మహిళా సాధికారతకి అడ్డంకులు

ఇది ఎంతటి స్త్రీ వ్యతిరేక రాజకీయ వ్యవస్థో చట్ట సభల్లో తొక్కివేయబడుతున్న మహిళా రిజర్వేషన్ బిల్లు నిరూపిస్తుంది.

*

సాధికారత అంటే?

సాధారణ అర్ధంలో సాధికారత అంటే మరొకరి దయా దాక్షిణ్యాల మీద, అనుమతుల మీద ఆధారపడాల్సిన అవసరంలేని స్వతంత్ర వైఖరితో ఇతరులతో సమాన స్థాయిలో వ్యవహరించగలగడం, నిర్ణయాలు తీసుకోగలగడం. ఇందుకు సంపుర్ణంగా హక్కుల్ని బేషరతుగా వినియోగించుకునే అవకాశం, సంఘ నిరభ్యంతరత, ఏ రకమైన వివక్ష లేకుండా వుండటం, భావజాలపరమైన అడ్డుగోడలు లేకపోవడం అనే సామాజిక వాతావరణం ఉండాలి. మహిళా సాధికారతకి అదనంగా మరి కొన్ని షరతులు వున్నాయి. అది సునిశితమైన, సున్నితమైన జెండర్ దృక్పథం నుండి చూస్తే కానీ అర్ధం కాదు. విద్య, వైద్య, ఆరోగ్యం, ఉపాధి, వ్యాపార, రాజకీయ అవకాశాలకు పురుషులతో సమాన అవకాశాలు కలిగివుండి స్త్రీలు ఎలాంటి అడ్డంకులు లేకుండా, పురుషుల ప్రమేయం తప్పనిసరి కాకుండా తమ ప్రతిభతో, నిర్ణయ సామర్ధ్యంతో స్వావలంబన చెందడాన్ని మహిళా సాధికారత అని చెప్పొచ్చు. ఈ స్థాయిని సాధించాలంటే ఎన్నెన్నో వ్యవస్థీకృతమైన అడ్డంకుల్ని అధిగమించాల్సి వుంటుంది. ఇది స్త్రీల పోరాటంగా కాక ఒక సామాజిక అవసరంగా, ఉద్యమంగా మొత్తం సమాజం భావించగలిగినప్పుడే మహిళా సాధికారత సాకారం కాగలదు. భారతదేశ సందర్భంలో అసలు మహిళా సాధికారతకు వున్న అడ్డంకులేమిటి? వాటి పుట్టుక ఎలా జరిగింది? వాటి స్వభావం ఏమిటనే విషయాల్ని మనం చర్చకు తీసుకురాకపోతే, వాటిని అర్ధం చేసుకోకపోతే, ఆ అడ్డంకుల నిర్మూలనకు పూనుకోకపోతే మహిళా సాధికారత ఎప్పటికీ కాగితం మీద శుష్క ప్రతిపాదనలానే మిగిలిపోతుంది.

సాంప్రదాయ భావనలు:

ముందుగా స్త్రీకి సంబంధించి సంప్రదాయాలుగా, జీవన విధానాలుగా వున్న భావజాలాల గురించి మాట్లాడుకుందాం. భారతదేశం కరడు కట్టిన పురుషస్వామ్య వ్యవస్థ. ఇది తన పునాదుల్లో పురుషుల కొరకు, పురుషులచే, పురుషుల యొక్క భావజాలాలు, ధర్మాలతో బాగా దట్టింపబడిన వ్యవస్థ. స్త్రీ పురుషులిరువురు కోసం కాక పురుషుల కోసం నిర్మించబడిన వ్యవస్థ అంటేనే అది స్త్రీ వ్యతిరేకమైనదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బానిసలు ప్రభువుల్ని ఆరాధించినట్లు స్త్రీలు కూడా హృదయపూర్వకంగా ఈ దోపిడీ వ్యవస్థ పునాది రాళ్లను వేల ఏళ్లుగా మోసేలా చేయడంలో పురుషస్వామ్యం సఫలీకృతం అయింది. ఇప్పటికీ మెజారిటీ స్త్రీలు దాన్ని మోస్తూనే ఉన్నారు. వంటగదికి, పడగ్గదికి తమ శక్తిని, దేహాల్ని అప్పగించేసి, తమని తాము స్తంభాలకు బంధించుకొని, “అసూర్యంపశ్య” అంటే అదేదో గొప్ప పొగడ్త అనుకొని పొంగిపోయారు. బైట విస్తారమైన ప్రపంచముంది, చల్ల గాలులున్నాయి, కొండకోనలున్నాయి, నదీనదాలు, సముద్రాలు, అడవులు, తోటలు వున్నాయని, వాటిని అనుభవంలోకి రానివ్వకుండా, ప్రకృతి ప్రసాదమైన ఆ సహజ సంపదని సాధికారంతో అనుభవించే సమాన స్వేచ్ఛ పురుషులతో పాటు సమానంగా తమకూ అవకాశముందని, సమాజ మనుగడలో బానిసగా కాక యజమానిగా తానూ గర్వపడే స్థానంలో ఉండొచ్ఛనే స్పృహని కలగనివ్వకుండా, అలాంటి స్పృహ కలిగినా దానిని ఎదగనివ్వకుండా పాతివ్రత్యపు పైత్య వికార కథలతో, దేవతలు కూడా చివరాఖరికి తమ మొగుడు దేవుళ్ల కాళ్లు పట్టాల్సిందేనన్న సైకలాజికల్ కండిషనింగ్ చేయబడ్డ స్త్రీ మన భరత స్త్రీ. స్వాతంత్ర్య పూర్వం ఎక్కడో ఝాన్సీ లక్ష్మీబాయి వంటి వారి పేరు తీసినా అది పురుష ప్రయోజనాలను నిలబెట్టిన దృష్టాంతాలే. వ్యవస్థలో స్త్రీ స్థానాన్ని పైకి జరపనివ్వని ఉదాహరణలే. మన సాహిత్య, సాంస్కృతిక వాతావరణం ఇందుకు దోహదం చేసేదే.

పురుషస్వామ్యం:

పురుషస్వామ్యం అనేది ఓ బహుముఖ వ్యూహం. అందులో ఎమోషనల్ బ్లాక్మెయిల్ నుండి బౌతిక హింస వరకు ఇమిడి వుంటాయి. చివరాఖరికి ప్రేమ, త్యాగం వంటి ఉదాత్త భావనల్ని కూడా పురుషస్వామ్యం వ్యవస్థ స్త్రీలకి వ్యతిరేకంగానే వాడుకున్నది. భర్త పట్ల ఉండాల్సిన ప్రేమని పాతివ్రత్య భావజాలంలో ఇరికించింది. దానితో పురుషుడి విశృంఖలత్వానికి, స్వార్ధానికి నోరెత్తలేని బలహీనురాలైందామె. అగ్ని ప్రవేశాలు చేయించినా, జూదంలో అమ్మేసినా, కుష్హ్టు రోగిని అంటగట్టినా కిక్కురుమనలేక పోయింది. ఆ రకంగా ఆమె పురుషుడిని తిరుగులేని యజమానిగా, తనని అతనికి బానిసగా మార్చుకున్నది. స్త్రీ పురుష సంబంధాల్లో యజమాని-బానిస అంశం వస్తే ఇంక సమానత్వం ఎక్కడ? సాధికారత ఎక్కడ?

భావజాల మాతృత్వం:

ప్రకృతి సహజాతమైన మాతృత్వ భావనని భావజాల మాతృత్వంతో రీప్లేస్ చేయించి స్త్రీని కట్టిపడేసింది పురుషస్వామ్యం. ఈ కృత్రిమ మాతృత్వం, మాతృప్రేమ మరో మోసపూరితమైన విలువ. స్త్రీ తన సర్వ శక్తులను పిల్లలకు, భర్తకు, అత్త మామలకు ధారపోసేలా చేసేది పురుషస్వామ్య మాతృత్వమనే భావన. సృష్టిలో ఏ జీవి ఐనా తాను కన్న బిడ్డని సంరక్షించుకుంటుంది. ఆహార అన్వేషణలో తర్ఫీదునిస్తుంది. ఇది సహజం. కానీ జీవితాంతం తన పిల్లలకి బానిసగా బతకదు. కానీ మహిళ అసలు తాను తల్లినవడమే గొప్ప వరంగా భావిస్తుంది. ఏం పురుషుడు తండ్రిగా ఎందుకు స్త్రీ అంతగా గర్వించకూడదు? పితృత్వం ఎందుకు వరం కాదు? ఎవరో కొందరు వ్యక్తులు అలా భావించవచ్చు. కానీ వ్యవస్థ భావజాలాలు ఎందుకని స్త్రీ పేరెంట్ హుడ్ మీదనే అంతగా ఫోకస్ చేసిందనేదే అసలు ప్రశ్న. ఈ భావజాలపు లోడ్ ఏదైతే వున్నదో అది తీవ్రమైన స్త్రీ సామాజిక బలహీనతకి దారి తీసింది. బలహీనత, వివక్ష వున్న చోట సమానత్వం, సాధికారత పుట్టవు. స్త్రీ తన జీవితాన్ని బాధ్యతల పేరుతో కుటుంబ సభ్యుల సేవకే అంకితం చేస్తే ఇంక ఆమె సామాజిక జీవితం ఏముంటుంది? ఆమెలోని సృజనకారిణి ఏం చేయగలుగుతుంది? ఆమెలోని మేధావి, సైంటిస్టు ఏ రకమైన ఆవిష్కరణలు చేయగలదు?

రాజ్యాంగం:

ఇంక చట్టాల విషయానికొస్తే రాజ్యాంగంలో స్త్రీల గురించి ఓ నాలుగు మంచి మాటలున్నప్పటికీ భారతదేశ చట్టాలు స్త్రీ అనుకూలమైనవి కావు. స్త్రీలకి సమాన ఆస్తి హక్కు కలగచేసే చట్టాలు ఇప్పటికీ స్పష్టంగా లేవు. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం ప్రతి ఒక్కరికీ సమానమైన రక్షణ లభిస్తుంది. కానీ నిజానికి మన సమాజంలో స్త్రీకి ఎంత భద్రత వున్నదో మనకి తెలియని విషయం కాదు. ఆర్టికల్ 15 లింగ వివక్షతతో సహా అన్ని రకాల వివక్షల్ని నిషేదించింది. కానీ మన దేశంలో లింగ వివక్షని మించిన వివక్ష లేనే లేదు. ఆర్టికల్ 16 ఏ కార్యాలయంలోని ఉద్యోగానికైనా సమాన అవకాశాల్ని హామీ ఇస్తుంది. కానీ ఇప్పటికీ అనేకానేక ఉద్యోగాల్లో స్త్రీల ప్రాతినిథ్యం చాలా తక్కువ వున్నది. స్త్రీ పురుషులు ఇరువురికి సమాన అవకాశాలు ప్రైవేటు రంగంలో కూడా ఖచ్చితంగా అమలు చేస్తే తప్ప “సమాన అవకాశాలు” అనే పదానికి అర్ధమే లేదు. ఎందుకంటే ఉపాధి అవకాశాలు ప్రభుత్వంలో కంటే ప్రైవేట్ రంగంలోనే ఎక్కువ కాబట్టి! ఆర్టికల్ 51-ఏ స్త్రీ గౌరవానికి భంగం కలిగించే అన్ని విధాలైన ఆచరణల్ని పాటించకపోవడం ఈ దేశపు ప్రతి పౌరుడి బాధ్యత అని నిర్దేశిస్తుంది. కానీ ఏమి జరుగుతున్నది వాస్తవంలో? కుటుంబాల్లోని సంప్రదాయాలు, ఆచారాల సంగతి మన అన్ని ప్రధాన మతాలకు చెందిన సంప్రదాయాలు, ఆచారాలు స్త్రీని చిన్న చూపు చూసేవే. చివరాఖరికి పునరుత్పత్తి ప్రక్రియకి దోహదపడే ప్రకృతి ఏర్పాటైన నెలసరి ఒక మైలగా, ఆమె అస్తిత్వం మీద ఓ మరకగా చూడబడుతుంది. ఆ సమయంలో స్త్రీ అంటరానిదౌతుంది. ఆధ్యాత్మిక పవిత్రతకి స్త్రీల నెలసరి భంగకరం అనే ఆచారాలు స్త్రీని న్యూనతకి గురి చేసే భావజాలానికి గురి చేసేవి. ఇది స్త్రీల మీద అమలయ్యే ఓ వ్యవస్థీకృత కుట్ర.

చట్టాలు:

రాజ్యాంగం స్ఫూర్తితో ఎన్ని చట్టాలు స్త్రీల గౌరవాన్ని నిలబెట్టడానికి, రక్షణ ఇవ్వడానికి రూపొందించడం జరిగింది? ప్రపంచ అత్యాచారాల రాజధానిగా వున్న భారత్ లో 2012లో పోక్సో చట్టం వచ్చే వరకు పిల్లల మీద లైంగిక నేరాల నిరోధక ప్రత్యేక చట్టం ఏదీ రాలేదు. ఢిల్లీలో ‘నిర్భయ’ మీద దారుణ లైంగిక అకృత్యం జరిగాక కానీ కఠినమైన చట్టాలతో ప్రత్యేక చట్టం తయారు కాలేదు. 2018లో దిశ హత్యోదంతం వరకు ప్రత్యేక లైంగిక అత్యాచార విచారణ పోలీస్ స్టేషన్ల ఆలోచనే రాలేదు (అదీ ఏపి లో మాత్రమే). ఇప్పటికీ ఫాస్ట్ ట్రాక్ విధానంలో లైంగిక అత్యాచారాల కేసులు సెటిల్ అవ్వడం లేదు. సమాజాన్ని విచిలితం చేసి, కల్లోల పరిచిన సందర్భాల్లో మినహా ప్రభుత్వాల స్పందన యాంత్రికమే. న్యాయమూర్తుల్లో కూడా జెండర్ సెన్సిటివిటీ అత్యవసరంగా వుండి తీరాలని కొన్ని కేసుల్లో మహిళా న్యాయమూర్తుల పరిశీలనలు, తీర్పులు తెలియచేస్తున్నాయి. సామాజిక వాతావరణం భద్రంగా లేనప్పుడు స్త్రీల కదలికలు కుంచించుకు పోతాయి. ఇంక మహిళా సాధికారతకు ఎంతవరకు అవకాశముంటుంది?

చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు:

చట్టసభల్లో మూడో వంతు రిజర్వేషన్ బిల్ సంగతికొస్తే అది రెండున్నర దశాబ్దాలుగా లోక్ సభలోనే మూలుగుతున్నది. ఆ బిల్లు చట్టంగా అమల్లోకి వస్తే స్త్రీల నుండి రాజకీయ ప్రాతినిథ్యం పెరిగి తమ నుండి అధికారం చేజారుతుందేమోనన్న భయం పాలక పార్టీల్లో కనబడుతుంటుంది. ముఖ్యంగా ఫ్యూడల్ లక్షణాలు అదికంగా ఉన్న ఉత్తరాది పార్టీల నుండి అభ్యంతరాలు ఎక్కువగా వస్తున్నాయి. ములాయం ఎప్పుడో తేల్చి చెప్పేసాడు తాము ఆ బిల్లు చట్టంగా రూపొందనివ్వబోమని. చర్చ సందర్భంగా ఆ బిల్లుని ముక్కలు ముక్కలుగా చించి పాడేశారు మన నేతలు. చట్ట సభల్లో మహిళా ప్రాతినిథ్యం సగం వుండాలంటే మూడోవంతు రిజర్వేషన్ అమలు తప్పనిసరి. ఇలాంటి చట్టాలు లేకుండా మహిళా సాధికారత సాధన తేలికేనా? ఇది ఎంతటి స్త్రీ వ్యతిరేక రాజకీయ వ్యవస్థో చట్ట సభల్లో తొక్కివేయబడుతున్న మహిళా రిజర్వేషన్ బిల్లు నిరూపిస్తుంది.

సినిమా, సోషల్ మీడియా, సాంస్కృతిక వాతావరణం:

మన సినిమాలల్లో స్త్రీని ఒక సెక్స్ ఆబ్జెక్ట్ గానే చూపిస్తారు. హీరోయిజాన్ని ఎలివేట్ చేయాలంటే స్త్రీని గ్లామర్ డాల్ గా, బలహీనురాలిగానే చూపిస్తారు. స్త్రీ శరీరం మీద జరిగేంత సాంస్కృతిక వ్యాపారం ఇంకెక్కడా జరగదు. వాణిజ్య ప్రకటనల్ని గమనిస్తే చాలు ఈ దేశ వ్యాపారం స్త్రీ దేహాన్ని ఎంతగా వాడుకుంటుందో అర్ధమవుతుంది. ఇంక వెబ్ సిరీస్ పేరుతో చూపించే అరాచకం చిన్నా చితకా కాదు. టెక్నాలజీ విప్లవం పేరుతో చిన్న పిల్లలకి కూడా మొబైల్స్ ఇవ్వాల్సిన పరిస్తితుల్లో వారి మెదళ్ల మీద మొట్టమొదటగా వేసే ముద్ర స్త్రీ శరీరమే. ఇప్పుడు చిన్న పిల్లలకి కూడా పోర్న్ అంటే ఏమిటో తెలుసు. మన దేశంలో ప్రజలు పాటిస్తున్న సనాతన, అధునాతన సంస్కృతులు రెండూ ఆ రకంగా స్త్రీ వ్యతిరేకంగానే వున్నాయి. ఇది స్త్రీ యొక్క చొరవని, చురుకుతనాన్ని అడ్డుకునే సాంస్కృతిక ఆటంకం. ముఖ్యంగా సృజనాత్మక రంగాల్లో స్త్రీ తనకు తాను ఎదగడానికి అవసరమైన అవకాశాలను అందిపుచ్చుకోడానికి “కేస్టింగ్ కౌచ్” (అవకాశం కోసం లైంగిక లొంగుబాటు) రూపంలో ఆటంకాలు ఎదురవుతాయి. అది ఇష్టం లేని స్త్రీలు అవకాశాలు కోల్పోవాల్సి వస్తుంది. గౌరవం, హుందాతనం నిలుపుకోవడానికి ఇబ్బంది పడే ఇంతటి సాంస్కృతిక అననుకూలత స్త్రీ సాధికారతకి గొడ్డలిపెట్టు.

కుటుంబ వ్యవస్థ:

స్త్రీల సాధికారతకు అడ్డం పడే మరో ముఖ్యమైన వ్యవస్థ కుటుంబం. సమాజం కుటుంబంలోనే మొదలవుతుందంటారు. సమాజ పోకడలన్నీ కుటుంబంలోనే కనబడతాయి. సమాజానికి అనుగుణంగానే పిల్లల పెంపకం, తర్ఫీదు వుంటుంది. మరి సమాజపు రుగ్మతలన్నీ కుటుంబంలో కనబడటంలో వింత ఏమున్నది? కుటుంబ పరువు మొత్తం ఆడపిల్ల భుజాల మీద మోపడం మన దేశంలో సర్వ సాధారణం. మరి ఆడపిల్ల తనకు సంబంధించిన నిర్ణయాలు తానే తీసుకుంటే, ఆ నిర్ణయాల్లో సమాజం సాధారణంగా అంగీకరించని అంశాలుంటే అది కుటుంబ పరువుకి సంబంధించిన అంశం అవుతుంది. అందుకే అమ్మాయి పూర్తిగా ఎదిగి, ప్రగతిశీల భావాలతో ముందుకు వెళ్లి ఏ కులాంతర వివాహమో, మతాంతర వివాహమో చేసుకుంటానంటేనో లేదా అసలు వివాహమే వద్దు తనకి కెరీరే ముఖ్యమనుకుంటే అది కుటుంబ పరువు సమస్య అవుతున్నది. ఇప్పుడిప్పుడే కొన్ని కులాలకి సంబంధించిన కొన్ని మధ్య తరగతి కుటుంబాల్లో ఈ విషయాల్లో కొంత మార్పు కనబడుతున్నప్పటికీ కొన్ని సామాజిక వర్గాలలో ఆడపిల్ల వివాహానికి సంబంధించిన పట్టింపు ఎక్కువగా వుంటున్నది. మొత్తంగా చూస్తే అన్ని కులాల్లో ఈ భయమైతే వుంది. అమ్మాయి ఎంత చదివినా మళ్లీ తన కంటే ఎక్కువ చదివిన వాడిని భర్తగా తీసుకురావడం కష్టం అనే విషయం తల్లిదండ్రులను ఇప్పటికీ భయపెడుతున్నది. ఇవన్నీ మైనర్ వివాహాలకు దోహదం చేసి, వారి చదువుని అర్ధాంతరంగా ఆపేయడానికి దారి తీస్తుంది. ఈ పరిణామాలకు బలిపశువులైన స్త్రీలు ఇంక సాధికారత సాధించేది ఎలా? స్త్రీనే ఇంటి పరువుకి బాధ్యురాలు అనే భావజాలం ఈ రకంగా స్త్రీ సాధికారతకు గొడ్డలిపెట్టు వంటిది.

గ్రామీణ ప్రాంతపు ఆటంకాలు:

సాధారణంగా ఆలోచనాశీలురందరూ భారత స్త్రీ గురించి మాట్లాడమంటే నగర మధ్య తరగతి స్త్రీ గురించి మాట్లాడుతుంటారు. కానీ వ్యవసాయాధారితమైన మన దేశంలో ఇప్పటికీ 60 శాతం పైగా జనాభా గ్రామీణ ప్రాంతాల్లో జీవిస్తుంటారు. మన సాహిత్యంలో గ్రామీణ స్త్రీ జీవితం తక్కువగా ప్రతిబింబిస్తుంటుంది. మీడియా అంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియానే అయిన నేపథ్యంలో వాళ్లకి టీఆర్పీ నగర ప్రాంతాల్లో ఎక్కువ దొరుకుతుంది కనుక గ్రామీణ ప్రాంతాన్ని పట్టించుకోరు. ఆ రకంగా గ్రామీణ స్త్రీ రిపోర్ట్ అవదు. ఆవిడ అవసరాలు ఏమిటో చర్చకు రావు. గ్రామీణ ప్రాంతంలో స్త్రీ సాధికారతకి అడ్డం పడే ప్రధానంశం బాల్య వివాహాలు లేదా చదువు పూర్తవకుండానే చేసే ఎర్లీ మేరేజెస్, ఇంకా ఏదో ఒక పనిలో దిగిపోయి కుటుంబ పోషణ నిమిత్తం ఉపాధిని వెతుక్కోవడం. ఇప్పటికీ ఆడపిల్లలు గ్రామీణ ప్రాంతంలో పదో తరగతి పూర్తి చేయడం గగనమే. ఒకవేళ పూర్తి చేసినా కాలేజ్ చదువుల కోసం వేరే ఊరు పంపాల్సి వస్తుంది. ఏవో కొన్ని నినాదాల్ని సర్క్యులేట్ చేయడం మినహా ఆడపిల్లల చదువుల్ని ఏ ప్రభుత్వమూ తన బాధ్యతగా స్వీకరించదు. సమాజ వెనుకబాటుతనానికి ప్రజల్ని బాధ్యుల్ని చేసి కొన్ని ప్రబోధాలు చేయడం తప్ప అందుకు పాలకులుగా తమ బాధ్యతని అంగీకరించి, ఆ వెనుకబాటుతనం నిర్మూలన కోసం సీరియస్ కార్యాచరణలేవీ ప్రభుత్వాలు చేయవు. కొన్ని పేపర్ స్టేట్మెంట్స్, పథకాల ప్రకటనలు పరిస్థితిని మార్చలేవు. గ్రామీణ ప్రాంతపు స్త్రీ విద్య, వైద్యం గురించి ఖచ్చితంగా అమలు చేయాల్సిన చట్టాలంటూ ఏమీ లేవు. ఆడపిల్లల విద్య. వైద్యానికి సంబంధించి ఇన్ని పరిమితులుంటే గ్రామీణ మహిళా సాధికారత ఎలా సాథ్యం? ఎలాగోలా పదో తరగతి వరకు చదివినా ఆ తరువాత తమకు సమీపంలోని ఏ పరిశ్రమలోనో ఉద్యోగానికి కుదురుకోవడం లేదా పొలం పనికి వెళ్లడమో జరిగిపోతున్నది. అదీ కాకపోతే ఇంట్లో చిన్న పిల్లల్ని, వృద్ధుల్ని చూసుకోడానికి వినియోగింపబడుతుంటారు.

శ్రామిక మహిళల దుస్థితి:

శ్రామిక మహిళల పరిస్తితి చూసుకుంటే సాధికారత అనే ఆదర్శానికి చుట్టుపక్కల లేదు. అర్బన్ ప్రాంతాల్లో డొమెస్టిక్ మెయిడ్స్ గా, మాల్స్ లో హౌస్ కీపింగ్ స్టాఫ్ గా, నిర్మాణరంగంలో కూలీలుగా పని చేస్తుంటారు. వీళ్లందరూ అసంఘటిత రంగానికి చెందిన అల్పాదాయ వర్గ శ్రామికులు. గ్రామీణప్రాంతాల్లో శ్రామిక మహిళ్లలు ప్రధానంగా వ్యవసాయ కూలీలుగా చేస్తుంటారు. వీళ్లని లెఫ్ట్ పార్టీల వారు కొంతవరకు కూడగడుతుంటారు. పట్టణ ప్రాంతపు శ్రామిక స్త్రీలు ప్రధానంగా అన్ ఆర్గనైజ్డ్ సెక్టార్ కిందకి వస్తారు. అయితే పట్టణ, గ్రామీణ శ్రామిక మహిళల సమస్యల్లో చాలా పోలికలుంటాయి. ఎక్కడ పనిచేసినా వేతనాల్లో, జీతాల్లో స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసముంటుంది. వీళ్లకున్న ప్రధాన సమస్యల్లో ఒకటి భర్తల మద్యపాన బానిసత్వం. ప్రభుత్వాలు ఆదాయం కోసం మద్యపానాన్ని రకరకాల పద్ధతుల్లో మద్యపానాన్ని ప్రోత్సహిస్తుంటాయి. కుటుంబ వాతావరణం చిద్రమౌతున్న నేపథ్యంలో శ్రామిక మహిళల సాధికారత అనేది ఆదర్శానికి అనేక కాంతి సంవత్సరాల దూరంలో వున్నట్లు తోస్తుంది.

రాజకీయ రంగం:

ఇంక రాజకీయ రంగం విషయం చూస్తే స్థానిక సంస్థల్లో స్త్రీలకి రిజర్వేషన్ కల్పించినప్పటికీ వాటి అమలులో ఎన్ని లొసుగులున్నాయో మనందరికీ తెలుసు. సర్పంచ్ సీట్లలో మొగుళ్లే కూర్చుంటారు. భర్తనే ప్రెసిడెంట్ గా ఊరి ప్రజలు పిలుస్తుంటారు. భార్యల పేర్లు చెప్పి మొగుళ్లు చేసే దందాలకు తక్కువేం లేదు. అందుకే మహిళల్లో రాజకీయ స్పృహ పెరగాలి. రాజకీయాలు తమ అస్తిత్వానికి ముఖ్యం అనుకోవాలి. తమ కోసం రాజకీయ రంగంలో నిలబడాలే కానీ భర్తకి నీడగా వుండేందుకు కాదని గుర్తించాలి. స్త్రీల రాజకీయ ప్రాతినిథ్యం పెరుగుతున్న కొద్దీ కాలక్రమంలో వారిలో రాజకీయ చైతన్యం పెరుగుతుంది. ఇందుకు చట్ట సభల్లో మూడో వంతు రిజర్వేషన్ ఎంతైనా దోహదం కాగలదు.

మైలురాళ్లే గమ్యం కాదు:

మహిళలు ఇప్పుడు అనేక రంగాల్లో కనబడుతున్నారు. ఆమె ఒక డాక్టర్, ఇంజినీర్, ఒక పారిశ్రామికవేత్త, ఒక న్యాయవాది, న్యాయముర్తి, పైలట్, మిలటరీ అధికారిణి, మెట్రో రైల్ డ్రైవర్, ప్రొఫెసర్, సైంటిస్ట్, అంతరిక్ష శాస్త్రవేత్త, రాజకీయ నాయకురాలు, ముఖ్యమంత్రి, రాష్ట్రపతి….ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు. కానీ ఈ ప్రాతినిధ్యమంతా ఉదహరణాత్మకమే, ప్రతీకాత్మకమే కానీ సమాన స్థాయిలో కాదన్నది సత్యం. ఉపాధి, వికాసానికి సంబంధించిన అన్ని రంగాల్లోనూ స్త్రీ పురుషులిరువురికి సంబంధించిన ప్రాతినిధ్యపు గ్రాఫ్ లో చాలా వ్యత్యాసమున్నది. మైలురాళ్లే గమ్యం కాదని కూడా గమనించాలి. టోకెనిజంగా కాకుండా ఈ ప్రాతినిథ్యం వాస్తవికంగా సమాన స్థాయిలో జరగాలంటే సమాజంలో ఆమె గురించిన అవగాహనల్లో, ఆచరణల్లో ఒక ‘నమూన మార్పు’ (పేరాడిం షిఫ్ట్) రావాలి.

మహిళలు సంపాదించగలగడం, ఆర్థిక స్వావలంబన మహిళా సాధికారతకి ఖచ్చితమైన షరతే కానీ కేవలం సంపాదన మాత్రమే సాధికారత కాదని మనం గుర్తించాలి. సంపాదించి భర్తల చేతులకి ఏటీఎం కార్డ్ అప్పగించే ఉద్యోగినులు ఎంతోమంది ఉంటారు. భార్య సంపాదన నుండి ఈఎమ్మైలు కడుతూ తమ పేరుతో ఆస్తులు రిజిస్టర్ చేయించుకునే పురుషులున్నారు. సంపాదన మీద ఎవరికి అధికారముంది, ఎవరు నిర్ణయాలు తీసుకుంటున్నారనేది సంపాదించడం కంటే ముఖ్యమైన అంశం. ఎంతోమంది ప్రతిభావంతులైన సినిమా ఆర్టిస్టులు, గాయనిలు, వ్యాపార దక్షణిలు, కళాకారిణిలు ఎంత సంపాదించినా కూడా చివరికి పురుషస్వామ్య పదఘట్టనకి తల్లడిల్లే ఉదంతాలు మనకు ఎన్నో కనిపిస్తాయి. సినీ నతి సావిత్రి నుండి బీ.ఎస్.ఈ. మాజీ సీఈవో చిత్రా రామకృష్ణన్ వరకు అందరి కథా ఒకటే.

మహిళా సాధికారతకు సంబధించిన నిర్వచనాలు, అవగాహనల్లో పరిపక్వత, వాస్తవిక దృక్పథం పెరగాలి. న్యాయమైన పద్ధతిలో హక్కుల అన్వయం, సమానత్వ ప్రాతిపదిక మీద స్త్రీ ఉనికికి గౌరవం, స్వావలంబన, తన భవిష్యత్తుకి సంబంధించి స్వంత నిర్ణయాధికారం కలిగివుండటం, తన మనశ్శరీరాల మీద తానే హక్కుని కలిగివుండటం, నిర్భయత్వం, నిరాటంక వాతావరణంలో స్వేచ్ఛగా మనగలగడం….ఇదీ మహిళా సాధికారతంటే అని అనుకుంటున్నా. ఇందుకు సమాజంలో, వ్యక్తుల్లో ప్రజాస్వామిక దృక్పథం, మానవీయత, ప్రవర్తనా సంస్కారం పెరగాలి. ఇంతకు ముందు అనుకున్నట్లు ఒక నమూనా మార్పు రావాలి.

"నెత్తురోడుతున్న పదచిత్రం", "కవిత్వంలో ఉన్నంతసేపూ...." అనే  రెండు కవితా సంపుటల వయసున్న కవి.  సామాజిక వ్యాఖ్యానం, యాత్రా కథనాల్లోనూ వేలు పెట్టే సాహసం చేస్తుంటాడు.

Leave a Reply