మహిళల మూకీ భాష్పాలకు నోరిచ్చి రచ్చకెక్కించిన గుఱ్ఱం జాషువా-2

“ఘోషాలోబడి క్రుళ్ళిపోయినది దిక్కున్ మ్రొక్కు లేకుండ నీ
యోషామండలి యెండ కన్నెఱుగ కీ యుత్తుత్త ధర్మాలకున్
బోషాణంబయి బూజుపట్టినది హిందూ జాతి చిత్తంబునం
దీషత్ప్రేమ వహించి స్వేఛ్చ యిడవోయీ! అక్కచెల్లెండ్రకున్”

గాంధీ మహాత్ముని అకాల అసహజ మరణానికి దుఃఖిస్తూ జాషువా వ్రాసిన బాపూజీ (1948) కావ్యంలోని పద్యం ఇది. గాంధీ ఆశయంగా, గాంధీ వాక్కుగా స్త్రీ జనాభ్యుదయ ఆకాంక్షను ఇందులో వ్యక్తం చేసాడు జాషువా. భారతీయ స్త్రీ సమాజం అనేక నిషేధాల మధ్య నిలవ నీటి జీవితాల కారణంగా కుళ్లిపోయిందని, ఉత్తుత్త ధర్మాలను అనేకం దాచిపెట్టిన పెట్టె వంటి హిందూ జాతి చిత్తం బూజుపట్టిపోయిందని అంటాడు జాషువా. దేశ స్వాతంత్య్రం కోరేవాళ్ళు అక్కచెల్లెళ్ల స్వేచ్ఛ గురించి ఆలోచించవద్దా అని గాంధీ ముఖంగా అడిగాడు. గాంధీ సందేశంగా దానిని స్వీకరించి ఆచరించమని సూచించాడు. అభిప్రాయాల ప్రకటనకు, ప్రచారానికి ఏ చిన్న అవకాశాన్నయినా వాడుకొనే ఉద్యమకారుల లక్షణం అది.

జాషువా ‘అల్లుడు’ ( ఖండకావ్యము, నాలుగవ భాగం, 1950) అనే ఖండిక ఒకటి వ్రాసాడు. ఇది ఒక అల్లుడి కథనం. 11 పద్యాలు. అల్లుడు అనేది వివాహ వ్యవస్థలోని ఒక మానవ సంబంధం. పెళ్లి తంతు ద్వారా కూతురికి భర్త అయినవాడు ఆ ఇంటి అల్లుడు. పితృస్వామిక కుటుంబ వ్యవస్థ, లింగ అసమానత ప్రాతిపదికగా ఏర్పడిన వివాహవ్యవస్థ అల్లుడు అనే బంధుత్వ సంబంధాన్ని అధికారం సంబంధంగా మార్చేసింది. అది అధికారం అని చలాయిస్తున్నప్పుడు,చలాయిస్తున్న వాళ్లకు తెలియదు. తెలిసినా అది ఒక మత్తు. ఆ మత్తు దిగేది ఎప్పుడంటే అదే అధికారం తనమీద చలాయించటానికి మరొకడు సిద్ధమైనప్పుడు. ఆ పరిస్థితిలో ఒక పురుషుడు అల్లుడుగా తాను చెలాయించిన అధికారాన్ని విడిమనిషిగా విమర్శకు పెట్టటం ఇందులో విషయం. అల్లుడంటే ఎవరు? ఒకయమ్మ గన్న బలహీన లతా లలితాంగిని ఏలేవాడు. అత్తమామలు బానిసలు అనుకునేవాడు. అత్తమామల మర్యాదలలో లోపాలు ఎన్నేవాడు.

ఇల్లాలిని ‘కొట్టుటకు,తిట్టుటకు’ లభించిన ‘పట్టా’ గా మగవాడికి అధికారాన్ని, భర్త పెట్టె వెత లను, శ్రమను విధి అని నమ్మి సర్దుకుపోయే అధీనతను ఆడవాళ్లకు కేటాయించిన ద్వంద్వ విలు వల వ్యవస్థ పెండ్లి అని జాషువా సరిగ్గా గుర్తించి చెప్పాడు. భార్యాభర్తల సంబంధంలో ద్వంద్వ లైంగిక నీతి అమలవుతున్న వాస్తవాన్ని కూడా ఆయన గుర్తించాడు.

“ ఎంత గడ్డి గఱచి యెన్నిండ్లు దూరిన
సంఘ శక్తి నాకు సాయమయ్యే
పడతి గడపదాట పదివేల కనులతో
పట్టియిచ్చి బ్రువ్వ తిట్టిపోసె”

పెండ్లి స్త్రీపురుషులకు జీవితకాలపు సంబంధం అయినా పితృస్వామిక సమాజం ఆ నిబంధనను స్త్రీలకు వర్తింపచేసినట్లు పురుషులకు వర్తింప చేయదు. వాడికేమి మగవాడు అంటూ పురుషుల వైవాహికేతర లైంగిక సంబంధాలను చూసీ చూడనట్లు వదిలేస్తుంది. అదే ఆడదాని విషయంలో వేయి కళ్ళతో కనిపెట్టి చూస్తుంది. కఠినంగా శిక్షిస్తుంది. భార్యలకు భర్త తోటికాపురాన్ని “…. వెఱగందుచు నెత్తురు జచ్చి యావ జీ / వాలును గ్రుంగి పోవ బలవద్రతులం బరితృప్తి నందు” స్థితికి దిగజార్చిన అధికార అధీన సంబంధాల వ్యవస్థ పెళ్లి. బెదిరే గుండెతో వలపు అనేది లేక, ఏ స్పందనా, పులకరింత లేని శరీరంతో, శూన్యమైన మనస్సుతో భర్త కామానికి మందుగా స్త్రీలు చేసే కాపురాల గుట్టును జాషువా ఇప్పటికి డెబ్భయ్ ఏళ్ళక్రితమే విప్పిచెప్పాడు. వివక్షాపూరిత సంబంధాలలో దాంపత్యం అనేది ఎంత హింసాత్మకంగా ఉంటుందో , స్త్రీ తనను తాను పూర్తిగా కోల్పోవటంగా ఉంటుందో అల్లుడు ఖండిక చెప్తుంది.

భారతదేశానికి బ్రిటిష్ వలసపాలన నుండి స్వాతంత్య్రం లభించిన ఉత్సాహం, పునర్నిర్మాణం గురించిన ఊహలు కవులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నకాలపు కవిగా జాషువా ప్రజా స్వామ్య భారత నిర్మాణంలో స్త్రీల భాగస్వామ్యాన్ని ఆశించాడు. స్త్రీ సమాజంలోని కుళ్ళును, మరీ ముఖ్యంగా తన అభివృద్ధికి అవరోధంగా ఉన్న శక్తులను గుర్తెరిగి పడదోసుకొంటూ ముందుకు సాగటం ఆయన ఆకాంక్ష. ఆకాంక్షా పరిపూర్తికి స్త్రీలు చైతన్యవంతులు కావటం మొదటి షరతు. అది నెరవేరుతుందని కలగంటూ ‘నేటినెలత’( 1950) ను దర్శించాడు. ఒకటే సీసపద్యం. పరదాల చాటున మరుగుపరచబడిన బుద్ధిబలాన్ని, ఉబ్బించే మాటలలోని మాయను, బాల్యవివాహాలలోని కీడును, బంగారు సొమ్ముల బరువు చేటును మహిళ తెలుసుకొంటున్నదని మగవారితో చేయి కలిపి పనిచేయకపోతే అనర్ధం తప్పదని కూడా తెలుసుకుంటున్నదని హర్షం వ్యక్తంచేస్తాడు కవి ఈ పద్యంలో.

ప్రజారాజ్య నిర్మాణంలో స్త్రీల భాగస్వామ్యాన్ని కలగంటే సరిపోదు. అందుకు వాళ్ళను ఉత్తేజితులను చేయాలి. సంసిద్ధం చేయాలి. అందుకనే వాళ్ళను సంబోధిస్తూ ‘ప్రబోధము’ అనే ఖండిక (1950) వ్రాసాడు. “పురుషుల్ నెత్తిన కొమ్ము నిక్కిన మహాత్ముల్ గారు నీకన్న” అని ఒక వాస్తవం గురించిన విశ్వాసం స్త్రీలలో నాటటానికి పూనుకొన్నాడు. పురుష పక్షపాతి అయిన సమాజం స్త్రీలకు దాస్యాన్ని ధర్మంగా చేసి,విద్యాస్పర్శ లేకుండా చేసింది. నాలుగు గోడల చాటున మిగిల్చింది. అటువంటి స్త్రీలను “ పరదా దాటి స్వతంత్ర వీధుల” లోకి అడుగుపెట్టి విహరించమని ప్రబోధించాడు. మగవాడు ఎక్కువ ఆడది తక్కువ అన్న మగవాడి వంచనా ప్రచారానికి లొంగిపోయి అవుననుకొని మౌనంలోకి జారిపోయిన స్త్రీల విషాద చరిత్ర తెలిసినవాడిగా జాషువా “ నీ కడుపున జన్మించుచు / నీ కమ్మని పాలు ద్రావి నెగడిన/ మగవాడే కారణమున ఘనుడ” వుతాడో ఆలోచించ మని స్త్రీల కు చెప్తాడు. ‘సమగౌరవ హానికి’ సమ్మతి ఇయ్యరాదని ఆశించాడు. స్త్రీల సృజన నైపుణ్యాలను చిదిమేసిన పురుషుల యుక్తిమాటల భ్రమల నుండి బయటపడమని హెచ్చరించాడు. చీరెలు,నగలు, అలంకారాలు ఇవికావు స్త్రీ అంటే , వాటికి సంతోషిస్తూ బతికెయ్యటం వెఱ్ఱితనమని విశ్వ కళాప్రపంచంలోకి నడిచి రమ్మని స్త్రీలకు పిలుపునిచ్చాడు.

1938లో వ్రాసిన తెరచాటు నాటకంలోనే గృహలక్ష్మి”పత్రిక్కాడవాళ్ల రాతలేగా జీవం పోస్తు న్నది” అని సమకాలపు స్త్రీల పత్రికను, స్త్రీల సృజనాత్మక శక్తులను గౌరవంగా ప్రస్తావించిన జాషువా స్వతంత్ర భారతదేశ పునర్నిర్మాణానికి స్త్రీలు కవులు కావాలని ఆశించటం సహజమే. “ ఎన్నేండ్లా యోనొ పూరుషుం డొకడ సాహిత్యాంబు పూరంబులో దున్నంబోలి చరింప సాగె” నని సాహిత్యప్రపంచాన్ని పురుషుడొకడే ఏలుతున్న సుదీర్ఘ కాలపు అసమ చరిత్ర మీద నిరసనను తీవ్ర ధ్వనితో వినిపించటంలో ఉంది ఆయన ప్రత్యేకత. సాహిత్య ప్రపంచాన్ని ఏలుతున్నాడు సరే .. మానవత్వం, సమత్వం వంటి విలువలు ఏమైనా పెంచుకున్నాడా అంటే అదీలేదు. “పెడ బుద్ధుల్ దప్పిపోలేదు, గర్వౌన్నత్యంబు నశించలే దబల విద్యాపూర్ణయై తోడు రా/ కున్నన్ దేశము నిద్ర మేలుకొనునే” అని సందేహం వ్యక్తపరుస్తాడు. నిజానికి ఇది సందేహం కాదు. సందేహరూపంలో ఉన్న నిశ్చితార్ధమే. పురుషుడి ఆధిక్యతాగర్వం నశించి స్త్రీపురుషుల సమగౌరవ సమాజంగా దేశాన్ని పునర్నిర్మించటానికి స్త్రీలు విద్యావంతులై కావ్య కళారంగాల ద్వారా నూతన భావజాల పరివ్యాప్తికి తోడ్పడాలన్నది జాషువా ఆకాంక్ష. నీవు ఇంట్లోనే ఉండు, నేనొకడినే ప్రజాశ్రేయస్సుకు పాటుపడతాను, స్త్రీలు అబలలు, సుకుమార శరీరులు, పూజలు చేసుకొంటే పరలోకం అబ్బుతుంది అని చెప్తూ సాహిత్యవిద్యా సహవాసాన్ని నిరుత్సాహ పరిచే మగవాడి మోసాన్ని అరికట్టటానికి స్త్రీలు అప్రమత్తులై వుండాలని కూడా వాంఛిస్తాడు. ఉపాంతీకరణకు గురి అయిన స్త్రీలను తిరిగి చేర్చటం ద్వారా సాహిత్య సామాజిక రంగాలను సమగ్రం చేయాలన్నది ఇంక్లూసివ్ పాలసీలుగా రూపొందటం వెనుక ఎంతమంది జాషువాల ఆరాట పోరాటాలు ఉన్నాయో వూహించుకోవలసినదే.

1952 లో ప్రచురించబడిన అయిదవ ఖండకావ్య సంపుటిలో ‘వంచిత’ అనే 28 పద్యాల ఖండిక ఒకటి ఉన్నది. ద్వంద్వ విలువల ద్వంద్వ నీతుల సమాజంలో వంచిత అయిన స్త్రీ గురించిన దుఃఖ గీతం ఇది. స్త్రీల దుఃఖం ఎవరో తీరిస్తే తీరేదికాదు. దుఃఖితులు అయినవాళ్లే దుఃఖనివారణ మార్గాలను కనిపెట్టాలి. ఆ దిశగా వాళ్లలో చైతన్యాన్ని కూడగట్టటం ఇందులో ప్రధానం. అందుకు మొదట ఆయన చేసిన పని వాళ్ళ దైన్యం వాళ్లకు అర్ధం అయ్యేట్లు చేయటం.

“పురుషులు వంటయింటి కొరముట్టుగ నిన్ను గణించుచుండ, కి
క్కురుమనకుండ సంసరణ కూపమునం బడి, మందభాగ్యవై
వరవుడమాచరించెదవు భారత పుత్రికనంచు రిత్త సం
బరపడుచుందు వింటి తలవాకిలి దాటని పుట్టు ఖైదివై”

పురుషులు నిన్ను వంటయింటి పనిముట్టుగా పరిగణిస్తున్నారు. నువ్వేమో మారుమాటాడక దాస్యం చేస్తున్నావు. ఇంటిగడప దాటని పుట్టుఖైదీవీ అయిన నీవు భారత పుత్రికను అని వృధాగా సంతోషపడుతున్నావు అని చెప్తున్నకవి సంతోషించదగ్గవి నీ జీవితంలో ఏమున్నాయి? స్వేఛ్ఛా? స్వాతంత్ర్యమా? తరచి చూసుకొనమని స్త్రీలను హెచ్చరించినట్లయింది. అనసూయ మొదలైన వాళ్ళ పేర్లు చెప్పి గతంలో వాళ్ళు మూటగట్టుకున్న పుణ్యాలను చూపిస్తూ సంఘం అనే పులి నీ వ్యక్తిత్వాన్ని తినేస్తుంటే చలించని స్త్రీల శాంతస్వభావాన్ని నిరసించాడు. “మగనికి మగువల గూరిచి” అగచాట్లు పడ్డ సుమతి వంటివాళ్లను దేవతలని పూజించే స్త్రీలకు అసలు హృదయమనేది ఉందా అని సందేహపడ్డాడు. వలపుల రాణి , చిలుకలకొలికి, అలికులవేణి అనిపొగడుతూ పురుషుడు స్త్రీని ఆకాశహర్మ్యంలో ఊయలలు ఊపటం ఇన్నియుగాలుగా కాళ్ళకింద నలిపేస్తున్నచరిత్రను గ్రహించకుండా మాయ చేయటం లో భాగమని స్త్రీలు గ్రహించకపోవడం గురించి ఆందోళన పడ్డాడు. సహగమనం, వైధవ్యం, అత్తింటి ఆరళ్ళు, మగని నిర్లక్ష్యం మొదలైన సమస్యలనన్నిటినీ ప్రస్తావించిన జాషువా స్త్రీల జీవితంలో ఒక అభ్యుదయకరమైన భవిష్యత్తుకు బాట వేయబోయిన హిందూకోడ్ బిల్లు పై జరిగిన సమకాలీన చర్చలు , పరిణామాల చరిత్రపై చేసిన వ్యాఖ్యానం ఈ ఖండిక కు ఒక ప్రత్యేకతను కలిగించింది.

“పరదాలో నిను దాచిపెట్టుకొనుచున్ స్వాతంత్ర్య మావశ్యకం
బరవిందాక్షుల కంచు వీధుల నుపన్యాసాలు సాగించు ట
క్కరులె హైందవకోడు బిల్లులకు పక్కా ద్వేషులై నిల్చుచుం
దురు, విద్యనయనంబు లేని యలివేణుల్ గాన రీమర్మముల్”

హైందవకోడుబిల్లు అని జాషువా ప్రస్తావించింది రాజ్యాంగ సభలో 1947 ఏప్రిల్ 11 నాడు అంబేద్కర్ ప్రవేశపెట్టిన హిందూ కోడ్ బిల్ గురించే. స్వతంత్రం తరువాత రాజ్యాంగ రూపకల్పనలో భాగంగా నాలుగేళ్లపాటు చర్చలలో నలిగి, వాదవివాదాలకు గురి అయి పార్లమెంటులో నిలిపివేయబడి న్యాయశాఖా మంత్రిగా ఉన్న అంబేద్కర్ రాజీనామా చేయటానికి( 1951) కారణమైన బిల్లు ఇది. స్త్రీల ఆర్ధిక సామాజిక హక్కులకోసం అంబేద్కర్ తన శక్తిని అంతా వెచ్చించి రూపొందించిన బిల్లు ఇది. కుల అసమానతల హిందూ సమాజం స్త్రీలను నియంత్రించటం ద్వారా కొనసాగించబడుతున్నదని గుర్తించిన అంబేద్కర్ హిందూ మత మగవ్యాఖ్యాతల పరిధి నుండి స్త్రీలను విముక్తం చేయటం లక్ష్యంగా ఈ బిల్లుకు రూపకల్పన చేసాడు.

స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ప్రజాస్వామిక విలువల ప్రాతిపదిక మీద స్త్రీలకు ఆస్తిహక్కు, విడాకుల హక్కు, దత్తత/ రక్షణ హక్కు, బహు భార్యత్వ నిషేధం అనే ఈ బిల్లు ఏక కాలంలో అటు పితృస్వామ్యాన్ని ఇటు హిందూ మతవాదాన్ని సవాల్ చేసింది. హిందూ మహాసభ, సన్యాసులు వ్యక్తిగత మత విషయంలో రాజ్యం జోక్యంగా భావించి దీనిని అడ్డుకొన్నారు. మగవాడికి కొడుకును తద్వారా ముక్తిని పొందే హక్కును ఇది నిరాకరిస్తుందని వాదించారు. భారతీయ జనసంఘ్ కూడా వ్యతిరేకించింది. భారతదేశ అధ్యక్షుడుగా ఉన్న రాజేంద్రప్రసాద్ స్వయంగా దీనికి వ్యతిరేకి. పారిశ్రామికవేత్తలు, జమీందారులు ఈ బిల్లును ఉపసంహరించుకోక పోతే రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ కు తమ మద్దతు ఉండబోదని హెచ్చరించారు. ఈ సమకాలీన సంవాదంలో జాషువా అంబేద్కర్ పక్షం వహించాడు. స్త్రీల స్వాతంత్య్రం గురించి బయట మాట్లాడుతూ దానికి హామీ ఇచ్చే హైందవకోడుబిల్లును ద్వేషిస్తున్న వాళ్ళను టక్కరులని పేర్కొన్నాడు. వాళ్ళు స్త్రీలకు శత్రువులని జాషువా నమ్మాడు. విద్య అనే కన్ను లేని స్త్రీలు అది తెలుసుకోలేకపోతున్నారని వేదన పడ్డాడు.

జాషువా దృష్టిలో హిందూ కోడ్ బిల్లు ‘ స్త్రీ జగము దుఃఖము నాపెడు శాసనం’. స్వరాజ్యం సిద్ధించింది. ఇక రామ రాజ్యమే అనుకుంటున్నారు అంతా. కానీ స్త్రీ జగము దుఃఖము నాపెడు శాసనానికి మాత్రం ప్రబలాపకారులై నాయకులే విరోధులైన పరిస్థితి. రాజేంద్రప్రసాద్ తో పాటు వల్లభాయి పటేల్, ఎస్ ముఖర్జీ వంటి వాళ్ళు ఆ నాయకుల కోవలో వాళ్ళే. ఈ పరిస్థితిపట్ల జాషువా కు కలిగిన నిస్పృహ అంతా “ నీ యెడ జాలిబూను మహనీయులు పుట్టరు, రామరాజ్యముల్ / వేయి సముద్భవించి పదివేల స్వరాజ్యము లుప్పతిల్లినన్” అన్న పాదాలలో వ్యక్తం అవుతుంది.

హిందూ మహాసభ, భారతీయ జనసంఘ్ వంటి సంస్థలు, సన్యాసులు హిందుకోడ్ బిల్లును వ్యతిరేకించటాన్నిజాషువా హిందూసమాజ సంస్కరణపట్ల వున్న విముఖతగానే భావించాడు. అది ఈ నాటిదికాదని కూడా అతనికి తెలుసు. సహగమన దురాచారానికి వ్యతిరేకంగా పనిచేసిన రాజా రామమోహనరాయ్ మీద, వితంతు వివాహాలు చేసిన వీరేశలింగం మీద, అతి బాల్య వివాహ చారాన్ని నిరసించిన హరిబిలాల్ మీద పండ్లు నూరిన పీఠాధిపతుల వారసులే వీళ్ళని సూచించాడు. ‘శాసన సభల ముందు ఘోర శపథాలతో నిరాహార దీక్షలు’ చేస్తున్న వాళ్ళను “ బిల్లులను మ్రింగు పెను జంగు బిల్లులు” అని సంబోధించి చెప్పాడు.

జాషువా కవిత్వం మొత్తంలో గాంధీని ప్రస్తావించినట్లు, ప్రశంసించినట్లు అంబేద్కర్ ను ప్రస్తావించటం, ప్రశంశించటం కనబడదు. గబ్బిలం రెండవ భాగంలో “ కల డంబేత్కరు నా సహోదరుడు మాకై యష్టకష్టాలకుం బలియై, సీమకు వోయి క్రమ్మరిన విద్వాంసుండు …” అని ఒక పద్యంలో చెప్పాడు కానీ ఆయన ఉద్యమ జీవితఘట్టాల ప్రస్తావన ఏదీ లేదు. అలాంటిది హిందూ కోడ్ బిల్లు వాద వివాదాల మీద ఇంతగా స్పందించటం కొంచం చిత్రంగానే ఉంది. స్వరాజ్యం మీద, స్వరాజ్యం వస్తే దళితుల స్త్రీల సమస్యలను పరిష్కరించే దిశగా వచ్చే శాసనాల మీద జాషువా పెట్టుకొన్న ఆశలు భగ్నం కావటం బహుశా హిందూ కోడ్ బిల్లు విరమణతోనే మొదలై ఉంటుంది. దాని పరిణామమే ‘వంచిత’లో ఈ నిరసన.

ఈ ఖండిక వున్న అయిదవ ఖండకావ్య సంపుటికి ఒక మాట పేరుతో వ్రాసుకొన్న ముందుమాటలో జాషువా “ భయకంపితమై హింసాపీడితమై యున్న ప్రజానీకానికి కవి వాక్కు ఆశాకిరణాన్నందించాలి. మిట్టపల్లాల్ని సమంచేసి చూపాలి. హింసిత ప్రజల మూకీభాష్పాలకు నోరిచ్చి రచ్చకెక్కించాలి. కవుల ఆత్మవేదనోపశమనాని కిది ఒక సాధనం. దేశం చిమ్ముతూయున్న కన్నీటి చెమ్మలే ఈ కావ్యం” అని చెప్పుకొనటం గమనించదగినది. ఆ మాటల సారం లింగవివక్ష పట్ల అతని అసహనంలోనూ, ఆ వివక్షను రూపుమాప ఉద్దేశించిన శాసనాల నిరాకరణపట్ల ఆగ్రహంలోనూ వ్యక్తం కావటం వంచిత ఖండికలో చూస్తాం. కులవివక్షకు, లింగ వివక్షకు ఉన్న సంబంధాన్ని అర్ధంచేసుకొన్న అంబేద్కర్ ఆంతర్యం హిందూకోడ్ బిల్లులో ఆవిష్కృతం అయితే దానిని ఆవాహన చేసుకొన్న కవి వేదన ఈ ఖండిక. అంబేద్కరకు ఉన్న మనసు తనకు ఉండబట్టే ఆయన స్థానంలో నిలబడ్డట్లుగా ఈ కవితాఖండికను వ్రాయగలిగాడు జాషువా. కవి వాక్కు ఆశాకిరణాన్నందించాలి కదా ! అందుకనే జాషువా హిందూకోడ్ బిల్లు విరమణ విషాదం దగ్గర కావ్యాన్ని ఆపకుండా…


“ అబలయన్న బిరుదమంటించి కాంతల
స్వీయశక్తులదిమి చిదిమినారు
సబలయన్న బిరుదు సాధించి హక్కులు
గడన చేసికొమ్ము కష్టచరిత” ….

అని స్త్రీలను పౌర ప్రజాస్వామిక హక్కుల సాధనకు ఉద్యమించమన్న ప్రబోధం తో ముగించాడు.

కేతవరపు కాత్యాయని. తెలుగులో ఎమ్మే పిహెచ్ డి. కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో పూర్వ ఆచార్యులు. అప్పుడప్పుడు కవిత్వం, కథలు రాస్తున్నా ప్రధానంగా సాహిత్య విమర్శకురాలు. ప్రక్రియలలో వచ్చిన ప్రాచీన ఆధునిక సాహిత్య రచనలపైన, ప్రత్యేకించి స్త్రీల సాహిత్యం పైన  కాత్యాయనీ విద్మహే అన్న కలం పేరుతో ప్రచురించిన సాహిత్య విమర్శ వ్యాసాలు 300 కి పైగా ఉన్నాయి. 25 పుస్తకాలు ప్రచురించారు. 28  పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. మార్క్సిజం, స్త్రీవాదం ఆలోచనకు వెలుగునిచ్చి హృదయానికి దగ్గరైన సిద్థాంతాలు. అనేక సామాజిక సంచలనాల ఉద్వేగ వాతావరణంలో సాహిత్య సామాజిక పరిశోధనలకైనా, ఆచరణ కైనా ఎప్పుడూ ప్రజాపక్షపాత నిబద్ధతే నమ్మిన విలువ. 1980లలో స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థ వ్యవస్థాపక సభ్యరాలై  స్త్రీల సమస్యలపై సామాజిక, సాహిత్య రంగాలలో పనిచేసారు. పుస్తకాలు ప్రచురించారు. దానికి కొనసాగింపుగా 2010లో  ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏర్పాటులో చురుకైన పాత్ర పోషించారు. స్త్రీల సాహిత్యచరిత్ర రచన, తెలంగాణ సాహిత్య సమీక్ష తన ఆకాంక్షలు.

Leave a Reply