మళ్ళీ ఒకసారి

నక్షత్రాలు కవాతు చేసే రహదారి మీద
ఎర్ర పావురాలు మోసుకెళ్ళే స్వప్నాల్లోంచి
రాలిపడిన రక్తంరంగు స్వప్నమేదో
అక్కడ నిటారుగా నిలబడి వుంది

అడవిలో తెగిపడిన ఊపిరి
అక్కడింకా బతికే వుంది
అజ్ఞాతాన్ని బద్దలుకొట్టిన పేరు
ఆ స్తూపం మీద స్వేచ్ఛగా ఎగురుతోంది
రెక్కలొచ్చిన అక్షరాల్ని తడుముతుంటే
గుండెల్లో అగ్నిపూలచెట్టు ఆడుతోంది

అక్కడ
ఒక సంవత్సరాన్ని కని
కాలం ప్రాణాలు పోగొట్టుకుంది

స్తూపం మీద ఎగిరే
పొద్దురంగు జెండా నీడను పరుచుకుని
కూలీ ఎవరో నిద్రపోతున్నాడు

ఆ కట్టడం ఇంకా
పచ్చిగానే వుంది
లోపలెక్కొడో చిక్కుకున్న నెత్తుటి పాట
దాని పచ్చిదనానికి హామీ ఇస్తోంది
ఏ ప్లీనరీ రహస్య ప్రసంగం కోసమో
వర్తమానం అందుకున్న గాలి
స్తూపం చెవుల దగ్గర తచ్చాడుతోంది

పాలపిట్ట ఒకటి
తన పొడవాటి ముక్కుతో
విరిగిన పాటలగూడును సర్దుతోంది

జేగురు వర్ణపు కొండల మాటున
అస్తమించినట్టే అస్తమించి
సూర్యుడు
మళ్ళీ స్తూపంలోంచి పైకి లేస్తున్నాడు

జననం: ఒంకులూరు, శ్రీకాకుళం జిల్లా. కవి, రచయిత, ఉపాధ్యాయుడు.  వివిధ పత్రికల్లో కవితలు, అభినయ గేయాలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి.

Leave a Reply