మానవత్వం చంపబడుతోంది మాట్లాడుకుందాం రండి

సొంతలాభం కొంతమాని
పొరుగువారికి తోడ్పడవోయ్
గీసుకున్న దేశభక్తి గీతదాటి
అడుగు ముందుకేసి
సొంతలాభం అసలే వద్దు
ప్రజల కొరకే తన ప్రాణమంటు
మానవత్వం శిఖరమెక్కిన
మనిషి చంపబడ్డాడు
మానవత్వం చంపబడుతోంది
మాట్లాడుకుందాం రండి

అన్నం రాశులు ఒకచోట
ఆకలి మంటలు ఒకచోట
వ్యత్యాసాల ఎత్తుపల్లాలు ఆర్పడానికి
నాలుగడుగులు ముందుకేసి
అన్నం రాశులు ఆకలి సంచులు నింపిన
మనిషి చంపబడ్డాడు
మానవత్వం చంపబడుతోంది
మాట్లాడుకుందాం రండి

నెత్తురు మండే శక్తులు నిండే
సైనికులారా రారండి
పిడికిట్లో నినాదం పిడుగులు పట్టుకొని
మరో నాలుగడుగులు ముందుకే నడిచి
కొయ్యూరు నుడి కొయ్యూరు దాకా
జనం అలజడి నాడి
స్టెతస్కోప్ చేతులతో పట్టిన
మరో ప్రపంచపు నూతన మానవుడు
మానవత్వం నాటుకుంటూ వస్తున్నమనిషిని చంపేశారు

రండి
చంపబడ్డ మానవత్వాన్ని పిడికిళ్ళ నిండా మనిషింత తెచ్చుకుందాం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా, చిట్యాల మండలం గుంటూరుపల్లి. కవి, రచయిత, అధ్యాపకుడు. రచనలు: అవ్వ జెప్పిన తొవ్వ (దీర్ఘ కవిత), పాదముద్రలు, వెన్నెల వర్షం( పాటల సీడీ), గురి (దీర్ఘ కవిత ). వరంగల్ సీకేఎం కాలేజీలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు.

Leave a Reply