ప్రతి రచయితకు వారి ప్రాతినిధ్య రచనలు కొన్ని వుంటాయి. ఒక్కో రచయిత పేరు చెప్పిన వెంటనే వొక కవితో కథో నవలో నాటకమో గుర్తుకొస్తుంది. కొందరికి అది వారి యింటి పేరయిపోతుంది. దాసరి శిరీష పేరు చెప్పగానే నాకు చటుక్కున గుర్తుకు వచ్చే కథ ఆమె 2003 లో రాసిన ‘మరో మలుపు’. దాదాపు నాలుగు దశాబ్దాల సాహిత్య జీవితంలో శిరీష నలభైకి పైగా కథలు (కొత్త స్వరాలు, మనో వీధి సంపుటాలు), వొక నవల (దూర తీరాలు) రాసినప్పటికీ తక్కినవన్నీ వొక యెత్తు ‘మరో మలుపు’ వొక యెత్తు. తనదైన జీవిత దృక్పథాన్ని యీ కథ ద్వారా నమోదు చేశారు శిరీష. ఆమె కథల్లో యెక్కువ భాగం సామాజిక అసమానతల చుట్టూ స్త్రీల సమస్యల చుట్టూ స్త్రీ పురుష సంబంధాలు చుట్టూ చెదిరిన బాల్యం చుట్టూ తిరుగుతూ వుంటాయి. సమస్యని చూడటంలో ఆమె దృష్టి తీక్ష్ణమైందే కాదు సమగ్రమైంది, విలక్షణమైంది కూడా అని ఆమె రచనలు చూస్తే తెలుస్తుంది. ఆమె వ్యక్తిత్వమే ఆమె సాహిత్యంలో ప్రతిఫలించింది అన్నా తప్పు కాదు. కథ చదువుతుంటే ఆమెతో మాట్లాడుతున్నట్టే వుంటుంది. ఆమె జీవన శైలీ సాహిత్య శైలీ సంవదిస్తాయి అని చెప్పడానికి సిసలైన వుదాహరణ ‘మరో మలుపు’.
ఉద్యోగిని అయిన ఆధునిక స్త్రీ మనోభావాలకు అద్దం పట్టిన కథ యిది. స్త్రీ పురుషుల మధ్య సంబంధాలు బలంగా వుండాలంటే కాపాడుకోవాల్సిన విలువల గురించిన సున్నితమైన అంశాలెన్నిటినో యీ కథ లోతుగా ప్రస్తావించింది. పితృస్వామ్య సమాజంలో వైవాహిక జీవితంలో ఎదురయ్యే సమస్యల మూలకారణాల గురించి, వాటి పరిష్కారానికి యెంచుకునే మార్గాల గురించి సూక్ష్మంగా వివేచన చేసింది. పదిమందికి మంచివాడిగా వుండే మగవాడు మంచి భర్తగా వుండలేకపోడానికి కారణమౌతున్న సామాజిక వ్యవస్థల గురించి, విలువల గురించి శిరీష యీ కథలో చర్చకు పెట్టారు. స్త్రీల చదువు – ఉద్యోగం – తెలివితేటలూ యేవీ పురుధిపత్య కుటుంబంలో గౌరవం యివ్వవనీ, ఇంటి పనితో పిల్లల పనితో వుద్యోగంతో స్త్రీలు యింటా బయటా మరింత హింసని అనుభవిస్తున్నారనీ ఆవేదనతో దాదాపు యిరవై యేళ్ల కింద శిరీష రాసిన ‘మరో మలుపు’ యివాళ్టికీ ప్రాసంగికంగానే వుంది. అదీ అసలైన విషాదం.
కథలో వస్తువు : అరుణ, విమల అనే యిద్దరు సహోద్యోగినులైన స్త్రీల దాంపత్య జీవితంలో తలెత్తే సమస్యలు, వాటికి భిన్న పరిష్కారాలు.
అరుణ భర్త కుమార్. అందరిలాగే సాధారణమైన మగవాడు.
‘మగవాడు మంచి కొడుకు, మంచి అన్నయ్య, మంచి ఆఫీసరుగా మాత్రమే ఉంటాడు గాని మంచి భర్తగా ఉండటానికి ప్రత్యేకంగా ఏమీ కష్టపడు’
కుమార్ పూర్తిగా అటువంటివాడే. ‘తక్కువ సమయంలో ఎక్కువ పనులు భార్య చెయ్యాలని అనుకునే అతను భార్య పట్ల ప్రేమానురాగాలు చూపించడానికి మాత్రం సమయం లేదంటాడు.’ దర్జాగా కాలు మీద కాలేసుకుని సిగరెట్లు తాగుతూ భార్య చేసే పనుల్లో వంకలు వెతుకుతూ వుంటాడు.
‘పెళ్ళైతే మగవాడికి బాధ్యతలు పెరుగుతుంటాయోమో గాని చాకిరీ అంటూ ఏమీ పెరగదు. అంతకు ముందు తల్లీ చెల్లెలూ చేసి పెట్టే పనులన్నీ భార్య సునాయాసంగా చేయాలనుకుంటాడు.’
ఇది అతని గురించి అరుణ కంప్లైంట్. భార్య అనారోగ్యంతో బాధపడుతున్నా అతనికి కనీసం సానుభూతి వుండదు. పట్టింపు వుండదు.
విమల జీవితం అందుకు పూర్తిగా భిన్నం. ఆమె భర్త ప్రసాద్ చాలా అనుకూలుడు. పిల్లల పెంపకం దగ్గర నుంచి ఇంటి పని వంట పని అన్నీ చేస్తాడు. చూసినవాళ్ళెవరైనా ముచ్చటపడే ఆదర్శ దాంపత్యం వారిది.
“ఇది మగ పనీ, ఇది అడ పనీ అని విభజించుకోం. పనిపిల్ల ఉన్నాసరే వంట ఇంటి శుభ్రతా బట్టల పనీ ఇలా ఏ పనులయినా ఎవరికి వీలయినప్పుడు వాళ్ళు చేసుకుంటాం. పిల్లలకి అలాగే నేర్పుతున్నాం. అందుకే అరోపణలు లేకుండా శాంతిగా జరిగిపోతోంది సంసారం”
విమల మాటల్లో సంతృప్తి ముఖంలో కాంతి దాగవు.
‘వాళ్ళ ఇంట్లో పనులు చాలా నిశ్శబ్దంగా జరిగిపోతుంటాయి. అరుపులూ, విసుక్కోడాలూ, టెన్షన్ ఏమీ ఉండవు. ఒకర్ని ఒకరు అనవసరంగా డిస్టర్బ్ చేసుకోరు. అధికారాలతో వేధించుకోరు. ఇద్దరూ పుస్తకాలు బాగా చదువుతారు కాబట్టి ఏ విషయం గురించయినా జ్ఞానంతో చక్కగా చర్చిస్తారు. మంచి మంచి స్నేహితులు వస్తూంటారు. పిల్లల చదువు పాడవకుండా ఇద్దరూ శ్రద్ధ తీసుకుంటారు. రాత్రి నిద్రపోయే ముందు మంచి పాటలు వింటూంటారు.’
ఆడ – మగ యెవరైనా కోరుకునే జీవితం వాళ్ళది.
వైవాహిక జీవితంలో తాను అనునిత్యం యెదుర్కొనే హింసను భరించాలా? భరించలేక సంబంధాన్ని వదులుకోవాలా? వదులుకోక సర్దుకుపోవాలా? ఇది అరుణని వేధించే సమస్య.
“లొంగుబాటునే సర్దుబాటు అనుకుంటాం. ఈ అడ్జస్ట్మెంట్ లో కనీసం అప్పుడప్పుడూ అయినా సుఖమూ శాంతి లభిస్తున్నాయా?”
విమల సూటిగా అడిగిన ప్రశ్నకు అరుణ దగ్గర సమాధానం లేదు. అరుణే కాదు , యెవరూ జవాబు చెప్పలేరు.
లొంగుబాటు వల్ల పోనీ సర్దుబాటు వల్ల రాజీ ద్వారా లభించే శాంతి శాశ్వతమైనదేనా? పొందే సుఖం నిజమైనదేనా ? ఇక్కడే మరొక బలమైన ప్రశ్న ముందుకు వస్తుంది. మార్క్సిజం చెప్పే ఘర్షణ ఐక్యత సూత్రం వైవాహిక జీవితానికి అన్వయించుకోగలమా? దాంపత్యంలో / సహజీవనంలో వైరుధ్యాలకు అంతిమ పరిష్కారం ఏమిటి? సంసారంలో సుఖ శాంతులు కొనుక్కోవాలంటే లొంగుబాటు తప్ప మరో మార్గం లేదా? సర్దుబాటులో హింసని అనుభవించేవాళ్ళే సమాధానం చెప్పగలరేమో…
దాంపత్య బంధాన్ని దృఢంగా వుంచగలిగేది ప్రేమ వొక్కటేననీ దానికి విఘాతం కలిగినప్పుడు ఆ బంధం నుంచి బయట పడటమే పరిష్కారమనీ విమల నిశ్చితాభిప్రాయం.
కాపురాలు సజావుగా సాగాలంటే పెంచుకోవాల్సినవి పరస్పర ప్రేమా, గౌరవాభిమానాలు. వదులుకోవాల్సినవి అధిపత్యాలు, అసహనాలు.
ప్రేమ నశిస్తే ఆ జీవితం వదులుకుంటానంటుంది విమల. ఆచరణలో అదే చేసింది.
“మీ వైవాహిక జీవితాన్ని మీ ఇద్దరి మధ్యా ప్రేమనీ మీరు నమ్మరా?”
“నమ్ముతాను. కాని పరిస్థితులన్నీ ఇలా ఎప్పుడూ అనుకూలంగానే ఉంటాయని నమ్మలేను”
“ప్రేమ మీకా నమ్మకం కలిగించాలి కదా?”
“నిజమే. ఆ ప్రేమ నశిస్తే మాత్రం ఈ జీవితాన్ని వదిలేస్తా”
రచయిత్రి యీ సంభాషణ ద్వారా విమల ముఖతః వైవాహిక జీవితం పట్ల అందులో సంభవించే ఆటు పోట్లు పట్ల స్పష్టమైన వైఖరిని వెల్లడించారు.
ప్రకటించే ప్రేమలు, ప్రదర్శించే మంచితనం శాశ్వతం కాదని విమల భర్త ప్రసాద్ పాత్ర ద్వారా రచయిత నిరూపించారు. విలువలు అన్నిటికన్నా ముఖ్యమని ప్రతిపాదించారు. కొందరు మగవాళ్ళు యితరేతరంగా స్త్రీల పట్ల వారి సమస్యల పట్ల యెంత సానుభూతి సహానుభూతి ప్రదర్శించినా స్త్రీ పురుషుల లైంగిక సంబంధాల విషయంలో వారు ప్రకటించే స్వేచ్ఛకు మన సమాజంలో అంతిమంగా ఆడవాళ్ళే దోపిడీకి గురవుతున్నారు. ఇంతకీ ప్రసాదు దాంపత్య జీవితంలో విశ్వసనీయత కోల్పోయాడు అన్నది కూడా విమర్శకు నిలబడుతుందా? అతని లైంగిక స్వేచ్ఛ గురించి యిప్పుడు మనం కొత్త ప్రతిపాదనలు కూడా చేయవచ్చు. అతని లైంగిక స్వేచ్ఛకు తాను ప్రతిబంధకం కాకూడదని విమల భావించి వుండవచ్చు. ఏకకాలంలో మల్టిపుల్ రిలేషన్స్, బహుళ సంబంధాలు, విమలకు నచ్చని అంశం. అటువంటి సంబంధాలను చట్టం వొప్పుకోదు. సమాజం ఆమోదించదు. వైవాహిక జీవితంలో అది అడల్ట్రీ అని రచయిత ఆశయం. లైంగిక స్వేచ్ఛని నిర్వచించుకునేటప్పుడు యీ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి.
అందరికీ సలహాలిచ్చి ఆసరాగా నిలబడే విమలకి తన సంసారం దిద్దుకోవడం తెలియలేదా? అని అరుణ ఆశ్చర్యపోతుంది. తగాదా పడుతూనో లేదా పంచాయితీ పెట్టో దాంపత్య బంధాన్ని నిలుపుకోవాలని విమల ఆశించలేదు. పంచాయితీల్లో పెద్దల తీర్పులు కూడా మగవాడి పక్షమే ఉంటాయి. స్త్రీనే తప్పు పడతాయి. లేదా సర్దుకుపొమ్మంటాయి. బహుళ సంబంధాల పట్ల మన సమాజం పురుషుడి విషయంలో వున్నంత వుదారంగా స్త్రీల విషయంలో వుండదు. మొత్తం వివాహ వ్యవస్థే పురుష కేంద్రంగా నిర్మితమై వుంది. ఇన్ని భయాల మధ్యే కుమార్ దురహంకార ప్రవర్తనతో వేగలేనప్పటికీ విడిపోవడం అంత సులభం కాదనీ, విమలకున్నంత ‘తెగింపు’ తనకు లేదనీ అరుణ భావించింది.
‘చాలా మంది కన్నా మంచివాడైన’ ప్రసాద్ నుంచి విడిపోవాలని విమల తీసుకున్న నిర్ణయం అరుణకు అంతగా నచ్చలేదు.
విమల అన్ని విధాలా ఆత్మగౌరవం గల ఆధునిక స్త్రీ. దాంపత్య బంధంలో సమానత్వాన్ని కోరుకుంది (స్నేహితులు వస్తే భర్త ఉప్మా పెసరట్టులు చేసి వడ్డించడం మాత్రమే కాదు). కల్తీ లేని ప్రేమను కోరుకుంది. నిజాయితీ కోరుకుంది. ఆత్మగౌరవం కోరుకుంది. అవి లేనప్పుడు విడిపోయి జీవితాన్ని సంతోషంగా మళ్ళీ తనకు నచ్చిన రీతిలో దిద్దుకోటానికి విమల సిద్ధమైంది. కథకి గొప్ప పాజిటివ్ ముగింపు యిది. జరిగిన దానికి విమల కుంగిపోలేదు. జీవితం పట్ల ఆసక్తినీ ప్రేమనూ కోల్పోలేదు. భవిష్యత్తు పట్ల ఆశనీ నమ్మకాన్నీ వదులుకోలేదు. ఆమె పిల్లల పెంపకాన్ని అశ్రద్ధ చేయకుండా తన ఆశయాలకు అనుగుణంగా భవిష్యత్తుని నిర్మించుకోగలదనే రచయిత్రి నమ్మకం. విడిపోయిన వర్తమానం కంటే ఆమె భవిష్యత్తే ‘మరో మలుపు’. అది మరో మగవాడిని ఆహ్వానించే పెళ్లే కావచ్చు, కేవలం సహజీవనం కావచ్చు. లేదా వొంటరి జీవితం కావచ్చు. ఆమె స్వభావానికీ ఆశయాలకూ అనుగుణంగా పురుషాధిపత్య సమాజంలో అన్యాయానికి గురవుతున్న స్త్రీలకు ఆసరాగా ఆలంబనగా వుండే సేవ వైపు కావచ్చు. అది యిప్పుడు ఆమె జీవితం. దానికి కర్త కర్మ క్రియ అన్నీ ఆమే. అది ఆమె మార్గం. దాని గమనం గమ్యం అన్నీ ఆమె సొంతం. స్త్రీకి యీ స్వేచ్ఛ వుండాలని రచయిత్రి యీ కథని ఓపెన్ ఎండింగ్ గా వదిలివేశారు.
భవిష్యత్తు పట్ల విమల అవగాహన విన్న తర్వాత-
‘అరుణకి ఎందుకో తను బ్రతుకుతున్నానా అనిపించి బరువుగా నిట్టూర్చింది.’
ఇదీ కథ ముగింపు. ఆ నిట్టూర్పు పాఠకుల్ని వెచ్చగా తాకుతుంది.
జీవితంలో నిజమైన సుఖశాంతులను రచయిత్రి కథలో నిర్వచించ దలుచుకున్నారు. అరుణ జీవితంలో డబ్బు హోదా అనుకూలంగా మారిన భర్త వాటి వల్ల కలిగిన గౌరవం పరువు ప్రతిష్ట యివన్నీ ఆమెకు సుఖాన్ని యిచ్చాయి గాని శాంతిని తెచ్చాయా అన్నది పెద్ద ప్రశ్న. అంతిమంగా అరుణ వేసుకున్న ప్రశ్న కూడా అదే. గృహిణిగా ఉద్యోగినిగా తొలి రోజుల్లో అరుణ కోరుకున్నది కూడా పెద్దగా యేమీ లేదు. తన కష్టాన్ని భర్త గుర్తిస్తే చాలు అనుకుంది. ఆమెకు అంతకన్నా యెక్కువ కోరికలు వున్నట్టు కనపడవు. కానీ వొకసారి యేదోవిధంగా భర్తను తన అదుపులోకి తెచ్చుకున్న (‘వంచుకున్న’) తర్వాత ఆమెకు సుఖదాయకమైన కాంక్షలు పెరిగి వుండవచ్చు. వాటికి అంతు వుండకపోవచ్చు. అందువల్ల కోరుకున్నది పొందుతున్న కొద్దీ అశాంతి యెక్కువ కావచ్చు. ఎవరైనా సుఖశాంతులను యెలా నిర్వచించుకుంటారు అన్నది ముఖ్యం. సుఖం సాపేక్షం. శాంతి గురించి చెప్పలేం. అది అనిర్వచనీయం. స్వయంగా అనుభవిస్తే నే తెలిసేది. అరుణ వెతుక్కునే శాంతి వేరు. విమల వెతుక్కునే శాంతి వేరు. విమల నిర్ణయాల్లో స్వేచ్ఛ వుంది. తన జీవితాన్ని తానే నిర్మించుకోవటంలో వుండే ఆత్మగౌరవంతో కూడిన స్వేచ్ఛ అది. అందులోనే ఆమె శాంతిని వెతుక్కుంది. పొందింది.
“కొంతమంది పరువు గురించి పాతివ్రత్యం గురించి అలోచిస్తారు. డబ్బు గురించి సరే సరి. నేను ప్రేమ గురించి మానవ సంబంధాలలో నిజాయితీ గురించీ, స్త్రీ చైతన్యం గురించి అలోచిస్తాను.”
విమల చెప్పిన యీ మాటల ద్వారా ఆమె యెన్నుకొన్న విలువలు తెలుస్తున్నాయి. యెంచుకున్న దారి తెలుస్తోంది.
విమల యెన్నుకొన్న దారి పట్లే కాదు అరుణ యెంచుకున్న దారి పట్ల కూడా మనం జడ్జిమెంటల్ గా వుండలేం. ఎవరి జీవితాలు వాళ్ళవి , యెవరి యిష్టం వాళ్ళది. ఎవరి గమనం గమ్యం వాళ్ళవి. అయితే సమాజం విస్తృత ప్రయోజనాల కోసం పాటించాల్సిన విలువలు కొన్ని వుంటాయి కదా! జీవితంలో మనకు యెదురయ్యే ప్రతి మలుపులో అరుణ, విమల తారసపడుతూ వుంటారు. ఎవరి జీవితం నుంచి యే పాఠం స్వీకరిస్తామన్నది మన సంస్కారం బట్టీ వుంటుంది. అటువంటి వుదాత్త సంస్కారాన్ని పెంచడానికి శిరీష ‘మరో మలుపు’ వంటి కథలు తప్పకుండా దోహదం చేస్తాయని నా నమ్మకం.
కథ నిర్మాణం విషయానికి వస్తే ‘మరో మలుపు’ కోసం శిరీష తీసుకొన్న కాన్వాస్ చాలా చిన్నది. ఉపయోగించిన రంగులు కూడా తక్కువే. కానీ అందులో ఆమె యిమిడ్చిన, ప్రతిపాదించిన విషయాలు మాత్రం చాలా పెద్దవి. స్త్రీ పురుషుల మధ్య వుండాల్సిన స్వేచ్ఛ సమత్వ భావనలు, దాంపత్యజీవనంలో స్థిరంగా వుండాల్సిన ప్రేమ విశ్వసనీయత మొ. విలువలు, కుటుంబ నిర్వహణలో స్త్రీలు నిర్వహించే గురుతర బాధ్యతలు … యిలా అనేక అంశాలను ఆమె సూక్ష్మదర్శినిలో చూపించారు. రచయిత తనదైన జీవిత దృక్పధాన్ని అతి తక్కువ పాత్రలతో అతి తక్కువ సన్నివేశాల్లో (పది సంవత్సరాల్లో జరిగిన రెండు సన్నివేశాల్లో) కథా మాధ్యమంగా చాలా క్రిస్స్ప్ గా, చాలా సటిల్ గా చెప్పగలిగారు. శిరీష గారి మిత హిత మృదు భాషిత్వమే ఆమె వచనంలోకి ప్రవహించి కథ పాఠకులకు హృదయస్పర్శి అయింది. కథనంలో సూటిదనం, అల్లికలో చిక్కదనం, నిండైన పాత్ర చిత్రణ కథకి బలాన్నిచ్చాయి.
రచయిత రెండు విరుద్ధమైన వ్యక్తిత్వం గల స్త్రీలను పాత్రలుగా మలిచారు.
‘విమలది పరిపక్వమయిన మనస్సు, సాటి స్త్రీలంటే అపారమైన సానుభూతి.’
‘స్త్రీ సమస్యల పట్ల ఒక్క అవగాహనే కాదు పరిష్కరాలు చూపించే తెగువా, మానవతా విమలకి పుష్కలంగా ఉన్నాయి’
స్త్రీ పురుష సంబంధాలలో నిజాయితీ గురించీ, స్త్రీ చైతన్యం గురించి ఆమె ఆలోచిస్తుంది.
ఏ స్త్రీ కన్నీరు పెట్టడం ఆమె భరించలేదు. “మన సమస్యలకి మనమే స్పందించి పోరాడాలి” అని నమ్మి ఆచరించి చూపింది.
అరుణకు తోడుగా నిలిచింది. సంసారం చక్కదిద్దు కోవడానికి సహకరించింది.
అరుణ పాత్ర దీనికి భిన్నం. ఆమె మొదటినుంచి సానుభూతిని కోరుకుంది. సంసారంలో కాస్త గౌరవం, సుఖం లభించాక ఆమె తీరు మారింది. ఉద్యోగంలో ప్రమోషన్ సంపాదించింది. ఇల్లు కట్టుకొంది. కారు కొనుక్కొంది. నగా నట్రా పోగేసింది. భర్తను తనకు అనుకూలంగా మార్చుకొనే లౌక్యం – ‘గడుసుతనం’ కూడా నేర్చుకుంది. జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. అందుకే విడిపోవాలని విమల తీసుకున్న నిర్ణయాన్ని ఆమె ఆమోదించ లేకపోయింది. ఏదో విధంగా సర్దుకుపోతే తనలాగే విమల సుఖపడొచ్చు కదా అని ఆమె అభిప్రాయం కావచ్చు.
“మళ్ళీ నీ లాంటి పరిస్థితులలో ఎవరయినా తారసపడితే… నువ్వు ధైర్యం చెప్పు. ఆ ధైర్యం ఓదార్పూ వాళ్ళకు శక్తినిస్తుంది. అదే మనం సాటి స్త్రీలకు చేయగల సహాయం.”
కష్టంలో వున్న స్త్రీకి మరో స్త్రీ అండగా వుండాలని రచయిత స్పష్టం చేశారు. అరుణకి విమల యిచ్చిన సలహా అదే. అయితే విమలకు సహాయం చేయవలసిన సందర్భంలో అందుకు ముందుకు రాకపోవడం ఆమెలోని స్వార్ధాన్నే సూచిస్తుంది. లేదా అది ఆమె కొత్తగా నేర్చుకున్న గడుసుదనంలో భాగం కావచ్చు. అరుణ వ్యక్తిత్వాన్ని విమల పెద్దగా పట్టించుకోలేదు కానీ పాఠకులకు ఆమె స్వభావం తెలుస్తోంది. కథలో అరుణ జీవన పద్ధతితో రచయిత్రి యేకీభవించలేదనీ, విమల ఆచరణని ఆమోదిస్తున్నారనీ ముగింపు మాటల ద్వారా తెలియజేశారు.
అంతకుముందు విమల చెప్పిన మాటనే కాదు సహాయాన్ని కూడా అరుణ చాలా కంఫర్టబుల్ గా మర్చిపోయింది. ‘అవకాశవాదం, అతి తెలివి మాత్రమే తనకి సుఖాన్నిచ్చాయి.’
ఆమెలోని యీ మార్పును విమల గ్రహించినట్లే వుంది. అందుకే “మీ రూట్ వేరు. నా రూట్ వేరు” అని అన్యాపదేశంగానైనా స్థిరంగా చెప్పింది. ఇది రచయిత గొంతు కూడా కావచ్చు.
కథలో ముఖ్యంగా కనిపించే మరో బలమైన అంశం మరొకటి యేమంటే, రచయిత అరుణ, విమల జీవితాల్నీ ఆ జీవితాల్లో చోటు చేసుకున్న మార్పుల్నీ యధాతధంగా చిత్రించటం దగ్గర ఆగిపోలేదు. అవి అలా వుండటానికి గానీ అలా పరిణమించడానికి గానీ వెనక వున్న కనిపించే – కనపడని కారణాలను యెత్తి చూపటానికి ప్రయత్నించారు. మార్పులు అందుకు కారణమైన పరిస్థితులు … వీటిని విమర్శనాత్మకంగా పరిశీలించారు. విమల జీవితంలోని వూహించని మలుపు అరుణ దృష్టికోణం నుంచి విమర్శకు పెట్టి దాని మంచిచెడ్డలను విచారిస్తూ విమల తీసుకున్న నిర్ణయం క్షణికావేశంలో తీసుకున్నది కాదనీ భవిష్యత్తుని దీర్ఘ దృష్టితో పిల్లల గురించి సైతం ఆలోచించి చూసి చేసిన నిర్ణయమనీ రచయిత మాటల ద్వారా కంటే విమల ఆత్మ పరిశీలన ద్వారా స్వీయవిమర్శ ద్వారా వ్యక్తం చేశారు. కథలో ఉన్న బలం అదే. అదే సమయంలో అరుణ జీవితానికి సంబంధించిన మార్పుల్ని యే విధంగా చూడాలి అన్నది ఆమె పాఠకులకు వదిలేశారు. ఇది కథలో ఉన్న అంతర్గత నిర్మాణం. ఈ టెక్నిక్ ద్వారా రచయిత పాత్రల మధ్య సారూప్య వైరూప్యాలనూ, వైరుధ్యాలనూ సాపేక్షంగా చక్కగా చూపారు. అందువల్ల పాఠకులకు స్వయంగా ఆలోచించటానికి వెసులుబాటు దొరికింది. మంచి కథ లక్షణమిది.
కథ పేరు ‘మరో మలుపు’ గాని నిజానికి యిది దాసరి శిరీష లాగానే స్ట్రైట్ లైన్ స్టోరీ. ఏ మాత్రం సంక్లిష్టత లేని కథన శైలినే ఆమె యెంచుకున్నారు. అందువల్ల యెటువంటి శ్రమ లేకుండా ప్రతి పదాన్నీ దాని వెనుక వున్న అర్థాల్నీ వాటి లోతునీ ఆస్వాదించగలం. రచయిత ప్రతిపాదించదల్చుకున్న ఆలోచన పాఠకుల హృదయాలను నేరుగా తాకుతుంది. దృక్పథ స్పష్టత వుండటం వల్ల వస్తు శిల్పాల విషయికంగా సమన్వయం చక్కగా కుదిరి అన్ని విధాల పరిపూర్ణమైన కథ రూపొందింది. అందుకే ‘మరో మలుపు’ శిరీష ప్రాతినిధ్య రచన అయ్యింది. జీవితంలో మలుపులుంటాయి, సరళరేఖలుంటాయి. రెంటినీ సమంగా చూసి స్వీకరించగల స్థైర్యాన్నీ అవగాహననీ సాహిత్యం యిస్తుంది అనడానికి యీ కథ మంచి వుదాహరణగా నిలుస్తుంది.
(శిరీష గారు వున్నప్పుడే రాయాల్సిన ఈ నాలుగు మాటలు ఆమె నిష్క్రమించాక నివాళిగా రాస్తున్నందుకు బాధతో…)