మహమ్మద్ అలీ: అతని జీవితం, కాలం

ఒక రాత్రి కాసియస్ క్లే ఏడుస్తున్నాడు, ఎందుకంటే ఒక భవన పై అంతస్తులో ప్రతి సంవత్సర౦ కస్టమర్ల కోసం నీగ్రో వ్యాపారులు పెట్టే సరుకుల ప్రదర్శనలో ఎవరో తన కొత్త సైకిల్‌ను దొంగిలించారు. దానితో అతను ఏడుస్తూ కిందనున్న జిమ్ లోకి వచ్చాడు. అక్కడ ఈ విషయాన్ని పోలీసులకు కాంప్లైంట్ చేయాలనుకున్నాడు. ఆ జిమ్‌లో పోలీసు ఆఫీషర్ జో మార్టిన్ ఉన్నాడని ఎవరో చెప్పినందున కాసియస్ క్లే, అతని వద్దకు ఏడ్చుకుంటూ వచ్చి , అతని బైక్‌ను దొంగిలించిన వ్యక్తిని కొట్టాలనుకుంటున్నానని చెప్పాడు. దానికి జో మార్టిన్ “సరే, నువ్వు కొట్టబోయే వ్యక్తులకు సవాలు చేసే ముందు అసలు ఎలా కొట్టాలో, పోరాడాలో బాగా నేర్చుకో ” అని చెప్పాడు. దానితో ఆ పోలీసు ఆఫీషర్ జో మార్టిన్ సలహాతో క్లే బాక్సింగ్ ని ప్రారంభించాడు. అతను బాక్సింగ్‌ని నేర్చుకోవడడం ప్రారంభించాక , ఏదో ఒక రోజు తన తల్లి తండ్రికి ఇల్లు మరియు తన కోసం ఒక పెద్ద కారును తీసుకోవాలనేది అతని కల. క్లే తల్లి బాప్టిస్ట్ మరియు అతని తండ్రి మెథడిస్ట్ . మహిళలు ఎల్లప్పుడూ పురుషుడి కంటే మెరుగ్గా ఉంటారు, కాబట్టి మత విషయములో ఎల్లపుడు వారి తల్లిని అనుసరించమని క్లే తాత సలహా ఇచ్చిండు. దానితో క్లే మరియు అతని అన్న ఇద్దరు చర్చ్ కి పోవడం ప్రారంభించారు.

ఒలింపిక్స్ కోసం క్లే రోమ్‌కు వెళ్లవలసి వచ్చినప్పుడు అతను గాలిలో ఎగిరే భయం వల్ల విమానములో వెళ్లడానికి నిరాకరించాడు. అతను ఛాంపియన్ అయిన తర్వాత ఒక కారు తీసుకున్నాడు. పాడైనపుడు విమానం వలే 300 అడుగుల పై నుండి కారు కిందపడదు కాబట్టి విమానం కంటే కారు మంచిదని అతను ఎప్పుడూ ప్రజలకు చెప్పేవాడు. కానీ ప్రపంచ హెవీ వేయిట్ ఛాంపియన్ కావాలనుకుంటే తాను విమానంలో వెళ్లాల్సి ఉంటుందని చివరకు జో మార్టిన్ అతనిని ఒప్పించాడు.

ఒక ఫైట్ లో అతని చేతి గ్లవ్జులు సగం పాడైనప్పటికి క్లే , కూపర్‌ను ఓడించగలిగిండు. ఆ పోరాట విజయం తరువాత అతను బిగ్గరగా “ I’m not only the greatest , I am the double greatest “ అని అరిచిండు. ప్రపంచ హెవీ వేయిట్ ఛాంపియన్ గా మారడానికి అతను ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన ఫైటర్‌తో పోరాడవలసి వచ్చింది – అతడే సోనీ లిస్టన్ .1961 లో మహమ్మద్ అలీ గా మారిన కాసియస్ మార్సిల్లస్ క్లే జూనియర్ యొక్క కెరీర్ ని అత్యున్నత శిఖరాల్లోకి తీసుకెళ్లిన పోరాటమిది. సోనీ లిస్టన్‌పై అలీ విజయం ప్రేక్షకులకు పెద్ద ఆశ్చర్యం కలిగించింది. సోనీని తాకడానికి కీటకాలు కూడా భయపడేవి. సోనీ లిస్టన్ మీద విజయం సాధించిన తర్వాత అలీ పేరు ప్రతిచోటా మారుమోగింది.

అలీకి ఓటమంటే ఇష్టముండదు. 1959లో పాన్ అమెరికన్ ట్రయల్స్‌ లో ఉన్నప్పుడు అతను అమోస్ జాన్సన్‌తో ఓడిపోయాడు. పన్నెండేళ్ల తర్వాత (1971) జో ఫ్రేజియర్ చేతిలో ఓటమి అతను ఓడిపోయిన చివరి పోరాటం. 1971 లో ఓడిపోవడానికి కారణం అప్పటికి ముందు వరకి అలీకి ఐదేళ్ల జైలు శిక్ష ఖరారు అయినందున అతనికి ప్రాక్టీస్ లేదు. కారణం – 1967లో అతను వియాత్నాం యుద్ధానికి వెళ్ళడానికి నిరాకరించినందుకు బాక్సింగ్ నుండి మూడు సంవత్సరాలు నిషేధించబడ్డాడు. దీనివల్ల అలీ క్రీడా జీవితానికి చాలా ఇబ్బందులు కలిగాయి. ప్రపంచ హెవీ వేయిట్ బాక్సింగ్ ఛాంపియన్ గా తన జీవితములో అత్యున్నత స్థానములో ఉండి మంచి భవిష్యత్తు ఉన్న అలీ అపుడు అన్న మాట ‘ I ain’t got no quarrel with these Vietcongs . ఈ వియత్నామీలతో నాకు ఎలాంటి గొడవలు లేవు. వారితో నేను ఎందుకు యుద్ధం చేయాలి ?”.

మీరు మహ్మద్ అలీ విశ్వాసాన్ని, మతాన్ని అంగీకరించినా, అంగీకరించకపోయినా సరే.., కానీ అతను భాధితులైన వియాత్నామీస్ తో నిలబడి వారిని చంపడానికి నిరాకరించాడు. దీని కోసం అతను తన సకల సౌకర్యాలని , టైటిల్స్ మరియు స్వేచ్ఛను కోల్పోయాడు. జైలు శిక్షని అనుభవించాడు. మనం బహుశా అదే చేయగలిగితే దీనికి ఎంత ధైర్యం అవసరమో ఆలోచించండి ? ఒక వేరే సమూహానికి చెందిన ప్రజలపై దాడి చేయాలనే, చంపాలనే ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకించాలంటే ఎంత దైర్యం ఉండాలి ? నేను ముస్లిమ్‌ని కాదు, నల్లజాతీయురాలిని కూడా కాదు, కానీ అతను అలా యుద్ధానికి వెళ్లడానికి నిరాకరించడం నా హృదయాన్ని తాకింది. నేను అతని గురించి ఇంతకు ముందే తెలుసుకొని ఉంటే బాగుండు అని అనిపించింది. అతను జీవితాంతం తిరుగబడుతూనే ఉన్నాడు. దాని ఫలితాలు ఏమైనా స్వీకరిస్తూనే ఉన్నాడు. అయితే అతను వియాత్నమ్ కార్మికులను చంపడానికి వెళ్ళడానికి అమెరికన్ ప్రభుత్వానికి సూటిగా నిరాకరించడం అతను చేసిన గొప్ప తిరుగుబాటు . అలీ ఇలా అంటాడు ” నేను ఎక్కడికైనా వెళ్లి పోరాడాలని మీరు కోరుకుంటున్నారు , కానీ మీరు కనీసం ఇక్కడ మన దేశములో నాకోసం నిలబడరు. మొదట నాకు స్వాతంత్ర్యం కావాలంటే నా కోరికని వ్యతిరేకించేదే మీరు ? “

మహ్మద్ అలీని ఎవరు ఓడించలేకపోయారు మరియు అతని నుండి తప్పించుకోలేకపోయారు. , అతను జో ఫ్రేజియర్‌ని రీబౌట్‌లో ఓడించినాడు. ఇస్లాంలో చేరిన తర్వాత అలీ తన బానిస జాతి చిహ్నమైన తన పేరు ని మార్చుకున్నాడు. ( కాసియస్ క్లే అనేది తెల్లజాతి వారికి నల్లజాతి మహిళకి పుట్టిన సంతానానికి పెట్టిన ఇంటి పేరు.) తన పాత మూలాలని పూర్తిగా తుడిచిపెట్టుకోవడం కోసం ఇస్లామ్ మతాన్ని స్వీకరించి, కాసియస్ మార్సిల్లస్ క్లే జూనియర్ సన్నాఫ్ కాసియస్ మార్సిల్లస్ క్లే తన పేరుని ముహమ్మద్ అలీగా మార్చుకున్నాడు. ముహమ్మద్ అలీగా మారిన చాలా రోజుల తర్వాత ఒక ఫైట్ లో ఎర్నీ టెర్నెల్ తో దిగినప్పుడు అతను అలీని మానసికంగా దెబ్బతీయాలని మరియు జాత్యాహంకారంతో బానిస పేరుతో పిలిచినప్పుడు , అలీ ప్రతిస్పందనగా “ప్రపంచవ్యాప్తంగా నా పేరు ఏమిటి?” అంటూ కొడుతూ ఓడిస్తూ, అతను “ ముహమ్మద్ అలీ “ అని పిలిచే వరకు టెర్నల్ మీద దెబ్బల వర్షం కురిపించాడు.

Mohammad Ali – His life and times అనే జీవిత చరిత్ర పుస్తకముని Thomas Hauser , అలీ జీవితంలోని అన్ని పోరాటాలు , బాధలు మరియు అతని అన్ని రకాల ప్రయత్నాలలో ఎదుర్కొన్న ఇబ్బందులని ఎంతో హృదయాన్ని తాకే పదాలతో రాసిండు. ఈ పుస్తకం అతను చిన్నతనము నుండి ఎదుర్కొన్న అన్ని క్రూరమైన వివక్ష మరియు జాత్యహంకారాలను అధిగమించి సాధించిన విజయాలు మరియు పొందిన ఆనందాల గురించి అధ్భుతంగా వివరిస్తుంది. నిర్దిష్టమైన తేదీ రికార్డులతో పాటు ప్రతి ఫైట్ లో మహ్మద్ అలీ యొక్క ప్రత్యర్థుల ప్రస్తావనని రికార్డ్ చేసింది. మొదటినుండి అలీ తన జీవితం పట్ల ఎంత ఖచ్చితమైన వైఖరితో నిర్ణయాలతో ఉన్నాడో మరియు ఎలా భిన్నంగా వ్యవహరించేవాడో ఈ పుస్తకం చెపుతుంది. అతను పరాజయాలను రుచి చూసినప్పుడు కూడా అతని మనసు మారదు, దైర్యముని కోల్పోడు. బదులుగా అతను ప్రతిసారీ మరింత దృఢంగా తయారు అవుతాడు. అతను ఏదైనా గొప్పగా చేయాలని మరియు వైవిధ్యం చూపాలని కోరుకుంటాడు. అతను అలాగే చేశాడు కూడా. ఈ పుస్తకంలోని అధ్యాయాలు ఒక వరుస క్రమంలో లేవు. మహ్మద్ అలీ పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడే విషయాన్ని వివరించే చివరి అధ్యాయాలలో నేను ఈ పుస్తకం చదువుతూ ఏడ్చాను. విషాధం మరియు విచిత్రం ఏమిటి అంటే – అనేకమైన వివక్షతలను, హేళనలను , అడ్డంకులని ఎదుర్కొని గెలుస్తూ నిలబడుతున్నంత కాలం…, అతనికి వాయిస్ ఉన్నప్పుడు వాళ్ళు(అమెరికన్స్ ఇతర శ్వేత జాతి జనం) అతనిని ద్వేషిస్తారు. పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడడం మొదలై అతను తన జీవితంలో నిశ్శబ్దం అయిన తరువాత మాత్రం ఒక్కసారిగా అతను జాతీయ సంపదగా మారతాడు.

మహ్మద్ అలీ తన జీవితంలో ఏ రూల్స్ మరియు నిబంధనలకి తలవంచలేదు. వాటికి వ్యతిరేకంగా పోరాడాడు. ఇతరులు అవసరమని అనుకునేది, గొప్ప అని పిలిచేది ఏది అతను చేయలేదు. తనకు అవసరమైనది చేశాడు. మీరు ఈ పుస్తకాన్ని చదివితే ఇష్టపడతారు. ఒక వ్యక్తి తన జీవితాన్ని ఎలా మార్చుకోగలడో మనం చూస్తాం. ఈ పుస్తకం చదువడం ద్వారా అలీ దిగ్గజంపై నాకు ఎంత ప్రేమ కలిగిందో మాటల్లో వివరించలేను.

స్వస్థలం మంచిర్యాల, విద్యార్థిని. పుస్తకాలు చదవడం, డ్రాయింగ్, కవిత్వం రాయడం హాబీలు. ఐదో తరగతిలో " ఫేమస్ ఫైవ్ " అనే పుస్తకాన్ని చదివిన తరువాత సాహిత్యం పట్ల ఆసక్తి పెరిగింది. చదువుతో పాటు మానసిక పరిణితి కోసం సాహిత్యాన్ని చదువుతోంది.

One thought on “మహమ్మద్ అలీ: అతని జీవితం, కాలం

Leave a Reply