మాయని మచ్చ

దోపర ఇగంలో జరిగిన బార్తన, అన్నదమ్ముడు బిడ్డలు ఆస్తి పాస్తుల కాడ కొట్లాడు కొంటే వొచ్చింది. పచ్చాపల్లం భార్తన నలపై రెండూళ్ళు వొక్కటై, పద్దెనిమిది దినాలు ఏడిగ్గా జరుపుకొంటే
అయితే ఇప్పుడా భార్తన, మా మాలా, మాదిగోళ్ళకూ, అగ్ర కొలపోళ్ళకూ, మద్దెన జరిగే రంపూ రావిడికి కారణమయ్యింది.

నల్లగా నిగనిగ లాడే నేరేడు పొండ్లు, ఆడి మాసం, వానాకాలం, ఆడి కిర్తిక, అన్నీ వొక్కసారిగా కూడబలుక్కొని వచ్చేస్తాయి. ఇక్కడ ఎప్పుడు భార్తన బెట్టుకొంటే అప్పుడు వానొస్తింది. వానొచ్చేది సూసి భార్తన బెట్టుకుంటారా లేక భార్తన పెట్టుకొంటే వానొస్తిందా అంటే తెల్దు గాని, దినుమ్మూ వానే.

చిత్తూరు జిల్లా పాతగుంట పాయకట్టులో పచ్చాపల్లం భార్తనంటే తెల్నోళ్ళు ఉండరు. అంత ఇసేసంగా జరగతాది. దీన్నే అగ్గని తిర్నాళ్ళని గూడా అంటారు. రాయుడోళ్ళే ఈ బార్తనకు మొగుదారిగా ఉండి జరిపిస్తారు.

భార్తన జరిగే దానికి నెలకు ముందే సెల్లలు ఊరి మెరవణకు యలబార్తాయి. ఈ నలబై రెండూళ్ళూ తిరుక్కోనొచ్చే కొద్దికి ఆ నెలై పోతాది. మల్ల అమాస పొయ్యిన అయిదో దినం సూసి కొడెక్కిస్తారు, అంటే దొజారోహణ మన్నమాట. అమాస పొయ్యిన అయిదో దినమే ఎందుకు కొడెక్కిస్తారంటే, ఎన్నిలుంటిందని. దినుమ్మూ మద్దేణం నించి సందేళ దాకా భార్తన్ని అరికతగా సెప్పతారు. రేతిరి పూట అదే భార్తన్ని ఈదినాటకంగా ఆడతారు.

కొడెక్కిన నాట్నించే అరికత ఆరంభిస్తారు. మూడో నాట్నించి రెయ్యాట మొదులు పెడతారు. మొదిటి దినుం కిష్టుడు పుట్టి కంసుణ్ణి సంపేస్తాడు.రొండోదినుం పాండవులు పుట్టి లక్కింటిని కాల్చేస్తారు. మూడోదినుం బండికుమ్మాలు తోలి రెయ్యాటలో బక్కాసురుణ్ణి సంపేస్తారు. బండి కుమ్మలల్లో ముందుగా రాయుడు బండి పోవాల అది అక్కడ రూలు.

నాలుగో దినుం దోపతమ్మకి పెండ్లి, జూదమాడేది, చీర్లు పెరికేది, ఆ పొద్దిటికి ఆట బలే రంజుగా ఉంటాది. దుస్సేసునుడిగా కంగుంది కుప్పం రామసెంద్రుడేసి మెప్పిస్తే, దోపతిగా వాళ్ళ బామార్ది నారాయుడేసి దుఖ రసంతో పాడి జనాని మెప్పిస్తాడు. ఆ పొద్దిటికి జనం ఇసికేస్తే రాలదు అంత జనమొస్తారు.

మల్ల తవుసు మానెక్కేది. ఉత్తర గోగ్రెహణమని ఆవుల్ని తోలకొచ్చి మలేసేది. ఆకీరుగా ఇలా మంతుణ్ణి బొమ్మజేసి తలకాయ తుంచేసి, దుర్యోదుణ్ణి సంపేస్తే, భార్తన అయి పొయ్యినట్టు లెక్క, ఆదివోరం అగ్గితొక్కేస్తారు.

వొకప్పుడు అరికత సెప్పాలంటే పాండురంగ దాసు నాగరత్నమ్మే సెప్పాల. ఆటాడాలంటే కంగుంది కుప్పమోళ్ళే ఆడాల. అప్పుడు రామసెంద్రుడు, నారాయుడు, సిన్న మునసామి, సిట్టేలికాయన, అగ్గిపెట్లోడు, అప్పోజి, ఇట్టాటోళ్ళంతా ఉండేవోళ్ళు. అయితే ఇప్పుడు కాలం మారింది. వాళ్ళంతా ఇప్పుడు లేరు. వాళ్ళను తలదన్నే వోళ్ళు ఈడనే తయారై భార్తన మొత్తం ఆడేస్తా ఉండారు.

ముందుంతా అమ్మలక్కలు పగులు కతకు పోతా పోతా ఈతాకు సాపల్ని ఎత్తక పొయ్యి అరికత అయిపోతానే తీసకపొయ్యి టేజీ ముందర పర్సేసి జాగాను ఆపుజేసుకొనే వోళ్ళు. దాని మింద ఎన్నో రంపులు గూడా జరిగేవి. నేను ముందొచ్చి పర్సినానని వొకరు, నేను పర్సినానని వొకరు.

ఇంకొక్క తమాసా ఏందంటే చౌడేపల్లి సినర్శిగోడని వొకడుండె. దినుమ్మూ భార్తనకు పోతాడు. పోతా పోతా గోతం పట్ట మడిచి సంకలో పెట్టక పొయ్యి టేజీ ముందరేసి సందకాణే గురకబెట్టి నిద్దర పోతాడు. తెల్లార్తో అందురూ పొయ్యినాక లేసి ఇంటికొస్తాడు. “దినుమ్మూ ఎందుకు పోతావురా!” అని అడిగినామనుకో భార్తన మిట్టలో బలే నిద్దర పడితింది అనేవోడు.

ఈ పద్దెనిమిది దినాలూ భార్తన సుట్టూ అంగుళ్ళే టీ, కాఫీలు, అమ్మే అంగుళ్ళూ, సోడా కలర్లు బఠాని గింజలమ్మే వోళ్ళూ, సుట్టూ పెట్టుకోనుంటారు. నిద్రోచ్చిందనుకో వొక్క బఠాని గింజ నోట్లో ఏసుకొని పటక్కమని కొరికితే నిద్ర కొండెక్కేది. ఈ అంగుళ్ళ మద్దెలో కల్లూ సారాయి అంగుళ్ళు గూడా, ఎలిసేవి.

ఇంగ భార్తనంటేనే క్లబ్బాట తప్పనిసరి అంటే సీట్ల పేకాట. ఆట కొటాయికి ఉత్తరంగా పెద్ద పెద్ద జోబిడీలు ఏస్తారు. వాటల్లో లోపలా బైటని, సిండికేటని, ఆడేవోళ్ళు సెక్రాలు గిర్రని తిప్పతా ఉంటారు. ఆటిన్,కళావరు, డైమండని, వొక డబ్బాయిలో ఏసి గులగరిస్తా ఉంటారు.

వొకసారి ఈ క్లబ్బాటను ఏలంబెడితే పచ్చాపల్లం మాబూ సాయబూ, తుమ్మల సెర్వు కండిగ ఘటికాచలం, ఎర్రాసుపల్లి మాధవరెడ్డి, పోటీలు పడి ఆకీరుకు మాదవరెడ్డి దక్కించుకున్నాడు. అట్ట అయిదువేలు కాడ మొదులై ఏలం పాట లచ్చలు దాటి పోయ. ఆ వొచ్చిన డబ్బుతో భార్తన జరిగి పోతింది అనుకునే వోళ్ళు గాని. సేతిలో గెడారాలు, ఉంగరాలు, మెడలో గొలుసులు, దారబోసుకున్నోళ్ళు ఎంతమందో సెప్పలేము.

ఈ క్లబ్బాట కాడనే ఎక్కువ వొడ్డీకి నగలు, భూమి పత్రాలు, అట్టాటివి పెట్టుకొని అప్పిచ్చే వోళ్ళు ఆడనే కాసుకోనుంటారు. అట్ట భూములూ నేలలు దారబోసుకున్నోళ్ళు శానా మందే ఉండారు.

అయితే ఇన్ని నాళ్ళ నించి భార్తన సూస్తా ఉండాము గదా! మనం నేర్సుకునింది ఏంది? ఈ భార్తనకు మూల కారణమే జూదం కదా! సెప్పిన మాట ఇనకుండా ధర్మరాజు జూదం ఆడిన దానివొల్లే కదా! ఆలిని, అన్నదమ్ముల్ని, ఆకీరుకు రాజ్జాన్ని, దారబోసుకునింది, అడువుల పాలైయ్యింది, ఇద్దంజేసి అయినోళ్ళనంతా దారబోసు కునిందనే ఆలోసెన ఎవురూ సేసుకోరు.

ఇది మంచిది గాదని వొక బార్తన క్లబ్బాటకి పోలీసోల్లు పరిమిసన్ ఇయ్యకపోతే. రాయుడు ఊరికా ఉంటాడా మంచి సెయ్యాలంటే ఆయనికి మనస్సు రాదుగాని సెడ్డజేసే దానికి ఎన్ని అడ్డదార్లో. తెలివితేటల్లో ఆయనికి మించినోళ్ళు లేదు. ఇంగ రాజక్రియాలనేవి ఆయనికి కొట్టిన పిండి. దర్మరాజుకు జూదమంటే ఇష్టం, అదిలేకుండా భార్తన సెయ్యలేమని భర్తనకు కళే ఉండదని పైయ్యోళ్ళను మెప్పించి పరిమిసన్ తెచ్చి నోడాయన.

ఈ భార్తన ఆరంబించి నూరేండ్లు అయుంటిందంటారు. దీనికి దర్మకర్తలుగా రాయుడి వొంశమోళ్ళే పెద్దలుగా ఉండి జరిపిస్తా ఉంటారు. వాళ్ళ తరవాత ఎవురుంటారో సెప్పలేము. ఎందుకంటే ఇప్పిటికే శానామంది తరతరాలుగా వాళ్ళేనా పెద్దలు అంటా ఉండారు.

ఈ భార్తన వొల్ల ఈ పాయకట్టంతా వొక తాటిమిందికొస్తింది. ఎక్కడెక్కడ పొయ్యినోళ్ళంతా వొచ్చి ఈ భార్తన్లో కలుసుకుంటారు. మల్లా ఎప్పుడు వొస్తవని ఎవుర్నడుగినా వాల్ల నోట్లో నించి వొచ్చే వొకటే మాట, వొచ్చే భార్తనకని.

ఇంత పేరూ పెక్కాసి తెచ్చుకున్న భార్తనకి మాయని మచ్చొకటి అట్టనే ఉండి పొయ్యింది. సెల్లలు ఊరిమెరవణకి ఎలబార్న కాణ్ణించి అగ్గిని గుండంలో అడుగు పెట్టే దాక, మా పలకలూ, కొమ్ములూ, ఉండాల్సిందే. అయ్యి లేకుండా భార్తన జరగదు. ఊళ్ళల్లో సాటింపు ఎయ్యాలన్నా మేమే. ఊరి మెరవణి సెయ్యాలన్నా మేమే. సలవ పందిళ్ళు ఎయ్యాలన్నా మేమే.

కాని అన్నాయమేందంటే? గుడిలో అడుగు పెట్టే దానికి లేదు. అగ్గిని గుండంలో కాలు పెట్టే దానికి లేదు. ఈళ్ల గుళ్ళకు రానీయరు ఇంగొకరి గుళ్ళకు పోనియ్యరు. ఆ పక్కనుండే చర్చిలో గెంట కొట్టి మరీ పిలుస్తారు రమ్మని. ఈళ్ళేమో వొద్దూ వొద్దంటారు. ఇట్ట ఇది ఏండ్ల పొద్దుకీ సాగతానే ఉంది. మేమంతా మనకిది కాలం గాదని పొయ్యినాము.

కాని ఇప్పుడు పిలకాయలు ఊరికా ఉంటారా సిన్నోల్లంతా పెద్దోళ్ళయినారు. సదువుకుంటా ఉండారు. మంచీ సెడ్డా లాగూ బాగూ తెల్సుకుంటా ఉండారు. అందుకే ఇప్పుడు ఎదురు తిరగతా ఉండారు. మీరూ మేవు మడుసలమే మీదీ మాదీ వొకే రగతం గుడికొస్తాం. అగ్గితొక్కతామని. ఇప్పుడు బండి కూడు కట్టుకోనొచ్చి రాయుడి బండికంటే ముందు తీసకొచ్చి నిలబెటేసినారు.

దీనికి రాయుడెట్ట వొప్పుకుంటాడు. మా మాలా మాదిగల్ని వొదిలేసి అగ్ర కులపోళ్ళనంతా వొక తాటిమిందికి తెచ్చేసినాడు.

వాల్లు కత్తులూ కటార్లెత్తుకొని బండికడ్డంగా వొచ్చి కూసొనేసి “ఇప్పుడు బండి కుమ్మాలు తోలకొచ్చినారు. రేపు గుళ్లో కొస్తానంటారు. అగ్గి తొక్కాలంటారు. మల్ల మా ఇండ్లలోకి వొస్తానంటారు అని బండి పొయ్యే దానికి కుదర్దనేసినారు.

మేవు “అట్టయితే మీరు సచ్చినా బతికినా రాము. మీరు సస్తే పలకలు కొట్టం. సచ్చిన గొడ్డూ గోదా ముట్టుకోము. మీ పన్లకు గిన్లకు రాము” అని సెప్పేసినాము.

వాల్లూ ఊరికా ఉంటారా? అంతే దీమాతో మీ పలకలు, కొమ్మలు, మాకొద్దు, మంగల మేళం పెట్టుకుంటాం. సచ్చిన గొడ్డూ గోదా మేమే పూడ్సుకుంటాం. మా పన్లకు మీరు రావాల్సిన పనే లేదని కరాకండిగా సెప్పేసినారు.

మల్ల మేమే కొంచిం ఎనకడుగేసి బండికూడు ఎనక్కు తోలుకొని వొచ్చేసినాము.

ఇట్ట వాల్ల పన్లకు కొన్ని రోజులు మేమూ పోలేదు. వాల్లూ రమ్మని పిలవలేదు. అట్ట ఎన్ని రోజులని ఉంటాం, మేము పొయ్యి వాల్లతో రంపు పెట్టుకున్నా వాల్లొచ్చి మాతో రంపు పెట్టుకున్నా పస్తు సచ్చేది మేమే కదా అందుకని మాదే తప్పని వొప్పుకోక తప్పలేదు.

కారణం మేమూ కూలికీ నాలికీ పోకుండా బతకలేము. సందేళ అయ్యిందంటే తాక్కుండా ఉండలేము అందుకే వాల్లకు తగ్గి వొప్పుకున్నాము గాని అప్పుడప్పుడు మాకనిపిస్తుంది కాలం మారినా మా బతుకులిట్టా కడలేరాల్సిందేనా అని.

Leave a Reply