నా రాజకీయ మార్గదర్శకుడు చెరబండరాజు

మా సారు చెరబండరాజు విషయాలు ఈ విధంగా పంచుకునే అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా వుంది. నిర్ధిష్ట రాజకీయాలను పరిచయం చేసి నా జీవితానికో అర్థాన్ని, సార్థకతని చేకూర్చిన చెర గురించి ఎంత చెప్పినా తక్కువే. నాకు రాసే అలవాటు అంతగా లేకపోవడం వల్ల 1971 నుంచి 75వరకు నా జీవితంలో జరిగిన పరిణామాలకు మార్గదర్శకుడై నా భవిష్యత్తుకి ఒక రూపాన్నిచ్చిన, ఒక రకంగా పునర్జన్మ నిచ్చిన చెరబండరాజును అక్షరీకరించడంలో న్యాయం చేయలేమోననే భయం కూడా వుంది.

1975 నుంచి 2011 వరకు అజ్ఞాతంగా విప్లవోద్యమంలో వుంటూ ఆంధ్రప్రదేశ్‌కి దూరంగా ఉండడంతో కొన్ని విషయాలు మరిచిపోవడమూ, జ్ఞాపకం వచ్చింది వచ్చినట్టుగా రాస్తూ పోవడంతో కాల క్రమాలు కాస్త అటూ ఇటూ అయ్యే అవకాశమూ వున్నది. తరువాతి తరాలకు చెరబండరాజు గురించి తెలియాలని ఆయన జీవితమూ, సాహిత్యాల గురించి కొన్ని వివరాలు రాయడానికి ప్రయత్నించాను.

మలక్ పేట గవర్నమెంట్ హై స్కూలులో అయిదవ తరగతిలో చేరిన నాకు పదవ తరగతికి వచ్చేవరకు చెరబండరాజు మా స్కూల్లో ఉపాధ్యాయుడుగా పని చేస్తున్నారని తెలియదు. తెలుగు వ్యాక రణాన్ని ఒంట పట్టించుకోలేక విసిగిపోయిన నాకు పదవ తరగతిలో తెలుగు పాఠాలు చెప్పడానికి వచ్చిన బద్దం భాస్కరరెడ్డి సారు వ్యాకరణాన్ని అర్థం చేయించడం చూస్తే ఎంత కఠిన విషయాన్నైనా సులభంగా అర్థం చేయించగలిగే పద్ధతులు వుంటాయి అని తెలిసింది. ఆ సారు అంటే ఒక హీరో వర్‌షిప్ వుండేది. కళ్ళు నవ్వుతాయంటారే అలా, ఏదైనా విషయాన్ని వివరిస్తున్నప్పుడు మేము అర్థమయినట్టుగా తలలూపుతుంటే నవ్వే కళ్ళతో ఆయన మొహం వెలిగిపోయేది. ఏదైనా ఒకరోజు ఎంతగానో మిస్ అయ్యేవాళ్లం. పుస్తకంలో పాఠాలకు అనుగుణంగా సామాజిక విషయాలను జోడిస్తూ ఎంతో వివరంగా విషయాల్ని అర్థం చేయించేవాడు.

1944 లో చెరబండరాజు పుట్టిన వూరు హైదరాబాద్‌కు 24 కి మీ దూరంలో ఉన్న నలగొండ జిల్లా బోనగిరి తాలుకా లోని అంకుశాపురం అనే గ్రామం. వారిది ఒక నిరుపేద రైతు కుటుంబం.

బద్ధం భాస్కర్ రెడ్డి కలం పేరు చెరబండరాజు అని ఆయన తన కవిత్వం పుస్తకం ఒకటి నాకు చదవమని ఇచ్చినప్పుడు తెలిసింది. ఏ విషయాన్నైనా నిర్మొహమాటంగా అడిగేయాలని, ప్రశ్నించడానికి వెనుకాడకూడదనీ నేర్పిన పాఠాన్ని ఆయన మీదే ప్రయోగిస్తూ చెరబండరాజు అనే పేరు పెట్టుకోవడం గురించి , “రాచరికాన్ని ధిక్కరిస్తూ రాసే మీరు ఈ పేరు పెట్టుకుంటే రాజు మీద మోజు ఉన్నట్లు కాదా” అని అడిగినప్పుడు దాని వెనుక వున్న గాథను వివరించారు. తాను కడుపులో ఉన్నప్పుడు తల్లి బాల నరసమ్మకు పది నెలలు నిండినా ప్రసవ నొప్పులు రాలేదు. ఆవిడ ఆ గర్భస్థ శిశువును మోయలేక ఆపసోపాలు పడుతుంటే ఆ పల్లెటూళ్ళో ఆమెను కోదండమేశారు. అలా తల్లిని ఎంతో కష్టపెట్టి బయటకువచ్చి తల్లి చెరను విడిపించాడని తండ్రి ఆయనను చెరబండరాజు అని పిలుచుకున్నాడు. పుట్టిన బిడ్డకు బక్కారెడ్డి అని పేరు పెట్టుకున్నారు. ఇంట్లో బాల నరసింహ అని ముద్దుగా పిలుచుకొనేవారు. ఆ తరువాత స్కూల్లో చేర్చేటప్పుడు బక్కారెడ్డి పేరుని భాస్కర రెడ్డిగా మార్చారు.

దిగంబర కవులుగా ఏర్పడినప్పుడు కులాన్ని సూచించే పేర్లు వదులుకోవాలని చర్చ జరిగితే తన తండ్రి పిలిచిన ఈ పేరు జ్ఞాపకం వచ్చి తాను ఆ పేరును పెట్టుకున్నాడు. క్లాసులో పాఠ్యాంశంలో వ్యాసాలు రాయడానికి “దేవుడు ఉన్నాడనేవాళ్ళుగా, లేడనే వాళ్ళుగా ప్రపంచం రెండు సమూహాలుగా విడిపోతే మీరు ఏ వైపు ఉంటారు?లాంటి శీర్షికలను వ్యాసాలు రాయడానికి ఇచ్చేవాడు. సిలబస్‌లో లేని, ఆలోచనలను రేకెత్తించే అంశాలను ఎన్నుకొనేవాడు. కఠినమైన పదాలను డిక్టేషన్‌గా రాయమని చెప్పేవాడు. ఒకసారి సుబ్రమణ్యం అనే పేరుని రాయమని చెప్పి దాన్ని ఎంతమంది ఎన్ని రకాలుగా రాశారో చెబుతూ ఆ పదం రాసే పద్ధతి వారి సామాజిక, ప్రాంతీయ నేపథ్యాన్ని కూడా తెలియచేస్తుందని వివరించాడు. తెలుగు పాఠం చెప్పేటప్పుడు తాను రాసిన కవితలలోని పంక్తులు చదివి వినిపించేవారు. గోర్కీ అమ్మ, వట్టికోట ఆళ్వారుసామి ప్రజల మనిషి, చైనా కథలు వగైరా ఎన్నెన్నో పుస్తకాలు చదవడానికి ఇచ్చేవారు.

చిన్నప్పటినుంచి కథలు, నవలలు, రకరకాల వారపత్రికలు చదివే అలవాటున్న నాకు ఆయన ఇచ్చిన పుస్తకాలను మొదట్లో వెంటనే చదివి ఇచ్చేస్తుంటే ఆశ్చర్యపోయేవాడు. నాన్న కొంతకాలం లైబ్రరీ కార్యదర్శిగా కూడా పని చేశారు.అందులో విషయాలను నేను ఎలా అర్థం చేసుకొన్నాను అని అడిగినప్పుడు సరిగా చెప్పలేకపోయినప్పుడు, కాలక్షేపంలాగా చదవకూడదనీ ఆ పుస్తకంలోని సామాజిక రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకొంటూ ఒక అవగాహన ఏర్పరచుకోవాలనీ చెప్పి ఆ తరువాత ఇచ్చిన పుస్తకాలను చదివే పద్ధతిని మార్చారు. నేను ఆ పుస్తకాన్ని ఎంత అర్ధం చేసుకొన్నాననో తెలియచేయాలనే ఆతృతతో మరింత శ్రద్ధగా చదివేదాన్ని.

పదవ తరగతి చదువుతున్నపుడు వచ్చిన ఆగస్టు పదిహేనునాడు నేను ఉపన్యాసం ఇస్తూ ఈ స్వాతంత్ర్యం వల్ల ప్రయోజనం ఏముందనీ, పాలల్లో నీళ్ళు కలిపి అమ్మితే ఎంత లాభం వస్తుంది అని లెక్కలు నేర్పించే పాఠాలతో మనం ఏం నేర్చుకుంటున్నామనీ చెబుతూ ‘‘ఆగస్టు 15 ద్రోహన్ని చెప్పకపోతే అన్నం సహించదు నాకు’ అని చెరబండరాజు రాసిన కవితా పంక్తిని ఉదహరిస్తే ఎంతగానో మురిసిపోయాడు. స్కూలు తరఫున వ్యక్తృత్వ పోటీల్లో పాల్గొనడానికి వెళ్లినప్పుడు విషయ సేకరణలో సాయం చేసేవారు.

ʹఏటికేతం బెట్టి ఎయిపుట్లు పండించి గంజిలో మెతుకెరగనన్నాʹ అని మోటకొడుతూ తన అయ్య, పేగులు నోట్లో కొచ్చేలా గొంతెత్తి పాడుకునే వాడని చెర ఎన్నోసార్లు జ్ఞాపకం చేసుకొనేవాడు. చెర తాను హైస్కూల్‌ విద్యార్థిగా ఉన్నప్పుడే కవిత్వం రాయటం ప్రారంభించాడు. పదహారేళ్ళ వయసులోనే పద్నాలుగుఏళ్ళ వయస్సు వున్న శ్యామలతో 1960లో పెండ్లి జరిగింది.ఆమె గురించి రాసిన ప్రేమ కవిత్వం కూడా చదివి వినిపించాడు. చెర సహచరి శ్యామలతో కలిసి చెలకల్లో పని చేశాడు. మలక్‌పేట ఆంధ్ర కాలనీ నుంచి అంబర్‌పేటలో వుండే సార్ ఇంటికి నడుచుకుంటూ వెళ్ళేదాన్ని. మధ్యలో పొలాలు ఉండేవి. అంత దూరం నడచి వచ్చావంటూ శ్యామల అన్నం పెట్టేది. కొన్ని సార్లు మీటింగులకు వచ్చేది. మీతో పాటు శ్యామలని కూడా అన్ని చోట్లకూ ఎందుకు తిప్పరని వాదించేదాన్ని. పధ్నాలుగు సంవత్సరాల తరువాత వారికి పాప పుట్టడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఉదయిని అని పేరు పెట్టారు. పాపతో ఎక్కువ సమయం గడపకుండానే త్వరలోనే అరెస్ట్ అయి జైలుకి వెళ్లాల్సి వచ్చింది. శ్యామల చెరతో అన్ని సమయాల్లోనూ తోడునీడగా నిలచింది.

తన స్కూలు ఉపాధ్యాయుని ప్రోత్సాహంతోనే హైస్కూలు చదువు అయిపోయి కళాశాలలో చేరాల్సిన వయసులో తండ్రి యిక చదివించలేను అని అనడంతో ఇంట్లో చెప్పకుండా చెర ʹశాంతినికేతన్‌ʹలో చేరాలని పారిపోయాడు. కలకత్తాలో డబ్బులు లేక నానా ఇబ్బందులు పడి వెనక్కి తిరిగి వచ్చేశాడు. నల్లకుంట ప్రాచ్య కళాశాలలో ఎం.ఒ.ఎల్‌. (తెలుగు) దాకా చదివాడు. 1961లో ఉపాధ్యాయ వృత్తిలో చేరాడు.

1962లో నిఖిలేశ్వర్‌తో పరిచయం ఏర్పడింది. 1965నాటికి ఆరుగురు దిగంబర కవుల్లో ఒక్కడై చెరబండరాజుగా మారాడు. ‘‘ఏటికేతం బట్టి వెయ్యి పుట్లు పండించి గంజిలో మెతుకెరుగనన్నా’ అని పాడుకుంటూ దశాబ్దాల కర్షక జీవితంలో హక్కుల గురించి తెలియకుండానే కన్నుమూసిన తండ్రికి తన తొలి కవితా సంకలనం ‘‘దిక్సూచి’’ ని అంకితం ఇచ్చాడు.

1965-68 మధ్య దిగంబర కవులు కవిత్వం రాశారు. నగ్నముని, నిఖిలేశ్వర్, చెరబండరాజు, జ్వాలాముఖి, భైరవయ్య, మహాస్వప్న అనే ఆరుగురు దిగంబర కవులుగా ఏర్పడి మూడు కవితా సంపుటాలను ప్రచురించారు. సమాజంలోని అన్యాయాలను, అక్రమాలను చూసి కోపంతో తిట్లకు, పరుషపద ప్రయోగాలకు దిగారు. సమాజంలోని రాజకీయ కుళ్లును దిగంబరం చేసి చూపారు. సమాజంలోని అవినీతిని, దోపిడీని, ఆత్మవంచన, పరవంచనలను అసహ్యించుకున్నారు. మత మౌఢ్యాన్ని, దొంగ గురువుల మోసాలను ప్రశ్నించారు. ఆధునిక నాగరికతలోని దుర్మార్గాలకు, అక్రమాలకు బాధపడ్డారు. సుమారు మూడేండ్లు తెలుగు సాహిత్యంలో ఒక సంచలనాన్ని సృష్టించిన వీరిలో నగ్నముని, నిఖిలేశ్వర్, జ్వాలాముఖి, చెరబండరాజు 1970 జులై 4న విరసం ఏర్పడినప్పుడు అందులో చేరారు.

1971లో పి డి యాక్ట్ కింది చెరను అరెస్టు చేశారు. ముషీరాబాదు జైలులో ఉన్నప్పుడు శ్యామలతో కలిసి ఆయననుచూడడానికి వెళ్లినప్పుడు, నేను వస్తానని ఊహించని ఆయన ఎంతగా ఆనందాన్ని ప్రకటించారో ఇప్పటికీ జ్ఞాపకమే. రెండు సంవత్సరాల తరువాత వరవరరావు, ఏం.టి. ఖాన్‌లతో పాటు మళ్ళీ మీసా కింద అరెస్టు చేశారు.
ఒకసారి వివి చెరల జీవన సహచరులు హేమక్క, శ్యామలతో కలిసి జైలుకు వెళ్లినప్పుడు వివి సారుని కూడా చూశాను. వివి సారుకి చెర తన శిష్యురాలని పరిచయం చేసినప్పుడు ఆయన ముఖంలోని వెలుగుని (ఒక చిన్న గర్వంతో కూడిన మెప్పుకోలు) తలచుకొన్నప్పుడల్లా నా రాజకీయ ఎదుగుదల పట్ల ఆయనకు వున్న విశ్వాసాన్ని నాకు చేతనైన స్థాయిలో నిలబెట్టుకోగలిగినందుకు నాకూ కొద్ది గర్వమే మరి.

చెర విరసం వ్యవస్థాపక కార్యవర్గ సభ్యుడు. కార్యదర్శిగా 1971-72లో పనిచేశారు. 1971 నుండి 1977 మధ్యకాలంలో మూడేళ్ల పాటు చెరసాల పాలయ్యాడు. జైల్లో మొదలైన తీవ్ర తలనొప్పికి కారణం బ్రైన్ ట్యూమర్ గా గా తేలింది. 1977 నుండి 1981 మధ్యలో మూడుసార్లు ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది. ఎంతోమంది విప్లవ రాజకీయాలతో వున్న విద్యార్థులు యువత వంతులవారిగా ఆయన పరిరక్షణ ఆసుపత్రిలో చేశారని తెలిసింది. చెర అనారోగ్యంతో ఉండగానే ప్రభుత్వం ఉద్యోగం నుండి తొలగించింది. అయితే ప్రజాందోళన వల్ల తిరిగి యివ్వాల్సి వచ్చింది కూడా.

హైస్కూలు జూనియర్ కాలేజీగా మారడంతో నేను ఇంటర్మీడియట్ అక్కడే చేరాను. పదవ తరగతికి వచ్చే వరకు డాక్టరుని కావాలనే కోరిక ఉండేది. మంచి మార్కులు తెచ్చుకొని గవర్నమెంట్ కాలేజీలో చదవగలిగితే చదువు కానీ నాకు పైవేటు కాలేజీలో చదివించే స్థోమత లేదు అని నాన్న చెప్పేశాడు. తరవాత కొత్తగా నేర్చుకున్న రాజకీయాల ప్రభావంతో సైన్సు తీసుకుంటే ఎక్కువ సమయం చదువుకే ఖర్చయిపోతుందని. ఇంటర్మీడియట్‌లో సి.ఇ.సి గ్రూపు తీసుకున్నాను. అక్కడే చదువు కొనసాగించడంతో మరో రెండు సంవత్సరాలు చెరబండరాజుని మార్గదర్శనంతో మరింత ఎదిగే అవకాశం కలిగింది.

1973లో చెర రాసిన గౌరమ్మ కలలు అనే సుదీర్ఘ కవిత చదివి అందులో ఒకటి రెండు విషయాల గురించి విమర్శనాత్మకంగా చెప్పినప్పుడు అంత శ్రద్ధగా చదివావా అంటూ చిన్న పిల్లాడిలా సంబరపడిపోయాడు.

ఆ పుస్తకాన్ని “ జనాభాలో సగం మంది మహిళ లున్న సమాజంలో స్త్రీలోకం ముందురాక జనవిముక్తి జరగదనీ”, “పోరాడుతున్న చెల్లెళ్లకు” అంకితమిచ్చాడు.

“కొండలు పగిలేసినం, బండలనూ పిండినం మా నెత్తురు కంకరగా ప్రాజెక్టులు గట్టినం శ్రమ ఎవడిదిరో, సిరి ఎవడిదిరో” అనే పాటకు జననాట్యమండలిలో భూపాల్‌ వాళ్ళు డ్యాన్సు రూపం ఇచ్చారు. కారణాలు తెలిసినం, ఆయుధాలు పట్టినం మా యుద్ధం ఆపకుండ విప్లవాలు నడిపెదం, చావు మీదిరో, గెలుపు మాదిరో అని ముగింపు చేస్తున్నప్పుడు హాలులో చప్పట్లు మారుమ్రోగిపోయేవి.

మాలోని మనిషివే మా మనిషివే నీవు/ పొట్టకూటికి నీవు పోలీసువైనావు/ ప్రాణాలు బలిపెట్టి పోరాడు సోదరుల/ గుండెలకు తూటాలు గురిపెట్టినావేమి/ అన్నన్న ఆ బతుకు బతుకే గాదు అని రాసిన పాటలో పోలీసుల కిరాయి బతుకుల పట్ల ఎంత సరియైన అవగాహన వుంది అన్పించింది.

చెర రాసిన “ఎర్రెర్రని తెలంగాణ ఎర్రెర్రని తెలంగాణ/ ఇదేనండి ఇదేనండి ఎర్రెర్రని తెలంగాణ/ కమ్యూనిస్టు గుండెకాయ కష్టజీవి కలలకోన/ అనే పాటని గ్రామాలకు తరలండి కేంపెయిన్ లో ఎంతో ఉత్సాహంతో పాడేవాళ్ళం.

మా అమ్మ చాలా అమాయకంగా ఉండేది. అమ్మమ్మ, తాతయ్య అమ్మకు పది సంవత్సరాల వయసులోనే చనిపోతే పెద్దమ్మ పెంచి పదహారేళ్ళ వయసులో పెళ్లి చేసి పంపించిందట. ముగ్గురు మేనమామలు, ఇద్దరు పెద్దమ్మలు ఉండేవారు కానీ సంబందాలు అంతంతమాత్రంగానే ఉండేవి. ఏ మాత్రం హడావిడి లేకుండా పొద్దున్న ఎనిమిది గంటల కల్లా కిరోసిన్ స్టవ్ మీద వంట చేసి పెట్టేసేది. మా చదువుల సంగతి అంతా నాన్నే చూసుకొనేవాడు.

నాన్న అంధ విద్యార్థుల పాఠశాల హెడ్ మాస్టారుగా పనిచేసేవాడు. ఆయనకు సినిమాలు, నాటకాలు చూడడం అంటే చాలా ఇష్టం. ఇంట్లో వాళ్లందరమూ కలిసి సినిమాలకు వెళ్ళే పరిస్థితి ఉండేది కాదు. సినిమా చూడడానికి నన్ను తనతోబాటు తీసుకెళ్ళేవాడు. 75 పైసల టికెట్ తీసుకుని ముందు రెండు వరసల్లో కూచునే వాళ్ళం. ఏడుపు సీను వచ్చినప్పుడు భరించలేక ఏడుస్తుంటే దగ్గరికి తీసుకునేవాడు. వాళ్ళ స్కూల్లో వార్షికోత్సవాలప్పుడు చిన్న చిన్న నాటకాలు వేయించేవాడు. రేడియోలో ఆడిషన్ టెస్ట్ పాస్ అయ్యి ఒక నాటికలో చిన్న పాత్ర వేసినప్పుడు వారు ఇచ్చిన 25 రూపాయల డీడీ ఇప్పటికీ జ్ఞాపకం. నాకు నాటకాలు వేయడంలో ఇంట్రెస్ట్ వుందని తెలిసిన చెర ఆర్ట్ లవర్స్ బాధ్యులుగా వున్న నరసింగరావు, గద్దర్,ఎల్ ఎస్ ఎన్ మూర్తిలకు పరిచయం చేశాడు. తరువాత అది జననాట్యమండలిగా 1972లో రూపాంతరం చెందింది. నాటికల్లో మహిళ పాత్రలు వేయడానికి ఎవరూ లేరని నువ్వు వేస్తావా అని చెర నన్ను అడిగినప్పుడు నేను ఎంతో ఉత్సాహ పడ్డాను. వీర కుంకుమ నాటికలో పాత్ర వేశాను. విరసం సాహిత్య పాఠశాల 1973లో వరంగల్లులో జరిగినప్పుడు మొదటి సారి ప్రదర్శించాము. ఇలా విరసం కార్యక్రమం ఉందని చెప్పకుండా నేను నానమ్మని చూడడానికి వెళ్తున్నానని చెప్పి ముందుగా వెళ్లిపోయాను.

ఆ తరువాత మరోసారి ఆంధ్ర సారస్వత పరిషత్ హాలులో వేసినట్లు గుర్తు. అలా జె ఎన్ ఏం కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలైంది. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా పది రోజుల పాటు జరిగే సాంస్కృతిక కార్యక్రమాలలో ఒక రోజు మాకు కేటాయించేవారు. ఇంటికెళ్ళేటప్పటికి రాత్రి చాలా ఆలస్యం అవడంతో నాన్నకు కోపం రావడం మొదలైంది.

నక్సల్బరి రాజకీయాలతో పని చేస్తున్న పి డి ఎస్ యు విద్యార్థి సంఘం రాష్ట్ర మహా సభలో కార్యవర్గ సభ్యురాలిగా ప్రమాణం చేసినట్లు జ్ఞాపకం. ఆ తరువాత రాజకీయ విబేధాలతో విడిపోయిన ఆర్ ఎస్ యు లో కొనసాగాను. 1975 ఫిబ్రవరిలో మొదటి రాష్ట్ర మహాసభలు జరిగాయి. ఆ నెలలోనే విప్లవోద్యమంలోకి ఇల్లు వదిలి వచ్చేశాను. చెర చూపిన మార్గంలో నా నూతన జీవన పయనం మొదలైంది.

అధిక ధరలకు వ్యతిరేకంగా పెద్ద ర్యాలీ జరిగినప్పుడు మాతోపాటు వున్న చెర ఎండలో నినాదాలు ఇస్తున్న మాకు నోరు ఎండుకుపోతుందని పిప్పరమెంట్లు కొని ఇచ్చారు. రాడికల్ మార్చ్ అనే విద్యార్థి పత్రిక తీసుకు వచ్చేవారు. చెర మరణం తరువాత ఆయన స్మరణలో ఒక చిన్న కవిత రాసి ఆ పత్రికకు పంపినట్టు జ్ఞాపకం.

వరంగల్లు మా స్వంత ఊరు. అక్కడ తాతయ్య, నాన్నమ్మ, మేనత్త కుటుంబం ఉండేవారు. దాదాపు ప్రతి వేసవి సెలవులకు వూరు వెళ్ళేవాళ్ళం. మేనత్త పిల్లలు ఆరుగురూ, మేము అయిదుగురము పదకొండు మందిమి కలిసి ఆటపాటలతో పాటు ఒక సాహిత్య, సాంస్కృతిక వాతావరణాన్ని ఏర్పాటు చేసుకొనేవాళ్లం. అత్తయ్య మామయ్యలు రచయితలు. మేము పిల్లలమంతా నాటికలు ప్రాక్టీసు చేసి ముందర వున్న పెద్ద హాలులో, చీరలతో తెరలు కట్టి ప్రదర్శన ఏర్పాటు చేసే వాళ్ళం. మా మామయ్య మాకు వక్తృత్వ పోటీలు ఏర్పాటు చేసేవాడు. పదవ తరగతిలోకి వచ్చిన తరువాత వెళ్ళిన వేసవి సెలవుల్లో ఏర్పాటు చేసిన పోటీల్లో నేను మాట్లాడడం విని మామయ్య చెరబండరాజు ప్రభావం బాగానే పడుతోందే అని మెచ్చుకొన్నాడు. ఆయన వామపక్ష భావాల మద్దతుదారు, వి వి సారు, లోచన్ మొదలైనవారితో పరిచయాలు ఉండేవి.

చెర తన రాజకీయ శిష్యులైన భూపాల్ వాళ్ళ ఇల్లు చెర ఇంటికి దగ్గరలోనే ఉండేది. కలిసి బీదలపాట్లు, వీర కుంకుమ నాటికలు వేశాము. అంజన్న, తుషార్ లు కూడా పరిచయం అయ్యారు. జె ఎన్ ఏం సంధ్య, నేను, నెల్లుట్ల అరుణ బుర్ర కథ నేర్చుకున్నాము. కానీ ఎక్కడా ప్రదర్శించే అవకాశం రాలేదు.

టి ఎన్ గ్రూపు వారు యువజనులతో ప్రతి ఆదివారం హైదరాబాదులో ఏదో ఒక సామాజిక రాజకీయ అంశంపై చర్చ జరిపేవారు. జీవనాడి అనే పత్రికను తీసుకు వచ్చేవారు. నాన్న నాతో పాటు కొన్నిసార్లు ఆ సమావేశాలకు వచ్చాడు. ఒక సమావేశంలో మాట్లాడాడు కూడా. అప్పటివారిలో వసంత, ఆశ్విని, అశ్విని చెల్లెలు జయా బాగా జ్ఞాపకం. వసంతా నేను, భూపాల్ మరికొంతమంది బీదల పాట్లు అనే నాటికను రెండు మూడు బస్తీలలో వేశాం. బస్తీలో జనం చప్పట్లు కొట్టడం గురించి నాన్న ఇంటికి వచ్చి ఎంతో గొప్పగా చెప్పాడు.

1978 వేసవి సెలవుల్లో గ్రామాలకు తరలండి కేంపెయిన్ మొదలయినప్పుడు నేను కూడా వెళ్ళాను. నెల రోజుల పాటు నల్లగొండ జిల్లాలో తిరిగాము. కేంపెయిన్ ముందు పది రోజుల పాటు మిర్యాలగూడలో రాజకీయ తరగతులు జరిగాయి. చివరి రోజు సాయంత్రం పక్కనే వున్న దళితవాడలోకి పంపించారు. వచ్చిన తరువాత మా అనుభవంపై సమీక్ష జరిగింది. కొంతమంది కబుర్లు చెప్పి వస్తే మరి కొంతమంది చాయ్ తాగి వచ్చామని చెప్పారు. నేను ఒక్కదాన్నే అన్నం తిని వచ్చానని చెప్పినట్టు గుర్తు. వివి సారు ఒక అంశంపై పాఠం చెప్పారు. చెర కూడా వున్నారో లేదో సరిగ్గా జ్ఞాపకం లేదు.

గుంటూరు గుజ్జనగుళ్లలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో సంధ్య పాట పాడుతున్నప్పుడు ప్రేక్షకులపై లాఠీ చార్జి జరుపుతూ వచ్చిన పోలీసులు స్టేజి పక్కన వున్న ఇంట్లో దూరిన పోలీసులు అందరినీ కొట్టి పోలీసు స్టేషన్ కు తీసుకువెళ్ళారు. పోలీసులు నా మొహం మీద ఒక దెబ్బ కొట్టినప్పుడు నా కళ్ళజోడు ఎక్కడో పడిపోయింది. (నన్ను కళ్ళజోడు పద్మగా పిలుచుకొనేవాళ్ళమని జె.ఎన్.ఎం సంధ్య అంటుంది.) తరువాత అరెస్టై గుంటూరు సబ్ జైలులో మూడు రోజులు ఉంచినప్పుడు మమ్మల్ని కలవడానికి వచ్చిన చెర, రెండు రోజులు మసక కళ్ళతో గడిపిన నాకు కళ్ళజోడు తెచ్చిచ్చి వెలుగునిచ్చారు. ఆ రెండు రోజులూ మసక చూపులతోనే వున్నాను.

మేము విడుదలయ్యే రోజే అనుకుంటా ఎమర్జెన్సీ ప్రకటన జరిగింది. హైదరాబాదు నుంచి మమ్మల్ని చూడడానికి వచ్చినప్పుడు ఆ విషయం చెప్పిన చెర ముఖంలో కాస్త ఆందోళన కనబడింది, మమ్మల్ని వదిలిపెడతారో లేదో అని అనుకుంటా. అసలు ఎమర్జెన్సీ అంటే ఏమిటో అప్పటికి నాకు సరిగ్గా తెలియదు.

1970 జూలై 4న విరసం ఏర్పడిన దగ్గర్నించీ 2 జూలై 1982న అమరుడయ్యే దాకా చెరబండరాజు చరిత్ర విరసం చరిత్ర విడదీయరానివి.

తరువాత నా అజ్ఞాత జీవితం వల్ల చెర అనారోగ్యం గురించి విషయాలు తెలుసుకోవడమే తప్ప కలిసే అవకాశమే రాలేదు.

“వాస్తవ జీవితాన్ని వేల మైళ్ల దూరంలో విసిరేసిన విద్యాలయాలు వదిలి జట్లు జట్లుగా,మెట్లు మెట్లుగా యువకులు నడిరోడ్డుకు పరుగెత్తుకురావాలి.

మూఢనమ్మకాల ఉక్కు కౌగిళ్లలో నంగనాచి నాయకుల దొంగ వేషాల్లో నలిగే కృంగే జనం కళ్లగంతలు చించుకొని బయటికి రావాలి.

మహావ్యవస్థ రూపొందించని నాయకులు జనాన్ని జేజమ్మలుగా వాజమ్మలుగా పురుగులుగా వెధవలుగా ఎట్లా దిగజార్చారో ఒక్కసారివెన్నుతట్టి కళ్ళారా చూపించాలి.

యాభై కోట్ల కంఠాలు తిరుగుబాటు మంటలుగా మారాలి. “ అని చెర రాసిన వాక్యాలు ఇప్పటికీ వర్తించేవే.
‘సోషలిస్టు స్వప్నసీమ
కానేకాదు నిజం సుమా!
ఆకలంత సహజమది
అన్నమంత అవసరమది’’ అని చెర చెప్పిన కలలు కన్న సోషలిస్టు వ్యవస్థ కోసం జరుగుతున్న పోరాటం అంతిమ విజయం సాధించేవరకూ కొనసాగించాలి.

చెర గురించి చెప్పడంలో న్యాయం చేయలేకపోయాననే అసంతృప్తి వెంటాడుతోంది.

చివరగా, నా రాజకీయ అస్తిత్వానికి పునాది వేసిన చెరబండరాజు గురించి ఇలా అందరితో పంచుకొనే అవకాశం రావడం ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను. అందుకు మా జె ఎన్ ఎం సంధ్య, లక్ష్మన్నల కూతురు చైతన్యకు, కొలిమి నిర్వాహకులకు కృతజ్ఞతలు.

జ‌న‌నం: బంద‌రు. హైద‌రాబాద్‌లో పెరిగారు. విద్యాభ్యాసం: ఎంఏ., ఎల్ఎల్‌బీ. సుదీర్ఘ కాలం ప్ర‌జ‌ల కోసం విప్ల‌వోద్య‌మంలో ప‌నిచేశారు. ప్ర‌స్తుతం విశాఖ‌ప‌ట్నంలో అడ్వ‌కేట్‌గా, రాజ‌కీయ ఖైదీల విడుద‌ల క‌మిటీలో కార్య‌కర్త‌గా ప‌నిచేస్తున్నారు.

Leave a Reply