మాదక ద్రవ్యాలు – మనిషి జీవితం – రాజకీయాలు

గన్స్ అండ్ గులాబ్స్ అనే సిరీస్ Netflix లో ఉంది. దుల్ఖర్ సల్మాన్, రాజ్ కుమార్ రావ్ నటించిన ఈ సిరీస్ కథ -90లలో ఉత్తరాది రాష్ట్రాల్లో పండిస్తున్న గసగసాల సాగు చుట్టూ నడుస్తుంది. లైసెన్స్ తో పరిమిత సాగు చేసే రైతులు -పండిన పంటను ప్రభుత్వానికే అమ్ముతుంటారు. ప్రభుత్వం ఆ పంటను కొంత ఇక్కడ తయారయ్యే ఔషదాల కోసం వాడుతూ కొంత ఎగుమతి చేస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు చదవబోయేది ఆ సిరీస్ గురించి కాదు. ఇటీవల మణిపుర్ లో కుకిలను మాదక ద్రవ్యాల తయారీదారులుగా ప్రచారం జరుగుతున్న సందర్భంలో గసగసాలు, గంజాయి మొక్కల సాగు -ఇంకా వాటి చుట్టూ అల్లుకున్న మాదక ద్రవ్యాల, మత్తు మందుల వ్యసనాల గురించి విస్తృతంగా తెలియచేసే ఒక పుస్తకం గురించి మాట్లాడుకోవాలి.

‘Most of what you know about addiction is wrong’ (వ్యసనాల గురించి మనకు తెలిసిన దాంట్లో ఎక్కువ భాగం తప్పు). ఇదే ఆ పుస్తకం. అనిరుధ్ కాలా అనే పంజాబీ సైకియాట్రిస్ట్ రాసిన ఈ పుస్తకం వ్యసనాలకు సంబంధించి మనకున్న భావనలు అనేకం అపోహలని చెబుతుంది. భారతదేశంలో ‘మెంటల్ హెల్త్ చట్టం’ తీసుకొని రావటానికి కృషి చేసిన వ్యక్తి ఈ పుస్తక రచయిత అనిరుధ్ కాలా. హోమో సెక్సువాలిటీ గురించి అధ్యక్షుడు చెడుగా మాట్లాడినందుకు తాను నలభై సంవత్సరాలుగా క్రియాశీలకంగా పని చేసిన ‘ఇండియన్ సైక్రియాట్రిక్ సొసైటి’ నుండి వైదొలిగాడు. ఆయన గతంలో ‘ద అన్ సేఫ్ అసైలమ్: స్టోరీస్ ఆఫ్ పార్టిషన్ అండ్ మాడ్ నెస్’ అనే కథల పుస్తకాన్ని రాశారు. అందులో ఒక కథను మాతృకలో ప్రచురించాము. ‘టు అండ్ ఆఫ్ రివర్స్’ అనే ఆయన నవల 1980లలో పంజాబ్ లో వచ్చిన సాయుధ పోరాటం గురించి చెబుతుంది. ‘Most of what you know about addiction is wrong’ పుస్తకం పంజాబ్ ను కేంద్రంగా జరుగుతున్న మాదక ద్రవ్యాల వాడకం, వ్యాపారం, దాని చుట్టూ అల్లుకొని ఉన్న దేశ, విదేశ రాజకీయాల గురించి చెబుతుంది.

ఈ పుస్తకంలో ఉన్న 10 భాగాలు వ్యసనాల గురించి లోతుగా విశ్లేషణ చేస్తాయి. ఒకే కుటుంబంలో తాగుడు, పొగాకు అలవాటు ఉన్న వాళ్లను వ్యసనపరులుగా చూడకుండా, అదే కుటుంబంలో హెరాయిన్ అలవాటు ఉన్న వాడిని మాత్రమే ప్రమాదకరంగా చూసే దృక్పథానికి మూల కారణాలను ఈ పుస్తకం చర్చిస్తుంది.

మనుషులు మత్తుమందుల వ్యసనపరులుగా తయారు కావటానికి మూలకారణం జెనెటిక్ (వంశపారంపర్యం) అని రుజువు అయ్యింది. అయితే ఒక వంశంలో అందరూ అలా తయారు అవుతారా అన్న ప్రశ్నకు జవాబు కాదనే వస్తుంది. పరిస్థితుల ప్రాబల్యం, మత్తుమందులు సులభంగా లభ్యం అవటం కూడా కారణాలు అవుతాయి. చిన్నతనంలో శారీరక, లైంగిక అవమానాలకు గురి అయిన వాళ్లు ఎక్కువ శాతం మత్తుమందుల వ్యసనపరులు అవుతారు. భారీ కాయం వలన ఎలాగైతే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందో -శారీరక, లైంగిక అవమానాలు గురి అయిన వారికి మత్తుమందుల వ్యసనం అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందని అనే సర్వేలు, ప్రయోగాలు నిరూపించాయి. మత్తుమందుల బారిన పడకుండా ఉండటానికి ఒక్క వ్యక్తో, ఒక కుటుంబమో కాకుండా సమాజం అంతా ప్రయత్నం చేయాలి. ఆరోగ్యకరమైన సమాజాన్ని అందించటానికి ప్రభుత్వం కూడా విధివిధానాలను ఏర్పాటు చేయాలి.

వ్యసనం కేవలం మత్తుమందులకు మాత్రమే పరిమితం అయి ఉండదు. దేన్నీ లెక్క చేయకుండా, తనకి ఆనందాన్ని ఇచ్చే పనిని చేస్తూ పోయే ధోరణి వ్యసనమే అవుతుంది. డ్రగ్స్, వ్యసనం అనే రెండు పదాలను తీసుకొంటే వ్యసనం అనే పదమే కీలకం అని అంటారు రచయిత. డ్రగ్స్ వాడకుండానే ప్రవర్తనాపరమైన వ్యసనాలు కొన్ని ఉంటాయి. నెగటివ్ సెన్స్ లో చెప్పే సెక్స్ ఎడిక్ట్, వర్క్ ఎడిక్ట్ లే కాకుండా మనిషిని నిష్క్రియాపరంగానూ, విధ్వంసకరంగా, శక్తిరహితంగా చేసేవి ఏవైనా వ్యసనాలే. American Society of Addiction Medicine నిర్వచనం ప్రకారం వ్యసనం వదలని మెదడు జబ్బు. ఆ జబ్బు గుర్తింపు, ప్రేరణ, జ్ఞాపకాలు, వాటికి సంబంధించిన వలయాల ప్రమేయంతో కొనసాగుతుంది. వ్యసనాల్లో డ్రగ్స్ ఒక భాగం కావచ్చు. కానీ డ్రగ్స్ రహిత వ్యసనాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు గుర్తింపు కోసం చేసే మితిమీరిన ప్రవర్తన కూడా వ్యసనమే. స్వాములకు, బాబాలకు ఎడిక్ట్ అయ్యేవాళ్లు కూడా వ్యసనపరుల కిందకే వస్తారు. వీడియో ఆటలు, జూదం, విపరీతమైన షాపింగులు, అశ్లీల సినిమాల వీక్షణం, మితిమీరిన తిండి, అధిక సెక్స్ లు కూడా ఈ కోవలోకే వస్తాయి. మనిషికి ఆహ్లాదాన్ని ఇచ్చే ఈ విషయాలకి మామూలు మెదడు అయితే ఒక పరిమితి తరువాత ‘ఇక చాలు’ అని చెబుతుంది. వ్యసనపు మెదడు వలయాలు ఉన్న వారికి ఆ సంకేతం అందదు. తమ శారీరక, మానసిక, సామాజిక, ఆర్థిక శ్రేయస్సులకు ఎంత నష్టం వాటిల్లినా కూడా ఆయా వ్యక్తులు పట్టించుకోరు. అయితే వ్యసనపరుల మెదడు వలయాలు, వ్యసనపరులు కాని వ్యక్తుల మెదడు వలయాలు వేరుగా ఉంటాయి. ఆ వ్యసనం మత్తుమందుల వలన అయినా, లేక ప్రవర్తనాపరమైన వ్యసనం అయినా ఈ తేడా ఆ మెదడు నిర్మాణంలోనే ఉంటుంది.

మనుషులు, డ్రగ్స్ -అనేక సంవత్సరాలుగా కలిసి ప్రయాణం చేశాయనీ, వారిద్దరి మధ్య స్నేహం పరిణామాత్మకమైనదనీ అంటారు రచయిత. 7500 సంవత్సరాల కిందటి స్పెయిన్ దేశపు అస్థిపంజరం పళ్లల్లో గసగసాల తాలూకు ఆనవాళ్లు దొరికాయట. అలాగే స్పెయిన్ గుహల్లో శవాలను పూడ్చిపెట్టిన చోట ఉన్న బంగారు నగలతో బాటు, సంచుల్లో గంజాయి దొరికిందట. క్రీస్తు శకం 6వ శతాబ్దంలో నల్లమందు తాలూకు విత్తనాలు భారతదేశానికి వచ్చాయంటారు. అవి తెచ్చినందుకు అలగ్జాండర్ ద గ్రేట్ కు ఆ క్రెడిట్ ఇస్తారు. 14వ శతాబ్దం తరువాతనే నల్లమందును బహిరంగంగా ఔషదాలలో వాడినట్లు గ్రంధాల ద్వారా తెలుస్తోంది. 17వ శతాబ్దంలో అమెరికాలో పసిపిల్లలను చిన్న చిన్న నొప్పుల నుండి విముక్తి చేసి నిద్ర బుచ్చటానికి వాడిన టానిక్కులలో నల్లమందు ఉండింది. అమెరికాలో ఆ టానిక్కుల వ్యాపార ప్రకటనలు విరివిగా వచ్చేవి.

ఇక్కడ మాదక ద్రవ్యాల పేరుతో చలామణి అవుతున్నవాటి గురించి కొద్దిగా తెలుసుకోవాలి. నల్లమందును గసగసాల పంట నుండి తయారు చేస్తారు. దాని నుండే మార్ఫిన్, హెరాయిన్ (మార్ఫిన్ కు కొన్ని మందులు కలిపి తయారు చేస్తారు), కొడైన్ లాంటి మత్తు పదార్థాలు తయారు అవుతాయి. గంజాయి మొక్క ఇంకో రకం మత్తును ఇస్తుంది. ఈ మొక్కలో అనేక ఔషద విలువలు ఉంటాయి. అది మనిషి మూడ్ ను ఆహ్లాదకరంగా మారుస్తుంది. వినోదానికి, మందులకు, పరిశ్రమలకు గంజాయిని వాడతారు. ఇక భారతదేశానికి వస్తే -ప్రపంచంలోనే నల్లమందును ఉత్పత్తి చేయటానికి అనుమతి ఉన్న అతి తక్కువ దేశాల్లో భారతదేశం ఒకటి. ఇక్కడ ‘బంక నల్లమందు’ కూడా అధికారకంగానే తయారు అవుతుంది. అయితే ఇక్కడ కేవలం 1 శాతం మాత్రమే ప్రజలు మాదక ద్రవ్యాలకు అలవాటు పడి ఉన్నారు. అలవాటు పడిన వారిలో ఎక్కువ ఈశాన్య రాష్ట్రాల నుండి, పంజాబ్ నుండి ఉన్నారు. మాదక ద్రవ్యాలు అంటే నల్లమందు, గంజాయి, వాటి ఉప ఉత్పత్తులు మాత్రమేనని ప్రచారంలో ఉన్నమాట ఇక్కడ గుర్తుంచుకోవాలి.

1893 ప్రాంతంలో భారత దేశంలో గంజాయి తాగుతున్న వారి మీద, దాని చెడు ప్రభావాల మీద సర్వే చేయించటానికి బ్రిటిష్ ‘రాయల్ ఓపియం కమిషన్’ ను ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ 1200మంది డాక్టర్లనూ, కూలీలను, యోగులను, ఫకీరులను, మానసిక ఆరోగ్య సంస్థల అధిపతులను, భంగ్ పండించే రైతులను, పన్ను వసూలు చేసేవారిని, స్మగ్లర్లను, సైనికాధికారులను, పూజార్లను సర్వే చేసి 3281 పేజీల రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారం గంజాయి తగు మోతాదులో వాడటం వలన ఎలాంటి నష్టమూ లేదు.

మార్ఫిన్ నుండి హెరాయిన్ ను తయారు చేసే ‘వంటగదులు’ భారతదేశంలో పశ్చిమం నుండి తూర్పు వరకూ విస్తరించి ఉన్నాయి. థాయిలాండ్, మయన్మార్, లావోస్ సరిహద్దులను కలిపే త్రికోణాకర స్థలం కొండలతో నిండి ఉంది. అక్కడ నల్లమందు నుండి వెలికి తీసిన మార్ఫిన్ ను అతి సులువు రసాయన పద్దతులతో హెరాయిన్ గా మారుస్తారు. నల్లమందు తయారు చేసే దేశాల్లో ఇప్పుడు ఆఫ్ఘనిస్థాన్ ప్రధమంగా ఉంది. అక్కడి అస్థిరమైన రాజకీయ పరిస్థితులు ఆ ప్రజలను నల్లమందుని ఇచ్చే గసగసాల పంటను విస్తృతంగా పండించే వైపు తోసింది. ఆఫ్ఘనిస్థాన్ నుండి భారతదేశానికి పాకిస్తాన్ ద్వారా హెరాయిన్, నల్లమందు సరఫరా అయ్యే సరిహద్దులు ఉండటం వలన పంజాబ్ లో ఎక్కువ మాదక ద్రవ్యాల వ్యసనపరులు ఉంటారని అనుకుంటారు. కానీ ఇటీవల పంజాబ్ లో పట్టుబడిన 188 కేజీల హెరాయిన్ ఆ రాష్ట్రానికి 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న పాకిస్తాన్ నుండి రాలేదు. 1500 కిలో మీటర్ల దూరంలో ఉన్న గుజరాత్ నుండి వచ్చినట్లు తేలింది.

భారత సాంప్రదాయంలో నల్లమందును, ఆల్కహాల్ ను ఆమోదించే గుణం అనాదిగా ఉన్నదని అంటారు రచయిత. 80లలో పంజాబ్ లో తమ దగ్గర పని చేసే రైతుకూలీలకు ఏడాదికి రెండుసార్లు నల్లమందును సరఫరా చేయటం భూస్వాములు ఒక హోదాగా పరిగణించారు. ఆ నల్లమందుతో కూలీలు అవిరామంగా పని చేస్తారనే స్వార్థం కూడా ఉంది. గసగసాల పంటను తీశాక ఆ చెట్లను పశువులకు వేస్తే అవి హాయిగా ఉండేవట. 90ల దాకా నల్లమందు వ్యసనం ఉన్న కేసులు చాలా తక్కువగా సైకియార్టిస్టుల దాకా వచ్చేవి. ఎందుకంటే ప్రజలు, కుటుంబాలు నల్లమందును తీసుకోవటాన్ని వ్యసనంగా భావించేవారు కాదు.

కానీ తరువాత కాలంలో పరిస్థితులు వేగంగా మారిపోయాయి. మరీ చిన్నపిల్లలు డ్రగ్స్ వ్యసనపరులుగా మారారు. డ్రగ్స్ కూడా మారిపోయాయి. ప్రోక్సీ పేరుతో సింథటిక్ నల్లమందు గొట్టాల రూపంలో వాడుకలోకి వచ్చింది. డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ తో మాత్రమే అమ్మాల్సిన ఈ మందు వీధి చివర ఉన్న మందుల షాపుల్లో పప్పుబెల్లాల్లాగా అందరికీ అందుబాటులోకి వచ్చింది. 1985కు ముందు గసగసాల పొడి పేదవాడి నల్లమందు అయితే, 90లలో సింథటిక్ నల్లమందు రంగప్రవేశం చేసి ఒక తరంలోని కొంత శాతం యువత భవిష్యత్ ను నాశనం చేసింది. ఇక 2007లో రంగప్రవేశం చేసిన హెరాయిన్ ను (ప్లాస్టిక్ మాదక ద్రవ్యం) ఇప్పుడు పంజాబ్ లోని 80-90 శాతం వ్యసనపరులు వాడుతున్నారు.

సహజ మత్తుమందుల వాడకం నుండి అసహజమైన ప్లాస్టిక్ మాదక ద్రవ్యాల వాడకానికి ప్రజలు మరలటానికి కారణం అమెరికా ప్రకటించిన ‘మాదక ద్రవ్యాల మీద యుద్ధ’మేనని అంటారు రచయిత. ఈ సోకాల్డ్ యుద్ధం కొన్ని అంతర్జాతీయ ఒప్పందాల ఊతంతో -అన్ని రకాల సహజ మాదక ద్రవ్యాల మీద ప్రపంచవ్యాప్తంగా నిషేధం విధించింది. అమెరికాను అనుకరించి చేస్తున్న ఈ యుద్ధం వలన భారత్ చాలా మూల్యాన్ని చెల్లిస్తుంది. ఈ నిషేధం ఎంత ప్రమాదకరంగా మారింది అంటే -ఇంతకు ముందు తక్కువ మోతాదు మత్తుతో, ఎక్కువ పరిణామంలో ఉండే మత్తు పదార్థాలు ఇప్పుడు అక్రమ రవాణాకు అనుకూలంగా తక్కువ సైజులో, ఎక్కువ సాంద్రతతో తయారయ్యాయి. మత్తుని పెంచటానికి అనేక ప్రమాదకర కలుషితాలు అందులో కలగలుపుతున్నారు. ఇవి అక్రమంగా సరఫరా అవుతున్నాయి కాబట్టి ఎక్కడా వీటిని పరీక్షించి, నియంత్రించటం జరగదు.

‘మాదక ద్రవ్యాల మీద యుద్ధం’ అంటే మన యువత మీద యుద్ధమేనని రచయిత అభిప్రాయ పడ్డారు. మానవ మెదడుకు ఉల్లాసాన్ని ఇచ్చే మందుల వాడకం ఇప్పుడు నిషేధానికి గురి అయింది. గంజాయి, గసగసాల ఉత్పత్తుల వలన కలిగే నష్టం వాటికి ఎడిక్ట్ అవటమే. ఆ ఎడిక్షన్ నుండి బయట పడటం కూడా సులభమే. వాటి వలన ఎలాంటి ఆరోగ్య నష్టాలు ఉండవు. భారత్ అంతర్జాతీయంగా సంతకం చేసిన ఒప్పందాల ఫలితంగా వచ్చిన Narcotics Drugs and Psychotropic Substances (NDPS) లాంటి చట్టాలు యువతను వేధింపుల గురి చేస్తున్నాయి. పంజాబ్ జైళ్లలో ఉన్నవారిలో 40 శాతం డ్రగ్స్ ‘కలిగి ఉండటం’ అనే నేరాన్ని చేసిన వాళ్లే. అది ఎంత తక్కువ శాతమైనా శిక్ష ఒకటే. నిజమైన ఆరోగ్య క్షీణక కారణాలైన మద్యం, సిగెరట్టులు ఎలాంటి నిషేధం లేకుండా విచ్చలవిడిగా వాడకంలో ఉండగా -నిషేధం కారణంగా సహజ మత్తునిచ్చే గసగసాలు, గంజాయిలు ప్లాస్టిక్ మందులతో కలుషితం అయ్యి ప్రమాదకరంగా మారాయి. ఇంకో పక్క ఈ ‘యుద్ధాన్ని’ మొదలు పెట్టిన అమెరికా తన రాష్ట్రాల్లో క్రమంగా నిషేధాన్ని సడలిస్తూ వస్తోంది.

అంతర్జాతీయ నిబంధనలను తలవొగ్గుతూ గసగసాలు, గంజాయి, కోకా మొక్కల నుండి వచ్చే సహజ, అసహజ మత్తు పదార్థాల మీద నిషేధం విధించిన భారతదేశం భంగ్ మీద నిషేధాన్ని సడలించటం ఆసక్తికరం. భంగ్ భారతదేశ సాంప్రదాయ మత్తుమందనీ, మతపరమైన వేడుకల్లో వాడతారనీ -ఇండియా చెప్పుకుంటోంది. గంజాయి మొక్క నుండే తయారయ్యే భంగ్ హటాత్తుగా పవిత్రతను ఆపాదించుకోవటానికి కారణం వారణాసిలాంటి దైవ స్థలాల్లో బ్రాహ్మలు, యోగులు కూడా దాన్ని వాడటమే. భంగ్ శివుడి ఆశీర్వాదంతో వచ్చిందనే నమ్మకం కూడా భంగ్ నిషేధానికి గురి కాకుండా ఉపయోగపడింది.

ఈ పుస్తకంలో రచయిత మాదక ద్రవ్యాల వ్యసనానికి ఉన్న ఆర్థిక సామాజిక కారణాలను కూడా పంజాబ్ ను కేంద్రంగా తీసుకొని విశ్లేషించారు. పంజాబ్ లో వచ్చిన ఆకుపచ్చ విప్లవం నిజానికి అక్కడ ప్రజలను ఆత్మహత్యల వైపు తోసిందని చెబుతారు రచయిత. అక్కడి మాదక ద్రవ్యాల వ్యసనం కూడా పాక్షికంగా ఆత్మహత్యేనని ఆయన అంటారు. 1950ల నాటి కరువునుండి కాపాడుకోవటానికి భారత్ అమెరికా గోధుమల మీద ఆధారపడింది. ఆ గోధుమలను కొనటానికి భారత్ డాలర్ల రూపంలో అత్యధికంగా డబ్బు చెల్లించాల్సి వచ్చింది. అమెరికా దేశపు అదనపు ధాన్యాల ఎగుమతి వలన వచ్చిన ఆదాయాన్ని -ఆ ఆదాయాన్ని ఇచ్చిన దేశాల అభివృద్ధికే ఉపయోగించాలనే నియమపు పర్యవసానమే పంజాబ్ లో గ్రీన్ రివల్యూషన్. మానవ వనరులను, సాంకేతిక వనరులను విస్తృతంగా ఉపయోగించి భారతదేశానికి అదనపు ధాన్య ఉత్పత్తిని గ్రీన్ రివల్యూషన్ ద్వారా పంజాబ్ ఇవ్వగలిగింది. అయితే ఇక్కడి వ్యవసాయం ఎక్కువగా ట్రాక్టర్లు, మర యంత్రాలు, పురుగు మందులు, రసాయన ఎరువుల మీద ఆధారపడటంతో -దానికి కావాల్సిన పెట్టుబడి కోసం రైతులు బ్యాంకుల మీద కాకుండా, రాత పని తక్కువగా ఉండే స్థానిక వడ్డీ వ్యాపారుల మీద ఆధార పడ్డారు. కాలం గడిచే కొద్ది -ఇంతకుముందు పెద్ద పెద్ద భూఖండాలుగా ఉన్న భూమి కుటుంబాలలో విభజనకు లోనవటం, పంజాబ్ లో ఎన్ని నదులు ఉన్నా పంట కాలవల వ్యవస్థ ప్రాధమికంగానే ఉండటం, విరివిగా నీరు తాగే వరి పంట కోసం నీళ్లు చాలక రైతులు బోర్లు వేయటం, బోర్ల నుండి నీరు పైకి రావటానికి కరెంటు అవసరం ఎక్కువ అవటం, ఇంకా అనేకానేక కారణాల వలన వ్యవసాయం చాలా ఖరీదుగా మారింది. వ్యవసాయానికి అనుబంధంగా పరిశ్రమలు రావాల్సిన అవసరాన్ని భారతదేశ రాజకీయ వ్యవస్థలు గుర్తించక పోవటం వలన -వ్యవసాయానికి కావాల్సిన పెట్టుబడులు ఖరీదు అయ్యి పెద్ద రైతులు సన్నకారు రైతులుగా మారి క్షీణించి పోయారు. తరువాత తరాల్లో పిల్లలు అటు వ్యవసాయం చేయలేక, ఇటు ఉద్యోగాలు లేక బేకారుగా తిరగటం కూడా పంజాబ్ లో మాదక ద్రవ్యాల వ్యసనపరులు ఎక్కువగా తయారవటానికి కారణం అయింది అంటారు రచయిత.

మత్తుమందులు, వ్యసనాలు, ప్రభుత్వ విధానాలు, అంతర్జాతీయ కుట్రలు, పెట్టుబడిదారి అనుకూల విధానాలు -వీటన్నిటి గురించి కళ్లు తెరిపించే పుస్తకం ‘Most of what you know about addiction is wrong’. అవకాశం ఉన్నవాళ్లు తప్పక చదవవలసిన పుస్తకం.

స్వస్థలం ఒంగోలు. ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ మహిళా పాలిటిక్నిక్ కాలేజీలో ఎలక్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ బ్రాంచ్ హెడ్ ఆఫ్ సెక్షన్ గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు. 'మాతృక' బాధ్యతలు చూస్తున్నారు.

12 thoughts on “మాదక ద్రవ్యాలు – మనిషి జీవితం – రాజకీయాలు

 1. Very interesting book. ఒక మంచి డాక్యుమెంటరీ కూడా వుంది.

 2. నాకు తెలియని చాలా వివరాలతో చాలా ఆసక్తికరంగా రాశారు. ఈ పుస్తకం చదవాలనిపిస్తోంది.

 3. పుస్తకం గురించి సవివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. మాదక ద్రవ్యాల వ్యాప్తిని అరికట్టే పోలీసింగ్ కన్నా వ్యాప్తిలోకి తెచ్చే ముఠాలు బలంగా ఉన్నాయి కాబట్టే ఈ సమస్య రోజురోజుకీ తీవ్రత అవుతా ఉంది. అవగాహన పెంచి ఇటువంటి పుస్తకాలు రావాలి

 4. మొక్కల నుండి తయారయే సహజ మత్తు పదార్ధాలను నిషేధించడం వల్లే ప్రమాదకరమైన రసాయనిక మత్తు పదార్థాలు అక్రమంగా ప్రవేశించాయనడం నూటికి నూరు శాతం సబబుగా వుంది. లోతైన విశ్లేషణ.
  మీ ఈ పుస్తక పరిచయం బాగుంది.

 5. మంచి విశ్లేషణత్మాక వ్యాసం. అభినందనలు

 6. ‘Most of what you know about addiction is wrong’
  సుదీర్ఘమైన ఈ పుస్తకం పేరులోనే రచయిత చెప్పాల్సిందంతా చెప్పేశారు.
  అనిరుద్ కాలా మొత్తం పుస్తకం లో చర్చించిన విషయాలను మీరు ఈ సమీక్షలో
  అద్దంలో చందమామను చూపించినట్టు చూపించారు.
  మంచి పుస్తకం. మంచి సమీక్ష.

  వ్యసనం అంటే డ్రగ్స్, తాగుడు, ధూమపానం మాత్రమె కాదనీ –
  మనిషిని నిష్క్రియాపరంగా, విధ్వంసకరంగా, శక్తిరహితంగా చేసే ప్రతీదీ వ్యసనమే …
  గుర్తింపు కోసం మితిమీరినట్టు ప్రవర్తించడం… స్వాములకూ, బాబాలకు ఎడిక్ట్ అవడం … వీడియో గేములు, విపరీతమైన షాపింగులు, అశ్లీల సినిమాల చూడడం, తిండి మీదా సెక్స్ మీదా మితిమీరిన యావ … ఇవన్నీ వ్యసనాలే అని చాలా చక్కగా కన్విన్సింగ్ గా చెప్పారు.
  ఈ పుస్తకం తెలుగులో వస్తే బాగుంటుంది.

  1. తప్పక అనువాదం జరగాల్సిన పుస్తకం అండి

   1. మీరే ఎందుకు చేయరు?
    చాలాబాగుంది విశ్లేషణ.

 7. నాకు తెలియని విషయాలు తెలుసుకున్నాను, మాదకద్రవ్యాలు, వ్యసనాలు అనే మాటలకు విస్తృతమైన అర్థం చెప్పారు వ్యసనాల పరిధిలో చాలా అంశాలు చూపారు, ఆసక్తికరంగా ఉంది తప్పకుండ ఆ బుక్ చదువుతాను మేడం.

 8. మీ రివ్యూ చాలా విషయాలను సెన్సిటైజ్ చేసింది. వీలైతే పుస్తకం పంపగలరు.
  -9441348111.

 9. ఆసక్తికరమైన విషయం మీద పుస్తకానికి మంచి పరిచయం. 1969 నాటి గాడ్ ఫాదర్ ఫిక్షన్ నవలలో మాఫియా బృందాల మధ్య ఘర్షణకు ఒక కారణం, మాదకద్రవ్యాల వ్యాపారంలోకి ప్రవేశించాలని కొందరు కోరుకోవడం. ఆ సంగతి అటుంచితే, అమెరికా అధ్యక్షుడు 1971 లో ప్రకటించిన మాదకద్రవ్యాలపై యుద్ధం, ఒక రకంగా పాత వలసవాద విధానాల కొనసాగింపు, లాటిన్ అమెరికా దేశాల నియంత్రణలో అమెరికా నయా వలస వ్యూహానికి పొడిగింపు. లక్షల కోట్ల డాలర్ల వెచ్చించి, నడిపిన ఆ యుద్ధం ఎలాంటి ఫలితాలనీ సాధించలేక పోయిందని అధికారిక నివేదికలే చెబుతున్నాయి. ఆ యుద్ధానికీ, దాని వైఫల్యానికి కారణమూ రాజకీయాలే. తాజాగా, జిన్ పింగ్ అమెరికా పర్యటనలో నవంబరు 15, 2023న అమెరికా, చైనా ల మధ్య ఒప్పందాలలో కృత్రిమ మాదక ద్రవ్యాల తయారీకి ఉపయోగపడుతుందని చెప్పే ఫెంటానిల్ ఉత్పత్తిపై నియంత్రణ యాదృచ్చికం కాదు.
  అయితే, సహజ మాదక ద్రవ్యాలపై నిషేధమే కృత్రిమ (సింథటిక్) మాదకద్రవ్యాల ప్రాచుర్యానికి కారణమనడం పాక్షిక సత్యమేమో. కృత్రిమ (సింథటిక్) మాదకద్రవ్యాల ప్రాచుర్యానికి వాటిని తయారు చేయడంలో కొంత సౌలభ్యమూ, చిన్న చిన్న మార్పులతో నిషేధాలని అధిగమించే అవకాశం ఉండడమూ ఒక ముఖ్య కారణం. సహజ మాదకద్రవ్యాల వినియోగం పట్ల అమెరికాలో విధానాలు మారుతూ వున్నాయి. వైద్య కారణాల రీత్యా అయినప్పటికీ, వివిధ రాష్ట్రాలలో నిబంధనలని సడలిస్తూ ఉన్నారు. సుగంధ ద్రవ్యాలవంటి కన్నాబినాయిడ్స్, సుగంధ స్నాన లవణాలుగా పిలిచే కాథినోన్స్, ఆంఫిటమిన్స్ అనే మూడు తరహాల కృత్రిమ మాదక ద్రవ్యాల తయారీని నియంత్రించడం అంత సులభం కాదు.
  మాదక ద్రవ్యాల విషయంలో సిఐఏ తన ఏజెంట్లపైన నిర్వహించిన ప్రయోగాలలో భాగంగా 1953లో హత్యకి గురైన ఫ్రాంక్ ఓల్సన్ (మొదట దానిని ఆత్మహత్యగా చిత్రించారు) గురించి చదువుతుంటే భయంతో ఒళ్ళు జలదరిస్తుంది. మాదకద్రవ్యాలు చరిత్రతో, రాజకీయాలతో ముడిపడిన విధ్వంసానికి, విషాదానికి ఒక ముఖ్యమైన పార్శ్వం. మంచి పరిచయ వ్యాసం. అభినందనలు.

Leave a Reply