పోరాటమే మహిళామార్గం: జ్యోతక్క

తరతరాల పోరాట గాధలు. నిరంతర నిర్బంధం. రాజ్యహింసపై ధిక్కారం. తరగని దుఃఖం. కొండంత ఆత్మవిశ్వాసం. సుతిమెత్తని పలకరింపు. స్వేచ్ఛా జ్యోతులు వెలగాలనే కల. చైతన్య మహిళా సంఘం నాయకురాలు, గత ముప్పై ఏండ్లుగా నడుస్తున్న ఆ సంఘం అధికార పత్రిక “మహిళామార్గం” ప్రస్తుత సంపాదకురాలు, జ్యోతక్క.

ఎవరి ప్రత్యేకతలు, క్రృషి, త్యాగం వారిదైనా కొందరిని ఒక్కరిగా గుర్తు చేసుకోవడం కష్టం. నాకైతే పౌరహక్కుల నేత అమరుడు పురుషోత్తాన్ని గుర్తు చేసుకోకుండ, జ్యోతక్కను గుర్తు చేసుకోవడం కష్టం. అలాగే పురుషోత్తం గుర్తుకు రాగానే జ్యోతక్క కండ్లళ్ళ మెదులుతది. ఆ కుటుంబం తో పరిచయమున్న ఎవరికైనా ఆ ఇద్దరితో పాటుగా ఇంకా అనేక మంది అమరులు గుర్తు కొస్తారు. వాళ్ళలో ఎందరో మనతో కలిసి నడచిన మనుషులు. మనలో భాగమైన సామాన్యులు. మనందరికి స్ఫూర్తిగా నిలచి మనల వెలుగుల దిశగా నడిపించిన అసామాన్యులు.

నిజమే, కాలం ఎంతో గడిచిపోయింది. ఎందరినో తనలో భాగం చేసుకుంది. కాని వాళ్ళ త్యాగాలు, అమరత్వం కాలాన్ని శాసిస్తూ ప్రజల సామూహిక జ్ఞాపకమై వెలుగుతూనే ఉంటాయి. ఆ వెలుగులే భవిష్యత్తుకు దారులు చూపిస్తాయి. అలాంటి ఒక జ్ఞాపకాల, అనుభవాల చెలిమను తొవ్వడం కోసమే జ్యోతక్కతో మాట్లాడాలనుకున్న.

జ్యోతక్కతో కలువక, మాట్లాడక దాదాపు పదేండ్లకు పైనే అవుతుంది. కాని ఫోన్ చేసి నా పేరు చెప్పగానే అదేదో మొన్ననే కలిసినట్లు “ఆ…అశోక్. బాగున్నవా? చాలా రోజులవుతుంది కదా మట్లాడక” అని పలకరించింది. వేల మైళ్ళ దూరంలో వున్నా తన ఎదురుగా వుంటె ఎలా మాట్లాడేదో అలాగే వుంది ఆ ఆత్మీయ పలకరింపు. ప్రేమనంతా గొంతులో పలికియ్యాలంటే ఎంత సుతి మెత్తని మనసై వుండాలి కదా. బహుశా అక్కతో పరిచయం వున్న చాలా మంది నాలాంటి అనుభూతినే పొందివుండొచ్చు.

క్షేమసమాచారాలు తెలుసుకున్నాక నేను ఎందుకోసం ఫోన్ చేశానో చెప్పాను. “తప్పకుండ మాట్లాడుదాం” అని అన్నది.

ఇక మా ముచ్చట మొదలు పెట్టినం.

“అక్కా, ముందుగా మీ కుటుంబంలోకి రాజకీయాలు ఎట్లా వచ్చినవి? అవి మిమ్ముల ఎట్లా ప్రభావితం చేశాయో చెప్పండి?”

నాన్న పేరు రామిరెడ్డి. అమ్మ పేరు వేదమ్మ. వాళ్ళది రాయలసీమ. నాన్నది కర్నూల్ జిల్లా, మిడ్తూరు గ్రామం. అమ్మది కలమందలపాడు. అది మిడ్తూరుకు దగ్గర వుండే గ్రామమే. నాన్న వాళ్ళది పేద కుటుంబమే. అంటే ఏ పూటకు ఆ పూట సంపాదించుకునేదే. భూమి ఇరవై ఐదు ఎకరాల వరుకు వుంది. కాని అది రాయలసీమ కదా. నీళ్ళు లేక పెద్దగ వ్యవసాయం ఏమి అక్కరకు వచ్చేది కాదు. అందుకని నాన్నది టెంత్ అయినంక చేలు పనికి ఒక సంవత్సరం పంపించిండట మా తాత. సంవత్సరం తర్వాత ఇంకా ఆ పని చేయలేక మళ్ళీ చదువుకోవాలని అనుకున్నడట నాన్న. కాని చదువుకునే ఆర్థిక స్తోమత లేదు. అప్పుడు వాళ్ళ పెద్దమ్మ (పక్క ఊరు వడ్డెమాను ల ఉంటది) ‘నేను చదివిస్త’ అని తీసుకపోయి ఆమెనే ఎంఏ, ఎల్ ఎల్ బి వరకు చదివించింది. ఆలిగడ్ యూనివర్సిటీల చదివిండు. కాని చదువు అయిపోయిన వెంటనే ఉద్యోగం రాక చాలా ఇబ్బంది పడ్దడంట. అయితే ఎంఏ చదువుతున్నప్పుడే వాళ్ల పెద్దమ్మ వాళ్ళు అమ్మని చూసిండ్రు. ఆమెనే చదివించింది కాబట్టి తానే పెళ్ళి సంబంధం కూడా చూసింది. అమ్మమ్మ వాళ్ళు పెద్ద భూస్వాములు. రెండు వందల ఎకరాల వరకు ఉండేది. అప్పట్లనే పది వేల రూపాయల కట్నం మాట్లాడి పెళ్ళి కుదిరిచ్చిండ్రు. కట్నం తీసుకోవడం నాన్నకు ఇష్టం లేకున్నా వాళ్ళ పెద్దమ్మనే చదివిచ్చింది కాబట్టి ఏమి అనలేక పెండ్లికి ఒప్పుకున్నడు. కట్నం పెద్దమ్మ వాళ్ళే తీసుకొని పెండ్లి చేసిండ్రు.

పెండ్లి అయినంక కూడ ‘నేను ఇంకా చదువుకోవాలి’ అని చెప్పి అమ్మని పుట్టింట్లనే ఉంచి మళ్ళీ పోయిండు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ వస్తూ పోతూ వుండెటోడు. అప్పటికే అక్క (సుగుణ) పుట్టింది. అక్క పుట్టిందాని బట్టి ఏదో గుణ నక్షత్రం అని వస్తె, స్కూళ్ళో చేర్పించేటప్పుడు నాన్న “సుగుణ” అని పేరు పెట్టిండంట. ఇంట్లో అంత “గుణ”నే అంటుంటిమి అమెను. నాన్నకు లెక్చరర్ ఉద్యోగం చేయాలన్నది కోరిక. కాని కొన్ని మార్కులు తక్కువ ఉండటంతో రాలేదు. అప్పుడే ఎల్ ఐ సి ల ఫీల్డ్ ఆఫీసర్ గ ఉద్యోగం వచ్చి గద్వాలకు రావడం అయ్యింది. గద్వాలలో పోస్టింగ్. అప్పుడే నేను పుట్టిన. నేను పుట్టగానే ఉద్యోగం వచ్చింది కాబట్టి “జ్యోతి” అని పేరు పెట్టిండు అని చెబుతది అమ్మ. ఎల్ ఐ సీ గుర్తు జ్యోతి ఉంటది కదా. అందుకని. నాకు అక్కకు ఐదేండ్ల గ్యాప్. నా తర్వాత తమ్ముడు కొండారెడ్డి, చెల్లెలు విజయ.

నేను కర్నూల్ హాస్పిటల్ లో పుట్టిన కాని నా బాల్యమంతా గద్వాల్ లనే జరిగింది. ఫస్ట్ క్లాస్ నుండి డిగ్రీ వరకు గద్వాల్ లనే చదివిన. నాన్న ఉద్యోగస్తుడు కాబట్టి చిన్నప్పటి నుండి తిండికి, బట్టకు ఏమి ఇబ్బంది లేకుండె. గవర్నమెంట్ స్కూళ్ళనే జాయిన్ చేసిండు. బాగనే చదువుకోని వస్తుంటిమి. అయితే మేము చిన్నగున్నప్పటి నుండి ఇంటికి యూత్ ఎవరెవరో వచ్చిపోతుండ్రి. వెంకటేష్, లక్ష్మికాంత్, జగ్గు అని ఇంకా ఐదారుగురు వస్తుండ్రి. వాళ్ళతోటి నాన్న మాట్లాడుతుండె. “కమ్యూనిస్ట్” అని వినిపిస్తుండె నాకు, అక్కకు. ఏం మాట్లాడుతుండ్రో నాకేమి పూర్తిగా తెలియకుండె. వాళ్ళు గంటలు గంటలు బాగ మాట్లాడుతుండె.

అయితె 1975లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు ‘గద్వాల్ల నువ్వు ఒక్కడివే కమ్యూనిస్టువు’ అని నాన్నను అరెస్ట్ చేసిండ్రు. అప్పుడు మాకు కొంచం కొంచం అర్థం కాబట్టింది. ‘ఓహో ప్రభుత్వానికి వ్యతిరేకంగ ఎవ్వరు మాట్లాడినా అరెస్ట్ చేస్తున్నరంట. కమ్యూనిస్ట్ అయితే ఇంకా ఎక్కువ నిర్బంధం ఉంటది’ అని అప్పుడు తెలిసింది.

అప్పుడు మా నాన్నకు సగం జీతం (అంటే ఐదు వందలు) వస్తుండె. అది గద్వాల్ లో ఉంటే సరిపోదని మేమంత మిడ్తూర్ కు పోయినం. అక్కడ మా చిన్నాన్న ఉంటడు. అక్కడైతె ఇళ్ళు రెంట్ ఏమి ఉండదు. అక్కడే వుండి చదువుకోవచ్చిని అనుకున్నం. ఎనిమిది నెలల తర్వాత ‘ఎమర్జన్సీ ఎత్తివేసిండ్రు ఇంటికి వస్తున్న’ అని నాన్న ఉత్తరం రాసిండు. మేమంత బాగ ఎదురుచూస్తున్నం. అంతలనే వచ్చిండు. స్వీట్లు కూడ పట్టుకొచ్చిండు. మీము ఇంకా ఆ స్వీట్లు కూడ తిననేలేదు. ఇంట్లకొచ్చిన కొద్దిసేపటికే బయట నుండి ‘రాం రెడ్డి సాబ్, రాం రెడ్డి సాబ్’ అని ఎవరో పిలిస్తె అట్లనే ఇంకా బట్టలు కూడ మార్చుకోలె బయటకు పోయిండు. పోగానే ‘మళ్ళీ ఎమర్జెన్సీ కొనసాగిస్తుండ్రు’ అని అక్కడి నుండి అట్లనే పట్టుకుపోయిండ్రు. అప్పుడు అందరం బాగా నిరాశ పడినం. పిల్లలం కదా. బాగా ఏడ్చినం. అప్పుడు మాకు కొంచం కొంచం తెలిసొచ్చింది. మళ్ళీ ఒక పది నెలలు జైళ్ళ పెట్టిండ్రు. మొత్తం ఒకటిన్నర సంవత్సరం మిడ్తూర్ లనే వున్నం. ఆయనను వదిలేసినాక మేము మళ్ళీ గద్వాలకు వచ్చినం.

“అక్కా , మీ నాన్నను అరెస్ట్ చేసినప్పటికి మీరు చిన్న పిల్లలు కదా. మీకు అనిపించలేదా మనకెందుకు ఇవన్ని ఇబ్బందులు? అని”.

లే… లే అట్లేమి అనిపించలేదు. అందరూ వాళ్ళు వీళ్ళు వచ్చి ‘మీ నాన్న ఏమి చెడ్డపని చేయలేదు. హత్యలు, దోపిడీలు చేయలేదు. అందరికి అన్నీ సమానంగా ఉండాలని అన్నందుకే పట్టుకుపోయిండ్రు. అందరి మంచి కోరుకుంటోళ్లకే కష్టాలు వస్తయి’ అని చెబుతుండిరి మాకు. దాన్నిబట్టి మా నాన్న గొప్ప పనే చేసిండు. మా నాన్న మంచోడే. ఆయన నమ్మింది మంచిదే అని మాకు అనిపించింది. అమ్మకేమో ఇవన్ని ఎందుకు మనకు. మంచిగ ఉద్యోగం ఉంది. పిల్లల చదివిచ్చుకుంటె బాగుంటది కదా. ఈ రాజకీయాలతోటి ఎప్పుడు కష్టాలే కదా అని అమ్మకు అనిపిచ్చేది. కాకపోతె ఏమనకుండె.

మళ్ళీ గద్వాల్ కు వచ్చి నేను తొమ్మిదో తరగతిల చేరిన. అప్పటి నుండి ఇంటర్ వరకు ఇంటికి వచ్చే యూత్ కార్యకర్తల మాటలు వింటుండేదాన్ని. నాన్న సీపీయం పార్టీకి అనుకూలంగ ఉండేది. ఆ పార్టీ కార్యకర్తలే వచ్చేది. వాళ్ళతో పాటుగ కూర్చోని మాట్లాడకపోయేటోళ్లం కాని వాళ్ళు మాట్లాడుకునేది దగ్గరి నుండి వినేది. నాకంటె ఎక్కువ అక్క బాగ జాగ్రత్తగ వినేది. అర్థం చేసుకునేది. తనకు రాజకీయాల మీద చాలా ఇంటెరెస్ట్ వుండేది.

అట్లా వున్న క్రమంలోనె విద్యార్థి ఉద్యమం (రాడికల్ స్టూడెంట్ యూనియన్) కాలేజీల మొదలయ్యింది. అప్పుడు కాలేజీల ఏబీవీపీ వాళ్ళు ఉండెటోళ్లు. అమ్మాయిలను బాగా బనాయించెటోళ్ళు. మా కాలేజ్ కు పెద్ద క్యాంపస్ వుండేది. ఆ గ్రౌండ్ లో నుండి నడుచుకుంట క్లాస్ రూం లోకి పోవాలంటె ఒక ఐదు నిమిషాలు పడుతది. ఆ టైం ల అక్కడ వుండే రెండు అరుగుల మీద కూర్చోని అక్కడంగ పోయే అమ్మాయిలను కామెంట్లు చేస్తుండేది. వాళ్ళు అట్ల చేస్తుంటె కోపం వచ్చేది. ముఖ్యంగా గ్రామల నుండి వచ్చే అమ్మాయిలు బాగా ఇబ్బంది పడెటోళ్ళు. అయితే వాళ్ళను ఎదురుకునే శక్తి కేవలం రాడికల్ స్టూడెంట్స్ కు మాత్రమే వుండేది.

అప్పుడు సుదర్శన్ నాయకుడిగ ఉండె. ఆయన నా కంటె ఒక సంవత్సరం సీనియర్. అక్క క్లాస్మేట్. పురుషోత్తమేమో నా బ్యాచ్మేట్. ఆయనది ఎం పీ సీ గ్రూప్, నాది ఆర్ట్స్. అప్పటికే మాకు కమ్యూనిజం అంటె ప్రజల కోసం మంచి పని చేసుడు అని తెలుసు. కాబట్టి మీము రాడికల్స్ కు కొంత సపోర్ట్ గ వుండేది. అక్క చాలా ఆక్టివ్ గ, ధైర్యంగ వుండేది. నేనేమో మామూలుగ వుండేదాన్ని.

అప్పుడే పటేల్ సుధాకర్ కూడా ఉస్మానియా యూనివర్సిటీ నుండి వచ్చి గద్వాల్ లోనే రూం తీసుకోని వున్నడు. ఆయనది గద్వాల్ దగ్గర వుండే కుర్తి రావులచెరువు గ్రామం. ఆయన రాడికల్ స్టూడెంట్స్ కు గైడెన్స్ ఇస్తుండేవాడు. అయితే కార్యక్రమాలు చేసేటప్పుడు మాత్రం సుదర్శన్ ముందు ఉండేటోడు. ఆయన మంచి ఆర్టిస్ట్. అద్భుతమైన వాల్ రైటింగ్ చేస్తుండె. మంచి స్పీకర్. బాగా అధ్యయనం కూడ చేస్తుండె. అసలు ఆయనకు లేనివంటూ లేవు. తెలివితేటలతో పాటు బాగ ధైర్యం కూడ వుండేది. అందుకనే కాలేజ్ ఎన్నికలల్ల సుదర్శన్ ప్యానలే గెలిచింది.

కాలేజ్ ఫంక్షన్ కు హరగోపాల్ సార్ ను పిలిపించిండ్రు. అప్పుడే నేను మొదటి సారి హరగోపాల్ సార్ ని చూడటం. సార్ ను పిలిపించినందుకు ఏబీవీపీ వాళ్ళు బాగా గొడవ చేసిండ్రు. సారు మాట్లాడుతుంటె అసలు అయన మాటలు విననిస్తలేరు. అప్పుడు సుదర్శన్ స్టేజ్ మీదినుండి దిగొచ్చి ‘ఎవర్రా మీరు? ఎందుకు ఇట్ల గొడవ చేస్తుండ్రు?’ అని వాళ్ళ మీదికే పోయిండు. ఆ సంఘటన ఇప్పటికి నా కళ్ళకు కట్టినట్లే వుంటది. వాళ్ళు ముప్పై మంది వరకు వున్నరు. అయినా భయపడకుండ వాళ్ళ మీదికి ఒక్కడే దూకుతూ పోయిండు. తర్వాత కొందరు వెంటపోయిండ్రు. దాని తోటి వాళ్ళు భయపడి గొడవ చెయ్యడం ఆపేసిండ్రు. మళ్ళీ ఒక అర్థ గంట తర్వాత మీటింగ్ మొదలయ్యింది. అట్ల ప్రతి పని ఎంతో ధైర్యంగ, జాగ్రత్తగ చేస్తుండె.

నేను ఎక్కడెక్కడో పోతున్న. మీరు అడిగిన దానికి ఎక్కువ చెబుతున్ననా?

“లేదు, లేదక్క. ఒక మనిషి ఎదుగుదలకు, నిటారుగ నిలబడడానికి జీవితంలో ఎందరో మనుషుల, ఎన్నో సంఘటనల ప్రభావం ఉంటది. వాటిని అర్థం చేసుకోకపోతె ఆ మనిషి జీవితం లోతు తెలువదు. ఇప్పుడే మీరన్నారు కదా ‘ఇంకా ఆ సంఘటన కండ్లకు కట్టినట్లే వుందని’. దానర్థం అది కేవలం కండ్ల ముందు కనబడటం కాదు, అది తెలియకుండనే మీలో భాగమై మీకు ధైర్యం ఇస్తుంటది” అని నేను అనగానే…

“ఆ.. అది. సుదర్శనే మాకందరికి ఆదర్శం” అని గర్వంగా అన్నది.

“అక్కా అప్పటి సంఘటనలు ఇంకా ఏమైనా గుర్తున్నయా?”

వెంటనే సుదర్శన్ మాటలు గుర్తుచేసుకోని ‘తాను ఎప్పుడు అనేది. అధ్యయనం, ఆచరణ నాణానికి బొమ్మబొరుసు లాంటివి. ఒక దానినుండి మరొకటి విడదీయలేము అని. స్పీచ్ ఇస్తున్నా కూడా “మా మీద నక్సలైట్లు సంఘవిద్రోహులు అన్నట్లు ప్రచారం చేస్తుండ్రు. కాని నక్సలైట్లు అంటే ఒక అమ్మకు పిల్లలు. ఒక చెల్లికి అన్నలు, అక్కలు. ఒక అన్నకు తమ్ముళ్లు, చెల్లెల్లు.” ఇట్ల అన్ని వరసలు కలిపి వాళ్ళు ఎవరో కాదు, మన కుటుంబం అంత దగ్గరగా వుండేవాళ్ళు. మన కోసం ప్రాణాలు పణంగా పెట్టి పనిచేసేటోళ్లు అని చెబుతుండె.’

అప్పుడు ‘గో టూ విలేజ్’ (గ్రామాలకు తరలండి) క్యాంపెయిన్ వుండెకదా. నేను, అక్క రెండు రోజులు పోయినం. గద్వాల్ పక్కన ఉన్న గ్రామాలకే పోయినం. అక్కడికి పోయినంక ప్రజలతో మాట్లాడి ఆ గ్రామ పరిస్థితిని అర్థం చేసుకోని, వాళ్ళ సమస్యలను తెలుసుకోని ఎట్ల పరిష్కరించవచ్చో వాళ్ళతోనే చర్చించేవాళ్ళం. అందరం దళితవాడలోనె ఒక్కొక్కరం ఒక్కో ఇల్లు ముందే చూసుకోని వాళ్ళకు ‘అక్కా, అన్నా మీ ఇంటికి బోజనానికి వస్తం’ అని ముందే చెప్పిపెట్టుకొని వాళ్ళు ఏది పెడితె అది తినెటోళ్లం. అట్లా చేస్తెనే ‘డీక్లాసిఫై’ అవుతం అని చెప్పేవాళ్ళు. ప్రతిరోజు అందరు ఎక్కడ కలవాలో ఒక స్పాట్ ముందే అనుకోని అక్కడ కలుసుకోని విషయాలు చర్చించే వాళ్ళం.

“మీరు మొత్తంగా రెండు రోజులే పోయిండ్రా?”

అయితే అప్పుడు మహిళలను గ్రామాలకు తీసుకొనిపోవడం కొంత సమస్యగా వుండేది వాళ్ళకు. ఆడ, మగ కలసి తిరుగుతుండ్రు అని జనాలలో ఎట్లాంటి ఆలోచనలు వస్తవో అని; మహిళలను ఎక్కడ ఉంచాలో అనే సమస్యలు వుండేవి వాళ్ళకు. ఎందుకంటె ఇలాంటివన్ని కొత్త కదా అప్పుడు. ఆ రెండు రోజులల్లనే రెండు గ్రామాలల్ల మీటింగులు పెట్టినం. అక్కడ ప్రధానంగ భూమి సమస్య గురించి మాట్లాడిండ్రు. భూమికి ప్రజల విముక్తికి ఉండే సంబంధం గురించి బాగా మాట్లాడిండ్రు. పాటలు పాడటానికి ఒక టీం వుండేది. యుగేంధర్ అని టీం లీడర్ వుండేవాడు. ఆ టీం అంతా బాగా పాటలు పాడేది. చాలా పెద్ద టీం ఉండేది. తర్వాత ఎవరెవరు ఎక్కడెక్కడ పోయిండ్రో తెల్వది.

“అక్కా, మీరు రాడికల్ స్టూడెంట్స్ తో కలిసి తిరుగుతుంటె మీ నాన్న ఏమి అనలేదా? ఆయనకు పార్లమెంటరీ కమ్యూనిష్టు రాజకీయాలు వున్నవి, కాని రాడికల్ పోలిటిక్స్ తో సంబంధం లేదు కదా.”

నాన్నకు తెలుసు కాని పెద్దగా ఏమి అనకపోతుండె. ఏదో కాలేజీకి పోయి వస్తుండ్రు కదా అనుకుంటోడు. అయితే ఒక వారం రోజులు రాజకీయ అధ్యయన తరగతులకు పోయినం. అవి పటేల్ సుధాకర్ వాళ్ళ ఊళ్ళనే పెట్టిండు. నేను, అక్క మా అమ్మమ్మ ఊరికి పోతున్నం అని చెప్పి క్లాసులకు పోయినం. అక్కడికి పోయినంక మొదటి రోజే ‘మేము అమ్మమ్మ ఇంటి దగ్గర బాగనే వున్నం, ఒక వారం రోజులు ఉండి వస్తం’ అని ఉత్తరం రాసినం. అయితే ఆ ఉత్తరం మా అమ్మమ్మ ఊరి నుండి రాలేదని మా నాన్న కనుకున్నడు. ఆ ఉత్తరం మీద ముద్ర చూసి. మా అమ్మతోటి చెప్పిండంట ‘వీళ్ళు కర్నూల్ పోలే. ఇక్కడిక్కడే వున్నరు’ అని. చెప్పి పోలేక భయంతోటి అట్ల అబద్ధం చెప్పినం. అందులోను మొదటి సారి ఇల్లు వదిలిపోతున్నం కాబట్టి ఇంకేమి తోచలేదు మాకు. ఇంటికి వచ్చినంక ఏమి అనలేదు, కాని రెండు మూడు రోజులు సరిగ్గ మాట్లాడలేదు. ఎప్పుడైన అంతె. ఏమి అనకుండె. మాట్లాడకపోయేది. ఆయన చాలా నెమ్మది. ప్రతి దానికి అరవడం అట్లా వుండేది కాదు. ఇక అప్పుడే అక్క చెప్పేసింది. ‘మొత్తంగా నేను పూర్తికాలపు కార్యకర్తగ పనిచేయడానికి పోదామని అనుకుంటున్న’ అని. దానికి నాన్న ‘బాగా ఆలోచించుకో. ఎందుకంటె అందులోకి వెళ్ళినాంక చాలా కష్టాలుంటవి. తర్వాత తప్పు చేసిన అనుకుంటే జీవితం వెనక్కి రాదు. ఇప్పుడే సరైన నిర్ణయం తీసుకోవాలి’ అని చెప్పిండు.

ఇక సుదర్శన్ డిగ్రీ అయిపోయినంక పీజీ ఎంట్రన్స్ రాస్తే ఆయనకు ఫిలాసఫీ లో ఏడో ర్యాంకో ఎమో వచ్చింది. పోయి జాయిన్ అయ్యిండు కాని రెండు నెలలకే గద్వాల్ టౌన్ ఆర్గనైజర్ గ మళ్ళీ పాలమూరుకే వచ్చిండు. అప్పుడే అక్కకు, సుదర్శన్ కు మా ఇంట్లనే పెండ్లి జరిగింది. మా కుటుంబ సభ్యులు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఇద్దరు ముగ్గురు వున్నం అంతె. అప్పుడు వాళ్ళు “సెమి-లీగల్” గ పనిచేస్తుండ్రి. పటేల్ సుధాకర్ అప్పటికే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిండు. తర్వాత సుదర్శన్ మాత్రం నల్లమల్ల ప్రాంతంలో ప్రజలను ఆర్గనైజ్ చేయాడానికి బాధ్యతలు తీసుకున్నడు. ఆయనతో పాటుగా పురుషోత్తం, గోపాల్ రెడ్డి, ప్రభాకర్ ఇంకా మొత్తం ఏడెనిమిది మంది టీం గా వుండేవాళ్ళు. వాళ్ళలో కొందరు ఆర్ ఎం పి డాక్టర్లుగా కూడా వైద్యం చేసిండ్రు. అక్కనేమో వనపర్తి ఆర్గనైజర్ గ బాధ్యతలు తీసుకుంది. అప్పటి నుండి ఇంక ఇంటికి రాలేదు. అయితె ఒకసారి రాత్రి వచ్చి వెంటనే వెళ్ళిపోయిండ్రు. ఇక అదే చివరిసారి.

సుదర్శన్ జిల్లా కార్యదర్శిగ, అక్క, ప్రభాకర్ జిల్లా సభ్యులుగ ముగ్గురితోటీ జిల్లా కమిటి వుండేది. అయితే వాళ్ళు దళంలో పనిచేస్తున్న క్రమంలో సుదర్శన్, అక్క, వాళ్ళతో పాటు ఒక చెంచు అబ్బాయి అమ్రబాద్ మండల్ లో భైరాపురం చెరువులో స్నానం చేయడానికి పోయిండ్రంట. ఆ చెంచు అబ్బాయి చెరువు మధ్యకి వెళ్ళి ‘అన్నా, అన్నా నన్ను కాపాడు… కాపాడు’ అని అరిశిండంట. అప్పుడు సుదర్శన్ ఒడ్డున మొఖం కడుక్కుంటుండంట. అక్కనేమో తనది స్నానం అయిపోయి గట్టు ఎక్కుదామని అనుకుంటుందంట. ‘అరే కాపాడమంటుండు. ఏమయిందో చూసొస్త’ అని పోతుంటె ‘అరే ఆగు ఇంకెవ్వరైన వున్నరేమో పిలుద్దాం’ అని అక్క అంటుండగానే అక్క చెయ్యి వదిలించుకోని చెరువు లోపలికి పోయిండు. సరేలే అవతలి గట్టుకు వస్తరు కదా అని వాళ్ళ వెపన్స్ తీసుకోని ఆమె నింపారిగ అవతలి గట్టుకు పోయింది. అక్కడికి పొయ్యినంక చూస్తె ఎంతకి రారు… ఎంతకి రారు. ఆమెకి భయం అయ్యింది. దగ్గర్ల వున్న చెంచు వాళ్ళకు పోయి చెప్పింది. వాళ్ళు వచ్చి చెరువంత వెతికిండ్రు. దొరకలేదు. ఆ రోజు నైట్ అంతా అందరు ఆమె దగ్గరే కూర్చున్నరంట. అంతలోపే వాళ్ళ ఇతర సభ్యులకు తెలిసి వెంటనే అక్కడికి పొయి ‘ఇక్కడ వుండటం సేఫ్ కాదు. ఎందుకంటె వార్త ఇప్పటికే బయటికి పొక్కింది’ అని అక్కడి నుండి ఆమెను తీసుకోని పోయిండ్రు. చెరువులో వాళ్ళ శవాలు మరుసటి రోజు తేలినవంట. అయితే వాళ్ళిద్దరి కాళ్ళకి నాచు చుట్టుకుంది . ఆ అబ్బాయి ఈయన పోగానే గట్టిగ పట్టుకున్నడు. అట్ల ఇద్దరు మునిగిపోయిండ్రు. ఇది 1989ల జరిగింది.

“మరి ఆ వార్త మీకెట్ల తెలిసిందక్క?”

అయన చనిపోయిన తర్వాత వేరే వాళ్ళు ఒక లెటర్ తీసుకోని వచ్చిండ్రు. సుదర్శన్ ఫోటో కావాలి అని. అక్కనే రాసి పంపించింది. అప్పుడు బాధ పడ్దం చూడు… అంటే జీవితంలో మొదటిసారి అంతగా ఫీల్ కావడం. మనకు చాలా దగ్గరి వాళ్ళు లేకుండా పోతే ఎట్లుంటది, ఏమయితది అని తెలిసింది. ఆమె చాలా బాధ పడుతూ రాసి, ఫోటో పంపమని అడిగింది. దాని కోసమే రాసింది మాకు.

“సుదర్శన్ చనిపోయిన తర్వాత తాను బయటికి రావాలనే ఆలోచన ఏమైనా చేసిందా?”

తర్వాత నాన్నకు కూడా ఒక లెటర్ రాసింది. అప్పటికి ఆమె ఆరోగ్యం కూడ బాగ దెబ్బతినింది. ఫిట్స్ కూడా వచ్చినయ్. ‘ఇప్పుడు నాకు తను చనిపోయినదానికన్నా జిల్లాను ఒంటరి చేసిపోయిండే అనే బాధ ఎక్కువుంది. నాతో పాటు, జిల్లా కూడ ఒంటరయ్యింది. ఈ జిల్లా బాధ్యత ఇప్పుడు మేము తీసుకోవాల. అందుకే “ఆయన చనిపోయిండు, ఇంటికి వస్తది” అని అనుకోవద్దు మీరు. ఇప్పుడు ఇంకా ఎక్కువ పని చేయాలి నేను’ అని రాసింది. ‘జిల్లాను, నన్ను ఒంటరిని చేసి పోయిండు’ అనే సెంటెన్స్ అలా నా మైండ్ లో ఉండిపోయింది. అట్లనే ఆమె ఉద్యమంలో కొనసాగింది. చివరివరకు తాను నమ్మిన రాజకీయాలతోనే ఉంది. (2004లో చర్చల సందర్భంలో ఆమె చూపు బాగ తగ్గిపోతుంటె ట్రీట్ మెంట్ కోసమని గాజువాక ఏరియాకు వచ్చింది. కౌముది, ఆమె హాస్పిటల్ కు పోతుంటె ఇద్దరిని పోలీసులు పట్టుకోని చెరో వ్యాన్ల వేసుకోని పోయిండ్రు అని అక్కడ చూసినవాళ్ళు చెప్పిండ్రు. తర్వాత ఆమెను గుంటూర్ కి తీసుకొచ్చి దగ్గరలోనే కాల్చి చంపిండ్రు.)

“పురుషోత్తంతో మీ జీవిత ప్రయాణం ఎట్లా సాగిందో చెప్పండక్క”

పురుషోత్తం కూడా తన డిగ్రీ సెకండ్ ఇయర్ లోనే ఆపేసి సుదర్శన్ వాళ్ళతోనే పార్టీలోకి పోయిండు. అయితే తనకు అక్కడ ఆరోగ్యం సహకరించలేదు. తాను ఎక్కువ కాలం పని చేయలేనని భయమేసిందంట. దాదాపు మూడేండ్లు పని చేసినాక బయటకు వచ్చేసిండు. వచ్చిన తర్వాత డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసి పాస్ అయ్యిండు. తర్వాత లా కూడ పూర్తిచేసిండు.

నేనేమో అక్క వెళ్ళి పోయిన తర్వాత నా డిగ్రీ అవ్వగానే తిరుపతి మహిళా యూనివర్సిటీలో సోషల్ వర్క్ లో పీజీ కి అప్లై చేసుకుంటె అక్కడ వచ్చింది. రెండు ఏండ్లు అక్కడే వున్న. పీజీ అయిపోయిన ఎనిమిది నెలలకే ఒక జాబ్ వచ్చింది. ఆ జాబ్ చేస్తున్న సమయంలోనే మేము పెండ్లి చేసుకుందామని అనుకున్నం. అయితె మేము ఇద్దరం ప్రజా సంఘాలలో కచ్చితంగ పనిచేయాలి అనే ఒక కండీషన్ తోనే పెండ్లిచేసుకున్నం. ఆయనేమో పౌర హక్కుల సంఘాన్ని, నేనేమో మహిళా సంఘాన్ని ఎంచుకోని పనిచేయ్యాలని అనుకున్నం.

1990ల గద్వాల్ లనే స్టేజ్ మ్యారేజ్ అయ్యింది. పెండ్లికి రామ్మోహన్ సార్ వచ్చిండు. మాకు దగ్గరుండి అన్ని చేసింది కనకాచారి సార్. మా ఇద్దరికి కనకాచారి సార్ చాలా దగ్గర. సార్ ఐజ, దాని పక్కన మేడికొండ అని వుంటది అక్కడ ఏడెనిమిది ఏండ్లు టీచర్ గ పని చేసిండు. అప్పుడు ఐజ ల యాదగిరి సార్ కూడ పనిచేసిండు. యాదగిరి సార్ సుదర్శన్ కు గురువు కూడ. అట్ల వీళ్ళంత ఒక రాజకీయ వాతావరణంలోకి వచ్చిండ్రు. పురుషోత్తం ఊరు తాండ్రపాడు ఐజ పక్కనే కాబట్టి కనకాచారి తోటి ఇంకా ఎక్కువ పరిచయం అయ్యింది.

పెండ్లి అయినాక పురుషోత్తమేమో అంధ్రజ్యోతి రిపోర్టర్ గ పెబ్బేర్ లో పనిచేస్తుండె. నేను కూడ నా జాబ్ మానేసి అక్కడే ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గ చేరిన. 1993 వరకు పెబ్బేర్ లనే వున్నం.

మా పెండ్లి అయ్యేటప్పటికి మల్లు మాసిరెడ్డి మహబూబ్ నగర్ పౌర హక్కుల సంఘానికి ప్రధాన కార్యదర్శిగ ఉండె, పురుషోత్తమేమో జిల్లా కమిటి మెంబర్ గ పనిచేస్తుండె. నాకు బాగా గుర్తుంది మా పెండ్లి రోజు పొద్దున పెండ్లి అయిపోయింది, ఆ మధ్యాహ్నమే అదే హల్లో వాళ్ళ ఈ సీ (Executive Committee) మీటింగ్ పెట్టుకుండ్రు.

మల్లు మాసిరెడ్డి చనిపోతె బుచ్చారెడ్డి అధ్యక్షుడయ్యిండు. పురుషోత్తం సెక్రెటరీ అయ్యిండు. జిల్లా అంతా బాగ తిరుగుతుండె. తను ప్రజలతో సంబంధాలు బాగా పెట్టుకునేది. జర్నలిస్ట్ గా ఏ ఊరికి పోయినా అక్కడ ప్రజలతో కలిసి మాట్లాడకుండ రాకపోయేది. అట్లనే బాధ్యతలు అప్పగించడంలో కూడా మంచి నేర్పు వుండేది. కొంత పరిచయం అయితె చాలు ఏదైనా సమస్య మీద కరపత్రం రాయమనేది. నేను ఒకసారి అడిగిన ‘అరే అతను మీకు మొన్ననే పరిచయం అయ్యే. అప్పుడే బాధ్యత అప్పగిస్తవు?’ అని. ‘అట్ల బాధ్యతలు ఇస్తెనే వాళ్ళు కూడ సంఘాన్ని సొంతం చేసుకుంటరు’ అన్నడు. అయితే వాళ్లకు రాయడానికి కావాల్సిన ప్రోత్సాహం, విశ్వాసం బాగ ఇస్తుండె.

“అక్కా మీ అవగాహనను పెంచడంలో కాని, ఆచరణకు సంబంధించి మిమ్ముల గైడ్ చేయడంలో పురుషోత్తం పాత్ర ఏమైనా వుందా?”

అప్పట్లో మా మహిళాసంఘం (శ్రీ చైతన్య స్రవంతి) కార్యవర్గం మీటింగ్స్ వనపర్తిలో జరిగేవి. నేను ఆ మీటింగ్ కు పొయ్యేటప్పుడు అనేక విషయాల మీద తనతో చర్చించేది. వాళ్ళ సంఘానికి మాకంటే ఎక్కువ అనుభవం వుండె కాబట్టి సందర్భం బట్టి కొన్ని సలహాలు ఇచ్చేది. అయితే ‘ఏం చెయ్యాలి అని మాత్రం నన్ను అడగొద్దు. ఎందుకంటె మీరే ఒక అజెండా పెట్టుకోని దాని మీద చర్చ జరిపి మీరే నిర్ణయం తీసుకోవాలి’ అని చెప్పెటోడు.

అప్పుడు స్టేట్ మొత్తం మా సంఘం లేదు కాబట్టి జిల్లా వరకు పరిమితమై కార్యక్రమాలు చేసేవాళ్ళం. ఆచరణ ద్వారానే చాలా నేర్చుకున్నం. నాకు మొదటి నుండి మహిళారంగంలో పని చేయాలని చాలా ఇష్టం. వ్యక్తిగతంగా చిన్నప్పుడైనా, పెద్దగయినంక అయినా ఎలాంటి పీడనను, హింసను చూడలేదు కనుక ఎక్కడైనా చిన్న కుటుంబ హింస అయినా చాలా బాధనిపిస్తుండె. జిల్లాలో వరకట్న హత్యలు, వేధింపులు, ‘అనుమానాస్పద’ చావుల మీద బాగ పనిచేసినం. ఒక తులం బంగారం తేలేదని చంపడం. స్కూటర్ తేలేదని చంపడం. ఇట్లా చిన్న వాటికి కూడ హత్యలు ఎక్కువ జరిగేవి అప్పుడు. వాటి మీద సమాజంలో చైతన్యాన్ని కల్పించడం, సంఘటనల మీద నిజనిర్ధారణ చేయడం, బాధితుల పక్షాన లీగల్ పోరాటం చేయడం. ఇలాంటి కార్యక్రమాలు బాగ చేస్తుంటిమి.

అయితే మహిళా సంఘాలుగా ఒక్కో జిల్లాలో ఒక్కో పేరుతో పనిచేస్తుంటిమి. పాలమూరులో శ్రీ చైతన్య స్రవంతి, తిరుపతిలో మహిళా శక్తి. ఇట్లా భావసారూప్యత ఉండి అప్పటికి పది జిల్లాల్లో పని చేస్తున్న సంఘాలన్ని కలిసి 1995 లో ఒక సమాఖ్యగ ఏర్పడ్డం. అప్పటి నుండి ‘చైతన్య మహిళా సమాఖ్య’ గా రాష్ట్రమంత పనిచేస్తున్నం. ఆ పేరును 2010 ల ‘చైతన్య మహిళా సంఘం’ గా మార్చుకున్నం. అట్లనే 1989 నుండి ‘మహిళామార్గం’ అనే పత్రిక తెస్తున్నం.

1993 వరకు పెబ్బేర్ లో ఉండే మహిళా సంఘం కార్యక్రమాలలో పాల్గొంటుంటి. 93లనే పురుషొత్తం ఎల్ ఎల్ బి పూర్తి కావడం తోటి ప్రాక్టీస్ కోసమని మహబూబ్ నగర్ టౌన్ కి మారినం. అప్పుడే స్వేచ్ఛ కూడ పుట్టింది. నేను ప్రెగ్నంట్ గ ఉన్నప్పుడే పురుషోత్తం అడిగిండు నన్ను ‘బాబు పుడితె ఏమో కాని, పాప పుడితె “స్వేచ్ఛ” (పౌర హక్కుల సంఘం అధికారిక పత్రిక పేరు) పెట్టాలని వుంది. నీకేమైనా అభిప్రాయం వుందా? వేరే ఏదైన పేరు పెట్టాలని అనుకుంటున్నవా’ అని. ‘నాకేమి లేదు’ అని చెప్పిన. ‘ఏమి లేకపోతె సరేకాని. తర్వాత ఇది పితృస్వామ్యం అనుకోవద్దు. నేను డిసైడ్ చేసినా అని. నీకు ఇష్టమైతెనే చెప్పు’ అన్నడు. ‘నాకు ఎందుకు ఇష్టం ఉండదు. అదేమైనా నీ పర్సనల్ కాదు కదా’ అని ‘సరే’ అని చెప్పిన. అట్ల ఆమె పుట్టక ముందే ఆ పేరు డిసైడ్ అయ్యింది.

“స్వేచ్ఛ పుట్టిన తర్వాత జీవితం ఎట్ల వుండె?”

మహబూబ్ నగర్ ల మేము ఇద్దరం ఫుల్ బిజీగ వుండెటోల్లం. ఆయన కోసమో, నా కోసమో ఎప్పుడు ఎవరో ఒకరు వస్తనేవుండేది. బాగా తిరుగుడు కూడ వుండేది. స్వేచ్ఛకు రెండు ఏండ్లు వచ్చే వరకు నేను నాలుగయిదు రోజులు ఎక్కడైన పోవాల్సివుంటె ఆమెను అమ్మ దగ్గర వదిలి తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ తీసుకొచ్చుకునేది. స్వేచ్ఛ సంవత్సరం వయస్సు ఉన్నప్పుడే మా నాన్న పోయిండు. అమ్మ ఒక్కతే వుండేది కాబట్టి ఆమెకు ఇబ్బంది కాకుండ చూసుకునేదాన్ని. ఒకవేళ రెండు రోజులు ఎక్కడైన పోవాల్సివస్తె మా ఇద్దరిట్ల ఎవరైన ఒకరం ఇంటి దగ్గర వుండేటట్లు చూసుకునేది.

ఒక రోజు నాకు వేరే ఊరికి పోయే పనివుంది. నేను తయారవుతున్న. తనొచ్చి ‘నాకు ఇప్పుడే ఎం టీ ఖాన్ ఫోన్ చేసిండు. హైద్రాబాద్ కు రమ్మని. తప్పకుండ పోవాలి’ అని అన్నడు. ‘ఇదేంది నేను ఆ ఊరికి వస్తా అని చెప్పిన. నా కోసమని ఇద్దరు ముగ్గురు లీవ్ పెట్టుకోని వున్నరు. నేను పోవాలి కదా’ అని నేను అన్న. ‘ఎం టీ ఖాన్ కు మళ్ళీ వీలుకాదు కదా, నువ్వే ఎట్లన్న చూడు’ అన్నడు. ‘నాకు అదంత సంబంధం లేదు. నువ్వు ఇంటి దగ్గర వుంట అన్నందుకే నేను నా మీటింగ్ పెట్టుకున్న. ఇప్పుడు కుదురదు అంటే కాదు. నీ పరిస్థితిల నేను వుంటె పోకుంటి కదా. ఎవ్వరి బాధ్యత వాళ్లదే’ అని చెప్పి స్వేచ్ఛను ఆయన దగ్గర వదిలిపెట్టి పోయిన. ఇగ తనేం చేసిండు ఎం టీ ఖాన్ దగ్గరికి పాపను ఎత్తుకోని పోయినడు. వాళ్లు ఇందిరాపార్క్ దగ్గర కలిసి మాట్లాడుదామని అనుకున్నరంట. అక్కడికి పోయినంక పాప (అప్పుడు రొండేండ్లె) చెట్ల ఆకులు, పూలు తెంపుతుందంట. వాళ్ళకు మాట్లాడే అవకాశమే ఇవ్వలేదంట. చిన్న పాప కదా. అప్పుడు ఎం టీ ఖాన్ ‘ఎందుకొచ్చినవయ్యా ఈమెను తీసుకోని. రాకపోయిన అయిపోతుండె’ అని అన్నడంట. కాసేపు ఏదో మాట్లడుకోని వచ్చేసిండ్రు.

మేము చేసే పని మీద కూడా బాగ చర్చలు జరిగేవి. ఆ చర్చలు ఎంత వరకు పోయినవి అంటె వరకట్నం చావులు సమాజంలో జరిగిపోతున్నవి, ఆడవాళ్ళు చనిపోతున్నరు. కాని ఎంకౌంటర్లలో చనిపోయే వాళ్ళను రాజ్యం చంపుతుంది, వాళ్ళ చావులో త్యాగం వుంది. కాబట్టి పౌరహక్కుల పని గొప్పది. అనే వరకు పోయినవి. నేను అనేది ‘చావులను ఇలా పోల్చలేము. ఇద్దరు మొత్తంగా సమాజంలో ఉన్న అసమానతలు, ఆధిపత్య భావజాలాలకు బలి అవుతున్నరు’ అని. తర్వాత మిగతా మనవాళ్ళ దగ్గర కూడ పెద్ద ఎత్తున చర్చించిన తర్వాత ఆ రెండు హత్యలు సమానమే. రెండింటికి వ్యతిరేకంగా పోరాటం చేయడం అవసరమే అని ఒక అభిప్రాయానికి వచ్చినం. ఏదైనా సరే చర్చించుకోని అవగాహనను పెంచుకోవడం, తప్పుడు అవగాహన వుంటె మార్చుకోవడం ఇద్దరం చేసే వాళ్ళం.

ఇక స్వేచ్ఛకు మూడేండ్లు వచ్చినవి. ఆమె తోటి పిల్లలు నర్సరీకి పోతుండ్రు. కాని మాకు ఆమెను స్కూల్ దగ్గర దింపి, తీసుకు రావడం వీలుగాక నాలుగేండ్లకు నర్సరీలో చేర్పించినం. అందుకే స్వేచ్ఛ అంటది ‘మీ ఇద్దరు కలిసి నాకు ఒక సంవత్సరం నష్టం చేసిండ్రమ్మా’ అని.

పురుషోత్తం కోర్టుకు రెగ్యులర్ గ పోయినప్పుడు కనీసం ఇంటికి సరిపోయే పైసలు వచ్చేవి. ఒక రోజు ఇంట్లో అస్సలు పైసలు లేవు. చాలా కష్టంగ వుంది. అప్పుడు ఒక అమ్మ వచ్చి పురుషోత్తం కాళ్ళ మీద పడి, పది వేలు చేతిల పెట్టింది. ఆమె కొడుకు మీద డెకాయిట్ అని దొంగ కేసు పెడితె పురుషోత్తం బెయిల్ ఇప్పిచ్చిండు. అయితే పురుషోత్తం వెంటనే ‘అమ్మా నువ్వట్ల చెయ్యొద్దమ్మా! ముందు నువ్వు కూర్చో’ అని కుర్చీల కూర్చోబెట్టి ‘అమ్మా నాకు పదివేలు వద్దు. అంత ఖర్చు కాలేదు. నా పనికి ఎంత అయ్యిందో అంతే తీసుకుంట’ అని కాగితాల ఖర్చు, తన ఫీజు కలిపి సగం తీసుకొని మిగితావి వెనక్కి ఇచ్చేసిండు. అప్పుడు ఇంట్ల బాగ ఇబ్బంది ఉండె కాబట్టి ‘ఏమవుతండె ఇచ్చినప్పుడు తీసుకుంటె. నువ్వేమి పీడించి తీసుకుంటలేవు కదా’ అని నేను అంటే ఆరోజు నాకు చెప్పిండు కదా… అది ఎప్పటికి మర్చిపోలేను. ‘డబ్బుకు ఒక్కసారి అలవాటు పడ్డమా అంటే దాని మీదనే ఎప్పుడు ఆకాంక్ష వుంటది. దాని చెడు లక్షణం ఏందంటే ఇంకా ఇంకా పోగేసుకోవాలని అనిపిస్తది. మన రాజకీయాలు మర్చిపోతం. మన విలువలు మర్చిపోతం. దాని చుట్టే తిరుగుతం. మనం కూడా డబ్బుకు అడిక్ట్ అయిపోతం. ఎప్పుడైనా మనకెంత అవసరమైతదో అంతే తీసుకోవాలి. మన లక్ష్యమే అది కదా’ అని చెప్పిండు. నేను కూడా అప్పటి పరిస్థితికి క్యాజువల్ గా అనేసిన లోతుగ ఆలోచించకుండనే. కాని అది అప్పటి నుండి బాగ మనస్సుకు హత్తుకుంది. నిజమే కదా! ఎంత ఎక్కువ వస్తె మనకే అంత నష్టం చేస్తది డబ్బు.

ఆ టైం లోనే తాను దాదాపు ఫుల్ టైమర్ గా పౌర హక్కుల సంఘంలో పనిచేయడం మొదలు పెట్టిండు. ఏమైనా కేసులు వుంటె చంద్రశేఖర్ చూసుకుంటుండె. తాను రాష్ట్రం మొత్తం తిరుగుతుండె. అట్లా తిరిగే క్రమంలోనే ఎన్ కౌంటర్ శవాలను సరైన విధంగా పోస్ట్ మార్టం చేయ్యాలి, వాటిని ప్రిజర్వ్ చేసి గౌరవంగ వాళ్ళ కుటుంబాలకు అప్పగించాలని కోర్ట్ లో పిటిషన్ వేసినందుకే మహబూబ్ నగర్ లో దాడి చేసిండ్రు.

ఇది 1997లో. ఓ రోజు సాయంత్రం ఏ పీ టి ఎఫ్ ఆఫీస్ కు పోయి వస్తుంటె రోడ్ మీద వెనక నుండి వచ్చి మొదటి దెబ్బ తల మీద కొట్టిండ్రు. రెండో దెబ్బ వెయ్యబోయే సరికి పక్కకు జరిగిండు. అది భుజం మీద పడింది. వెంటనే రోడ్డు మీద ఉన్న బజ్జీల కొట్టులో పెద్ద ఇనుప జాలి గంటె అందుకోని ‘ఎవర్రా మీరు…’ అంటూ ఎదురు తిరిగేసరికి వాళ్ళు పరారయ్యిండ్రు. అక్కడే పడిపోతె అక్కడున్నోళ్ళు హాస్పిటల్ తీసుకుపోయిండ్రు. తలకు బాగా గాయం కావడంతోటి బతకడనే అన్నరు. అక్కడ కష్టమని ఉస్మానియా హాస్పిటల్ కు పంపించిండ్రు.

దాడి జరిగిన తర్వాత ఒక సంవత్సరం హైద్రాబాద్ లోనే వున్నం. ఆరోగ్యం కొంచం బాగవ్వగానే పౌర హక్కుల సంఘం స్టేట్ జాయింట్ సెక్రెటరీగ మళ్ళీ తిరగడం మొదలు పెట్టిండు. వాళ్ళ సంఘం కూడా తాను హైద్రాబాద్ లో ఉంటే సంస్థ పనులకు కూడా మంచిది అని నిర్ణయం తీసుకున్నదట. నాకు హైద్రాబాద్ పోవడం ఇష్టం లేదు. ‘పిల్ల చదువు కూడా డిస్టర్బ్ అవుతది. నువ్వు ఒక్కడివే అక్కడ వుండు. మధ్య మధ్య వచ్చిపో’ అని చెప్పి ఒక సంవత్సరం అక్కడే వున్న. తర్వాత ‘నాకు బాగ ఇబ్బంది అవుతుంది రమ్మని’ తను అడుక్కుంటె ‘సరే’ అని ఒప్పుకున్న. అప్పుడే నేను కూడా మా సంఘం కర్నూల్ సభల్లో రాష్ర్ట అధ్యక్షురాలుగా ఎన్నుకోబడిన. నాకు కూడా ఉపయోగపడుతుందిలే అనుకున్న. తానే దిల్ సుఖ్ నగర్ లో ఒక ఇల్లు చూసి ఒక కుండ కూడ పగలకుండ అన్నీ మహబూబ్ నగర్ నుండి షిఫ్ట్ చేసిండు. నేను ఏవో పనులతోటి బిజీగ వుంటే తనే వస్తువులు అన్ని భద్రంగ సర్దిండు.

మా సంఘం అవసరాలకైనా పనికొస్తది అని ‘లా’ అడ్మిషన్ తీసుకొనివుంటి. మరుసటి రోజు నాకు పరీక్ష వుంటె ఆ రోజు (నవంబర్ 23, 2000న) నేను ఇంట్లోనే వుండి చదువుకుంటున్న. పురుషోత్తం, ఇంకో ఇద్దరు “స్వేచ్ఛ” పత్రికను పోస్ట్ చేయడానికి రెడీ చేస్తున్నరు. మధ్యలో ఆయనే నాకు టీ తెచ్చి ఇచ్చిండు. అట్లనే ద్రాక్ష పండ్లు వలిచి నీళ్లల్ల పెట్టి ఇచ్చిండు. ‘ఇప్పుడే టీ తాగితి. ఆప్పుడే పండ్లెందుకు’ అని నేనంటె ‘ఏమి కాదు. మంచి శక్తి వుండాలి. కాసేపు అయినంక తిను’ అని అక్కడే పెట్టిపోయిండు. అంతకు ముందు బట్టలు నానేసి వుంటిమి. ఉతుకుదామంటే సబ్బు లేదు. లేకపోయే సరికి పోయి తెస్త అని బయలుదేరిండు. అడ్డ పంచలనే వున్నడు అప్పుడు. పత్రికకు హెల్ప్ చేయడానికి వచ్చిన బాబు ‘అన్నా నేను పొయ్యి తీసుకొస్తలే’ అంటె ‘వద్దు… వద్దు నువ్వెందుకు. నేనే పోత. నువ్వు ఆ పని చేస్తున్నవ్ కదా చెయ్యి.. చెయ్యి’ అని తను పోయిండు. తను కూడ పోస్టింగ్ పని చేస్తుండె. వాళ్ళ చెల్లె అయితది (సుధీర అని) ఆమెను కూడా ‘ఇట్ల పనుందమ్మా రా’ అంటే ఆమె కూడ వచ్చింది. ముగ్గురు టీం గ ఆ పని చేస్తుండిరి.

బయటికి పోయిన మనిషి అర్థ గంటయ్యింది ఇంకా వస్తలేడు. చూసివస్త అని పోస్టు పనులు చేస్తున్న ఇద్దరు పోయిండ్రు. వాళ్ళు వస్తలేరు. ఇంకొంచం సేపయినంక మా ఇంటి ఓనర్ వచ్చిండు. ‘వీళ్ళంత అటే పోయిండ్రు. ఒక్కరు కూడ రాలేదు’ అని అడిగిన. అతను కూడా ఏమి చెప్పలేక ‘ఏమోనమ్మ అక్కడ ఒక మర్డర్ జరిగిందంట. జనాలంత గుమ్మిగూడి వుండ్రు’ అని చెప్పిండు. నేను అనుకున్న ‘మర్డర్ జరిగింది కదా పురుషోత్తం, వీళ్ళంత చూసుకుంటుండొచ్చులే. వాళ్ళకి ఏదో న్యాయం జరగాల అని చూస్తుంటరు. అన్ని వివరాలు తెలుసుకోవడం కోసం అక్కడ వుండొచ్చులే’ అని నేను పట్టిచ్చుకోలె.

ద్రాక్ష పండ్లు అక్కడ పెట్టిపోయిండు కదా అవి తినుకుంటూ చదువుకుంట కూర్చున్న. అంతట్లనే మా మరిది (చెల్లి భర్త) ల్యాండ్ లైన్ కు ఫోన్ చేసిండు. అప్పటికే టీవీ ల స్క్రోలింగ్ కూడ వస్తుందంట.

‘అక్కా అన్న వున్నడా’ అంటె, ‘లేడు సబ్బు అయిపోతె తేవడానికి పోయిండు’ అని చెప్పిన.

‘అయ్యో, ఏదో జరిగింది అంటుండ్రు అక్కా’ అంటుంటే…

‘అవును. ఎవరినో చంపిండ్రంట. అందుకే అన్న వాళ్ళు రాలేదేమో. అక్కడే వున్నరేమో’ అని చెప్తుంటే…

‘లేదక్కా, అన్ననే అంటున్నరు. నువ్వు పొయ్యి చూడుపో’ అన్నడు.

చెప్పగానే ఫోన్ అక్కడ పెట్టేసి, నైటీ మీద చీర ఉట్టిగనే చుట్టుకోని పరుగెత్తుకోని పోయిన. అక్కడి జనాలు గుమ్మిగూడి వున్నరు. అందరిని తోసుకోని దగ్గరకు పోతుంటె అక్కడున్న పోలీసోడు ‘ఎవరు నువ్వు? ఎవరు నువ్వు?’ అంటున్నడు.

‘ఎవరో అది నన్ను చూడనీ’ అంటూ ముందుకు తోసుకోని పోయిన. అక్కడ చూస్తె పురుషోత్తం వెల్లెలికల పడిపోయి వుండు. ఒక చెప్పు కాలికి వుంది. ఇంకో చెప్పు దూరంల పడివుంది.

‘ఎవరమ్మా నువ్వు? ఎందుకొస్తున్నవ్?’ అంటూ దొబ్బనీక పోయిండు అక్కడున్న ఎస్ పి సురేంద్రబాబు.

నాకు బాగా కోపం వచ్చింది. కింద పడిపోయిన చెప్పు ఉంది కదా అది అందుకోని ఆయన మొఖం మీదికి విసిరేసి ‘ఏం రా కొడుకుల్లారా, మీరే చంపి. మల్ల మీరే నన్ను ఎవరు నువ్వు, ఎవరు నువ్వు అంటరా. మీకు ఏమొచ్చిందిరా’ అని బాగా గట్టిగ తిడుతుండగానే ఒక జీప్ వచ్చింది. నేను వాళ్ళ మీదికి పోతుంటె లేడీ కానిస్టేబుల్స్ నన్ను గట్టిగ పట్టుకున్నరు. నేను ఆయనను కొంచం కూడ చూసుకోనేలేదు, శాంతిభద్రతల సమస్య అని చెప్పి ఆయనను తీసుకోని పాయె.

అప్పుడే అమ్మ అక్కడికి వచ్చింది. అక్కడ గుంపు ఇంకా చెదరక ముందే వీవీ సార్, ఇంకా అనేక మంది ప్రజా సంఘాల కార్యకర్తలు వచ్చిండ్రు. సార్ కూడా ఒక వారం రోజుల ముందే ఇంటికి వచ్చి పోయిండు. ‘దిల్ సుఖ్ నగర్ లో హాస్పిటల్ కి వచ్చినమమ్మా. అట్లనే వచ్చినము’ అని అనె సారు. మహబూబ్ నగర్ కు వచ్చినప్పుడు కూడా ఇంటికి వస్తుండె సార్. రాత్రిల్లు మాట్లాడుకుంటూ చాలా సేపు ఉంటుంటిమి.

“అక్కా, పురుషోత్తాన్ని రాజ్యం చంపేసింది. మీ జీవితాన్ని ఒక సంక్షోభంలోకి నెట్టింది. ఆ సందర్భంలో మిమ్ముల మీరు నిలబెట్టుకోవడానికి శక్తి ఎక్కడినుండి వచ్చింది?”

చాలా కష్టమయ్యింది. అయితే తొందరగనే మానసికంగ సిద్ధమైన. ప్రజల కోసం పని చేసే వాళ్లను ఇలా చంపడం అంతకు ముందు కూడా చూసినం. కాబట్టి వాడు చేయగలిగింది ఇదే కదా అనుకున్న. పురుషోత్తం, నేను ఏ ప్రజల కోసమైతే పనిచేయాలనుకున్నమో ఆ పని కొనసాగించడమే ఆయనకు నివాళి అనుకున్న. అయితే ముందు నుండే నన్ను ఆయన ప్రిపేర్ చేసినట్లు అనిపిస్తది నాకు. ‘ఒకవేళ నాకు ఏదైనా అయితే నువ్వు సొంతంగా బతకడానికి సిద్ధపడాలి. నీ దగ్గరకు వచ్చే ఎంతో మంది మహిళలను చూస్తున్నవ్ కదా వాళ్ళు ఎన్నో సమస్యలతో ఉంటరు. వాళ్లకు ఏదైనా సహాయం చెయ్యాలంటే నువ్వు ఇంకా ధైర్యంగ వుండాలి’ అని ముందే చెప్పిండు. ఎందుకంటే అప్పటికే మహబూబ్ నగర్ లో ఒకసారి దాడి జరిగింది కదా.

నేను నిలదొక్కుకోవడానికి నాకున్న శక్తి మా సంఘమే. మా సంఘం లేకపోయింటె చాలా కష్టమయ్యేది. మా సంఘం దగ్గరికి వచ్చే వాళ్ళంతా భర్తలు వదిలేసినవాళ్ళు, మోసపోయినవాళ్ళు, ఇంకా అనేకానేక సమస్యలు ఉండేవాళ్ళు. వాళ్ళని చూసినప్పుడు ‘నాకేమి సమస్యలు వున్నవి’ అని అనుకునేదాన్ని. ఇక ఆర్థిక సమస్య అంటే ఆయన ఎప్పుడో ఒక జనతా పాలసీ చేసివుండె. ఇప్పుడు ఆ పాలసీ లేదు. అప్పుడుండె. దాని ద్వార వచ్చిన డబ్బును పోస్టాఫీసులో, బ్యాంకులో పెట్టి దానితోనే గడిచేది. అట్లనే నాన్న పెన్షన్ అమ్మకు వచ్చేది. రైస్ మొత్తం తాండ్రపాడు నుండి తెచ్చెటోళ్లు. అట్లా ఇల్లు గడిచిపోయేది. మొత్తంగ చూసుకుంటే మనిషి లేడు కాని, నాకు ఏ సమస్యలు లేవు కదా. అంత పెద్ద రాజ్యం తనకు అడ్డువచ్చిన వాళ్ళను తొలిగించుకోవాలని అనుకున్నప్పుడు ఇలాంటివన్నీ జరిగిపోతుంటయి అంతే. ఇది రాజకీయం కదా! ఎప్పుడైనా ఇది జరిగేదే అని అనిపిస్తుండె.

పురుషోత్తం అంతిమయాత్ర హైదరాబాద్ నుండి గద్వాల్, ఐజ మీదుగ తాండ్రపాడు పోవడానికి మూడు రోజులు పట్టింది. వేలాది మంది జనాలు వచ్చిండ్రు. వాళ్లను చూసినప్పుడే అనుకున్న రాజ్యం ఓడిపోయిందని.

ఇక మళ్ళీ దిల్ సుఖ్ నగర్ ఇంటికి పోతె అక్కడ పిల్లలు స్వేచ్ఛ తో ఆడుకోవడానికి ఎవ్వరు రావడం లేదు. ఎందుకంటె వాళ్ళు అక్కడ శవాన్ని చూసిండ్రు కదా. ఎంతైనా పిల్లలు. భయపడుతరు. స్వేచ్ఛ కూడా ‘నాతో ఎవ్వరు ఆడుకోవడం లేదమ్మా’ అని ఏడ్చింది. నాకు కూడ అక్కడ ఉండటం ఇష్టం లేకుండ పోయింది. కొన్ని రోజులు మా చెల్లి వాళ్ళింట్లో ఉండి తర్వాత వేరే ఇల్లు తీసుకోని ఉన్నం.

స్వేచ్ఛ స్కూల్ గురించి వీవీ సార్ ఆక్స్ ఫర్డ్ స్కూల్ వేదకుమార్ తో మాట్లాడి వెళ్ళి కలవమని చెప్పిండు. వెళ్ళి కలిస్తె ‘పురుషోత్తం గారి కూతురు మా స్కూల్ లో చదవడం మాకు చాలా సంతోషం. మా దగ్గర పదో క్లాస్ వరకు ఉంది. మీరు ఎంత వరకైనా చదివించుకోండి’ అని అన్నడు. మినిమం ఫీజ్ కట్టి పది వరకు అక్కడే చదివించిన.

తన తండ్రి చనిపోయేటప్పటికి స్వేచ్ఛ ఏడేండ్ల పాప కదా, మరి తనను ఎట్లా ఓదార్చగలిగిండ్రు? ఎడ్యుకేట్ చేయగలిగిండ్రు?

తనది కొంత తెలిసీ తెలియని వయస్సు. అందులోను నాతోనే ఎక్కువ అటాచ్ మెంట్ ఎక్కువ. ఆయన ఎప్పుడు పనుల మీద తిరుగుతా వుండె కాబట్టి మొదటి నుండి కూడ అటాచ్ మెంట్ కొంత తక్కువనే. అయితె తెలివి వచ్చిన తర్వాత నేను బాధ పడుతనేమో అని ఆమె ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. ఏడ్వలేదు. పాప మనసులో ఏదో పెట్టుకోని నీ ముందు అలా వుంటుందేమో, అది ఒక్కసారి బర్స్ట్అయితే టీనేజ్ లో కష్టం అని తెల్సినవాళ్ళు కూడా అన్నరు. POW సంధ్య కూడా ఒకసారి చెప్పింది ‘అట్ల చూస్తూ వుండొద్దు జ్యోతి, మంచి సైకియాట్రిస్ట్ కు చూపించు’ అని. సరే అని చూపించిన. వాళ్ళు నన్ను, ఆమెని వేరువేరుగా ఇంటర్వ్యూ చేసి ‘ఏమి బెంగ పెట్టుకోవద్దు. ఆమె తన ఏజ్ కు మించి మచ్యూర్ గా వుంది. ఇబ్బంది ఏమి వుండదు’ అని చెప్పిండ్రు.

నేను ఎప్పుడైనా వాళ్ళ నాన్న ఫోటోస్ చూస్తుంటే, ఆయన పుస్తకాలు చదువుతుంటే ఆమె వచ్చి మట్టసంగ తీసుకునేది. నేను మళ్ళీ ఎక్కడ ఏడుస్తనో అని. నాకు బాగ గుర్తుంది. మొదటి సంవత్సరంలోనే క్లాస్ లో ఫస్ట్ వచ్చింది. పేరెంట్స్ మీట్ కు పోయిన నేను. అక్కడ ‘చిన్నా, నాన్న వుంటె ఎంత బాగుండు’ అని నేను అనగానే ‘అమ్మా నువ్వున్నవ్ కదా, అమ్మా నువ్వున్నవ్ కదా’ అని వెంటనే అని నన్ను ఇంకో మాట మాట్లాడనీయలె.

అక్కా మీ ముప్పై ఏండ్లకు పై రాజకీయ, వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూసిండ్రు. నిర్బంధాన్ని, రాజ్య హింసను ఎదుర్కొన్నరు. అయితే మారుతున్న సమాజ పరిస్థితుల్లో, ముఖ్యంగా ప్రజా ఉద్యమాలు కూడా కొంత వెనుకడుగు వేసి వున్న సందర్భంలో, ఈ పోరాటాలతో ఒరిగేది ఏమిలేదు, అంతా వృధా ప్రయాస అనే ఒక నిరాశను వ్యక్తం చేసే వాళ్ళు ఉన్నారు. అలాంటి నిరాశావాదుల చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది?

వాస్తవానికి మన సమాజం, ప్రజా ఉద్యమాలు అనుభవించిన హింస, అణిచివేతతో మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు కొనసాగుతున్న నిర్బంధం ఒక లెక్కనే కాదు. ఎంతో మంది ప్రాణాలనే తీసిండ్రు కదా. కనకాచారి, మునెప్ప, ఆజం అలీ, ఇంకా ఎందరినో కోబ్రాల పేరిట, టైగర్ల పేరిట చంపేసిండ్రు కదా.

ఇప్పుడు జరుగుతున్న అరెస్టులకు, దాడులకు ఎవ్వరు భయపడే అవసరమే లేదు. ప్రజలకు మన రాజకీయాలు అర్థం చేయించగల్గితె ఇంకా ఉద్యమాలు బలపడే అవకాశం వుంది.

అయితే మహిళా సంఘంగా పితృస్వామ్య భావజాలన్ని గట్టిగా ఎదుర్కోవాలని మనం మొదటి నుండి అనుకున్నదే. ఇప్పుడు మహిళలపై కొనసాగుతున్న హిందుత్వ దాడి సందర్భంలో మాలాంటి సంఘాలు ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా ఎక్కువగ ప్రజల్లోకి వెళ్ళాల్సిన అవసరం కూడా వుంది. అన్ని శ్రేణుల్లో, వర్గాల్లో, సంస్థల్లో హిందుత్వ ప్రమాదం మీద నిరంతరం చర్చ కొనసాగించాల్సి ఉంది. ఇప్పుడు మహిళా సంఘంగా సంతోషపడేది ఏమంటే షహీన్ బాగ్ లాంటి చోట్ల, ఇంకా దేశమంత మహిళలు ఉదృతంగ రోడ్ల మీదికి వచ్చి హిందుత్వ దాడులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నరు. మొన్న మా గద్వాల్ లో కూడా ఏడు ఎనిమిది వేల మందితో సీఏఏ కు వ్యతిరేకంగా పెద్ద ఊరేగింపు తీసినరు. ఇవన్నీ మహిళలు ఉద్యమాలలోకి రావడానికి ఇంకా సిద్ధంగా వున్నారని చెబుతున్నాయి. ఇదొక మంచి సూచిక. ఇప్పుడు మహిళలు నాయకత్వంలో లేకపోవచ్చు. కాని ఉద్యమాలలో పాల్గొంటెనే నాయకత్వంగా ఎదిగి వస్తరు కదా.

ఉద్యమాలలోకి వస్తున్న కొత్త తరాన్ని చూస్తె మీకేమనిస్తది?

మంచిదే. ఎప్పటికప్పుడు కొత్త నెత్తురు ఉద్యమాలలోకి రావాల్సిందె. అయితే ఈ కొత్త తరానికి ఓపిక తక్కువ. ఫలితాలు త్వరత్వరగా రావాలి అనుకుంటరు. మొక్క నాటగానే పండ్లను ఆశించలేము కదా. ఓపిక, కష్టపడే తత్వం పెంచుకోవాల్సిన అవసరమైతే ఉంది.

అక్కా, చివరిగా భవిషత్తును మీరు ఎలా చూస్తున్నారు?

చరిత్రలో ఫాసిస్టు ప్రభుత్వాలు ప్రజల చేతనే కూలదోయబడినవి. ప్రజలపై ఎంత నిర్బంధం పెరిగితె ప్రజల నుండి కూడా అంత తిరుగుబాటు వస్తుంది అనేది అనేక దేశాల చరిత్ర మనకు చెబుతుంది. ఇక్కడ కూడా పరిస్థితి ఆశాజనకంగానే ఉంది. చివరిగా సమాజం మారుతది. ఒడుదుడుకులు ఎప్పుడైనా వుంటవి. కాని చివరికి అభివృద్ధికరమైన రాజకీయాలదే అంతిమ విజయం.

జ్యోతక్క మాటలు విన్నాక నాకు ఒక బ్లాక్ అమెరికన్ మిత్రుడు అమెరికాలోని జాత్యాహంకారం గురించి చెప్పిన ఒక మాట గుర్తొచ్చింది. అది “danger is real, but fear is a choice.” నిజమే హిందుత్వ ఫాసిజం ముంచుకొస్తున్న ప్రమాదమే, కాని దానికి భయపడి పరిగెత్తితే అది మన మీద స్వారీ చేస్తది. నిలబడి ఎదురు తిరిగితే తోక ముడుస్తది. చరిత్ర రికార్డ్ చేసిన అందరు ఫాసిష్టుల్లాగానే!

పుట్టింది చారకొండ (పాలమూరు). పెరిగింది అజ్మాపూర్ (నల్లగొండ). సామాజిక శాస్త్ర విద్యార్థి, ప్రజా ఉద్యమాల మిత్రుడు. అమెరికాలో అధ్యాపకుడిగా, పరిశోధకుడిగా పనిచేస్తున్నాడు.

4 thoughts on “పోరాటమే మహిళామార్గం: జ్యోతక్క

  1. జ్యోతి గారిని చాలా సార్లు కలిసినప్పుడల్లా ఆమేలో సింప్లిసిటీ న చ్చేది.com. పురుషోత్తం సహచరి ఆని తెలిసాక మరింత గౌరవం కలిగింది.ఆమె మంచి ఓపికతో వ్యవహరించే మహిళా సంఘం నాయకురాలు. బయట సమాజంలో .మహిళల సమస్యలే కాదు సంఘంలో సభ్యుల సమస్యలను పరిష్కరించటానికి శ్రద్ధ సీబుపేవారు జ్యోతిగారు.ఈ interveiw తో జ్యోతిగారి కుటుంబ నేపథ్యం…ఆమెను ఉద్యమాల్లోకి నడిపించిన తండ్రి,అక్క ఉదయం జీవితాలు…త్యాగాలు,అమరత్వం వాటినుంచి ఆమె పొందిన ప్రేరణ తెలిసొచ్చాయి.సహచరుడు పురుషోత్తం గారి అమరత్వం తర్వాత ఆమె ఒంటరిగా పసి పాపా స్వేచ్ఛతో సమాజం కోసం నిలబడ్డ తీరు ఆదర్శనీయం,స్ఫూర్తిదాయకం.పురుషోత్తం గారి గురించి చాల postive గా విన్నాను.ఆయన ఆదర్శం జీవితం వేరు వేరు కాదు.తన రాజకీయాలు విశ్వాసాలు,విలువలు తన జీవితంలో ఆచరించారు ఆయన.ఇంటిపని,వంటపని, ఆయన హెల్ప్ సీబీస్తున్నట్లుగా కాకుండా తన బాధ్యతగా చేసేవారని, జ్యోతివారిని చాలా అపురూపంగా గౌరవంగా చూసుకునేవారని విన్నాను చాలా మంది ద్వారా.వెదుకలెక్కి స్త్రీ పురుష సమానత్వాల మీద మాట్లాడి ఇంట్లో మాత్రం భార్యలతో ఫ్యూడల్ వెంకట్రావుల్లా పనులు చేయించుకునే దొంగ మేల్ ఫెమినిస్టులు ,ర హాయతలు ,హక్కుల కార్యకర్తల లాగా కాదు పురుషోత్తం గారు.మొతానికి జ్యోతి గారి 30 ఏళ్ల ఉద్యమ జీవితాన్ని బాగా పరిచయం చేసారు.అభినందనలు అశోక్ గారు.

  2. జ్యోతి బాగా తెలుసు. హైదరాబాద్ లో మహిళా చేతన వ్యవస్థాపక సభ్యురాలినే గాక అప్పటినుంచీ ” మహిళా చైతన్య సమాఖ్య” లో కొనసాగడం వల్ల ఈ విషయాలన్నీ తెలిసినప్పటికీ, జ్యోతి బాల్యం నుంచీ జరిగిన విషయాలు తెలుసుకోవడం సంతోషం కలిగించింది. సుగుణ గురించి వి వి సర్ , హేమక్క చెప్పారు. కౌముది ఎన్ కౌంటర్ జరిగినప్పుడు వాళ్ళతోనే ఆ ఊరికి పోయి వాళ్ళమ్మను చూశాను. పురుషోత్తం గారి మీద తెచ్చిన పుస్తకాన్ని మహిళా సంఘం వాళ్ళు నన్ను ఆవిష్కరించమన్నారు. ఇప్పుడవన్నీ తల్చుకుంటుంటే చాలా గర్వంగా ఉంది.
    ‘డబ్బుకు ఒక్కసారి అలవాటు పడ్డమా అంటే దాని మీదనే ఎప్పుడు ఆకాంక్ష వుంటది. దాని చెడు లక్షణం ఏందంటే ఇంకా ఇంకా పోగేసుకోవాలని అనిపిస్తది. మన రాజకీయాలు మర్చిపోతం. మన విలువలు మర్చిపోతం. దాని చుట్టే తిరుగుతం. మనం కూడా డబ్బుకు అడిక్ట్ అయిపోతం. ఎప్పుడైనా మనకెంత అవసరమైతదో అంతే తీసుకోవాలి. మన లక్ష్యమే అది కదా’ అనడం ఎంత గొప్ప మనస్తత్వం?
    నడిరోడ్డు మీద జరిగిన దారుణమైన హత్యతో మాకందరికీ ఏడుపొచ్చి ఏడుస్తుంటే స్వేచ్చ మాత్రం అలా చూస్తూ ఉంది. “నీకేడుపు రావడం లేదా?” అనడిగితే ఏడేళ్ళ స్వేచ్చపెద్ద ఆరిందాలా “బాపు ఏడవ వద్దని చెప్పాడ”ని చెప్పింది. ఇది మరీ ఏడుపు తెప్పించిందండీ!
    అశోక్ గారూ! ఇంటర్వ్యూ ని ఇంత హృద్యంగా మలిచినందుకు మీకు ధన్యవాదాలు!

Leave a Reply