మాటను వధించే క్రతువు

1
రుతుపవనాలన్నీ
మంటల్ని మోసుకొస్తున్నాయి
రేపోమాపో కాదు
ఇక ఎప్పుడూ
నిప్పుల వానలో నువ్వూ నేనూ
కట్టెలా కాలిపోవాల్సిందేనేమో!

2
ఎందుకిలా అనిగానీ
ఏమిటిది అంటూ గానీ పల్లెత్తు మాటనకు
పళ్ళు కొరుకుతోంది కాలం
ఇనుప గుర్రంపైనెక్కి సవారీ చేస్తూ
పైత్యమో, పతనమో పాటేదైనా గానీ
వంతపాడకుంటే నీ గొంతు నులుముతుంది

3
ఇప్పుడు నోర్మూసుకోవడమో
నంగినంగిగా మాట్లాడడమో
మెమ్మేంమే… తిత్తిత్తీ…అంటూ
నత్తిమాటలు నటించడమో
కొత్త పాఠాలుగా చదువుకోవాలటా

4
ఋతువులన్నింటా
మాటని, మాట్లాడే మనిషిని వంధించే
క్రతువులు నడుపుతున్న
కుల మతాల మబ్బులు కమ్మిన ఆకాశం కింద
స్వేచ్ఛగా విశ్వమానవ తీగలు ఎగబాకుతాయా?

ఆలోచన్లు లేని
మెదళ్లు లేని
అస్సలు తలలే లేని
మొండేలే బతుకుతుంటాయి గానీ
మోడదేలిన దినాలే తిరుగుతుంటాయి గానీ
మళ్లీ ఆదిమ యుగ న్యాయాలే భుజాలెగరేస్తాయి గానీ

5
నువ్వు నవ్వకు
ఋతువులన్నీ ఉరుముతున్నాయి
నవ్వుతూ మాట్లాడతావేమో
గొంతు గుర్తుపట్టే గుంటనక్కల గుంపులున్నాయి

6
నేనుకూడా
మరణ భయంతో మాట్లాడటమే మరిచిపోయాను
అయినా
నోరువిప్పి మంచి చెడుగురించి మాట్లాడలేని నేను
మనిషెట్టా అవుతాను

పూర్తిపేరు ప‌ల్లిప‌ట్టు నాగ‌రాజు. చిత్తూరు జిల్లా ‘అరవై నాలుగు పెద్దూరు’లో తెలుగు ఉపాధ్యాయుడు. శ్రీ వెంకటేశ్వర విశ్వ‌విద్యాల‌యంలో పీహెచ్‌డీ చేస్తున్నారు. ఆరువంద‌ల‌కు పైగా కవితలు, మినీ కవితలు, 6 కథలు రాశారు. చిత్తూరు జిల్లా ‘అభ్యుదయ రచయితల సంఘం’, ‘ఈ తరం కవితా వేదిక’లో కార్యవర్గ స‌భ్యుడిగా ప‌నిచేస్తున్నారు.

3 thoughts on “మాటను వధించే క్రతువు

 1. ఇప్పుడు నోర్మూసుకోవడమో
  నంగినంగిగా మాట్లాడడమో
  మెమ్మేంమే… తిత్తిత్తీ…అంటూ
  నత్తిమాటలు నటించడమో
  కొత్త పాఠాలుగా చదువుకోవాలటా

  నేరగాళ్లు రాజ్యమేలుతున్న కాలం కదా…
  ఇట్లనే ఉంటుంది

Leave a Reply