వెన్నెల రాత్రి – పదహారు రొట్టెలు- మరికొన్ని గాయాలు

వెన్నెల రాత్రి నలనల్లటి తారు రోడ్లపై
నడిచి, నడిచి ఇక నడవలేక సొమ్మసిల్లిన నడివయసు వాడు

నెర్రెలు వారిన భూమిలాంటి పగిలిన పాదాల వాడు
దుమ్ముగొట్టుకు పోయి, గుక్కెడు నీళ్లు లేక గొంతెండిన వాడు
మూడు రోజులుగా ఏమీ తినకున్నా
బతుకుపైన తీపి, కళ్ళలో ఆశే ఇంకా చావని వాడు

పల్లె మృగతృష్ణ అని తెలిసి తెలిసీ వందల మైళ్ళు నడిచి తిరిగి వెడుతున్న వాడు
తలవంచుకుని పనిచేసి, పనిచేసి కాయలు కాసిన మొరటు చేతుల వాడు

చేతిలో పైసాలేకున్నా, ఆత్మని ఎవరికీ అమ్ముకోని వాడు
ఎన్నడూ, ఎవరి ఎదుటా చేయి చాచని వాడు

అతడు ఎవరైతేనేం సకల సంపదల సృష్టికర్త
చాచిన చేతుల్లో వేసే రొట్టెముక్కకై చకోర పక్షిఅయి
ఇప్పుడు మన ముంగిట రిక్త హస్తాలతో నిలిచాడు

వాడు
ఎవరో విసిరిన రొట్టెను తుంచి నోట్లో పెట్టుకోబోయినప్పుడు
సరిగ్గా అప్పుడు ఏం జరిగిందంటే
అతడి కళ్ళ నిండా నిండిన కన్నీళ్లు
గజగజా వణికి రొట్టెలపై పడ్డాయి
రొట్టెలు సిగ్గుతో బిక్కచచ్చి పోయాయి
కన్నీళ్లతో తడిచిన రొట్టెముక్క
“ఒకప్పుడు వరి, గోధుమలు పండించిన రైతు
ఇప్పుడు వలసకూలి అని నుదిటిమీద చెరగని పచ్చబొట్టు గలవాడతడు”
అంటూ భోరున విలపించింది

అప్పుడా నల్లని రోడ్డు, దారిని చాపలా చుట్టేసి
అతడ్నిఇంటికి త్వరగా చేర్చలేని తన నిస్సహాయతను తలచుకుని దుఖించింది
నీళ్లు నిండిన ఆ రెండు కళ్ళూ, సిగ్గుతో తలవంచుకున్న రొట్టె ముక్కలూ
కాలం గుండెలపై శిలాక్షరాలై మరో కథని ఇట్లా మొదలు పెట్టాయి

***

సర్కారు నిజంగానే రైళ్లు నడపడం లేదని అమాయకంగా నమ్మి
వాళ్ళంతా బయలు దేరారు రైలు పట్టాల వెంట
జాల్నాలో వాళ్ళు మొదటి అడుగు ఇంటి దిక్కుగా వేసినప్పుడు
తెలీదు వాళ్లకి రొట్టెల సంచీలతో పాటూ మరణాన్ని కూడా తలకెత్తుకున్నామని
అప్పటికి నూటా యాభై ఏడూ కిలో మీటర్లు నడిచి, నడిచి
వాళ్ళు అలసిపోయి మూటల్ని దించారు నేలమీదికి
కంకర రాళ్లు పరిచిన రైలు పట్టాల మధ్య మిగిలిన ఆ కాసింత జాగాలో
వెన్నెల్ని దుప్పటిలా కప్పుకొని విశ్రమించారు వాళ్ళు ఒక్కరొక్కరుగా

వాళ్ళ ఊర్లు ఉమారియా, శదోల్ పిలుస్తున్నాయి
ఎనిమిది వందల యాబై కిలోమీటర్ల దూరం నుండి
గాఢ నిద్రలోకిజారి, వాళ్ళు అప్పుడో కలగన్నారు
తమ ఊర్లకు చేరినట్లు, పుట్టిన నేలని ముద్దు పెట్టుకున్నట్లు
పిల్లలు ఆనందంగా పరుగెత్తుకు వచ్చినట్లు
కన్నీళ్లతో ఎదురు చూస్తున్న భార్యల్ని ప్రేమగా అక్కున చేర్చుకున్నట్లు
వాళ్ళొక అద్భుతమైన కలకన్నారు
వాళ్ళ కలల కళ్ల మీదుగా నిశ్శబ్దంగా దూసుకు పోయిందొక రైలుబండి

నెత్తురంటిన ఆ పదహారు రొట్టెలూ
గమ్యం చేరకనే రైలు పట్టాల మధ్యే మరణించాయి
వాటి ఆర్తనాదాలు ఎవరికీ వినపడకనే గాలిలో కలిసి అదృశ్యమయ్యాయి

నిజానికి
మరణించే ముందు దారిపొడుగునా ఆ రొట్టెలు
వాళ్ళను మోసుకు వెడుతున్న వాళ్ళ కన్నీటి కథలను వినే ఉంటాయి
వాళ్ళు మరిక లేవలేదు
చూడలేక చందమామ సిగ్గుపడి వెళ్ళిపోయాక కూడా
రొట్టెలు వాళ్ళు, లేదా వాళ్ళూ రొట్టెలు మరిక మాట్లాడలేదు

అప్పుడు మనం ఏం చేసామంటే
సరిగ్గా రొట్టె ముక్కలుగా విరిగి పోయిన వాళ్ళ శరీరాలను
పదహారు రొట్టెలవలే మూట గట్టి ఊరికి మోసుకు వచ్చాం
తినేందుకు రొట్టెలు పట్టుకొచ్చేరేమో అని ఆత్రంగా ఎదురు చూస్తున్న
వాళ్ళ తల్లులు, భార్యాబిడ్డలూ, అయినవాళ్లంతా
చివరికి విప్పిన ఆ మూటల్ని చూసి
దిక్కులన్నీ కూలేలా, లోకాన్ని శపిస్తూ పొగిలిపొగిలి ఏడ్చారు

దుఃఖం ఇప్పుడు లోకమంతటా గుండ్రటి రొట్టెలా కనపడుతోంది
ఆ పట్టాల మధ్య పడివున్న చినిగిన, నెత్తురంటిన
వాళ్ళ వంద రూపాయల కాగితాన్ని
ప్రధానమంత్రి సహాయ నిధికి పంపండి ఎవరైనా

ఈ సారి గోధుమ పైరు గాలి వీచినప్పుడల్లా
పట్టాల మధ్య మరణించిన ఆ పదహారు మంది వేదన గురించి
దిగులు దిగులుగా తప్పక పాడుతుంది
అప్పుడు వినేందుకు మనం మిగిలి ఉండాలి

నిజంగా లేదు, నమ్ము ఏమీలేదని ఎవరన్నా,
రాత్రి రొట్టెముక్కను తుంచి తినబోయినప్పుడల్లా దానికి
అంటిన నెత్తురు కనబడుతోంది ఇప్పుడు

రాత్రుళ్ళు పున్నమి చందమామ కాలిన గుండ్రటి రొట్టెలా
దానిపై మరకలు ఎండిన నెత్తుటి చారికల్లా కనపడుతున్నాయి అదేమిటో
ఆకాశంలో నక్షత్రాలైన ఆ పదహారు రొట్టెలూ మరో కధని ఇట్లా చెప్పాయి

***

ఇంకా వాళ్ళు చిన్నపిల్లలే, కౌమార్యం వీడని వాళ్ళే
లెక్కలేనంత మంది, ఎవరి లెక్కలకూ అవసరం లేనంత మంది
మరో గతి కానరాక వెట్టి బానిసలుగా నగరాలకు వలసబాట పట్టినవారు
అప్పటికప్పుడు పొమ్మని తోసేస్తే, వీపులకు సంచీలు తగిలించుకుని
మారుమూల పల్లెలకు బయలు దేరిన వారు
నడుస్తున్నారట్లా ఎన్నో దినాలుగా పగలు, రాత్రీ తేడాల్ని మరిచిపోయి

అదే దారిన ఒక పాత సైకిల్ తొక్కుకుంటూ వచ్చారు
ఇద్దరు పిల్లలు ఆగ్రాకి వెళ్ళేందుకు
వాళ్ళు పెదవులపై కల్మషం అంటని సన్నటి నవ్వొకటి మెరుస్తోంది
ఇంతలో ఎక్కడి నుండో వచ్చిందో పదిహేడేళ్ల అమ్మాయి
గాయపడ్డ తండ్రిని మోసుకుంటూ సైకిల్ పై బీహార్ చేరేందుకు
ఆ ధైర్యం గల పిల్లలను దారి వాళ్ళ గమ్యాలకు చేరుస్తుందా?

“క్షేమం పిల్లలూ” అని గొణుగుతూ నడినెత్తిన వెలిగే
మండే సూరీడు చప్పున సిగ్గుతో తలవంచుకున్నాడు

రెక్కలు విరిగిన వలస పక్షుల్లా
చేతులు చాపి నిలబడి, తినేందుకు ఇచ్చినదేదో తీసుకుని
ఒక్క ఫిర్యాదన్న లేకుండా
ఆ కూలి గుంపులు నడిచివెళ్లాయి భూగోళపు అంచుల వరకూ

ఎక్కడెక్కడి నుండో నడిచి వచ్చిన కూలీలు
ఎక్కిన వాహనాలూ, వాళ్ళని మోసంచేసాయి చివరకు
అవి తిరగబడి దారిలోనే మరణించారు అనేకులు
అట్లా చెల్లాచెదరైన ఇరవైనాలుగు మంది కూలీలు
మునుపు నగరాల్ని నిర్మిస్తూ మరణించిన
వాళ్ళ పూర్వీకుల వద్దకు చేరి
కాలం ఇంకా ఏమీ మారలేదని కన్నీళ్లతో చెప్పారు
అప్పుడు వాళ్ళంతా కలిసి లోకం విస్మరించినప్పటికీ
నేలపై ఇంకా జీవించే వున్న
వలస మానవుల హృదయ విదారక జీవిత కథ వినిపించాయి ఇట్లా

***

తల్లులు కొన్ని చిన్ని చిన్ని వలస పాదాలను ప్రసవించారు నడిరోడ్లపై
కన్న బిడ్డల బొడ్డుతడి ఆరకముందే
పురిటి నెత్తుటి ధారలు ఆగకముందే లేచారు వాళ్ళు
నడిచారు వందల మైళ్ళు ఆ దిక్కులేని బాలింతలు, భరత మాతలు

ఇళ్ళు చేరాలంటే,
వాళ్ళు నడవాలి మరో వెయ్యి మైళ్ళు
అప్పటికి వాళ్ళు బతికి ఉంటే తప్పక చెబుతారు పొత్తిళ్లలోని బిడ్డలకు
వలస తల్లులకి తల్లి కావడం కన్నా మరో నరకం లేదని
తిండి లేక పాలింకిన ఎండిన వాళ్ళ స్తన్యాల గురించి
వాళ్ళ దుఃఖరాగం బిడ్డలకు జోల పాటలైన వైనం గురించి

వాళ్ళ నిస్సహాయ, ఆగ్రహ శాపాల గురించి
తల్లుల్ని కీర్తించే దొంగల రాజ్యం వాళ్ళ మాతృదేశం
కావడం కన్నా విషాదం లేదని
వాళ్ళు తప్పక చెబుతారు

ఆ వలస తల్లులు ఇంకా బతికుంటే
వాళ్ళను కన్న అమ్మల వడిచేరి తప్పక విలపిస్తారు
తల్లులందరికీ
దేశాన్ని తల్లి అనే వాడి పట్ల అసహ్యం కలుగుతోంది

ఇంకా ఉన్నాయి అంతులేని నడకల గాయాలు
ఆకటి కడుపుతో, వడదెబ్బతో కుప్పకూలి భద్రాచలం వద్ద
మరణించిన ఆ ఆదివాసీ కుర్రవాడు
ఇల్లు చేరే దారికానరాక ఉరిపోసుకున్న
నూనూగు మీసాల జార్ఖండ్ పిల్లవాడూ

ఎన్నో మైళ్ళు నడచి నడచి, అలసిసొలసి
ఇక అడుగు వేసే శక్తి లేక తన ఇంటి ముందే మరణించిన
ఆ పన్నెండు, పదమూడేళ్ల ఇందూరు, ఛత్తీస్ ఘడ్ అమ్మాయిలు

నిజంగా ఇంత అర్దాంతరంగా బతుకు ముగిసి పోతుందని
వాళ్ళు ఊహించలేదు ఎన్నడూ
వలస వచ్చేముందు కలల తోటల్లో వాళ్ళు
ఎగరేసి వచ్చారు కొన్ని తూనీగలను, సీతాకోక చిలుకలను

పక్షులకు కాసిన్ని గింజలు, నీళ్ళూ పెట్టి తిరిగి వస్తామని బాస చేసారు
వాళ్ళతో పాటూ అవి కూడా మరణించాయి అక్కడ
అదిగో ఆ అడవి లో నుండే, వాళ్లు బతికిన దినాలలో పాడిన
రేల పాటలు అస్పష్టంగా వినపడుతున్నాయి

వాళ్ళు ఎందుకలా చనిపోయారని మనుష్యులెవరూ గట్టిగా అడగలేదు
కానీ ఆ వెర్రి వేసవి గాలి మాత్రం చండ్ర నిప్పులు చెలరేగుతూ
వలస వచ్చిన వాళ్ళ కథల్ని లోకమంతా వినిపిస్తూ వీస్తోంది

***

విరిగిన వాళ్ళ పెంకుటిళ్లను, సగం కూలిన పూరి పాకలను
అనేక జ్ఞాపకాలు వెలిగే వాళ్ళ పల్లెల ధూళి నిండిన గతుకు దారులను
ఎండిన పంటపొలాలను దాటి, ముసలి తల్లిదండ్రులను
భార్యా పిల్లలను, అక్కడే వదిలి
భాష తెలియని, ఊరుగాని వల్లకాట్ల వంటి ఊర్లకు
నగరాలకు వాళ్ళు గుంపులు గుంపులుగానో, ఏకాకులుగానో
భయం భయంగా వలస వచ్చింది బతికేందుకే కదా!

మనిషి మరణించిన వాసన వచ్చే ఆ మహా నగరాల్లో
కిక్కిరిసిన మురికి వాడల్లోనో, రోడ్లపైనో
రాత్రుళ్ళు మూసేసిన దుకాణాల ముందో
రైలు స్టేషన్లు, బ్రిడ్జీలు, మసీదులు, గుడులు
మురికి కాలువల పక్కనో నివసించే వాళ్ళు

కలత నిద్దురలో పాడు కలల భయాలతో నిదురించే వాళ్లు
వాళ్లను తోలుకు వచ్చిన యజమానులు
చూపిన ఇరుకు రేకుల గదులలోనో, ధూళి దుర్గంధాల మధ్యనో
బతికే వాళ్ళు, ఆ అధోజగత్ సహోదరులు

నిజంగా వాళ్ళు మనుషులేనా?
మానవుల్ని సాటి మానవులుగా
గుర్తించ నిరాకరించిన నాగరికుల మధ్య నుండి అట్లా చీమల బారుల్లా
నడిచి వెడుతున్నవాళ్ళు, వాళ్ళసలు మనుష్యులేనా?

మన కోసం వీధులు వేసిన వాళ్ళు వాటిని అద్దాల్లా తుడిచే వాళ్ళు
మన కోసం మేడలు, మిద్దెలు కట్టిన వాళ్ళు
ఆఫీసులు, ఆసుపత్రులు, బడులు, ప్రాజెక్టులు, విమానాశ్రయాలు, ఫ్యాక్టరీలు
సినిమాహాళ్ళూ, హోటళ్ళూ నిర్మించిన వాళ్ళు

మన ఇండ్లలో ఊడ్చి, ఉతికి, వంటలు చేసేవాళ్ళు
మన పిల్లల్ని ఆడించి, బడులకు తీసుకుపోయే వాళ్లు

నిజంగా వాళ్ళు మనుష్యులేనా?

ఆ పూల తోటల్లో చెట్లకు పాదులు వేసిన వాళ్ళూ
నెత్తురు, చెమటా ధారబోసి ఆకలి కడుపులతో
మన కోసం పాలు, పెరుగు, పండ్లు, కూరలు, సకల ధాన్యాలూ సృష్టించి
నగరాలకు తరలిస్తున్న ఆ రైతులూ, కూలీలు వాళ్ళు మనుషులేనా?

మనం కదిలేందుకు బస్సులు, రైళ్ళూ, కార్లు, విమానాలు నడిపే వాళ్ళూ
కాసిన్ని కరెన్సీ నోట్లు విసిరేసి మనం కోరే గొంతెమ్మ కోర్కెలన్నింటినీ
మన ఇంటి వాకిలి ముందుకు మోసుకువచ్చే
పేర్లు, చిరునామాలే అవసరం లేని వట్టి డెలివరీ
బాయ్ లు

మన వినోదాలు, విశ్రాంతుల కోసం సేవలందించే వాళ్ళు
మనలో చెలరేగే రహస్య వాంఛలను చల్లార్చేందుకు
దేహాల్ని అమ్ముకుంటే తప్పా బతకలేని వాళ్ళు
వాళ్ళు నిజంగా మనుష్యులేనా?

నిట్టనిలువుగా చీలిన రెండు ప్రపంచాల మధ్య
సేవకులుగానే తప్ప మనం మనుషులుగా గుర్తించ నిరాకరించిన
వాళ్ళు నిజంగా మనుషులేనా ?

సకల నాగరికతలకు నవనాడులైన
ఆ కోట్ల మంది పనివాళ్ళ హృదయ ఘోష
దేశమంతటా కలయతిరుగుతూ నడుస్తున్న
వాళ్ళ నెత్తుటి పాదాల చప్పుడు వినబడుతున్నదా?

ఈ దేశపు పాత జబ్బు ఆకలి కన్నా మించిన జబ్బు మరేదీ లేదని
వాళ్లపై మన దయ ప్రదర్శనా వస్తువు కారాదని
వాళ్ళకన్న ఎవరికి ఎక్కువ తెలుసు?
అన్ని తెలిసిన అసలైన మానవులు వాళ్ళు
ఇప్పుడు వాళ్ళంతా మౌనం గానే వున్నారు
ఎలాగైనా ఇంటికి చేరాలన్నది ఒకటే వాళ్ళ ధ్యాస

అన్ని దారులూ మూసుకుపోయి
ఉన్న చోట బతకలేకే కదా వాళ్లసలు వలస కూలీలైంది

వాళ్ళు మళ్ళీ తిరిగి రాక తప్పదు ఏదో ఒక నాడు
బతుకును తాకట్టు పెట్టుకొనో, పూర్తిగా అమ్ముకొనో
మళ్లీ వాళ్ళు తిరిగిరాక తప్పదు నగరాలకు

అప్పటికన్నా వాళ్ళ కోసం వెన్నెల రాత్రుల్లో
ఒక చలివేంద్రం, కాసిన్ని రాక్షసి బొగ్గులు
ఒక కొలిమీ సిద్ధమైతే బావుండును

పుట్టింది హైదరాబాద్. కవయిత్రి. కథా రచయిత్రి. ఉద్యమ కార్యకర్త. కవితా సంకలనాలు: 'అడవి ఉప్పొంగిన రాత్రి', 'మృగన'. కథా సంకలనం: 'కొన్ని నక్షత్రాలు... కాసిన్ని కన్నీళ్లు'

12 thoughts on “వెన్నెల రాత్రి – పదహారు రొట్టెలు- మరికొన్ని గాయాలు

  1. ఏమి కవిత విమలా….హృదయ విదారక అప్రకటిత యుద్ధభూమిలో గిరగిరా thippeshavu కదా!? ఇతిహాస పు చీకటి కోణాలను మోహాలమీద visiresaavu కదా…

  2. హృదయవిదారకం.
    ఇంట్లో కూచుని భరించలేని అస్తిమితం మోయడం తప్ప ఏం చెయ్యగలుగుతున్నాం .
    మీరు ఆ బరువును అక్షరాల్లోకైనా వొంపగలిగేరు.
    విమల గారూ మన్నించండి
    మీ ఫోటో మరొకటి పెట్టి ఉండాల్సింది

  3. ఎంత దుఖ్ఖం! ఎంత వేదన !
    “వాళ్ళు మళ్ళీ తిరిగి రాక తప్పదు ఏదో ఒక నాడు
    బతుకును తాకట్టు పెట్టుకొనో, పూర్తిగా అమ్ముకొనో
    మళ్లీ వాళ్ళు తిరిగిరాక తప్పదు నగరాలకు

    అప్పటికన్నా వాళ్ళ కోసం వెన్నెల రాత్రుల్లో
    ఒక చలివేంద్రం, కాసిన్ని రాక్షసి బొగ్గులు
    ఒక కొలిమీ సిద్ధమైతే బావుండును”
    అవును. వాళ్లు మళ్లీ వచ్చేకైనా నగరం కొంచెం మానవత్వాన్ని నేర్చుకుంటే బాగుండు

  4. విమల గారు,
    కవిత చదువుతుంటే గుండెల్ని ఎవరో చేతితో పిండినట్టు అయ్యింది. కళ్ళ ముందు ఏవేవో నవలలు,ఏవేవో దృశ్యాలు కద లాడినయి.
    మనం ఇంత సుఖంగా ఉన్నాం – అను నాకు,నేనే తిట్టుకున్నాను.
    చాలా బాగుంది.
    ధన్యవాదాలు.

  5. హృదయాన్ని తాకిన కవిత . ఈ ప్రజల బాధను హృదయాన్ని కదిలించేలా రాశారు .

  6. తల్లిని కీర్తించే దొంగల రాజ్యం … నిజమైన మనుషుల ప్రపంచాన్ని కళ్ళకు కట్టించావు విమల్! దుఃఖంతో నాలుక పిడచ కట్టుకుపోతుంది.

  7. మాటల్లో వ్యక్తపరచలేని విషాదం ఆవహించింది మనసంతా ఈ కవిత చదివింతర్వాత. వలస కూలీల కోసం తల్లి అయి విలపించారు విమల. ఇంతవరకు సబాల్టరిన్ కవిత్వం గురించి మాట్లాడుకోవాలంటే ఆఫ్రికన్ కవుల ప్రస్తావన ప్రముఖంగా వచ్చేది. ఇప్పుడు తప్పనిసరిగా విమల గారి కవిత్వం గురించి కూడా ఉదహరించాలి.

  8. ఎంత కష్టం, ఎంత దుఃఖం, ఎంత వేదన.. హృదయాన్ని మెలిపెడుతూ ..
    బతుకును తాకట్టు పెట్టుకునే వాళ్లే, అమ్ముకునే వాళ్లే రేపు కాసిని రాక్షసి బొగ్గులతో కొలిమిరాజేసేది.
    కనిపిస్తున్నది కదా.. అమెరికాలో..

  9. మా సత్యం
    విమల (కవయిత్రి )గారు రాసిన” వెన్నెల రాత్రి పదహారు రొట్టెలు” దీర్ఘ దృశ్య కవిత చదివా. మీ కవిత్వంలో సామూహిక భావోద్వేగాన్ని(collective emotions) వ్యక్తం చేశారు. దోపిడీ పరిపాలకుల పై మీ కవిత్వం ద్వారా ఏమి సందేశం ఇవ్వాలా అనుకున్నది అస్పష్టంగా ఉంది. ఈ సందర్భంలో చెరబండరాజు కవిత వాక్యాలు గుర్తుకొస్తున్నాయి.
    ” నాది శ్రమైక జీవన సౌందర్యం గీతం/మతానికి దోపిడి పదానికి నేను పల్లవిని కాను”. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా కరోనా మనిషి ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని కూర్చున్నది.

    “వాళ్ళు ఎందుకలా చనిపోయారని మనుష్యులెవరూ గట్టిగా అడగలేదు
    కానీ ఆ వెర్రి వేసవి గాలి మాత్రం చండ్ర నిప్పులు చెలరేగుతూ
    వలస వచ్చిన వాళ్ళ కథల్ని లోకమంతా వినిపిస్తూ వీస్తోంది”
    భారత పాలకుల అనాలోచిత నిర్ణయం వల్ల వలస కూలీలు అయోమయ పరిస్థితిలో చిక్కుకుని తమ అమూల్యమైన ప్రాణాలను వందల మైళ్లు నడిచి తిండి లేక ఆకలి దప్పిక అలసిపోయి నడవలేక ఆ వెన్నెల రాత్రి రోజున పట్టాలపై నిద్రించిన వారిపై గూడ్స్ బండి వాళ్ళని శాశ్వత నిద్రలోకి తీసుకెళ్ళింది. వారి మృతికి కారకులైన భారత పాలకులు బాధ్యులు.
    Down Down Indian Criminal Government

  10. Capitalism emerges in its most shameless and cruel form , well depicted Vimala in a plain and heart wrenching form of expression! Will the message reach the policy makers?

  11. గుండెలను పిండివేసే కవిత.. వాళ్ళు వెళ్లిపోతున్నారు.
    బాబ్ మార్లే అద్భుత గీతం ‘ఎక్సోడస్’లో అంటాడు, ‘we are leaving Babylon’.. బానిసల శ్రమపై నిలిచిన నగరానికి బాబిలోన్ ప్రతీక..
    ఇది ప్రయాణపు విషాదం మాత్రమే కాదు. రాజకీయ ఆర్ధిక వ్యవస్థ వికృతతత్వానికే ఒక ప్రతీక..

Leave a Reply