నేనెవర్నీ అని ప్రశ్నించుకోవడంతో నా రచన మొదలయ్యింది – మహమూద్

 1. మీరెక్కడ పుట్టి పెరిగారు? మీ కుటుంబ నేపధ్యం వివరించండి?

జ: 1971 లో పుట్టి పెరగడం, నివసిస్తూ ఉండడం (బహుశా గిట్టడం కూడా) కడపజిల్లా ప్రొద్దుటూరు పట్టణం . అమ్మ ఎస్పీ హస్మత్ బీ, నాయన ఎస్పీ అహమ్మద్ హుసేన్. వారికి కలిగిన మూడో సంతానాన్ని. నాయన మునిసిపల్ రిటైర్డ్ ఉద్యోగి. అమ్మ ఆర్థడాక్స్ గృహిణి. మధ్యతరగతి ముస్లిం కుటుంబం. నాయన అహమ్మద్ హుసేన్ క్రమశిక్షణ, సమయపాలన విషయంలో గట్టిగా ఉండడమే గాక ఈ సమాజ స్టాండర్డ్స్ ప్రకారం నిజాయితీ పరుడు. డ్యూటీ మైండెండ్. ఇవేవీ నా విషయంలో వర్తించవు. నిజానికి ఇప్పటకీ నేను నిరుద్యోగినే. నాయన పెన్షన్ డబ్బులే జీవనాధారం. బిఈడీ దాకా ఎగుడుదిగుళ్ళ చదువు. ఒక రకంగా ఒక లక్ష్యం లేని బతుకు. అలాగని అరాచకం కాదు. ఉద్యోగాల కోసం ప్రయత్నించింది తక్కువే. ఉపాధి అవకాశాలు అస్సలు రాలేదని కాదు చిన్న వ్యాపారం మొదలుపెట్టి నా అలసత్వమూ,.తప్పుల వల్ల చిందరవందర చేసుకున్నాను. ప్రస్తుతానికి గత పదేళ్ళుగా ఒక చిన్న పాఠశాల నడుపుతున్నాను. ఇందులో ఎన్ని రోజలుంటానో తెలియదు. అమ్మా నాయనా లౌక్యం లేని మనుషులు దానికి తగ్గట్టుగానే నాకూ లౌక్యం తెలియదు. ఇతరులకు హాని చేయనితనం తప్ప ఇంకే గొప్ప లక్షణాలు లేవు. 1971 నుంచి బాబ్రీ విధ్వంసం దాకా సాఫిగా సాగిన ఒక అందమైన జ్ఞాపకం నా జీవితం. మత, కుల వాసన తెలియని పరమత, కుల స్నేహితుల సాంగత్యంలో హాయిగా సాగిన బాల్యం. విపరీతమైన ఆటలు ఇంటిపట్టున ఉండడం తెలియదు. సినీ గీతాలు సినిమాలు బాగ్తమాషాలూ ఓ విహారయాత్ర లా సాగింది అప్పటి దాకా! సాయబునై ఉండి శంకరాభరణం పాటలు పాడుతుంటే మా ప్రైమరీ టీచర్లు చప్పట్లు కొట్టేవారు. రోజూ పాడించుకొని ఆనందించేవారు. బాల్యంలో దగ్గరకు తీసి చదువుచెప్పిన తుంగమ్మ బ్రాహ్మణ స్త్రీ. కుల మత భేషజాల పాత్ర శూన్యం. అంతెందుకూ మా ఇంటి డాక్టరు మా అమ్మకు అల్లా తర్వాత అంతటోడు వెంకటరమణాచార్లు పదహారణాల బ్రాహ్మణుడు. అప్పటి గొప్ప మిత్రులు మల్లి, రాజేశ్వర్, శ్రీను, ఇండ్లల్లో కిచెన్ రూంలలోకి నేరుగా వెళ్ళి కావలసింది తీసుకొని తినేంత చనువు. అడిగి పెట్టించుకుని తిని అరగాయించుకున్న అభిమానం. వాళ్ళ అక్కల పెళ్ళిళ్ళు భుజాల మీద వేసుకొని చేసిన చతురత. ఒక్క రోజు వాళ్ళ ఇళ్ళకు పోకపోతే వాళ్ళకు వెలితి అనిపించేలా చేసిన చురుకుదనం. అహ్! ఏం రోజులవి. బాబ్రీ మశీదు విధ్వంసానికి వెళ్ళి వచ్చిన మనిషిని కూడా మార్చగలిగిన మంచితనం. కాలం అన్నీ తలకిందులు చేసింది.

కశెట్టి చిన్న వెంకట సుబ్బయ్య హైస్కూల్ లో ఆరోతరగతి ఓ మతాహాంకారి మాస్టారి చేతిలో చావుదెబ్బలు. స్వేఛ్ఛగా తిరిగి చెడిన నాకు క్రమశిక్షణని కర్రసాయంతో నేర్పచూశాడతను. అభద్రతా భావపు తొలి రుచి. ఆ తర్వాత నేరుగా విహెచ్పీతో సభ్యుడుగా ఉన్న లెక్కల మాస్టారి చేతిలో సాయబునై అతడి బోధనని ప్రశ్నించినందుకు బడిత పూజ. అదే పాఠశాలలో బాగా దగ్గరకు తీసిన తెలుగు మాస్టరు కృష్ణమూర్తి, ఆంగ్లం మాస్టారు శాంతారావు, సోషల్ మాస్టారు రసూల్, సైన్సు మాస్టారు నారాయణరెడ్డి, లెక్కల మాస్టారు జలీల్ ( పిల్లలందరి హీరో. టీచర్ అంటే ఇలా ఉండాలి అనిపించిన ఆయన పిల్లలను శిక్షించని ఏకైక మాస్టారు)

బాబ్రీ విధ్వంసం దగ్గర ఆకస్మికంగా అంతా తలకిందులు. నన్ను నేనే నేనెవర్నీ? అని ప్రశ్నించుకోవడంలో భాగంగా నేను నేను కాను అని కవిత రాసుకున్నాను. పాత స్నేహితులు మెల్లగా కనుమరుగై కొత్త సావసగాళ్ళూ, ప్రపంచాన్ని నిలేసే ప్రశ్నించే సాహసగాళ్ళు మిత్రులై భిన్నమైన ఆలోచనలతో అక్కున చే‌ర్చుకున్నారు. కోయంబత్తూరు బాంబు బ్లాస్ట్ ల తర్వాత రెండేళ్ళు భయంకరమైన డిప్రేషన్. సగటు మానవుడి దేశభక్తి మూఢదేశభక్తి ముందు ఓడిపోయిన ఒకానొక పీడకల. మన దేశం మనవాళ్ళు అని గుండెల్నిండా నింపుకున్న ప్రేమ పర్వతం కరగడం ప్రారంభమైంది. స్వాతంత్య్ర పోరాటంలోని హీరోలందరూ ఏమైపోయారు? గాంధీ నెహ్రూ భగత్సింగ్ అప్పటి హీరోలు. వారి స్థానంలో వేరెవరెవరో అప్పటి దాకా తెరమీద లేని పేర్లు ముందుకొచ్చి పాత చరిత్రని తూలనాడడం మొదలై నా అస్థిత్వం తో పాకిస్తాన్ ముడిపడడం తో పాటు గోడల మీద బ్రౌన్ అక్షరాలతో రాడికల్స్ నినాదాలు వెలసిపోయి మన జీవితానికీ, మన భౌతిక పరిస్థితులకూ సంబంధం లేని ముసల్మాన్ కే దోహి స్థాన్ పాకిస్థాన్ యా కబరస్థాన్ వంటి నినాదాలు వినడం మొదలయ్యింది. ఆశ్చర్యం ఏమిటంటే రమణారెడ్డి, వరదరాజుల రెడ్డి మధ్య ఫ్యాక్షన్ గొడవలు భయపెట్టని మాకు ఈ నినాదాలు అభద్రతకు లోను చేయడం మొదలైంది. అక్కడ నుండి మొదలైన సంఘర్షణ ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ మధ్య లో 1994 లో మిత్రజ్యోతి సాహితీసంస్కృతిక సంస్థ తో సభ్యత్వం. వ్యవస్థాపక సభ్యుడు బాషకూ నాకూ మధ్య గొప్ప దోస్తీ ఈ నేపధ్యంలోనే సిపిఐ, విరసం, ఎపిసీఎల్సీతో పరిచయం. ఇక అక్కడ నుండి వామపక్ష ఆలోచనాధారలో ఇప్పటికీ తలమునకలు. ఇక్కడ నా జీవితంలో రెండో దశ ప్రారంభమైంది. ఏ రాజకీయాలు ప్రజలవీ ఏవి కావు అనే క్లాస్ ఔట్ లుక్ వచ్చింది. అది నా రచనల మీద ప్రభావం వేసింది.

 1. మీరు ఎప్పటి నుంచీ కవిత్వం రాస్తున్నారు? ఎందుకు రాయాలనుకున్నారు?

జ : 1993 లో ఓ ఆర్నెల్ల పాటు ఉపాధికోసం సౌదికి పోయివచ్చాను. అక్కడ పడ్డ యాతన నన్ను కవిని చేసిందేమో? అక్కడ నా రాత్రి వెళ్ళిపోయింది కవిత రాసాను. ఒక నోట్ బుక్ లో రాసుకునేవాణ్ణి. అది పోయింది కానీ అందులో డెబ్బై దాకా కవితలుండేవి. కథారచయిత దాదాహయాత్ ( మా బావ) వల్ల ఆధునిక సాహిత్య పరిచయం. ఆయన శ్రీశ్రీ పిచ్చోడు. నేనూ ఆయన తమ్మడు కవి, నా దోస్త్ దాదాఖలందర్ సాహిత్యం లో అఆ లు దాదాహయాత్ వద్దే నేర్చుకున్నాం.1994 నుండి రాస్తున్నట్టు లెఖ్ఖ. విరసంతో పరిచయం నా కవిత్వాన్ని స్పీడప్ చేసింది. ఎందుకు రాయడం? అంటే బతుకులోని ఘర్షణ అనివార్యంగా రాయడానికి చోదక శక్తిగా పని చేస్తుంది కదా! సామాన్యమానవుడి ఘర్షణ ప్రజాస్వామిక పోరాటాల్లోనూ సాహిత్యకారుల వ్యక్తీకరణలోనూ బహిర్గతమౌతాయి. రాయగలిగిన వారు రాస్తున్నారంటే రాయించగలిగే ఆర్థిక సాంస్కృతిక పరిస్థితిలున్నాయని అర్థం. నా విషయంలోనూ అదే జరిగింది. కాకపోతే కాల్పానిక సృజనలోనూ కళాత్మక వ్యక్తీకరణలోనూ తరతమ బేధాలుండవచ్చు.

 1. మీరు ఎలాంటి కవిత్వాన్ని ఎక్కువగా ఇష్ట పడతారు?

జ: ఇలాంటిదని ఏమీ లేదు కానీ. ఒకప్పుడు తిలక్ అమృతం కురిసిన రాత్రి ని బాగా చదివాను. తర్వాత శ్రీశ్రీ, శివసాగర్, గద్దర్, శివారెడ్డి తరహా కవిత్వం పై మక్కువ పెరిగింది. సముద్రుడు రాసిన కవిత్వం బాగా ఇష్టంగా చదువుకున్నాను. కౌముదీ చనుబాల ధార నా చేత బాగా విప్లవ కవిత్వం రాయించింది. అతడికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. అప్సర్,కొప్పర్తి, త్రీశ్రీ,.కలెకూరి ప్రసాద్ కవిత్వం చాలా భిన్నంగా అనిపించేది. అనామధేయుడు ఆల్ టైం ఫెవరైట్. ఆయన రాసిన జంగే కాశ్మీర్ దీర్ఘ కావ్యానికి నామకరణం నేనే చేశాను. ముస్లీం కవులలో ఖాదరన్న పుట్టుమచ్చ ను చెత్తో పట్టుకొని కొన్ని రోజులు తిరిగాను. స్కై జగ్నేకి రాత్, షాజహాన కవిత్వం చాలా ఇష్టం. అఫ్సర్ అన్న వలస, యాకూబ్ అన్న కవిత్వంలో సరళత చాలా ఇష్టం. నీలిమేఘాలు కవిత్వం చదవడం గొప్ప అనుభవం . చిక్కనౌతున్న పాట దళిత కవిత్వాన్ని దగ్గర చేసింది. నా మనసుకు దగ్గరగ అతి దగ్గర గా మోహన్ కిటికీపిట్ట ఎప్పటికీ ఉంటుంది. ఇటీవల నరేష్కుమార్ సూఫీ, మెర్సీ, పల్లిపట్టు, గీతావెల్లంకి, నిర్గుణ్, తెలుగు వెంకటేష్,వైష్ణవి, సివిసురేష్ కవిత్వం బాగా చదువుతున్న. విరసం మిత్రులందరి కవిత్వం ఇష్టమైందే. మునాసు వెంకట్ మెద తెలంగాణ నుడికారాన్ని ఆకాశానికెత్తింది. ఇలాంటివి రాయాలి ఎవరైన అనిపించింది. మన తెలుగు కవిత్వం ఎంత భిన్నంగా సాగుతుందో కదా అనిపిస్తోంది. వీరినంతా చదువుతుంటే.

4.ఎలాంటి వస్తువుల్ని మీరు ఎక్కువగా కవిత్వీకరిస్తారు?

జ: నాకు తెలియకుండానే ముస్లీంవాద కవిత్వం ఎక్కువ రాశాను. విప్లవ కవిత్వం రాయడం ఓ పని నాకు. పరిణామాల దృష్ట్యా రాయలసీమ కవిత్వం రాస్తున్నాను. దృష్టికి వచ్చిన అంతర్జాతీయ పరిణామాల్ని కవిత్వీకరిస్తున్నాను. బహుజన కవిత్వం కూడా రాస్తున్నాను. స్త్రీవాద కవిత్వం అనను కానీ స్త్రీ బేస్డ్ కవిత్వం కూడా రాసాను. విప్లవం నా మనసుకు దగ్గరైన వస్తువు.

 1. మీరు ప్రేమ కవిత్వాన్ని ఎక్కువగా రాయటానికి కారణాలేమైనా ఉన్నాయా?

జ: నేను మొదట ముస్లీం ఓరియెంటేషన్ ఉన్న ప్రేమ కవిత్వాన్ని ఇంటెన్షనల్ గానే రాసాను. ముస్లీంలవి విఫల ప్రేమలు. అవి తీరం చేరవు. దానికి వెనుక ఉన్న ఆర్థిక సాంస్కృతిక విషయాలని చెబుదామని ప్రయత్నించాను. ఆ నేపధ్యంలో ప్రేమ కవిత్వం రాసాను.

 1. విప్లవానికి ప్రేమకి అవినాభావ సంబంధం ఉందనుకుంటున్నారా?

జ: ప్రేమికులు కాని విప్లవకారులెవరూ? మార్క్స్ దగ్గర నుంచి మొదలుకొని చే, భగత్సింగ్ దాకా అందరూ గొప్ప ప్రమికులే కదా! అందులోనూ స్త్రీ ఔన్యత్యాన్ని నిలబెట్టిన ప్రేమికులు. నా విప్లవ ప్రేమకవిత్వంలో ఆచరణలో వారు పడే ఘర్షణ ప్రధాన ఇతివృత్తం. అందులోనూ మహిళా విప్లవకారులని ప్రధాన పాత్రని చేశాను. ఇది ఫక్తు కాల్పానిక కవిత్వమే! ఈ తరహా కవిత్వం విప్లవాన్ని రోమాంటిసైజ్ చేయడం అనే అపవాదును మోస్తుందేమో తెలియదు. ఇలాంటి కవిత్వం రాయాలా వద్దా అనే మీమాంస లో ఉన్నపుడు రాయాల్సిందేనని చెప్పింది పాణి. విప్లవంలోని ప్రజాస్వామికతే నా దృష్టిలో ప్రేమంటే! అందులో స్త్రీ పురుషులు సమానం అనే మానవీయ కోణం ఉంది.

 1. ప్రేమని విప్లవాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు?

జ: నేను ప్రత్యేకంగా బ్యాలెన్స్ చేసేదేముంది. అది విప్లవంలోనే ఉంది. చాలా ప్రేమలు ఆచరణలో భాగంగా మొగ్గతొడిగి చాలా రకాల బ్యారియర్స్ ని కూలగొట్టివే కదా! అర్థాంతరంగా అమరత్వం పొందిన విప్లవకారులవి కూడా చాలా కథలున్నాయి. ప్రభాకర్, ఆర్కేలదీ అదే కదా!

 1. ఇప్పటి తరం రచనలు సమాజానికి దగ్గరగా ఉంటున్నాయా? సమాజానికి ఎంత వరకూ ఉపయోగపడుతున్నాయి?

జ: సీరియస్ రచయితలవి సమాజానికి దగ్గరగానే ఉంటున్నాయి. లోతు విషయంలోనే వెనుకబాటుతనం. అధ్యయనం జరగాల్సినంతగా జరగడం లేదు అనిపిస్తోంది. జనంతో నేరుగా యాక్సెస్ లేకపోవడం వల్ల ఈ సమస్య వచ్చిందా? జీవితానికి సంబంధించిన అనేక రాజీలలో కూరుకుపోవడం వల్ల కాబోలు రచయితలు జనం తో తెగతెంపులు చేసుకున్నట్టే ఉంది. చాలా ఇతివృత్తాలు క్లియర్గా ఉండకపోవడానికి ఇదే కారణమేమో. పైపైన తడిమి ముందుకు వెళ్ళిపోతున్నారు. వైయుక్తిక సమస్యలనే ప్రధాన సమస్యగా భావించడం వల్లా ఈ లోపం ఉందా అనేది ఆలోచించాలి. సామాజిక సంక్షోభాలు ముసురుకుంటున్నంత వేగంగా వాటి వెనుక గల కారణాలను భిన్నమైన పార్స్వాల నుంచి అర్థం చేసుకొని రాయాల్సిన అవసరాన్ని రచయితలు గుర్తించాలి. ఇదీ ప్రతి తరానికీ తప్పదేమో. జీవితాన్ని అతి దగ్గర నుండి చూసేదీ లేదా మాగ్లిఫై చేసే భూతద్దం కాల్పానిక సాహిత్యమే! ఆ విషయంలో జరగాల్సినంత కృషి జరగడం లేదు. ఈ విషయంలో విప్లవకథ, కవిత్వం నా దృష్టిలో ముందున్నాయి.

 1. ఇప్పటి రాజకీయ ధోరణిని మీరెలా సమర్ధిస్తారు?

జ: భిన్న శత్రు వర్గాల రాజకీయాలను ఏ దృష్టికోణంతో చూడాలో అదే కోణం నుంచి చూస్తున్నాను. భారతదేశ రాజకీయాలు చాలా కీలకమైన దశలో ఉన్నాయి. ఫాసిస్టులెప్పుడూ ధనికవర్గాల కొమ్మే కాస్తారు. అటు ఇటలీ, జర్మనీ రెండింటిలోనూ అదే కదా జరిగింది. ఆ దశ ప్రిమిటీవ్గా మన దేశంలో ఉందిప్పుడు. దానికి సమాంతరంగా అది ముందుకు తెస్తున్న సామాజిక సంక్షోభాలను ఎదుర్కొనే ప్రజల వైపు నిలబడే విప్లవకర ఆచరణ వైపు నుండే ఈ పరిణామాలను అర్థం చేసుకోవడం తప్ప ఇంకో మార్గం లేదు. మన జాతి ఎంత తొందరగా ఆ వైపు అడుగులేస్తే అంత తొందరగా విముక్తి లభిస్తుంది. విశాలమైన దేశం కావడం భిన్న సామాజిక సమూహాలు వారి వారి సమస్యలతో ఏక కాలంలో ముందుకు రావడం వీటన్నింటిని శత్రుపూరితంగా చూసే ఫాసిస్టు అనుయాయులుండడం ఇంత సంక్లిష్ట రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకోవడం సులభమైన విషయం కాదు. కానీ తొందరలోనే అటూ ఇటూ రెండు శత్రు వర్గాలు ఎదురెదురుగా నిలబడే పరిస్థితులు రాబోతున్నాయి. మనం ఎటు వైపో తేల్చుకునేలా చేస్తాయి.

 1. మీరింతవరకూ ఎన్ని రచనలు చేశారు? కవిత్వం, కథలు ఎన్ని రాశారు?

జ: కథలు ఓ పదమూడు, కవితలు ఎన్నో గుర్తులేవు. చాలా పొగొట్టుకున్నాను. నేనింతవరకూ పుస్తకం వేసుకోలేదు. అన్నీ కుదిరితే ఈ సారి నెల్లూరు విరసం మహాసభల్లో పుస్తకావిష్కరణ ఉండవచ్చు. ఆ పని జరుగుతోంది.

 1. మీ పైన ఎవరి ప్రభావమైనా ఉందా? ఉంటే ఎంత వరకూ ప్రభావితం చేసింది?

జ: ఎందుకుండదూ? కాలం మారే కొద్ది ముందుకొచ్చే కొత్త మార్పుల ప్రభావం అందరిపైనా ఉంటుంది. ఇటీవల రాస్తున్న నరేష్కూమార్ సూఫీ ప్రభావం కూడా నా పై ఉంది. అయితే అది రాయడం కోసం ఉసికొల్పడం వరకే! ఎవరినీ కాపీ కొట్టను. అయితే శైలి పరంగా సూఫీల పొయెట్రీ ప్రభావం బలంగా ఉంది నాపైన! ఇటీవల సూఫీజం కవితలు చాలానే రాసాను. కొన్నింటికి మంచి పేరు కూడా వచ్చినట్టుంది.

నివాసం విజయవాడ. కవయిత్రి, అధ్యాపకురాలు, జర్నలిస్టు. 2015 నుంచి కవిత్వం రాస్తున్నారు. 2019 లో ' ఏడవ రుతువు' కవితా సంపుటి వచ్చింది.

10 thoughts on “నేనెవర్నీ అని ప్రశ్నించుకోవడంతో నా రచన మొదలయ్యింది – మహమూద్

 1. ఇంటర్వ్యూ చాలా బాగుంది.
  మహమూద్ కవితా సంకలనం కోసం ఎదురుచూస్తుంటాం.

  జంగ్ ఏ కశ్మీర్ వడ్డెబోయిన శ్రీనివాస్ దీర్ఘకవిత అనుకుంటాను. ఒకవేళ నేనే పొరబడ్డానా?

  1. అవును. కానీ ఆ కవితకి నామకరణం నేనే చేశాను.

 2. సమాధానాల నిడివి ఎక్కువయ్యింది. అయినా ఇంటర్వ్యూ బాగుంది. మహమూద్ కవితా సంకలనం రావడం మంచి వార్త.

 3. అభినందనలు 👍ఇంటర్వ్యూ బాగుంది… మీ కవితా సంకలనం కోసం ఎదురుచూస్తున్నా👍👍

 4. తేటతెల్లం అక్షర బావుటా. దాపరికం లేకుండా

 5. మహమూద్ గురించి తెలియని విషయాలు తెలిశాయి. ఆయన ఆలోచనా ధోరణి అర్ధమైంది. ఇంటర్వ్యూ బాగుంది.

 6. అవును,నేను ఇటీవల చదివిన అన్ని కవితలూ రూపంలోనూ,సారంలోనూ అత్యుత్తమంగా వున్నాయి.కథలు రాసినట్టు ఇప్పుడే తెలిసింది.మంచి ఇంటర్వూ.అభినందనలు.

Leave a Reply