మాన‌వి మహాశ్వేతాదేవికి అక్షర నివాళి

ఒక ఆదివాసేతర స్త్రీ తననకు తాను ఆదివాసీ గుర్తింపులోకి ఆవాహన చేసుకొని ఆదివాసీల మారంమాయిగా, మారందాయిగా పిలుచుకునే మహాశ్వేతాదేవి అచ్చమైన ప్రజాస్వామ్యవాది, ప్రగతిశీల రచయిత్రి. భారత దేశంలోని పేదలూ, నిరక్షరాస్యులూ, అమాయకులూ, అజ్ఞానులూ కావచ్చు కానీ వారు బుద్ధిహీనులు మాత్రం కాదని నమ్మే మహాశ్వేతాదేవి 1926 జనవరి 14న ఢాకాలో జన్మించారు. తల్లి ధరిత్రీదేవి రచయిత్రి, అనువాదకురాలు, సామాజిక కార్యకర్త, తండ్రి మనీష్‌ ఘటక్‌ కవి, రచయిత. వీరిది స్వాతంత్య్ర కాంక్ష బలంగా ఉండే కుటుంబం. మహాశ్వేత 1936-1938లో రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ స్థాపించిన శాంతి నికేతన్‌లో, 1939-1942 బెల్లాలా బాలికల పాఠశాలలో, మెట్రిక్‌, 1944లో ఇంటర్మీడియట్‌, 1946లో ఆంగ్లంలో ఆనర్స్‌ డిగ్రీ శాంతినికేతన్‌లో చదివారు. 1963లో ఆంగ్లంలో ఎం.ఎ. పట్టా పుచ్చుకున్న ఆమె కలకత్తాలోని విజయగర్‌ కళాశాలలో 1984 వరకు లెక్చరర్‌గా పనిచేశారు. ఆ తరువాత పూర్తికాల సామాజిక కార్యకర్తగా, రచయితగా పని చేశారు.

”నా రచనలన్నింటిలో నేను క్రింది స్థాయి దృష్టి కోణాల్ని పరిచయం చేసే ప్రయత్నం చేశాను” అన్న మహాశ్వేతాదేవి సాహిత్య జీవితం, బ్రిటిష్‌ సైన్యాలకు ఎదురొడ్డి 1857లో ప్రథమ స్వాతంత్య్ర రణభేరి మ్రోగించిన వీరనారి ఝాన్సీలక్ష్మిబాయి జీవితాధారంగా 1956లో ‘పరాయి పాలనను ఎదిరించిన ఝాన్సీరాణి’ అనే చారిత్రక గ్రంథంతో మొదలయ్యింది. ఈ చారిత్రక రచన కోసం ఆమె అనేక వ్యయప్రయాసలకోర్చి లక్ష్మీబాయి సైన్యంలోని వారు నివసించే బుందేల్‌ఖండ్‌ ప్రాంతంలోని ప్రజలతో మమేకమై సేకరించిన సమాచారాన్ని నవలగా రాశారు.

***

1956-1996 వరకు మహాశ్వేతాదేవి 94 సృజనాత్మక రచనలు చేశారు. ఆమె రచనల్లోని నాయికా నాయకులందరూ దోపిడీకి వ్యతిరేకంగా జరిపిన పోరాటాలకు అగ్రభాగాన నిలిచిన వారే. ”నా బాల్యం నుంచీ నేను దేనికి భయపడలేదు. స్వేచ్ఛగా ప్రవర్తించే హక్కుకే నా మద్దతు నిచ్చాను… ఆచారాలను ఉల్లంఘించాను. స్వేచ్ఛగా ప్రవర్తించడమంటే ప్రతిసారీ ఏదో తీవ్రమైనది చేయడం కాదు అది తనకు ఇష్టమైన పుస్తకాన్ని చదువుకోగలగడం అంత సాధారణంగా కూడా ఉంటుంది”అన్న మహాశ్వేతాదేవి 1965లో పలమావు (ఆబిజిళీబితి) ను సందర్శిచడం ఆమె జీవితంలో ఒక గొప్ప మలుపు. ‘పలమావు గిరిజన భారతానికి అద్దం లాంటిది’ అని ఆమె భావించారు. అణచివేత, వెట్టిచాకిరీ, నిరక్షరాస్యత గిరిజనులను ఎలా పట్టి పీడిస్తున్నాయో ఆమెకు స్వయంగా అనుభవంలోకి వచ్చాయి. ఆ అనుభవాలన్నీ ఆమె తన రచనల్లో పొందుపరిచారు. ఒక రచయితగా ఆమె కొన్ని వేల పేజీల సాహిత్యాన్ని సృష్టించారు. పోరాట యోధురాలిగా కొన్ని వందల మైళ్లు నడిచారు. వంశీకృష్ణ అన్నట్లు ‘రచన కార్యాచరణల సంగమం’ ఆమె. మహాశ్వేతాదేవి అణగారిన వర్గాల ప్రజలతో కలిసి జీవించారు. కలిసి పోరాడారు. వాళ్ల గురించి, వాళ్ళ కోసం రాస్తూ వాళ్లనామె ‘నా ప్రజలు’ అన్నారు. ఆమెను వాళ్ళు మారందాయి, పెద్దక్క అని పిలుచుకున్నారు.

***

నా రచనలు చదివాక పాఠకులకు తమ చుట్టూ ఉన్న సమాజం పైన అసహ్యం కలగాలి, ఆ అసహ్యంతో ఆ సమాజాన్ని మార్చుకునేందుకు ఏదో ఒక రూపంలో నడుం బిగించాలి’ అని చెప్పిన మహాశ్వేతాదేవి 45 నవలలను, 15 కథా సంపుటాలను 10 బాలల పుస్తకాలను, ఒక నాటక సంపుటినీ రచించారు. ఆమె రాసిన 30 పాఠ్య పుస్తకాలను ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రెస్‌ ప్రచురించింది. ఆమె ‘జుగంతర్‌’ అనే పత్రికకు సంచార విలేకరిగా పనిచేస్తూ గిరిజనుల, గ్రామీణ శ్రామికుల సమస్యలను తెలుసుకున్నారు. ‘బర్తికా’ అనే పత్రికను కూడా ఆమె నిర్వహించారు. 1997 నాటికే ఆమె శతాధిక రచనల, రచయిత్రిగా ఖ్యాతిగాంచారు.

తన జీవితాన్ని అక్షరాలకే పరిమితం చేయలేదు మహాశ్వేత. ”రచయితలంటే తన గదిలో తాను భద్రంగా కూర్చొని రాసేవారు మాత్రమే కాదని, తాను ఎవరికోసమైతే రాస్తున్నానో ఆ పీడితుల నిజ జీవితంలో వాళ్ళ కష్ట సుఖాల్లో భాగం పంచుకోవాలన్న దృక్పథం” ఆమెది. కనుకనే అభివృద్ధి ఫలాలు ఏవీ దక్కని ఆదివాసులు పీడిత, బాధిత జన సమూహాలుగా మిగిలిపోయే పరిస్థితి పోవాలని, వాళ్ళ అమాయక జీవితాల్లో చైతన్యం నింపాలని, అడవి బిడ్డల హక్కుల పాలన కోసం శ్రమించారు. వివిధ అవార్డుల ద్వారా తనకు అందిన డబ్బును గిరిజనుల కోసమే వెచ్చించారు. ఆమె కేవలం రచయిత్రిగానే కాక ఒక క్రియాశీల కార్యకర్తగా భారతీయ గిరిజన జీవిత చరిత్ర పైన చెరగని ముద్ర వేశారు.

”ఆలోచన, ఆచరణ పోరాటపరం చేసి కష్టాలను ఎదుర్కోవడానికి భరించడానికీ సిద్ధమై, తనతో తానే పోరాడుతూ, సుఖ దుఃఖాలన్నింటికీ స్పందించగలిగినప్పుడు, మానవతతో అన్ని అనుభూతులనూ ఆకళింపు చేసుకున్నప్పుడు సజీవ సాహిత్యం వచ్చే అవకాశం ఉంది” అన్న మహాశ్వేత 1930, 40ల్లో ‘గణనాట్య’ అనే థియేటర్‌ బృందంతో కలిసి పనిచేశారు. పలు చారిత్రక ఉద్యమాలను చూసిన ఆమె తన జీవిత కాలంలో ఆదివాసీ సంఘాలను స్థాపించారు. వాటిల్లో సభ్యులుగా ఉన్నారు.

తెలుగులోకి అనువదింపబడిన మహాశ్వేతాదేవి నవలలు పరాయి పాలనను ఎదిరించిన ఝాన్సీ, రాకాసి కోర, ఎవరిదీ అడవి, ఒక తల్లి, ఎతోవా పోరాటం గెలిచాడు, బషాయిటుడు మొదలైనవి. కథా సంపుటాలు: రుదాలి, శనిచరి, చోళీకే పీఛే, విత్తనాలు (రెండు కథలు) మొదలైనవి.

”చెట్లకు వేర్లు ఎంత అవసరమో, సాహిత్యం జీవితపు లోతుల్లో పాతుకొని ఉండటం కూడా అంతే అవసరం” అని అభిప్రాయపడే మహాశ్వేతాదేవి, బెంగాలీ రచయిత్రిగా భాషా తదితర అంశాలను అధిగమించి, సాహిత్యానికి సరిహద్దులు లేవని నిరూపిస్తూ భారతీయ రచయిత్రిగా ఆవిష్కృతమయ్యారు.

”నేను అభాగ్యుల పక్షాన నిలబడి నా శాయశక్తులా కలంతో పోరాటం కొనసాగిస్తున్నాను. ఆ విధంగా నాకు నేను సంజాయిషీ చెప్పుకోవలసి వస్తే తలదించుకోవలసిన ఆగత్యం ఏనాడూ కలుగబోదు” అన్న మహాశ్వేతా దేవికి లభించిన అనే పురస్కారాలలో ప్రధానమయినవి 1979 నాటి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, 1986లో లభించిన పద్మశ్రీ, 1996లో లభించిన జ్ఞానపీఠ పురస్కారం, రామన్‌ మెగసెసే పురస్కారాలు, ఇంకా చాలా గౌరవాలను ఆమె తన రచనా పటిమకుగాను అందుకుంటే, భారతీయ సమాజంలో దారిద్య్రంలో మగ్గుతూ నిరాదరణకు గురైన ప్రజల పక్షాన గొంతు వినిపించినందుకు అదే సంఖ్యలో ప్రశంసలూ పొందారు.

అభివృద్ధి ప్రక్రియకు దూరంగా ఉంచబడిన వాళ్ళంతా ఒక్కటై ఉద్యమిస్తే తప్ప ఈ దేశ పౌరులుగా వాళ్ళకు దక్కవలసింది దక్కదు అనేది ఆమె ప్రగాఢ విశ్వాసం. ఆ నమ్మకమే ఆమెను అనేక సంస్థలు నెలకొల్పేటట్లు, వివిధ సంస్థలలో క్రియాశీలక పాత్ర నిర్వహించేటట్లు చేసింది.

”మౌఖిక సంప్రదాయం ద్వారానే ప్రామాణికంగా చరిత్ర సజీవంగా మన ముందుకు వస్తుందని నేను భావిస్తాను” అన్న మహాశ్వేతాదేవి యువ రచయితలకిచ్చే సలహా ”ప్రజల మధ్యకు వెళ్లండి వాళ్ళ జీవిత సత్యాలను సేకరించండి. వాటిని విశ్లేషించి, వాటి గురించి రాసి వారి స్థితిగతులను మెరుగు పరచడానికి పోరాడండి.” ఆమెకు కలం అనేది రచయిత హోదాను పెంచే అలంకార వస్తువు కాదు. అది ఒక జ్వలన ఖడ్గమై అంధకారాన్నీ, అసత్యాన్నీ సవాలు చేస్తూ గళం విప్పలేని వారి పక్షాన నిలుస్తూ సమతౌల్యాన్ని సాధిస్తుంది.

భారతావనిలోని లక్షలాది మంది పేదల, నిర్వాసితుల శక్తిహీనుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న ఆ మహామానవి తన 90వ ఏట 28 జూలై 2016న కలకత్తాలో తుది శ్వాస విడిచారు. సమాజంలోని చీకట్లను చీల్చడానికి అనునిత్యం అనితరసాధ్యంగా సాహిత్య ప్రయాణం కొనసాగించిన ఆ యుద్ధనారి మహాశ్వేతాదేవికి అక్షర నివాళి.

(మ‌హాశ్వేతాదేవి వ‌ర్ధంతి( 28 జులై) సంద‌ర్భంగా…)

వరంగల్ ఏ.యస్.యం. మహిళా కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పదవీ విరమణ పొందారు. వివిధ సంకలనాలు, పత్రికలలో వీరి కవితలు, వ్యాసాలు, సమీక్షలు, కథలు, ప్రచురితమయ్యాయి. ప్రస్తుతం ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక తెలంగాణ శాఖ సమన్వయ కర్తగా, రుద్రమ ప్రచురణలు, వరంగల్ వ్యవస్థాపక సభ్యురాలుగా కొనసాగుతున్నారు.

Leave a Reply