ పోరాటం మరింత ఉద్రుతమైంది.
ఇదంతా ఈ మొత్తం గడబిడలో అడవిలో తన సహచరులతో నిలబడిన నాయకుడు మద్దునూరులో మంటలు లేపిన రఘు(ఆదిరెడ్డి) ముంజం రత్నయ్య అప్పుడు నాకేదో రూపుకడుతోంది. బయట ఉద్యమాలు పెరిగి – పని పెరిగి కోలాహలంగా క్షణం తీరిక లేకుండా తిరుగుతున్నా లోపల ఏదో తడుతోంది. మే మాసమంతా చైనాలో జరిగిన సాంసృతిక విప్లవం గురించి దొరికిన పుస్తకమల్లా చదివాను.
అప్పుడు జన్నెకోడె అర్థమయ్యింది.
ఈ అలజడి పెరిగేదే కానీ తరిగేదికాదు. ఈ ఎరుక ఎవరికైనా ఎంత కష్టమైన త్యాగాలైన అవసరమైందే. ఎప్పుడో చచ్చిపోయి కుళ్లి కంపుకొడుతున్న భూసామ్యం వందల సంవత్సరాలుగా మహాద్భుతమైన స్రుజనాత్మకమైన మనుషులను చంపుతోంది. లేదా చావకుండా కొన ఊపిరితో ఉంచుతోంది. దానికెంత చరిత్ర ఉందో? మానవ ఆరాట పోరాటాలకు అంత చరిత్ర ఉంది.ఎట్టకేలకు నా కాలంలో నా స్థలంలో భూసామ్యాన్ని బద్దలు కొట్టారు. ఇది మనుషులు నిర్మిస్తున్నచరిత్ర. తలకిందుల ప్రపంచాన్ని సీదా నిలబెట్టే చరిత్ర.
ఈ మొత్తాన్ని సమీక్షించుకోవడానికి నెల్లూరులో జూన్ 1981లో రైతుకూలీ సంఘం మొదటి రాష్ట్ర మహాసభలు జరుపుకోవడానికి సంబంధించిన వార్తతోపాటు సమీక్ష లాంటి వ్యాసాలు క్రాంతి పత్రికలో వచ్చాయి. సుమారు 14 సంవత్సారాలుగా (1967 నుండి 1981) దాకా ( రష్యా విప్లవోద్యమం కన్నా మూడు సంవత్సరాలు ఎక్కువ రష్యా విప్లవం 1906 నుండి 1917 దాకా) జరిగిన నక్సల్బరీ రైతాంగ పోరాటాలు అనేక ఆటుపోట్ల తరువాత నిలదొక్కుకోవడం.
అప్పుడన్పించింది. కథరాయాలని. ఇంతపెద్ద కాన్వాసును ‘‘జన్నెకోడె’’కు అటుయిటుగా విస్తరించిన మనుషుల లోలోపలి ఎదుగుదల గురించి రాయాలి. అంటే ప్రతీకాత్మకంగా.
మళ్లీ అతలాకుతలం. అటుయిటుగా జరిగిన ముఖ్య ఘట్టాలన్ని రాసుకున్నాను. ఆ ఘట్టాలల్లో నుంచి వచ్చిన ఫలితాలు- ఉద్వేగాలు-రాసుకున్నాను. మళ్లా మద్దునూరు… కొండకావల విసిరేసినట్టున్న ప్యూడల్ ఊరు. దాన్ని అర్థం చేసుకోవడానికి మద్దునూరు దొర మామూలు దొర కాదు. 500 ఎకరాల పట్టా భూమి, 600 ఎకరాల ప్రభుత్వ భూమి, 200 ఎకరాల అడవి ఆక్రమించాడు. ఉత్పత్తి వనరులైన భూమి, అడవి, పశువులు, నీటి వనరులు, ఉత్పత్తి సాధనాలు కలిగినవారు. పెద్దూరు డైరీఫాం ఉండేది. మొదట ట్రాక్టర్ కొన్నవాడు. అయిదు సంవత్సరాల కాలంలో ప్రజలనుండి దండుగల రూపేణా సుమారు 27 లక్షలు వసూలు చేశాడు. ఇప్పుడవి సుమారు పదహారు కోట్లు ( 60 రెట్లు పెరిగాయి). అప్పుడు కూలి మొగనాలుగు రూపాయలు, ఆడ రెండున్నర- వడ్డీవ్యాపారం, దొంగతనంగా కలప అమ్మడం ఆరు గ్రామాల మీద ఆధిపత్యం (ఇదంతా నాగేటి చాళ్ల్లల్లో రగిలిన పోరాటాలల్లో రికార్డయ్యింది.) బిసి కులం పట్వారి రైతులను కూలీలను దోపిడీ హింసలే కాకుండా పని పాటలోల్లయిన ఆశ్రిత కులాలతో వెట్టిచాకిరి.
ఉత్పత్తి శక్తులు, రైతుకూలీలు, ఆశ్రిత కులాలైన వ్రుత్తి పనివారు తరతరాల దోపిడిలో, దౌర్జన్యంలో ఉన్నారు. ఉత్పత్తి సంబంధాలు- మద్య యుగాల నాటి మొరటు హింసాత్మకమైనది. వర్గ కుల వైరుధ్యాలతో పాటు పిత్రుస్వామిక భావజాలంలో ఉన్నారు. మొత్తంగా ఆ ఊరొక నిరంతరం రగిలే యుద్ధరంగం.
రాజన్నా, మళ్లొకసారి కళ్లనిండా నీళ్లతో చదివిన. రఘు గురించి వాక్యాలు నీళ్లు అడ్డుపడి చదవలేకపోయిన. చాల బాగుంది. రాయి. ఇంకా రాయి. నువ్వే రాయగల చరిత్ర.