ఒక సినిమాను సిలబస్ లో భాగంగా దేశం అంతా చూపించడం జరుగుతుందంటే, ఆ సినిమా ఇచ్చే సందేశం, చర్చించే విషయాల అవసరం సమాజానికి ఎంత ఉందో అర్ధం చేసుకోవచ్చు. కొన్ని సార్లు బోధించవలసిన ఎన్నో విషయాలను దృశ్య శ్రవ్య మాధ్యమాల ద్వారా చర్చకు తీసుకువస్తే విద్యార్ధులపై దాని ప్రభావం ఆశాజనకంగా ఉంటుంది. “అమెరికన్ హిస్టరీ X” అనే సినిమాను అమెరికాలో చాలా చోట్ల విద్యార్ధులకు చూపించడం జరుగుతుంది. ఇది 1998 లో వచ్చిన సినిమా. అమెరికాలోని జాతి వివక్ష ఆధారంగా తీసిన సినిమా. కాని అసలు వివక్ష అన్నది ఎక్కడ నుండి ఎలా మొదలవుతుంది. అది మనిషి ఆలోచనను ఎలా ప్రభావితం చేస్తుంది అన్నది చాలా చక్కగా చూపించిన చిత్రం ఇది. మనిషి పుటుక నుండే మరో వర్గం పై కసితో ద్వేషంతో రగిలిపోతూ జన్మించడు. అతని చుట్టూ వాతావరణంలోని మనుష్యులు, సంఘటనలు, పరిసరాలు, అతన్ని, అతని ఆలోచనలను ప్రభావితం చేస్తాయి. కొన్ని సార్లు ఈ ప్రభావం ఎంతలా ఉంటుందంటే ఒక రకమైన మూఢత్వంతో, మూర్ఖత్వంతో, కసితో ద్వేషంతో అతను రగిలిపోతూ ఉంటాడు. తనలోని ఈ భావాలకు కారణాల పట్ల అతను క్రమపద్ధతిలో ఆలోచించలేకపోతాడు. ముఖ్యంగా యువత ఈ మూర్ఖత్వంలో పడితే సహజంగానే అన్ని ఎమోషన్స్ అతి ఎక్కువగా ఉండే వయసులో వారిలో మరో వర్గం పట్ల ద్వేషం మొదలయితే అది చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది. ఆ తీవ్రత వారి ఆలోచనను నశింపజీస్తుంది. ఒక రకంగా మెదడు మసకబారిపోయి తమలోని ద్వేషం చాలా అవసరంగా సహజమైన చర్యగా కనిపిస్తూ ఉంటుంది. అప్పుడే మనిషి జంతువులా మారతాడు, తన ప్రాణానికి కూడా భయపడకుండా ద్వేషాన్ని చుట్టూ ఉన్నవారిపై ప్రసరిస్తూ ఉంటాడు. ఇలాంటి ప్రభావంలోనే ప్రపంచంలో యుద్ధాలు జరిగాయి, ఎన్నో ఘోరమైన ఆపదలు సంభవించాయి. ఎంత నష్టపోయినా మానవ సమాజం ఈ ద్వేషంతోనే జీవిస్తూ కనిపిస్తుంది.
ఇది ఇద్దరి అన్నదమ్ముల కథ. పెద్ద వాడి పేరు డెరిక్. డానీ చిన్నవాడు. డెరిక్ ప్రభావం డానీ పై చాలా ఉంటుంది. డెరిక్ చదువులో గొప్ప ప్రతిభ చూపిస్తూ ఉంటాడు. చాలా తెలివి కలవాడు అలాగే మంచి ఫుట్ బాల్ ప్లేయర్ కూడా. అయితే అతను హై స్కూల్ లో ఉన్నప్పుడు అతని తండ్రి హత్య చేయబడతాడు. కాలిపోతున్న ఇంటి మంటలను ఆపే ప్రయత్నంలో ఆ ఇంటి వారైన ఇద్దరు ఆఫ్రో అమెరికన్ల చేతిలో పైర్ మేన్ గా పని చేసే డెరిక్ తండ్రి మరణిస్తాడు. తన తండ్రి నల్ల జాతీయులను కాపాడాలని ప్రయత్నిస్తుంటే, ఆ సంగతి మరచి అతన్ని హత్య చేసిన నల్లవారంటే ద్వేషం పెంచుకుంటాడు డెరిక్. అతని ద్వేషాన్ని కామెరాన్ అలెక్జాండర్ అనే ఒక వ్యక్తి తనకు అనుకూలంగా మార్చుకుంటాడు. అతని శిష్యరికంలో డెరిక్, అతనిలాంటి ఇంకొందరు డిసైపిల్స్ ఆఫ్ క్రైస్ట్ ( D O C) అనే ఒక సంఘాన్ని స్థాపిస్తారు. దీని ఉద్దేశం, తెల్లజాతీయుల రక్షణ, ఆసియా, ఇతర దేశాల వారి నుండి ముఖ్యంగా నల్లజాతివారి నుండి తమ దేశాన్ని కాపాడుకోవడం. ఒక ఫుట్ బాల్ మేచ్ లో డెరిక్ నల్లవారి తో ఆడి గెలిచి వారు అక్కడి మైదానంలో మళ్ళీ రాకుండా అడ్డుకుంటాడు. దీనితో అతను D O C లో ఒక పెద్ద హీరో అయిపోతాడు.
అదే రోజు అతని తల్లి తన స్నేహితుడ్ని ఇంటికి తీసుకువస్తుంది. అతను ఒక యాదుడు (jew). భోజనం దగ్గర డెరిక్ తన నాజీ ఆలోచనలను బైట పెడతాడు. విపరీతంమైన ద్వేషం చూపిస్తాడు. జ్యూస్ ని హిట్లర్ చంపించడం సరి అయినదని ప్రతి జాతిలో అలాంటిది జరగాలని తన అభిప్రాయం చెబుతాడు. తల్లిని చెల్లిని కొట్టేటంత పని చేస్తాడు. అతనిలోని ఆ ఆవేశం చూసి తల్లి స్నేహితుడు ఆమెతో సంబంధం కాదని వెళ్ళిపోతాడు. డెరిక్ లోని ద్వేషం, అతనిలోని రాక్షసత్వం భరించలేక అతని తల్లి అతన్ని ఇల్లు వదిలి వెళ్ళిపోమంటుంది. అదే రాత్రీ ఫుట్ బాల్ మేచ్ లో ఓడిపోయి అవమానపడిన నల్ల జాతీయులు ముగ్గురు అతని కారు దొంగలించే ప్రయత్నం చేస్తారు. డెరిక్ వారిని చంపేస్తాడు. వారిని చంపినందుకు సిగ్గుపడడు. అది తప్పని కూడా ఒప్పుకోడు. అతనికి మూడు సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది.
జైలులో అతను ఖైదీలలో తన తోటి తెల్లవారి వర్గంలోనే చేరతాడు. వారితో ఉంటూ వారిని గమనిస్తున్నప్పుడు వ్యక్తిగతంగా వారిలోని అవకాశవాదం, ద్వేషం మాటున వారి హిపోక్రెసీ అన్నీ చూసి వారితో కలిసి ఉండలేకపోతాడు. ఒక నల్ల జాతీయునితో పని చేస్తూ అతనితో స్నేహం చేస్తాడు. నలుపు తెలుపులతో మంచితనం రాదని అది ప్రతి మనిషి వ్యక్తిగత స్వభావం అని మంచి చెడు అన్ని జాతులలో ఒకే రకంగా ఉంటాయని అతని జైలు అనుభవాలు అతనికి చెబుతాయి. తన తోటి గాంగ్ తో దూరంగా ఉంటాడు. అందుకు వారు అతన్ని గాయపరిచి, అత్యాచారం చేసి అతన్ని అవమానిస్తారు. తన అనుకున్న వారే తనకు విధించిన శిక్ష అతనికి మనిషి స్వభావం పట్ల ఎన్నో ప్రశ్నలు రేకెత్తిస్తుంది. అసలు తాను ఎవరిని ఎందుకు ద్వేషిసున్నాడు ఎవరిని ఎందుకు ప్రేమిస్తున్నాడో ఆలోచించడం మొదలెడతాడు. తనను అవమానించిన వారికి దూరమవుతాడు. తనని ప్రాణాలతో ఉండనివ్వరని తెలిసినా వారితో చేరడు. అయితే తాను స్నేహం చేసిన నల్లజాతీయుడే తనకి రక్షణ గా ఉన్నాడేమో అన్న అనుమానం అతనికి కలుగుతుంది. ప్రాణ భయం ఉన్న చోటే అన్ని రోజులు గడిపి తన జోలికి ఎవరూ రాకుండా శిక్షాకాలం పూర్తి చేసుకుని బైటికి వస్తాడు. దీనికి తన నల్లజాతి మిత్రుడే కారణమని నమ్ముతాడు.
డెరిక్ స్కూల్ లో ఉన్నప్పుడు అతనికి పాఠాలు చెప్పిన బాబ్ నల్ల జాతీయుడు. అలాగే సంఘ సేవకుడు కూడా. డెరిక్ ని జైల్లో అతను వచ్చి కలిసేవాడు. అతని సహాయంతోనే జైలు నుండి బైట పడతాడు డెరిక్. అయితే తన చిన్న తమ్ముడు డానీ D O C లో ఒక ముఖ్య సభ్యుడని తనకన్నా ఆవేశంతో, మూర్ఖత్వంతో నల్లజాతీయుల పట్ల ద్వేషంతో రగిలిపోతున్నాడని అర్ధం చేసుకుంటాడు. తనకు గురువుగా వ్యవహరించిన కమెరాన్ తన తమ్మున్ని కూడా వశపరుచుకున్నాడని తెలుసుకుంటాడు. తన లాంటి యువకుల ఆవేశాన్ని తనకు అనుకూలంగా మరల్చుకుని కమెరాన్ నాయకుడిగా ఎదగడం, లాభపడడం చూస్తాడు. కమెరాన్ ఏర్పాటు చేసిన విందుకు వెళ్ళి తన తమ్మున్ని వదిలి పెట్టమని అతనితో గొడవకు దిగుతాడు. చేయి కూడా చేసుకుంటాడు. కెమెరాన్ పై చేయి చేసుకున్న అన్నను చూసి డానీ ఆశ్చర్యపోతాడు. అప్పుడు డెరిక్ తన జైలు అనుభవాలు చెప్పి తమ ద్వేషం సహేతుకం కాదని, మనిషిని మనిషిగా చూసి వారి మంచి చెడ్డలతో వారిని ఎంచాలి కాని ఒక వ్యక్తి తప్పును సంపూర్ణంగా ఒక జాతికి అంటగట్టడం మూర్ఖత్వమని దీని వలన తాను సుఖపడిందేమీ లేదని, తనలాంటి వారి బలహీనతలను వాడుకుని లాభపడే కమెరాన్ లాంటి శక్తులకు పావుగా మిగిలిపోయానని, డాని ఆ దారిలో నడవకూడదని చెబుతాడు.
అంతకు ముందు తన స్కూల్ ప్రాజెక్టు కోసం డాని హిట్లర్ రాసిన మై కెంఫ్ పై తన అభిప్రాయాలు రాస్తూ నాజీలు చేసినది సరి అయిన పని అని రాస్తాడు. ఆ ప్రాజెక్టు చూసిన బాబ్ అన్న ప్రభావంలో ఉన్న డాని ని మార్చడానికి అతనికి తాను చరిత్ర భోధిస్తానని మరో ప్రాజెక్టు తన అన్న జీవితం మీద రాసుకు రమ్మని ఆ ప్రాజెక్ట్ కు తాను తీసుకోబోతున్న క్లాసుకు అమెరికన్ హిస్టరీ X అని పేరు పెడతాడు బాబ్. డాని అన్నతో మాట్లాడిన తరువాత అన్న సహాయంతో తన గదిలో ఉన్న ద్వేషపూరిత పోస్టర్లన్నిటినీ తీసి వేస్తాడు. అన్నతో జరిపిన చర్చ ఆధారంగా ప్రాజెక్ట్ పూర్తి చేస్తాడు. మరుసటి రోజు పని వెతుక్కోవడానికి డెరిక్, స్కూల్ లో ప్రాజెక్టు ఇవ్వడానికి డాని ఉత్సాహంతో ఇంటి నుండి బయలు దేరతారు.
డెరిక్ విడుదల అవబోయే ముందు రోజు స్కూల్ బాత్ రూమ్ లో ముగ్గురు నల్ల జాతీయులు ఒక తెల్ల విద్యార్ధిని కొడుతున్నప్పుడు డాని అడ్డు వెళతాడు. వారిని ఎగతాళి చేస్తాడు. అతనిలోని ఆ ద్వేషాన్ని ఆ ముగ్గురు నల్ల జాతి విద్యార్ధులు చూసి దానికి బదులు తీర్చుకోవాలనుకుంటారు. మారిన మనసుతో స్కూల్ కి చేరిన డానిని బాత్ రూమ్ లో పిస్టల్ తో కాల్చి చంపేస్తారు వాళ్ళు. ఏ ద్వేషం నుండి తమ్ముడిని దూరం చేద్దామనుకున్నాడో ఆ ద్వేషానికే తను బలి అవడం చూసి గుండె పగిలి రోదించే డెరిక్ ఆఖరి సీన్ లో ప్రేక్షకులనూ ఏడిపిస్తాడు.
ద్వేషం అన్నది సమాజంలో ఎన్నో విధాలుగా పాకిపోయింది. దాని పర్యవసానం మనకు కనిపిస్తూనే ఉంటుంది. అయితే ఈ ద్వేషం మూలాలు కుటుంబం నుండే మొదలవుతాయి. సినిమా ఆఖరి సీన్ లో దర్శకుడు అదే చెప్పే ప్రయత్నం చేస్తాడు. తనకు ప్రమోషన్ రాకుండా తనకన్నా జూనియర్లు నైపుణ్యం లేని నల్లవారికి దేశంలో కొత్తగా వచ్చిన సమానత్వం అనే భావం తో ప్రమోషన్లు ఇవ్వడం డెరిక్ తండ్రి జీర్ణించుకోలేడు. బాబ్ ఇచ్చిన ప్రాజెక్ట్ కోసం నల్లజాతీయుల జీవితాలను పరిశిలించే ప్రయత్నం చేస్తున్న డెరిక్ తో తండ్రి తనకు జరిగిన అన్యాయాన్ని చాలా కోపంగా ద్వేషంతో, చెబుతాడు. నల్లజాతీయులను నమ్మరాదని అతను చెప్పిన మాటలు తండ్రిని విపరీతంగా ప్రేమించే డెరిక్ మనసులో నాటుకుపోతాయి. దానికి బలం చేకూరుస్తూ తండ్రి మరుసటి రోజు నల్లవారి చేతుల్లో హత్యకు గురి అవడం డెరిక్ మనసును విరిచేస్తుంది. తండ్రి పై ప్రేమ నల్లవారిపై ద్వేషంగా మారుతుంది. నాజీలను సమర్ధించే భావజాలంగా మారుతుంది. తరువాత తన ఆలోచనను సక్రమమైన మార్గంలో పెట్టుకుని తమ్మున్నీ బాగుచేసుకుందామని కొత్తగా జీవితాన్ని మళ్ళీ మొదలెడదామని అతను అనుకునేంతలోనే అతని తమ్ముని హత్య అతన్ని వివశున్ని చేస్తుంది. ఈ ఘటన తరువాత అతను ఏ దారిలో ప్రయాణించాడన్నది దర్శకులు మన ఊహకే వదిలేస్తారు. కాని ద్వేషానికి ఆది అంతం ఎక్కడ అన్న ఆలోచన మనలను చుట్టుముడుతుంది. చుట్టూ ఉన్న వాతావరణలో మనిషి కొట్టుకుపోవలసిందేనా? తనను తాను సంభాళించుకుని నిష్పక్షపాత మార్గంలో ప్రయాణించే పరిస్థితులు సమాజంలో ఎందుకు లేవు? మనిషి తాను సృష్టించుకున్న ఈ ద్వేషంలో తానే ఎందుకు వివశుడయిపోయి ఒంటరిగా మిగిలిపోతున్నాడు… మనిషి మానవత్వాన్ని మార్గంగా తీసుకుని ప్రయాణించే దారులు ఎందుకు మూసుకుపోతున్నాయి… ఇలాంటి ఎన్నో ప్రశ్నలను రేకెత్తించే సినిమా ఇది.
డెరిక్ గా ఎడ్వర్డ్ నార్టన్ నటన అత్యుత్తమ స్థాయిలో ఉంటుంది. డానీ గా ఎడ్వర్డ్ ఫర్లాంగ్ నటించాడు. ఈ సినిమా కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ కాలేకపోయినా అమెరికన్ సినిమాలో ఒక గొప్ప చిత్రంగా మిగిలిపోయింది. చిత్ర దర్శకుడు టోనీ కే సినిమా ముగింపు పరంగా సంతృప్తి పడలేక పోయారట. కొన్ని గొడవలు… వారికీ నార్టన్ కీ మధ్య ఆ కారణంగా జరిగాయని చెప్తారు. కాని మనం స్క్రీన్ పై చూసే చిత్రంలో ఏ లోపం కనిపించదు. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న పరిస్థితులలో ఈ చిత్రం అవసరం ఇంకా ఉంది అనిపిస్తుంది. వివక్ష, జాతి విద్వేషాల ఆధారంగా ఎన్నో సినిమాలు వచ్చినా ఈ సినిమా ప్రేక్షకుల మేధకు పదును పెట్టినంతగా ఇప్పటి వరకు మరో సినిమా ఆ ఆలోచనపై చేయలేకపోయిందన్నది వాస్తవం. అందుకే దీన్ని విద్యార్ధుల సిలబస్ లో భాగంగా చేసారు కూడా. ఒక ఆలోచనాత్మక, మేధోపరమైన సినిమా చూడాలంటే మిస్ కాకూడని సినిమా ఇది.
Madam,I am trying this movie in you tube .it’s not available.ott platform name chepputharani request.