1.
 పసిపిల్లల్ని వొడిలో జోకొడుతూ
 తన్మయంతో శిగమూగే అడివి తల్లి 
 వికృత రూపందాల్చి మోడుబారినట్టు.. 
 దిగంతాలకావల దిగ్గున లేసి కూసున్న ఓ పీడకల
 కాలం దిగుడుబాయిలోకి కాళ్ళుపట్టుకుని
 గొర్రగొర్ర గుంజుకపోతున్న భయంకరమైన చీకటి
 పట్టరాని దు:ఖంతో ఆకులు.. 
 కొమ్మల్ని అమాంతం సుట్టేసుకుని చెట్టును వడిదిప్పినట్టు దూరంగా
 కనుమరుగవుతున్న ఆదివాసీ చెంచు పెంటలు.
2.
యురేనియం పాము వెన్నులోకి
 జరజరా పాకుతున్న అలికిడి
ఏ బుడుగులోకి దిగబడిపోతున్నమో జాడైనాదియ్యని
హైటెక్ మనుషుల మెదడులో
ఇంకా ఎన్ని బైట్ల ఖాళీతనం నిల్వవుందో తెల్సుకోవాలి. 
కోసిన బొడ్డుతాడును మళ్ళీ అతికించి అమ్మకడుపులోకి
తబాదల్ జెయ్యాల్సిందే!
3.
ఇప్పుడు అభిమన్యులందరికీ 
అడివిగీతం నేర్పించాలి
అమ్మచేతి స్పర్శను అనుభూతి చెందించాలి
ఝుమ్మని తిరిగే తుమ్మెదల కమ్మని తేనెపాటల్ని
చెవిలో నెమ్మదిగా వొంపాలి
జలపాతాల హోరును పిచ్చుకల కువకువల్ని,
ఆకుల పచ్చదనాన్ని పదేపదే మనుసుకు ఇంకెలా అనువదించాలి
అమ్మ మళ్లీ నీళ్ళోసుకుంది కదా.. 
పురుడుపోయడానికి ప్రకృతి పసరు మందు పట్టుకొచ్చింది. 
మరో ఆకుపచ్చని తడిగీతాన్ని నూరిపోసింది
సామూహిక మనిషి పుట్టుకను వేడుకచేసేందుకు
చెట్టూ పుట్టా వాగు వంకా ఎదురుచూస్తున్నట్టుంది
4.
నాయినా.. 
ఇప్పుడైనా పాలు కుడిపిన అమ్మరొమ్ముల్ని తన్నిపోవుకదరా! 
ఎదురు కాళ్ళతో పుట్టావు కదా.. 
అప్పటి నా బాధ నీకెలా చెప్పను తండ్రీ! 
కడుపులో అడ్డం తిరిగావని  అదేపనిగా మనాది పెట్టుకోకు బిడ్డా…
నాకు కడుపుకోత  మిగల్చవు కదా! చిరంజీవ… చిరంజీవ!!
 
                
Very good poem
……..Abhinandanalu .