ప్రజలు తిరస్కరించినా మారని మోడీ తీరు

మోడీ ప్రభుత్వంలో ”ప్రశ్నను సహించలేరు. విమర్శను భరించలేరు. పరమత సహనం, లౌకికత్వం లేనేలేవు. చివరకు టీవీల్లో వచ్చే మత సామరస్య ప్రకటనలపైనా దాడులు చేస్తున్నారు. యువతరానికి విషయ పరిజ్ఞానం లేకుండా కాలం చెల్లిన రుజువుకు నిలవని పుక్కిటి పురాణాలను పాఠ్యాంశాలుగా బోధిస్తున్నారు. ప్రజలు మతం అనే మత్తులో ఊగేలా ఉద్వేగాలను రెచ్చగొడుతున్నారు. భావప్రకటనా స్వేచ్ఛకు సంకెళ్లు వేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి వారు వెల్లడించిన భావాలే స్వేచ్ఛగా భావించే పరిస్థితులు కల్పిస్తున్నారు. ఎన్నో నిర్బంధాలు ఎదుర్కొని, పోరాడి సాధించుకున్న రాజ్యాంగ హక్కులు కూడా నిష్ఫలం అయ్యాయి. భావప్రకటనా స్వేచ్ఛ స్వీయ నిర్బంధంలో ఉండేలా కట్టడి చేశారు. టివీలు, ఫోన్లలో మనం ఏం చూడాలో కూడా ఇంటర్నెట్‌ నియంత్రణ ద్వారా వారే నిర్ణయించారు. గడిచిన పదేళ్లుగా రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, పౌర స్వేచ్ఛ ప్రమాదంలో ఉన్నాయనడానికి ఇంతకంటే ఆధారాలు ఇంకేం కావాలి!’’

భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని క్షీణింపజేసే విధానాలను గత పదేళ్ళుగా మోడీ తన పాలనలో అనుసరించారు. మోడీ ఏనాడు రాజ్యాంగాన్ని, ఫెడరలిజాన్ని, ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన దాఖలాలు లేవు. భారత రాజ్యాంగాన్ని మోడీ తుంగలో తొక్కాడు. ఆశ్రిత పెట్టుబడిదారుల చేతుల్లోనే రాజకీయ, ఆర్థిక శక్తి కేంద్రీకృతమైంది. పార్లమెంటు, సమాఖ్య విధానం, అనేక ఇతర రాజ్యాంగ సంస్థలను బిజెపి రాజకీయ ఉపాంగాలుగా మార్చుకున్నారు. దేశంలో అత్యున్నత స్థానంలో ఉన్న గుప్పెడు మందికి మేలు చేయడానికి ప్రజల జీవితాలను పణంగా పెట్టి నిర్ణయాలు తీసుకున్నారు. ఫలితంగా దశాబ్ద కాలంలో వ్యాపార ప్రపంచంలో పరిమిత సంఖ్యలోని ఆశ్రితులకు దేశ వనరులపై పట్టు రావడమే కాకుండా, వారికి ఆర్థిక రంగంపై ఆధిపత్యం లభించింది. మోడీ హయాంలో ద్రవ్యోల్బణం విజృంభించి, నిరుద్యోగం పెరిగి, అసమానతలు పెరిగి, కొనుగోలు శక్తి పడి పోయినప్పటికీ మతం మత్తులో, ఇతర అంశాల పేరు మీద బిజెపి అనుకూల ప్రభుత్వానికే పేదలు మద్దతును కొనసాగించారు. హిందుత్వ పేరుతో మైనారిటీలను పణంగా పెట్టి వర్తమాన సామాజిక అంశాలలో అస్తిత్వ రాజకీయాలు, మతతత్వ విభజన తీసుకొచ్చారు.

ఈ నేపథ్యంలో 18వ పార్లమెంట్‌ ఎన్నికలు ఏప్రిల్‌ 13 నుంచి జూన్‌ 1 వరకు ఏడు విడతలుగా జరిగాయి. గడిచిన పదేళ్లలో ఒక వ్యక్తి కేంద్రీకృత వ్యవస్థగా మారిన భారతీయ జనతా పార్టీకి మోడీ తిరుగులేని నాయకుడు. ఆయన నాయకత్వానికి ఆయనే ముగ్దుడై తనది కారణ జన్మ అని, తాను తన తల్లికి పుట్టలేదని, దేవుడే తనను పంపించాడని చెప్పుకున్నారు. పూరీ జగన్నాథుడే మోడీ భక్తుడని బిజెపి అధికార ప్రతినిధి ఒకరు వాక్రుచ్చారు. మోడీ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ నిర్మాణపరంగా ఎంతో ఎదిగి పోయిందని, దానికి ఆర్‌ఎస్‌ఎస్‌ వంటి సంస్థ అవసరం ఇక ఏ మాత్రం లేదని భారతీయ జనతా పార్టీ అధ్యకక్షుడు జగత్‌ ప్రకాశ్‌ నడ్డాయే ప్రకటించారు. ఏమైతేనేం దాదాపు 80 రోజులుగా జరిగిన ఎన్నికల ఘట్టంలో ఎన్నో రాజకీయ దృశ్యాలు, భావోద్వేగ ప్రసంగాలు, అబద్ధాలను అలవోకగా చెప్పడం, ఉత్కంఠ భరితమైన సన్నివేశాలు, అధికార దుర్వినియోగం చూసే అవకాశం ప్రజలకు కలిగింది.

జూన్‌ 4న ఎన్నికల ఫలితాలూ వచ్చాయి. మళ్ళీ మోడీ సర్కార్‌ జూన్‌ 9న ఢిల్లీ పీఠమెక్కింది. అయితే ఈసారి మోడీ స్వంత కాళ్ళ మీద అందలం ఎక్కడం లేదు. రెండు ఊత కర్రల సాయంతో కుర్చీని అతి కష్టం మీద అందుకున్నారు. గతంలో మోడీ చేతిలో అవమానాలకు గురైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌, మోడీ ఆలింగనాలతో తరించిపోయి ఆయన ఆకాంక్షను నెరవేర్చారు. ఏమైతేనేం పది సంవత్సరాల తర్వాత దేశంలో మళ్లీ సంకీర్ణ రాజకీయాలు ప్రారంభమయ్యాయి. అయితే ఎన్‌డిఎ సహజసిద్ధమైన కూటమని, ఇందులో ఎవరికి అధికార యావలేదని మోడీ చెప్పటం కూడా వింతగానే ఉంది. ఇప్పుడు ఎన్‌డిఎకు మద్దతుగా నిలిచిన నితీష్‌, చంద్రబాబులిద్దరూ ఊగిసలాటకు పెట్టింది పేరు. నిలకడ తక్కువ, అవకాశవాద రాజకీయం ఎక్కువ. ఏ గట్టున బాగుంటుందనుకుంటే అటు దూకే బాపతు.

ఈ ఎన్నికలలో దేశ ప్రజలు తమ ఓటుతో మోడీకి శృంగ భంగం చేశారు. తనకిక ఎదురు లేదని విర్రవీగిన మోడీ తోక కత్తిరించారు ఓటర్లు. ఇది నైతికంగా మోడీకి పరాజయం. రాజ్యాంగం మార్చడానికి సిద్ధమైన మోడీ పరివారం దూకుడికి ప్రజలు కళ్ళెం వేశారు. రాజ్యాంగాన్ని మారుస్తామని, హిందూ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని ఎన్నికల ముందు ప్రకటించారు. అలాగే ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఒకే నేత అన్న మోడీ గ్యారంటీకి ఓటర్లు బ్రేకు వేశారు. అందుకే ఇది ప్రజావిజయం. ప్రజాస్వామ్యాన్ని మట్టుపెట్టాలని, విద్వేష రాజకీయం కోసం మోడీ తలపెట్టిన వికృత క్రతువును భగ్నం చేసిన జనవిజయం ఇది. ప్రజలు తలుచుకుంటే అజేయులంటూ ఎవరూ ఉండరని అందరూ పరాజితులే అవుతారని రుజువు చేశారు. చరిత్రలో ప్రజలే అంతిమ విజేతలు. మోడీ హవా, సమ్మోహనా శక్తి తాత్కాలిక నీటి బుడగలేనని తేల్చేశారు.

ఈ ఎన్నికలకు మరొక ముఖ్యమైన ప్రత్యేకత ఉంది. ఎన్నికల ప్రచారంలో సిద్ధాంతపరమైన, విధానపరమైన అంశాలు ప్రధాన పాత్ర పోషించడం ఒక కొత్త మేలి మలుపు. లౌకిక, ప్రజాస్వామిక మేధావులు, హక్కుల కార్యకర్తలు, ఇండియా కూటమి ఈ చర్చను సమర్థవంతంగా నిర్వహించింది. ప్రజాస్వామ్యాన్ని, పౌరస్వేచ్ఛనే కాదు దళితులకు, ఆదివాసీలకు, బహుజనులకు, మైనారిటీలకు రక్షణ కవచంగా ఉన్న రాజ్యాంగాన్ని పరిరక్షించే ఎన్నికల పోరాటంగా రాహుల్‌ గాంధీ ప్రకటిస్తూ రాజ్యాంగ పుస్తకాన్ని ప్రజలకు చూపిస్తూ చేసిన ప్రసంగాలు వారిని విశేషంగా ఆకట్టుకున్నాయి. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ మత విద్వేష మనువాద సిద్ధాంతాలను ఇండియా కూటమి ఎండగట్టింది. కులగణన ద్వారా సామాజిక న్యాయాన్ని అందించే అవకాశాలను ప్రచారంలోకి తెచ్చింది. రాజకీయం అంటే అదానీలకు, అంబానీలకు దేశాన్ని దోచిపెట్టడం కాదంటూ మోడీ పాలన ప్రజల కోసం కాదని ప్రచారం చేసింది. రానున్న కాలంలో ప్రజలను అప్రమత్తం చేయడానికి పార్టీల మధ్య జరిగే సిద్ధాంత సంఘర్షణకు ఈ ఎన్నికల ప్రచారం దారి చూపించేదిగా ఉంది. కొన్ని రాష్ట్రాలలో ప్రజలు మోడీ దుష్ట రాజకీయ కుతంత్రాలను ఓటు ద్వారా తిరస్కరించారు.

నరేంద్ర మోడీ నిస్సందేహంగా తిరిగి అధికారంలోకి వచ్చినప్పటికీ, ఆయన ఊహించిన దానికి భిన్నమైన నాటకీయ పరిస్థితుల్లో రావడం జరిగింది. కీలకమైన ప్రశ్న ఏమిటంటే ప్రధానమంత్రిగా ఇప్పుడు ఎదుర్కొంటున్న పూర్తి భిన్నమైన పరిస్థితులను మోడీ స్వాభావికంగా, మానసికంగా ఎలా సర్దుబాటు చేసుకోగలరన్నదే అసలు ప్రశ్న! ఇప్పటిదాక ఆయన అభీష్టం ప్రతి ఒక్కరికీ ఆదేశం అయింది. ఆయన కేంద్రీకృత ప్రభుత్వాన్ని ఏకవ్యక్తిగా నడిపారు. మోడీ విదేశాంగ విధానాలను సహితం మంత్రి మండలిని సంప్రదించకుండా తీసుకునేవాడు. ప్రధాని కార్యాలయం కోరినట్లే మంత్రులు నడుచుకున్నారు. ఒక్కరు కూడా ఇదేమిటి అని అడిగే సాహాసం చేయలేదు. ఇప్పుడు మోడీ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపించేందుకు మిత్ర పక్షాలను దగ్గర చేసుకోవడం, తరచూ వారికి లోబడి ఉండడం, నిరంతరం వారిని సంతుష్టులుగా ఉంచడం వంటి వాటికి ఆయన సంసిద్ధత కలిగి ఉంటారా? గుజరాత్‌ ముఖ్యమంత్రిగా 13 సంవత్సరాలు, భారత ప్రధానిగా పదేళ్లు ఆయనకు ఇలా చేసే అవసరం లేకపోయింది. అందుకు భిన్నంగా పాత మోడీ ఇప్పుడు కొత్త మోడీ కాగలరా? అంటే అనుమానమే. ఆయన హిట్లర్‌ లాంటి నియంత.

ఒకే దేశం, ఒకే సంస్కృతి, ఒకే జాతి, జమిలి ఎన్నికలు, ఉమ్మడి పౌరస్మృతి అన్నది మోడీ షాల ఎన్నికల నినాదం. ఈ దేశంలో ఉన్న భిన్నత్వాన్ని మోడీ సర్కారు గుర్తించదు. ప్రజాస్వామ్యం, లౌకిక విధానం అంటే మోడీకి గిట్టదు. ఒకే దేశం, ఒకే భాష, ఒక సంస్కృతి (సాంస్కృతిక జాతీయవాదం) పేరుతో ప్రాంతీయ ప్రత్యేకతల్ని, వారి ఆకాంక్షల్నీ, వాటికి ప్రాతినిధ్యం వహించే ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేయడమే దీని లక్ష్యం. ఈ ఎన్నికలలో ప్రాంతీయ ప్రత్యేకతల ముందు మోదీ హవా సాగదని తమిళనాడులో స్టాలిన్‌, పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ, పంజాబులో భగవంత్‌ మాన్‌(ఆప్‌), కొంత మేరకు మహారాష్ట్రలో ఉద్దమ్‌ ఠాక్రే నాయకత్వంలోని ప్రజలు ప్రాంతీయ అస్తిత్వాలకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. టిడిపి16, జెడి(యు) 12 స్థానాలు కలుపుకుంటే ఎన్‌డిఎ కూటమి 294కి చేరింది. అలాగే ప్రతిపక్షాల ఎమ్మేల్యేలను కొని తమ ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన మహారాష్ట్రలో బిజెపికి ప్రజలు గట్టి బుద్ధి చెప్పారు.

ఈసారి ఎన్నికలలో మోడీ అనుకున్నది ఒకటైతే ఓటర్లు ఇచ్చిన తీర్పు మరొకటైంది. మోడీ కోరిన 370 సీట్ల పిలుపుకు ఓటర్లు జై కొట్టలేదు. 240కి దించి కూర్చో పెట్టారు. నిజానికి బిజెపి నుంచి గెలిచిన వారిలో ఒరిజినల్‌ బిజెపి నేతలకన్నా బయటి పార్టీ నుంచి వచ్చిన వారు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నారు. ఎన్‌డిఎ బలం 352 స్థానాల నుంచి 266కు తగ్గింది. ఇప్పుడు మిత్రపక్షాలుగా ఉన్న చంద్రబాబు నాయుడు(టిడిపి), నితీష్‌ కుమార్‌(జెడియూ)లు లేకపోతే మోడీకి ప్రధాని పదవి గల్లంతయ్యేది. అయితే ఈ ఇద్దరు నిన్నటి శత్రువులు, నేటి మిత్రులు. చంద్రబాబు 2018లో ఎన్‌డిఎ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్‌తో కలిశారు. 2023లో నితీష్‌కుమార్‌ ఎన్‌డిఎ నుంచి ఇండియా కూటమికి వచ్చారు. సార్వత్రిక ఎన్నికల ముందు తిరిగి ఎన్‌డిఎ కూటమిలో చేరారు. నీటి బుడగ లాంటి వీరి బంధం ఎంతకాలం కొనసాగుతుందో ఇతిమిద్ధంగా చెప్పలేము. ఒకప్పుడు మోడీ పంచన చేరి అడుగులకు మడుగులొత్తినవారు ఇప్పుడు కేంద్రంలో చక్రం తిప్పేవారయ్యారు.

ఈ ఎన్నికల తీరు పరిశీలించడానికి పలు దేశాల నుంచి 75 మంది ప్రతినిధులు వచ్చారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై జాతీయ మీడియానే కాదు… ప్రపంచ మీడియా కూడా దృష్టి సారించింది. ఈ ఎన్నికల్లో బిజెపి, దాని కూటమికి చేదు ఫలితాలు వచ్చాయని పలు మీడియా సంస్థలు నివేదించాయి. పలు రకాల శీర్షికలతో కథనాలను, వార్తలను అందించాయి. ఇందులో ‘ది వాషింగ్టన్‌ పోస్ట్‌’, ‘ది గార్డియన్‌’, ‘బిబిసి’ వంటి అంతర్జాతీయ వార్త సంస్థలు ఉన్నాయి. అమెరికా డైలీ ‘ది వాషింగ్టన్‌ పోస్ట్‌’.. భారత్‌లోని లోక్‌సభ ఎన్నికలు ప్రధాని మోడీకి, ఆయన పార్టీ (బిజెపి)కి పెద్ద ఎదురుదెబ్బగా అభివర్ణించింది. ప్రధాని మోడీ నాయకత్వాన్ని ఊహించని తిరస్కరణగా ఓటర్లు నిర్ణయించారని పేర్కొన్నది. ఇన్నేండ్ల తర్వాత తొలిసారి మోడీ బలహీనంగా కనిపించారని ది వాషింగ్టన్‌ పోస్ట్‌ రాసుకొచ్చింది. మోడీ ఇంతకూ ముందులా ఏకపక్షంగా వ్యవహరించడం ఇక కుదరదని ఐరాస మాజీ ప్రతినిధి ఇడి మాథ్సూ ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు.

బ్రిటీష్‌ డైలీ ది గార్డియన్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో బిజెపికి విజయం ఏకపక్షమని వేసిన అంచనాలు నిజం కాలేదని పేర్కొన్నది. బలమైన ప్రధానికి, ఆయన హిందూ జాతీయవాద రాజకీయాలకు వ్యతిరేకంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో ఎదురుదెబ్బలు తగిలినట్టు స్పష్టమైందని వివరించింది. బిబిసి న్యూస్‌ మోడీ పదేండ్ల పాలనకు ఈ ఎన్నికలు రెఫరెండం అని అంతా భావించారనీ, అయితే, ఎన్నికల ఫలితాలు మాత్రం ఎక్కువగా నిరుత్సాహపర్చాయని వివరించింది. ఆశించిన ఫలితాలు సాధించకపోవటంతో దేశవ్యాప్తంగా బిజెపి కార్యాలయాలు ‘విచారంగా, చీకటి’గా కనిపించాయని బిబిసి రిపోర్టర్లు పేర్కొన్నారు. ది న్యూయార్క్‌ టైమ్స్‌ .. మోడీ తన ప్రాభవాన్ని కోల్పోయారని పేర్కొన్నది. ఈ సారి మోడీ అధికారంలో ఉండాలంటే ఇతర పార్టీల సాయం కావాల్సి ఉంటుందని నివేదించింది. ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత మోడీపై కనబడిందని వివరించింది.

18వ సార్వత్రిక ఎన్నికలు అధికార పక్షం సర్వోన్నత నాయకుడి పదేళ్ల పాలనపై ఒక తిరుగుబాటు. గత పది సంవత్సరాలుగా తాను సాగించిన నిరంకుశ పాలనకూ, రాబోయే ఐదేళ్లలో మన గణతంత్ర రాజ్యాన్ని కూల్చివేసేటందుకూ ఎటువంటి మినహాయింపులు లేని ప్రజామోదాన్ని మోడీ ప్రగాఢంగా అభిలషించారు. కానీ, దేశ ప్రజలు ఆయన అభీష్టాన్ని, భావి పథకాన్ని తిరస్కరించారు. ఈ ప్రజా తీర్పు పర్యవసానాలు స్పష్టమే. దీంతో నిర్ణయాతక్మమైన నిరంకుశ పాలన నుంచి ఎలాంటి పౌర స్వేచ్ఛలకు తావులేని సంపూర్ణ నియంతృత్వ రాజకీయ వ్యవస్థగా భారత ప్రజాస్వామ్య తిరోగమించకుండా అడ్డుకున్నారు. హిందూ మెజారిటేరియన్‌ రాజ్య వ్యవస్థకు అనుకూలంగా ప్రజాస్వామ్యం లౌకికవాద సమాజ నిర్మాణంపై రాజ్యాంగ దార్శనికతను ధ్వంసం చేస్తోన్న సంకుచిత భావజాల కార్యక్రమానికి విఘాత మేర్పడింది. ఇంత మాత్రాన ఈ పర్యవసానాలు లౌకిక, ప్రజాస్వామిక భారత్‌కు భద్ర భవిష్యత్తును సమకూర్చేదిగా ఈ ప్రజా తీర్పును పరిగణించలేము.

దేశంలో నిరుద్యోగం, అధిక ధరలు, ఆర్థిక అంతరాలు అనూహ్యంగా పెరిగిపోతుంటే, రానున్న ఐదేండ్లలో భారత్‌ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టడమే తన లక్ష్యమని లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ ఊదరగొట్టారు. భారత్‌ మెరుగైన వృద్ధిరేటుతో దూసుకుపోతున్నదని కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీలూ గత కొంతకాలంగా ప్రచారం చేస్తున్నాయి. అయితే, ఎవరెన్ని చెప్పినప్పటికీ, దేశంలో ఆర్థిక అసమాతనలు మాత్రం తగ్గే సూచనలు కనిపించడం లేదని ఆర్థిక నిపుణులు, మేధావులు తేల్చి చెప్తున్నారు. స్టాక్‌ మార్కెట్ల సూచీలు, జిడిపి వృద్ధిరేటును చూపి పేదలు, మధ్యతరగతి వర్గాలకు లాభం చేకూరుతుందని అనుకొంటే అది పొరపాటేనని చెబుతున్నారు. భారత ప్రజల తలసరి ఆదాయం ప్రపంచ దేశాలతో పోలిస్తే 137వ స్థానంలో ఉంది.మానవాభివృద్ధి సూచీలో 134వ స్థానంలో ఉంది.

ఈ నేపథ్యంలో రానున్న ఐదేండ్లలో పేదలకు కొత్తగా ఒరగబోయేది ఏమీ ఉండబోదని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో… ఇప్పటికీ 80 కోట్ల మందికి ఉచిత బియ్యం సరఫరా చేస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ మేరకు అంతర్జాతీయ పత్రిక ‘రాయిటర్స్‌’ సంస్థ మే 15 నుంచి జూన్‌ 18 వరకు నిర్వహించిన పోల్‌లో వెల్లడైంది. పోల్‌లో పాల్గొన్న మొత్తం 51 మంది ఆర్థికవేత్తల్లో… ఏకంగా 43 మంది రానున్న ఐదేండ్లలో మోడీ హయాంలో దేశంలో ఆర్థిక అసమాతనలు తగ్గే అవకాశమే లేదని, పేదల కష్టాలు తీరబోవని తేల్చిచెప్పడం గమనార్హం. నైపుణ్యం కలిగిన మానవ వనరులను పెంచడం, నిరుద్యోగాన్ని రూపుమాపడం, సమ్మిళిత వృద్ధితోనే పేదరిక నిర్మూలన సాధ్యమౌతుందని ఆర్థిక నిపుణులు సూచించారు. దేశ ఆర్థిక ప్రగతికి నిరుద్యోగమే పెద్ద సమస్యగా మారిందని పోల్‌లో పాల్గొన్న 90 శాతం మంది అభిప్రాయపడ్డారు.

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ తీరులో మార్పు కనబడటం లేదు. గతంలో మాదిరి అవే ఏకపక్ష విధానాలు, నిరంకుశ పోకడలను కొనసాగిస్తోంది. ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్‌పై తీవ్రవాద నిరోధక చట్టం (ఉపా) మోపడానికి అనుమతి ఇవ్వడమే దీనికి నిదర్శనం. ఎప్పుడో 14 సంవత్సరాల క్రితం జరిగి సంఘనటనను తవ్వి తీసి, ఏకంగా ఉపా వంటి క్రూరమైన చట్టాన్ని ప్రయోగించడానికి సిద్ధం కావడంలోనే కేంద్ర ప్రభుత్వ కుటిలత్వం స్పష్టమౌతోంది. 2010లో న్యూఢిల్లీలో జరిగిన ఒక సదస్సులో వేర్పాటువాదాన్ని ప్రోత్సహించేలా మాట్లాడారన్నది అరుంధతీ రాయ్‌ ప్రభృతులపై ఆరోపణ! 2019లో మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత వేర్పాటువాదాన్ని అణచి వేశామని, కశ్మీరాన్ని భూతల స్వర్గం చేశామని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్‌ షాలు పదే పదే దేశవ్యాప్తంగా చాటింపు వేస్తూనే ఉన్నారు. అయినా, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రచయిత్రి, హక్కుల ఉద్యమకారిణిపై అతి క్రూరమైన చట్టం కింద కేసు పెట్టడానికి బరితెగించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సంకేతాలేమిటి? ఈ కేసు విషయంలోనే కాదు. అనేక ఇతర అంశాల్లోనూ మోడీ సర్కారు పోకడలు ఇదే మాదిరి ఉన్నాయి.

నిరంకుశ హిందూత్వ లక్షణాలు బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ జన్యుధాతువుల్లోనే ఉన్నాయి. తను ఎజెండాను ముందుకు నెట్టడానికి ప్రత్యక్షంగా కాకపోతే పరోక్షంగా మార్గాలు నిరంతరంగా వారు అన్వేషిస్తూనే ఉంటారు. పలు రాష్ట్రాలలో సంఘ్‌పరివార్‌, హిందూత్వ శక్తులు చెలరేగిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొత్తగా అధికారంలోకి వచ్చిన ఒడిషాలోని బాలాసోర్‌లో బిజెపి, సంఘ్‌పరివార్‌ శక్తులు ఒక వ్యూహం ప్రకారం మతఘర్షణలను రెచ్చగొట్టాయి. ఉత్తరప్రదేశ్‌లో గోగూండాలు దాడులకు దిగుతున్నాయి.

ముగింపు :
మోడీ ప్రభుత్వాన్ని నడపటం ఇకమీదట నల్లేరు మీద నడక కాదు. మోడీ ప్రభుత్వం మైనారిటీ ప్రభుత్వం. దినదిన గండంతో గడిచే ప్రభుత్వం. ఈ ఎన్నికలు ”బాహుబలి” మోడీకి ఇతర పార్టీల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి ప్రభుత్వాన్ని నడుపుకునే చేదు అనుభవాన్ని చవిచూపించాయి. కానీ, మోడీ(అమిత్‌షా) అధికారాన్ని అంత తేలిగ్గా వదులుకోబోరు. తన పదవిని కాపాడుకునేందుకు మోడీ అవలంభించే పద్ధతులను ఎవరూ ఊహించలేరు. గడిచిన పదేళ్ళలో కుంచించుకుపోయిన భారత గణతంత్రంలోని ప్రజాస్వామ్యం, చట్టబద్ధపాలన, సమాఖ్య వ్యవస్థలు తిరిగి పంజుకున్నట్లయితే రాజకీయ సంక్షోభాలు మునుపటి ప్రభావాన్ని చూపలేవు. అయినప్పటికీ, రాజకీయ పాత్రధారులే కాకుండా పునరుజ్జీవం పొందిన పౌరసమాజం కూడా కీలక పాత్ర వహించాల్సి ఉంటుంది. ఎందువల్లనంటే నిరంకుశ మతతత్వ ప్రమాదం ఎంత మాత్రం ముగియలేదు. హిందూత్వ కార్పొరేట్‌ కూటమిపై సమరం మరింత ఉధృతం కావాల్సిన అవసరం ఉంది.

తాజా ఎన్నికలు నూతన దిశగా పరివర్తన సూచిస్తే, ప్రత్యేకించి ఆర్‌ఎస్‌ఎస్‌ సంబంధిత పటిష్టమైన యంత్రాంగాన్ని ఎదుర్కొనేందుకు అధికార మార్పిడి ఒక్కటే భారత పునఃప్రజాస్వామీకరణకు సరిపోదు. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ హిందూత్వ కూటమితో రాజకీయ, భావజాల, సాంస్కృతిక పోరాటం ఏకకాలంలో చేయవల్సి ఉంది. రానున్న రోజుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్య పరచాలి. ముఖ్యంగా భావప్రకటన స్వేచ్ఛను కాపాడుకోవడానికి ప్రజలు, ప్రజాతంత్ర శక్తులు మరింత సంఘటితం కావల్సిన సందర్భం ఇది. మొత్తం మీద ఈ తీర్పు రాజ్యాంగ పరిరక్షణకు, ఆధిపత్య ధోరణుల మీద, ఫాసిస్టు పోకడల మీద పోరాడే వారికి ప్రజలను జాగృతం చెయ్యడానికి తగిన సమయాన్ని, అవసరమైన భూమికను ఇచ్చింది. అందుకే ఇది అభినందనీయమైన ప్రజా తీర్పు.

క‌డ‌వెండి, జ‌న‌గామ జిల్లా. ఉపాధ్యాయ ఉద్య‌మ నాయ‌కుడు. సామాజిక‌, రాజ‌కీయార్థిక విశ్లేష‌కుడు.

One thought on “ప్రజలు తిరస్కరించినా మారని మోడీ తీరు

 1. Modi ji — hitler —-wrong reddy garu
  ( i am not bjp guy )
  If not modi — Rahul is p.m — 50 years congress ruled our country
  Any progress —how many years one family rule reddy garu
  Is it DEMOCRACY ???REGIONAL PARTIES are not good for the country -Stalin//mamatha // Naidu— all
  Are clean politicians sir —check and dig sir — all are dictators —play dirty politics in their states
  10 yrs bjp rule — no wars // no kumbhakonalu

Leave a Reply